సీఎంల మధ్య సంధి కుదిరిందా?

ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి రెండు రాష్ట్రాల రాజకీయాలలో ఎప్పుడు ఏం జరగుతుందా అని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ కేసు మొదలైనప్పటినుండి ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గలేదు. ఇద్దరు సీఎంలు ఎప్పడూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నట్టే ఉండేవారు. అయితే గత రెండు మూడు రోజుల నుండి ఈ కేసులో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోకపోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీఎంల మధ్య సంధి కుదిరిందా? అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.   దీనికి నిదర్శనంగా.. ఈకేసులో చంద్రబాబు వాయిస్ టెస్ట్ లకు నోటీసులు పంపిచాలని ఆలోచనలో ఉన్న ల్యాబ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపించ వద్దని ఆదేశాలు జారీ చేయడం.. చంద్రబాబు స్థాయి మనిషికి వాయిస్ టెస్ట్ చేసినా, నోటీసులు జారీ చేసినా అది వివాదాస్పదమవుతుందని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్ కి, సాక్షి ఛానల్ కి నోటీసులు జారీ చేయగా చంద్రబాబు ఆవిషయంపై అధికారుల్ని పిలిచి మందలించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పనులు తొందరపాటుతో చేయకూడదని.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కూడా అధికారులకు సూచించారట.   అయితే పరిస్థితి కాస్త నెమ్మదించడానికి.. ఇద్దరు సీఎంలు కాస్త స్పీడ్ తగ్గించడానికి.. వారిలో ఇంత మార్పు రావడానికి వెనుక కారణం కేంద్రం జోక్యం చేసుకోవడమేనా అనే వార్తాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు వ్యవహారంపై కేంద్రం ఇరు సీఎంలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మరీ ఉద్రిక్తం కాకుండా రెండురాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ పోరును చల్లార్చేందుకు.. ఇద్దరు సీఎం మధ్య రాజీ కుదిర్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

నేతలకు ఫోన్ ఫియర్.. "పలుకే బంగారమాయెనా" అన్న పరిస్థితి

ఓటుకు నోటు కేసు పుణ్యమా అని ఇప్పుడు రాజకీయ నేతలు ఫోన్లలో మాట్లాడటానికే వణికిపోతున్నారు. అందులో టీఆర్ఎస్ నాయకులకు ఈ గుబులు మరీ పట్టుకుందట. మైకులిస్తే గంటలు గంటలు మాట్లాడే నేతలు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడటానికే భయపడుతున్నట్టు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వాళ్లు ఉపయోగించిన టెక్నాలజీకి ఇప్పుడు వాళ్లే భయపడుతున్నారట. అంటే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చిన్నగా తీసుకుంటుంది అనుకున్నారేమో.. కానీ ఏపీ సర్కార్ దానిని అంతటితో వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు తెరాస నేతలలో గుబులు పుట్టుకుందట. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఏపీ నేతలకంటే.. తెలంగాణ నేతలే ఎక్కువ భయపడటం విశేషం. ఎక్కడ ఫోన్ మాట్లాడితే ఏం సమస్య వస్తుందా అని కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితికి వచ్చారట.. ఒకవేళ ఫోన్ ఎత్తినా కానీ ఏదో పొడిగాపొడిగా మాట్లాడటం... లేకపోతే తమ పీఏలతో ఫోన్లు ఎత్తించి "సార్ బిజీ గా ఉన్నారు" అని చెప్పించడం చేస్తున్నారట.   అసలు రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఒక్క రాజకీయ నేత మాత్రమే కాదు ఓటేసే ఓటరు కూడా డబ్బు తీసుకోకుండా ఓటు వేయలేని పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. అలాంటిది రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అతిగా ప్రవర్తించి.. అసలు వారు ఎలాంటి తప్పు చేయరు అన్నట్టు దీనినో పెద్ద ఈష్యుగా చిత్రీకరించి పెద్ద రచ్చ చేశారు. చివరికి "ఎవరు తీసుకున్నగోతులో వాళ్లే పడతారు" అన్న సామెత ప్రకారం ఫోన్ ట్యాపింగ్ లు అంటూ కుట్రలు చేస్తే చివరికి ఏమయింది.. వారి ఫోన్లు వాళ్లే మాట్లాడుకోలేని పరిస్థితికి వచ్చారు.

