ఛలో అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోసమేనా?
posted on Jun 12, 2013 8:04AM
స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెరాస ఛలో అసెంబ్లీ అంటూ మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను రాజేసే పనిలో పడింది. యధాప్రకారం ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించడం, పోలీసులు దానిని నిలువరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం, తెరాస, టీ-జేయేసీ నేతలు ఖండించడం, అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం వంటివన్నీ కూడా ఒక పద్దతి ప్రకారంగా సాగిపోతున్నాయి. చివరి నిమిషం వరకు ఈ తంతు కొనసాగిన తరువాత, ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం, దానిని సీమంద్రా నేతల కుట్రలపై తెలంగాణా ప్రజల విజయంగా తెరాస నేతలు అభివర్ణించడం కూడా అంతే పద్దతిగా జరిగిపోతుంది. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క పరిపాలన తప్ప ఇటువంటి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, బంద్ లు అన్నీ కూడా చక్కగా ఒక పద్ధతి ప్రకారం సాగిపోతున్నాయి. ఈవిషయంలో మనల్ని మనం మెచ్చుకోక తప్పదు.
తెలంగాణా ఉద్యమాలను ఇంతకాలం పక్కన బెట్టి ఎన్నికల బాట పట్టిన తెరాస దాని అనుబంధ సంస్థ టీ-జేయేసీలు తమకి అవసరమయినప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణా భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలనుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
తెలంగాణా అంశంపై కేంద్ర ప్రభుత్వ నాన్పుడు ధోరణిని నిరసించే తెరాస, టీ-జేయేసీ నేతలు దాని సాధన పట్ల నిబద్దత చూపకపోవడం హాస్యాస్పదం. ఒకసారి ఉద్యమాల ద్వారా, మరో సారి డిల్లీలో లాబీయింగ్ ద్వారా, మరో సారి ఎన్నికలలో అధికసీట్లు గెలుచుకోవడం ద్వారా వారు తెలంగాణా సాధిస్తామని ప్రజలకి నమ్మబలుకుతూ, తెలంగాణా సెంటిమెంట్ ని, అంశాన్ని ఊరగాయలా నిల్వ ఉంచుకొని తమ అవసరమయినప్పుడు బయటకి తీసి ఈవిధంగా వాడుకోవడం శోచనీయం.
అదేవిధంగా, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణా ఉద్యమాలవల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నపటికీ, తెలంగాణా అంశంపై రాజకీయ లబ్ది పొందేందుకు దానిని నాన్చడం గర్హనీయం. అటు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికి, ఇటు ఉద్యమం చేస్తున్న నేతలకి తెలంగాణా అంశం రాజకీయ లబ్దిపొందే అంశంగా మారిపోవడంతో, మధ్యలో రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల బ్రతుకులు నానాటికి దయనీయంగా మారుతున్నాయి.