పారిస్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ హతం..

పారిస్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ మొదలయ్యింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దురు పోలీసులు మృతి చెందగా మరో ఇద్దురు పోలీసులు గాయపడ్డారు. కాగా పారిస్ పోలీసులు సెయింట్ డెవిస్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టి కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.. ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అపార్ట్ మెంట్లో పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ ను కాల్చి హతం చేసినట్టు.. ఒక మహిళా ఉగ్రవాది తనను తాను కాల్చుకున్నట్టు పారిస్ పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా సెయింట్ డెవిస్ ప్రాంతంలో పోలీసులు  హై అలర్ట్ ప్రకటించారు.. ఇళ్ల నుండి ఎవ్వరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో కొత్త మలుపు.. చిక్కుల్లో శ్రీశాంత్

  క్రికెట్ ఐపిఎల్ మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. క్రికెటర్స్ శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రిబ్యునల్ కోర్టు వీరి ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది.

రాహుల్ జాతీయత వివాదం.. ఆయన ఒట్టి అబద్దాల కోరు.. దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై వివాదం ముదురుతోంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు రాహుల్ భారతీయుడే కాదని.. అతనికి లండన్ పౌరసత్వం ఉందని ఆయన విమర్శించారు. అంతేకాదు దీనిపై ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాసి.. రాహుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ పై చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనవసరంగా ఆరోపణలను చేస్తున్నారని.. ఆయన ఒట్టి అబద్దాల కోరని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

పారిస్ లో మళ్లీ కాల్పులు.. ఐసిస్ తో అప్రమత్తంగా ఉండాలి.. రాజ్ నాథ్ సింగ్

ఇప్పటికే అగ్రరాజ్యమైన అమెరికా.. ఇతర దేశాలకు ప్రాన్స్ కు పట్టిన గతే మీకు పడుతుందని ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పారిస్ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో యూఎస్ నుండి పారిస్ వెళ్లే రెండు విమానాలను దారి మళ్లించారు. ఇక ఐసిస్ బెదిరింపులతో పారిస్ లో పలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా పారిస్ లో మళ్లీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ భారత్ లో ఐసిస్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇక్కడ కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం లేకపోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హైఅలర్ట్ గా ఉండాలని.. అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

మేయర్ అనురాధ, మోహన్ హత్యలకు నిరసనగా బంద్

  చిత్తూరుజిల్లా మేయర్ కటారి అనురాధ, మోహన్ హత్యలకు నిరసనగా బంద్ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని పలు వాణిజ్య వ్యాపార సంస్ధలు, విద్యా సంస్థలు, దుకాణాలు మూసివేశారు. దీంతో జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు.. 144 సెక్షన్ విధించారు. నిన్న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మున్సిపల్ కార్యలయంలో తన ఛాంబర్లో ఉన్న అనురాధ ఆమె భర్త మోహన్ పై దుండగులు కత్తులతో దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనురాధ మోహన్ లను వేలూరు ఆస్పత్రికి తరలించగా అనురాధ మరణించింది. అయితే భర్త పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా మోహన్ కూడా నిన్న రాత్రి 9 గంటలకు మరణించాడు. ఇదిలా ఉండగా అనురాధ మృతదేహానికి పోస్టుమార్టం చేయగా.. నుదుటి ఎడమవైపు బులెట్ దిగిందని.. మెదడు చిట్లిపోయిందని.. దీంతో అనురాధ మరణించిందని వైద్యులు తెలిపారు.

ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు

  ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఐసిస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ఫ్రాన్స్ పౌరులైతే ఏ చిన్న ఘటన జరిగినా ఉలిక్కిపడుతున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్‌కి చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం నాడు ఎయిర్ ఫ్రాన్స్ విమానం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి ఫ్రాన్స్‌కి వెళ్ళాల్సి వుండగా ఆ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనిఖీలు నిర్వహించిన అనంతరం విమానంలో బాంబు లేదని నిర్ధారించిన అధికారులు సాల్ట్ లేక్ మీదుగా విమానాన్ని నడిపించారు. అలాగే వాషింగ్టన్ నుంచి ప్యారిస్ వెళ్ళాల్సిన మరో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. అధికారులు ఆ విమానాన్ని కూడా తనిఖీ చేసి బాంబు లేదని ధ్రువపరిచాక విమానం ప్రయాణించింది. రెండు విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్‌కి చేరుకున్నాయి.

