ఏరులై పారుతున్న మద్యం.. బహిరంగంగానే పంపిణీ!

రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా.. మందు అంటే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే దొరికేలా చేస్తా. అమ్మల్లారా.. అక్కల్లారా వింటున్నారా.. ఇదీ మీ బిడ్డ జగన్ ఇస్తున్న హామీ. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి చూపిస్తా అంటూ గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పారు. మాట ఇస్తే చేస్తాడంతే అంటూ వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. మాట తప్పడు.. మడమ తిప్పడు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాకా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు. మద్యపాన నిషేధం హామీని మరవడమే కాకుండా కొత్త కొత్త కంపెనీలను తెచ్చి ఏ మాత్రం ప్రామాణికాలు లేకుండా క్వాలిటీలేని మద్యంతో ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా జీవోలు తెచ్చి మద్యాన్నితన ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వైసీపీ నేతలే ఇప్పుడు గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రజల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేసి జేబులు నింపుకుంటున్నారు.  ఇక, ఇప్పుడు అదే నాసిరకం మద్యాన్ని వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉచితంగా పంపిణీ చేస్తూ ఓట్లుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ వై నాట్ 175 అన్న నినాదాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. అంటే  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా గెలుపొందుతామని వైసీపీ ప్రగల్భాలు పలికింది. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలను చూసిన వైసీపీ ఈ నినాదాన్ని పక్కన పెట్టింది. కానీ, కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి పోటీ చేయించాలని భావిస్తున్న జగన్.. ఆయనకు ఆర్ధికంగా కూడా   అండగా ఉంటూ వస్తున్నారు. భరత్ ఏది అడిగితే అది చేసేలా వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్ పవర్ ఇచ్చారు. దీంతో పోలీసు, రెవెన్యూ అంతా భరత్ కనుసన్నల్లోనే మెలిగేలా చేసుకున్నారు. కాగా, ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ గా కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. చంద్రబాబును   అరెస్ట్ చేశారు.  ఇదే ఆదునుగా భావిస్తున్న వైసీపీ కుప్పాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ముందుగా చంద్రబాబు అవినీతిపరుడని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో నియోజకవర్గంలో భారీగా  సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభలకు హాజరయ్యే వారికి సకల ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో సభ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ తమ వైపుకు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు జనాలను బలవంతంగా తరలించి వారికి భారీగా మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు.. సమావేశం అనంతరం సభా ప్రాంగణంలోనే భారీగా మందు పంపిణీ చేయడం విశేషం.  ఈ సభకు వచ్చే మార్గాలలో కూడా వందలాది మందికి బహిరంగంగానే మద్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫోటోలు చూస్తున్న నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన మద్యపాన నిషేధం ఇదేనా అంటూ  ప్రశ్నిస్తున్నారు. జగన్ తెచ్చిన చీప్ లిక్కర్ మద్యంతో ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. మాట తిప్పడు మడమ తిప్పడు అంటూ మైక్ దొరికితే భజన చేసే మంత్రి రోజా తదితరులకు ఈ వీడియోలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. మీరు మంత్రిగా ఉండి కూడా మీ జిల్లాలోనే ఇలా బహిరంగంగా ప్రజలకు ఉచితంగా మద్యం పంపిణీ చేస్తుంటే మీ కళ్ళు మూసుకుపోయాయా అంటూ రోజాను ట్యాగ్ చేస్తూ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. మీరు ఎంతగా ఇలా బజారు కెక్కితే అంతగా నష్టం పెరుగుతుందే తప్ప చంద్రబాబును ఓడించడం మీ తరం కాదంటూ తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాలినేని vs సుబ్బారెడ్డి.. తీగ లాగితే అక్రమాల బాగోతం బయటపడిందా?

బాలినేని శ్రీనివాస రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఈ రెండు పేర్లు చెప్పగానే మనకి గుర్తొచ్చేది సీఎం జగన్ మోహన్ రెడ్డే. ఈ ఇద్దరూ జగన్ కు దగ్గరి బంధువులే.  వైవీ సుబ్బారెడ్డి వైఎస్ జగన్ కు వరసకు చిన్నాన్న కాగా.. బాలినేని బంధువుతో పాటు జగన్ కాంగ్రెస్ తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న రోజులలోనే ఆయనతో నడిచిన వారిలోఒకరు. అందుకే సుబ్బారెడ్డిని జగన్ టీటీడీ చైర్మన్ ను చేస్తే.. బాలినేనికి జగన్ తొలి క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. కాగా సుబ్బారెడ్డికి మరోసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తే.. బాలినేనిని మాత్రం రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి నుండి తప్పించారు. అదే సమయంలో అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కేబినెట్ లో కొనసాగించారు. దీంతో అప్పటి నుండే బాలినేని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వైసీపీలో ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలో రెబల్ గా వాయిస్ వినిపిస్తున్నారు. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. ఆ మధ్య తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో మీడియా ముఖంగా వైసీపీ పెద్దలపై విరుచుకుపడిన బాలినేని.. తన వాళ్లపై సప్సెన్సన్ ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని, పోలీసుల నుండి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికీ తన మాట అంటే లెక్కలేకుండా పోయిందని ఆవేశాన్ని వెళ్లగక్కారు. దీంతో పలుమార్లు వైసీపీ పెద్దలు బుజ్జగించి బాలినేనిని కూల్ చేస్తూ వస్తున్నారు. నిజానికి ఇక్కడ వైసీపీలో బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు కలిసి చేసిన ఓ భూ ఆక్రమణల కుంభకోణం బాలినేని చేతికి చిక్కింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలినేని.. ఈ కుంభకోణంలో ఎంతటి వారున్నా వదలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, పోలీసులు బాలినేనిని లెక్కచేయకుండా సుబ్బారెడ్డికి మద్దతుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలినేని పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు.  ప్రకాశం జిల్లాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అనుచరులు కొందరు నకిలీ పట్టాలు తయారు చేసి భూవివాదాలకు పాల్పడ్డారు. ఈ ముఠా చాలా పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడింది. బాలినేని ఫిర్యాదుతో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. కానీ, ఈ కేసులో పోలీసులు అసలు వారిని వదిలేసి కొసరు వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును తప్పు దోవ పట్టించారని..ఆరోపిస్తూ అందుకు నిరసనగా బాలినేని సెక్యూరిటీని సరెండర్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అధిష్టానం పెద్దలు ఎలాగోలా బాలినేని కూల్ చేశారు. కానీ, అసలు ఈ భూ కుంభకోణం ఏంటి అన్నది మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.   ఒంగోలులో వెలుగు చూసిన ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణం ఒక్క ఒంగోలుకు పరిమితమవలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారసులు దగ్గర్లో లేని ఆస్తులను, ఎలాంటి అండా లేని వృద్ధుల ఆస్తులను, పలుకుబడి లేని వారి ఆస్తుల్ని ముఠా టార్గెట్ చేసి.. అప్పటికప్పుడు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బెదిరింపులకు దిగేవారనీ. త్రుణమో పణమో ఇచ్చింది తీసుకుని తమకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో వారిని మేనేజ్‌ చేయగా.. పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ సివిల్‌ కేసులని దాటవేయడంతో బాధితులు ముఠాకి లొంగిపోయి వారు చెప్పినట్లు తలొగ్గేవారని అంటున్నారు. ఈ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్వవస్థలన్నీ వ్యవస్థీకృతంగా కలిసి ఈ కుంభకోణానికి తెరతీసినట్లు తెలుస్తున్నది. ఇది ఒక్క ఒంగోలులో మాత్రమే కాదని రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కేసును ఏ దర్యాప్తు సంస్థకు ఇచ్చేది లేదని.. తామే ‘లోతు’గా దర్యాప్తు చేస్తామని ఏపీ పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ కుంభకోణం నీరుగారిపోవడం గ్యారంటీ అని టాక్ నడుస్తుంది.

కొట్లాడి తెచ్చిన తెలంగాణ.. కేసీఆర్ ఎమోషన్ పని చేసేనా?

తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన ఘనుడు కల్వకుంట చంద్రశేఖర రావు. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ ప్రజల మనసు లోతులను కొలిచి.. అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న  టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీ. అందుకే ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజలను ఎంతగా తమ వైపుకు తిప్పుకున్నా.. ఒక్కసారి కేసీఆర్ మైక్ అందుకుంటే ప్రజలంతా తన గురించి మాట్లాడుకొనేలా చేసుకోగలరు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగింది ఇదే. ఒకవైపు రాజకీయంగా తన ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బ తీస్తూనే.. ప్రజల నాడీని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రసంగాలు చేస్తూ వచ్చారు.   దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజలను బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్లేవారు. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు విజయవంతంగా అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ క్రమంలో ఆయన  ఆ సమయానికి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఒక అంశాన్ని టేకప్ చేసుకొని అందులోనే సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలచుకునే వారు. గత రెండు ఎన్నికలలో కేసీఆర్ అదే చేశారు. ముఖ్యంగా తెలంగాణ స్వాభిమానం పేరిటే ఇంత వరకూ కేసీఆర్ ఎన్నికల రాజకీయం అంతా నడిచింది. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంటును, ఆంధ్రా నేతల పాలనను తెరమీదకి తెచ్చి.. ఓటర్ల గుండెల్లో అగ్గిపుట్టించే వారు. తెలంగాణ రాష్ట్రం ఊరికే అచ్చిందా .. చావు నోట్లో తలబెట్టి తెచ్చిన.. ఊరికే ఇచ్చిన్రా రాష్ట్రం.. ఆగమాగం జేస్తే ఇచ్చిన్రు. సోయ లేకుండా నిర్ణయాలు తీసుకోకన్రి.. ఇంకా ఈ ఆంధ్రోళ్లు మన నెత్తిన అవసరమా.. ఇంకా మనం ఢిల్లీ ఎళ్లి గులాంగిరి జేయాల్నా.. జెర ఆలోచించుర్రి లాంటి మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునే వారు. ఎన్నికలు ఏవైనా సరే కనీసం ఒక్కసారైనా తెలంగాణ తెచ్చింది నేనే అనే మాట లేకుండా కేసీఆర్ ప్రసంగాలు ఉండవు. ఇక, ఆ పార్టీ నేతలైతే తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ అనే రేంజిలో ఎలివేషన్స్ ఇస్తారు. ఒక ధంగా తెలంగాణ అనే ఎమోషన్ మీదనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గండం నుండి గట్టెక్కుతూ వస్తుంది.  అయితే, ఈసారి ఈ తెలంగాణ ఎమోషన్ కేసీఆర్ ను గెలిపిస్తుందా అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. గత రెండుసార్లు కాంగ్రెస్ పరిస్థితి వేరు.  ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది.  తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.  తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అంటూ బలంగా ప్రజలలోకి చొచ్చుకుపోయింది. చొచ్చుకుపోతోంది. అస‌లు సోనియా ప్రత్యక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న రాజకీయ సంకల్పం తీసుకోకుండా ఉంటే తెలంగాణ వ‌చ్చేదా అంటూ ప్రజల మనసుకు హత్తుకునేలా ప్రశ్నిస్తోంది.  దీంతో తెలంగాణ  ప్రజలలో ఇదే చ‌ర్చ‌నీయాంశంగామారింది.   రెండుసార్లు తెలంగాణ తెచ్చిన వారికి అవకాశం ఇచ్చాం.. ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అసలు ఈ సెంటిమెంటే ఈసారి ఎన్నికలలో ఏ మాత్రం ఉపయోగపడదన్న భావన వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్దం అయ్యింది. అంతే కాకుండా పార్టీ పేరులోని తెలంగాణను కూడా కేసీఆర్ తీసి పారేశారు. అలాగే ఈ పదేళ్లలో ఉద్యమ నేపథ్యం ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా తాను స్వయంగా ముద్ర వేసిన నాయకులను కేసీఆర్ చేరదీశారు. దీంతో తెలంగాణ ఎమోషన్ ను ఈ సారి కేసీఆర్ పండించలేకపోవచ్చునని, అదే సమయంలో ప్రజలలో ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిందేమిటన్న ప్రశ్న బలంగా మెదులుతోందని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు.   దీంతో ఈసారి తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ ఎమోషన్ ను పండించలేరనీ, ఈ సారి ప్రజలు ఇచ్చే తీర్పు కేసీఆర్ పాలనపైనేననీ అంటున్నారు. 

ఏపీలో రోడ్లకు మరొకరు బలి.. పుట్టిన కుమార్తెను కళ్లారా చూడకుండానే కానరాని లోకాలకు!

రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోవాలని.. అందుకు తగిన మార్గర్శకాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఏపీలో రోడ్లకు మహర్దశ రాబోతుందని, రూ.వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రులు మీడియా ముందుకొచ్చి ప్రజలకు వివరించారు.   పోనీలే ఇకనైనా రహదారి కష్టాలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రజలు ఆశపడ్డారు. కానీ, ప్రకటనలకే తప్ప ఆచరణను మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరు. మంత్రులు మళ్ళీ ఆ ఊసే ఎత్తరు.  గత నాలుగేళ్ళరేళ్ళలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇలాంటి ప్రకటనలు రావడం.. ప్రజలు ఆశపడడం.. మన బతుకు ఇంతేలే అని రాజీ పడడం, నిరాశపడటం ప్రజలకు అలవాటైపోయింది.  రాష్ట్రంలో గుంతల రోడ్లతో వాహనదారుల బండ్లు, ఒళ్ళు గుల్లయిపోతున్నాయి. ఏపీలో రోడ్డెక్కితే బండికి ఏది ఎక్కడ ఊడిపోతుందో అర్ధంకాకపోగా.. అసలు రోడ్డు మీదకి వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి క్షేమంగానే వస్తాడా అని ఆ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూసే పరిస్థితులు దాపురించాయి.  వర్షాకాలంలో రోడ్ల మీద గుంతలలో నీరు నిలిచి అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో కూడా అర్ధం కాక ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలే కాదు.. ఆర్టీసీ బస్సులు సైతం రోడ్ల మీద వెళ్తుండగానే చక్రాలు ఊడిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రోడ్లెక్కి నిరసనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా మాట్లాడితే.. వాహన మిత్ర పేరుతో డబ్బులు ఇస్తున్నాం కదా రోడ్లు వేసేందుకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఉల్టా మాట్లాడిన మంత్రులు కూడా ఉన్నారు. దీంతో అసలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు అనే మాటకు తావులేదని జనం కూడా నిర్ధారణకు వచ్చేశారు. ప్రభుతాన్ని, సీఎంను రోడ్డెక్కిన ప్రతిసారి తిట్టుకుంటూనే  గతుకుల రోడ్లపై ఒళ్లు హూనమౌతున్నా, బండ్ల రిపేర్లకు జేబులు ఖాళీ అయిపోతున్నా పట్టించుకోకుండా తిరుగుతూనే ఉన్నారు. అందుకు అలవాటు పడిపోయారు.   కానీ, అన్ని రోజులు మనవే కాదు కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా గుంతల రోడ్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్ల కారణంగా  ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఓ ప్రమాదం మాత్రం మనసులు కలచివేసింది. కన్నులు చెమర్చేలా చేసింది. మనసు వికలమయ్యేలా చేసింది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజని అనే మహిళ   నిండు గర్భిణీ కాగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు లేరు. కుటుంబ సభ్యులు ఆమెను గురజాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ సదుపాయాలు లేవు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అయితే, గర్భిణీ వెళ్లిన రోడ్లన్నీ గుంతల మయమే కావడంతో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. చివరకు అదృష్టం కొద్దీ అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గురజాల ఆసుపత్రి నుండి భార్యను తరలించే సమయంలో నరసారావు పేట ఆసుపత్రిలో కూడా చేర్చుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే ఉద్దేశ్యంతో భర్త ఆనంద్ డబ్బులు తీసుకు రావడానికి వెళ్ళాడు. గురజాల వరకు గర్భిణీకి తోడుగా వచ్చిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని వెళ్ళాడు.  ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొని వస్తుండగా జోలకళ్ళు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు గుంతల్లో బోల్తా పడింది. దీంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు.   స్థానికులు ఆయనను  నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో ఆయన భార్య, అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉన్నారు. కానీ వారిని చూసుకునే భాగ్యం ఆనంద్ కు కలుగలేదు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ కన్నుమూశాడు. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే తండ్రి మృతి చెందడం అందరికీ కన్నీరు తెప్పించింది. దిక్కుమాలిన రోడ్ల కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని ఆనంద్ కుటుంబం విలపిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. ఇది ఒక ఆనంద్ పరిస్థితి మాత్రమే కాదని.. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంలో ప్తి రోజూ ఏదో ఒక కుటుంబంలో ఇలాంటి విషాదం నెలకొనడం పరిపాటిగా మారిందని నెటిజన్లు అంటున్నారు. 

