డీఎల్ ప్రెస్ మీట్: ఎందుకు తొలగించారు!
posted on Jun 4, 2013 @ 3:53PM
మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి ఈరోజు మధ్యాహ్నం సీఎల్పీలో మీడియా సమావేశం పెడతానని కార్యాలయ వర్గాలకు సమాచారం ఇచ్చారు. దీంతో శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. డీఎల్ కు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి అనుమతిలేదని కార్యాలయ వర్గాలు తాళం వేసుకున్నాయి. దీంతో ఆయన మీడియా పాయింటు వద్ద తన ప్రెస్ మీట్ నిర్వహించుకొన్నారు.
ముఖ్యమంత్రి తనను ఎందుకు బర్త్ రఫ్ చేయవలసి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీకి ముప్పై ఏళ్లుగా సేవలు చేసినందుకు చివరికి ఇదా బహుమానం? అని ఆవేదన వ్యక్తం చేశారు. తానూ గతంలోనే రాజీనామా చేసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఇంత హడావుడిగా తనను బర్తరఫ్ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. తానూ కళంకితుల జాబితాలో లేనని, తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని, పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలలో కూడా ఎన్నడూ పాల్గొనలేదని మరి అటువంటుప్పుడు ఎందుకు తనను పదవిలోంచి తొలగించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనను ఈవిధంగా బర్త్ రఫ్ చేసి అవమానించడం కంటే, పిలిచి రాజీనామా తీసుకొని ఉండి ఉంటే ఇద్దరికీ గౌరవంప్రదంగా ఉండేదని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ పధకాలలో లోపాలను ఎత్తి చూపుతున్నందుకు పదవి నుండి తొలగించడం చాలా తప్పని, అది కిరణ్ కుమార్ రెడ్డి నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు.