ఇది భార్యా భర్తల సవాల్

      ఎక్కడైనా బావ అంటే ఒప్పుకుంటాను. కానీ వంగతోట కాడ మాత్రం ఒప్పుకోను అంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఇది మారిపోయింది. ఎక్కడన్నా భార్య అంటే ఒప్పుకుంటాను. ఎన్నికల వేళ మాత్రం భార్యా భర్తా జాన్తానై అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లోకసభా స్థానానికి బీఎస్పీ తరఫున సిట్టింగ్ ఎంపీ ఖాదర్ రాణా పోటీ చేస్తున్నారు.ఆయనకు పోటీగా ఆయన భార్య షాహిదా బేగమ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. రాణా గతంలో సమాజ్ వాదీ పార్టీలో ఉండేవారు. 2007లో ఆయన రాష్ట్రీయ లోకదళ్ లో చేరారు. రెండేళ్లకే బీఎస్పీలోకి దూకేశారు. ఆయనకు కూడా ఇంతిపోరు తప్పడం లేదు. భార్యామణి బరిలో దిగేసరికి ఆయన కంగారు పడుతున్నారు. కొసమెరుపు: ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో మన రాణా మీద కూడా చార్జిషీటు దాఖలైంది.

కేసీఆర్.. వంద అబద్ధాలు

      ఇన్నాళ్లూ కేసీఆర్ తన పార్టీని విలీనం చేస్తారేమో, కనీసం పొత్తుకైనా సరేనంటారేమో అని ఎదురు చూస్తూ సంయమనం పాటించిన కాంగ్రెస్ నాయకులు.. ఇక ఆ ఆశలన్నీ అడుగంటి పోవడంతో నోళ్లు విప్పడం మొదలుపెట్టారు. ‘కేసీఆర్.. వంద అబద్ధాలు’ పేరుతో ఏకంగా ఓ పుస్తకం విడుదల చేయాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకు కేసీఆర్ చెప్పిన మాటలు, వాటిని మార్చుకున్న తీరును ఎండగడుతూ ఈ పుస్తకం ఉండబోతోంది. పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో చోటు ఉండబోదని చెప్పడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించి మాటతప్పడం, 2004, 2009 ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించిన తీరు, 2009 ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ పంచన చేరిన వైనం.. ఇలా అన్నీ ఇందులో ఉంటాయట. వారం రోజుల్లోపే ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని టీ-పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

రాజుగారికి ఆశాభంగం

    కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతోపాటే క్యాడర్ కూడా వెన్నంటి వస్తుంది.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా మూకుమ్మడిగా తనకే జయజయధ్వనాలు పలుకుతారని భావించిన రాజావారికి ఆశాభంగమైంది. టీడీపీలో చేరిన తర్వాత తొలిసారి పాతపట్నం నియోజకవర్గానికి వచ్చిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు తనవారనుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొహం చాటేశారు.. మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచీ పూర్తిస్థాయిలో స్వాగత సత్కారాలు లభించలేదు. ఎల్.ఎన్.పేట నుంచి నిర్వహించిన స్వాగత ర్యాలీ చప్పగా సాగింది. టీడీపీలో తన అధిపత్యం నిరూపించేందుకు శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పటికే అక్కడ టీడీపీలో రెండు వర్గాలు ఉండగా.. ఒక వర్గానికి చెందినవారే ఈ కార్యక్రమంలో కనిపించారు. దీంతో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి ఈసారి తనను గట్టెక్కించేస్తారు అనుకున్న శత్రుచర్ల ఆశలు అడియాసలని మొదటిరోజే తేలిపోయింది. రెంటికీ చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి తయారైంది.

