పురుషుడిపై అత్యాచారం

  ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరగడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ దేశంలో వెరైటీగా మగవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయట. ఎక్కడ అనుకుంటున్నారా... దక్షిణాఫ్రికాలో... అక్కడ పురుషులపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయట. అదే కోవలో ముగ్గురు మహిళలు ఓ వ్యకిని అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. గాంటెడ్ నగరానికి చెందిన ముగ్గురు యువతులు 33 ఏళ్ల యువకుడిని తుపాకీతో బెదిరించి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అతనిని 500 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి ఎవరూ తిరగని ప్రాంతంలో కారును ఆపి అతని చేత మద్యం తాగించారు. తరువాత అతనిపై అత్యాచారం జరిపి కారులోంచి తోసేని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుండి ఏపీలో ఉపాద్యాయ పరీక్షలు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈరోజు నుండి మొదలవుతున్నాయి. ఈరోజు నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,97,294 మంది హాజరవుతున్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2560 పరీక్షా కేంద్రాలను ఏర్పటు చేసారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 10,313 ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. వేసవి శలవుల తరువాత మళ్ళీ పాఠాశాలలు మొదలయ్యేలోగానే జూన్ 1న పరీక్షా ఫలితాలు వెల్లడించి, నియామకాలు కూడా పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడంతో పరీక్షకు హాజరవుతున్న వారిలో ఒకరకమయిన ఆశ, ఉత్సాహం నెలకొని ఉంది.   సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల షెడ్యూల్: శనివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. బాషా పండితుల పరీక్షల షెడ్యూల్: ఆదివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షల షెడ్యూల్: సోమవారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1.15గంటల వరకు. స్కూల్ అసిస్టెంట్ (బాషేతర) పరీక్షల షెడ్యూల్: సోమవారం మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 6.15 గంటల వరకు.   సెకండరీ గ్రేడ్ పరీక్షలకి మొత్తం 57,520 మంది, బాషా పండితుల పరీక్షలకి 53,044 మంది, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకి 56, 373 మంది, స్కూల్ అసిస్టెంట్ (బాషేతర) పరీక్షలకి 2,20,490 మంది హాజరవుతున్నారు.   ఈ పరీక్షలకి హాజరవుతున్న వారి కోసం జిల్లాల వారిగా మరియు రాష్ట్ర స్థాయిలో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ కమీషనర్ సంద్యా రాణి మీడియాకు తెలిపారు. రాష్ట్ర స్థాయి సహాయ కేంద్రాల ఫోన్ నెంబర్లు: 9848854943, 9959400080.

సమావేశాలు పొడిగించినందుకు కూడా నిరసనలా?

  సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు పొడిగించమని ప్రతిపక్షాలు అధికార పార్టీలని డిమాండ్ చేయడం గురించి వింటాము. పొడిగించకపోతే అధికార పార్టీకి ప్రజాసమస్యల గురించి సభలో చర్చించడానికి శ్రద్ధ లేదని నిందిస్తుంటాయి. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు మూడు రోజులు పొడిగించినందుకు ఈరోజు సభలో నానా రభస చేసాయి. అయితే అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది తోడికోడలు నవ్వినందుకేనన్నట్లు మోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు పొడిగించినందుకు కాక తమకు మాట మాత్రం చెప్పకుండా సమావేశాలు పొడిగించారంటూ ‘మోడీ నియంతృత్వం సహించేది లేదు’ అంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేసాయి.   అయితే బీజేపీ వారి ఆరోపణలను తిరస్కరించింది. గతంలో కూడా ఈవిధంగా ఆఖరు నిమిషంలో పార్లమెంటు సమావేశాలు పొడిగించబడ్డాయని కానీ నిన్న(గురువారం) రాజ్యసభ సమావేశాలు రాత్రి వరకు కొనసాగడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ యం. వెంకయ్యనాయుడుతో సహా అనేకమంది మంత్రులు సభా కార్యక్రమాలను మధ్యలో విడిచిపెట్టి రాలేకపోవడంతో పార్లమెంటు సమావేశాలు పొడిగిస్తున్న సంగతి కొన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలియజేయలేకపోయామని బీజేపీ వాదించింది. కానీ బిజినస్ అడ్వయిజరీ కమిటీలో సమావేశంలో పాల్గొన్న సభ్యులకు దీని గురించి తెలుసునని బీజేపీ వాదించింది. తెదేపా, తెరాస, వైకాపా, ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీలు సమావేశాల పొడిగింపుకి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పాయి. ఈ సమావేశాల పొడిగింపు కారణంగా రాహుల్ గాంధీ ఈనెల 12న అదిలాబాద్ జిల్లాలో నిర్వహించదలచిన పాదయాత్రను 15కి వాయిదా వేసుకొన్నారు.

