చంద్రబాబుకి జేడీ లక్ష్మి నారాయణ క్లీన్ చిట్

  సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్రంలో తన పదవీ కాలం ముగియడంతో మహారాష్ట్రలోని తన స్వంత క్యాడర్ కు మొన్న తిరిగి వెళ్ళిపోయారు. వెళిపోయే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేసుల గురించి కొంత వివరణ ఇచ్చారు.   జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ దాదాపు ముగింపుకు చేరుకొందని, అందువల్ల తన బదిలీవల్ల దానిపై ఎటువంటి ప్రభావం పడబోదని విచారణకు కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ కేసును ఎవరు చేప్పటినా కూడా విచారణ త్వరలోనే ముగిసిపోవచ్చునని ఆయన అన్నారు.   చెన్నై కి చెందిన అరుణాచలం అనే సీబీఐ అధికారికి ఈ బాధ్యతలు అదనంగా అప్పగించబడ్డాయి. ఆయన గనుక ఇంతవరకు ఈ కేసులపై విచారణ చేస్తున్న రాష్ట్ర సీబీఐ అధికారులకు పూర్తి స్వేచ్చనిస్తే, త్వరలో దర్యాప్తు ముగిసి జగన్ కేసుల్లో తుది చార్జ్ షీట్స్ దాఖలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, జగన్ త్వరలో బెయిలు పొందే అవకాశం కూడా ఉండవచ్చును.   ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తానూ చంద్రబాబును ఉపేక్షిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెస్ నేతల చేస్తున్న విమర్శలకు బదులిస్తూ, ఈవిషయంలో చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక ఆధారాలు లేనందునే ఆయనపై విచారణ మొదలుపెట్టలేదని, ఆయన హయంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం మొదలయినపట్టికీ, దానిని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మాత్రం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డేనని ఆయన స్పష్టం చేసారు.   లక్ష్మి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకి కొండంత బలం ఇవ్వగా, వైకాపా నేతలకి ఇబ్బందికరంగా మారనుంది. ఇంతవరకు, ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నఆరోపణలు లక్ష్మి నారాయణ వ్యాక్యాలతో తప్పని ఋజువు అవడమే కాకుండా, తిరిగి మళ్ళీ అవి వైకాపా మెడకే చుట్టుకొన్నాయిప్పుడు. అయితే, జగన్ అమాయకుడని బలంగా వాదిస్తున్న ఆ పార్టీ నేతలు లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను కూడా తీవ్రం ఖండించి, చంద్రబాబు విషయంలో తమ పాత పాటే అందుకొనే అవకాశం ఉంది.

టి నాయకులపై నోరు జారిన కిరణ్

      ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్వపక్షం నుండే విమర్శలు వచ్చాయి. తాజాగా శాసనసభ సమావేశాల నేపథ్యంలో నీలం తుఫాను బాధిత రైతులకు, వడగండ్ల మూలంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అసేంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదుట బైఠాయించారు. దీంతో అటుగా వచ్చిన ముఖ్యమంత్రి “నాటకాలు ఆపి ఛాంబర్ లోపలకు వస్తే మాట్లాడదాం” అని అన్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ రైతుల సమస్యల గురించి మాట్లాడితే డ్రామాలని అవమానిస్తారా ..వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అసేంబ్లీలో హరీష్ రావును ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడితే ఒక్క పైసా కూడా ఇవ్వను ..ఏం చేసుకుంటారో ? ఏం రాసుకుంటారో ? చేసుకోండి అని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.

ఓయులో ఉద్రిక్తత

      తెలంగాణ రాజకీయ జేఏసీ ఛలో అసేంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానికి మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయలయంలో విద్యార్థులు ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని విద్యార్థులు చెప్పినా పోలీసులు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదాలు జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీ ఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాలతో ఉస్మానియా అట్టుడుకుతోంది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్రమ అరెస్టులు, బైండోవర్లకు ఎట్టి పరిస్థితులలోనూ భయపడం అని, ఖచ్చితంగా ఛలో అసేంబ్లీ జరుగుతుందని విద్యార్థి నేతలు అంటున్నారు.

