కాంగ్రెస్ పంచాయితీలో ఇంతకీ తేలిందేమిటి?

 

డిల్లీలో కాంగ్రెస్ పంచాయితీ ఇక ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పెద్ద తలకాయలన్నిటికీ పేరుపేరునా పిలిచి సింగల్ గా మరియు సామూహికంగా వేర్వేరు రకాల అక్షింతలు వేసి సాగనంపుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఎవరికీ ఏ టైపు అక్షింతలు వాడిందో పెరుమాళ్ళకే ఎరుక గనుక, వారందరూ బయటకి వచ్చినప్పుడు మాత్రం ఏదో ఘనవిజయం సాదించినట్లే కాలరేగరేసుకొని మీడియాతో మాట్లాడకుండా, ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్త పడుతూ రాష్ట్రంలో తిరిగి వచ్చి పడుతున్నారు.

 

ఇంతవరకు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఏమి చెప్పలేదు గనుక, మీడియా కూడా తనకు తోచినట్లు మంచి రుచికరమయిన మసాలా దట్టించి కధనాలు వండి వడ్డిస్తోంది. జనాలు కూడా వారి వారి టేస్టుల బట్టి వాటిలోంచి తమకు నచ్చిన వాటిని వడ్డించుకొని ఆనందిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే తంతును బట్టే డిల్లీ పంచాయితీలో ఏమి జరిగిందో కనిపెట్టుకొనే పని జనాలదే అవుతుంది.

 

ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ ఇంటికి వచ్చి చప్పుడు చేయకుండా కూర్చుంటే ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నందుకు ఆయనకు సోనియమ్మ అరగంట సేపు తలంటి పంపిందని భావించవచ్చును. ఒకవేళ, ఆయన కలలు కంటున్న హోంమంత్రి పదవి ఇస్తే, ముఖ్యమంత్రిని మరీ అంత రెచ్చిపోవద్దని హెచ్చరించినట్లు అనుకోవచ్చును.

 

ఒకవేళ ముఖ్యమంత్రి రామచంద్రయ్యకు మంగళ హారతి ఇచ్చేస్తే, చిరంజీవికి సోనియమ్మ అక్షింతలు వేసినట్లు చెప్పుకోవచ్చును. రామచంద్రయ్యను క్యాబినెట్ లో చిరంజీవి పఠం పెట్టుకొని మెగాభజన చేసుకోనిస్తే, ఇక రెడ్డిగారు అమ్మహస్తం పట్టుకొన్నపటికీ, పగటి (ఇందిరమ్మ) కలలు కనవద్దని, ఒక్క బంగారు తల్లినే కాకుండా పార్టీలో ఉన్న చిరంజీవి, రామచంద్రయ్య, దామోదర, జానారెడ్డి ఇత్యాది బంగారు తండ్రులను కూడా పట్టించుకోమని అమ్మ ఆదేశించినట్లే అనుకోవచ్చును.

 

ఇక, డిల్లీలో పంచాయితీలు ముగిస్తే, రేపటి నుండి మంత్రులందరూ మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెడతారని ప్రజలు అత్యాశకి పోతున్నారు. కానీ, ఒకసారి తెలంగాణా అంశం, మరోసారి అవిశ్వాసం, మరోసారి కళంకిత మంత్రుల ఉద్వాసన, ఇంకోసారి మంత్రి పదవుల భర్తీ, అసమ్మతి నేతల బుజ్జగింపులు వంటి అనేక సీరియస్ సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వచ్చిపడిపోతుంటే, ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ప్రజలు బాధపడటం అవివేకం.అప్పటికీ వారు డిల్లీ నుండి తిరిగి వచ్చినప్పుడల్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు కదా పాపం.