రాజస్థాన్ బరిలో అజారుద్దీన్

      మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్‌ ఈసారి రాజస్థాన్‌ రాష్ట్రంలోని సవాయ్‌ మదోపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు. ఇంతకుముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీలోని మొరాదాబాద్ నుంచి ఫీల్డింగ్ ప్లేస్ మార్చినట్లుగా ఏకంగా రాజస్థాన్ పంపేశారు. 58 మంది పేర్లతో కాంగ్రెస్ పార్టీ లోక్ సభకు పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అందులో అజహరుద్దీన్ పేరు రాజస్థాన్ లో వినపడింది. మొరాదాబాద్ లో ఆయనపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతవల్లే రాజస్థాన్‌ కి మార్చినట్టు సమాచారం.ఇక కేంద్ర మంత్రులు కపిల్‌ సిబల్‌ ను ఢిల్లీలోని చాందినీచౌక్ స్థానం నుంచి, కృష్ణతీరథ్‌ను వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు. వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ జాబితాలోనూ వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు.

అంతరాత్మను బయట పెడతానంటున్న కలెక్షన్ కింగ్

      కొంతకాలంగా అంతరాత్మను చంపుకుని ఓపిగ్గా ఉన్నానని, కొన్ని రోజుల తరువాత తన అంతరాత్మను బయటపెడతానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటున్నారు. త్వరలో ఓ వ్యక్తిపై సంచలన వ్యాఖ్యలు చేస్తానని, వారి అక్రమ సంపాదననూ బయట పెడతానని ఆయన చెప్పారు. ఆ వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఎంత ఆస్తి ఉండేది? ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎంత ఆస్తి సంపాదించాడని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆయనీ వ్యాఖ్యలు చేయడంతో.. అవి ఎవరి గురించన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సహజంగానే నెలకొంది.   ఓటర్లు  నిజాయితీగా, డబ్బులకు లొంగకుండా ఓటు వేసినరోజు దేశం ముందడుగు వేస్తుందని కూడా మోహన్ బాబు అన్నారు. ఎన్నికల్లో డబ్బుతీసుకుని ఓటేస్తే మన హక్కులకోసం నాయకుడిని నిలదీసేందుకు అర్హత కోల్పోతామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని రూపుమాపితే తప్ప ప్రజలకు మంచి జరగదన్నారు. గతంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన మోహన్ బాబు, ఆ తర్వాత మాత్రం వాటికి కొంత దూరంగా ఉన్నారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోందని ఈ వ్యాఖ్యలు విన్నవాళ్లు అంటున్నారు.

కొంప ముంచిన కిరణ్ పర్యటన

      ముఖ్యమంత్రి హోదాలో 2012 డిసెంబర్ 19న కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా పాడేరు పర్యటన ఆర్‌ఆండ్‌బీ అధికారుల కొంపముంచింది. ఆయన పర్యటనలో సాంకేతిక అనుమతులు లేకుండా హడావిడిగా ఆర్‌ఆండ్‌బీ రోడ్ల అభివృద్ధి పేరిట రూ.76.25 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆధారాలతో పాడేరుకు చెందిన అల్లాడి శ్రీనివాసరావు పాడేరు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి నాగేశ్వరరావు, అక్రమాలకు పాల్పడిన 11 మంది ఆర్‌ఆండ్‌బీ అధికారులతోపాటు కాంట్రాక్టర్‌పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పాడేరు పోలీసులను ఆదేశించారు. దీంతో పాడేరు పోలీసులు మంగళవారం ఆర్‌ఆండ్‌బీ అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కావాలనే తప్పుడు నామినేషన్లు

      ఎన్నికల సీజన్‌లో క్షణక్షణానికి సీన్ మారిపోతుంటుంది. బస్తీమే సవాల్ ఈ సీటు నాదేనని బీరాలు పలికినవారు నామినేషన్ ఘట్టానికి వచ్చేసరికి చతికిలపడతారు. నామినేషన్లకు ముందే కొందరు తప్పుకుంటుంటే మరికొందరు నామినేషన్ల అనంతరం. పోటీలో నిలబడి తీరతామని మీసం మెలేసి చెప్పిన వారు సైతం రహస్య బేరాలకు తలొగ్గి నామినేషన్ పత్రాల దాఖలులో కావాలని కొన్ని పొరపాట్లు చేసి అవి తిరస్కరణకు గురయ్యేలా చేసుకుంటున్నారు.   తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మూడో వార్డులో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి పరోక్షంగా సహకరిస్తూ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి లోపాయికారీ ఒప్పందాలతో సహకరించారు. అతనికి ఖర్చు చేసే సత్తా లేక పోవడంతో నామినేషన్ వేసినట్టే వేశారు. కానీ వాటిని కావాలని  సరిగ్గా పూర్తి చేయలేదు. అతని నామినేషన్‌ను అనుకున్నట్టుగానే తిరస్కరించారు. దాంతో ఆ వార్డులో ఆయన స్నేహితుడి విజయం నల్లేరుపై నడకైంది. ఇలాగే చాలాచోట్ల అంతర్గత ఒప్పందాలతో నామినేషన్లను తిరస్కరింపజేసుకుని, హాయిగా ఇంట్లో పడుకుంటున్నారు. అదీ సంగతి.  

చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్

      బెర్లిన్ గోడ ముక్క అంటూ ఓ రాయిని చూపించి, మళ్లీ తెలుగు మాట్లాడేవాళ్లందరినీ ఒకే రాష్ట్రంలోకి తీసుకొస్తానన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా ఉంది. ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తనకు వేసుకోడానికి ‘చెప్పులు ’ లేకపోయినా పర్వాలేదు గానీ, తొక్కడానికి ‘సైకిల్’ ఉంటే చాలంటున్నారు.   ఒకవైపు శైలజానాథ్‌ను కిరణ్ తమ పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించగా... శైలజానాథ్ మాత్రం తనకు ఆ పార్టీతో సంబంధం లేదన్నట్లుగానే మాట్లాడారు. "నా వెంట నడిచిన అన్ని వర్గాల ప్రజలనూ సంప్రదించి... ఏ పార్టీలో చేరబోయేదీ గురువారం ప్రకటిస్తా'' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి, తెలుగు ప్రజల అభివృద్ధికి పని చేసే పార్టీలోనే చేరతానని కూడా తెలిపారు. శైలజానాథ్, టీడీపీ మధ్య ఇప్పటికే మధ్యవర్తుల స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో శింగనమలలో శైలజానాథ్‌పై టీడీపీ అభ్యర్థిగా శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ. ప్రస్తుతం శింగనమలలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధమైతే, చేర్చుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు

      తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు ఈరోజు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరినట్లు కొండా సురేఖ ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ శ్రేణులతో వివాదాలు ఉన్న నేపథ్యంలో అదంతా రాజకీయ పరమైనవే తప్ప వ్యక్తిగతం కాదని, తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం అని, గతంలో ఉన్న పరిస్థితులు, అవగాహన మేరకే కేసీఆర్ మీద విమర్శలు చేశామని, ఇప్పుడు టీఆర్ఎస్ మూలంగానే తెలంగాణకు భవిష్యత్ అని భావించి ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చామని కొండా సురేఖ వెల్లడించారు. పార్టీలు మారడంపై మీడియా అడిగిన ప్రశ్నకు జర్నలిస్టులుగా మీరు అవకాశాలను బట్టి ఛానళ్లు, పత్రికలు మారినట్లే తాము పార్టీలు మారామని, తాము పదవుల కోసం పార్టీలు మారలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సురేఖ గుర్తు చేశారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు కొండా దంపతుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.ఒక కార్యకర్త అయితే కిరోసిన్ మీద పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో కెటిఆర్ అయిందేదో అయిపోయింది..అంతా కలిసి పనిచేద్దామని కెటిఆర్ పిలుపు ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ?

      తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అమలులోకోచ్చే అపాయింతేడ్ తేదీ జూన్ 2. అంటే ఇంకా 2 నెలలకు పైగా సమయం ఉంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు చాలా సమయము ఉంది. అప్పుడే తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఎలా అంటే ఆయన మాటల ద్వారా అయిపోయారనిపిస్తోంది. గెలుపు గుర్రాలు, విజయావకాశాలపై, సొంతంగా చేయించుకున్నానని స్వయంగా చెప్పిన కేసీఆర్.. సర్వేలో పేర్కొన్న సీట్లన్నీ టీఆర్ఎస్ కు వచ్చినట్లు, తానే తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొందరు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక సీఎం మాట్లాడుతున్నా తీరుగా ఉన్నాయని, తానూ అధికారంలోకి వస్తే చేస్తాననే హామీలులా లేవని విశ్లేషించారు రాజకీయ పరిశీలకులు. టీయూడబ్ల్యుజే సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. వీరంతా తెలంగాణ పునర్నిర్మాణం, ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి ప్రసంగించారు. కేసీఆర్.. మాత్రం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఇక ఉండదని, డెస్క్, ఫోటో, వీడియో జర్నలిస్టులనే తేడా లేకుండా అందరికీ అక్రిడేషన్లు ఇస్తానని, బలహీనవర్గాల కోటాలో ఇల్లు మంజూరు చేస్తానని చెప్పారు. వేదికపై ఉన్న ఇతర పార్టీ నేతలు మాత్రం ఔరా.. కేసీఆర్ అని ముక్కున వేలేసుకున్నారు.

జగన్ బాబు పిలుపు కోసం మానుగుంట నిరీక్షణ?

      ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత మానుగుంట మహీధర రెడ్డి కిరణ్ క్యాబినెట్ లో మొదటిసారి మున్సిపల్ శాఖామంత్రిగా భాద్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే కెప్టెన్ నల్లారి జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాష్ట్ర విభజనతో కిరణ్ పదవికి రాజీనామా చేయడంతో మానుగుంట కూడా మాజీ అయ్యారు. అయితే కిరణ్ కొత్త పార్టీలో మాత్రం చేరలేదు. రాజకీయాల్లో రాజీ పడని వ్యక్తిగా, పాలనాదక్షుడిగా పేరున్న మానుగుంట ప్రస్తుతం జగన్ బాబు పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు వచ్చి వాలిపోతాను అని కందుకూరుకు చెందిన ఓ ఉన్నతాధికారితో రాయబారం పంపారట. వైసీపీ లో జగన్ తరువాత చెప్పుకోదగ్గ పవర్ సెంటర్ అయిన సజ్జల రామకృష్ణా రెడ్డికి బంధువైన ఉన్నతాధికారి ఎలాగైనా మానుగుంటను పార్టీలో చేర్చాలని కంకణం కట్టుకున్నారట. అయితే జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ పేరు ఉందని, తానే డైరెక్టుగా జగన్ దగ్గరకు వెళ్లి పార్టీలో చేరితే కేడర్, ద్వితీయ శ్రేణి నేతల ముందు పలుచన అయిపోతానని, ఒక్కసారి జగన్ మిస్సిడ్ కాల్ ఇచ్చినా చాలు.. జగనే తనను పార్టీలోకి ఆహ్వానించారని, నియోజకవర్గ ప్రజల కోరిక కూడా అదే కావడంతో వైసీపీలో చేరుతున్నానని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారట మానుగుంట. మరో వైపు వైసీపీలో మొదటి నుంచి పనిచేస్తూ జిల్లా కన్వీనర్ గా భాద్యతలు నిర్వహించిన నూకసాని బాలాజీ ఎప్పటి నుంచో తనకు కందుకూరు టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. మానుగుంట పార్టీలో చేరితే బాలాజీకి ఇక సీటు దక్కేది అనుమానమే? మరో వైపు జిల్లా వైసీపీనీ అన్నే తానే అయి నడిపిస్తున్న బాలినేనికి కూడా మానుగుంట పార్టీలో చేరితే ఇబ్బందులు తప్పవు. అందుకే మహీధర్ కు జగన్ నుంచి ఫోన్ రావాలంటే.. ముందు బాలినేని నుంచి గ్రీన్సిగ్నల్ రావాలి.

అంతా వెళ్లే వారే.. వచ్చే వారేరీ?