నేను బొబ్బిలి పులినే..దాసరి

        మాజీ కేంద్ర బొగ్గు సహాయమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణవు ను బొగ్గు కుంభకోణంలో సిబిఐ ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్నడం పై స్పందించారు. 'ఒక పథకం ప్రకారం నా మీద అసత్య ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయి. అంతవరకూ ఆందోళన చెందకుండా అభిమానులు ఓపిక పట్టాలి. నేను ఎప్పటికీ బొబ్బిలిపులినే' అని అన్నారు. దాసరిని ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్న సీబీఐ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి లాభం చేకూరేలా చేశారని, ఆయన చేసిన మేలుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన సౌజన్య మీడియాలోకి రూ.2.5 కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ నుండి వచ్చిన సీబీఐ అధికారులు దాసరి నివాసంలో, సిరి మీడియా, సౌజన్య మీడియా కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు.

వచ్చే ఎన్నికల్లో కిరణ్ పోటి చేయరు!

        మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్ర రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శల ఘాటును పెంచారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై ఆగ్రహంతో ఉన్న డి.ఎల్. ముఖ్యమంత్రి పై విరుచుకుపడుతున్నారు. కిరణ్ బ్రదర్స్ జైలు కు వెళ్ళే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్న విషయం ముఖ్యమంత్రికి తెలుసునని, అందువల్ల ఆయన ఎన్నికల్లో పోటిచేయకపోవచ్చునని రవీంద్రరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదివి నుంచి కిరణ్ దీగిపోయాక అమెరికా వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నారని కూడా రవీంద్ర రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని కిరణ్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కిరణ్ సోదరులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారని, అదే నిజమనిపిస్తోందన్నారు.

సొంత రాష్ట్రానికి సీబీఐ లక్ష్మినారాయణ

      సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన ఇవాళ రిలీవ్ అయ్యారు. డీఐజీ వెంకటేష్‌కు తన బాధ్యతలను అప్పగించారు. తాను రిలీవ్ అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి వల్లే దేశాభివృద్ధి కుంటు పడుతోందని .. ఇప్పటి వరకు రాష్ట్రంలో దర్యాప్తు చేసిన కేసుల వివరాలను సీబీఐ కోర్టుకు తెలిపామని, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో కోర్టుకు సమర్పించామని” ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దర్యాప్తును డీఐజీ వెంకటేష్ బృందం పూర్తి చేస్తోందని తెలిపారు. అయితే కేసుల దర్యాప్తు విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడిలేదని తెలిపారు. తాను మీడియాకు ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని లీకు చేయలేదని, అవసరమనిపిస్తే తానే మీడియా నుంచి సమాచారాన్ని సేకరించానని తెలిపారు. సొంత రాష్ట్రంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని లక్ష్మినారాయణ అన్నారు.

బొగ్గు స్కామ్ లో దాసరి పై ఎఫ్‌ఐఆర్‌

        దేశంలోనే భారీ స్థాయి కుంభకోణాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న బొగ్గుస్కామ్ లో ఏపీ వాటాలు కూడా బయట పడుతున్నాయి. యూపీఏ ప్రభుత్వాన్ని వణికిస్తున్న కోల్ స్కామ్ లో దాసరికి కూడా వాటా ఉందని దాదాపుగా నిర్దారణ అయ్యింది. లక్షా 86 వేల కోట్ల రూపాయల కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బొగ్గు కేటాయింపుల్లో మంత్రిగా దాసరిపాల్పడిన అక్రమాలకు పక్కా ఆధారాలు దొరికనట్టు తెలుస్తోంది. ఈ కేసులో కూడా సీబీఐ క్విడ్ ప్రోకో కోణాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో నవీన్‌జిందాల్‌ పెట్టబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్‌ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం..

వీసీ శుక్లా కన్నుమూత

        కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా కన్నుమూశారు. గత నెల 25వ తేదీన ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి ప్రముఖ నేతలు సంతాపం తెలియజేశారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమ ప్రగాఢ సంతాపం తెలుపుతూ, శుక్లా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు.వీసీ శుక్లా తొమ్మిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.

