మంత్రి వర్గ విస్తరణకి గంట కొట్టిన శ్రీనివాసరావు

  మంత్రి డీయల్ బర్త్ రఫ్, టీ-కాంగ్రెస్ నేతలు పార్టీ విడిచిపోవడం వంటి అంశాలతో అల్లకల్లోలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో వేడిని చల్లార్చేందుకు మంత్రి గంట శ్రీనివాసరావు త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగబోతోందని ప్రకటించారు. ఈ నెల 10నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ చల్లటి మాటతో కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ అసమ్మతివాదుల గొడవ వదిలిపెట్టి మంత్రి పదవులు దక్కించుకోనేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తారు. ఈ ప్రయత్నంలో అందరూ ఒక్కసారిగా ముఖ్యమంత్రికి అనుకూలంగా మారే అవకాశం ఉంది గనుక అప్పుడు వారు డీయల్ రవీంద్ర రెడ్డి, దామోదర రాజానరసింహ, రామచంద్రయ్య వంటి వారి స్వరాలను వినబడకుండా చేసే అవకాశం ఉంది.   ఈ నెల పదిన జరగనున్న మంత్రివర్గ సమావేశం నాటికి ఈ విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి ఖాళీ చేసిన హోం మంత్రి పదవికోసం పార్టీలో చాల మందే పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, బొత్స సత్యనారాయణ ముందున్నారు. అయితే ముఖ్యమంత్రి వారిరువురికీ కూడా ఆ పదవి ఇవ్వకుండా మోకాలు అడ్డుపెడుతూ, తనకి విదేయులయిన మంత్రులలో ఎవరో ఒకరికి ఆ పదవి కట్ట బెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో బాటు, మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. రామచంద్రయ్య వంటి వారిని మరింత అప్రదాన్యమయిన పదవులలోకి పంపించి, దానిలో తనకు విదేయులయిన వారిని నియమించుకొనే అవకాశం ఉంది.

డిఎల్‌ దారెటూ..?

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయటంతో ఇప్పుడు అందరి దృష్టి డిఎల్‌ రవీంద్రారెడ్డి నెక్ట్స్‌ స్టెప్‌ మీదే ఉంది.. చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెవిలో జోరిగగా తయారైన డిఎల్‌ రవీంద్రారెడ్డిని కిరణ్‌ అధిష్టానం అండదండలతో చావు దెబ్బ కొట్టాడు.. దీంతో ఇప్పుడు డిఎల్‌ భవిష్యత్తు డైలమాలో పడింది..     అయితే డిస్‌మిస్‌కు గురైన డిఎల్‌ కాంగ్రెస్‌ నేతల నుంచి మంచి మద్దత్తు అందుతుంది.. ముఖ్యంగా కిరణ్‌ వ్యతిరేఖ వర్గంతో పాటు పిసిసి చీఫ్‌ బొత్సాతో పాటు చిరంజీవిలాంటి నాయకులు బహిరంగంగానే డిఎల్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ సందర్భంలో డిఎల్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలా లేక పార్టీని వీడాలన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు..   అయితే ఇప్పటికే డిఎల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్టుగా ప్రచారం మొదలైంది.. మొదట వైఎస్సార్‌ ప్రాణ స్నేహితుడిగా ముద్రపడ్డ  డిఎల్‌ తరువాత జగన్‌ రాజకీయ ప్రవేశంతో ఆయనకు దూరం అయ్యారు.. 2009 ఎలక్షన్స్‌ తరువాత ఆ అంతరం మరింత పెరిగింది అయితే  తాజా పరిణామాలతో మరోసారి డిఎల్‌ వైయస్‌ కుటుంబానికి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తుంది..   అందుకు తగ్గట్టుగానే డిఎల్‌ ఇటీవల ఓ బహిరంగ సభలో ‘కాంగ్రెస్‌ పెద్దలు నా ప్రాణ స్నేహితుడి కుమారిడి మీద నన్ను పోటి చేయించారు’ అంటూ కాంగ్రెస్‌ నేతలపై విరుచుపడ్డారు.. ప్రస్తుతం అమలవుతున్నవన్ని వై యస్‌ పథాకాలే అంటూ రాజశేఖర్‌ రెడ్డిని కీర్తించారు.. ఈ పరిణామాలన్నీ డిఎల్‌ అడుగులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపే అన్నట్టుగా ఉన్నాయి..     అయితే కొంతమంది డిఎల్‌ తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే కడప జిల్లా నుంచి వైయస్‌ కుటుంబంతో పాటు మైసూరా రెడ్డి కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌లో ఉండటంతో తాను అదే పార్టీలో చేరితే సముచిత స్థానం దక్కకపోవచ్చని భావిస్తున్నాడట.. అదే సమయంలో టిడిపి పార్టీలో మైసూరా వెళ్లిపోవడంతో కడప జిల్లాలో నాయకత్వం లేమి ఏర్పడటంతో ఆ గ్యాప్‌ డిఎల్‌ భర్తి చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు..    డిఎల్‌ రవీంద్రా రెడ్డి మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల తరువాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానంటున్నాడు..