'దొంగాట' షార్ట్ రివ్యూ

  కామెడీని మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందులో డౌటే లేదు. అదే కామెడీకి, కొంచెం క్రైమ్, కొంచెం సెంటిమెంట్ కలిపితే బండి లాగించేసినట్టే. ఇలా అన్ని కోణాలు కలుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాయే ఈ దొంగాట. ఈ దొంగాట షార్ట్ రివ్యూ చూద్దాం. కథ ఏంటంటే: శ్రుతి (మంచు ల‌క్ష్మి) ఓ స్టార్‌. ఆమె తల్లి ప‌విత్ర‌ శ్రుతికి కావ‌ల్సిన అవసరాలన్నిద‌గ్గ‌రుండి చూసుకొంటుంటుంది. అయితే  వెంక‌ట్ (అడ‌వి శేష్‌), విజ్జు (మ‌ధు) కాటం రాజు (ప్ర‌భాక‌ర్‌) శ్రుతిని కిడ్నాప్ చేయ‌డానికి ప్లాన్ చేస్తారు. పథకం ప్రకారం పుట్టిన రోజు పార్టీ నుండి  శ్రుతిని ఎత్తుకొచ్చేసి ప‌ది కోట్లు డిమాండ్ చేస్తారు. శృతి కిడ్నాప్ కేసు డీల్ చేయ‌డానికి రంగంలోకి దిగుతాడు ప్రైవేట్ డిటెక్టీవ్ బ్ర‌హ్మీ (బ్ర‌హ్మానందం). అయితే కిడ్నాప‌ర్లు శ్రుతిని బ్ర‌హ్మీ ఇంట్లోనే దాచి పెడ‌తారు. ఇదిలా ఉండగా కిడ్నాపర్లు డిమాండ్ చేసిన ప‌ది కోట్లూ వారి చేతిలో ప‌డిపోతున్నాయ్ అన‌గా.. అప్పుడు క‌థ‌లో ఓ కొత్త ట్విస్టు వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటీ? ప‌ది కోట్లు కిడ్నాప‌ర్ల‌కు అందాయా? ఎవరు ఎవరితో 'దొంగాట' ఆడారు? అనేదే ఈ సినిమా క‌థ‌. తారాగణం: మంచులక్ష్మీ, అడవి శేషు, మధు, ప్రభాకర్, బ్రహ్మానందం తదితరులు.

పోలవరం బాధ్యత నాదే.. ఉమాభారతి

  లోక్ సభలో పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత తనదేనని, ప్రాజెక్టును నిర్దిస్ట సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి ప్రత్యేకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి తానే స్వయంగా నీతిఆయాగ్ కు వెళ్లి చర్చించామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పై మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 1864 నాటి చట్టం ప్రకారం కాకుండా 2013 తరువాత వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దీనికి ఉమాభారతి సమాధానమిస్తూ నిర్వాసితులకు మేలు చేకూర్చేందుకు విధంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