      కాంగ్రెస్ నుంచి రోజురోజుకూ పెరిగిపోతున్న వలసలు ఏపీపీసీసీ అగ్రనేతలను తీవ్రంగా కలవరపరుస్తోంది. మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండడం రాష్ట్ర పార్టీ ముఖ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. గత కేబినెట్లోని మంత్రుల్లో రఘువీరారెడ్డి (పీసీసీ ప్రస్తుత చీఫ్) బొత్స సత్యనారాయణ (మాజీ చీఫ్), ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి మాత్రమే మిగిలారు.మిగతా సీమాంధ్ర మంత్రుల్లో పలువురు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరగా, తక్కినవారు రేపోమాపో కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రుల్లో పురందేశ్వరి బీజేపీలో చేరగా ఇతర మంత్రులు పోటీకి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎంపీలు మొత్తం పార్టీని వీడారు. సీమాంధ్రకు చెందిన 97 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో మిగిలిన వారి సంఖ్య వేళ్లమీద లెక్కించేలా మారింది. వచ్చే ఎన్నికలకు పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులే కరువయ్యారు. నేతలు వలసలు పోయిన నియోజక వర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా విభాగాలలోని నేతలను పోటీకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

దళితులకు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్?

      ఏపీ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంటును నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు సాగిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన ఎన్.రఘువీరారెడ్డి (యాదవ్)కి అప్పగించినందున దళితవర్గానికి చెందిన నేతల పేర్లపై పరిశీలన సాగిస్తోంది. తెలంగాణ పీసీసీకి అధ్యక్షునిగా వెనుకబడినవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంటుగా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో సీమాంధ్రలో కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని ఏర్పాటుచేయలేదు. ఈ విషయాన్ని దిగ్విజయ్‌సింగ్‌ వద్ద పార్టీ సీనియర్ ప్రస్తావించారు. పీసీసీ అధ్యక్షుడితో చర్చించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ వారికి తెలిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వగా ప్రచార, మేనిఫెస్టో కమిటీలను అగ్రవర్ణాలకు చెందిన చిరంజీవి, ఆనం రామనారాయణరెడ్డిలకు కట్టబెట్టారు.దీంతో దళితవర్గాలను నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ తరుణంలో ఆ వర్గాలకు చెందినవారికి వర్కింగ్ ప్రెసిడెంటును అప్పగిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ను నియమించవచ్చన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.

లచ్చన్న పార్లమెంటుకే.. నెగ్గిన కోడలి పంతం

      తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్‌ సభకే పోటీ పడుతున్నట్లు తెలిసింది. కోడలు వైశాలి గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో జనగాం అసెంబ్లీ టికెట్ ఆమెకే ఇప్పించి, తాను నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి లోక్ సభకు వెళ్లాలని పొన్నాల భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప పొన్నాల పేరు దాదాపుగా ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.పొన్నాల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.   టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి కూడా హుజూర్‌ నగర్ నుంచే పోటీ చేయనున్నారు.ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయనుండగా.. ఆయన తనయుడు కె.రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు.

టీ-టీడీపీ సీఎం అభ్యర్థిగా కృష్ణయ్య?

      తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలిసింది. దీనివల్ల తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకు మరింత చేరువ కావచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన తెలుగుదేశానికే మా మద్దతు' అని ఆర్.కృష్ణయ్య కూడా పేర్కొన్నారు. అయితే... ఆయన ఇప్పటిదాకా టీడీపీలో అధికారికంగా చేరలేదు. అతి త్వరలోనే కృష్ణయ్యను లాంఛనంగా పార్టీలో చేర్చుకుని... ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్... ఇప్పుడు ఈ విషయంలో వెనుకడుగు వేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీలకు సీఎం పదవి ఇస్తామని ప్రకటించడం ద్వారా మొత్తం బలహీనవర్గాలందరికీ దగ్గర కావొచ్చునని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం!  

టీడీపీలోకే రాయపాటి

      గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఒకటి రెండు రోజుల్లో రాయపాటి టీడీపీలో చేరబోతున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటి టీడీపీ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు నరసరావుపేట సిటింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని గుంటూరు పశ్చిమ నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించినట్లు తెలియవచ్చింది.   రాయపాటిపై కాంగ్రెస్ అథిష్టానవర్గం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరేదీ తేల్చుకోలేకపోయారు. ఈ మధ్య కాలంలో రాయపాటి శిష్యునిగా పేరుపొందిన డొక్కా ఆయనకు మళ్ళీ కాంగ్రెస్‌లోకి రప్పించడానికి ఢిల్లీలో యత్నించినట్లు తెలిసింది. అయినా ఫలితం దక్కలేదు. ఒక దశలో రాయపాటి సమైక్యాంధ్ర నినాదంతో తెరపైకి వచ్చిన కిరణ్‌తో చేతులు కలుపుతారనుకున్నారు. అదీ జరగలేదు. చివరకు సైకిలెక్కాలనే రాయపాటి నిర్ణయించుకున్నారు.