రేవంత్ రెడ్డి కొత్త ఆరోపణలు

  కాంగ్రెస్ పార్టీతో తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కయరని వైకాపా నేతలు ఆరోపిస్తుంటే, తల్లీపిల్ల కాంగ్రెస్ పార్టీలు ఒకదానినొకటి రక్షించుకొంటున్నాయని తెదేపా ఆరోపిస్తోంది. కానీ, వారి మద్యలో వేలు పెట్టేందుకు కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ ప్రయత్నం చేయకపోవడం విశేషం. దానిని బట్టి కాంగ్రెస్ లోపాయికారిగా ఆ రెండు పార్టీలతో కూడా రహస్యంగా పొత్తులు పెట్టుకొని వాటితో డబుల్ గేం ఆడుతోందా అనే అనుమానం కలుగుతోంది.   వైకాపాతో ఆ పార్టీకి జగన్ అక్రమాస్తుల కేసులో అవినావ భావ సంబంధం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ రెండు పార్టీలను వేరు చేస్తూ వాటి మద్య ఉన్నఓ సన్నటి గీత జగన్ కేసులతో చెరిగిపోవడంతో ఇక్కడ తుంటి మీద కొడితే అక్కడ పళ్ళు రాలుతాయన్నట్లు తయారయింది ఆ రెండు పార్టీల పరిస్థితి.   ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ తెదేపా దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందనేది వైకాపా ఆరోపణ. తెదేపా తలుచుకొంటే అవిశ్వాసం పెట్టి కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని చిటికలో కూల్చగలదని, కానీ జగన్ను జైలు నుండి బయటకి రానీయకుండా ఉండేందుకే అవిశ్వాసానికి వెనకాడుతోందని వైకాపా ఆరోపణలు.   వీరి ఆరోపణ ప్రత్యారోపణలతో ప్రజలలో ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ, ఆ రెండు పార్టీలు మాత్రం రాజకీయ చదరంగం సాగిస్తూనే ఉన్నాయి.   జగన్ అక్రమాస్తుల కేసులో మొన్న విజయసాయి రెడ్డిని కూడా జగన్ ఉన్న చంచల్ గూడా జైలుకే తరలించడంతో వారినందరినీ, ఒకే జైలులో ఎందుకు పెడుతున్నారని తెదేపా నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు. జగన్‌ కోరిక మేరకు వారినందరినీ ఒకే జైలులో పెట్టి వారికి ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సునీల్‌ రెడ్డిని కూడా అదే జైలులో కొనసాగిస్తూ,జగన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నందునే ఆయన బెయిల్‌ పిటిషన్‌ కూడా ఇంతవరకు వేయకపోవడం చూస్తే, ఈ వ్యవహాల వెనుక కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష సహాయసహకారలున్నాయని అర్ధం అవుతోందని ఆయన ఆరోపించారు.ఇప్పటికయినా ప్రభుత్వం వారందరినీ వేర్వేరు జైళ్ళలో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేసారు.   అదేవిధంగా జగన్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతున్న డీయల్, శంకర్ రావు, బొత్స, దామోదర రాజానరసింహ వంటివారినందరినీ కూడా ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ మరో కొత్త ఆరోపణ కూడా చేసారు. తద్వారా వారిలో ముఖ్యమంత్రి పట్ల మరింత వ్యతిరేఖత పెంచాలని ప్రయత్నించినట్లు అర్ధం అవుతోంది.అయితే, సీబీఐ కోర్టు విజయసాయి రెడ్డికి రిమాండ్ విదిస్తే, దానికి ముఖ్యమంత్రే కారణమన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం విచిత్రం.

విద్యార్థులపై భారం మోపుతున్న ఆర్టీసీ

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) విద్యార్థులపై భారం మోపడానికి సిద్ధపడింది. ప్రస్తుతం వున్న నగరాలలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు రూ.85 నుండి రూ.130, గ్రామీణ ప్రాంతాల్లో 85 నుండి రూ.170 అలాగే రూట్ జనరల్ బస్ పాస్ ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి పంపగా రవాణాశాఖ మంత్రి, అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ఉత్తర్వులు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. 1994 లో బస్ పాస్ ధరలను పెంచిన తరువాత ఇప్పటివరకు పెంచలేదు. దీంతో రాయితీలతో కూడిన బస్ పాస్ వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోందని కాబట్టి విద్యార్థుల బస్ పాస్ లపై ధరలు పెంచవలసిన అవసరం ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. 

ముఖ్యమంత్రి మార్పుకి రంగం సిద్దం అవుతోందా

  బహుశః ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ఏ ముఖ్యమంత్రీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్నంత అసమ్మతి ఎదుర్కోలేదేమో. అందుకు ప్రధాన కారణం ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎవరినీ లెక్క చేయకపోవడమేనని మీడియాతో సహా అందరూ విడమరిచి చెపుతున్నపటికీ, ఆయన మాత్రం తన పద్దతీ మార్చుకోలేదు, తన దూకుడు తగ్గించుకోలేదు. బహుశః ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నుండి ప్రేరణ పొంది, ఆవిధంగా ప్రవర్తిస్తున్నారనుకొన్నా, ఆయనలాగా అందరినీ కలుపుకుపోయే స్వభావం మాత్రం అలవరుచుకోలేక పోవడంతో అభాసుపాలవుతున్నారు. తత్ఫలితమే పార్టీలో నేడు ఈ అసమ్మతి, ఈ ముటా కుమ్ములాటలు.   డీయల్ రవీంద్ర రెడ్డిని పదవి నుండి అవమానకరంగా తొలగించడం, తెలంగాణా నేతలు పార్టీని వీడినప్పుడు వారిపట్ల చులకనగా మాట్లాడటం, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అనేక అంశాలు పార్టీలో ఆయనకు వ్యతిరేఖ వర్గాన్ని తయారు చేసాయి. రాష్ట్ర పాలన సంగతి ఎలా ఉన్నా, ముందు డిల్లీలో ఈ పంచాయితీలకి హాజరవడానికే ఆయనకి సరిపోతోందిపుడు.   ఆయన డిల్లీ నుండి తిరిగి హైదరాబాద్ చేరుకోనేసరికి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ డిల్లీ చేరుకొని, ఇప్పటికే అక్కడ తిష్ట వేసిన బొత్ససత్యనారాయణ, చిరంజీవి తదితరులతో కలిసి పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి పై పిర్యాదు చేయనున్నారు. ఈ అగ్నికి ఆజ్యం పోస్తునట్లు, మాజీ మంత్రి శంకర్రావు చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై, దానిలో ముఖ్యమంత్రి సోదరుడి పాత్రను వివరిస్తూ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ఒక లేఖ వ్రాసారు. దీనిపై పార్టీ వెంటనే దృష్టిసారించకపోతే, ఆ తరువాత ఇదే 2జి కుంభకోణం వలె తయారయ్యి రాష్ట్రంలో పార్టీని బలి తీసుకొంటుందని ఆయన హెచ్చరించారు.   వీరందరూ ముఖ్యమంత్రి ని వ్యతిరేఖించడానికి ఎవరి కారణాలు వారికున్నపటికీ అందరు కలిసి ఆయన కుర్చీకి ఎసరు తెచ్చే అవకాశాలున్నాయి. అయితే, అధిష్టానం అండతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా తన పద్దతిలోనే ముందుకు సాగుతుండటం విశేషం. సాదారణంగా కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలయ్యే ఇటువంటి అసమ్మతి వ్యవహారాలే చివరికి ముఖ్యమంత్రి మార్పుకు దారి తీస్తాయని చరిత్ర చెపుతోంది. మరి ముఖ్యమంత్రి చేజేతులా పరిస్థితిని అంతవరకు తెచ్చుకొంటారా లేక పద్ధతి మార్చుకొని అందరితో కలిసి ముందుకు సాగుతారో చూడాలి.

