చిరు అభిమానులకు తప్పని ఎదురుచూపు!
posted on Sep 18, 2012 @ 10:33AM
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయతెరంగేట్రం చేసినా ఊహించని పదవి ఏదీ ఆయన్ని వరించలేదని అభిమానులు నిరాశపడుతున్నారు. సినిమాల్లో ఉన్నత స్థాయిని వదులుకుని ప్రజాసేవ పేరిట పీఆర్పీని ఏర్పాటు చేయటమే చిరంజీవి మొదటితప్పని ఇప్పుడు బాధపడు తున్నారు. పైగా, కాంగ్రెసులో ఆ పార్టీని విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొందిన చిరంజీవి కేంద్రమంత్రి అవుతారని వీరు ఆశపడ్డారు. ఇంకా విషయం తేలకపోవటంతో నిరాశపడుతున్నారు. అంతేకాకుండా పుండు మీద పుట్రలా వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కాంగ్రెసులో విలీనం అయితే తమ హీరోను కాంగ్రెసు పట్టించుకోదని వాపోతున్నారు. జగన్‌పార్టీ కాంగ్రెసులో విలీనం అయితే తొలినష్టం తమ హీరోకే జరుగుతుందని మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా భవిష్యత్తులో చిరంజీవి సిఎం అభ్యర్థి అనే బ్యానర్‌తో 2014 ఎన్నికలు జరగవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిశీలకుల అభిప్రాయానికి ఒక చిన్నబ్రేక్ ఏమిటంటే అది జగన్ పార్టీ విలీనం. దీంతో ఈ విలీనం త్వరలోనే ఉండవచ్చనే అంచనాలు కూడా ఊపిరి పోసుకుంటున్నాయి.
దీంతో కాంగ్రెసు గూటిలో చేరిన పీఆర్పీ, వైకాపా నేతల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయి. తాము గొప్పంటే తామే అన్న వాతావరణం ఈ రెండు పార్టీలకు ఉండవచ్చని భావిస్తున్నారు. అసలే కాంగ్రెసు పార్టీలో గ్రూపురాజకీయాలు ఎక్కువ. అటువంటిది కొత్తగా జగన్ గ్రూపు కాంగ్రెసులో చేరితే నేరుగా ఘర్షణలు ఎక్కువవ్వొచ్చని సీనియర్లు అంటున్నారు. పీఆర్పీ, వైకాపా నేతలు బాహాబాహీ తలపడుతుంటే ఇప్పటి వరకూ గ్రూపుల ఆధారంగా కొట్టుకునే కాంగ్రెసు ప్రేక్షకపాత్ర పోషించవచ్చు. అసలు ఈ వీలినం అనే ముసలం తప్పితే బాగుంటుందని చిరు అభిమానులు కోరుకుంటున్నారు. తమ హీరోకు మంచి జరగాలని ఇటీవల ద్రాక్షారామ భీమేశ్వరాలయంలోనూ, మరికొన్ని దేవాలయాల్లో పూజలు చేయించారట. అసలు మొండివాడైన జగన్ కాంగ్రెసులోకి రాకుండా చూడమని కూడా అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారట. ఏదేమైనా రాజకీయతెరపై హీరో ఈమధ్య పెద్దగా తెరపై హడావుడి చేయటం లేదు. ఏదైనా పదవి వస్తే మాత్రం అభిమానులతో కలిసి చిందేయవచ్చని భావిస్తున్నారు.