నన్ను రెచ్చగొడితే నీకే నష్టం: దగ్గుబాటి

      తనను రెచ్చగొడితే సుబ్బరామిరెడ్డికే నష్టమని దగ్గుబాటి వెంకటేశ్వర రావు హెచ్చరిక జారీ చేశారు. మరి ఈయన దగ్గరు సుబ్బిని బెదిరించడానికి ఏ అస్త్రాలు ఉన్నాయో కానీ…ఇలా నాతో పెట్టుకోకు అని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ''సుబ్బరామిరెడ్డి పంపించిన లీగల్ నోటీసుల వ్యవహారం నేను కోర్టులోనే తేల్చుకుంటాను. అయినా నాతో వివాదం పొడిగించుకోవడం సుబ్బరామిరెడ్డికే నష్టం. నాతో పెట్టుకోవద్దు..నన్ను రెచ్చగొట్టొద్దు..ఇలాగే చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి” అని కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. సుబ్బరామిరెడ్డి పంపిన లీగల్ నోటీసులను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. మా ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అభ్యర్థుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఎన్నికల్లో టికెట్లు వస్తాయని అయన అన్నారు.

వాయిదాలతో శాసనసభ వాయిదా

        శాసనసభ రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరుగకుండా వాయిదా పడింది. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు పట్టుపడుతూ పోడియం దగ్గర డిమాండ్‌ చేయగా..తెలంగాణాపై తీర్మానం చేయాలంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు సభను స్తంభింపచేశారు. దీంతో స్పీకర్ సభను పదేపదే రెండు సార్లు అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు తమ అందోళన కొనసాగించారు. బడ్జెట్ పద్దులపై చర్చ చేద్దామంటూ స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన విపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. మొదటి వాయిదా తర్వాత సమావేశమైన సభలో బడ్జెట్‌ పద్దులపై స్టాండింగ్‌ కమిటీలు రూపొందించిన నివేదికలను సభకు సమర్పించినట్టు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించారు. సభ్యుల ఆందోళనల మధ్యే పలు బిల్లులను మంత్రులు ప్రవేశట్టారు. రెండుసార్లు వాయిదా తర్వాత మూడోసారి ప్రారంభమైన సభలోను విపక్షాల ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

దాసరికి అంటుకున్న బొగ్గు మసి

        తన ప్రత్యర్ధులను బెదిరించటానికి కేంద్రం వాడుకున్న సిబిఐ అస్త్రం ఇప్పుడు మిస్‌ ఫైర్‌ అయినట్టుగా కనిపిస్తుంది.. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ సిబిఐ సోదాలతో కాంగ్రెస్‌ అవినీతి డొంక కదులుతుంది.. ఇన్నాళ్లు సిబిఐ చార్జీ షీట్లతో పదివిలో ఉన్న మంత్రలు మాజీలవుతుంటే ఇప్పుడు మాజీలకు కూడా కష్టాలు తప్పేలా లేదనిపిస్తుంది..   ముఖ్యంగా కేంద్రంలో సాక్ష్యాత్తు ప్రదాన మంత్రే అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వినిపించిన స్కాం బొగ్గు కుంభకోణం. అయితే ఇప్పుడు ఈ స్కాంలో ఆ బోగ్గు మసి ఆ శాఖ కు సహాయ మంత్రిగా వ్యవహరించిన దాసరికి కూడా అంటుకున్నట్టుగా కనిపిస్తుంది.. సిబిఐ తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ ఐ ఆర్‌లో దాసరి పేరును కూడా చేర్చడంతో దాసరి కూడా అరెస్ట్‌ అవుతారన్న ప్రచారం జరుగుతుంది.. చిరు పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన దగ్గర నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న దాసరి పార్టీ పై కాస్త అసంతృప్తిగా కూడా ఉన్నరన్న టాక్‌ ఉంది.. ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్‌ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం.. దాసరితో పాటు మరో కాంగ్రెస్‌ నాయకుడు నవీన్‌ జిందాల్‌ పేరు కూడా ఎఫ్‌ ఐ ఆర్‌లో చేర్చడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ ఈ సమస్యపై ఎలా స్పందిస్తుందో అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..

అభిమానం డబ్బులిస్తే రాదు: బాలయ్య

        నందమూరి నటసింహం బాలకృష్ణ తన బర్త్ డే వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా ప్రారంబించారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’ సినిమా ఘనవిజయం సాధించింది. శ్రీమన్నారాయణ సినిమా తరువాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది.   ఈ సంధర్భంగా బాలకృష్ణ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ “నాకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ దంపతులు అయితే ఇంతవాడిని చేసింది అభిమానులు. అభిమానం అనేది గుండెలోతుల్లోంచి రావాలి తప్పితే ..డబ్బులిస్తేనో..ప్రలోభాలకు గురిచేస్తేనో రాదు” అని అన్నారు. “కొందరు ఆశించడానికి పుడితే..మరి కొందరు శాసించడానికి పుడతారు” అని కొత్త సినిమా డైలాగ్ కొట్టి అభిమానులను ఆనందపరిచారు బాలయ్య. 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తానంటున్న బాలకృష్ణకు ఇది ఆఖరు చిత్రం అవుతుందా..లేక ఈ లోపే 100వ చిత్రం మొదలు పెడతారా ? చూడాలి.

