ప్రత్యేక రాయలసీమపై మైసురా హడావుడి అందుకే తగ్గిందా?

  నిన్న మొన్నటి దాకా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అంటూ తెగ హడావుడి చేసిన మైసురారెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రాయలసీమ రాష్ట్రం సాధన కోసం సొంతంగా పార్టీ పెట్టాలని చూసిన ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసలు జగన్ చేసే పోరాటాలనే ఎవరూ పట్టించుకునేవారు లేరు.. ఇంక మైసురా ను ఎవరూ పట్టించుకుంటారు. కనీసం ప్రజలు కాదు కదా.. మైసురా చేసిన ఆలోచనలకు తమ పార్టీ మిగతా నాయకులనుండే సరైన స్పందన రాలేదు. దీంతో ఆయన కూడ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించడమే తన లక్ష్యం అంటూ మైసురా చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను మాత్రం ఓ ఇంగ్లీష్ దినపత్రిక మాత్రం సీరియస్ గా తీసుకొని మైసురా ఇంటర్య్వూని ప్రచురించింది. దీంతో మైసురా రాయలసీమ సాధన కోసం నాయకత్వం వహించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే విచిత్రమేంటంటే.. తాను ఎలాంటి పత్రికకు ఇంటర్య్వూ ఇవ్వలేదని.. దాని గురించే వివరణ కోరేందుకు ప్రయత్నిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రాయలసీమ సాధన కోసం పోరాడతానన్న మైసురా ఇలా ఎందుకు మాట్లాడారా అని ఆశ్చర్యపోయారు. అయితే ఇంత సడెన్ గా మైసూరా యూటర్న్ తీసుకోవడానికి కారణం తన ఉద్యమానికి సరైన రెస్పాన్స్ రాకపోవడమే అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఏదో హడావుడి చేసిన మైసురాకి ఇప్పుడు అవన్నీ వర్కవుట్ కావని బాగా అర్ధమయినట్టుంది.

వరంగల్ ఉపఎన్నిక.. రోజా ప్రచారం.. కొత్త రికార్డ్

  వైకాపా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఓ సరికొత్త రికార్డును కొల్లగొట్టింది. అదేంటనుకుంటున్నారా.. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో రోజా వరంగల్ ప్రచారంలో పాల్గొంది. అయితే రోజా మాట వైఖరి గురించి మనకు తెలిసిందే.. అయితే తను ఎవరిని విమర్శిస్తుంది.. ఎలా మాట్లాడుతుంది అనే విషయం పక్కన పెడితే.. రోజా వరంగల్ లో చేసిన ప్రచారానికి మాత్రం మంచి స్పందనే వచ్చిందని వైకాపా నేతలు ఆనందపడిపోతున్నారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తొలి ఆంధ్రప్రదేశ్ నాయకురాలు కూడా కావడం విశేషం. కాగా.. వైకాపా ఎమ్మెల్యే అయిన రోజా ప్రచారం చేస్తేనే ఇంత మంచి స్పందన వచ్చిందంటే.. ఇంక పార్టీ అధినేత జగన్ ప్రచారం చేస్తే ఎలాంటి స్పందన వస్తుందో అని పార్టీ నేతలు అనుకుంటున్నారట. మరి రోజాకి వచ్చిన స్పందన జగన్ కి వస్తుందో రాదో చూడాలి.

మరి కొద్దిసేపటిలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఇవ్వాళ ఉదయం 11 గంటలకు భేటీ కాబోతున్నారు. కోద్దె సేపటి క్రితమే పవన్ కళ్యాణ్, మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. రాజధాని భూసేకరణ, అమరావతి నిర్మాణం, ప్రత్యేకహోదా, ప్యాకేజీ తదితర  విషయాల గురించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.   పవన్ కళ్యాణ్ కి ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి గన్నవరం విమానాశ్రయంలో ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. గన్నవరం నుండి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం చేరుకొంటారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న కొందరు రైతులు కూడా విమానశ్రయం వద్ద పవన్ కళ్యాణ్ న్ని కలుసుకొనేందుకు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కలుసుకొనే ముందే ఆయనతో తామెదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి, ముఖ్యమంత్రితో సమావేశమయినప్పుడు వాటి గురించి చర్చించి పరిష్కరించాలని వారు కోరుకొంటున్నారు.

సైనికులతో కలసి మోడీ దీపావళి

  భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు అమృత్‌సర్ సమీపంలోని డోగ్రాయ్ యుద్ధ స్మారకం వద్ద సైనికులతో కలసి దీపావళిని జరుపుకున్నారు. దేశ గౌరవాన్ని పెంచుతూ దేశ భద్రతను పదిలంగా వుంచుతున్న సైనికులతో కలసి దీపావళి పండుగను జరుపుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని మోడీ పేర్కొన్నారు. భారత సైనికుల ధైర్యసాహసాలు, అంకితభావం వల్ల భారతదేశాన్ని ప్రపంచం ఎంతో గౌరవిస్తోందని ప్రశంసించారు. సైన్యం ధరించే యూనిఫాంను బట్టి కాకుండా వారి నడవడిక వల్లే ఇది సాధ్యమైందన్నారు. సైనిక దళాలకు సుదీర్ఘంగా నాయకత్వం వహిస్తున్నవారికి మోడీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. డోగ్రాయ్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, అమర జవానులకునివాళులర్పించారు.

