​ గ్రీట్ వే అమెరికా​ ​ప్రచార కర్తగా డా॥గజల్ శ్రీనివాస్ నియామకం

ప్రఖ్యాత గజల్ గాయకుడు, ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ప్రపంచ శాంతి ప్రచారకుడు అయిన డా॥ గజల్ శ్రీనివాస్ ను అమెరికా లోని ప్రముఖ గ్రీటింగ్ కార్డు తయారీ సంస్థ గ్రీట్ వే (Greetway Inc) తమ సంస్థ ప్రచార కర్తగా నియమించారు. గజల్ శ్రీనివాస్ గ్రీటవే ప్రచార కర్తగా 2015 నుండి 2018 వరకు, మూడు సంవత్సరములు కొనసాగుతారని గ్రీట్ వే మార్కెటింగ్ అధినేత జేర్మి డాసన్ తెలిపారు.   డా॥ గజల్ శ్రీనివాస్ ప్రచార కార్య కర్తగా వుంటూ, వివిధ దేశాలు పర్యటించి 18 సంవతరములలోపు బాలబాలికలు , యువతీ యువకులకు చిత్ర లేఖన పోటీలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించి వారిలోని ప్రతిభా కౌశలాన్ని పైకి తీసుకు వస్తూ, వివిధ దేశాల మధ్య శాంతి సుహృద్భావ స్నేహ బంధాలను పెంపొందిచే లాగా కృషిచేస్తారు.   గ్రీట్ వే (Greetway Inc) సంస్థ ఫౌండేషన్ ద్వారా భారత దేశం లో మారు మూల ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం డా॥ గజల్ శ్రీనివాస్ కృషి చేస్తారని సంస్థ అధినేత వడలి రమేష్ తెలిపారు.   ఇందులో భాగంగా పోటీలను నిర్వహించి బాల బాలికలు, యువతీ యువకులకు ప్రోత్సాహకరమైన నగదు బహుమతులు, వివిధ దేశాలలో శిక్షణా కార్యక్రమాలు అందచేస్తారని తెలిపారు. త్వరలో భారత దేశములో ఢిల్లీ , హైదరబాద్ నగరాలలో కార్యాలయాల ప్రారంభానికి కృషి చేస్తున్నామని జేర్మి డాసన్ తెలిపారు.

సెక్షన్ 8 అమలు చేయండి.. లేకపోతే యూటీ చేయండి.. గంటా

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఎంత తొందరగా సెక్షన్ 8 అమలు చేస్తే అంత మంచిదని.. లేకపోతే హైదరాబాద్ ను యూటీ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు పై ఇప్పటికే గవర్నర్ కు చెప్పామని.. ఇప్పటికి 23 సార్లు గవర్నర్ ని కలిశామని.. అయినా గవర్నర్ మాత్రం ఈ విషయంపై ఇంకా నాన్చుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి వితండవాదం చేస్తుందని.. తమ వైఖరిని ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదని అన్నారు. ఎన్ని చేసినా ఇప్పటి వరకు సహించామని.. ఇక నుండి సహించేది లేదని మేము కూడా తిరిగి పోరాడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మధ్యలో కేసీఆర్ పెత్తనమేంటి... చంద్రబాబు

తెలంగాణ సీఎం పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా చేసిందని.. రోజు రోజుకి వారి ఆగడాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రతి చిన్న విషయానికి ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం వాదోపవాదలకు దిగుతుందని.. ఏదో ఒక విషయంలో గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందని మండిపడ్డారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు దాని బాధ్యతలన్నీ గవర్నర్ వి మధ్యలో కేసీఆర్ పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. ఆవిషయం కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు.. కాస్త గుర్తుంచుకుంటే మంచిదని ఎద్దేవ చేశారు. ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాం మా ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.

కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. చంద్రబాబు

పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉన్న సమన్వయం ఇంకా పెరగాలని.. కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పైవిధంగా తెలిపారు. ఎన్ని సమస్యలొచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహానాడులో ఇచ్చిన హామీలను.. తీసుకున్న నిర్ణయాలకు కార్యచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోకగజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారా లోకేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదు... కేటీఆర్

ఇప్పటి వరకూ ఓటుకు నోటు కేసులో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు వల్ల రెండు రాష్ట్రాల రాజకీయాలలో రోజురోజుకి వాతావరణం వేడెక్కుతోంది. ఈ వ్యవహారంపై ఎంతో మంది ఎన్నో స్టేట్ మెంట్ లు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఇప్పుడు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ రోజు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ని కలిసిన ఆయన అనేక విషయాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం బావుందని అరుణ్ జైట్లీ అన్నారని తెలిపారు. అంతేకాక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈయన సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదు అని అన్నారు. అంటే కేటీఆర్ తన మాటగా అన్నారా లేక కేంద్రం మాటగా అన్నారా అని అందరూ అనుకుంటున్నారు.   తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చించిన తరువాత ఈరోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్లడంపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదు అని చెప్పడం వల్ల అందరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాతే తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు తగ్గించారని తెలుస్తోంది. ఇప్పుడు కూడా కేటీఆర్ ఎవరిని కలిసినా ఇలా చెప్పడంపై ఇందులో కూడా నిజం లేకపోలేదనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించడానికి బాగానే ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ.. ఆంధ్రా రాష్ట్రాలు సెక్షన్ 8 అమలుపై వాదనలు చేసుకుంటున్నాయి. ఇంకో రెండు రోజులు ఆగితే కాని అసలు ఢిల్లీలో ఏం జరిగిందో అనేదానిపై ఓ స్పష్టత వస్తుంది.

రాజీవ్ శర్మ వక్రీకరించి మాట్లాడుతున్నారు.. అచ్చెన్నాయుడు

ఇప్పటికే ఓటు నోటు కేసు వ్యవహారంపై రెండు రాష్ట్రాలు కొట్టుకుచస్తుంటే మళ్లీ ఇప్పుడు షెడ్యూల్ 10 తెరపైకి వచ్చింది. ఈ కేసు ఓ కొలిక్కి రాకముందే రోజుకో వివాదంపై రెండు రాష్ట్రాలు తిట్టిపోసుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ 10 గురించి వాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ షెడ్యూల్ 10 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు తమ రాష్ట్రానికే చెందుతాయని అన్నారు. ఇప్పుడు రాజీవ్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. షెడ్యూల్ 10 గురించి తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ లో 103 ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేసుకున్నామని.. ఏపీకి వీటిలో వాటా ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్ 10 ప్రకారం హైదరాబాద్ పై తెలంగాణతో పాటు ఆంధ్రాకి కూడా సమానంగా హక్కు ఉందని.. పదేళ్ల రాజధాని గా ఉన్న హైదరాబాద్ పై పదినిమిషాలు కూడా హక్కు వదులుకోమని తేల్చిచెప్పారు. ఏపీ ఉద్యోగులను వెళ్లిపోమని చెప్పడానికి వారేవరని.. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ ను విడిచి వెళ్లరని అక్కడే పని చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని.. గవర్నర్ సెక్షన్ 8 పై నాన్చకుండా వెంటనే అమలు చేస్తే మంచిదని సూచించారు.

