బాబు నిర్ణయాలకు ‘దేశం’ బలి?
posted on Sep 18, 2012 @ 10:21AM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలకు ఆ పార్టీ బలపీఠం ఎక్కనుంది. పార్టీని పటిష్టం చేసే కంగారులో చంద్రబాబు ఎస్సీల్లో మాదిగలకు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఒక వర్గానికైనా దగ్గరయ్యామని చంద్రబాబు చంకలుగుద్దుకున్నారు. తాజాగా మాదిగదండోరా రాష్ట్ర అధ్యక్షుడు మందాకృష్ణమాదిగ సొంతంగా రాజకీయపార్టీని నెలకొల్పనున్నారు. దీని కోసం ముమ్మరంగా ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అయితే మాలలు తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని నిశ్చయానికి వచ్చారు. వీరిని కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆకర్షిస్తున్నాయి.
దీంతో తెలుగుదేశం పార్టీకి మాలల ఓటుబ్యాంకు దూరమైంది. అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు మాదిగలను వర్గీకరణ పేరుతో దగ్గర చేసుకునేందుకు కసరత్తులు చేశారు. దీనిలో భాగంగానే వారితో కలిసి ఆందోళనకార్యక్రమాలు సాగిస్తున్నారు. అయితే మందాకృష్ణ పెట్టబోయే పార్టీలో అభ్యర్థులందరూ మాదిగలే. పైగా, దండోరా జిల్లా కమిటీల సహాయంతో పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్ల మాదిగలు వర్గీకరణ కోసమని చంద్రబాబుకు మద్దతు పలికినా, తిరిగి తమ పార్టీలోకి వెళ్లిపోతారు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న మాదిగ సామాజికనేతలే మిగులుతారు. మాదిగల ఓటుబ్యాంకు మొత్తం మందాకృష్ణ వెనుకే నిలవాలని నిశ్చయించుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గీకరణ వైపు మొగ్గు చూపి ఒకవైపు మాలలకు, మరోవైపు మాదిగలకు దూరమయ్యే స్థితిలో ఉంది. దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు తమ వెనుక మాదిగలున్నారని భావించారు. వర్గీకరణ నిర్ణయాన్ని బలపరిచి చంద్రబాబు పార్టీని బలి చేశారని మాలలు అంటున్నారు. తమ మందాకృష్ణ మాట దాటి అడుగుకూడా కదపబోమని మాదిదిగలు చెబుతున్నారు. ఎస్సీల్లో కీలకమైన ఈ రెండు సామాజికవర్గాలూ దూరమయ్యాక మిగిలిన సామాజికవర్గాలు ప్రభావం అంతగా కనిపించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.