దిగొచ్చిన ఆర్టీసీ

  వేతన సవరణలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు ఎంతమంది సమ్మె విరమించమని చెప్పినా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సమ్మె చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమించని ఆర్టీసీ కార్మికులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూ, టీఎన్‌యూ, ఎన్ఎంయూలకు ఉన్న సదుపాయాలను తొలగించాలని రహదారి రవాణా సంస్థ ఎండీ అన్నారు. ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కార్మికుల సంఘాలు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు ఇబ్బందుల్లో పడతామని ఆలోచించి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. సమస్యలపై మాట్లాడి పరిష్కారం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే విధుల్లోకి చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

అందుకే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము

  ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అనే మాట వినగానే ఎవరికయినా టక్కున గుర్తుకు వచ్చేది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే. ఎందుకంటే గత మూడు నాలుగు నెలల క్రితం వరకు ఈ ప్రత్యేక హోదా గురించి అందరి కంటే ఎక్కువగా మాట్లాడింది ఆయనే గాబట్టి. అందుకే ఇప్పుడు అందరూ ఆయననే నిందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం కోసం తననే టార్గెట్ చేసుకొంటున్నాయని ఆయన కూడా వాపోయారు.   ప్రత్యేక హోదా గురించి మొన్న డిల్లీలో తన ఇంటి ముందు కొందరు ఆందోళన చేసినప్పుడు ఆయన వారి ముందు ఒక బ్రహ్మ రహస్యం బయటపెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కోరుకొంటున్నప్పటికీ 14వ ఆర్ధిక సంఘం అందుకు అభ్యంతరం చెప్పిందని ఆయన తెలిపారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టం అవుతోందని ఆయన తెలిపారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని తాను కూడా కోరుకొంటున్నానని, అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం అభ్యంతరం చెప్పిందన్న విషయాన్ని ఆయనతో సహా ఇంతవరకు ఎవరూ కూడా బయటపెట్టలేదు. అందరి కంటే ముందు ఆర్ధిక సంఘమే అడ్డుపడుతున్నప్పుడు ఇంక ఇరుగు పొరుగు రాష్ట్రాలను ఆడిపోసుకోవడం అనవసరం. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయని వాదించడం కూడా అనవసరం. అయితే ఈ అంశం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంత కాలం నాన్చితే అంత వారికే నష్టం జరుగుతుందని రెండూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనుకొంటే అదే విషయం ప్రజలకు, ప్రతిపక్షాలకు నచ్చజెప్పి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, వాటి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమయిన సబ్సీడీలు, ప్రోత్సహకాలు ప్రకటిస్తే మంచిది.

నావల్లే నెలకో ప్రాజెక్టు... వెంకయ్యనాయుడు

  ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విద్యార్ధి జేఎసీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రత్యేకహోదా విషయం చాలా కీలకమైన అంశమని, కేంద్రం ప్రభుత్వం దీని గురించి చర్చలు జరుపుతుందని అన్నారు. రెండు రాష్ట్రాలకు అధిక ప్రాజెక్టులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనేక ఉన్నత సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చానని, కేంద్రంలో తాను ఉండబట్టే తెలుగు రాష్టాలకు నెలకో ప్రాజెక్టు వస్తుందన్నారు. 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన తెలిపారు.

చంద్రబాబు గురించి తెలుసుకుంటున్న.. ఒబామా

  టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్యయకర్త లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల సాకారం కోసం అమెరికాలో పర్యటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామాను కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై, అమెరికన్ కంపెనీల సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రాజెక్టుల గురించి లోకేశ్ ఒబామాకు వివరించారని తెదేపా పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు. తాను కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నానని ఒబామా తెలిపారని ప్రసాద్ చెప్పారు. అయితే లోకేశ్ ను కలవరాదని అమెరికాలోని కొన్ని తెలుగుసంఘాలు ఒబామాకు లేఖలు రాసిన ఆయన యువనేతను కలవడం విశేషం.

