ఏపి పోలీసుల అదుపులో స్మగ్లర్ గంగిరెడ్డి

  అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మరియు 2003సం.లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో నిదితుడు కొల్లం గంగిరెడ్డిని రాష్ట్ర సిఐ.డి. అదనపు డిజి ద్వారకా తిరుమల రావు మారిషస్ నుండి డిల్లీ మీదుగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తీసుకువచ్చేరు. అతను గత 15 ఏళ్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా అతనిపై గత ఏడాది వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు.   గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడి నెలరోజుల పాటు జైల్లో ఉన్నాడు. మే 18వ తేదీన బెయిలుపై బయటకు వచ్చి వెంటనే నకిలీ పాస్ పోర్ట్ తో విదేశాలకు పారిపోయాడు. రాష్ట్ర పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో మారిషస్ నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయి మళ్ళీ అక్కడ జైలు పాలయ్యాడు. అతనిని రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు సుమారు ఏడాదిగా ఏపి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్ర సి.ఐ.డి. తరపున న్యాయవాది, పోలీస్ ఉన్నతాధికారులు మారిషస్ వెళ్లి అక్కడి న్యాయస్థానంలో గంగిరెడ్డిపై రాష్ట్రంలో నమోదయిన కేసుల గురించి వివరించి అక్కడి కోర్టు అనుమతితో అతనిని ఆదివారం హైదరాబాద్ కి తిరిగి తీసుకురాగలిగారు.   అతను ఎర్రచందనం స్మగ్లింగ్, నకిలీ పాస్ పోర్ట్, చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం వంటి అనేక కేసులలో నిందితుడుగా ఉన్నాడు. పోలీసులు అతనిని రేపు పొద్దుటూరు కోర్టులో హాజరుపరిచి అతనిపై ఉన్న అనేక కేసులలో విషయంలో ప్రశ్నించేందుకు అతని కస్టడీ కోరుతారు.

టీఆర్ఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు తమ ఛానెళ్లలో వార్తలను ప్రసారం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని.. ప్రచారంలో పరిమితికి మించి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని.. టీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు టీన్యూస్, నమస్తేతెలంగాణ పత్రికల్లో తమ వార్తలు ప్రచురిస్తున్నారని.. వాటిని పెయిడ్‌న్యూస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ ను టీ టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నిక టీఆర్ఎస్ నేతలు ఎన్నికలు కోడ్ ను ఉల్లంఘించారు అంటూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసినందుకు జుట్టు కత్తిరించారు.. ఎక్కడ?

  ఎన్నికల్లో పోటీ చేయడమే ఆమె చేసిన తప్పు. అందుకే ఆమెను కట్టేసి జట్టు కత్తిరించారు ప్రతిపక్షపార్టీ నేతలు. ఇంతకీ ఎవరామె.. ఎక్కడ ఆ ఘటన జరిగింది అనుకుంటున్నారా? వివరాల ప్రకారం. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు సతికుమారి (50) గ్రామ పంచాయితీ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిపైపోటి చేశారు. దీంతో ఆమెపై సీపీఎం నాయకులు దారుణంగా ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను పట్టుకొని కట్టేసి జుట్టు కట్ చేశారు. దీంతో ఈ విషయంపై కేరళ ముఖ్యముంత్రి ఉమెన్ చాందీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యర్థి పార్టీల మీద అసహనం పెరిగిపోతోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని.. ఇలాంటి సంఘటనలను తాము చూస్తూ ఊరుకోమని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆశ్చర్య ఏంటంటే సతికుమారి ఎన్నికల్లో ఓడిపోయినా కూడా సీపీఎం అభ్యర్ధులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తావా అంటూ దాడి చేశారు.

ఎమ్మెస్సార్ వృద్దాప్యంలో ఉన్నారు.. గుత్తా

  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. నారాయణ కేసీఆర్ ను ప్రశంసించిన సంగతి తెలిసింది. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెస్సార్.. కేసీఆర్ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని.. ప్రతిపక్షాలు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీనేత, పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాలనుండి ఎప్పుడో తప్పుకున్నారని.. ఆయన వృద్దాప్యంలో ఉన్నారు.. అందుకే ఆయనకు కేసీఆర్ పాలనపై సరైన అవగాహన లేదని విమర్శించారు. ఈ వయసులో ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మరి గుత్తా చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెస్సార్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

కేసీఆర్ సచివాలయానికి వచ్చారా? అదీ వార్తే..!

సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లినా వార్తే.. వెళ్లకపోయినా వార్తలాగే తయారైంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఒకటిగా ఉన్న సచివాలయం కాస్త రెండుగా చేసి మధ్యలో కంచె కూడా వేశారు. అయితే ఎవరి సచివాలయం నుండి వారు పాలన చేస్తూ.. ఇద్దరు సీఎంలతో సచివాలయం బిజీగా ఉంటుందేమో అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా మారింది పరిస్థితి. వాస్తును ఎక్కువగా నమ్మే కేసీఆర్ ఆ నెపంతో అసలు సచివాలయంవైపు కన్నెత్తి చూడటమే మానేశారు. ఇప్పటికే కేసీఆర్ సచివాలయానికి వచ్చి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం సెక్రటేరియట్ కు రావడంతో పలువురు ఆసక్తిగా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కేసీఆర్ సీఎంవోకు వచ్చారంటూ వార్తను కూడా పెద్ద ఎత్తున ప్రచురించారు. ఇక చంద్రబాబు అయితే విజయవాడ నుండే తన పాలన కొనసాగిస్తున్నారు. మొత్తానికి సీఎంలు తమ కార్యలయానికి రావడం కూడా ఒక వార్త అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఏపీ నెంబర్ వన్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి..

  కొంత మంది పార్టీ నేతలు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పడమే కాని చేతల్లో చేసేది మాత్రం ఏముండదు. అలాంటి నేతల పేర్లు మాత్రం జనాలకు బాగా గుర్తుంటాయి. కానీ కొంతమంది నేతలు మాటలు కాకుండా.. తమ పని తాము చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారి పేరు మాత్రం బయట చాలా తక్కువగా వినిపిస్తుంటుంది. అలాంటి కోవకు చెందిన ఆమెనే ‘గుండా లక్ష్మీదేవి’’. ఈమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆసక్తికరంగా మారారు. దానికి కారణం అత్యుత్తమ ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై జరిపిన సర్వేలో  ఆమె నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడమే. గుండా లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో  శ్రీకాకుళం టౌన్ నియోజకవర్గ నుండి పోటీ చేసి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విజయం సాధించారు. అప్పటి నుండి నియోజక వర్గం అభివృద్ధి కోసం కృషిచేస్తూ.. ఏపీలో ప్రభుత్వ పథకాల్ని సమర్థంగా అమలు చేయటంతో పాటు.. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించటంలో ఆమె ముందున్నట్లుగా తేల్చారు. దీంతో ఇప్పుడు ఆమె ప్రముఖంగా మారారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ రెండో స్థానంలో.. మంత్రి అచ్చెన్నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే మొదటి ఐదు ర్యాంకుల్లో మూడు ర్యాంకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం. ఇక మిగిలిన మంత్రులు.. పలువురు నేతలు యాభై ర్యాంకు తర్వాత ఉన్నారు. దీంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు వారికి క్లాస్ పీకి అంతటితో ఊరుకుంటారా.. లేక మంత్రి వర్గం మార్పు గురించి ఆలోచిస్తారా అన్నది ప్రశ్న..

పారిస్ లో ఉగ్రవాదుల దాడులు ఎలా జరిగాయంటే..

    సంతోషానికి, సౌందర్యారాధనకి నిలయమయిన పారిస్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిపి సుమారు 20గంటల తరువాత పోలీసుల దర్యాప్తులో వాటి వివరాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులను ప్రతీకార చర్యగా తామే జరిపినట్లు ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించుకొన్నారు. సుమారు 8 మంది ఉగ్రవాదులు నిన్న సాయంత్రం సుమారు 8గంటలకు ఒకే సమయంలో ఆరు వేర్వేరు ప్రదేశాలలో దాడులు చేసారు.   వాటిలో ఐదు దాడులు పారిస్ నగరంలోని 10, 11 జిల్లాల పరిధిలో గల బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ మరియు మరొకటి బటక్లాన్ ఆడిటోరియంలో జరిగింది. ఇక్కడే ఎక్కువమంది పౌరులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. యు.ఎస్. బాండ్ ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ బృందం బటక్లాన్ ఆడిటోరియంలో కచేరీ నిర్వహిస్తున్నప్పుడు కొందరు ఉగ్రవాదులు లోపలకి జొరబడి తమతో తెచ్చుకొన్న హ్యాండ్ గ్రెనేడ్స్ ప్రేక్షకులపైకి విసిరి ఆ తరువాత తమ వద్ద ఉన్న ఏకే-47 మెషిన్ గన్లతో వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపదాంతో అక్కడికక్కడే సుమారు 80మంది వరకు చనిపోయారని తెలుస్తోంది.   మరొకటి పారిస్ నగరానికి ఉత్తరాన్న గల స్టేడ్-డి-ఫ్రాన్స్ జాతీయ స్టేడియం బయట జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 128 మరణించినట్లు 185 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారిక సమాచారం. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాన్కోయీస్ హోల్లాండీ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి ఇరువురూ ఇరు దేశాల మధ్య జాతీయ స్టేడియంలో జరుగుతున్న సాకర్ మ్యాచ్ చూస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు స్టేడియం బయట బాంబులు పేల్చారు.   బటక్లాన్ కన్సర్ట్ ఎవెన్యూ, 50 బోలివార్డ్ వోల్టైర్ వద్ద మిషన్ గన్ మరియు బాంబులతో దాడులు జరిగాయి. పారిస్ నగరం ఉత్తరాన్న సెయింట్ డెనిస్ వద్ద గల స్టేడ్-డి-ఫ్రాన్స్ జాతీయ స్టేడియం వద్ద బాంబు దాడులు జరిగాయి. లీ కారిల్లన్ బార్, 18 ర్యూ అలిబెర్ట్ వద్ద ఉగ్రవాదులు తుపాకులతో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. లీ పెటిట్ కేంబోడ్జ్ రెస్టారెంట్, 20 ర్యూ అలిబెర్ట్ వద్ద ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు. లా బెల్లి ఎక్వీప్, 92 ర్యూ డీ కరోనీ వద్ద తుపాకులతో కాల్పులు జరిపారు. లా కాస నోస్ట్రా రెస్టారెంట్, 2 ర్యూ డీ లా ఫాన్ టేయినీ వద్ద తుపాకులతో కాల్పులు జరిపారు.   అన్ని దేశాల అధినేతలు ఈ దాడుల పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ దాడులు కేవలం ఫ్రాన్స్ దేశంపైనో లేదా ఆ దేశ ప్రజల మీదనో జరిగిన దాడులు కావని యావత్ మానవాళిపై జరిగిన దాడులని అభివర్ణిస్తున్నారు. జర్మనీ, అమెరికా తదితర అనేక దేశాలు ఈ ఉగ్రవాదుల దాడులపై దర్యాప్తులో ఫ్రాన్స్ దేశానికి అవసరమయిన సహాయ సహకారాలు అందించదానికి సంసిద్దత వ్యక్తం చేసాయి.

సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించగా.. గవర్నర్ కూడా తన రాజీనామాను ఆమోదించినట్టు తెలుస్తోంది. అసలు నితీశ్ కుమార్ ఏంటీ రాజీనామా ఏంటీ అనుకుంటున్నారు.. వివరాల ప్రకారం.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తి కేవలం ఆపద్దర్మ సీఎంగా మాత్రమే పాలన చేపట్టవలసి ఉంటుంది. అనంతరం ఎన్నికల్లో గెలిచిన తరువాత వేరే నాయకుడు సీఎం పగ్గాలు చేపట్టినా లేదా  ఒకవేళ అదే నాయకుడు సీఎంగా గెలిచినా అలాగే కొనసాగడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. రాజీనామా చేసి తరిగి మళ్లీ బాధ్యతలు చేపట్టాల్సి వుంటుంది. దీనిలో భాగంగానే నితీశ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 20న నితీశ్ తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

బుద్ది చెప్పడానికే దాడి చేశాం.. ఐఎస్ఐఎస్

  ప్యారిస్ లో ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈదాడిలో ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 170కి చేరగా.. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ప్యారిస్ లో దాడులు చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ సిరియా విషయంలో జోక్యం చేసుకున్నాడని.. అనవసరంగా తమతో పెట్టుకున్నారని, మీకు తగిన బుద్ది చెప్పడానికే ఈ దాడులు చేస్తున్నామని ఉగ్రవాదులు చెప్పారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అంతే కాకుండ ఉగ్రవాదులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే దాడి చేశారని హోలండ్ ఇప్పటికీ కచ్చితంగా చెప్పడం లేదు.