ఆడియో టేపుల నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఏపీ పోలీసులు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు వచ్చిన టేపులు టీన్యూస్, సాక్షి ఛానల్ లో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు ఛానళ్లకు ఏపీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ టేపులకు సంబంధించి సమాధానం ఇవ్వాల్సిందిగా ఛానళ్లను కోరారు.. కానీ ఈరోజుతో గడువు ముగియడంతో వారి నుండి సమాధానం రాని నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ టేపుల నిగ్గు తేల్చేందుకు రంగలోకి దిగనున్నట్టు సమాచారం. ఆడియో టేపుల్లో ఉన్న అతుకుల గుట్టును తెలుసుకునేందుకు.. ఆడియో క్లిప్పుల్లో ఎడిటింగ్ జరిగిందన్న అనుమానంతో వాటిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) విజయవాడలోని టెలికాం ప్రొవైడర్లతో భేటీ కానున్నారు. మొత్తం 12 సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రతినిధులతో చర్చించి ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనే విషయాలు తెల్చి తరువాత ఎలాంచి చర్యలు తీసుకోవాలి అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

చంద్రబాబుకు నోటీసులివ్వద్దు.. వెనక్కి తగ్గిన టీ సర్కార్

నోటుకు ఓటు కేసులో చంద్రబాబును ఇరికించాలని, పార్టీని దెబ్బగొట్టాలని తెలంగాణ ప్రభుత్వం తెగ ఉరకలు వేసింది. ఇంకేముంది స్టీఫెన్ సన్ వాంగ్మూలం రావడమే ఆలస్యం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడమే అని తెగ హడావిడి చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఎందుకో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు వచ్చిన ఆడియో టేపులు ఇప్పటికే వాయిస్ టెస్ట్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి.. ఈ నేపథ్యంలో ల్యాబ్ అధికారులు కూడా వాయిస్ టెస్ట్ కోసం చంద్రబాబుకు నోటీసులు జారీ చేద్దామనుకున్నారు.. కానీ చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం ల్యాబ్ అధికారులకు సూచించినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   మరోవైపు ఈ కేసుకు సంబంధించి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నాంపల్లీ ఏసీబీ కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం కూడా నీరు కార్చేవిధంగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్ సన్ తనకు చంద్రబాబు డబ్బులు ఆఫర్ చేసినట్టు చెప్పగా.. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు వచ్చిన టేపుల్లో చంద్రబాబు మాత్రం ఎక్కడ డబ్బు ప్రస్తావన తీసుకురాలేదు. దీనిని బట్టే ఈ టేపులలో ఉంది నిజం కాదని తెలుస్తోంది.. దీంతో నిన్నటి మొన్నటి వరకు చంద్రబాబుకు నోటీసులు ఇద్దామనుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి నోటీసులు జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. మొత్తానికి ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో సయోధ్య కుదురుతుందోమో అనే సందేహాలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో లారీల బంద్

  ఈనెల 23 నుంచి తెలంగాణలో లారీల బంద్ చేయాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. లారీల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 23 నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నామని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింగిల్ పర్మిట్ (కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్) ఇవ్వాలని, 15 సంవత్సరాలు దాటిన వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా నిర్ణయించే విధానాన్ని కూడా విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా సమ్మె తలపెట్టింది. ఈనెల 24 నుంచి వీరు సమ్మె చేయబోతున్నారు.

