పవన్ లెఫ్ట్ భావాలు.. రైట్ చూపులు

  పవన్ కళ్యాణ్ . ఇప్పుడు ఓ పవర్ సెంటర్. పవనిజం.. యూత్ ను ఊపేస్తున్న మానియా. ఎన్నికల్లో దిగుతానని పవన్ ప్రకటించగానే స్నేహహస్తం అందిస్తూ అనేక పార్టీలు ముందుకు వచ్చాయి. ఆయితే పవన్ ఆలోచనలు, మానసిక సంఘర్షణ అంతా లెఫ్ట్ భావాలతో తొణికిసలాడుతుంది. ఒక్క కాంగ్రెస్ ను ఓడించేందుకు తానూ ఏ పార్టీతోనైనా కలుస్తానని ప్రకటించిన పవన్, తన ఆలోచనలకు దగ్గరగా ఉండే కామ్రేడ్లు వైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా తన భావాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. నోవాటెల్ నుంచి ప్రసంగించిన పవర్ స్టార్, కులం, మతం, ప్రాంతం అన్నింటికీ తాను వ్యతిరేకమని ప్రకటించాడు. కానీ ఇప్పుడు మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇక్కడే క్లారిటీ లోపించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీలోకి దినేష్ రెడ్డి?

      ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. బీజేపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆయన కమలం పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ నేతలతో దినేష్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో బీజేపీ తరుపున ఒంగోలు లోక్‌సభ స్ధానం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తనకు మద్దతివ్వాలంటూ ముందే టీడీపీ నేతలను కలిసి వచ్చి, ఆ తర్వాతే ఆయన బీజేపీ నాయకులను సంప్రదించారని దినేష్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే పార్టీలో చేరికపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో కూడా దినేష్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఇల్లు కాలుతుంటే.. చుట్టకు నిప్పా?

      ఒకవైపు ఇల్లు కాలిపోతుంటే మరోవైపు చుట్టకు నిప్పు దొరికిందని సంబర పడ్డాడట వెనకటికెవడో. మన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల) తీరు అలాగే ఉందని గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. వాళ్ల విదేశీ పర్యటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాలని ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. ఒకపక్క విభజన ప్రక్రియ, మరోపక్క ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఇక నుంచి విభజన ప్రక్రియ ముగిసే వరకూ ప్రభుత్వఉద్యోగులు ఎవ్వరికీ గవర్నర్ అనుమతి లేకుండా సెలవులూ మంజూరు చేయరు. దీనికి సంబంధించి సీఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

జైరామ్ దృష్టిలో వీరంతా ఎవరు?

  కేంద్రమంత్రి జైరామ్ రమేష్ అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు అత్యంత ప్రముఖుడు. మన రాష్రం కోటా నుంచే రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపిక చేసిన ఈ మేధావి కలహ ప్రియుడు. అంటే నారదుడి టైపు అన్నమాట. ఒకే నోరు.. కర్నూలులో ఒక మాట, కరీంనగర్ లో ఒక మాట ఇదీ జైరాం రమేష్ తీరు. తాజాగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణా ఇవ్వడం కోసం కాంగ్రెస్ 14 ఏళ్ళుగా రాముడిలా వన వాసం, పాండవులా అజ్ఞాత వాసం చేసిందన్నాడు. అయితే సీమాంధ్రులు కౌరవులా, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీతో పాటు ఇతర పార్టీలు రావణుడి టైపా? మరి ఈ విషయాలు కూడా చెబితే కదా ఎవరు రాముడో, ఎవరు రావణుడో తేలిపోయేది. తమరు పాండవులైతే .. కౌరవులెవరో చెప్పకుండా ఎలా తెలుస్తుంది సారూ..?

బొత్స పొమ్మన్నారు .. రఘువీరా రమ్మంటున్నారు..

  కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వారికే తెలియదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగియక ముందు పీసీసీ చీఫ్ గా ఉన్న బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు కొందరు ఇతర పార్టీల్లో కర్చీఫ్ లు వేసుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎప్పుడో ఎందుకు.. ఇప్పుడే వెళ్లిపోవచ్చని ఆగ్రహోదగ్రుడైపోయాడు. సత్తిబాబు కమిట్మెంట్ చూసి కాంగ్రెస్ ను ఎవరూ కదిలించలేరనుకున్నారు. విభజన పూర్తయ్యేసరికి సత్తిబాబు చేతులెత్తేశారు. బొత్స బంధువులు, నమ్మిన బంట్లు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు వేసేవారు కూడా లేకపోవడంతో సీమాంధ్ర పీసీసీ చీఫ్ భాద్యతలు స్వీకరించిన రఘువీరా ఖాళీ అయిన కాంగ్రెస్ దుకాణంలో కొత్త షావుకారులా కూర్చున్నారు. వార్డు మెంబర్ గా కాంగ్రెస్ టికెట్ పొందాలంటే ఢిల్లీ స్థాయి పైరవీలు చేయాల్సి ఉండేది. ఇప్పుడేమో కార్యకర్తలైనా ఫర్వాలేదు. టికెట్కు దరఖాస్తు చేసుకొండంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు రఘువీరా. మరో అడుగు ముందుకేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇంతలో ఎంత మార్పు అని ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు.

పవన్ నా రాజకీయ శత్రువు: చిరంజీవి

  ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే రాజకీలలో ప్రవేశించానని విస్పష్టంగా ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుదుటపడింది. అయితే, సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజానికెత్తుకొన్న చిరంజీవి మాత్రం షాక్ అయ్యారనే చెప్పవచ్చును. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపన సమావేశానికి తన అభిమానులను వెళ్ళవద్దని కోరారు. తన సోదరుడు నాగబాబు ద్వారా అభిమానులను తన వెంట నడవాలని పిలుపునిచ్చారు. బీవీ రాఘవులు వంటి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా చివరికి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అయిపోతుందని , జనసేన కేవలం ఓట్లు చీల్చడానికి తప్ప మరి దేనికీ పనికిరాదని అభిప్రాయపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు, మ్యానిఫెస్టో, ‘సవినయంగా మనవి చేసుకొంటున్నాను’ వగైరా పడికట్టు పదాలతో ఊకదంపుడు ఉపన్యాసం చేయకుండా అభిమానులతో తన మనసులో భావాలను పంచుకొన్నట్లుగా సాగడంతో రాజకీయ విశ్లేషకులు, మీడియా కూడా పెదవి విరిచింది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికి ఆయన అభిమానుల నుండే కాక ప్రజల నుండి కూడా చాలా సానుకూల స్పందన వచ్చింది. కారణం ఆయన ఊకదంపుడు ఉపన్యాసం చేయకుండా సాధారణ ప్రజల మనోభావనలను తన ప్రసంగంలో చక్కగా ప్రతిబింబింపజేయడమే.   ఇప్పటికే సీమాంద్రాలో ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించే బాధ్యత తీసుకొన్న చిరంజీవికి ఇది ఊహించని పెను సవాలుగా మారింది. అందుకే ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పలేదు. ఒకవేళ ఇప్పటికీ ఆయన మాట్లాడకపోయినట్లయితే, ఆయనను కాంగ్రెస్ పార్టీ శంఖిస్తుంది గనుకనే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడారు.   “తమ్ముడు పవన్ కళ్యాణ్ వేరే పార్టీ పెట్టుకొన్నాడు గనుక ఇకపై నేను కూడా అతనిని మా రాజకీయ ప్రత్యర్దిగానే భావించి ఎదుర్కొంటాను. కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను ఏవిధంగా ఎదుర్కొంటుందో తమ్ముడి జనసేనను కూడా అదేవిధంగా ఎదుర్కొంటుంది. నేటికీ నా అభిమానులు, ప్రజలు అందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని నమ్ముతున్నాను. అందువల్ల అతను పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని చెప్పినంత మాత్రాన్న మేమేమి భయపడటం లేదు. సమాజసేవ చేయాలనే తలపుతో అతను రాజకీయాలలో ప్రవేశించి పార్టీ స్థాపించాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం పూర్తిగా అతని వ్యక్తిగత విషయం గనుక నేనేమి ఆ విషయంలో కలుగజేసుకోను.కానీ, తమ్ముడికి ఎల్లపుడూ నా ఆశీస్సులు ఉంటాయి,” అని అన్నారు. అయితే, పవన్ పార్టీ స్థాపిస్తున్నపుడు అన్ని విధాలా అడ్డంకులు సృష్టించి, ఇప్పుడు ఈ నీతి కబుర్లు చెప్పడం చిరంజీవి నైజానికి అద్దంపడుతోంది.

