రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజుకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుంచో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా?అనే అనుమానాలకు ఈ రోజు తెరపడింది. నేడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. దీంతో తెదేపా నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా తెలంగాణ ఏసీబీ అధికారులు చాలా గట్టి ప్రయత్నమే చేశారు. కేసు కీలక దశలో ఉందని.. సాక్ష్యాలు తారు మారు చేస్తారని పలు కుంటి సాకులు చెప్పింది. కానీ కోర్టు మాత్రం వాటిని ఖండించి రేవంత్ రెడ్డికి రేవంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

చంద్రబాబు వెళ్లనిది అందుకేనా?

రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత ఉమ్మడి రాజధాని గా ఉన్న హైదరాబాద్ లో ఉండే సీఎం చంద్రబాబు పరిపాలనా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీ లో సీఎం క్యాంపు కార్యలయానికి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.. అవి పూర్తవడానికి ఇంకా సమయం పడుతుంది. అప్పటి వరకూ ఇక్కడ కొన్ని రోజులు.. అక్కడ కొన్ని రోజులు ఉండి పరిపాలన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ భారత విడిది సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తనకు అతి దగ్గరగా ఉన్నా కూడా రాష్ట్రపతికి స్వాగతం పలకలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది చంద్రబాబు.   భారతదేశ ప్రధమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయనకు సైనిక స్వాగతం ఉంటుంది. అలాగే ఈసారి కూడా హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగగానే సైనికాధికారి సెల్యూట్‌ చేసి స్వాగతం పలికారు. అయితే ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా తదితరులు పాల్గొంటారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వెళ్లవచ్చు కానీ ఇప్పుడు వెళ్లలేని పరిస్థితి వచ్చింది చంద్రబాబుకి. గతంలో ఒకసారి రాష్ట్రపతి ఇక్కడికి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయంలో ఆయన దిగారు. అప్పుడు సైనికాధికారి.. గవర్నర్‌.. తెలంగాణ సీఎం.. ఆ తర్వాత చంద్రబాబు స్వాగతం పలికారు. ఎందుకంటే బేగంపేట విమానాశ్రయం రాజధాని ప్రాంతమైన జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. దాంతో తెలంగాణ సీఎంకు తొలి ప్రాధాన్యం ఇస్తే ఏపీ సీఎంకి తదుపరి ప్రాధాన్యం కల్పించారు. కానీ ఈసారి సీన్‌ మారిపోయింది. రాష్ట్రపతి ల్యాండింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని హకీంపేటలో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకవేళ ఆయన అక్కడికి వెళ్లినా పొరుగు రాష్ట్రం హోదా కింద వస్తుందని.. తెలంగాణ సీఎంతో సమానంగా అధికార మర్యాదలు ఉండవని ఆలోచించి స్వాగత కార్యక్రమానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా తానే స్వయంగా బొల్లారంలోని రాష్ట్రపతి విడిదికి వెళ్లి ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది.

జగన్ కేసుల పురోగతిపై నివేదిక కోరిన హైకోర్టు

  అక్రమాస్తుల కేసులో ఏకంగా 11 చార్జ్ షీట్లలో ఎ-1నిందితుడిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 16నెలలు జైల్లో గడిపిన తరువాత బెయిలుపై విడుధాలి బయటకు వచ్చారు. ఆ తరువాత మరి ఆయన అప్పుడప్పుడు విచారణ కోసం కోర్టుకి వెళ్లి వస్తున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ గతేడాది సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం ఆయన శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం వంటివన్నీ జరిగాయి. కానీ ఆయనపై మోపబడిన కేసుల విచారణ ఎంతవరకు వచ్చిందనే సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. కనుక విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే ఒక న్యాయవాది జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఒకవేళ హైకోర్టు స్వయంగా ఈకేసుల పురోగతిని పర్యవేక్షించడం మొదలుపెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి తదితరులకు ఊహించని కష్టాలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గవర్నర్ విందులో ఇద్దరు చంద్రులు