పండగ పుణ్యమాని.. తగ్గిన ఖర్చు

      ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఉగాది పండుగ కలిసొస్తోంది. ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు మునిసిపల్ ఎన్నికలున్నాయి. ఆ మర్నాడే ఉగాది పండుగ. అంటే రెండు రోజులు సెలవులొస్తున్నాయి. ఎటూ రెండు రోజులు సెలవులు వస్తాయి కాబట్టి, వేర్వేరు నగరాల్లో స్థిరపడినవాళ్లు కూడా సొంతూళ్లకు తమంతట తామే వస్తారు. పండుగ పుణ్యమా అని ఆయా డివిజన్లలోని అభ్యర్థులకు కొంత ఖర్చు తగ్గినట్టవుతుంది. ఒకవేళ ఉగాదికి వాళ్లు రాకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రవాణా చార్జీలు భరించి తీసుకురావాల్సి వచ్చేది. ప్రతిసారీ స్థానిక ఎన్నికల్లో, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అయితే హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కేవలం ఓట్లు వేయించుకోడానికే భారీ సంఖ్యలో ఓటర్లను వోల్వో బస్సుల్లో తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం తగ్గిపోయినట్లయింది.

మర్డర్ కేసులో బైరెడ్డి?

      రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాశేఖరరెడ్డిపై హత్య కేసు నమోదైంది. నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు దారుణ హత్యపై మృతుడి కుమారుడు కర్నూలు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెరైడ్డి రాశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, తమ్ముడి కుమారుడు సిద్దార్ధరెడ్డిలతోపాటు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మరికొంతమంది తన తండ్రిని హతమార్చారని సాయి ఈశ్వరుడు కుమారుడు ఫిర్యాదు లో పేర్కొన్నాడు.   సాయి ఈశ్వరుడు గతంలో బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడు. తరువాత కాలంలో ఆయనకు దూరమయ్యాడు. ఆ తరువాత కాలంలో సాయి ఈశ్వరుడు ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది. ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టేసింది. పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చి స్థిరపడిన సాయి ఈశ్వరుడు ప్రత్యర్ధులు బలిగొన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకొనేందుకే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

మెగా సోదరుల మాటల యుద్ధం

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తానని శపథం చేసారు. అయితే ఆయన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజాన్నేసుకొన్నసంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల తమ్ముడు విసిరిన సవాల్ కి జవాబీయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.   చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “తమ్ముడు పవన్ సమాజానికి సేవ చేయాలనే తలపుతో రాజకీయాలలోకి ప్రవేశించాడు. 125సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎన్నో సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కొని బయటపడింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం కొత్తా కాదు, పెద్ద కష్టమూ కాదని” బదులిచ్చారు.   చిరంజీవికి కూడా కాంగ్రెస్ నీళ్ళు బాగానే ఒంటబట్టాయి గనుక అచ్చమయిన కాంగ్రెస్ వాదిలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చక్కగా చిలకపలుకులు పలికారు. అయితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా అభ్యర్ధులు దొరకని పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఎవరికయినా అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వంటి మంచి ప్రజాభిమానం ఉన్న వ్యక్తి, రాజకీయాలోకి ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయమని ప్రజలకు పిలుపునీయడం, ప్రజలపై, ముఖ్యంగా మెగాభిమానులపై ఎటువంటి ప్రభావమూ చూపదని చిరంజీవి అనుకొంటే అది భ్రమే అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకి ప్రస్తుతం ఇంతకంటే వేరే గత్యంతరం కూడా లేదు పాపం!