టెలీకాం సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ నోటీసులు జారీ?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం (సిట్) హైదరాబాద్ లోని 12 మొబైల్ సర్వీస్‌ ప్రొవైడర్లకు శనివారం నోటీసులు జారీ చేసింది. గత నెల రోజుల కాల్ డాటా, మరికొన్ని ఇతర రికార్డ్స్ లతో ఈరోజు విజయవాడలో భవానీపురం పోలీస్ స్టేషన్ లో తమ ముందు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చేరు. రికార్డులను తారుమారు ప్రయత్నం చేసినట్లయితే కటిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఎవరెవరి ఫోన్లను ఎవరు ట్యాపింగ్ చేయించారు?ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ చేసారు?ఎందుకు చేయించారు? ఎటువంటి వివరాలను సేకరించారు?వంటి ప్రశ్నలకు వారి నుండి సమాధానం రాబట్టవచ్చును. వారిచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

విజయనగరం వైకాపాలో ముసలం?

  బొబ్బిలి ఎమల్యే సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయిన విజయనగరం జిల్లాకి చెందిన మరికొందరు సీనియర్ వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ వారి అభ్యంతరాలను త్రోసిపుచ్చి ఆయనను పార్టీలోకి తీసుకోవడంతో వారు అందరూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారందరూ త్వరలోనే పార్టీని వీడే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం అవుతుండటంతో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి, విజయనగరం ఎమల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తదితరులు వారితో సంప్రదింపులు జరిపారు. బొత్స సత్యనారాయణ వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొంటామని వారికి హామీ ఇచ్చి పార్టీని వీడవద్దని కోరినట్లు సమాచారం. కానీ బొబ్బిలి రాజులిరువురూ పార్టీలో కొనసాగేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారు ఈ విషయమై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మీడియా స్వేచ్చకు భంగం కలిగించకూడదు: కిషన్ రెడ్డి

  తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందిస్తూ “ఈ వ్యవహారంలో కేంద్రం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తున్నాను. కేంద్రం తన పరిధిలో తన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయమనం పాటించడం చాలా అవసరం. ఇరువురు కూడా తమతమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని నా అభిప్రాయం. పత్రికా స్వేచ్చకు భంగం కలిగించడం మంచి పద్ధతి కాదు. తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి ఛానల్ పై నిషేధం విదించడాన్ని ఖండిస్తున్నాను. అదే సమయంలో మీడియా కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, తమ స్వంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింపజేయాలని అప్పుడే ప్రజలకు కూడా మీడియాపై నమ్మకం కోల్పోకుండా ఉంటారని అన్నారు. రాజకీయ పార్టీలు మీడియా చానెల్స్‌ను పెట్టి నడిపించడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు.

తుస్సుమన్న స్టీఫెన్‌సన్ వాంగ్మూలం

  ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరికించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ మొన్న తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏదేదో సంచలనాలు జరుగుతాయని చాలామంది భావించారు. అయితే ఆయన ఇచ్చిన వాంగ్మూలానికి అంత సీన్ లేదని, ఇప్పటి వరకు ఉత్కంఠను తుస్సుమనిపించేలా ఆయన వాంగ్మూలం వుందని తెలుస్తోంది. చంద్రబాబు మాట్లాడినట్టుగా ప్రచారంలో వున్న టేపులకు, స్టీఫెన్‌సన్ చెప్పిన వాంగ్మూలానికి పొంతన కుదరడం లేదని సమాచారం. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ప్రకారం తనను మత్తయ్య, సెబాస్టియన్ కలిశారట. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయకుండా విదేశాలకు వెళ్ళిపోవాలని సూచించారట. తాను ఏసీబీకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేయడంతో వాళ్ళు తన ఇంట్లో వీడియో తీయడానికి ఐఫోన్ అమర్చారట. అప్పుడు రేవంత్ రెడ్డి అక్కడకి వచ్చారట. ఆ తర్వాత చంద్రబాబుతో  తనను మాట్లాడిస్తానని చెప్పిన సెబాస్టియన్ అక్కడి నుంచే ప్రయత్నిస్తే చంద్రబాబు బిజీగా వున్నారట. అదేరోజు సాయంత్రం సెబాస్టియన్ తనకు ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడించాడట. మీరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి మీకు నేను అండగా వుంటానని చంద్రబాబు అన్నారట. ఐదుకోట్లు ఇస్తానని హామీ ఇచ్చారట. అయితే ఇక్కడే అసలు తిరకాసు వుంది. చంద్రబాబు మాట్లాడినట్టు చెబుతున్న ఆడియోలో డబ్బు ప్రస్తావనే లేదు. స్టీఫెన్‌సన్ మాత్రం చంద్రబాబు ఐదుకోట్లు ఇస్తానని హామీ ఇచ్చారని  తన వాంగ్మూలంలో చెప్పారు. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం తుస్సుమనడానికి ఈ ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి అయితే స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో వి.రాఘవేంద్రరెడ్డి అని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ చేసి రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేయడమే కోర్టు ముందు నిలబడదని న్యాయ నిపుణులు భావిస్తున్న ఈ తరుణంలో స్టీఫెన్‌సన్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును మరింత నీరుగార్చేలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేశం వదిలి పోయిన సోనియాగాంధీ