షారుఖ్ మీద ఇ.డి. ప్రశ్నల వర్షం

  బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఇడీ) అధికారులు మంగళవారం నాడు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇ.డి. అధికారులు దాదాపు మూడు గంటల పాటు షారుఖ్‌ను విచారించి ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్‌ఎస్‌పీఎల్) షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి అమ్మడంలో అవకతవకలు జరిగాయనే కేసులో ఈ విచారణ నిర్వహించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో షారుఖ్‌ను ఇ.డి. గతంలో ఒకసారి ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి ప్రశ్నించింది. ఈ విషయంలో తాను ఎలాంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని షారుఖ్ ఇ.డి.కి వివరించినట్టు తెలుస్తోంది.  

‘అఖిల్’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

  యూనిట్: అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్, దర్శకత్వం : వి.వి.వినాయక్, నిర్మాత : శ్రేష్ట్ మూవీస్, సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున కుమారుడు ‘సిసింద్రీ’ ద్వారా చిన్నప్పుడే సినీ రంగ ప్రవేశంచేసి ‘మనం’లో తళుక్కున మెరిసిన అఖిల్ అక్కినేని యంగ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘అఖిల్’ దీపావళి నాడు విడుదలైంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే లవ్ స్టోరీతో రూపొందింది.  కథ విషయానికి వస్తే సంతోషంగా జీవితాన్ని గడిపే మామూలు కుర్రాడు అఖిల్ జీవితంలోకి సయేషా ప్రవేశిస్తుంది. ఆమెని ప్రేమించిన అఖిల్ ఆమె ప్రేమను పొందుతాడు. ఇంతో సయేషాని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఆఫ్రికాకి తరలిస్తారు. తన ప్రియురాలిని వెతుక్కుంటూ అఖిల్ ఆఫ్రికా వెళ్తాడు. అక్కడ అఖిల్‌కి అనేక కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కథ మలుపులు తిరుగుతుంది. నటుడిగా అఖిల్ తన మీద ఉన్న బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. హీరోయిన్ సయేషా సైగల్ కూడా మంచి నటన కనబరిచింది. డ్యాన్స్ల్లో అఖిల్‌తో పోటీ పడింది. బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి కామెడీ,  మహేష్ మంజ్రేకర్ విలనీ ఆకట్టుకుంటాయి. రాజేంద్రప్రసాద్ మరోసారి మంచి పాత్రలో నటించారు.   అనూప్, థమన్లు కమర్షియల్ సాంగ్స్‌తో అలరించి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

మళ్ళీ అసంతృప్తి రాగాలు తీసిన అద్వానీ బృందం

  బిహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయం చెందడంతో ప్రత్యర్ధ పార్టీలే కాక పార్టీలో సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, యశ్వంత్ సిన్హా, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. వారు నలుగురు సంయుక్తంగా చేసిన ఒక ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడిని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను తీవ్రంగా విమర్శించారు.   “డిల్లీ ఎన్నికలలో ఓటమి నుండి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని బిహార్ ఎన్నికల ఓటమితో స్పష్టం అయింది. బిహార్ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి ఉండి ఉంటే ఆ ఖ్యాతి అంతా ఎవరికి వెళుతుందో అందరికీ తెలుసు. అలాగే ఎన్నికలలో పార్టీ ఓటమి బాధ్యతను వారు స్వీకరించి ఉండి ఉంటే బాగుండేది. కానీ పార్టీ ఓటమికి మాత్రం పార్టీలో అందరిది సమిష్టి బాధ్యత అని చెప్పడం సబబు కాదు. ఒకప్పుడు పార్టీలో ఏ నిర్నయమయిన సమిష్టిగా తీసుకొనేవారు. కానీ ఇప్పుడు కేవలం కొందరు మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఇది పార్టీ సిద్దాంతాలకి విరుద్దం. పార్టీలో ఇటువంటి మార్పు ఎందుకు జరిగింది? పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎవరు? అనే విషయాలపై పార్టీలో సమీక్ష జరపాలి. కానీ ఆ సమీక్షను పార్టీ ఓటమికి కారకులయిన వారు కాకుండా ఇతరులు చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.

గచ్చిబౌలిలో బాణాసంచా బ్లాస్ట్

  హైదరాబాద్ గచ్చిబౌలిలోని భాగ్యరేఖ బాణాసంచా దుకాణంలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట వున్న ఈ దుకాణంలో బాణసంచాకి నిప్పు అంటుకుని మాటలు చెలరేగి పేలుళ్ళు సంభవించాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో దుకాణంతోపాటు గోదాములో నిల్వ వుంచిన బాణాసంచా అంతా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 50 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. ఇదిలా వుండగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ హోటల్ దగ్గర టపాకాయల కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు మరణించారు.