కేసీఆర్ పై కన్నెర్ర చేసిన ఓయూ విద్యార్థులు
posted on Jun 8, 2012 @ 9:44AM
నువ్వు తెలంగాణా రావాలని కోరుకుంటున్నావా? అయితే కారు గుర్తుపై బటన్ దబాయిస్తానని ప్రమాణం చెయ్! అంటూ టి.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్ ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారు. సహజంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటరుతో ప్రయాణం చేయించటం అమానుషమైన చర్య అని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)విద్యార్థులు కేసీఆర్ పై కన్నెర్ర చేశారు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ తంతును విద్యార్థులు ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి భాన్వర్ లార్ దృష్టికి తీసుకెళ్ళారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయటం తెలంగాణావాదుల హక్కు అయితే ఓటు తమకు నచ్చిన వారికి వేయటం కూడా హక్కేనని విద్యార్థులు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులో విచిత్రమేమిటంటే ఇప్పటి దాకా టి.ఆర్.ఎస్. వెనుక ఉండి నడిచిన విద్యార్థులు ఎన్నికల సమయంలో తమ గళం విప్పటం. అదీ కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోయిన గతాన్ని మరచిపోవటం. పోనీ ఈ అనుభవంతోనైనా విద్యార్థులు రాజకీయనాయకులకు దూరంగా ఉంటే నాడు యువకుల ఆత్మహత్యల గతం పునరావృత్తం కాదని మానవతావాదులు కోరుకుంటున్నారు. విద్యార్థులూ కళ్ళు తెరిచి తప్పును ఎత్తి చూపాలని ఫిర్యాదు చేసిన ఓయూ విద్యార్థులను అభినందిస్తున్నారు. నీతిబాహ్యమైన రాజకీయాలకు దూరంగా ఉండి ప్రగతిరథచక్రాలుగా విద్యార్థులు ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల కమీషన్ కూడా విద్యార్థుల స్ఫూర్తిని అభినందించింది.