  ఎక్కడకి వెళ్తున్నారో చెప్పాపెట్టకుండా మాయమైపోవడం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీకి అచ్చి వచ్చినట్టుంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు తాము ఎక్కడకి వెళ్తున్నామో చెప్పకుండా మాయమైపోతున్నారు. మొన్నామధ్య రాహుల్ గాంధీ ఏ దేశానికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి, చాలా రోజులపాటు అడ్రస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలా వెళ్ళిపోయే బాధ్యతను సోనియాగాంధీ తీసుకున్నట్టున్నారు. శనివారం నాడు ఆమె దేశాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడకి వెళ్ళిపోయారయ్యా బాబూ అని కాంగ్రెస్ నాయకులను అడిగితే, తమకు కూడా తెలియదని సెలవిచ్చారు. అదేంటని అడిగితే అదంతే అని సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల సారాంశం ప్రకారం సోనియాగాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ‘ఏదో’ దేశానికి వెళ్ళారు. వారం రోజుల తర్వాతే తిరిగి వస్తారు. ఏ దేశానికి వెళ్ళారో, దేనికోసం వెళ్ళారో తెలియదు. ఈ తీరు చూస్తుంటే బోలెడన్ని అనుమానాలు వస్తున్నాయి మరి. ఆమధ్య రాహుల్ గాంధీ ఏ సమాచారమూ ఇవ్వకుండా మాయమైపోతే ఇదెక్కడి అలవాటురా బాబూ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆయనగారి అమ్మగారు కూడా అలాగే వెళ్ళిపోయారు. దీన్నిబట్టి రాహుల్ గాంధీది తల్లిపోలిక అని అర్థమవుతోంది. సర్లే.. కొడుకు వెళ్ళొచ్చాడు కాబట్టి తల్లి కూడా వెళ్ళొ్స్తుందని సరిపెట్టుకుందాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే,  సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ కూడా దేశాన్ని విడిచిపెట్టి కొద్దిరోజులు వెళ్ళిపోతాట్ట. ఆయన ఏ దేశానికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో కూడా చెప్పరట.

చంద్రబాబు పై అందుకేనా కుట్ర పన్నింది?