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో విడిది చేసిన సందర్భంగా ఆయన గౌరవార్ధం మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేసారు. దానికి ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులిరువురినీ సతీ సమేతంగా రావలసిందిగా ఆహ్వానించారు. వారితో బాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులను కూడా ఈ విందుకు ఆహ్వానించారు. మామూలు పరిస్థితుల్లో అయితే అందరూ ఈ విందులో హాజరయ్యేందుకు చాలా ఉత్సాహం చూపేవారు. కానీ ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8 వగైరాల కారణంగా ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో అందరూ ఒకరికొకరు ఎదురుపడటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఈ విందుకు ఎవరెవరు హాజరవుతారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. కానీ ముఖ్యమంత్రులిరువురూ తప్పకుండా హాజరు కావచ్చును. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గవర్నర్ వారిరువురి మధ్య రాజీ ప్రయత్నమేమయినా చేస్తారేమో కూడా?

హాల్ టికెట్ పై కుక్క ఫోటో

పరీక్ష రాయడానికి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్న విద్యార్ధి హాల్ టికెట్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అంతలా ఆ హాల్ టికెట్ లో ఏముందనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్ హాల్ టికెట్ లో సదరు విద్యార్ధి ఫోటో బదులు కుక్క ఫోటో ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ విచిత్రమైన ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో మిడ్నాపూర్‌కు చెందిన సౌమ్యదీప్ మహాతో (18) అనే విద్యార్ధి ఇంటర్ పాస్ అయ్యాడు ఉన్నత విద్య కోసం ఐటీఐ ప్రవేశపరీక్ష కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్ష నిమిత్తం హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోగా కుక్క ఫోటో రావడంతో ఖంగుతిన్న విద్యార్థి నోడల్ అధికారిని కలిశాడు. సాంకేతిక లోపం వల్ల జరిగిన తప్పిదం అని సర్ధిచెప్పి మహతో ఫోటో ఉన్న కొత్త అడ్మిట్ కార్డును జారీ చేశారు.

అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాం.. వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరణ

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఅర్ విగ్రహాన్ని జులై 5 వ తేదీన ఆవిష్కరించనున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమెరికా వెళ్లనున్నారు. వారం రోజుల పాటు వెంకయ్యనాయుడు బిజీ షెడ్యూల్ తో గడపనున్నారు. జులై 1న అమెరికా, భారత్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని.. తరువాత బీజేపీ మద్దతుదారుల సమావేశానికి హాజరవుతారు. జులై 3న డెట్రాయిట్ లో తానా వార్షికోత్సవాన్ని ప్రారంభించి అనంతరం మిచిగాన్ గవర్నర్ స్నియడర్‌తో కలిసి వ్యాపార సదస్సు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన డెట్రాయిట్‌లో తానా అందిస్తోన్న జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆ తర్వాత జులై 4న లాస్ ఏంజిల్స్‌లో తెలుగు సంఘం నాట్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. తరువాత జులై 5 న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  కృష్ణావతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పశాలలో, 80 కిలోల పంచలోహాలతో రూపొందించారు.

నిన్న గవర్నర్.. ఈ రోజు రాష్ట్రపతి

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ కు పాదాభివందనం చేసినందుకే చాలా మంది ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. ఇంత వరకూ ఎవరికి పాదాభివందనం చేయని కేసీఆర్ గవర్నర్ కు పాదాభివందనం చేసే సరికి అందరూ ఆశ్చర్యపోయారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రపతికి పాదాభివందనం చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ భారత విడిది కోసం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ప్రణబ్ ముఖర్జీ కి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. కాగా యాదగిరి గుట్టలో జులై 3న నిర్వహించనున్న హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. పదిరోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఉంటారు.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం వారికి అలవాటే.. పల్లె

ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత కేసీఆర్ కే లేదు.. అలాంటిది రాజకీయాల్లో ఓనమాలు కూడా సరిగా రాని కేటీఆర్ విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందని.. కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని ఏపీ మంత్రి పల్లె రాఘునాథరెడ్డి మండిపడ్డారు. అలాగే తెలంగాణ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెడ్డడం తెలంగాణ మంత్రులకు అలవాటే అని, టీడీపీ భిక్షతో మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అలాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై కూడా విమర్శల వర్షం కురిపించారు. చట్టం గురించి శ్రీహరికి తెలియక పోయినా ఏపీ మంత్రులకు చట్టం గురించిన అవగాహన లేదని అనడం శ్రీహరి అహంకారానికి నిదర్శమని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఎన్ని సెక్షన్లు, షెడ్యూళ్లు, పేజీలు ఉన్నాయో శ్రీహరికి తెలుసా? అలాంటిది సెక్షన్‌-8 చట్టబద్ధం కాదని అని అంటున్నారని విమర్శించారు.

త్వరలో పవన్ కళ్యాణ్ అమూల్యాభిప్రాయాలు విడుదల

  కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన సందేశంపై మీడియాలో వచ్చిన విమర్శలను చూసినందునో మరేమో తెలియదు కానీ త్వరలోనే తను ఓటుకి నోటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8లపై తన అమూల్యమయిన అభిప్రాయాలు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ అకౌంటులో ఓ సందేశం పెట్టారీ రోజు. దానితోబాటు ఆయన మరో గొప్ప సందేశం కూడా పెట్టారు. “తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు. అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలుతో ప్రభుత్వాలని నడిపితే 'భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి.” ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒకరకమయిన ఘర్షణ వాతవరణం నెలకొని ఉండగా ఆ సంగతి వదిలిపెట్టి ఎప్పుడో భావితరాలవారి మధ్య యుద్దాలు జరుగుతాయని ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

స్టీఫెన్ సన్ కు కోర్టు ఝలక్...కోర్టు ధిక్కారణ చర్యలు

తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు కోర్టు ఝలక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య తనకు ఈ కేసుతో సంబంధం లేదని.. తన అరెస్ట్ పైన స్టే విధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో సవాల్ చేస్తూ న్యాయమూర్తిని మార్చాలన్న స్టీఫెన్ సన్ పిటిషన్ ను కోర్టు కొట్టి పారేసింది. ఈ సందర్భంగా స్టీఫెన్ సన్ వైఖరిపై కోర్టు మండిపడింది. స్టీఫెన్సన్ కోర్టును తప్పుదోవ పట్టించారని.. కేసు విచారణ అదే బెంచ్‌లో కొనసాగుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కారు చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

కేసుకు కీలకమైన వారం.. సద్దుమణుగుతుందా? సంచలనాలా?

