ముద్రగడ ఓ కీలుబొమ్మ.. స్ర్కిప్టు సాక్షి కార్యాలయంలో తయారవుతుంది..
posted on May 25, 2016 @ 5:57PM
కాపు నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాపునేతలకు కట్టే భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై ముద్రగడ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన గంటా శ్రీనివాసరావు ముద్రగడపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిటీని వేశాం.. కాపు సమస్యలపై పరిశీలను చేస్తున్నాం.. ఇలాంటి సమయంలో మిగతా వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కాపుల ఓట్లు భారీగా పడ్డాయని, వారి రుణం తీర్చుకుంటామని గంటా అన్నారు. ‘మీరొక కీలు బొమ్మ.. మిమ్మల్ని కొందరు వ్యక్తులు ఆడిస్తున్నారు’ అని గంటా ముద్రగడని విమర్శించారు. ‘కాపులకు నష్టం కలిగించేలా ముద్రగడ ఇటువంటి లెటర్లు రాయకూడదు’ అని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ ముద్రగడపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసమే ముద్రగడ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘మొన్న ఒక లేఖ, ఈరోజు మరో లేఖ రాసి ముద్రగడ రాజకీయాలు చేస్తున్నార’ని ఆయన విమర్శించారు. ముద్రగడ రాసే లేఖలకు స్క్రిప్టు సాక్షి కార్యాలయంలో తయారవుతోందని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలనే ముద్రగడ లేఖ రూపంలో పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ‘ముద్రగడ వెనకున్నది ఎవరో అందరికీ తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. కాపులకు న్యాయం చేయడం ముద్రగడకు ఇష్టం లేదని ఆయన అన్నారు.