నేడే మోడీ - పవన్ భేటీ

  జనసేన పేరుతో పార్టీ పెట్టినట్లు ప్రకటించి, ఇటు టీడీపీ.. అటు బీజేపీ రెండింటితోనూ పొత్తు పెట్టుకుంటున్నపవన్ కల్యాణ్.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. శుక్రవారం నాడు మోడీని కలిసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని గురువారం సాయంత్రమే అహ్మదాబాద్ వెళ్లారు. శుక్రవారం సాయంత్రం పవన్ - మోడీల భేటీ జరిగే అవకాశం ఉంది.   వాస్తవానికి వీళ్లిద్దరి సమావేశం గురించి ముందు ఉంటుందని, తర్వాత ఉండదని, మళ్లీ ఉంటుందని రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా మోడీని పవన్ కలవట్లేదని అన్నారు. మళ్లీ చివరకు కలుస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్పాయి.   మోడీతో భేటీ సందర్భంగా రాజకీయాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల అభివృద్ధిపై తనకున్న ఆలోచలను పవన్ పంచుకోనున్నారు. ఆయన మద్దతు కోరనున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 'తెలుగు జాతి' అభివృద్ధికి ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి? తదితర అంశాలపై తన ఆలోచనలు చెప్పడంతోపాటు, మోడీ అభిప్రాయాలు కూడా పవన్ కల్యాణ్ తెలుసుకుంటారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై బీజేపీ వ్యూహాలు తెలుసుకోవాలని చూస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు గుజరాత్‌లో చాలా తక్కువ. ఇందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలను కూడా పవన్ తెలుసుకునే అవకాశముంది. మోడీతో సమావేశం తర్వాత పవన్ తన పర్యటన వివరాలు బహిరంగ పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

యువత చేతిలోనే నేతల తలరాతలు

  చిత్తూరు జిల్లాలో యువతీ యువకులే రాజకీయాలను నిర్దేశించబోతున్నారు. వీళ్లు నూటికి నూరుశాతం ఓట్లు వేస్తే.. పార్టీల జాతకాలు తారుమారు కావడం ఖాయం. యువతరం మనస్సు దోచుకున్న నేతలు తాము ఆశించిన స్థానం దక్కించుకోవడమూ ఖాయం. ఈ ఏడాది జనవరి నాటికి చిత్తూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 29,00,500 కాగా అందులో 18 నుంచి 39 సంవత్సరాల వారు 16,15,860 మంది. అంటే సగానికి పైగా ఓటర్లు యువతేనని స్పష్టం అవుతోంది. వీరిలో 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 71,156 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో యువత తీసుకునే నిర్ణయం అభ్యర్థులతో పాటు ఆయా రాజకీయపార్టీల తలరాతలను నిర్దేశించబోతోంది.

టీఆర్‌ఎస్‌ లోకి బాబూమోహన్!

  టీడీపీ నేత, మాజీమంత్రి బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు! ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈనెల 26 తర్వాత ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో బాబూమోహన్ ఆంధోల్ నుంచి పోటీచేసి 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవలి కాలంలో ఆయనకు టీడీపీలోని కొంతమంది నేతలతో సంబంధాలు చెడిపోయాయని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. పార్టీలో కూడా తనకు పెద్దగా ప్రాధాన్యం కనిపించకపోవడం, తెలంగాణాలో టీఆర్ఎస్ అయితేనే ఈసారికి కాస్త ఉపయోగం ఉంటుందని భావించడంతో గులాబీ కండువా కప్పుకోడానికి బాబూమోహన్ సిద్ధపడుతున్నారు.

టీడీపీకి మోదుగుల టాటా?

      నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన చంద్రబాబు పెట్టిన శీలపరీక్షలో నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఇటీవల ఇక్కడ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన మనసు గాయపడింది. నరసరావుపేట నుంచి మళ్లీ పోటీచేస్తానని, అక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అయోధ్యరామిరెడ్డి తన బావ అయినప్పటికీ వెనుకాడబోనని ఆయన చంద్రబాబును కలిసి స్పష్టంచేసినా, గుంటూరు పశ్చిమ లేదా బాపట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు అధినేత యోచిస్తున్నారు. దీంతో తానేం చేసేదీ రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని మోదుగుల స్పష్టం చేశారు. అవసరమైతే నరసరావుపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ఆయన అనుచరులతో చెప్పినట్లు సమాచారం.

కృష్ణా జడ్పీ బరిలోకి గద్దె అనూరాధ?