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ ఏంటీ అంటే వెంటనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు గుర్తొస్తుంది. ఈ వ్యవహారం అంతలా రెండు రాష్ట్రాల రాజకీయాలలో వేడి పుట్టించింది మరి. కొంతమంది అయితే కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్త్తూ ఇంకా వివాదం చేయటానికి చూస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడానికి మాత్రం చూడట్లేదు. ఏదీ ఏమైనా ఈ కేసులో మాత్రం ఎవరికి ఎంత లాభం ఉందో తెలియదు కాని చంద్రబాబును ఇరికించడంవల్ల అటు కేసీఆర్ కు కానీ, ఇటు జగన్ కు కానీ రాజకీయపరంగా చాలా లబ్ధిచేకూరే అవకాశం ఉందనేది మాత్రం నిజమని విశ్వసనీయ వర్గాల వెల్లడి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బగొట్టడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి ప్రతిపక్షాలు.   అసలు కేసీఆర్, జగన్ కుమ్మక్కయి చంద్రబాబును కావాలనే ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని అటు తెదేపా శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందులో కూడా నిజం లేకపోలేదు అనే సందేహం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబును ఈ రొచ్చులోకి లాగటం వల్ల వారికి లాభం చేకూర్చే అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. అవేంటంటే ఏపీ రాజధాని నిర్మించాలన్నా దానిని అభివృద్ధి చేయాలన్నా తగిన పెట్టుబడి పెట్టాలి. ఇప్పటికే చంద్రబాబు సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లి వాళ్లతో చర్చించి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకొచ్చారు. వారు కూడా చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ఆయన అడ్మినిస్ట్రేషన్ పై నమ్మకం.. చంద్రబాబు అనే ఒకే ఒక్క కారణం చేత పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారు.   ఇప్పుడు ఈ కేసు ద్వారా ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బగొట్టి, మరక అంటిస్తే పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడతారని ఈ రకంగా కుట్రలు పన్నినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సీమాంధ్రాలో పెట్టుబడులు పెట్టే మేజర్ ఇన్వేస్టర్లు వెనక్కి తగ్గి హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెడితే ఆరకంగా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల అటు కేసీఆర్ కు చాలా ఉపయోగం.. మరోవైపు ఈ కేసులో చంద్రబాబును ఇరికించి అతనిపై బురదపై చల్లడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ కు రాజకీయంగా చాలా లాభం ఉంటుంది.. ఏపీలో తన ఉనికిని చాటుకోవచ్చు.. ఈ రెండు కారణాలతో కేసీఆర్ తో కుమ్మక్కయి చంద్రబాబుపై ఎదురుదాడికి దిగారని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఏపీ రాజధాని కోసం శ్రమిస్తున్నచంద్రబాబును చూసి తెలంగాణలో కూడా తెదేపా అధికారంలోకి వస్తుందనే భయంతో అటు కేసీఆర్, ఆంధ్రాలో వైకాపా పరిస్థితి ఏమవుతుందో అన్న భయంతో ఇటు జగన్ ఇద్దరు కలిసి ఇలాంటి కుట్రకు పాల్పడ్డారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

చంద్రబాబుకి, కేసీఆర్‌కి హ్యాపీ ఫాదర్స్ డే

  ఈరోజు ఫాదర్స్ డే.. ప్రపంచ వ్యాప్తంగా వున్న తండ్రులకు వారి పిల్లలు కృతజ్ఞతలు తెలిపే రోజు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న తమ పిల్లలను చూసి తండ్రులు సంతోషించే రోజు. తమ చిటికెన వేలు పట్టుకుని నడిచిన పిల్లలు తమ అంత ఎదిగి, తమ ప్రతిరూపాలుగా పెరుగుతూ, తాము నడుస్తున్న బాటలోనే విజయవంతంగా పయనిస్తుంటే ఏ తండ్రి అయినా ఎంతో సంతోషిస్తాడు.  పుత్రోత్సాహం కానివ్వడి, పుత్రికోత్సాహం కానివ్వండి.. ఆ ఉత్సాహం వారిని జనులు కొనుగొని పొగిడినప్పుడే ఆ తండ్రికి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు  ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ తండ్రి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుని, తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. రాజకీయ వారసత్వం వుంది కదా అని తాను శ్రమించకుండా ఆయన వుండరు. తన తండ్రి ఎలా కార్యకర్తల్లో ప్రజల్లో కలసిపోతారో ఈయన కూడా అచ్చం అదే శైలితో ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ కార్యకర్తలను ఆదుకోవడంలో, అక్కున చేర్చుకోవడంలో ముందుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడం, రాజనీతిజ్ఞతను ప్రదర్శించడంలో నారా లోకేష్‌ది కూడా చంద్రబాబు శైలే. మరి ఇలాంటి సమర్థుడైన పుత్రుడు వున్న చంద్రబాబు నాయుడికి హ్యాపీ ఫాదర్స్ డే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు తారక రామారావు, కుమార్తె కవిత అయితే ముమ్మూర్తులా తండ్రిలాంటివారే. ముఖ కవళికల్లో మాత్రమే కాదు.. రాజకీయ వ్యూహాలు వేయడంలో కూడా వీరిద్దరు తండ్రికి తగ్గవారే. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా సమర్థంగా పనిచేస్తోంటే, కవిత నిజామాబాద్ ఎంపీగా తనదైన శైలితో ముందుకు దూసుకువెళ్తున్నారు. రాజకీయ వారసత్వం అనేది  తండ్రి ఇస్తే వచ్చేది కాదు.. శ్రమించి సాధించుకోవలసింది. అలా శ్రమించి తన రాజకీయ వారసత్వాన్ని పొందిన కేటీఆర్, కవిత ఇద్దరూ తమ తండ్రికి ఉత్సాహాన్ని ఇస్తున్న పిల్లలే కదా. ప్రతిభావంతులైన ఇద్దరు పిల్లలు తోడుగా రాజకీయ ప్రస్థానం చేస్తున్న కేసీఆర్‌కి కూడా ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు.