గవర్నర్ పై కేంద్రం అసంతృప్తి... ఇప్పటి వరకూ ఆగడమే సరైంది కాదు

ఓటుకు నోటు వ్యవహారంలో సెక్షన్ 8 పై పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ అధికారులతో విస్తృత చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదల మధ్య గవర్నర్ నరసింహన్ మాత్రం నగిలిపోతున్నారన్నది మాత్రం వాస్తవం.. ఇప్పటికే అటు తెలంగాణ ప్రభుత్వం.. ఇటు ఆంధ్రా ప్రభుత్వం.. ఈ రెండు ప్రభుత్వాల మధ్య నరసింహన్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగా మరో వైపు కేంద్రం కూడా గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించి.. పరిస్థితులు చక్కదిద్ది ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధికి పాటుపడేలా చేయమని.. సమస్యను మాదాకా తీసుకురావద్దు మీరే సర్దుబాటు చేయండి అని గవర్నర్ కు ముందే సూచించినా ఇంతవరకూ నాన్చడంవల్లే కొత్త సమస్యలు వస్తున్నాయని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. కేసు మొదలైనప్పుడు వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని కేంద్రం పెదవి విరిచినట్లు సమాచారం.   అయితే మరోవైపు గవర్నర్ కూడా సెక్షన్ 8 అమలుపై వస్తున్న హెచ్చరికలు కేంద్రానికి వివరించినట్టు తెలుస్తోంది. సెక్షన్ 8 ఎప్పటినుండో అమలులోనే ఉన్నా దానికి సంబంధించిన విశేషాధికారాలు ఉన్న నేపథ్యంలో అటార్నీ జనరల్ చెప్పేంత వరకూ ఆగానని కేంద్రానికి తెలిపారు. మరోవైపు సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తానని హెచ్చరిస్తున్నారని అందుకే హోంశాఖ మార్గదర్శకాలకోసం వచ్చానని చెప్పడంతో.. రాజకీయ నేతల హెచ్చరికలకు అనుగుణంగా వ్యవహరించరాదని కేంద్రం అభిప్రాయపడినట్టు విశ్వసనీయవర్గాల వెల్లడి. కాగా ఆంధ్రా నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ప్రస్తావిస్తుండగా అవన్నీ మాకు తెలుసు.. మీరు ఇప్పటి వరకూ ఆగడమే సరైంది కాదని హోంశాఖ గవర్నర్ ను సూచించింది.   మొత్తానికి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మాత్రం గవర్నర్ పరిస్థితే అయోమయ స్థితిలో ఉంది. ఏ చర్య తీసుకుంటే ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో అటు కేంద్రం సలహా తీసుకుందామనుకున్న కేంద్రం కూడా గవర్నర్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఇంకో రెండు మూడు రోజులైతే కానీ ఏం చర్యలు తీసుకుంటారో తెలుస్తుంది.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై అంత కక్ష ఎందుకో?

  ఓటుకి నోటు వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజాప్రతినిధులను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వార్త చూస్తే అర్ధమవుతుంది.   ఓటుకి నోటు కేసులో దొరికిన రూ.50 లక్షలు నగదు తెదేపా ప్రధాన కార్యాలయమయిన యన్టీఆర్ ట్రస్ట్ కి సమీపంలో ఉన్న ఒక బ్యాంక్ నుండి తెదేపా యంపీ సీయం రమేష్ కి చెందిన ఖాతా నుండి తీసినట్లు ఇంతకు ముందు వైకాపాకు చెందిన మీడియాలో ప్రచారం జరిగింది. దానిని రమేష్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఆ డబ్బు తన ఖాతాలో నుండి తీసినట్లు నిరూపించినట్లయితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని సవాలు చేసారు. అంతేకాదు తన గౌరవానికి భంగం కలిగించినందుకు ఆ మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు కూడా ఆయన సిద్దపడ్డారు. దానితో ఆయనకి వ్యతిరేకంగా పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారందరూ వెనక్కి తగ్గవలసి వచ్చింది.   నిన్న హైకోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారిస్తున్నప్పుడు ఎసిబి తరపున వాదించిన తెలంగాణా అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయం ఇంకా రాబట్టవలసి ఉంది కనుక రేవంత్ రెడ్డిని బెయిల్ పై విడుదల చేయవద్దని వాదించారు. అంటే ఎసిబి అధికారులకి కూడా ఆ డబ్బు ఎక్కడి నుండి తీసుకువచ్చేరు? ఎవరు ఇచ్చేరు? అనే విషయం తెలియదని స్పష్టం అవుతోంది. కానీ ఆ డబ్బు గురించి ఎసిబి అధికారులకి తెలియకపోయినా మీడియాలో ఒక వర్గం ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలిసిందని పనిగట్టుకొని ప్రచారం మొదలుపెట్టడం గమనిస్తే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా కొన్ని బలమయిన శక్తులు పనిచేస్తున్నాయని స్పష్టం అవుతోంది.   హైదరాబాద్ లో అమీర్ పేట కు చెందిన ఒక చిట్ ఫండ్ సంస్థ నుంచి ఆ డబ్బు తీసినట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారని మీడియాలో ప్రచారం మొదలయింది. ఆ సంస్థ యజమాని కృష్ణాజిల్లాకి చెందినవాడని ఆయనకి ఫైనాన్స్ బిజినస్ కూడా ఉందని పేర్కొనడం చూస్తే వారి తరువాత లక్ష్యం ఎవరో చూచాయగా అర్ధమవుతోంది. ‘ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు...భావిస్తున్నారు...’ అంటూ ఊహాజనితమయిన వార్తలు ప్రచురించడం చూస్తుంటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయో అర్ధమవుతోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండటం, అటువంటివారిని అంతే ధీటుగా ఎదుర్కోవడం చాలా అవసరం.