      ప్రతిష్ఠాత్మకమైన కృష్ణా జిల్లా జడ్పీ పీఠం కోసం తెలుగుదేశం పార్టీ గద్దె అనూరాధను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ భార్య అయిన అనూరాధ ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) చదివారు. జడ్పీ చైర్మన్ పోస్టుకు పలువురు పోటీలో ఉన్నా, అనూరాధ విద్యావంతురాలు కావడంతో పాటు రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.   తన భార్యకు జడ్పీ చైర్‌పర్సన్ టిక్కెట్ ఇచ్చినా తనకు మాత్రం తప్పనిసరిగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని గద్దె రామ్మోహన్ చంద్రబాబును కోరినట్లు సమాచారం. గతంలో తనకు ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ (తూర్పు) సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సమ్మతిస్తేనే తన భార్య తిరువూరు నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుందని అంటున్నారు. గతంలో నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు ఎమ్మెల్యే సీటు, ఆయన భార్య సుధారాణికి జడ్పీ చైర్‌పర్సన్ పోస్టు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గద్దె ఉదహరిస్తున్నారు.

మీసేవ చుట్టూ పరుగో పరుగు

      స్థానిక సంస్థల అభ్యర్థులను ఆయా పార్టీలు ఆఖరి నిమిషంలో ప్రకటిస్తుండటంతో రిజర్వ్ స్థానాల్లో పోటీచేసే సంబంధిత అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక పోవటంతో అభ్యర్థుల స్థానంలో కొందరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆఖరి నిమిషంలోనైనా అవకాశం వస్తే పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు కులధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రిజర్వేషన్ల కారణంగా దొరక్కదొరక్క దొరికిన అభ్యర్థి కులధ్రువీకరణ ప్రతం తేవడం కష్టంగా మారింది. పంచాయతీ ఇంటి, నీటి పన్నుల బకాయిల చెల్లింపుల నోడ్యూస్ సర్టిఫికెట్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చాలా పంచాయతీలలో కార్యదర్శుల కొరత ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. ఎన్నికల నిబంధనలు తెలియని గ్రామీణ ప్రాంత అభ్యర్థులైతే మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

చైనీయుడికి ఎన్నికల ఇక్కట్లు

      ఎన్నికల కోడ్‌తో చైనా దేశస్తుడు జిచెంగ్ కర్నూలు జిల్లాలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో రూ.3.50 లక్షల నగదు లభించడంతో సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత ఆయన వివరాలు చెప్పడంతో వదిలేశారు. చైనాకు చెందిన జిచెంగ్ 15రోజుల కిందట మనదేశం వచ్చారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన కర్నూలు వాసి జుల్ఫికర్ అలీ ఆహ్వానం మేరకు బుధవారం ఇన్నోవాలో స్నేహితులతో కలిసి వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శించేందుకు బయల్దేరారు. భానకచర్ల వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా రూ.3.50 లక్షల నగదు లభించింది.   ఎన్నికల నియమావళి ప్రకారం ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆ నగదును సీజ్‌చేశారు. జిచెంగ్ పాస్‌పోర్టు, వీసా వివరాలను సీఐ రవిబాబు.. ఎస్పీ రఘురామిరెడ్డికి ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. పూర్తి వివరాలుండడంతో అతడిని వదిలేశారు. జిచెంగ్ ఢిల్లీలో మార్బుల్స్ వ్యాపారం చేస్తున్నారని, మే నెల వరకు మన దేశంలో ఉండేందుకు వీసా ఉందని పోలీసులు తెలిపారు.

పరిషత్తులను పట్టించుకునేవారేరీ?

      గతంలో ప్రధాన పార్టీలు జిల్లా పరిషత్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఒకేసారి మున్సిపల్, పరిషత్, ఎంపీ, ఎమ్మె ల్యే ఎన్నికల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. నెలన్నర వ్యవధిలోనే అన్నింటి పోలింగ్ పూర్తి కానుంది. మొదట మున్సిపల్, వెంటనే పరిషత్, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు.   ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు స్థానిక ఎన్నికలను అంత గా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం పూర్తయ్యింది. గురువారంతో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తవుతుంది. అయినా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జిల్లా పరిషత్తుల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చాలాచోట్ల జడ్పీ పీఠంపై ఎవరిని నిలబెట్టాలన్న విషయమై పార్టీలు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాయి.తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు వేర్వేరు రోజుల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. ఈలోపే స్థానిక సందడి ముగిసిపోతుంది. అయినా కూడా ఆ ఎన్నికలమీదే దృష్టిపెడుతున్న నాయకులు.. ఈసారి మాత్రం జడ్పీ ఎన్నికలను అంతగా పట్టించుకోవట్లేదు.