డీయల్ లక్ష్యం పార్టీ మారడమా కిరణ్ పై పగ తీర్చుకోవడమా

  ఇంత వరకు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అవుతుందని చెపుతూ వచ్చారు. అయితే, ప్రతిపక్షపార్టీలు ఆవిధంగా కలలుకంటూ మాట్లాడటం సహజమే గనుక వాటిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇటీవల మంత్రి వర్గం నుండి బర్త్ రఫ్ చేయబడిన డీయల్ రవీంద్ర రెడ్డి కూడా నిన్న కర్నూలు జిల్లా చాగల మర్రి సమీపంలో నిర్వహించిన ఒక బారీ బహిరంగ సభలో అదే మాట అనడం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికి సీఎం కిరణ్ కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. హైకమండ్‌చే నియమించబడి, ఏదో నాలుగు రోజులు పదవిలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకు వచ్చిన కిరణ్ వంటి వ్యక్తులు పార్టీని కాపాడలేరని, అటువంటి వ్యక్తి సీఎం పదవిలో కొనసాగితే పార్టీకే ముప్పు అని అన్నారు. తద్వారా డీయల్ ముఖ్యమంత్రిపై తన పోరాటాన్ని ఉదృతం చేయబోతునట్లు అర్ధం అవుతోంది.   అయితే ఇది అంతిమంగా ఆయన పార్టీ నుండి మారేందుకే చేస్తున్నారా?లేక కేవలం తనను మంత్రి పదవి నుండి తప్పించినందుకే ఆక్రోశం వెళ్ళగ్రక్కుతున్నారా? అనే సంగతి కూడా త్వరలోనే తేలిపోతుంది. తను చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని గట్టిగా చెప్పిన ఆయన, ఇక ముందు కూడా ఆవేశంలో ఇదే తరహాగా (కాంగ్రెస్ భూస్థాపితం వంటి మాటలు) మాట్లాడితే ముఖ్యమంత్రి ఆ మాటలను అధిష్టానం చెవిన వేసి ఆయనను పార్టీ నుండి బయటకి వెళ్లగొట్టవచ్చును. మరి డీయల్ కూడా అలాగే జరగాలని కోరుకొంటున్నారా?అందుకే తన విమర్శలకు పదును పెడుతున్నారా లేక నిజంగా కాంగ్రెస్ లోనే ఉంటూ కిరణ్ కుమార్ రెడ్డిపై పగ తీర్చుకోవలనుకొంటున్నారా? అనే సంగతి కూడా త్వరలో తేలిపోవచ్చును.   కడప జిల్లాలో బలమయిన నాయకుడయినా ఆయనను వదులుకోవడానికి ముఖ్యమంత్రికి అభ్యంతరం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆయనను వదులుకోకపోవచ్చును. బొత్స, దామోదర, రామచంద్రయ్య వంటివారు కూడా అండగా నిలబడి ఆయనను పార్టీ వీడకుండా ఉంచేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చును. అదే జరిగితే, కిరణ్ కుమార్ రెడ్డికి అది ఎదురు దెబ్బే. ఆయనకు నిజంగా కిరణ్ పై పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యమే ఉంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉండి కిరణ్ వ్యతిరేఖులందరి సహాయ సహకారాలతో ఆయనను ముప్పతిప్పలు పెట్టవచ్చును.   ఇక, కడపలో మైసూరా రెడ్డిని కోల్పోయి బలహీనపడిన తెదేపా డీయల్ ను పార్టీలోకి ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తునట్లు సమాచారం. ఆయన వైకాపాలో జేరవచ్చునని ఆయనను వ్యతిరేఖించే కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నపటికీ, జగన్ పొడ గిట్టని ఆయన వైకాపాలో చేరకపోవచ్చును. ఇటువంటి సదవకాశాల కోసమే ఎదురు చూస్తున్న వైకాపా కూడా ఆయనకు గాలం వేస్తునప్పటికీ, ఆయన ఆ పార్టీలో చేరకపోవచ్చును. అందువల్ల డీయల్ రవీంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదా తెదేపాలో చేరడం ఏదో ఒకటి జరుగవచ్చును.

కాంగ్రెస్ కి ఒక్కటి దక్కలేదు

        దేశంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ సీట్లనూ కాంగ్రెస్ కోల్పోయింది. గుజరాత్‌లోని 2 లోక్‌సభ, 4 శాసనసభ స్థానాలలో బీజేపీ విజయభేరి మోగించింది. గుజరాత్లో బనస్కాంత, పోర్‌బందర్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కోల్పోయింది. టోల్‌గేట్‌ వద్ద తుపాకీతో సంచలనం సృష్టించిన విఠల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీ తరఫున పోటీచేసి గెలిచారు. బీహార్లో మహరాజ్‌గంజ్ లోక్‌సభ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి ప్రభునాథ్ సింగ్ గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించలేదు. మహరాజ్ గంజ్ ఆర్జేడీ ఎంపీ ఉమేష్‌ కుమార్ సింగ్ మరణంతో ఎన్నిక నిర్వహించవలసి వచ్చింది. ఉమేష్ కుమారుడు జితేంద్ర స్వామికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. అయినా ఫలితందక్కలేదు. బెంగాల్లోని హౌరా స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది. సీపీఎం అభ్యర్థిపై భారీ మెజార్టీతో ఇక్కడ తృణమూల్ అభ్యర్థి గెలుపొందారు.

ఎంసెట్ 2013 ఫలితాలు విడుదల

        ఎంసెట్ 2013 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూలో ఉప ముఖ్యమంత్రి, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 76 వేల 995 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2 లక్షల 1వేయి 308 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ లో 72.67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడికల్ లో 80.79 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన 50వేల ఇంజనీరింగ్ సీట్లు. ప్రకాశం జిల్లా పొదిలి కి చెందిన సాయి సందీప్ రెడ్డి కి ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్. మెడికల్ విభాగంలో హైదరాబాద్ లోని రామచంద్రపురానికి చెందిన వెంకట్ వీనిత్ మొదటి ర్యాంక్ సాధించాడు. విజయవాడకు చెందిన రోహిత్ కు రెండో ర్యాంక్, జగదీశ్ రెడ్డికి మూడో ర్యాంక్.    

చిరంజీవి కిరణ్ కి యాంటీ!

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గంలో కేంద్రమంత్రి చిరంజీవి కూడా జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో నిన్న జరిగిన పార్టీ నేతల, మంత్రుల సమావేశానికి చిరంజీవి కూడా హాజరై ముఖ్యమంత్రి పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. డీఎల్ తరువాత మంత్రి సి. రామచంద్రయ్య పైన కూడా వేటు వేయవచ్చునని వార్తలు వస్తున్న నేపధ్యంలో.. ఈరోజు చిరంజీవి సోనియా గాంధీ తో భేటి అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలను మేడమ్ దృష్టికి చిరంజీవి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే సి.రామచంద్రయ్య మంత్రిపదవి పై కూడా సోనియాతో చర్చించారని ప్రచారం జరుగుతుంది. కేబినేట్ నుంచి తొలగించకుండా సిఎంకు అడ్డుకట్ట వేయాలని, రాష్ట్రంలో అసమ్మతి పెరిగిపోతుందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అంటే సిఎం వ్యతిరేక వర్గంలో మొదటిసారిగా చిరంజీవికే మేడమ్ అప్పాయింట్‌మెంట్ ఇచ్చినట్లుంది.

