వైకాపా.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పెట్టింది పేరుగా తయారైంది. అధికార పక్షంపై ఆందోళనలు చేయడం, ప్రజల మద్దతు కూడగట్టుకోవడం. అయితే అలా అందోళన చేద్దామని వెళ్లిన వైకాపా నేతలకు చుక్కలు కనపడేలా చేశారు గిరిజన ప్రాంత వాసులు. వివరాల ప్రకారం.. బాక్సైట్ తవ్వకాల పై అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వైకాపా ఎమ్మెల్యే ఈశ్వరి.. పార్టీ శ్రేణులు  విశాఖ ఏజెన్సీలోని జర్రెలకు వెళ్లి ఆందోళన చేద్దామని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నేతలు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అయితే తమ ఆందోళనకు సంబంధించిన సమాచారం గిరిజనులకు చేరవేయటంలో జరిగిన లోపంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై గిరిజనం అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నేతలు తాము వచ్చింది గిరిజనుల తరుపున పోరాటం చేయడానికి అని చెప్పి.. వారిని ఒప్పించడానికి తలప్రాణం తోకకి వచ్చినంత పనైంది. అంతేకాదు గిరిజనులు అడిగిన ప్రశ్నకు వైకాపా నేతలకు దిమ్మతిరిగిపోయేంత పనైంది. అదేంటంటే.. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన అన్ రాక్ కంపెనీకి సంబంధించి.. పెన్సా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి జగన్ మేనమామ వరస అవుతారని.. బాక్సైట్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోరాడాలంటే.. ముందు కంపెనీనిని మూసేసిన తర్వాత రావాలంటూ అడగటంతో వారు ఏం సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోయారు. మొత్తానికి వైకాపా నేతలు ఏదో చేద్దామనుకుంటే.. ఇంకేదో అయినట్టు ఉంది పరిస్థితి.

అప్పుడు మోడీ విజయానికి కారణమయ్యాడు.. ఇప్పుడు ఓటమికి..

బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే మహా కూటమి విజయం పొంది..బీజేపీ పరాభవం పొందడానికి ఎన్నో కారణాలు ఉన్నా ప్రస్తుతం మాత్రం ఒక పేరు బలంగా వినపడుతుంది అది ఎవరో కాదు ప్రశాంత్ కిశోర్. ఒకప్పుడు మోడీ వెంట ఉండి మోడీ గెలుపుకు కారణమయిన ప్రశాంత్ కిశోరే ఇప్పుడు నితీశ్ విజయనానికి కారణమైనట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్, మోడీ తరుపున ప్రచార బాధ్యతలు తీసుకొని.. ఛాయ్ పే చర్చ, సిటిజన్ ఫర్ అకౌంటబుల్ వంటి అనేక పథకాలతో ప్రచారం చేసి మోడీ గెలుపుకు కారణమయ్యాడు. అయితే తరువాత ఏమైందో ఏమో ప్రశాంత్ కిశోర్ ని నితీశ్ చేరదీశాడు. దీంతో బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచించి.. కనెక్ట్ టు నితీశ్ పేరుతో ఆన్ లైన్ జనతా దర్బార్ నిర్వహించి.. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. అంతేకాదు ఘర్ ఘర్ తక్ దస్తక్ కార్యక్రమం పేరుతో నితీశ్ కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరేలా చేశాడు. ఫలితం బీహార్ ఎన్నికల్లో మహా కూటమి ఘన విజయం సాధించడం. మొత్తానికి మోడీ గెలుపుకు కారణం అయిన వాడే.. మోడీ ఓటమికి కూడా కారణం అవ్వడం గమనార్హం.

బిహార్ ఎన్నికలతో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకం కాబోతున్నాయా?

  బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నితీష్ కుమార్ కి చెందిన మహా కూటమికి ఓట్లేసి గెలిపించాలని డిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ మరియు మమతా బెనర్జీ బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. ఎన్నికలలో విజయం సాధించిన తరువాత నితీష్ కుమార్ కి వారిరువురు అభినందన సందేశాలు కూడా పంపారు. నితీష్ కుమార్ కూడా వారిరువురికి ఫోన్ చేసి తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ వారిరువురినీ తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి తేదీ ఖరారు కాగానే మరోమారు వారిరువురిని స్వయంగా ఆహ్వానిస్తారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. బిహార్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు, శక్తులు అన్నీ చేతులు కలిపేందుకు ఆలోచన చేస్తున్నాయి. దానికి ఇది నాందిగా భావించవచ్చును.

ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. నాతో కాదు.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో ఉన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను రాయలసీమ వాసినే.. ప్రాణం ఉన్నంత వరకూ సీమకు న్యాయం చేస్తా అని అన్నారు. నాపై వస్తున్న విమర్సలను ఏమాత్రం పట్టించుకోను.. కావాలనే కొంతమంది నేతలు సీమ అభివృద్దికి అడ్డుపడుతున్నారు.. కానీ రాయలసీమను అభివృద్ధి చేసే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఇక్కడే మకాం వేస్తానని, అవసరమైతే బస్సులో పడుకుని ఇక్కడే తిష్ట వేస్తానని.. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గానీ తనతో పెట్టుకోవద్దని..అభివృద్దికి ఎవరైనా అడ్డుపడితే బుల్లెట్‌లా దూసుకెళ్తానని మండిపడ్డారు. సీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తా.. అంతేకాదు రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా అని అన్నారు.

బీజేపీ ఓటమి.. మంత్రివర్గంలో మార్పు?

బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ప్రధాన మంత్రి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన బీహార్ ఎన్నికల్లో ఇంతటి పరాభవం పొందిన మోడీ.. ఇది తన ప్రతిష్టకే భంగకరమని భావించినట్టు ఉన్నారు. అందుకే కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద చర్యలు తీసుకోనున్నట్టు సమాచరం. బీహార్ ఎన్నికల సమయంలో మొత్తం ఐదుగురు మంత్రులు తమకు ఏమి పట్టనట్టు వ్యవహరించగా.. వారిలో మొదటి వరుసలో ఉన్నది మాత్రం.. ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ - వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లు. వీరు దేశంలో నిత్యవసర ధరలు పెరుగుతున్నా.. కరువు పరిస్థితులు ఏర్పడుతున్నా ఏమాత్రం మోడీ దృష్టికి తీసుకురాకపోవడంతో వీరిపై మొదట చర్యలు తీసుకోకున్నారు. అంటే శాఖ నుండి తీసేయకపోయినా.. శాఖ మార్పిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెపుతున్నారు. మొత్తానికి వెంటనే కాకపోయినా.. శీతాకాల సమావేశాల అనంతరం మంత్రివర్గంలో మార్పులు చేస్తారని అభిప్రాయపడుతున్నారు.

నితీశ్ కు అభినందనలు తెలిపిన కేసీఆర్ ఫ్యామిలి

బీహార్ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి ఘన విజయం సాధించి.. బీజేపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. నిజామాబాద్ ఎంపీ కవిత సైతం స్పందిస్తూ మహాకూటమి విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. మంచి పాలన అందించినందుకే మరోమారు ప్రజలు నితీష్ కు పట్టం కట్టారని కేసీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. లక్షకోట్ల ప్యాకేజీ ప్రకటించినా మోడీని బీహారీలు విశ్వసించలేదని.. బీహార్ లో నితీశ్ విజయం వెనుక స్థానిక అంశాలు కూడా ప్రభావం చూపాయని కేటీఆర్ విశ్లేషించారు. కవిత మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగానే మోడీ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని.. కానీ బీహార్ ప్రజలు మోడీని నమ్మలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రధానమంత్రి హోదాలో  ప్రస్తుతం చేస్తున్న పనులకు  పొంతనలేదని ఆమె అన్నారు.

బీజేపీ ఓడిపోవడానికి కారణాలు అవేనా?

బీహార్ ఎన్నికలు ఊహించని రీతిలో అందరికి షాకిచ్చాయి. ముఖ్యంగా బీజేపీకి. ఢిల్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటకట్టుకున్న బీజేపీ.. బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చాలా నమ్మకంగా ఉంది. కానీ బీహార్ ప్రజలు మాత్రం బీజేపీ నమ్మకాన్ని ఒమ్ము చేసి మహాకూటమికి పట్టం కట్టబెట్టాయి. అయితే బీహార్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ముందే ఒక అంచనాకి వచ్చినా ఆ అంచనాల్ని సైతం తారుమారు చేసి.. ఎలాంటి మొహమాటం లేకుండా స్వష్టమైన తీర్పును ఇచ్చారు బిహారీలు. బీహారీలకు మంచి ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం అవడానికి కొన్ని కారణాలు తెలుపుతున్నారు పరిశీలకులు అవేంటంటే. * ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ చేస్తున్న అనవసర మత అసహనంపై చర్చ. గోమాంసం వివాదం.. దీనిపై నేతలు చేస్తున్న వివాదాస్పదమైన చర్చలు. * మహాకూటమి ఏర్పాటు.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఒక జట్టుగా మారటం. * సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన నిత్యవసరం వస్తువులు ఆకాశాన్ని అందేలా ఉండటం * నితీశ్ పై బీహార్ ప్రజలకు వ్యక్తిగతంగా ఎటువంటి అసంతృప్తి లేకపోవడం * బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కొందరు నేతల మాటనే అధినాయకత్వం వినటం. * బీహార్ లో 14 శాతం మాత్రమే ఉండే అగ్రవర్ణాలకు మొత్తం టిక్కెట్లలో 40 శాతం ఇవ్వటం. కారణాలు ఏదైనా మొత్తానికి బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందింది. దీనిబట్టి మొత్తానికి బీహార్ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య సస్పెన్షన్