సోనియాకు థ్యాంక్స్ చెప్పిన మోడీ

  భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలం నుండి బంగ్లాదేశ్ సరిహద్దు వివాదం సాగుతుంది. దీనిపై లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు అమలుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ.. కాంగ్రెస్ పార్టీ అందించిన సహకారాన్ని మరిచిపోమని, బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపినందుకు సోనియాగాంధీకి ధన్యవాదాలని అన్నారు. ఈ బిల్లు అమలైతే ఏ దేశపు సరిహద్దులో ఉన్నామో కూడా తెలియకుండా ఉన్న కొన్ని వేల మందికి మేలు చేసినట్టువుతుందని మోడీ అన్నారు. ఈ బిల్లు ద్వారా మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న 51 బంగ్లాదేశీ కాలనీల్లో ఉన్న దాదాపు 15 వేల మంది ఇండియా భాగంలోకి వస్తారని, ఒకవేళ వారు రావడానికి ఇష్టం లేకపోతే అక్కడే ఉండే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

హైకోర్టుపై నమ్మకం పోయింది... ఎంపీ కె.కె

  కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో తెరాస ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎంపీలు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.కె మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై కేంద్రమంత్రితో చర్చించామని అన్నారు. 15 రోజుల్లో హైకోర్టును విభజించాలని కేంద్రమంత్రిని కోరగా ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు పై తమకు నమ్మకం పోయిందని, తెలంగాణ కేసులన్నీ వేరే ఉన్నత న్యాయస్థానానికి తరలించాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 31, 32 లో ప్రత్యేక న్యాయస్థానం అంశం ఉందని అన్నారు.

20 ఏళ్లకే ఎంపీ... చరిత్ర సృష్టించిన బ్లాక్

  బ్రిటన్ కు చెందిన 20 ఏళ్ల విద్యార్ధి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సష్టించాడు. మైరి బ్లాక్ అనే విద్యార్ధి గ్లాస్గో యూనివర్శిటీలో చదువుతున్నాడు. ఇతను స్కాటిన్ నేషనల్ పార్టీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్ధి అయిన డగ్లస్ అలెగ్జాండర్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా బ్లాక్ మాట్లాడుతూ తన సొంతవూరు పైస్లీ కొన్ని దశాబ్దాల నుండి నిరాదారణకు గురైందని, ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంతో గడుపుతున్నారని వారి కోసం ఏదో ఒకటి చేయాలి అని అన్నాడు. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో 1667 నుంచి ఎంపీగా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా బ్లాక్ గుర్తింపు పొందాడు.

సల్మాన్ ఖాన్ కి బెయిల్ దొరుకుతుందో లేదో?

  బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రెగ్యులర్ బెయిలు పిటిషనుపై ముంబై హైకోర్టు ఈరోజు తీర్పు చెప్పబోతోంది. ‘హిట్ అండ్ రన్ కేసు’లో ముంబై సెషన్స్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించి, ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. తక్షణమే అతని లాయార్ హరీష్ సాల్వే ముంబై హైకోర్టుని బెయిలు కోసం ఆశ్రయించడంతో కోర్టు అతనికి కేవలం రెండు రోజుల కోసం మధ్యంతర బెయిలు మాత్రమే మంజూరు చేసింది. ఈ రోజు అతని రెగ్యులర్ బెయిలు పిటిషనుపై విచారణ చేప్పటనున్న హైకోర్టు ఒకవేళ అతని విజ్ఞప్తిని మన్నించి బెయిలు మంజూరు చేసినట్లయితే అతను జైలుకి వెళ్ళకుండా మరికొంత కాలం తప్పించుకోగలుగుతారు. కానీ ఒకవేళ హైకోర్టు అతని రెగ్యులర్ బెయిలు పిటిషనును తిరస్కరించినట్లయితే జైలుకి వెళ్ళకతప్పదు.