ఏసీపీ సంజీవరావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. అక్రమాస్తుల ఆరోపణ

  కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆదాయం కంటే ఎక్కువ అక్రమాస్తులు కూడబెట్టారన్ననేపథ్యంలో ఏసీబీ.. సంజీవరావు ఇంట్లో, కార్యాలయం.. ఇంకా పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సంజీవరావు కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. అల్వాల్ లో షాపింగ్ కాంప్లెక్స్ , హన్మకొండలోని అడ్వకేట్ కాలనీలో ఉన్న ఖరీదైన ఇల్లు, ములుగులో 30 ఏకరాల తోట దమ్మన్నపేటలో 5 ఎకరాల భూమి, షామిర్ పేటలో ఫామ్ హౌస్ వంటి రూ. 5కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. కాగా అక్రమాస్తుల్లో సంజీవరావు కి బినామిగా అక్బర్ అనే మరో పోలీస్ ఉన్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. వరంగల్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన నాటి నుంచి సంజీవరావు అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం అక్రమాస్తుల విలువ తేలుతుందని ఏసిబి అధికారులు తెలిపారు. కాగా బినామీ పేర్లున్న ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని తెలిపారు.

షాకిచ్చిన కేసీఆర్ ఫ్లాష్ సర్వే

  వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీనేతలు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రచారంలో మాత్రం తెలంగాణ అధికార పార్టీకి కాస్త ఇబ్బందులు ఎక్కువవుతున్నాయనే చెప్పొచ్చు. ప్రచారం నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా వారికి ప్రజలనుండి ప్రశ్నలు ఎదురవడం.. ప్రజలు వారిని నిలదీయడం వంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్న నేతలు దగ్గర నుండి పెద్ద నేతల వరకూ ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి ఎర్పడటం గమనార్హం. దీనికి కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసరడమే నిదర్శనం. దీంతో అసలు వరంగల్ ఎన్నికల్లో విజయంపై ఎలాంటి సందేహం లేదు.. మెజార్టీ మీదనే దృష్టి పెట్టాలనుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న పరిస్థితులపై దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. అసలు ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలు గురించి కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే కేసీఆర్ ఓ ఫ్లాష్ సర్వే నిర్వహించారు.  అయితే ఈ సర్వేలో ఫలితాలు చూసి పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల్లో అసంతృప్తికి ముఖ్యకారణాల్లో ఒకటి.. పత్తికి గిట్టుబాటు ధర లభించకపోవటంగా చెబుతున్నారు. దీనికి తోడు.. ఉప ఎన్నిక జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం పత్తి పంట పండించే వారు ఉండటం గమనార్హం. అంతేకాదు ఫించన్ల పంపిణీ కార్యక్రమం సరిగా లేకపోవటం.. దళితులకు ఇస్తామని చెప్పిన మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం మీదా గుర్రుగా ఉన్నట్లు తేల్చారు. దీంతో అధికార పార్టీ ప్రజలను బుజ్జగించే పనిలో పడింది. దీనిలో కొన్ని అంశాలు తమకు సంబంధంలేదని ప్రజలకు చెప్పి వారి ఆగ్రహాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపట్టారు. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే వరంగల్ ఉపఎన్నిక ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది.

బ్రిటన్ మీడియాపై మోడీ ఫైర్.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

  ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాంబ్లే స్టేడియంలో ప్రసంగించిన మోడీ బ్రిటన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీకి ఆ దేశ మీడియా బాగానే కవరేజ్ చేసింది.. వార్త పత్రికల్లో మోడీ గురించి పెద్ద ఎత్తునే ప్రస్తావించింది. అయితే ప్రస్తావించింది కానీ అది  మోడీ ప్రస్థానం.. ఆయన హయాంలో విమర్శకులు తరచూ ప్రస్తావించే వివాదాల్ని ప్రముఖంగా ప్రస్తావించటం కనిపించింది. దీంతో మోడీ తన ప్రసంగంలో బ్రిటన్ ప్రధాని కామెరన్ సమక్షంలోనే మీడియా మీద పంచ్ లు వేశారు. ఒక దేశాన్ని అంచనా వేసేందుకు వార్తా పత్రికలు.. టీవీ శీర్షికలు కొలమానం కాదంటూ.. వార్తా పత్రికల్లో కనిపించేదే భారత్ కాదని ఆయన ప్రసంగించిన 75 నిషాల్లో కొంచం సేపు మీడియాపై పంచ్ లు విసిరారు. ‘‘125 కోట్ల మందితో కూడిన భారత్.. టీవీ తెరల్ని మించిన స్థాయిలో పెద్దదీ.. మెరుగైనది’’ అంటూ మీడియా కథనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. మొత్తానికి మత అసహనంపై మన దేశంలోనే కాకుండా పొరుగుదేశంలో కూడా చర్చించుకోవడం ఆశ్చర్యం.

ప్యారిస్‌ మృతులు 150 మంది

  ప్యారిస్ నగరంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనల్లో మృతుల సంఖ్య 150 కి పెరిగింది. ప్యారిస్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో ఈ ఘోరం జరిగింది. ప్యారిస్ మొత్తంలో ఆరుచోట్ల కాల్పులు, మూడు చోట్ల పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి కూడా జరిగినట్టు సమాచారం. వందమంది ప్రజలను తీవ్రవాదులు ఒకేచోట బంధించి బాంబులతో పేల్చివేశారని తెలుస్తోంది. అయితే కాల్పుల సంఘటనల తర్వాత సైన్యం అప్రమత్తమై మొత్తం వందమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొంతమంది తీవ్రవాదులను కాల్చి చంపారు.కాల్పుల దుర్ఘటనల అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్యారిస్ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు.

ప్యారిస్‌లో ఉగ్రవాదుల దాడి... 60 మంది మృతి

  ప్యారిస్ నగరంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ప్యారిస్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో ఈ ఘోరం జరిగింది. ప్యారిస్ మొత్తంలో ఆరుచోట్ల కాల్పులు, మూడు చోట్ల పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి కూడా జరిగినట్టు సమాచారం. అయితే కాల్పుల సంఘటనల తర్వాత సైన్యం అప్రమత్తమై మొత్తం వందమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తు్న్నాయి. కాల్పుల దుర్ఘటనల అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్యారిస్ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు.

ఇది హత్యా? ఆత్మహత్యా?

  పరీక్ష పత్రాల వాల్యుయేషన్ చేసేవారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. బాగా చదువుకునే విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ తర్వాత ఆ విద్యార్థి పాసయ్యాడని తెలిసింది. వాల్యుయేషన్ చేసేవారి నిర్లక్ష్యం ఒక ప్రాణం తీసింది. జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చెందిన మహ్మద్ అద్నాన్ హిలాల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్లో తనకు ఇష్టమైన సబ్జెక్టులో అతను ఫెయిలయ్యాడు. దాంతో హిలాల్ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ అంశం మీద అనుమానం వచ్చిన హిలాల్ తండ్రి ఫెయిలైన పేపర్ని రీ వాల్యుయేషన్ చేయిస్తే హిలాల్ క్లాస్ టాపర్‌గా నిలిచాడు. దాంతో ఆ తండ్రి గుండె మరోసారి పగిలపోయింది. ఆ తండ్రి తన కొడుకుది ఆత్మహత్య కాదని హత్య అంటూ రోదిస్తున్నాడు. పేపర్లు దిద్దేవారే తన కొడుకును హత్య చేశారని అంటున్నారు. ఈ అంశాన్ని కాశ్మీర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ మాత్రం చాలా లైట్‌గా తీసుకుంది. ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయని, అంతమాత్రానికి ఆత్మహత్య చేసుకోవడమే తప్పని అంటోంది.

రఘువీరా పై ఆనం రామనారాయణరెడ్డి ఫైర్.. అది మట్టి యాత్ర

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది తాజా పరిణామాలు చూస్తుంటే. అందుకే ఇప్పుడు డైరెక్ట్ గానే ఏపీ పీసీసీ రఘువీరా రెడ్డిపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఆనం బ్రదర్స్ రఘువీరా రెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమకు చెప్పకుండా రఘువీరా నెల్లూరు కమిటీ ఏర్పాటు చేసినందుకు గాను.. మాకు చెప్పకుండా కమిటీ ఎలా ఎంపిక చేస్తారు అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రఘువీరా మట్టి సత్యాగ్రహం చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. రఘువీరా చేస్తున్న యాత్ర కేవలం మట్టి యాత్రగా ఆయన కొట్టి పడేశారు. ప్రజల్లో ఆదరణ లేకుండా రఘువీరా ఎన్ని యాత్రలు చేసినా వేస్ట్ అని ఆయన తేలిగ్గా తీసిపడేశారు. దీంతో ఇప్పుడు ఆనం బ్రదర్స్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ జిల్లాకే చెందిన బీజేపీ నేత వెంకయ్యనాయుడితో  ఈ బ్రదర్స్ టచ్ లో ఉంటున్నారట.. దీంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.