తెరాస 'తెలంగాణ రాబందుల పార్టీ'

      రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడానికి కొత్త డైలాగులు కనిపెడుతున్నారు. గత కొంత కాలంగా టీడీపీని 'తెలంగాణ ద్రోహుల పార్టీగా' టీఆర్ఎస్ ప్రచారం చేస్తూంటే, దానికి పోటిగా టిడిపి మరో డైలాగు పేల్చింది. టీఆర్ఎస్ పార్టీని 'తెలంగాణ రాబందుల పార్టీగా' అభివర్ణించింది. టిఆర్ఎస్ తెలంగాణ అంశం పేరుతో పలువురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారని టిడిపి ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాధోడ్ లు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అవకాశవాదులే టిఆర్ఎస్ లో చేరుతున్నారని వారు మండిపడ్డారు. సీమాంధ్ర పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయానని కడియం శ్రీహరి అంటున్నారని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కడియంకు 2013లోనే కనువిప్పు ఎందుకు కలిగిందని, ఆయనకు నిజంగా తెలంగాణ పై ప్రేమ ఉంటే అమరులైన కుటుంబాలలో ఒకరికి తన టిక్కెట్ ఇవ్వగలరా అని వారు సూటిగా ప్రశ్నించారు.

"కుక్కలు చింపిన విస్తరి'లో కాంగ్రెస్

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       "కుక్కలూ కుక్కలూ కొట్లాడుకుని, కూట్లో దుమ్ముపోసుకున్నాయ''ని మన పెద్దవాళ్ళు ఎందరి జీవితాలనో, లేదా ఎన్ని కుటుంబాల, రాజకీయపక్షాల నాయకుల ప్రవర్తన కాచివడపోసిన తరువాత అల్లుకున్న సామెత ఇది! అందుకే "కూట్లో దుమ్ముపోసుకున్న'' పరిణామాన్నే వారు "కుక్కలు చింపిన విస్తరి''గా నామకరణం చేసుకున్నారు! అలాంటి పరిణామం ఇప్పుడు 150 ఏళ్ళ చరిత్రగల జాతీయ కాంగ్రెస్ ను కేంద్రం స్థాయిలోనూ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనూ ఎదుర్కొంటోంది! తెలుగుజాతిని చీల్చే విద్రోహపథకానికి "బొబ్బిలి దొర'' (కేరాఫ్ విజయనగరం-శ్రీకాకుళం) కె.చంద్రశేఖరరావు "తెలంగాణా రాష్ట్ర సమితి'' పేరిట, కాంగ్రెస్ లో పాతపుణ్యం తాలూకు తనకు సరైన స్థానం దొరక్క పదవీనిరుద్యోగంతో తీసుకుంటున్న కె.కేశవరావు [మచిలీపట్నం కనెక్షన్] కొత్తగా టి.ఆర్.ఎస్. తీర్థం పుచ్చుకుని "తెలంగాణా'' పేరిటా ఆడుతున్న నాటకాన్ని కేంద్రకాంగ్రెస్ అధిష్ఠానం కనిపెడుతూ ఉంది; కేశవరావుతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ఎం.పి.లు గా ఉన్న వివేక, మందా జగన్నాథం 2014 ఎన్నికల్లో తిరిగి తామూ, తమ కుటుంబసభ్యులూ అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభలోనూ సీట్లు "టి.ఆర్.ఎస్.''లో చేరితేనే దక్కుతాయేమోనన్న భ్రమతో ఉన్నారు. అయితే కె.సి.ఆర్. పన్నిన రాజకీయ పన్నుగడలో [తెలుగుజాతిని చీల్చడం కోసం బూతులను, విషప్రచారాన్ని ఆశ్రయించిన కెసిఆర్ వలలో] వీళ్ళు ఇరుక్కుపోయి, వారూ తెలుగువారే అయిన తోటి రెండుప్రాంతాల (కోస్తా, రాయలసీమ) ఆంధ్రులపైన ప్రచార దాడిలో ముమ్మరంగా పాల్గొనడంతో వీరిపైన వేటు వేయడానికి అధిష్ఠానం సిద్ధం కావలసి వచ్చింది. ఇంతకూ వీళ్ళు ప్రధాన ప్రతిపాదన ఏవిటి? తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతినిపోయే పరిస్థితులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అవతరణతోనూ, "తెలుగుదేశం'' పార్టీకి తెలంగాణలో ఇంకా బలంగానే ఉన్నందున - తెలంగాణా వేర్పాటు సమస్యను కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పనందున, తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటుంది; కాబట్టి ఈ ప్రాంతీయ కాంగ్రెస్ ను దక్కించుకోవాలంటే కాంగ్రెస్ కూడా మిగతా చిల్లరపార్టీల మాదిరిగా "తెలంగాణా ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు, సిద్ధమే''నన్న ఓ మబ్బుతెరను కాంగ్రెస్ పార్టీ తగిలించుకోవాలని భావించారు. అయితే ఈలోగా విదూషక పాత్రను శ్రద్ధగా పోషిస్తున్న "బొబ్బిలిదొర'' ఏం చేశాడు. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఢిల్లీలో నెలరోజుల మకాంలో మంతనాలు నడిపి తెలంగాణారాష్ట్రానికి తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడానికి సిద్ధమని లాలూచీ బేరం సాగించి వచ్చాడని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకోవాలంటే, "బొబ్బిలి'' పైరవీకారుణ్ణి "బుట్టలో'' వేసుకోగలిగితే, కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి, తానూ లబ్ధిపొందవచ్చునని టి.ఆర్.ఎస్. నాయకుడి తాపత్రయం!   అయితే ఈ పైరవీ రాజకీయం ఫలిస్తుందన్న ఆశ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేదు. అయినా, కాంగ్రెస్ నుంచి వలసల్ని తప్పించడంకోసం తాజాగా అధిష్ఠానం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు కన్పిస్తోంది. కాంగ్రెస్ సంస్థను వీడిపోయి తెలంగాణాలోని ఒక "టుమ్రీ'' పార్టీలోకి ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉడాయించినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టంలేదని అధిష్ఠానం స్పష్టం చేయడంతో టి.