ఆంద్ర ప్రదేశ్ లో యంసెట్ పరీక్షలు నేడే

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎంసెట్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అయ్యే ఈ పరీక్షలకు మొత్తం 2,55,409 మంది హాజరవబోతున్నారు. వారిలో 1,70,685 మంది ఇంజనీరింగ్, 84, 274 మంది విద్యార్ధులు వైద్య మరియు వ్యవసాయ పరీక్షకు హాజరవుతున్నారని రాష్ట్ర మానవ వనరుల అబివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 312 ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు, వైద్య మరియు వ్యవసాయ పరీక్షల వ్రాసేవారి కోసం 141 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి కొద్ది సేపటిలో మొదలవబోయే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల కోసం కోడ్ ఎన్ -1 ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జేఎన్ టీయూలో ఎంపిక చేసారు. ఉదయం 10 గంటల నుండి ఇంజనీరింగ్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి వైద్య, వ్యవసాయ పరీక్షలు నిర్వహించాబడుతాయి.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షలకు హైదరాబాద్ లో విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకొన్నందున అక్కడ కూడా 16ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు, 22 వైద్య, వ్యసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. హైదరాబాద్ లో మొత్తం 22758మంది విద్యార్ధులు ఎంసెట్ పరీక్షలు వ్రాస్తున్నారు.   నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడే ఈ పరీక్షలకు 350 మంది నిర్వహాకులుగా మరొక 150 మందిని పరిశీలకులుగా ప్రభుత్వం నియమించింది. ఎంసెట్ ప్రాధమిక ‘కీ’ ని ఈనెల 10న ప్రకటించి దానిపై అభ్యంతరాలను ఈ నెల 15వరకు స్వీకరిస్తారు. అనంతరం ఈ నెల 26న తుది ‘కీ’ ని ప్రకటిస్తారు. అదే రోజు ర్యాంకులను కూడా ప్రకటిస్తారు.   ఆర్టీసీ సమ్మె కారణంగా పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విజ్ఞప్తులను మన్నిస్తూ మానవతా దృక్పధంతో కొన్ని సంస్థలు మరియు గుంటూరులో ఆర్టీసీ ఉద్యోగులు బస్సులను నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ డ్రైవర్లను తీసుకొని వారి ద్వారా పరీక్షా కేంద్రాలకు అనేక బస్సులను నడిపిస్తోంది.   ఆర్టీసీ సమ్మె కారణంగా సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేని విద్యార్ధులకు ఎటువంటి మినహాయింపు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేసారు. అవసరమయితే విద్యార్ధులు వారి తల్లి తండ్రులతో కలిసి ముందు రోజే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆలశ్యమయిన విద్యార్ధులను పరీక్ష వ్రాసేందుకు అనుమతించబోమని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు ప్రకటించారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా పరీక్షా కేంద్రాలకు ఆలశ్యంగా చేరుకొన్న దూర ప్రాంత విద్యార్ధులను పరీక్ష వ్రాసేందుకు అనుమతించే విషయంపై రీజినల్ కొ-ఆర్డినేటర్లకు విచక్షణాధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఆలశ్యంగా వచ్చిన విద్యార్ధులు వారిని సంప్రదించినట్లయితే వారు తగిన నిర్ణయం తీసుకొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఎంసెట్ పరీక్షలకు ఆర్టీసీ సమ్మె దెబ్బ తగలడం చాలా దురదృష్టకరం.

100 ఫోన్ చేస్తే పరీక్షకు తీసుకెళ్తాం

  ఆర్టీసీ సమ్మె కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మే 8 వ తేదీన మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. సుమారు 2. 55 లక్షల మంది విద్యార్ధులు ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్నారని, పరీక్ష షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ బస్సులు 40 శాతమే తిరుగుతున్నాయని దీనికోసం  ప్రైవేట్ స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకుంటామని గంటా తెలిపారు. మరోవైపు ఎంసెట్ రాయడానికి వెళ్లే విద్యార్ధులకు రవాణా సౌకర్యం లేకపోతే డయల్ 100 కి కాల్ చేస్తే పోలీసు వాహనాల్లో తీసుకెళ్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు.