కేసీఆర్ ను ఏడిపించిందెవరు?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏడుపు తన్నుకుంటూ వచ్చిందట.. కానీ ఏవరైనా చూస్తారేమో అని ఆపుకున్నారట.. ఈ విషయం ఎవరో కాదు కేసీఆరే స్వయంగా చెప్పారు. అంతలా కేసీఆర్ ని ఏడిపించిందెవరు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం... కేసీఆర్ గజ్వేల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారట. అయితే అక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు కేసీఆర్ దగ్గరకొచ్చి ‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాథలం. మాకు ఎవరూ లేరు సార్..’ అన్నారట.. అంతే ఆ మాటలకి కేసీఆర్ కు ఏడుపొచ్చిందంట కానీ కంట్రోల్ చేసుకున్నారట. దీంతో కేసీఆర్ పదో తరగతి తర్వాత అనాథ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సూచించారు. దీనిలో భాగంగానే మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

రేవంత్ బెయిల్ విచారణ వాయిదా..

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై వాదనలు వినిపించడానికి ఇంకా కొంత సమయం కావాలని.. మావద్ద కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయని దీనిపై అదనపు కౌంటర్ దాఖలు చేయాలని.. దానికి కొంత గడువుకావాలని ఏసీబీ కోరింది. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో వీడియో టేపులు ఇప్పటికే టెస్టు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వాటికి సంబంధించిన నివేదిక కూడా ఈ రోజే రానుంది. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య అరెస్ట్ పై స్టే కూడా ఈ రోజే ముగియనుంది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా బెయిల్ కోసం హోకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

రాజీనామా చేయలేదింకా: నల్లపురెడ్డి

  నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్గానికి పార్టీలో మేకపాటి వర్గానికి మధ్య జరుగుతున్న అంతర్యుద్దం ప్రసన్న కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పరాకాష్టకు చేరినట్లు స్పష్టమవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా మసులుతున్నారు. ఆ కారణంగా ఆయన ప్రమేయం లేకుండానే జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో మేకపాటి వర్గం ఆద్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు మరింత ఆగ్రహించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు తన అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.   కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలను ఖండించారు. జిల్లా నేతలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, కేవలం తన నియోజక వర్గంపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అధ్యక్ష బాధ్యతల నుండి తప్పు కోవాలనుకొంటున్నానని, కానీ ఇంతవరకు తను రాజీనామా చేయలేదని తెలిపారు. పార్టీని వీడుతానని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తను వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని ఎన్నడూ విడిచిపెట్టనని రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతానని చెప్పారు. నిజానికి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రతీ పార్టీలో చాలా మంది పోటీ పడుతుంటారు. జిల్లా రాజకీయాలను శాశించగల అటువంటి కీలకపదవిని ఏదో బలమయిన కారణం ఉంటే తప్ప ఎవరూ వదులుకోరు. కనుక జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవడానికి ఆయన చెపుతున్న కారణాలు సహేతుకంగా లేవని స్పష్టం అవుతోంది.

కేసీఆర్ అల్లిన కథనే స్టీఫెన్ సన్ చెప్పాడు.. మత్తయ్య

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరసలేం మత్తయ్య కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఓ అందమైన పిట్టకథ అల్లారని.. అదే పిట్టకథను తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో కోర్టులో చెప్పించారని ఎద్దేవ చేశారు. స్టీఫెన్ సన్ ఎమ్మెల్యేగా నామినేటెడ్ అవ్వడానికి రూ కోటి రూపాయలు కేసీఆర్ కు అందించారని.. ఈ విషయాన్ని స్టీఫెన్ సన్ స్వయంగా చెప్పారని తెలిపారు. కానీ తనకు టీఆర్ఎస్ నేతల నుండి ఎదురైన అవమానాల కారణంగా ఆ పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న స్టీఫెన్ సన్ ను కేసీఆర్ చంపేస్తానని... పదవి రద్దు చేస్తానని బెదిరించారని.. అందుకే స్టీఫెన్ సన్ కేసీఆర్ అల్లిన కథను కోర్టులో చెప్పారని వెల్లడించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాం... సర్వీస్ ప్రొవైడర్లు