ఆర్.ఎస్.లోకి వలసలకు "బ్రేక్'' పడిపోయినట్టే. పైగా కెసిఆర్ తో జరిగే "బేరసారాల''లో గుట్టు అధిష్ఠానానికి ఎలాగూ తెలిసి ఉన్నందున, కెసిఆర్ ను ఏ పద్ధతుల్లో లొంగదీసుకోవాలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పటికే ఒక అవగాహన ఉన్నందుననే - ఇంతకుముందు తెలంగాణా కాంగ్రెస్ నుంచి సుమారు ఏ 15-20మంది నాయకులో కెసిఆర్ వైపు దూకుతారని భావించినప్పటికీ చివరికి టి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకుల సంఖ్య ముగ్గురు, నలుగురితో ముగిసిపోయింది.   తాజాగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలూ చూసే కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ప్రతినిధి ఆజాద్ సహితం "కెసిఆర్ పైరవీల'' గురించి, అతనితో అటువైపునకు దూకిన పార్టీ విభీషణాదుల గురించి బట్టబయలు చేస్తూ బహిరంగ ప్రకటన చేయడంతో కెసిఆర్ సహా అతని పార్టీలోకి దూకిన కాంగ్రెస్ అవకాశవాదనాయకులు కలగుండు పడిపోతున్నారు. తెలంగాణా సమస్య తెలుగువారి భవితవ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలవారి అభిప్రాయాలతో కూడా ముడిపడిన సమస్య కాబట్టి, వెంటనే తేల్చి చెప్పగల అంశం కాదని ఆజాద్ ప్రభృతులు కాంగ్రెస్ అధిష్ఠానం తరపున స్పష్టం చేశారు. జాతీయ సమైక్యత, దేశ సమగ్రత దృష్ట్యా గతంలో (1969లో 1972లో) నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాటి పైరవీకారుల "తెలంగాణా సమస్య''పై ఏమీ తేల్చిచెప్పిందో అవగాహన ఉన్న ప్రస్తుతపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టు స్పష్టమైన సమాచారం. కాగా ఈలోగా రాష్ట్ర కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి వై.యస్. మరణానంతరం తలెత్తిన సమస్యలు, పార్టీలో వచ్చిన చీలికలూ రాష్ట్ర కాంగ్రెస్ ను చిన్నా భిన్నం చేయడంతో ఆ పార్టీ పునరుజ్జీవనం పెద్ద సమస్యగా మారి, నాయకులు తలో దారిపట్టే స్థితి ఏర్పడింది. 150 సంవత్సరాల చరిత్ర అయితే ఆ పార్టీకి ఉందిగాని, అత్యంత క్రమశిక్షణారాహిత్యానికి 'పెద్దబిడ్డ'గా కాంగ్రెస్ తయారయింది. అదేమంటే, కాంగ్రెస్ "ప్రజాస్వామిక సంస్థ'' కాబట్టి భిన్నాభిప్రాయాలుంటాయని నాయకత్వం అనేకసార్లు సమర్ధించుకోడానికి ప్రయత్నించింది. సమస్యలపై చర్చలు, తద్వారా సమిష్టిగా నిర్ణయాలకు రావడాన్ని ప్రజాస్వామ్య సంప్రదాయంగా భావించకుండా బజారుకెక్కి కొట్లాటలు, కుమ్ములాటలు, ఏర్పడడం తిట్టిపోతలు, చీలికలనే "ప్రజాస్వామ్యం''గా కాంగ్రెస్ చలామణీ చేసుకుంటూ వచ్చింది. దాని ఫలితమే ఎవడూ క్రమశిక్షణకు బద్ధమై పార్టీ సమైక్యతావాణికి దోహదం చేయడంలేదు. కనుకనే, కాంగ్రెస్ రాజకీయాల్లో వంశపారంపర్యంగా నాయకులు తమ కుటుంబీకులనే తమకు వారసులుగా సిగ్గువిడిచి ప్రకటించుకుంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇది పైనుంచి కిందిస్థాయి దాకా పాకిపోయి ఘనీభవిస్తున్న సంస్కృతి! ఒకనాడు కాంగ్రెస్ నిర్మాణంలో అగ్రనాయకులలో ఒకరైన తోలిప్రదానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ ఛోటా మోటా నాయకులకు హెచ్చరికగా యిలా సలహా యిచ్చారు : "కాంగ్రెస్ ను వీడిపోవడమంటే జాతీయతా స్రవంతినుంచి తనకుతాను దూరమైపోవటమేనని నా అభిప్రాయం; దేశ రాజకీయాలను మలచగల ఆయుధం జాతీయ కాంగ్రెస్. అలాంటి ఆయుధాన్ని తుప్పుపట్టించడమే అవుతుంది, పార్టీనుంచి విడిపోతే'' అంతేగాదు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే "సోషలిస్టు సమాజం నిర్మాణమావుతుందన్న'' ఆశ పెట్టుకున్న నెహ్రూ తనకు తానై ఒక ప్రశ్న కూడా ఆనాడే వేసుకున్నారు :   "ఎన్నటికైనా కాంగ్రెస్ మౌలిక మార్పులకు దోహదం చేయగల అభిప్రాయకర సామాజిక పరిష్కారాన్ని  దేశప్రజలకు ఇవ్వగల్గుతుందా కాంగ్రెస్?'' అని! అంతేగాదు, భావిభారతదేశంలో ఒకవేళ "సోషలిజం ఆవిష్కరించుకునే పక్షంలో, మానవ జీవితం గురించి, జీవిత సమస్యల గురించి ఆలోచించగల దృక్కోణంలో కాంగ్రెస్ వారిలో అవసరమైన మార్పు రాగల్గుతుంది'' అని కూడా నెహ్రూ ఆశించారు. ఎందుకని అలా ఆశించారు? ఆయన మాటల్లోనే చెప్పాలంటే "ఇప్పటిదాకా కాంగ్రెస్ వారి దృష్టిఅంతా వంశపారంపర్య ధోరణులపైన, గతానుగతికంగా వస్తున్నా అజ్ఞాత పలుకుబడులపైన, అలాంటి వాతావరణంపైన ఆధారపడుతూ వచ్చింది. జీవితం నేర్పే చేదునిజాలే కాంగ్రెస్ వారిలో నూతన దృష్టికి నాంది పలకగలగాలి'' అన్నారు! కాని పాతవరవడి నుంచి కాంగ్రెస్ వారిలో చాలామంది విముక్తి పొందినట్లు కన్పించదు. కనుకనే ఎవరికివారే యమునాతీరేగా ఈ రోజుకీ వ్యవహరిచటం!  