ఏపీలో నీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యం.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో నీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఎన్-1 కన్వెన్షన్ హాల్ లో ఆయన మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ద్వారా వృధాగా పోయే నీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలని అధికారులను సూచించారు. అంతేకాక 22.5 మిలియన్ యూనిట్ విద్యుత్ కొరతను 5 నెలల్లో అధిగమించామని తెలిపారు. పట్టిసీమ ప్రొజెక్టు ద్వారా నీటి కొరత తగ్గుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీరు తీసుకురాగలమని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ. వై.ఆర్ కృష్ణారావు, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పరకాల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

కూకట్ పల్లి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయండి.. టీ టీడీపీ

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈ నెల 30 లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ని కలిసి సమావేశామయ్యారు. పార్టీ ఫిరాయించిన వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరామని తెదేపా నేతలు తెలిపారు. అలాగే ఇటీవలే టీడీపీ నుండి తెరాస లోకి చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

కేసీఆర్ కు పదవీగండమే.. ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి పై మండిపడ్డారు. కేసీఆర్ కు ఎప్పుడూ ఆంధ్రా వాళ్లను తిట్టడం తప్ప ఇంకేం పని లేదని విమర్శించారు. ఓటు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమని రుజువైతే కేసీఆర్ కు పదవీగండం తప్పదని, రేవంత్ రెడ్డి కేసుకు ఏపీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. అలా చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని.. శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్ర విభజన న్యాయబద్దంగా జరగలేదని.. పార్లమెంట్ లో బిల్లు చట్ట ప్రకారం పాస్ కాలేదని.. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని అన్నారు.

రేవంత్ కు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి.. సిద్దార్ధ లూధ్రా

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి బెయిల్ గురించి ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చల్లో మొదలయ్యాయి. సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. సాక్ష్యులను బెదిరిస్తారని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో తాను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ పిటిషన్ పై వాదనలు జరిపిన హైకోర్టును విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారని.. వాంగ్మూలాన్ని తీసుకున్న తరువాత జైలులో ఉంచాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు స్టీఫెన్ సన్ కు ఇచ్చిన.. ఇంకా ఇవ్వాలనుకున్న డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందని ఏసీబీ తరపు న్యాయవాది ఏజీ రామకృష్ణారెడ్డి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా?లేదా ? అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూధ్రా ఆశాభావం వ్యక్తం చేశారు.   మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కస్టడీలో నాలుగు రోజుల విచారణలో అంతా చెప్పేశానని.. చెప్పడానికి ఇంకా నా దగ్గర ఏం లేదని ఆరోపిస్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం కలిసి రేవంత్ రెడ్డికి కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని రాజకీయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎందుకంటే నిందితుడిని కస్టడీలో విచారించిన తరువాత అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చు కానీ ఏసీబీ అధికారులు మాత్రం రేవంత్ కు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించింది. రేవంత్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహా, సెబాస్టియన్ లు కూడా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఒరిజినల్ నివేదిక ఇచ్చేది లేదు... ఏసీబీ కోర్టు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన నివేదికను కూడా ఏసీబీ కోర్టుకు అందజేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు అందజేసిన నాలుగు నివేదికలను ఏసీబీ కోర్టు శుక్రవారం పరిశీలించింది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అదికారులు ఇచ్చిన నివేదికలను ఏసీబీ అధికారులు తమకు కావాలని కోర్టును కోరగా కోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించింది. ఒరిజినల్ నివేదిక ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. నివేదికకు సంబంధించిన కాపీలు కావాలంటే కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని ఏసీబీ అధికారులకు సూచించింది. దీంతో ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

రాజ్‌నాథ్‌ సింగ్ తో ముగిసిన భేటీ..

రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సెక్షన్ 8 అమలు విషయంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు వీరిద్దరి సమావేశం జరిగింది. అయితే మొదట హోంశాఖ కార్యదర్శి గోయల్ తో భేటీ అయి.. తర్వాత జాయింట్ సెక్రటరీ అలోక్ కుమారు తో భేటీ అయ్యారు. అనంతరం ముగ్గుర కలిసి రాజ్‌నాథ్‌ సింగ్ తో సమావేశమయ్యారు. తరువాత మళ్లీ గవర్నర్ ఒక్కరే రాజ్‌నాథ్‌ సింగ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో నోటుకు ఓటు కేసు గురించి, సెక్షన్ 8 అమలు గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై కేంద్రం ఖచ్చితంగా ఉన్నట్టు.. గతంలో కేంద్రం పంపిన గైడ్ లైన్స్ ను యధాతథంగా జరిగించాల్సిందేనని గవర్నర్ కు స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సెక్షన్ 8 అమలుకు ఆదేశాలివ్వండి

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో సెక్షన్ 8 అమలుపై పలు రకాల వివాదాలు జరుగుతున్నాయి. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలును వ్యతిరేకిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. అయితే సెక్షన్ 8 అమలు చేయాలా? వద్దా అనే విషయం పై ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రవిభజన చేసేపుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని.. తీసుకోకుండానే ఒత్తిళ్ల కారణంగా అన్యాయంగా రాష్ట్రాన్ని విడదీశారని పేర్కొన్నారు. అంతేకాక ఆయన దాఖలు చేసిన పిల్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెండు రాష్ట్రాల హోంశాక ముఖ్య కార్యదర్శకులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు

ఓటుకు నోటు కేసులో అత్యంత కీలక సాక్షి అయిన స్టీఫెన్ సన్ సీఎం కేసీఆర్ ను ఫాంహౌస్ లో కలవడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై తెదేపా నేతలు స్టీపెన్ సన్ పై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ ముందు కూడా ఇలాగే రహస్యంగా మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఇరికించారని.. ఇప్పుడు కేసు కీలకదశలో ఉన్నప్పుడు కేసీఆర్ ను కలవాల్సిన అవసరం ఏముందని.. అసలు అలా ఎలా కలుస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ ఎలా చెబితే స్టీఫెన్ సన్ అలా నడుచుకుంటున్నాడని.. ఎలా తప్పుడు వాంగ్మూలం చెప్పాలో కేసీఆర్ పాఠాలు చెప్పుతున్నాడని మండిపడుతున్నారు. స్టీఫెన్ సన్ కేసీఆర్ ను కలవడానికి వెళ్లొచ్చు కానీ మత్తయ్య అత్తగారింటికి వెళ్తే తప్పా అని ప్రశ్నిస్తున్నారు.   అయితే రేవంత్ రెడ్డి కేసులో తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా పెద్ద తప్పు చేసిందని.. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా మావద్ద ఆధారాలున్నాయని.. ఈ విషయంలో కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెదేపా నేతలు అంటున్నారు. జగన్ తో కలిసి కుట్రలు పన్ని తెదేపాను దెబ్బతీయాలని చూశారు కానీ దీనివల్ల కేసీఆరే ఇరుక్కుపోయాడని విమర్శించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని.. కానీ నగరంలో సెక్షన్ 8 అమలు తప్పకుండా జరగాలని.. అలా అయితేనే హైదరాబద్ లో ఉంటున్న సీమాంధ్రులకు న్యాయం జరుగుతుందని అన్నారు.