ఏపీలో పనితనం లేదు పగతనం ఉంది.. జగన్‌పై మరోసారి హరీష్ రావు సెటైర్లు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలలో కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క ఏపీలో మాత్రమే కాదు.. ఇప్పుడు తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్ట్ బిగ్ ఇష్యు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణలో ఇది రాజకీయాలను మలుపు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఈ అంశమే తెలంగాణ రాజకీయాలలో కూడా సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయింది. చంద్రబాబు అరెస్టు సమయంలో అన్ని పార్టీల నేతలు స్పందించి ఖండించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టుపై స్పందించి ఖండించారు. బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ స్పందించలేదు  కానీ.. బీఆర్ఎస్ లో మిగతా మంత్రులు ఈ అంశంపై స్పందించి ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలకు వైసీపీ నేతలలో కనీస చలనం  లేదు. బీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి హరీష్ రావు మొదట నుండి చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పు బడుతూనే ఉన్నారు. మూడు వారాల క్రితం స్పందించిన ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండకూడదన్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం ముమ్మాటికీ తప్పే అని.. ఇది పూర్తిగా బీజేపీ, వైసీపీల కుట్ర రాజకీయం అని కూడా విమర్శించారు. తెలంగాణ నేతలు ఈ స్థాయిలో విమర్శిస్తున్నా.. ఏపీ వైసీపీ నేతలు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కాగా, ఇప్పుడు మరోసారి హరీష్ రావు చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసలు పనితనం లేదు.. కేవలం పగతనం మాత్రమే ఉంది అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కేసీఆర్ పగబడితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలులో ఉండేవారని.. కానీ తాము ఎవరి మీదా పగ పట్టమని, అలాగే ఎవరి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఏపీలో కక్ష రాజకీయాలు కనిపిస్తున్నాయని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టడాన్ని ఆయన పగతనంగా చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో పనితనం లేదని..  పగతనం మాత్రమే ఉందని హరీష్ రావు విస్పష్టంగా చెప్పారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ యధాలాపంగా చేశారో.. ముందే అనుకోని చేశారో కానీ.. కేసీఆర్, జగన్ లను ముడిపెట్టి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను కలుపుతూ చేసిన ఈ వ్యాఖలు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐదేళ్ల తమ పాలనలో రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోయామన్న ఆవేదన హరీష్ రావు మాటలలో కనిపిస్తున్నదని కొందరి అంటుంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలాగా తాము రాజకీయాలలో పగను చూడమని, వ్యక్తిగతంగా పగబట్టమనే హరీష్ రావు మాటలకు అర్ధంగా మరికొందరు   భావిస్తున్నారు. అ యితే, అసలు ఇప్పుడు హరీష్ రావు మరోసారి చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే తెలియనిదేమీ కాదు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు సానుభూతిపరుల ఓట్లు బీఆర్ఎస్ కు ఇప్పుడు అవసరం. అందుకే బీఆర్ఎస్ నేతలు వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. పనిలో పనిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని, ఆయన పాలనను వేలెత్తి చూపుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో నిరసనలను కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నది. అడ్డుకుంటున్నది. మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, ఆ తర్వాత అదే కేటీఆర్ చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ చేసిన ట్వీట్ కు స్పందించి సానుభూతి తెలిపారు. ఖమ్మంలో చంద్రబాబు పాలన ప్రస్తావన తెచ్చి కీర్తించారు. అదే దారిలో తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు ప్రస్తావన తెచ్చి ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నేతలు సైతం జగన్ సర్కార్ వైఖరిని తప్పుబడుతున్నా వైసీపీ నేతలు తేలు కుట్టిన దొంగలాగా  మౌనంగా ఉంటున్నారు.

లోకేష్, పవన్ భేటీ.. ఇక బొమ్మ దద్దరిల్లిపోతుంది!

సమయం లేదు మిత్రమా.. ఇక రణమే అంటూ ఎన్నికలకు సిద్దమైపోతున్నాయి ఏపీలో ప్రతిపక్ష పార్టీలు  తెలుగుదేశం,జనసేన. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో  జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తరువాత  ఏపీలో జగన్ ఓటమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.  అప్పటి వరకూ ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాల మధ్య ఊగిసలాడుతున్న తెలుగుదేశం, జనసేనల పొత్తు ఖరారైపోయింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన పవన్ పొత్తు ఉంటుందని పై ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం, జనసేన కలిసే పోటీచేస్తాయని విస్పష్టంగా తేల్చేశారు. దీంతో రెండు పార్టీలలో జోష్ పెరిగింది. త్వరలోనే రెండు పార్టీల నేతలు కలిసి చర్చించి జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటిస్తామని నేతలు చెప్పారు.  ఇప్పటికే రెండు పార్టీల నుండి ఈ కమిటీ కోసం నేతల ఎంపిక కూడా పూర్తయ్యింది. ఇకపై రెండు పార్టీలు కలిసే ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించనున్నారు . పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేసినపుడే త్వరలోనే చంద్రబాబు జైలు నుండి బయటకి వస్తారని, ఆ తర్వాత రెండు పార్టీల నేతల మధ్య చర్చలు ఉంటాయని అనుకున్నారు. కానీ, నలభై రోజులు దాటిపోయినా చంద్రబాబు కేసులో తీర్పు రాలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడడానికి మరి కొన్ని రోజులు.. అంటే కోర్టుల దసరా సెలవుల పూర్తయిన తరువాత వెలువడే అకాశం ఉండటంతో  చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పుడు రెండు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు. ముందుగా రెండు పార్టీల కమిటీలు సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తదుపరి కార్యాచరణపై చర్చించబోతున్నాయి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో జనసేన కమిటీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించబోతున్నారు. ముందుగా నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించబోతున్నట్లు  వార్తలు వచ్చినా.. ఇప్పుడు పవన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నుండి నారా లోకేష్ నాయకత్వం వహించబోతున్నారు. ఇక ఈ భేటీకి ముందు లేదా తర్వాత చంద్ర‌బాబుతో లోకేష్, పవన్ లు ములాఖత్ ద్వారా భేటీ కానున్నట్లు చెబుతున్నారు.   ఒక్కసారి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటన వస్తే.. ఇహ అప్పటి నుంచీ నిత్యం రెండు పార్టీలు ప్రజల మధ్యనే ఉండనున్నాయి. ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్‌ని నవంబరు 1 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం వచ్చే వారం మొత్తం ప్రజల్లోనే ఉండాలని ప్రణాళిక రూపొందించింది. `నిజం గెలవాలి` అంటూ భువనేశ్వరి, `భవిష్యత్ గ్యారెంటీ` ప్రోగ్రామ్‌తో నారా లోకేష్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా, ఈ రెండు కార్యక్రమాలకీ జనసేన నేతలు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చే అవకాశం ఉంది. అలాగే,  నవంబరు మొదటి వారంలో పవన్ తదుపరి విడత వారాహి యాత్ర మొదలు కానుంది. ఈ  యాత్రకి టీడీపీ మద్దతు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఐక్యంగానే కదులుతున్న సంగతి తెలిసిందే. ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగేలా  మొత్తం వ్యవహారాల్ని జాయింట్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు కదలనున్నాయి. మొత్తంగా  రానున్న రోజుల్లో రాష్ట్రం అంతటా  ప్రతిపక్షాల జోరు, దూకుడు కనిపించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఇరు పార్టీల నేతలూ చెబుతున్నారు.  తెలుగుదేశం, జనసేన కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించి  నలభై రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకూ రెండు పార్టీలూ కలిసి చేపట్టిన కార్యక్రమాలు లేవు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు మద్దతు ప్రకటించడం సరే..  ఉమ్మడిగా కలిసి పనిచేసింది లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరగబోయే రెండు పార్టీల భేటీ ఉమ్మడి కార్యాచరణకు నాంది కాబోతున్నది. రాజహేంద్రవరంలో సోమవారం (అక్టోబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్, లోకేష్ ల అధ్యక్షతన ఇరుపార్టీలూ ఉమ్మడిగా తొలిసారి సమావేశం కానున్నాయి. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. ఒక్కసారి ఈ ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే ఇక రాష్ట్రంలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని తెలుగుదేశం, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

పెద్దిరెడ్డి వర్గీయుల అరాచకత్వం!

ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయనని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆయన మంత్రివర్గ సహచరులతో సహా అంతా  మూకుమ్మడిగా మీడియా ముందుకొచ్చి ఏపీలో జగనన్న పాలన సుభీక్షంగా, సంతోషంగా ఉందని  చెప్పుకుంటారు. రామరాజ్యం లాంటి జగనన్న రాజ్యంపై ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురద జల్లుతున్నాయని మాటల దాడికి దిగుతుంటారు. అయితే వాస్తవంగా   ఏపీలో పరిస్థితులు చూస్తే అసలు రాష్ట్రంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మాస్కులు లేవన్న దళిత వైద్యుడి దగ్గర నుండి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తుల వరకూ ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ వేధింపులకు గురి చేశారు. వీరిలో అవమానాలు భరించలేక మరిణించిన వారు కొందరైతే..   వైసీపీ శ్రేణులే దాడులు, చిత్రహింసలకు మరణించిన వారు మరి కొందరు. ప్రశ్నిస్తే దాడులు.. నిరసన తెలిపితే అరెస్టులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి.  ఆ మధ్య జరిగిన పుంగనూరు అల్లర్లు రాష్ట్ర ప్రజలెవరూ ఇంకా మరిచిపోలేదు. ఈ అల్లర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై ఇంకా న్యాయస్థానాలలో విచారణ   కొనసాగుతోంది. నిజానికి ఈ అల్లర్లకు కారణం వైసీపీ నేతలు, కార్యకర్తలే. పక్కా ప్రణాళికతో చంద్రబాబు రాకను అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో రాళ్ళూ, కర్రలతో వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. కానీ, దీన్ని వక్రీకరించి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదలా ఉండగా  ఇప్పుడు అదే పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను అమానుషంగా వేధించి అర్ధనగ్నంగా మాకంయి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మంత్రి పెద్ది రెడ్డి మనుషేలే ఈ దారుణానికి ఒడిగట్టారు.   చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు పలు నిరసన కార్యకమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్ రావు, రమేష్ లు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఈ సైకిల్ యాత్ర తలపెట్టారు. మధ్యలో వచ్చే దేవాలయాల్లో చంద్రబాబు పేరిట పూజలు చేస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అక్టోబర్ 19) వారి సైకిల్ యాత్ర పుంగనూరు చేరుకుంది.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద టీ తాగేందుకు సైకిళ్లు ఆపారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు వారిని చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇది పెద్దిరెడ్డి అడ్డా.. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్ళగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అటువంటిది మీరు టీడీపీ జెండాలతో ఎలా వచ్చార్రా.. అసలు శ్రీకాకుళం నుంచి ఏం పీకేందుకు వచ్చార్రా అంటూ రెచ్చిపోయారు. అంతే కాదు, టీడీపీ జెండాలు, కండువాలు తీయించి, వారితో చొక్కాలు విప్పించి అర్ధనగ్నంగా మార్చి సైకిళ్ళు నెట్టుకుంటూ వెళ్లండని హుకుం జారీ చేసి అక్కడ నుండి పంపించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండగా ఏపీలో పరిస్థితులపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు మనం స్వాతంత్య్ర దేశంలోనే ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడెక్కడో రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్ పరిస్థితులను జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. అవసరం లేకున్నా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులకు ఏపీలో ఇంత జరుగుతున్నా కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది వీడియో రూపంలో బయట పడింది కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉందని.. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1నుంచి జనంలోకి తెలుగుదేశం.. లోకేష్ దిశా నిర్దేశం

నారా చంద్రబాబునాయుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా ప్రజాసేవలోనే ఉన్న నేత. అయినా చంద్రబాబునాయుడు కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయతల మేలుకలయిక అనదగ్గ రాజనీతిజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో దూసుకుపోతున్నారు. ఈ  నాలుగున్నర దశాబ్దాలలో దేశంలో ప్రతి కీలక మలుపులోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి దిగ్గజ నేతను ఏపీలోని జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. 43 రోజులుగా ఆయన  నిర్బంధంలోనే ఉన్నారు. క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లపై కోర్టులలో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ విషపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో  ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి దిశా నిర్దేశం చేస్తూనే చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం అని నినదించారు. జగన్ సర్కార్ అక్రమంగా బనాయించిన స్కిల్ కేసులో నిందితులుగా ప్రభుత్వం పేర్కొన్న వారంతా బెయిలుపై బయటకు వచ్చేశారనీ, కానీ చంద్రబాబు మాత్రం 43 రోజులుగా జైలులో ఉన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కంటనీరు పెట్టుకుంటూనే జగన్ సర్కార్ పై కన్నెర్ర చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ సర్కార్ చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఆవేదన, ఆగ్రహం, ఆవేశం కలగలిసిన స్వరంతో ఆయన పార్టీలో గత 43 రోజులుగా ఉన్న స్థబ్దతను బద్దలు కొట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై జరుపుతున్న న్యాయపోరాటంలో గెలుపు తథ్యమని ఉద్ఘాటించారు. చంద్రబాబు అరెస్టు తరువాత గత 43  రోజులుగా ఆగిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను  వచ్చే నెల 1వ తేదీ నుంచి  రెట్టించిన ఉత్సాహంతో మొదలు  పెట్టాలని పిలుపునిచ్చారు.   చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, విద్యావంతులు ఆయన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆయనకు సంఘీభావం  తెలుపుతూ దేశ  విదేశాల్లో స్వచ్ఛందంగా  ఆందోళనలకు దిగుతున్నారు. ఆ విషయాలన్నీ ప్రస్తావించిన  లోకేష్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ  నేతలకూ, నియోజకవర్గ ఇన్ చార్జీలకూ దిశానిర్దేశం చేశారు. “బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ” కార్యక్రమాన్ని తిరిగి ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. జగన్ సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జగన్ రాష్ట్రంలో  ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనీ, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవలసిసన బాధ్యత తెలుగుదేశం భుజస్కంధాల మీద ఉందని చెప్పారు.   విజిల్ వేస్తే కేసు,  కొవ్వొత్తి పట్టుకుంటే కేసు, గంట కొడితే కేసు  మన చేతులకు మనమే సంకెళ్లు వేసుకున్నా కేసు అంతెందుకు కదిలితే అరెస్టు, మెదిలితే నిర్బంధం అంటూ తెలుగుదేశం నేతలపై, తెలుగుదేశం మద్దతుదారులపై ఇష్టారీతిగా కేసులు నమోదు చేసి భయపెట్టాలని జగన్ సర్కార్ చూస్తోందనీ, అయితే తెలుగుదేశం డిక్షనరీలో భయం అన్న పదానికే చెటులేదని లోకేష్ అన్నారు. తెలుగుదేశం బయోడేటాలో భయం అన్నదేలేదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలతో, అక్రమ కేసులు పెట్టి బాబుని జైలుకు పంపిన జగన్ ఒక సైకో అని, దీనికి కచ్చితంగా రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం సరైన సమాధానం చెప్తుందని, ఈ సైకో ప్రభుత్వం వలన ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసే గ్యారంటీ నాది అంటూ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వారిలో ధైర్యం నింపారు.  ప్రజా వేదికను కూల్చడంతో మొదలు పెట్టిన తన దుష్టపాలన ప్రారంభించిన జగన్ ఈ నాలుగున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్వీర్యం సహా ఎన్నోఎన్నెన్నో దుర్మార్గాలను పాల్పడ్డారనీ,  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ఏకంగా రాష్ట్రాన్నే కూల్చేందుకు సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు. వంద తప్పులతో శిశుపాలుడి పాపం బద్దలైనట్లు.. చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలు పండాయనీ, ఆయనను అరెస్టు చేసి తన గొయ్యి తానే తీసుకున్నారనీ, తన పతనాన్ని తానే లిఖించుకున్నారని లోకేష్ అన్నారు. నాలుగున్నర దశాబ్దాల  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా అంటని బాబుపై నిరాధార ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్టు చేసి జగన్ చేసిన తప్పుకు కచ్చితంగా రానున్న రోజులలో ఫలితం  అనుభవించకతప్పదని హెచ్చరించారు.  రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి,రాజకీయ కక్ష సాధింపులతో ప్రతిపక్ష నేతల పై కేసులు మోపి, “జే” టాక్స్ లతో పెట్టుబడి దారులను భయపెట్టి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేసి,రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన జగన్ ఒక భస్మాసరుడనీ, బాబు అక్రమ అరెస్టుతో జగన్ తన నెత్తిన తానే చేయిపెట్టున్నట్లైందనిలోకేష్ చెప్పారు. 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బిజెపి సస్పెన్షన్ ఎత్తివేత?