క్యాబినెట్ సమావేశం కోసం డిల్లీలో పంచాయితీ

  మళ్ళీ చాలా నెలల తరువాత ఎల్లుండి మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ప్రధానంగా శాసనసభలో విపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించడాని మంత్రివర్గం సమావేశమవుతోంది. కానీ, అంతకంటే ముందుగా స్వపక్షంలో విపక్షాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయం తేల్చుకోవడానికి ప్రస్తుతం డిల్లీ పెద్దల ముందు పంచాయితీ జరుగుతోంది. దానికి వారు హుందాగా ‘రాష్ట్ర రాజకీయ సమస్యలపై చర్చలు’ అనే టైటిల్ ఇచ్చుకొన్నపటికీ అది పంచాయితీ కాకుండా పోదు.   ఈ పంచాయితీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి తదితరులు పాల్గొంటున్నారు. తద్వారా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం చర్చించే మంత్రివర్గ సమావేశం రసబాస కాకుండా సజావుగా జరుపుకోవాలని వారి తాపత్రయం. ముందు ఇంట్లో గొడవలు చక్కబెట్టుకొంటే ఆ తరువాత పొరిగింటి గురించి చర్చించవచ్చునని వారి ఆలోచనతో ప్రస్తుతం డిల్లీలో పంచాయితీ నడుస్తోంది. బహుశః అధిష్టానం ఈ విషయంలో వారందరికీ తగిన మార్గదర్శక ప్రతిపాదనలు చేసి హైదరాబాదుకి సాగానంపవచ్చును. అందువల్ల, కనీసం ఈ సమావేశం సజావుగా సాగే అవకాశం ఉంది.   ఈ ముందస్తు పంచాయితీయే జరుపకపోయి ఉండిఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయనను వ్యతిరేఖించే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జానా రెడ్డి, రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ తదితరులు డీయల్ ను అత్యంత అవమానకరంగా బర్త్ రఫ్ చేసినందుకు ఈ సమావేశంలో ఎండగట్టేవారేమో.   ఇక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలోమంత్రివర్గం ఆమోదంతో పనిలేకుండా ప్రవేశ పెడుతున్న రోజుకొక కొత్త పధకం గురించి కూడా తీవ్ర అభ్యంతారాలు వ్యక్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయనను నిలదీయడానికి మంత్రి వర్గంలో డీయల్ లేరు గనుక ముఖ్యమంత్రికి చాల ఉపశమనమే అవుతుంది. ఒకవేళ, ఇంకా ఎవరయినా తనను నిలదీయలనుకొన్నా కూడా ప్రస్తుతం డిల్లీలో జరుగుతున్న పంచాయితీ అటువంటి వారి గొంతు నొక్కివేయబడుతాయి గనుక ఈ సారి మంత్రి వర్గ సమావేశం సజావుగా సాగే అవకాశాలున్నాయి. కానీ, టీ-కాంగ్రెస్ యంపీల విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి ఈ సమావేశంలో విమర్శించే అవకాశం ఉంది.   ఇంత అనైక్యంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కలిసి, శాసనసభలో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలని చర్చించుకోవడం ఎవరికయినా నవ్వు తెప్పించక మానదు.

బిజెపి తెలంగాణ ఇవ్వగలదా?

        హైదరాబాదులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు అందరూ ముక్తకంటంతో కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని, కాంగ్రెస్, తెరాసల వల్ల కాదని తెలియజేశారు. అయితే గతాన్ని ఒకసారి పరిశీలిస్తే 1997 లొ ఒకవోటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వాజపాయ్ నేతృత్వంలోని బిజెపి తరువాత తెలంగాణా అంశాన్ని ఎందుకు థాటవేసింది? ఆనాడు కేంద్ర హోమ్మంత్రి గా ఉన్న అద్వాని తెలంగాణా గురించి ప్రస్తావిస్తూ రాజధాని హైదరాబాద్ తెలంగాణా మద్యలో ఉన్నది కనుక ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని చెప్పారు. ఇపుడు బిజెపిలోకి కొత్తగాచేరిన నాగం జనార్ధనరెడ్డిది మరోచిత్రమైన వైఖరి. 1977 లో టిడిపితో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన బిజెపి చత్తీస్ ఘడ్ ,జార్కండ్ ,ఉత్తరాంచల్  అనే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసి, తెలంగాణాను టిడిపి అడ్డుపడిన కారణంగా ఏర్పాటు చేయలేదని ఇపుడు చెపుతున్నారు. మరి ఇప్పుడు కూడా బిజెపి ఎవరొవకరి పొత్తులేకుండా అధికారంలోకి రాలేదు. అలా జరిగితే మళ్ళీ ఎవరొవొకరి పెత్తనానికి తలవ౦చి తెలంగాణా అంశాన్ని పక్కకు నెట్టరు అన్న గ్యారెంటీ ఏమిటి? నాగం జనార్ధనరెడ్డి చెప్పినప్రకారం ఆనాడు టిడిపి అడ్డుపడిన కారణంగానే తెలంగాణా ఏర్పడలేదంటే, మరి  ఇన్నేళ్ళు  ఆయన తెలంగాణా వాదిగా టిడిపిలొ ఏన్నో మంత్రి పదవులు అనుభవిస్తూ ఎందుకు కొనసాగారు.అసలు అన్నిటికి మించి ముఖ్యంగా నాది "సమైఖ్యవాదం", నేను సమైఖ్యవాదిని అంటూ టిడిపిని స్థాపించిన అన్న నన్దమూరి తారక రామారావు పార్టీలో 30సం'ల క్రితం ఈయన చేరినపుడు మరి తెలంగాణ వాదం ఎటుపోయింది? సమైఖ్యవాదిని అని వ్యాఖ్యానించిన ఎన్.టి.ఆర్ హయాంలోనూ, తరువాత చంద్రబాబు హయాంలోనే కదా తెలంగాణ అభివృద్ధి సాధించింది. మరి నాగం ఆరోజు పదవులు అనుభవిస్తూ తెదేపాలో ఉండి, ఇపుడేమో తెలంగాణ ఆత్మగౌరవం అంటూ, వింత వ్యాఖ్యానాలు చేయటం ఎంతవరకు సబబు.

కాంగ్రెస్ లో డీఎల్ చిచ్చు

        ఇప్పటికే అంతర్గత కలహాలతో గందరగోళంలో ఉన్న కాంగ్రెస్ లో ఇప్పుడు డీఎల్ రవీంద్రరెడ్డి బర్తరఫ్ ఉందంతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. డీఎల్ రవీంద్రరెడ్డి బర్తరఫ్ అనంతరం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అనుకూలవర్గం, వ్యతిరేక వర్గం అంటూ రెండు గా విడిపోయింది. కొందరేమో డీఎల్ ను తప్పించడం చాలా గొప్ప పని, సరైన పని అని ముఖ్యమంత్రికి ఆ మాత్ర స్వతంత్రం ఉండాలని, డీఎల్ చేజేతులారా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని..అంటూ ఒక విశ్లేషణ చేస్తుంటే. మరోవైపు… డీఎల్ ను బర్తరఫ్ చేయడం అత్యంత దారుణమైన విషయం అని… అది పద్దతి కాదని, ముఖ్యమంత్రి నియంతా మారాడని మరికొందరు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ అంశం గురించి చర్చించడానికి కాంగ్రెస్ నేతలు వరస సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారట! తాజాగా ఢిల్లీలోనే మకాం పెట్టిన బొత్స జానాలు కూడా అక్కడే సమావేశాలు అయ్యారట.

