మీడియాపై చిరంజీవి చిర్రుబుర్రు
posted on Sep 15, 2012 @ 12:29PM
“అసలే కాంగ్రెస్ వాళ్లు కూరలో కరేపాకులా తీసిపారేస్తున్నారు. అవసరానికి వాడుకుని ఇప్పుడు ఎవర్ని కలవాలన్నా ముఖం చాటేస్తున్నారు. పార్టీలో ఉండలేక, బైటికి పోలేక చిరు చాలా అవస్థలు పడుతున్నాడు. కాలమే ఇలాంటి పెద్ద పెద్ద గాయాలకు సరైన పరిష్కారం చూపిస్తుందన్న ఆశావాదం తప్ప చిరంజీవిదగ్గర ఏం మిగల్లేదు. మన్మోహన్ క్యాబినెట్ విస్తరణ జరిగితే ఓ మంత్రి పదవి ఇస్తారేమోనన్న ఆశ తప్ప కనుచూపుమేరలో కాంగ్రెస్ వల్ల చిరంజీవికి ఒరిగేదేం లేదు.” ఇదీ చాలాకాలంగా చిరంజీవి మీద చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. వినీవినీ విసుగుపుట్టింది. ఏదో రాసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారులే అని ఇన్నాళ్లూ ఓపిక పట్టిన చిరంజీవి ఉనట్టుండి మీడియామీద విరుచుకుపడ్డారు. “అసలు ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు. నేనేమైనా చెప్పానా లేక పార్టీ పెద్దలెవరైనా చెప్పారా.. అన్నీ మీకు మీరే ఊహించుకుని, మీకు తోచిన కథల్ని మీరే సృష్టించుకుని ఎలా పడితే అలా రాసేస్తే ఎలా.. అంటూ క్లాస్ పీకారు.“ తనమీద జరుగుతున్న అర్థం పర్ధం లేని ప్రచారాలతో విసిగిపోతున్నానని మెగాస్టార్ అంటున్నారు.