అద్వాని కి బుజ్జగింపు యత్నాలు

      భారతీయ జనతాపార్టీకి అద్వాని చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తిరస్కరించారు. ఆయనను బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వెంకయ్యనాయుడు ఈ మధ్యాహ్నం రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. విషయం తెలుసుకున్న సీనియర్ నేతలందరూ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా రంగంలోకి దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు భగవత్ సింగ్ ఢిల్లీలోని ఆద్వానీ నివాసానికి వెళ్లారు. మోడీ అనుచరులు మరో విధంగా ఊహించారు. కేంద్రంలో మోడీని ప్రధానిని చేద్దామని, అద్వానీని రాష్ట్రపతిని చేయాలనేదే తమ కోరికగా వారు తెలిపారు. బీజేపీ విధానాలపై తీవ్ర మనస్తాపం చెందిన అద్వానీ ఈ రోజు ఉదయం పార్టీకి, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలేదని, అలాంటి పార్టీలో కొనసాగేది లేదని అద్వానీ పేర్కొన్నారు.

అద్వాని అస్త్ర సన్యాసం

        బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని,నాడు శంకరముఖర్జీ,వాజిపేయి ల నాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాదు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా నరేంద్ర మోడీ ని గురించిన వ్యాఖ్యానమనే అనుకోవచ్చా?అయితే 86సం'ల అద్వాని కొత్త నీరు వస్తున్నపుడు పాత నీరు దానికి ఆహ్వా నమ్ పలకాలి అనే సంగతిని విస్మరించారా? అద్వాని 1982లో 2ఎంపి సీట్లు మాత్రమే కలిగి ఉన్న బి. జె.పి ని తర్వాతి కాలంలోతన రధ యాత్ర ద్వారా భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి బి. జె.పిని తీసుకెళ్ళిన ఘనుడు. ఆనాడు కేవలం అద్వాని సామర్థ్యం వల్లనే బి. జె. పి పట్టం గట్టినా,వాజిపేయి కి ప్రధాని పదవిని అప్పగించి,తన గౌరవాన్ని మరింతగా పెంచుకుకున్నారు. అదే నరేంద్రమోడి విషయానికొస్తే గుజరాత్ లో   మూడు సార్లు అధికారంలోకి బి. జె. పి ని తీసుకొచ్చిన ఘనత కలిగిన  నేత. గుజరాత్ ను అభివృద్ధి పధం వైపు తీసుకెళుతు ఒక్కసారి దేశ ప్రజలందరి దృష్టి తన వైపు  మళ్లించుకున్న నాయకుడు నరేంద్రమోడి.                                   అయితే ఈనాడు కేవలం గుజరాత్ రాష్ట్ర స్థాయి అభివ్రుది,ఆస్థాయి పరిపాలన దేశాన్ని పరిపాలించే సామర్ధ్యానికి సరిపోవు అనేది అద్వాని అభిప్రాయమ్. అంతేకాదు గోద్రా అల్లర్ల నేపధ్యంలో నరేంద్రమోడి మీద ఉన్న మతతత్వ అభిప్రాయం,పార్టీకి మిగతా మతాల వారి ఓటు బాంక్ ను దూరం చేస్తుందనేది కూడా. అలాఐతే నాడు బాబ్రి మసీదు విషయంలో ఎల్. కె అద్వాని పట్ల కూడా దేశంలోని ఒక వర్గం ప్రజలకు ఇలాంటి అభిప్రాయమే ఉండవచ్చును కదా!పైగా 2002 నాటి గోద్రా అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీ ని సమర్ధించింది,ఈ ఎల్కెఅద్వానీయె అన్న విషయం జగమెరిగిన సత్యం. అసలు బి. జె. పి అంటేనే మతతత్వ పార్టీ. అలాంటపుడు ఇపుడు కొత్తగా మోడీ వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమిటి ?           ఇహ సామర్థ్యం విషయానికి వస్తే కార్గిల్ మరకలు,చిన్నరాష్ట్రాలు  తద్వారా మావోఇష్టుల మరకలు బిజె.పి కి ఎటూ ఉండనే ఉన్నాయి,ఏది ఏమైనా నేడు బిజె.పి ని అనుకోని సమస్యలోకి నెట్టి,చేజేతులా నష్టాన్న్ని తెచ్చిపెట్టిన వాడుగా అద్వాని మిగిలిపోనున్నారా?      