  కోడలు, మనవళ్ళ మరణం కేసులో ఇరుక్కున్న వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు ప్రకటించారు. రాజయ్య కుటుంబంతో ఆయన కోడలు సారికకు వున్న మనస్పర్థల వల్ల ఈ ఘోరం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజయ్యను, ఆయన భార్యను, కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. రాజయ్య కుటుంబం సారికను మానసికంగా, శారీరకంగా హింసించేవారన్న ఆరోపణలు బలంగా వినిస్తూ వుండటంతో కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  

ఆర్.ఎస్.ఎస్. కామెంట్లే కొంప ముంచాయా?

  బీజేపీ నాలుగు అడుగులు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి లాగడానికి ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ దారుణంగా చతికిలపడటానికి ఆర్.ఎస్.ఎస్. కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు బీహార్లో ప్రచారం జరుగుతుంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఊరుకోకుండా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విధానాన్ని పునః సమీక్షిస్తుందని కామెంట్ చేశారు. దాంతో ఆయన దొరికిపోవడమే కాకుండా బీజేపీ కూడా దొరికిపోయేట్టు చేశారు. ఈ కామెంట్‌ని అడ్డం పెట్టుకుని లాలూ ప్రసాద్ యాదవ్ రెచ్చిపోయారు. బీజేపీకి అధికారం ఇస్తే రిజర్వేషన్లు రద్దయిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారం బీహార్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. జరిగిన నష్టాన్ని గ్రహించిన మోడీ రిజర్వేషన్లను తొలగించే సత్తా ఎవరికీ లేదని వివరణలు ఇచ్చుకున్నా ప్రయోజనం లేకపోయింది. బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయి కొంప మునిగింది.

నితీష్‌కి అభినందనల వెల్లువ

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి ఘన విజయం సాధించి, నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కానుండటంతో దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల నుంచి నితీష్ కుమార్‌కి అభినందనలు అందుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే రాజకీయ శక్తులు నితీష్‌ని అభినందనల్లో ముంచెత్తుతున్నాయి. నితీష్ విజయం బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తుందని కొందరు, నితీష్ విజయం ముందే ఊహించామని మరికొందరు అభినందిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నితీష్‌కి అభినందన సందేశం పంపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నితీష్‌కి ఫోన్ చేసి మరీ అభినందించారు. తమిళనాడు నుంచి స్టాలిన్ కూడా నితీష్‌కి అభినందన సందేశం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా అయినా బీజేపీకి జ్ఞానోదయం కలగాలని కోరుకున్నారు.

మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్

  బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి ఘన విజయంతో జేడీయూ నాయకుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి కానున్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని లాలూ ప్రసాద్ యాదవ్ మీద విజయం సాధించిన ఆయన ఇప్పుడు లాలూ ప్రసాద్‌తో పొత్తు పెట్టుకుని బీజేపీ మీద విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే బద్ధ శత్రువులైన ఈ మూడు పార్టీలూ కలసి పోటీ చేసి విజయం సాధించాయి. నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రాన్ని దాదాపు పది సంవత్సరాల పాటు పాలించారు. 2000 సంవత్సరం మార్చి 3వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం ఏడు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా వుండి, రబ్రీదేవికి అధికారం ఇచ్చి తప్పుకున్నారు. అనంతరం 2005 నవంబర్ 24 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2010 ఎన్నికలలో కూడా నితీష్ విజయం సాధించారు. 2010 నవంబర్ 26 నుంచి 2014 మే 17 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు. అయితే 2014 ఎన్నికలలో బీజేపీ విజయం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని జితన్ రామ్ మాంఝీకి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. అయితే మాంఝీ వ్యవహార శైలి కారణంగా ఆయన్ని దించేసి మళ్ళీ నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2015లో కూడా ఆయన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.

ఓటమి బాటలో లాలూ కొడుకులు

  బీహార్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మహా కూటమి భారీ స్థాయిలో ముందంజలో వుంది. ఇది ఆర్జేడీ, జేడీయూ నాయకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం పూర్తిస్థాయిలో ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, ఈ ఎన్నికలలో పోటీ చేసిన లాలూ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ తమ ప్రత్యర్థుల కంటే వెనకబడి వున్నారు. తేజ్ ప్రతాప్ మహువా నియోజకవర్గం నుంచి, తేజస్వి యాదవ్ రాఘోపురా నియోజకవర్గం నుంచి పోటీలో వున్నారు. వీరిద్దరూ మొదట్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత వెనకబడ్డారు. వీరిద్దరూ ఓటమి బాటలో వున్నట్టు సమాచారం.