మళ్ళీ అసంతృప్తి రాగాలు తీసిన అద్వానీ బృందం
posted on Nov 11, 2015 @ 11:23AM
బిహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయం చెందడంతో ప్రత్యర్ధ పార్టీలే కాక పార్టీలో సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, యశ్వంత్ సిన్హా, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. వారు నలుగురు సంయుక్తంగా చేసిన ఒక ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడిని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను తీవ్రంగా విమర్శించారు.
“డిల్లీ ఎన్నికలలో ఓటమి నుండి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని బిహార్ ఎన్నికల ఓటమితో స్పష్టం అయింది. బిహార్ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి ఉండి ఉంటే ఆ ఖ్యాతి అంతా ఎవరికి వెళుతుందో అందరికీ తెలుసు. అలాగే ఎన్నికలలో పార్టీ ఓటమి బాధ్యతను వారు స్వీకరించి ఉండి ఉంటే బాగుండేది. కానీ పార్టీ ఓటమికి మాత్రం పార్టీలో అందరిది సమిష్టి బాధ్యత అని చెప్పడం సబబు కాదు. ఒకప్పుడు పార్టీలో ఏ నిర్నయమయిన సమిష్టిగా తీసుకొనేవారు. కానీ ఇప్పుడు కేవలం కొందరు మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఇది పార్టీ సిద్దాంతాలకి విరుద్దం. పార్టీలో ఇటువంటి మార్పు ఎందుకు జరిగింది? పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎవరు? అనే విషయాలపై పార్టీలో సమీక్ష జరపాలి. కానీ ఆ సమీక్షను పార్టీ ఓటమికి కారకులయిన వారు కాకుండా ఇతరులు చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.