నటుడు వినోద్ కుమార్ అరెస్ట్

  మామగారు, సీతారత్నం గారి అబ్బాయి, మౌనపోరాటం వంటి అనేక సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు వినోద్‌కుమార్‌ను ఓ హత్యా ప్రయత్నం కేసులో పోలీసులు నిన్న పుత్తూరులో అరెస్టు చేశారు. ఆయన తన మేనేజర్ సచ్చిదానందను తన కారుతో గుద్దించి చంఫై, దానిని రోడ్డు ప్రమాదంగా చూపాలని ప్రయత్నించినట్లు పిర్యాదు అందడంతో పోలీసులు వినోద్‌కుమార్‌ను, అతనికి సహకరించిన ఉదయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పుత్తూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు వారిరువురినీ జైలుకి తరలించారు.   నటుడు వినోద్‌కుమార్‌ ఆర్ధిక లావాదేవీలను సచ్చిదానంద చూస్తున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య వివాదాలు జరుగుతున్నాయి.  అకౌంట్స్ నిర్వహణలో మేనేజర్ సచ్చిదానంద అవకతవకలకు పాల్పడుతున్నాడని వినోద్ కుమార్ అనుమానిస్తున్నారు. ఆ కారణంగానే తనను హత్య చేయడానికి ప్రయత్నించారని మేనేజర్ సచ్చిదానంద పిర్యాదు చేయడంతో, పోలీసులు వినోద్‌కుమార్‌ పై ఐపీసీ సెక్షన్లు 120 బి, 307 (హత్యాయత్నం) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

ప్రముఖ నటుడికి ఎయిడ్స్

  ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ కథానాయకుడికి ఎయిడ్స్ సోకిందని, ఆ కథా నాయకుడితో సంబంధం వున్న పలువురు హీరోయిన్లకు కూడా ఆ వ్యాధి సోకిందని హాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ప్రముఖ హీరోకి వ్యాధి సోకిందన్న పుకార్లే తప్ప ఆ హీరో ఫలానా హీరో అని మాత్రం ఎవరూ బయట పడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు చార్లీ షీన్ మీడియా ముందుకు వచ్చి తనకు ఎయిడ్స్ సోకిందని ప్రకటించాడు. అయితే తనకు ఎయిడ్స్ ఎలా సోకిందో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు. తనకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకిన విషయాన్ని ఇంతకాలం గోప్యంగా వుంచడానికి తాను ఎంతో ఖర్చు పెట్టానని, ఇప్పుడు ఈ విషయాన్ని తానే బహిర్గతం చేస్తున్నాను కాబట్టి ఇక ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చార్లీ చెప్పాడు. ఇంతకాలం నుంచీ ఈ రహస్యాన్ని దాచి తనకు జైల్లో వున్నట్టు అనిపించిందని, ఇప్పుడు తనకు జైల్లోంచి బయట పడినట్టు హాయిగా వుందని షీన్ చార్లీ అన్నాడు.

వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత

వీహెచ్పీ (విశ్వహిందూ పరిషత్) సీనియర్ నేత అశోక్ సింఘాల్ కన్ను ముశారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సింఘాల్ గుర్గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుర్గావ్‌ లోని మేదంతా మెడిసిటీ ఆస్పత్రిలో ఈ రోజు మధ్యాహ్నం 2.24 గంటలకు మృతి చెందినట్లు వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు. అశోక్ సింఘాల్ 20 ఏళ్ల పాటు వీహెచ్పీ కి అధ్యక్షుడిగా పనిచేశారని.. విశ్వహిందూ పరిషత్ విస్తరణకు ఆయన అనేక విధాల కృషి చేశారని ప్రవీణ్ తొగాడియా తెలిపారు. కాగా భారత దేశ విశ్వహిందూ పరిషత్ కు చైర్మన్ గా కోనసాగిన ఆయన అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