 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి రాజాసింగ్ కావడం  గమనార్హం. ఇవ్వాళో, రేపో బిజెపి  మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో తెలంగాణ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ పై గత సంవత్సరం ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆరోపణతో సస్పెన్షన్  అయ్యారు. ఎన్నికల సందర్బంగా బిజెపి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినప్పటికీ రాజాసింగ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాజాసింగ్ హిందుత్వ నినాదంతో దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.తనకు బిజెపి టికెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడనని రాజాసింగ్ ప్రకటించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రాజాసింగ్ నిండు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదే నా చివరి అసెంబ్లీ సమావేశాలు అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ కమెడియన్ మునావర్ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.  రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరగ్రేటం చేశాడు. అతను 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి, 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా గెలిచాడు.  తొలిసారి ఎమ్మెల్యేగా రాజాసింగ్  బిజెపి నుంచి గెలిచారు.2014లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. రెండోసారి అంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీచేసి తెలంగాణ అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి కూడా తానే గెలుస్తానని ఇప్పటికే రాజాసింగ్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారసభలో పేర్కొంటున్నారు. గోషామహల్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీ హేట్స్ జగన్!.. తెలుగుదేశం కొత్త స్లోగన్

ఏపీలో ఎన్నికలకు నిండా ఆరు నెలల సమయం కూడా లేదు. దీంతో ఇప్పటికే  రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోయింది. ఎవరికి వారు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలైతే రకరకాల కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కారక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కోసం తీసుకోచ్చిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని విమరిస్తూ మరోసారి రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి కావాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి మంత్రుల వరకూ.. పూర్తి స్థాయిలో క్యాడర్ ను కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే వైసీపీ పెద్దలు పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే దీనికి కౌంటర్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. త్వరలోనే జనసేన ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లనున్నది.  ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం కూడా  ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.    వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు ఏపీ హేట్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. నాలుగున్నరేళ్ల జగన్ సర్కార్ లో ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, నెరవేరని హామీలను, కక్షపూరిత పాలన, ప్రణాళికలు లేని నిర్ణయాలపై  విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. తాజాగా ఏపీ హేట్స్ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ముక్త కంఠంతో అంటున్నారని  ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, బినామీలు సృష్టించిన కంపెనీల మద్యంతో రాష్ట్రంలో 30 వేల మందిని చంపేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, విద్యుత్‌ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలోని హామీలు జగన్ నెరవేర్చ లేదని, సీపీఎస్‌ రద్దు, ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న జగన్ మాట తప్పారని గుర్తు చేశారు. నిజానికి ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పార్టీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టై 43 రోజులు అయ్యింది. కోర్టులలో వాయిదాల మీద  వాయిదాలు పడుతున్నాయి.  ఆయన ఎప్పుడు బయటకి వస్తారో అర్ధం కావడం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి అక్కడే ఉంటూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా అటు ఢిల్లీలో సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ వ్యవహారాలు, లాయర్లతో భేటీలు చూసుకుంటూ ఢిల్లీ, ఏపీ మధ్య పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారు.  అయినా పార్టీ నేతలు, క్యాడర్ మాత్రం దూకుడుగానే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజలలో యాక్టివిటీ ఉండేలా చేస్తున్నారు. తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.  నిజానికి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే తెలుగుదేశం నీరుగారిపోతుందనీ, అధినేత అరెస్టుతో ఆవేదనతో చేష్టలుడిగి నిస్తేజంగా ఉండిపోతుందని వైసీపీ మరీ ముఖ్యంగా జగన్ భావించారు. అయితే అందుకు భిన్నంగా తెలుగుదేశం రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు, వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో తెగించి మరీ రోడ్డుమీదకు వస్తున్న తీరు అధికార పార్టీ అగ్రనేతలకు మింగుడు పడటంలేదు. తెలుగుదేశం దూకుడుకు బ్రేకులు వేయవచ్చని భావించి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన క్షణం నుంచీ తెలుగుదేశం శ్రేణులు అనూహ్యంగా గతానికి మించి యాక్టివ్ అయ్యాయి. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు.   తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెడుతున్నారు.  అలాగే ఇప్పుడు ఏపీ హేట్స్ జగన్ అంటూ పార్టీ రూపొందించిన కార్యక్రమంతో మరింత ఉత్సాహంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు.  

ప్రజలలో పెల్లుబుకుతున్న ఆక్రోశం.. సైకో ప్రభుత్వ పతనమే ధ్యేయం

ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలపై విపక్షాలు విమర్శించడం సహజమే.  ఆ విమర్శలకు అధికార పార్టీ దానికి కౌంటర్లు ఇవ్వడమూ సాధారణమే.  ఏపీలో  కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అంతకు మించిన విమర్శలు ప్రజల నుంచే వస్తున్నాయి.   సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరిపై రాష్ట్ర ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, ఆయన పాలనను ప్రజలు తూర్పారపడుతున్నారు.  జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మంత్రులు మాట్లాడే ప్రతి మాటపై విపక్షాల కంటే ముందే ప్రజలు కౌంటర్లు ఇస్తున్నారు. మండిపడుతున్నారు. అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజా వేదిక కూల్చివేత, రాజధాని అమరావతి నిర్వీర్యం, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ ఒక్కో అంశాన్ని గుర్తు చేసుకొని మరీ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఉపాధి, ఆరోగ్యంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుతున్నారు. తమ తమ శాఖల పనితీరు, ఆయా శాఖలలో సాధించిన పురోగతి  తదితర అంశాలపై  మీడియా సమావేశం నిర్వహించాల్సిన మంత్రులు.. ప్రతిపక్ష నేతలపై దూషణల కోసం మాత్రమే మైకుల ముందుకు వస్తున్నారు. శాఖల వారీ సమీక్షల విషయమే మరచిపోయారు.  రాష్ట్రంలో పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ ప్రతినిధులు కులాల గురించి, ప్రతిపక్షాల పొత్తుల గురించి, ప్రతిపక్ష పార్టీలలో అంతర్గత విషయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఎవరైనా.. ఎంతటి వారినైనా సభ్యత, సంస్కారం అన్న మాటే తెలియదన్నట్లు అనుచితంగా దూషణలకు దిగుతూ తమ దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నారు. నేతల కుటుంబాలు, మహిళలు అని కూడా లేకుండా వేధిస్తున్నారు. కనీస ఆధారాలు కూడా లేకుండా కేసులు పెట్టడం, విమర్శలు చేయడం.. వివరణ అడిగితే వ్యతిగత జీవితాలపై విమర్శలు చేయడం ఇదే వైసీపీ నేతల తీరుగా మారిపోయింది. వైసీపీ  పాలన,  వైసీపీ నేతల తీరుతో విసుగెత్తిన జనం తిరగబడుతున్నారు. అతి సామాన్య ప్రజలు కూడా ఆగ్రహంతో   బయటకి వస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే తమపై అక్రమ కేసులు పెడతారని.. వేధించి హింసిస్తారనీ తెలిసినా ప్రజలు వెనకడుగు వేయడం లేదు. ఒక్కో అంశంపై.. ఒక్కో వైసీపీ నేతను పేరుపేరునా కడిగిపారేస్తున్నారు. అలాంటి వీడియో  ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీమతి వరలక్ష్మి. రాజధాని 29 గ్రామాల్లో ఒకటైన మందడం గ్రామానికి చెందిన ఈమె ఓ సాధారణ గృహిణి. కేవలం  రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 4 సెంట్లలో రేకులతో నిర్మించిన చిన్న ఇల్లు ఈమె కుటుంబ యావదాస్తి. అయితే, ఆమె కుటుంబానికి ఉన్న రెండెకరాలను ఆంధ్రుల ప్రజా రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చేశారు. కానీ రాజధానిపై నీలినీడలు కమ్ముకోవడంతో సర్వం కోల్పోయి చట్ట ప్రకారం రావాల్సిన కౌలు రాక భవిష్యత్ కారు చీకటిగా మారి అంతులేని వేదనతో  బతుకీడుస్తున్నారు. కష్టాలు చుట్టుముట్టినా ఆమెలో చైతన్యం అణగారిపోలేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తేందుకు భయం అడ్డు రాలేదు.   ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి ఆమె మాటలకు తడుముకోలేదు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ  తీసుకున్న ఒక్కో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, పాల్పడిన అక్రమాలను ఒకదాని తరువాత ఒకటిగా గుక్క తిప్పకోకుండా కడిగి పారేశారు.   మాస్కులు లేకుండా కరోనా వైద్యం ఎలా చేయాలని ప్రశ్నించిన దళిత వైద్యుడినే అక్రమ కేసులు పెట్టి చంపేసిన ప్రభుత్వం.. అంటూ ఆమె జగన్ సర్కార్ ను దుమ్మెత్తి పోసింది. ఇలాంటి సాధారణ గృహిణి ఇంతలా విమర్శిస్తే ఊరికే ఉంటారా. ఆమె బాధను వెళ్లగక్కిన పుణ్యానికి ఆమెపై అక్షరాల ఇరవై మూడు క్రిమినల్ కేసులు బనాయించింది జగన్ సర్కార్. రాక్షస కాండపై రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కును అహింసా మార్గంలో గొంతెత్తినందుకు ఆమెకు 23 క్రిమినల్ కేసులు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఒక సాధారణ మహిళ, తన ఆక్రందనను వెక్కగక్కుతూ గుక్క తిప్పుకోకుండా వైసీపీ నేతలను చీల్చి చెండాడిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తమ బాధ కూడా ఆమె మాటలలో కనిపిస్తున్నదని, మా మనసులలోని ఆవేదన ఆమె నుండి ఆక్రందనగా బయటకి వచ్చినట్లుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఒక్క వరలక్ష్మి ఆవేదన మాత్రమే కాదని.. రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకొనే ప్రతి పౌరుడి మనసులో మాటలేనంటూ ఆమెకి మద్దతు తెలుపుతున్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై అనుచిత వ్యాఖ్యలు.. వెగటు పుట్టిస్తున్న వైసీపీ తీరు!