దొరగారి చెప్పులా.. మజాకా

      బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ వాళ్లు తెచ్చిపెట్టిన దొరతనం మాత్రం మనను వదల్లేదు. కాస్త పదవి రాగానే తమను తాము దొరలుగా భావించుకోవడం నాయకులకు మామూలైపోయింది. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇదే కోవలోకి వెళ్లిపోయారు. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా గుడిపాడులో ఒక ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్కనే ఉన్న చనుగొండ్ల పంచాయతీ సర్పంచ్ సుజాతమ్మ భర్త జి.రంగనాయకులు.. మంత్రి చెప్పులు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వాటిని శుభ్రం చేసి కోట్ల పాదాలకు తొడిగారు. ఇదంతా మామూలే అన్నట్లుగా, అసలు అలా జరుగుతున్నట్లు కూడా పట్టించుకోకుండా కోట్ల వ్యవహరించారు.

రహస్య స్నేహాలు బట్టబయలు

      కాంగ్రెస్‌తో దోస్తీ లేనేలేదని తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్... చాలాచోట్ల రహస్య స్నేహాలు మొదలుపెట్టేసింది. స్థానికంగా తమకు కావల్సిన చోట్ల ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుంటోంది. కరీంనగర్ జిల్లా పరిస్థితి అలాగే కనిపిస్తోంది. రహస్య స్నేహాలన్నీ క్రమంగా బయటపడుతున్నాయి. జగిత్యాలలో ఆ పార్టీకి మద్దతుగా ఐదు చోట్ల పోటీకి దూరంగా ఉంది. వేములవాడలో ఏకంగా బీజేపీతో గులాబీయింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లిలో నాలుగు స్థానాల్లో పోటీ చేయుకుండా చేతులెత్తేసింది.   పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మధ్య ఉన్న కోల్డ్‌వార్‌తో 19వ వార్డు నుంచి పోటీకి దిగిన పార్టీ అభ్యర్థి బండి సునీల్‌కు బీ ఫారం దక్కలేదు. సిరిసిల్లలోని 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు లేకుండా పోయూరు. వేములవాడ నగర పంచాయతీలో రెండు స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి ఇక్కడ కమలనాథులతో టీఆర్ఎస్ రహస్య స్నేహం చేసింది. ఏడో వార్డు నుంచి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి, తన ప్రత్యర్థి అయిన బీజేపీ నాయకుడికి మద్దతుగా బరినుంచి తప్పుకొన్నాడు. అలాగే 11వ వార్డులో కూడా టీఆర్ఎస్ అసలు అభ్యర్థినే నిలబెట్టలేదు. అదీ కుమ్మక్కు రాజకీయం.

అద్వానీ శకం ముగిసినట్లేనా?

      బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ శకం దాదాపుగా ముగిసిపోతున్నట్లే కనిపిస్తోంది. ఆయన ఏం అనుకున్నా అది అవ్వడంలేదు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన ససేమిరా అన్నారు. అయినా తప్పలేదు. ఇప్పుడు తన సొంత అభ్యర్థిత్వం విషయంలోనూ చుక్కెదురైంది. ఇన్నాళ్లూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లోని గాంధీనగర్ కాకుండా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి బరిలోకి దిగాలని ఆయన భావించినా, పార్టీ మాత్రం అద్వానీకి గాంధీనగర్ టికెట్టే కేటాయించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది.

జైరాం.. ఇక రెండు రాష్ట్రాల్లో రాం రాం

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి, ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి తామున్నామంటూ పాలమూరుకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్, రాహుల్ దూత కొప్పుల రాజులకు క్షేత్రస్థాయిలో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలిసింది. సీమాంధ్రలో ఎటూ ఒక్కసీటైనా రావడం కష్టమేనని తెలిసినా, తెలంగాణాలో బ్రహ్మాండంగా ఉంటుందని అనుకున్నారు. కానీ, ఇక్కడ సైతం వాళ్లు ఊహించని పరాభవం ఎదురుకావడంతో విస్తుపోయారు.   మునిసిపాలిటీ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వలేదని కొందరు నాయకులు గొడవ సృష్టించారు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 31 వార్డు నుంచి తమ కుటుంబానికి టికెట్ ఇప్పిస్తామని నాయకులు చెప్పడంతో తన చిన్న కూతురు రేణుకను నామినేషన్ వేయిస్తే బీఫామ్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని డీసీసీ కార్యదర్శి నాగమణి స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద కన్నీటిపర్యంతమైంది. ఆమె కూతుళ్లు ఉమ, టికెట్ ఆశించిన రేణుక కేంద్రమంత్రి జైరాం రమేశ్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో హాలు బయటపార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, ముత్యాల ప్రకాశ్ కుట్ర చేశారని, డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.