పారిస్ కి పట్టిన గతే పడుతుంది.. ఐఎస్ఐఎస్ హెచ్చరిక

  పారిస్ లో ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎంతో మంది మృతి చెందగా ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా సిరియా దేశంలో జోక్యం చేసుకున్నందుకు.. బుద్ది చెప్పడానికే ఈ దాడి చేశామని ఐఎస్ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క పారిస్ లోనే కాదు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా తాము దాడులు చేసి తగిన బుద్ది చెబుతామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా దాడులు చేస్తున్న అన్ని దేశాలకు ప్యారిస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఐఎస్ఐఎస్ వెబ్ సైట్ నుండి ఓ వీడియో ద్వారా అల్జెరియన్ అల్ గరీబ్ అనే వ్యక్తి హెచ్చరించినట్టు తెలుస్తోంది. సిరియాలో తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో అగ్రరాజ్యాలు వైమానిక దాడులు చేస్తున్నాయని.. తాము త్వరలోనే దాడులు చేసి బుద్ది చెబుతామని హెచ్చరించాడు.

రాహుల్ భారతీయుడే కాదు.. లేఖ కూడా రాశా.. సుబ్రమణ్య స్వామి

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రస్తుతం రగడ జరుగుతుంది. ఈయన పౌరసత్వంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ భారతీయుడు కాదని.. అతను ఇంగ్లండ్ పౌరసత్వం ఉన్న వ్యక్తని అన్నారు. అంతేకాదు 2003ఆగస్టు 21లో రాహుల్‌ యూకేలో బ్యాకప్స్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ ప్రారంభించాడని.. అది అక్కడి లండన్ చిరునామాతోనేనని.. కంపెనీకి కార్యదర్శిగా, డైరెక్టర్‌గా కొంతకాలం ఆయనే వ్యవహరించగా తరువాత 2009 ఫిబ్రవరి 17న కంపెనీని మూసేశారని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాసినట్టు ఆయన సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. కాగా భారత్ లో ద్వంద్వ పౌరసత్వ విధానం లేనందున కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి ఈసారి రాహుల్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

చిత్తూరు ఘటన హేయమైంది.. చంద్రబాబు

  చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధ దారుణహత్యకు గురైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆమె పృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఘటన చాలా హేయమైనదని అన్నారు. రాజకీయ ముసుగులో కొంతమంది అరాచకాలు సృష్టిస్తున్నారని.. గత పదేళ్లు అరాచకాలు సృష్టించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిందుతుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టేది లేదు.. శాంతి భద్రతల్ని కాపాడటమే మా లక్ష్యం.. శాంతి భద్రతలకి భంగం కలిగించేవారిని ఉపేక్షించమని మండిపడ్డారు. కాగా కటారి అనురాధ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

చిత్తూరు మేయర్ దారుణ హత్య

  చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో వున్న కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ మీద కర్ణాటకు చెందిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కటారి అనురాధ, కటారి మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా కటారి అనురాధ చనిపోయారు. కటారి మోహన్ పరిస్థితి విషమంగా వుండటంతో ఆయనను వేలూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏసీపీ సంజీవరావుపై దాడి.. టీఆర్ఎస్ వ్యూహం అదేనా?

  కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలో ఏసీబీ.. ఏసీపీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగానే సంజీవరావుకు ఉన్న అనేక అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇదంతా ఒకవైపు అయితే సంజీవరావు టీ టీడీపీ బంధువు అనే విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ సోదా వెనుక రాజకీయ కోణం కూడా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కావాలనే ఏసీపీ ఇంటిపై దాడులు నిర్వహించిందని..ఆ రకంగా ఆ టీడీపీ నేతను ఇరుకున పెట్టాలని ఈ ప్లాన్ వేసిందని అనుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ,టీడీపీ తరుపున అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేందుకు గాను ఆ టీడీపీ నేత గ్రౌండ్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో.. మానసికంగా దెబ్బకొట్టేందుకే టీఆర్ఎస్ ఇలా చేసిందని.. దానివల్ల టీడీపీ నేత తన దూకుడిని తగ్గిస్తారని టీఆర్ఎస్ భావించి ఉండవచ్చని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం వారి మాటలను ఖండించి ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే.. అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు అంటు చెబుతున్నారు. మరి దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.