లగడపాటి దూకుడు !
posted on Jun 6, 2012 @ 4:02PM
ఉప ఎన్నికల ప్రచారంలో, జగన్ పై విమర్శలు చేయడంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ తనదైనా శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. జగన్ తల్లి విజయమ్మకు సుద్దులు చెప్పడం మొదలుకొని జగన్ తప్పుచేయలేదని బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ రోజుకో కొత్త ప్రకటనతో వార్తలలోని వ్యక్తిగా వుంటున్నారు. ఇదే సమయంలో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఆయన చేస్తున్న యాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి నేత బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు చిరంజీవిలకు పోటీగా ప్రజలలో గుర్తింపు పొందుతున్నారు. ఈ ఉప ఎన్నికల ద్వారా లగడపాటి కోస్తా ప్రాంతంలో ప్రజా గుర్తింపు పొందిన నాయకునిగా తయారవుతున్నారు. ఈయన ప్రచార శైలి, దూకుడు గమనిస్తే రానున్న రోజులలో రాష్ట్రం రాజకీయాలలో లగడపాటి కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి రెండో పర్యాయం లోకసభ సభ్యునిగా ఎన్నికైనా లగడపాటి భవిష్యత్తులో శాసన సభ్యునిగా పోటీచేసి రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర వహించాలనే భావనలో వున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా అయితే పిసిసి అధ్యక్ష పదవి, అధికార పరంగా అయితే ముఖ్యమంత్రి పదవి దృష్టిలో పెట్టుకొని ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.