నోటుకు ఓటు కేసులో మరో కీలకమైన అంశం బయటపడింది. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడినప్పటినుండి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. ఫోన్ ట్యాపింగ్ జరపలేదు అని తెలంగాణ అధికార నేతలు వాదిస్తునే ఉన్నారు. అయితే ఈ విషయంలో వెనుకకు తగ్గని ఏపీ ప్రభుత్వం మాత్రం దాని నిగ్గు తేల్చేందుకు రంగలోకి దిగి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారలు విజయవాడలో సర్వీస్ ప్రొవైడర్లను ప్రశ్నించగా.. వారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని.. పక్కా ప్లానింగ్ తో రెండు నెలలుగా ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. రెండు నెలలుగా ఏపీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని.. అది కూడా కంపెనీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల వెల్లడి.   మరోవైపు సిట్ అధికారులు ఎవరి ఫోన్లు ఎప్పటి నుండి ట్యాపింగ్ చేశారు.. ఎంతకాలం ట్యాపింగ్ చేశారు అని సర్వీస్ ప్రొవైడర్లను అడుగగా.. దాని గురించి స్పష్టంగా తెలియాలంటే ఇంకా సమయం పడుతుందని.. ఆ సమాచారం తెలిపేందుకు కొంత గడువు కావాలని కోరారట. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని సర్వీస్ ప్రొవైడర్లు చెప్పగా సిట్ అధికారులు ఇప్పుడు ఆకోణంలో దర్యాప్తుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ బెయిల్ పిటిషన్ నేడే హైకోర్టులో విచారణ

  ఓటుకునోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన తెదేపా ఎమల్యే రేవంత్ రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారణకు చేపట్టనుంది. వారితో బాటు ఈ కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు విచారణకు చేపడుతుంది. ఎసిబి అధికారులు వారికి బెయిలు మంజూరు చేయవద్దని కోరుతూ ఒక కౌంటర్ దాఖలు చేసారు. ఈ కేసులో తనను ప్రశ్నించడం పూర్తయింది కనుక తనను ఇంకా జైల్లో ఉంచడానికి తగిన బలమయిన కారణాలేవీ లేవని కనుక తనకు బెయిలు మంజూరు చేయవలసిందిగా రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు బెయిల్ మంజూరు చేసినట్లయితే కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని హామీ ఇచ్చారు. కనుక ఈరోజు హైకోర్టు రేవంత్ రెడ్డితో సహా మిగిలిన ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తుందా లేదా? అనే విషయం తేలిపోవచ్చును.

దానిపై కేంద్రం నిర్ణయమే తీసుకోలేదుట!

  నిన్న మొన్నటి వరకు ఓటుకి నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజకీయపార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకొన్నారు. ఇప్పుడు తాజాగా విభజన చట్టంలో సెక్షన్: 8 అమలుపై వాదోపవాదాలు మొదలుపెట్టారు. తెలంగాణాకు చెందిన కొందరు దానికి వ్యతిరేకంగా, ఆంధ్రాకి చెందిన నేతలు దానికి మద్దతుగా వాదోపవాదాలు చేసుకొంటూ మీడియాకు మంచి పని కల్పిస్తున్నారు. సెక్షన్: 8 అమలుచేస్తే మళ్ళీ మరో ఉద్యమం తప్పదని తెలంగాణా నేతలు హెచ్చరిస్తుంటే, చట్టంలో ఉన్న మిగిలిన అన్ని సెక్షన్లను అంగీకరించినవారు సెక్షన్: 8ని మాత్రం ఎందుకు అంగీకరించరు? తప్పనిసరిగా దానిని అమలుచేయవలసిందే అని ఆంధ్రా నేతలు వాదిస్తున్నారు. కొందరు తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలు రేపటి నుండి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వగైరాలకు సిద్దమయిపోతున్నారు.   కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే సెక్షన్: 8 అమలు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీజేపీని అప్రదిష్ట పాలుజేసేందుకే కొందరు రాజకీయనాయకులు పనిగట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ఈ వ్యవహారమంతా డిల్లీలో ఆడిటర్ జనరల్ ముకుల్ రోహాత్గీ కేంద్ర హోం శాఖకు చెప్పిన తరువాతనే రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై చర్చ మొదలయింది తప్ప రాష్ట్రంలో ఎవరో సృష్టించడం వలన కాదని కిషన్ రెడ్డి మరిచిపోయినట్లున్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగింది... సర్వీస్ ప్రొవైడర్లు

  ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ప్రభుత్వాధికారులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ సిట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. తాము ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు సర్వీస్‌ ప్రొవైడర్లు అంగీకరించారు. అయితే సాంకేతికపరమైన అంశాలు చెప్పడానికి, కాల్‌డేటా ఇవ్వడానికి కొంత సమయం కావాలని వారు సిట్‌ని కోరారు. తాము మళ్లీ విచారణకు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని ప్రొవైడర్లను ఈ సందర్భంగా సిట్‌ అధికారులు ఆదేశించారు. యునినార్‌, ఎయిటెల్‌, ఐడియా, డొకోమో, వోడా, రిలయన్స్‌ కంపెనీల ప్రతినిధులను ఏపీ సిట్‌ అధికారులు విచారించారు.

కల్తీసారా మృతులు 102 మంది

  ముంబైలోని మలద్‌లో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 102కి చేరింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి ఏకనాథ్ ఖడ్సే విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శి మూడు నెలలో ఈ ఘటనపై తన నివేదికను ఇస్తారు. కల్తీ సారా కారణంగా ముంబై మహానగరంలో ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడంతో ముంబైలో సారా అమ్మకాల మీద ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. ఇకపై ముంబైలోని మురికివాడల్లో కల్తీసారా అమ్మకుండా తగిన చర్యలు చేపట్టనున్నామని ఖడ్సే తెలిపారు. ఈ ఘటనతో సంబంధం వున్న ఏడుగురు వ్యక్తులను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది పోలీసులు, నలుగురు ఎక్సైజ్ అధికారులను సస్సెండ్ చేశారు.

ఢిల్లీలో కేసీఆర్ దీక్ష?

  ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం, హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ చేతికి అప్పగించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. గంటకు పైగా ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సెక్షన్ - 8ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కేసీఆర్‌ గవర్నర్‌కు తేల్చి చెప్పారని సమాచారం. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా సెక్షన్‌-8 మీద కేంద్రం ముందుకెళ్తే, దానికి తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు అవసరమైతే ఢిల్లీలో దీక్షకు దిగాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ తో కేసీఆర్, చంద్రబాబు కీలక సమావేశం?

  పునర్విభజన చట్టంలో సెక్షన్: 8 క్రింద ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్ తదితర వ్యవస్థల మీద గవర్నర్ నరసింహన్ కి గల విశేషాధికారాలు వినియోగించుకొనేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించినట్లు మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితం గవర్నర్ తో సమావేశమయ్యారు. తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున, బహుశః ఆయన అదే విషయం గవర్నర్ కి మరో మారు స్పష్టం చేయవచ్చును. కానీ అసలు కేంద్ర హోంశాఖ నిజంగానే గవర్నర్ కి అటువంటి ఆదేశాలు జారీ చేసిందా లేదా అనే విషయంపై ఇంతవరకు సంబంధిత అధికారులు ఎవరూ స్పష్టత ఇవ్వనందున, కేసీఆర్ సమావేశంతో ఆ వార్తలు నిజామా..కాదా అనే విషయంపై స్పష్టత ఏర్పడవచ్చును.   కేసీఆర్ తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజే గవర్నర్ ని కలుసుకొబోతున్నట్లు తెలుస్తోంది. గవర్నరే స్వయంగా వారిరువురిని ఆహ్వానించి ఉన్నట్లయితే బహుశః వారిరువురి మధ్య రాజీ కుదిర్చేందుకే అయ్యి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ తో సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడినట్లయితే ఈ విషయంపై పూర్తి స్పష్టత రావచ్చును.