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తర్వాత జరుగతున్న సంఘటనలు గమనిస్తే చంద్రబాబును వీలైనంత ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్నదే  వైసీపీ  లక్ష్యంగా కనిపిస్తున్నది. అందుకే  చంద్రబాబు ప్రమేయమే లేని స్కిల్  కేసులో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా ఒకదాని తరువాత ఒకటిగా అక్రమ కేసులను తెరమీదకు తెచ్చి.. పీటీ వారెంట్లతో హడావుడి  చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేమన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆయన ప్రజలలో తిరిగే అవకాశం లేకుండా చేయాలన్న దుష్టతలంపుతోనే అక్రమంగా అరెస్టు చేయించారని అంటున్నారు.  అయితే అక్రమ అరెస్టుతో కూడా ఏ మాత్రం ధైర్యం కోల్పోని చంద్రబాబు.. తనపై కేసు అక్రమమనీ, దానిని కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి  చంద్రబాబునాయుడిని ఏపీ  సీఐడీ అరెస్టు చేసిన కేసులో ఆయన క్వాష్ కాకుండా బెయిలు పిటిషన్ దాఖలు చేసి ఉంటే ఒకటి రెండు రోజులలో బయటకు వచ్చేసే వారు. కానీ.. జగన్ సర్కార్ దుష్ట తలంపును అర్ధం చేసుకున్న ఆయన ఒక కేసులో బెయిలు పొందగానే మరో కేసు.. ఆ తరువాత ఇంకో కేసు అంటూ వేధిస్తారని, అసలు ఆ  కేసులలో పస లేదనీ, కేవలం రాజకీయ వేధింపులేనని తేల్చేసేందుకే సిద్ధపడ్డారు.   న్యాయస్థానాలలో  విజయం సాధించి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసునని అందుకే ఆయన కోర్టులలో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా నిబ్బరంగా ఉన్నారని అంటున్నారు.  అయితే రాజమహేంద్రవరం జైలులో పరిస్థితులు, జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబుకు జైలులో ఏదైనా హాని తలపెడతారన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. ఆయన విపరీతమైన ఉక్కపోతకు గురై డీహైడ్రేషన్ కు గురైన సందర్భంలోనూ, ఉక్కపోత కారణంగా అ లర్జీ వచ్చి అనారోగ్యానికి గురైనా సరైన వైద్య సహాయం అందించకపోవడం వంటి సంఘటనలతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుకు హాని తలపెట్టాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా జైలులో ఉండగా అనారోగ్యానికి గురైతే.. ఆసుపత్రికి తరలించడం కద్దు. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం జైలు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించకుండా జైలుకే ప్రభుత్వ వైద్యులను రప్పించడం, అలాగే ఆయనకు చేసిన పరీక్షలు, చికిత్స, అందించిన మందుల విషయాలను గోప్యంగా ఉంచడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.   సొంత బాబాయ్  వివేకా హత్య కేసులో  కేసులో సొంత కుటుంబ సభ్యులే జగన్ వైపు  వేలెత్తి చూపడం, కన్నతండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి పదివి కోసం ఆయన చేసిన ‘సంతకాల’ ప్రయత్నం, రాజకీయంగా తల్లీ, చెల్లి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు గుర్తు చేస్తూ..  అధికారం కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడని జగన్ రెడ్డి, ఇప్పుడు అదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసం  చంద్రబాబుకు  హాని తలపెట్టినా తలపెడతారన్న అనుమానాలు సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు,  చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల, కొందరు మంత్రులు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలను గమనిస్తే.. ఆ అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు.   చంద్రబాబు  5 కిలోలు బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే,ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై ఇంత వరకూ  కనీసం స్పందించని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ  విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికలపై విశ్వాసం లేకపోవడంతో  చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్’ను పిలిపించుకుని చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగితెలుసు కున్నారు.అలాగే, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్’ను  చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకుంటే..  పార్లమెంట్ -20 సమావేశం సందర్భంగా  ప్రధాని మోదీ  తెలుగుదేశం ఎంపీ కనకమేడలను చంద్రబాబు ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఇలా చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంటే ఒక్క వైసీపీ నాయకులు మాత్రం మానవత్వాన్ని మరిచి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరుగు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే,   ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల  మాత్రం చంద్రబాబు జైల్లో బరువు తగ్గలేదు సరికదా ఒక కిలో బరువు పెరిగారని  వ్యంగ్య వ్యాఖ్యలు చేసశారు.  చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందంటూ చౌకబారు ఆరోపణలు, అడ్డగోలు  వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల వయసున్న నాయకుడి ఆరోగ్యంపైనా అవహేళనగా మాట్లాడి తమ తీరు ఎంత నేలబారుగా ఉంటుందో మరో  సారి రుజువు చేసుకున్నారు.   చంద్రబాబుకు వయసు రీత్యానే కాదు, 35 సంవత్సరాలకు పైగా ఉన్న చర్మ ఆరోగ్య  సమస్య రీత్యా ప్రత్యేక  వైద్యం, ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఆరోగ్య అవసరాల దృష్ట్యా చల్లటి వాతావరణం (ఏసీ) లో ఉండటం అవసరం. జైల్లో ఆ సదుపాయం లేదు. కోర్టు ఆదేశించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ సౌకర్యం కల్పించారనుకోండి అది వేరే విషయం.  అయితే స్కిన్‌ అలర్జీతో ప్రాణాలు పోతాయా? వంటి దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతల పట్ల ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. హెల్త్ బులిటిన్ విడుదల చేయాలన్న డిమాండ్ పైనా సజ్జల చేసిన నీచమైన వ్యాఖ్యల  పట్ల సర్వత్రా ఏహ్యత వ్యక్తం అవుతున్నది.  అధికార దర్పంతో సభ్యత, సంస్కారం మరిచి వ్యవహరించే నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నది చరిత్ర పదే పదే రుజువు చేస్తున్న సత్యం.  అధికార  మదంతో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ ఏజీపై చర్యలకు గవర్నర్ ఆదేశం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో ఏపీ సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిన విషయం.. ఆ తరువాత  విచారణ, రిమాండ్ ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ బాబు జరుపుతున్న న్యాయపోరాటం  అందరికీ తెలిసిందే. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అలాగే సైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ కేసులో తీర్పు వెలువరించిన తరువాతనే మిగిలిన విషయాలను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టం చేసింది.  ఒక వేళ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తే చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయన్నది న్యాయనిపుణుల విశ్లేషణ. అలాగే   క్వాష్ పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టులోబాబు తరఫు న్యాయవాదుల వాదనలే ఎఫెక్టివ్ గా ఉన్నాయనీ, ఈ కేసులో జగన్ సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ.. వాయిదాల కోసమే వాదిస్తున్నారన్న అభిప్రాయం కూడా న్యాయనిపుణులలో వ్యక్తం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ కేసులను ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పర్యవేక్షిస్తున్నారు,  ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులలో వాదిస్తున్నారు. అయితే కేవలం ఉద్యోగ ధర్మానికి పరిమితం కాకుండా వారు ఒకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారనీ, ఊరూరా తిరిగి  మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ కేసుల గురించి మాట్లాడుతున్నారనీ వారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మీడియా సమావేశాలలో కోర్టులలో విచారణలో ఉన్న కేసులలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఒక్క ఆయనే కాదు.. ఇంకా లోకేష్ సహా పలువురిని కూడా అరెస్టు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా ఈ కేసులలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తదితరుల అవినీతికి సంబంధించి   బలమైన సాక్ష్యాధారాలున్నాయని వారు మీడియాకు చెప్పారు.  తాము చట్టప్రకారమే ముందుకు సాగుతున్నామని  రాజకీయ కక్ష సాధింపు సరికాదంటూ రాజకీయ ప్రసంగాలు చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టి జగన్‌ ప్రభుత్వం ఈ అక్రమకేసులు బనాయించి తమపై ఏవిదంగా రాజకీయ కక్షలకు పాల్పడుతోందో వివరించడంతో  జగన్‌ ప్రభుత్వం తరఫున ఏపీసీఐడీ చీఫ్ సజయ్, అడిషనల్ ఏజీ పొన్నవోలు ఢిల్లీ వెళ్లి కౌంటర్లు ఇచ్చి వచ్చారు.  అయితే నారా లోకేష్‌   జాతీయ మీడియా ముందు జగన్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోందని  చెప్పడం.. మూడు కోర్టులలో ఈ కేసుల విచారణ కొనసాగుతున్నప్పుడు, వాటిని పర్యవేక్షిస్తున్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, వాదిస్తున్న పొన్నవోలు   ప్రెస్‌మీట్‌ పెట్టి కేసులపై మాట్లాడడాన్ని ఒకే గాటన చూడలేం.  కోర్టులు కేసులను విచారిస్తునప్పుడు వాటిని ప్రభావితం చేసేవిధంగా ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ అడ్వకేట్ జనగర్ మీడియాకు చెప్పడం చట్టప్రకారం నేరం అవుతుంది. వారి ఉద్యోగ ధర్మాన్ని ఉల్లంగించడమే ఔతుంది. ఇదే విషయంపై ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు  ఏపీ యునైటడ్ ఫోరం ఫర్ కాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు ఎన్‌. సత్యనారాయణ గవర్నర్‌కు  ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని   రాష్ట్ర హోమ్ కార్యదర్శిని ఆదేశించారు.   గతంలో తెలంగాణలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మరీ వివరాలు వెల్లడించారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి, కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను మందలించింది. కోర్టుకు మాత్రమే తెలియజేయాల్సిన వివరాలు సీఎంకు ఎలా తెలిశాయని నిలదీసింది. అంతే కాకుండా కేసునే రద్దు చేసింది. చంద్రబాబు స్కిల్ కేసులో కూడా ఏపీసీఐడీ, అడిషనల్ ఏజీ కోర్టుకు తెలియజేయాల్సిన విషయాలను మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ బహిరంగంగా వెల్లడిస్తుండటం కూడా ఆ కోవలోకే వస్తుంది. దీనిపైనే గవర్నర్ వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఏపీ హెోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.  