పవన్ ఫ్యాన్స్ కు పూరీ సారీ

        టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గరంగరంగా వున్నారు. దీనికి కారణం బన్నీ, పూరీ కాంబినేషన్లో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా! ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ పై పూరి రాసిన డైలాగ్ వారిని కించపరిచేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ప్రతి వెధవా పవన్ కళ్యాణ్ ఫ్యానే' అనే డైలాగ్ సినిమా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది గమనించిన పూరి...దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. ‘పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా బాధపడితే వాళ్లందరికీ స్వారీ చెప్తున్నాను. ఆ డైలాగ్ చూసి చిరంజీవిగారు నవ్వుకున్నారు, అల్లు అరవింద్ గారు ఎంజాయ్ చేశారు. బన్నికి ఎంతో నచ్చింది. అది కేవలం కాంప్లిమెంట్ మాత్రమే. అది బన్ని ..పవన్ కి పెద్ద ఫ్యాన్ అని మాత్రమే చెప్తుంది. ఐనా సరే మీరు భాధపడితే రియల్లీ సారి. ఇది మనస్సులో పెట్టుకోవద్దు'' అని వివరణ ఇచ్చాడు.

కొత్త సినిమాలో బాలకృష్ణ రాజకీయం

        గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాలకు, సినిమాలకు సెంటర్ పాయింటుగా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇంతకాలం గాసిప్ గా చెప్పుకుంటున్న బాలయ్య బోయపాటి హిట్ కాంబినేషన్ మూవీ అధికారికంగా తెరకెక్కి గాసిప్ కాస్తా న్యూస్ అయ్యింది. రాజకీయంగా వచ్చే ఏడాది కీలకం కావడంతో అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో తనను సెటిల్ చేసే సినిమా తీయాలనేది బాలయ్య ఆలోచన. అది బోయపాటి అయితేనే సాధ్యమని ఆయన భావిస్తున్నారు. దాదాపు తుడిచిపెట్టుకుపోయిందనుకున్న బాలయ్య సినీ జీవితాన్ని “సింహ” లాంటి భారీ విజయం ద్వారా మళ్లీ ఫాంలోకి తెచ్చాడు బోయపాటి.   ఇప్పుడు బోయపాటితో బాలయ్య మరో సినిమా ప్లాన్ చేశాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. సోమవారం మధ్యాహ్నం సినిమా ప్రారంభం అయ్యింది. సింహా తర్వాత అంచనాలు ఎలా ఉంటాయో తెలుసు. అయితే నా పరిధులు నాకుంటాయి. ప్రేక్షకులు సంతృప్తి పడే స్థాయిలో ఈ సినిమా తీస్తా అని చాలా సాఫ్టుగా చెప్పుకొచ్చారు బోయపాటి.  

డీఎల్ ప్రెస్ మీట్: ఎందుకు తొలగించారు!

        మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి ఈరోజు మధ్యాహ్నం సీఎల్పీలో మీడియా సమావేశం పెడతానని కార్యాలయ వర్గాలకు సమాచారం ఇచ్చారు. దీంతో శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. డీఎల్ కు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి అనుమతిలేదని కార్యాలయ వర్గాలు తాళం వేసుకున్నాయి. దీంతో ఆయన మీడియా పాయింటు వద్ద తన ప్రెస్ మీట్ నిర్వహించుకొన్నారు.   ముఖ్యమంత్రి తనను ఎందుకు బర్త్ రఫ్ చేయవలసి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీకి ముప్పై ఏళ్లుగా సేవలు చేసినందుకు చివరికి ఇదా బహుమానం? అని ఆవేదన వ్యక్తం చేశారు. తానూ గతంలోనే రాజీనామా చేసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఇంత హడావుడిగా తనను బర్తరఫ్ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. తానూ కళంకితుల జాబితాలో లేనని, తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని, పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలలో కూడా ఎన్నడూ పాల్గొనలేదని మరి అటువంటుప్పుడు ఎందుకు తనను పదవిలోంచి తొలగించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనను ఈవిధంగా బర్త్ రఫ్ చేసి అవమానించడం కంటే, పిలిచి రాజీనామా తీసుకొని ఉండి ఉంటే ఇద్దరికీ గౌరవంప్రదంగా ఉండేదని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ పధకాలలో లోపాలను ఎత్తి చూపుతున్నందుకు పదవి నుండి తొలగించడం చాలా తప్పని, అది కిరణ్ కుమార్ రెడ్డి నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు.