ఓటుకు నోటు కేసు... తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి ఎప్పడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుండి రాజకీయ వర్గాల్లో వేడి వాతావరణం నెలకొంది. అయితే ఈ కేసు విషయంలో ముందున్న జోరు ఇప్పుడు లేదని మాత్రం తెలుస్తోంది. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ.. ఇటు ఆంధ్రా ప్రభుత్వం కాని ఈ కేసు విషయంలో కొంచెం వెనక్కి తగ్గాయా అని అనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు ఒకరినొకరు తిట్టుకున్న సీఎంలు, మంత్రులు ఇప్పుడు పెద్దగా ఎక్కడ ఆ ఊసే ఎత్తడంలేదు.. అదీకాక స్టీఫెన్ సన్ వాంగ్మూలం తరువాత ఈ కేసు ఎలాంటి కీలకమైన మలుపు తిరుగుతుందో అని చూశారు కానీ స్టీఫెన్ సన్ వాంగ్మూలం చెప్పినా కూడా అలాంటి పరిణామాలేమి జరగలేదు. ఈ విషయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు కూడా తమ దూకుడికి కొంచెం బ్రేక్ వేసినట్టే తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రా ప్రభుత్వం టీ న్యూస్ ఛానల్ కి, సాక్షి ఛానల్ కి నోటీసులు జారీ చేసి దానిని సమాధానం చెప్పాలని గడువు ఇచ్చింది.. కానీ ఆ గడువు ముగిసినా కానీ ఏపీ పోలీసు అధికారులు కూడా ఆ ఊసేత్తడం లేదు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కొంచెం నెమ్మదించినట్టుగానే కనిపిస్తోంది.   అయితే ఈ కేసు ఇప్పుడు కొంచెం సద్దుమణగడానికి కేంద్ర ప్రభుత్వం చొరవేనా అని అంటే నిజమనే అంటున్నాయి రాజకీయవర్గాలు. అయితే గంతంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కేంద్రంతో భేటీ అయిన తరువాతే ఏసీబీ తమ దూకుడిని తగ్గించినట్టు అర్ధమవుతోంది. ఆ తరువాతే ఏపీ ప్రభుత్వం కూడా ముందు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించిన ఇప్పుడు కొంత వరకూ తగ్గాయనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కేంద్ర హోంశాఖ అధికారులతో భేటీ అయిన తరువాత రోజే ఢిల్లీ వెళ్లారు. దీంతో ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.   ఇదిలా ఉండగా ఈకేసులో ఈ వారం చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ల కస్డడీ ఈ రోజుతో ముగిసింది. వీరిని ఏసీబీ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా?రాదా?అని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే వ్యవహారంలో సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ) ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాల్సిన గడువు సోమవారంతో ముగుస్తున్నది. ఈ విషయంలో ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా ఉంది. ఇంకోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసిన పిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజే విచారణ జరపనుంది. మొత్తానికి ఈ వారం ఈ కేసుకు చాలా కీలకమైందిగా కనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.. లేక నెమ్మదిగా సద్దుమణిగిపోతుందా మొదలైన విషయాలు ఈ వారంలో తెలుస్తాయి. లేకపోతే రెండు ప్రభుత్వాలు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టే అని అర్ధంచేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

నేటితో ముగిసిన రేవంత్ కస్టడీ...

నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీ ఈ రోజుతో ముగిసింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా లకు కూడా ఈ రోజుతో కస్టడీ ముగియడంతో ఏసీబీ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసిన పిల్ పై తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి బెయిల్ విచారణ మంగళవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా?రాదా?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్ లో రాష్ట్రపతి 10 రోజుల విడిది

  ప్రతీ ఏటా రాష్ట్రపతి వర్షాకాలం సమయంలో 10 రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల విడిదిగా ఉన్న హైదరాబాద్ లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పాటిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 10 రోజుల విశ్రాంతి నిమిత్తం ఈరోజు మద్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. ఆయనకి ఆంద్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు, గవర్నర్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. ఆయన జూలై 1వ తేదీన తిరుపతి వెళ్తారు. జూలై 3వ తేదీన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. క్రిందటిసారి ఆయన హైదరాబాద్ లో విడిది చేసినప్పుడు ఆంధ్రా, తెలంగాణా నేతలు రాష్ట్రవిభజన వ్యహరాలపై పిర్యాదులు చేసారు. ఈసారి కూడా అటువంటి పరిస్థితే నెలకొని ఉంది. ఆంద్రా, తెలంగాణా ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధం, సెక్షన్: 8 అమలు వంటి అనేక అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకి పిర్యాదులు చేసేందుకు బారులు తీరవచ్చును.

పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీటేసాడోచ్...