ప్రశ్నించే వాడిని ప్రశ్నిస్తే ఎలా?

  “ఇంతకన్నా రాజకీయాలకు ఓ నమస్కారం పెట్టేసి తప్పుకొంటే మంచిదేమో!” అని పవన్ కళ్యాణే కాదు ప్రజలు కూడా అనుకొనే విధంగా ఆయనపై విమర్శలు కురుస్తున్నాయి. అసలు అది “మేకప్ అండ్ ప్యాకప్ పార్టీ” అని కవితమ్మ జనసేన పార్టీ పెట్టగానే జోస్యం చెప్పారు. ఆ టైములో పైన తదాస్తు దేవతలున్నట్లున్నారు. ఆమె మాటలను నిజం చేస్తూ మొదటి సమావేశంలో పార్టీ ఆవిర్భావం రెండవ సమావేశంలో దాని ముగింపు వేడుకా రెండూ చకచకా జరిపించేసి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డు స్వంతం చేసుకొన్నారు.   రెండు మీటింగులతో పార్టీని అటకెక్కించేసినప్పటికీ ఎన్నికలలో మోడీ-చంద్రబాబులకి మద్దతు ఈయడంతో పార్టీ మూసేసిన ఎఫెక్ట్ పెద్దగా కనబడలేదు, పైగా పాపులారిటీ కూడా బాగా పెరిగింది. పార్టీని మూసేసినా పాపులారిటీ ఇంకా పెరగడం రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డే. అది పవన్ కళ్యాణ్ కే చెల్లు. ఇక అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పడంతో జనాలు ఫ్లాటయిపోయారు. అన్నయ్య చిరంజీవి కేవలం ముఖ్యమంత్రి అవుదామనే ఏకైక లక్ష్యంతో ‘ఏదో రాజ్యం’ స్థాపిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ తన వెనక ఒక్క సైనికుడు లేకపోయినా ప్రశ్నించడం కోసం ఒన్-మ్యాన్-ఆర్మీ వంటి జనసేనతో ప్రజల ముందుకు రావడం, ఆ తరువాత మళ్ళీ పత్తా లేకుండా పోవడం చూసి ఔరా! అని జనాలు ముక్కున వేలేసుకొన్నారు.   మళ్ళీ వారు ముక్కు మీద నుండి ఆ వేలు తీయక మునుపే తుళ్ళూరుకి దారేది అనుకొంటూ జనాల మధ్య ప్రత్యక్షమయిన గోపాలుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడో అలాగే మాయమయిపోవడంతో అప్పటి నుండి జనాలు ఆయన కోసం వెదుకుతూనే ఉన్నారు. చివరికి ట్వీటర్ లో వేడికి పట్టుకొందామని ప్రయత్నించినా అక్కడా ఆయన దొరకడం లేదని అభిమానులు కంప్లైంట్ చేస్తున్నారు.   రామ్ గోపాలవర్మ అంతటివాడు కూడా “ఓ గోపాలా...ఇంకా లోక కల్యాణం ఎప్పుడు చేస్తావు? లేకపోతే ఇది కళ్యాణ ద్రోహం అనేసుకొమ్మంటావా?” అని ట్వీటేసారు. అదేదో పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు చేతిలో కర్రని మరొకరికి అందించి పరుగుని కొనసాగించినట్లుగా పవన్ కళ్యాణ్ న్ని విమర్శించేవారు కూడా ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొని మరీ విమర్శిస్తున్నారు ఏమిటో...పాపం!   తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు “అవినీతిని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు? ఓటుకు నోటు కేసుపై మీ అమూల్యమయిన అభిప్రాయం ఏమిటి?అని సింపుల్ గా రెండే రెండు ప్రశ్నలు వేశారు. కానీ ప్రశ్నించడానికి వచ్చిన వాడిని పట్టుకొని ఇలా అందరూ ప్రశ్నించడం ఏమి భావ్యం?అలా అందరి ప్రశ్నలకి ఆయన జవాబులు చెప్పుకొంటూ పోతే ఇక ప్రశ్నించడానికి ఆయనకి టైమెక్కడ మిగులుతుంది అనే ఆలోచన లేకపోవడం వలననే జనాలు ఎవరికి తోచినట్లు చిలక జోస్యుడిని ప్రశ్నించినట్లు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ఇప్పటికిప్పుడు అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పకపోయినా మళ్ళీ ఏదో ఒకనాడు ఆవేశంగా జనాల ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకూ ఒకేసారి హోల్ సేల్ గా జవాబు చెప్పకపోతారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.

