కేసీఆర్ అమరుల ఉసురు పోసుకుంటారా?
posted on Mar 13, 2014 6:51AM
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం దాదాపు వెయ్యిమంది వరకు ప్రాణత్యాగాలు చేసి అమరులయ్యారు. కానీ ఆ అమరుల కుటుంబాలను ఉద్యమపార్టీగా చెప్పొకునే టీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇతర పార్టీల నాయకులను ప్రజల్లో పలుచన చేసేందుకు ఎప్పటికప్పుడు అమరుల అంశాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం వాళ్లను కూరలో కర్వేపాకులా తీసి పారేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోతూ కూడా తెలంగాణా నినాదాలు చేసిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి.
శ్రీకాంత్ తల్లి శంకరమ్మ సైతం ఇదే అంటున్నారు. ఆమె కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని కూడా హెచ్చరించారు. పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ చెప్పారని, దానికి ఆమె ససేమిరా అన్నారని తెలుస్తోంది.