  అప్పుడెప్పుడో తుళ్ళూరు వచ్చి చాలా హడావుడి చేసిన వెళ్ళిపోయిన జనసేన అధ్యక్షుడు మళ్ళీ ఇప్పటివరకు జనాలకు మొహం చూపించనేలేదు. పోనీ అప్పుడప్పుడు రెండు ట్వీట్ ముక్కలు పెట్టిన జనాలు సర్దుకుపోయేవారు. కానీ ఆయనకి ఆ మాత్రం ఓపిక, సమయం కూడా లేకపోవడంతో సినిమాల్లో హీరోగా చేసే పెద్దమనిషి రాజకీయాలలో గెస్ట్ ఆర్టిస్ట్ లాగ వచ్చిపోతున్నాడని జనాలు ప్రేమగా తిట్టుకొంటున్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన జనాలకి ఓ మూడు ట్వీట్ ముక్కలు పంచిపెట్టి సర్దుకుపొమ్మన్నారు.   ఈసారి ఆయన ఏమన్నారంటే “ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రాజకీయాలని భావించే మన నాయకులాగే ఆనాడు నెల్సన్ మండేలా ఆలోచించి ఉండి ఉంటే, దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల పట్ల తీవ్ర వివక్షత చూపిన తెల్లజాతీయులతో ఆయన ఏవిధంగా వ్యవహరించి ఉండాలి? కానీ ఆయన చాలా సంయమనం పాటిస్తూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాల ప్రజల మధ్య యుద్ధాలు జరుగకుండా నివారించగలిగారు. అటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఆ మహనీయుని మార్గంలో మన నేతలు కూడా పయనించాలి. తెగే దాక ఏదీ లాగొద్దు అంటారు. అయినా పట్టించుకోకుండా ముందుకు సాగితే వారికి అధికారం కట్టబెట్టిన ప్రజలే ముందుగా నష్టపోతారని గ్రహించాలి.”   ఎన్నికల ప్రచార సమయంలో చాలా నిర్భయంగా సినిమాలలో లాగే మంచి పదునయిన పంచ్ డైలాగులు పలికి ‘మనోడికి బొత్తిగా భయమన్నదే లేదు...సోనియా, రాహుల్, కేసీఆర్, కవిత, జగన్ అంతటి వాళ్ళని పట్టుకొని కడిగిపారేశాడు మనోడు...మనోడు ఎవరికీ భయపడేటోడు కాడ్రోరే...” అని అభిమాన జనాలు తెగ ముచ్చటపడిపోయారు. అసలు సినిమాలలో కంటే రాజకీయాలలో ఆయనేసిన పంచ్ డైలాగులే భలే పేలాయి..జనాలకి కూడా యమాగా నచ్చేసాయి.   కానీ ఏడాది తిరిగేసరికి కర్ర విరగకుండా పాము చావకుండా ఆయన చెపుతున్న ఈ డైలాగులను చూసి అవురా...ఇంతలోనే ఎంత మార్పు? అని ముక్కున వేలేసుకొంటున్నారు. ‘తెగే దాక తాడు లాగొద్దు’ అన్నాడే గానీ లాగొద్దని ఎవరికి చెపుతున్నాడో కూడా చెప్పలేదు. కనుక ఆ ఆప్షన్ అభిమానులకే వదిలి పెట్టేసాడు. ఆంధ్రాలో అభిమానులు కేసీఆర్ కి చెపుతున్నాడని సరిపెట్టుకోవచ్చును...అలాగే తెలంగాణాలో అభిమానులు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నాడని సరిపెట్టుకోవచ్చును. కాకపోతే ఇద్దరినీ అన్నాడని చెప్పుకొనే ఆప్షన్ కూడా ఇచ్చేడు. మళ్ళీ ఎప్పుడు ట్వీట్స్ పంచిపెడతాడో ఏమో...

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది టీఆర్ఎస్ కాదా.. ఎర్రబెల్లి

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే విచారణ అనంతరం తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇంకో పది మంది ఎమ్మెల్యేలను కొంటే తెలంగాణ ప్రభుత్వమే కూలిపోతుందని ఏజి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శాసనసభ్యులను కొనుగోలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. ఎవరు ఎవరి ఎమ్మెల్యేలను కొన్నారో ప్రజలకు తెలియదా అని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీని దెబ్బగొట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుట్రలు చేస్తుందని విమర్శించారు.