దమ్ముంటే చంద్రబాబుకు నోటీసులు ఇవ్వండి... పల్లె

ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్ తో పాటు సాక్షి ఛానల్ కు కూడా నోటీసులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో టీ న్యూస్ ఛానల్ తో పాటు సాక్షి ఛానల్ కూడా చాలా అతిగా ప్రవర్తించిందని.. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేశామని విశాఖపట్నం డీజీపీ త్రివ్రిక్రమ్ వర్మ చెప్పారు. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నోటీసులు ఇచ్చాం.. దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వండని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కేసీఆర్ కు బహిరంగంగా సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడ్డామనే వార్తలు వస్తున్నాయి.. అలాంటి అవసరం లేదని.. తాము తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఉన్నామని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఎన్నికల కమిషన్ ఈ కేసును పర్యవేక్షించాలి కానీ ఏసీబీ ఎలా ఈ కేసు నమోదుచేస్తుందని ప్రశ్నించారు. అందుకే ఈ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు రాసి పేట్రేగి పోయిన న్యూస్ ఛాళ్లపైనే నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు.   ఒకవైపు ఇప్పటికే టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు ఇచ్చినందుకు తెలంగాణ జర్నలిస్టులు నిరసనలు చేపడుతున్నారు. ఇప్పుడు సాక్షి ఛానల్ కు కూడా నోటీసులు ఇవ్వడంవల్ల ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం వల్ల తెలంగాణ ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచుతారేమో అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఈ నోటీసుల వల్ల కేసు మరో కీలక మలుపు తిరుగుతుందేమో అనిపిస్తోంది.

నోటీసులు ఉపసంహరించుకోండి..

ఏపీ పోలీసు అధికారులు నిన్న రాత్రి టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో ఆడియో టేపులను టీ న్యూస్ ఛానల్ లో ప్రసారం చేసినందుకు గాను నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ తెదేపా పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించినట్టు తెలుస్తోంది. ఈరోజు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ తెదేపా నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, వేం నరేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకా కొంత మంది నేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారు టీ న్యూస్ ఛానల్ కు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని, లేకపోతే తెలంగాణ జర్నలిస్టులతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏపీ పోలీసులు టీ న్యూస్ కు నోటీసులు ఇవ్వడంవల్ల ఇప్పటికే తెలంగాణ జర్నలిస్టులు నిరసనలు మొదలుపెట్టారు.