బెడిసి కొట్టిన ఆర్జీవీ వ్యూహం!

ఏం చేసినా చూస్తూ ఊరుకునేందుకు ఇదేమీ ఆటవిక రాజ్యం కాదు కదా. ఎలాంటి మహారాజులనైనా చీల్చి చెండాడే రాజ్యాంగం అమలయ్యే దేశం కదా.. కాస్త ఆలస్యమైనా విపరీత ధోరణికి కళ్లెం పడాల్సిందే.  నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అందరూ చూస్తూ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. అసలే తలబిరుసు ఎక్కువాయె.. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇంతకీ దేని గురించి ఇదంతా అనుకుంటున్నారా? అదే టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ గురించి.. ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా గురించి. దీనిని సినిమా అనే కన్నా.. ఎన్నికలే లక్ష్యంగా  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హీరోగా చిత్రీకరించేలా తెరకెక్కించిన ఓ కంప్లీట్  ప్రచారం చిత్రం అని చెప్పొచ్చు. విడుదల కూడా కాకుండా మీరెలా చెప్తారని అంటారేమో.. ఏకంగా సినిమా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ తానే స్వయంగా ఈ విషయం చెప్పారు.  ఔను.. నాకు జగన్ మోహన్ రెడ్డి హీరోలాగానే కనిపిస్తారు.. కనుకే ఆయన్ని ఈ సినిమాలో హీరోలా చూపించానని ఓపెన్ గానే చెప్పారు ఆర్జీవీ. జగన్ హీరో అంటే మిగతా ఆయన రాజకీయ ప్రత్యర్థులంతా విలన్లే కదా. అందుకే ఇష్టం వచ్చినట్లుగా జగన్ ప్రత్యర్థులందరినీ ఘోరాతి ఘోరంగా చూపించారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లలోనే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆయన సినిమాకు బ్రేకులు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. .  జగన్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వర్మ అండ్ కో ఇప్పటికే ప్రకటించారు. అయితే, వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరుతున్నారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. వర్మ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయ నేతలందరినీ తక్కువ చేసి చూపించడమే కాకుండా.. వారంతా కుట్రలు పన్నే నేతలుగా చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు.  వ్యూహం సినిమా విడుదలైతే తెలంగాణ ఓటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపించిన నట్టి కుమార్.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహం సినిమా విడుదల సరి కాదని పేర్కొన్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్న తెలంగాణలోతెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయని.. ఆ పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలను ఈ సినిమాలో తప్పుగా చూపించారన్న విషయం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ల ద్వారానూ, స్వయంగా ఆర్జీవీ మాటల ద్వారానూ అర్దం అవుతోందని పేర్కొన్న నట్టి కుమార్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విడుదల వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అక్రమంగా అరెస్టై జైలులో ఉండగా.. ఆయన పాత్ర డూప్ ద్వారా వస్తున్న ఈ చిత్రం విడుదల చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయనీ, ఈ సమయంలో వ్యూహం సినిమా విడుదలైతే అల్లర్లు జరిగే అవకాశాలు మండుగా ఉన్నాయనీ నట్టి కుమార్   ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ సినిమాలో పాత్రలన్నీ యధాతధంగానే చిత్రీకరించారు. ఒక్క జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీలను తప్ప మిగతా అందరినీ కుట్రదారులుగా చూపించారు. పైగా రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో వాస్తవాలను వక్రీకరించి తమకు కావాల్సినట్లుగా తెరకెక్కించారు. జగన్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పాత్రలను ఎక్కడా సినిమాలో లేకుండా ఇది సంపూర్ణంగా జగన్ కోసమే.. జగన్ కు అనుకూలంగా ఉండేలా.. జగన్ ను ఓ ఆదర్శ నాయకుడిలా చూపించే ప్రయత్నంగానే కనిపిస్తున్నందునే  నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు.  

బాబుకు సజ్జల సలహా బూమరాంగ్.. ముందు జగన్ జైలుకెళ్లాలంటున్న నెటిజన్లు!