కిరణ్, బాబుల రాజకీయకుట్రలు

        వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు విజయమ్మ నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు పార్టీ ఎమ్మేల్యేలతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ...''చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లది రాజకీయ కుట్ర అని, రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. అప్పుడేమో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలిపినా తర్వాత అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలపై వేటు పడిన తర్వాత అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నారు'' అని విజయమ్మ విమర్శించారు. వీరిద్దరి రాజకీయ కుట్రలకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని,15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటం సరికాదని విజయమ్మ అన్నారు.

బీజేపీకి అద్వానీ రాజీనామా

      భారతీయ జనతా పార్టీలో సంక్షోభం ముదిరినట్లే కనిపిస్తోంది. పార్టీ పదవులకు ఆ పార్టీ అగ్రనేత ఎల్.కే అద్వానీ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ పని తీరును తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఎల్.కే అద్వానీ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చాలా మంది పార్టీలో వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని, సిద్దాంతాలకు అనుగుణంగా పార్టీ ఎక్కువకాలం పనిచేస్తుందని అనుకోవడంలేదని.. సిద్దాంతాలకు కట్టుబడని పార్టీలో తాను కొనసాగలేనని ఆయన తనలేఖలో పేర్కొన్నారు.   తన మాట కాదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించడంపై భంగపడ్డ అద్వానీ మనస్తాపం చెంది, పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. దీనికి తోడు ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఏక పక్షం నిర్ణయం తీసుకుంటూ మోడీని కన్వీరన్‌గా కాకుండా ఏకంగా ఛైర్మన్‌గా నియమించాలని నాగ్‌పూర్ నుంచి ఆదేశాలు జారీ చేయడంపై కూడా అద్వానీ మనస్తాపం చెందారు. అయితే మోడీ నియామకం అద్వానికి ఇష్టం లేకపోయినా తర్వాత సర్దుకుంటారని బీజేపీ నేతలు భావించారు తప్ప, రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు.  

బ్రాహ్మణయ్య మృతికి అసెంబ్లీ సంతాపం

        ఇటీవల మృతి చెందిన టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది. అంబటి బ్రాహ్మణయ్య మరణంపై జరిగిన సంతాపసభలో చంద్రబాబు మాట్లాడి నివాళి అర్పించారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దం ఎమ్మెల్యే అంబటి బ్రహ్మణయ్య అని అన్నారు. బ్రహ్మణయ్య విలువలతో కూడిన రాజకీయం చేశారని కొనియాడారు. బ్రహ్మణయ్య విద్యారంగానికి ఎనలేని కృషి చేశారన్నారు. పులిగడ్డ వంతెనకు బ్రహ్మణయ్య పేరుపెట్టాలని, అవనిగడ్డలో ఆయన విగ్రహం పెట్టాలని చంద్రబాబు సూచించారు.   ఎమ్మెల్యే అంబటి బ్రహ్మణయ్య సేవలు ఎనలేనివి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రైతులు, పేదల సమస్యలపై బ్రహ్మణయ్య రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

దగ్గుబాటికి సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీస్ లు

        విశాఖ ఎంపీ సీటు వివాదం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టి.సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని 12 అంశాలతో కూడి నోటీసును సుబ్బరామిరెడ్డి పంపారు. అయితే తనకు సుబ్బరామిరెడ్డి నుండి ఎలాంటి నోటీసులు అందలేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖ ఎంపీ సీటుకోసం సుబ్బరామిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికితోడు పురంధేశ్వరిని నరసారావుపేట వెళ్లాలని, ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చింది తానేనని ఆయన అన్నారు. దీంతో విభేదించిన దగ్గుబాటి అసలు సుబ్బరామిరెడ్డి చరిత్రం ఏంటి ? నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంటు అమ్ముకున్న కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లాడు అని ఆరోపించారు. దీంతో సుబ్బరామిరెడ్డి దగ్గుబాటికి నోటీసులు పంపారు.