ముఖ్యమంత్రి పై డీఎల్ విమర్శలు

  ఈ రోజు డా. డీ.యల్. రవీంద్రా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకొనేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే కాకుండా, సీయల్పీ.కార్యాలయానికి తాళం కూడా వేయించడంతో, ఆయన మీడియా పాయింటు వద్ద తన ప్రెస్ మీట్ నిర్వహించుకొన్నారు.   ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి తనను ఎందుకు బర్త్ రఫ్ చేయవలసి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. పార్టీకి ముప్పై ఏళ్లుగా సేవలు చేసినందుకు చివరికి ఇదా బహుమానం? అని ఆవేదన వ్యక్తం చేసారు. తానూ గతంలోనే రాజీనామా చేసినప్పుడు ఆమోదించ కుండా ఇప్పుడు ఇంత హడావుడిగా తనను బర్త్ రఫ్ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. తానూ కళంకితుల జాబితాలో లేనని, తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని, పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలలో కూడా ఎన్నడూ పాల్గొనలేదని మరి అటువంటుప్పుడు ఎందుకు తనను పదవిలోంచి తొలగించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.   తనను ఈవిధంగా బర్త్ రఫ్ చేసి అవమానించడం కంటే, పిలిచి రాజీనామా తీసుకొని ఉండి ఉంటే ఇద్దరికీ గౌరవంప్రదంగా ఉండేదని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ పధకాలలో లోపాలను ఎత్తి చూపుతున్నందుకు పదవి నుండి తొలగించడం చాలా తప్పని, అది కిరణ్ కుమార్ రెడ్డి నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు.   యస్సీఎస్టీసబ్ ప్లాన్ బిల్లుపై లోతుగా అధ్యయనం చేసి, దాని అమలుకు తీవ్ర కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను కూడా ముఖ్యమంత్రి పక్కకు తప్పించి అదంతా తన గొప్పధనమేనని చాటింపు వేసుకొంటున్నారని విమర్శించారు. తనను పదవిలోంచి తప్పించి బొత్స, రాజనరసింహ తదితరులను బయపెట్టాలని అనుకొంటే పొరపాటని ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివిధ సంక్షేమ పధకాల పేరిట చేసుకొంటున్న ప్రచార ఆర్భాటాన్ని తప్పు పట్టారు. అమ్మహస్తం పధకం ప్రకటించి మూడు నెలలు గడిచినా ఇంతవరకు సరుకులు మాత్రం ప్రజలకు అందట్లేదని, కనీసం ప్రచారం కోసం చేస్తున్నఖర్చుని ఆ పధకం అమలుకి ఉపయోగించినా కొంత మేర ప్రయోజనం కలిగి ఉండేదని ఆయన విమర్శించారు. పధకం అమలు కాకముందే ఆర్భాటంగా ప్రచారం చేసుకొని అమలు చేయడంలో వైఫల్యం చెందితే అటు పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని మాత్రమే తానూ హెచ్చరించానని, కానీ తన సలహాను ముఖ్యమంత్రి వ్యతిరేఖంగా స్వీకరించారని అన్నారు.   ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇటీవల ప్రవేశ పెట్టిన ‘బంగారు తల్లి’ వంటి వివిధ పధకాలను ప్రస్తావిస్తూ వాటిలో చాల వరకు గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకాలేనని, వాటికి ఇప్పుడు సరికొత్త పేర్లు తగిలించి మళ్ళీ కొత్తగా ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ఆ విధంగా ప్రవేశ పెట్టినప్పటికీ, వాట్ని కూడా సరిగ్గా అమలు చేయలేక ప్రభుత్వం చతికిల పడుతోందని ఆయన విమర్శించారు. మంత్రి పదవి నుండి తప్పించబడినప్పటికీ, తానూ బ్రతికినంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.

ఎస్‌.పి. బాల సుబ్రహ్మణ్యం బర్త్ డే స్పెషల్

      పాట ఆనందాన్ని ఇస్తుంది.. పాట ఆహ్లాదాన్ని ఇస్తుంది, పాట హాయినిస్తుంది, కాని కొన్ని గొంతుల నుండి వచ్చిన పాటలు మాత్రం అమృతంలా అనిపిస్తాయి.. అలాంటి అరుదైన సుమధుర స్వరం గాన గంధర్వుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంది.. తన గొంతుతో పాటకు ప్రాణం పోయగల విలక్షణ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం. ఎస్‌ పి బి గుర్తింపు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఈ మహాగాయకుడు1946 జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యం తన చిన్న వయసునుంచే గాయకుడిగా గుర్తింపు తెచ్చకున్నారు.. తండ్రి వారసత్వంగా వచ్చిన స్వర జ్ఞానానికి తన కృషితో మెరుగులు దిద్దుకున్నాడు.. తండ్రి హరి కథలు చెప్పేవాడు, చిన్నతనంలో తండ్రితో పాటు బాలు కూడా ప్రదర్శనలు ఇస్తూ… పాటలు పాడేవారు. కాని చిన్నతనంలో ఎప్పుడు గాయకుడు కావాలని మాత్రం అనుకోలేదు.. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి మంచి ఉద్యొగంలో స్థిరపడాలనుకున్నాడు.. కాని వెండితెర మీద సున్నాత స్థానం సంపాదించాల్సిన ఆయన అలా నాలుగు గోడల మధ్య ఆగిపోవటానికి సినీ కళామతల్లి అంగీకరించలేదు అందుకే శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాలో గాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు బాలు.. ఘంటసాట, పిబి శ్రీనివాస్‌, రామకృష్ణ లాంటి మహామహులు ఉన్న సమయంలో గాయకునిగా అవకాశం దక్కటమే కష్టం అలాంటి సమయంలో గాయకుడిగా తనకంటూ గుర్తింపఉ తెచ్చుకోవటమే కాదు తనకంటూ సమున్నత స్థానం సంపాదించకున్నాడు బాలు.. చిత్ర పరిశ్రమలో స్వర రారాజుగా వెలుగుతున్న  మన బాల సుబ్రహ్మణ్యం, 40 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి, 11 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును సృష్టించారు. బాలు గానామృతానికి  4 బాషలలో 6 సార్లు నేషనల్ అవార్డులు లభించాయి. లతామంగేష్కర్ అవార్డుతో పాటు, మన రాష్ట్ర ప్రభుత్వం అందించే 25 నంది పురష్కారాలను కూడా  స్వంతం చేసుకున్నారు. గాయకునిగా ఎన్నో అద్బుతమైన పాటలు పాడిన బాలు,  మన్మద లీలలు సినిమా తో  డబ్బింగ్ ఆర్టిస్టుగా తన  ప్రస్థానాన్ని ప్రారంభించారు, కమల్ హసన్, రజినికాంత్ లాంటి ఎంతో మంది అగ్రకథానాయలకు తన గాత్రాన్ని అందించారు. ముఖ్యంగా దేవుళ్ల పాత్రకు పాటలు పాడాలన్నా. డబ్బింగ్‌ చెప్పాలన్నా బాలు తప్ప మరువరు లేరు అనేలా శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు..          తెర వెనుకనే కాదు తెర మీద కూడా బాలు తనను తాను నిరూపించుకున్నాడు.. నటునిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించాడు.. అభినయం, హస్యంతో ఆకట్టుకుంటూ మంచి నటుడు గా కూడా  గుర్తింపు పొందాడు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా..  దేవాలయం, మిథునం లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో అవార్డులను సైతం అందుకున్నాడు..         బాలు స్వర ప్రస్ధానం వెండితెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా కొనసాగింది.. ఎన్నో సీరియల్స్‌కు టైటిల్‌ సాంగ్స్‌ పాడిన బాలు.. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా కూడా వ్యవహారించారు.. పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలతో ఎన్నో మంది గాయకులను పోత్సహిస్తూ తనకు ఆ స్థాయిని కల్సించిన కళామతల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు బాలు..         ఇలా ఎన్నో రంగాల్లో తనదైన బాణీలో దూసుకుపోతున్న బాలసుబ్రమణ్యం గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఇంకా ఎన్నో వేల పాటలతో మనల్ని అలరించాలని ఆశిస్తూ ఈ గాన ప్రవాహానికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు..