ఫెడరల్ స్ఫూర్తిని చాటిన రేవంత్!
posted on Mar 5, 2024 @ 9:42AM
గత కొన్నేళ్లుగా తెలంగాణలో మోడీ పర్యటన వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. అదే విధంగా మోడీ తాజా పర్యటన కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే గతంలో మోడీ పర్యటన చుట్టూ వివాదాలు, వివాదాస్పద చర్చలూ ముసురుకుని ఉండేవి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాలే ప్రభుత్వాల మధ్యా కూడా ప్రతిఫలించేవి. రాజకీయ విభేదాలు పాలనలోనూ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలోనూ కనిపించకూడదన్న ఫెడరల్ స్ఫూర్తికి ఇసుమంతైనా విలువ ఉండేది కాదు. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రంలో అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భాలలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకాలన్న విషయాన్ని కేసీఆర్ పట్టించుకోకపోయేవారు.
అలాగే అధికారిక కార్యక్రమాలలో ప్రధానితో వేదిక పంచుకోవాలన్న సంప్రదాయాన్ని కూడా ఆయన ఖాతరు చేసే వారు కాదు. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, విలువలకు పెద్ద పీట వేస్తూ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక సంబంధాలు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పడమే కాదు.. స్వయంగా ఆచరించి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ వల్ల ప్రజలకు నష్టమని విస్పష్టంగా చెప్పారు. రాజకీయాలనేవి ఎన్నికల సమయంలోనేననీ, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడుస్తామని విస్పష్టంగా చాటారు. హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మోడీని రేవంత్ కోరారు.
సోమవారం (మార్చి 4) రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించిన సంగతిని గుర్తుచేస్తూ, తాము ప్రస్తావించిన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. డిఫెన్స్ భూములను స్కై వేల నిర్మాణానికి ఇచ్చినందుకు మోడీకి ఈ సభ వేదికగా కృతజ్ణతలు చెప్పారు. అంతే కాదు తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్దన్నలా సహకరించాలని కోరారు.
ఇప్పుడే కాదు రేవంత్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. సస్పెన్షన్లు లేవు, ఏకపక్ష ప్రసంగాలు లేవు. విపక్షానికి తగిన సమయం ఇవ్వడమే కాకుండా సభలో అరుపులు, గోలల సంస్కృతికి, సభాకార్యక్రమాలను స్తంభింప చేసే కార్యక్రమానికి చుక్కపడింది. సభ ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నదన్న భావన రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య జనంలోనూ కూడా కలిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఇప్పుడు మోడీతో సభా వేదికను పంచుకుని కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు ఆకాంక్షిస్తూ చేసిన ప్రసంగం ప్రజా స్వామ్య వాదుల మన్ననలు పొందింది.