ఈనెల 29నుండి రంగారెడ్డిలో షర్మిల పరామర్శ యాత్ర

  ఈనెల 29నుండి వై.యస్. షర్మిల రంగారెడ్డి జిల్లాలో కర్మన్ ఘాట్ వద్ద హనుమాన్ టెంపుల్ చౌరస్తా నుండి మళ్ళీ తన పరామర్శ యాత్రలు మొదలుపెడతారని రంగారెడ్డి జిల్లా వైకాపా అధ్యక్షుడు సురేష్ రెడ్డి తెలిపారు. ఈసారి యాత్రలో ఆమె ఏడు నియోజక వర్గాలలో పర్యటించి, వైయస్ మరణవార్తను తట్టుకోలేక చనిపోయిన 15 మంది వ్యక్తుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఆమె చేపట్టబోయే పరామర్శ యాత్ర గురించి జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి దిగ్విజయం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఆమె రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజక వర్గాలలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.

భగ్గుమన్న కంటైనర్ లారీ

  విద్యుత్ తీగలు తగిలి కంటైనర్ లారీ భగ్గుమని కాలిపోయిన ఘటన గుంటూరు జల్లా పిడుగురాళ్ళ సమీపంలోని కొండమూరు కూడలిలో మంగళవారం ఉదయం జరిగింది. బెంగళూరు నుంచి ద్విచక్రవాహనాల లోడుతో వున్న కంటైనర్ లారీ రాజమండ్రికి వెళ్ళింది. అక్కడ వాహనాలను దిగమతి చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో వుంది. ఈ లారీ కొండుమూరు కూడలి వద్దకు రాగానే డ్రైవర్, క్లీనర్ టీ తాగటానికి లారీని పక్కకు ఆపే క్రమంలో లారీ విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక యంత్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ లారీ డ్రైవర్, క్లీనర్‌ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ముందడుగు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తామేమీ ఆషామాషీగా ఆరోపణలు చేయలేదని నిరూపించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలో సేవలందిస్తున్న 9 టెలిఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు సిట్‌ నోటీసులు జారీ చేయడంతో వాటిలో యూనినార్‌, వొడాఫోన్‌, డొకొమో, రిలయన్స్‌, ఐడియా కంపెనీల ప్రతినిధులు విచారణ నిమిత్తం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు.   సుమారు 11గంటల పాటు ఏకధాటిగా సాగిన నిన్నటి విచారణలో సిట్ అధికారులు “వారు ఎవరి ఆదేశాల మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఫోన్లను ట్యాపింగ్ చేసారు? ఎందుకు చేసారు? ఎవరెవరి ఫోన్లను ఏఏ సమయాలలో ట్యాపింగ్ చేసారు? ట్యాప్ చేసిన ఫోన్ల డాటాను ఎవరికి అందించేరు?”వంటి వంద ప్రశ్నలను సందించి వారి నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ల ట్యాపింగ్ కి సంబంధించిన దేనినీ కూడా డిలీట్ చేయడం లేదా సాక్ష్యాలను నాశనం చేయడం వంటి పనులు చేయరాదని సిట్ అధికారులు వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.   సిట్‌ అధికారులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌, కాకినాడ ఏఎస్పీ దామోదర్‌, ఏఎస్పీ నరసింహారావు మరియు విజయవాడ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ కాశీ విశ్వనాథ్‌ లు ఈ విచారణ చేసారు. ఈరోజు మిగిలిన సర్వీస్‌ ప్రొవైడర్లను కూడా విచారించిన తరువాత వారు అందజేసిన సమాచారాన్ని అంతా క్రోడీకరించి డిజిపి రాముడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు.

ఇద్దరు సీఎంలతో గవర్నర్ భేటీ?

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం నాడు భేటీ అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో గవర్నర్‌కి శాంతిభధ్రతల అంశాన్ని అప్పగించే అవకాశం వుందన్న వార్తలు వస్తూ వుండటం, ఈ విషయంలో అటార్నీ జనరల్ నరసింహన్‌కి కీలక సూచనలు చేశారన్న వార్తలు కూడా వినిపిస్తు్న్న నేపథ్యంలో గవర్నర్ ఈ భేటీని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రెండు రాష్ట్రాల రాజకీయాలలో మార్పులు వచ్చే అవకాశాలు వున్నాయని పరిశీలకులకు భావిస్తున్నారు.

గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మృతి

  సముద్రంలో చేపల వేటకు వెళ్ళి గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మరణించినట్టు తెలుస్తోంది. మరణించిన మత్స్యకారులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పగడాల పేటకు చెందినవారిగా గుర్తించారు. పగడాలపేటకు చెందిన ఒక మత్స్యకారుడు మంగళవారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడుగురి మృతితో గల్లంతైన వారిలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈనెల 16వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన వాటిలో 20 పడవలు కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాలకు చేరుకున్నాయి. 20 పడవల్లోని దాదాపు 100 మంది మత్స్యకారులు క్షేమంగా తీరానికి చేరుకున్నారు. ఇంకా 23 పడవల్లోని వందమందికి పైగా మత్స్యకారులు ఇంకా సముద్రంలోనే చిక్కుకుని వున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం 3 హెలికాప్టర్లతో గాలింపు జరుగుతోంది.

ఫోన్లో మాట్లాడం బాబోయ్...

ఇప్పుడు రాజకీయ నేతలలో పట్టుకున్న భయం ఏంటంటే ఫోన్ లో మాట్లాడటం. ఓటుకు నోటు కేసు వల్ల ప్రతి ఒక్కరికి ఎవరితో ఫోన్లో మాట్లాడదామన్నా భయపట్టకుంది. ఎవరితో మాట్లాడితే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారో అని.. ఎవరు సీక్రెట్ గా రికార్డ్ చేస్తారో అని వణికిపోతున్నారంట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా తెరాస నేతలకు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చారంట. ఎక్కడ తెదేపా వాళ్లు తమపై "spy camera" లు పెట్టి నిఘా విదించారో అని.. ఎవరు నమ్మకమైన వాళ్లో తెలియదు.. ఎవరిని నమ్మాలో తెలియదు.. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారంట నేతలు. ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించిన తెరాస ఇప్పుడు వాళ్లను ఎవరైనా ట్రాప్ చేస్తారేమో అని భయపడుతున్నారట. ఎందుకంటే ఒకప్పుడు తెరాసలో దళారీలు ఉండేవారు. వారి ద్వారా ఏ డీలింగ్స్ అయినా జరిగేవి. ఇప్పుడు జర్నలిస్టుల దగ్గరనుంజి ప్రతి ఒక్కరూ "deal makers" గ మారిపోవడంతో ఎవరిని దగ్గరకు రానివ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంట.   అసలు రాజకీయాలలో డబ్బులు ఖర్చుపెట్టనిదే పదవులు రావనేది జగమెరిగిన సత్యం. అంతెందుకు ఒక ఓటు వేసే ఓటరే డబ్బులు ముట్టజెప్పనిదే ఓటేసే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలప్పుడు ఓటుకు డబ్బులు ఇవ్వలేదని గొడవలు చేసిన ఉందంతాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పదవులు కొనుక్కుంటున్నాం.. ఒక ఎమ్మెల్యేగా, మంత్రి గా ఉన్నప్పుడు మాకొచ్చే వేతనాలు డీజిల్ ఖర్చులకు కూడా చాలవని.. ఇంకా రెండేళ్లు ఇలానే ఉంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని రాజకీయ నేతలు మొత్తుకుంటున్నారు. ఏదీ ఏమైనా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వల్ల రాజకీయ నేతలకు చాలా నష్టమనేది మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది.

ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి.. బాలకృష్ణ

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన దగ్గర నుండి ఎన్నో రకాల వదంతులు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాజీనామా చేస్తారని వారి స్థానంలో అశోకగజపతిరాజు కానీ, బాలకృష్ణ కానీ సీఎంగా నిలబడతారని చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ తాను ముఖ్యమంత్రి అవుతానని వచ్చిన వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటారని సృష్టం చేశారు. రాష్ట్రాన్ని, పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగే సామర్ధ్యం చంద్రబాబు ఒక్కడికే ఉందని.. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని అన్నారు.