సజ్జల రామకృష్ణా రెడ్డి.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి. ఈయన  ఇటీవల మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అవినీతి పరుడు. అందుకే జైలుకు వెళ్లారు. ఒక వేళ ఆయన అవినీతికి పాల్పడి ఉండకపోతే ఆయన జైలుకు ఎందుకు వెడతారు? తన నిర్దోషిత్వాన్ని జైల్లో  ఉండే విచారణను ఎదుర్కొని ఎందుకు రుజువు చేసుకోకుండా క్వాష్ పిటిషన్ వేస్తారు అని ప్రశ్నలు సంధించారు. అంతే కాదు.. జైల్లో ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై సైతం సెటైర్లు వేసి జనంలో పలుచన అయ్యారు. అయితే అవన్నీ  పక్కన పెడితే ఇప్పుడు సజ్జల చేసిన వ్యాఖ్యలే  వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి. ఆయన వ్యాఖ్యలు  బూమరాంగ్ అయ్యాయన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. వైసీపీ నేతలు కూడా జగన్ ను సజ్జల వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయని అంటున్నారు.  ఎందుకంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కనుకనే అరెస్టయ్యారు. తన నిజాయితీని నిరూపించుకోవలసిన బాధ్యత  ఆయన మీద ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు సూటిగా జగన్ అక్రమ  కేసులలో 16 నెలలు జైలులో ఉన్న సంగతిని  గుర్తు చేశాయి. ఇప్పుడు ఆ మాటలనే తెలుగుదేశం  నాయకులు ప్రస్తావిస్తూ  జగన్ అవినీతికి పాల్పడ్డాడు కనుకనే  16 నెలలు జైలుకు వెళ్లారని సజ్జల అంగీకరించేశారుగా అంటున్నారు. జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారే  ఆ మాటలు చెప్పిన  తరువాత ఒక్క క్షణం కూడా  సీఎంగా  ఉండే అర్హత జగన్ కు లేదని అంటున్నారు. ఆయన తక్షణమే జైలుకు వెళ్లి.. తన నిజాయితీని  నిరూపించుకున్న తరువాత బయటకు  రావాలని అంటున్నారు. ఇక  నెటిజనులు అయితే సజ్జల వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఒక వేలు చంద్రబాబువైపు చూపే ముందు మూడు వేళ్లు జగన్ వైపు చూపుతున్నాయని గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు.  స్కిల్ కేసు అంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ చేసినవన్నీ ఆరోపణలేననీ, అదే జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు జరిగిందనీ, మనీ ట్రయల్ జరిగిందన్న ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థలు చూపాయని గుర్తు చేస్తున్నారు.   పదేళ్లుగా బెయిల్‌పైనే ఎందుకు తిరుగుతున్నారని నెటిజనులు నిలదీస్తున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని జడ్జి నమ్మినందుకే, ఆయనకు రిమాండ్‌ విధించారన్న సజ్జల మాటలు నిజమైతే… జగన్‌ కూడా అవినీతికి పాల్పడ్డారని కోర్టు నమ్మినందుకే, ఆయనను 16 నెలలపాటు రిమాండ్‌లో ఉంచిందా అని నిలదీస్తున్నారు.  జగన్‌పై 38 కేసులుంటే.. దానిపై కోర్టులో 54 డిశ్చార్జి పిటిషన్లు వేశారు. 158 స్టే పిటిషన్లు వేశారు. మరి సజ్జల చెప్పినట్లు జగన్‌ కూడా నిర్దోషి అయితే, ఇన్నేసి పిటిషన్లు వేయడం ఎందుకు జైల్లో ఉండి తాను నిర్దోషినని రుజువుచేసుకుని, తుది తీర్పు వచ్చిన తర్వాత పులుకడి గిన ముత్యం మాదిరిగా బయటకు రావచ్చు కదా?  అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్య సలహాదారు అయి ఉండీ ఆ సలహా జగన్ కు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు.   పనిలో పనిగా జగన్ కేసులకు సంబంధించిన వివరాలు అన్నీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.  ఇంతకూ కోర్టులో తాను నిర్దోషినని రుజువుచేసుకోవాలన్న సజ్జల సలహా  చంద్రబాబుకు ఇచ్చినట్లా, లేక జగన్ కు ఇచ్చినట్లా అని ప్రశ్నిస్తున్నారు.  పదేళ్లుగా జనం బెయిలుపై ఉన్నారన్న సంగతి కొద్ది మందిని మినహాయిస్తే జనం పెద్దగా గుర్తుంచుకున్నట్లు కనిపించదు. ఆయన పాలనా వైఫల్యాలపైనే జనాగ్రహం ఉంది. ఆయనపై కేసులు, ఆయన బెయిలపై పదేళ్లుగా విచారణకు హాజరుకాకుండా ఉన్నారన్న విషయం జనానికి పెద్దగా గుర్తు లేదనే భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్య సలహాదారు విపక్ష నేతకు ఇచ్చిన  అమూల్యమైన సలహాల కారణంగా జనం జగన్ కేసులు, బెయిలు విషయాన్ని గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలను అంతర్జాలంలో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు జగన్ ముఖ్యసలహాదారు ఆ విషయాలన్నిటినీ గుర్తు చేసి జగన్ ను మరో సారి జనం ముందు దోషిగా నిలబెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణలోనూ బీజేపీకి జనసేన రాంరాం.. తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు?!

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ విధానాలేంటి, వ్యూహాలేంటి అన్న విషయంలో ఆ పార్టీకి చందిన రాష్ట్ర నాయకులకే అవగతం కావడం లేదు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ఒక బలపైన విపక్షం జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీని పట్టించుకోకుండా.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార పార్టీకి అన్ని  విధాలుగా అండదండలు అందిస్తూ.. రాష్ట్రంలో తనకున్న కొద్ది పాటి బలాన్ని కూడా చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చేసి కలిసి వస్తే రండి లేకుంటే పొండి అంటూ బంతిని బీజేపీ కోర్టులో పడేసింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అసలే స్టేక్ లేని బీజేపీకి గత ఎన్నికలలో వచ్చిన ఒక  శాతం ఓటు కూడా అనుమానమే అని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న వైసీపీకి తమ పార్ట హైకమాండ్ అండదండగా నిలిచి తమను పలుచన చేస్తున్నదో అవగతం కాలేదంటూ ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చే స్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అక్కడ అధికారమే తరువాయి అన్నంతగా బలపడిన పార్టీని చేజేతులా మళ్లీ మొదటికి అంటే సింగిల్ డిజట్ స్థాయికి దిగజారడానికి  కారణం కూడా అధిష్థానమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద దక్షిణాదిలో బలపడాలంటే పార్టీని క్షేత్ర స్థాయి నుంచీ బలోపేతం చేయాలన్న ప్రాథమిక  సూత్రాన్ని విస్మరించిన బీజేపీ అగ్రనాయకులు.. ఆయా రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీలను అంటే బలహీనం చేస్తే చాలన్న ఎత్తుగడతో వెళ్లి మొదటికే మోసం వచ్చేలా వ్యవహరించారని  పరిశీలకులు అంటున్నారు.  ఏపీలో అధికార పార్టీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు  అందించి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో  బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీన  పరచాలన్న బీజేపీ వ్యూహం  బెడిసికొట్టిందని అంటున్నారు. ఏపీలో  మిత్ర పక్షంగా  ఉన్న జనసేన కూడా ప్రజాభిప్రాయానికి  తలొగ్గి బీజేపీతో మైత్రి ఉన్నా లేకపోయినా ప్రజాభీష్టం ఎలా ఉంటే అలా నడుచుకోవాలని నిర్ణయించుకోవడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం తీరే కారణమని  విశ్లేషిస్తున్నారు. సరే ఏపీలో అలా ఉంటే.. ఇక తెలంగాణలో అధికారమే తరువాయి  అన్న  స్థితి  నుంచి  అన్నినియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి పార్టీ  దిగజారడానికి  కూడా బీజేపీ హైకమాండ్ తీరే కారణమని అంటున్నారు. తీరా ఎన్నికల  ముంగిటకు వచ్చిన తరువాతైనా ఇక్కడ  కలిసి  వచ్చే పార్టీలను కలుపుకుని పోవడానికి బదులు బరిలో నిలవవద్దంటూ వాటిపై ఒత్తిడి తీసుకువచ్చి  పెద్దన్న  పాత్ర  పోషించి అజమాయిషీ చేయాలని చూడటం కూడా వికటిస్తోందని అంటున్నారు. తెలంగాణలో 36స్థానాలలో పోటీకి జనసేన నిర్ణయించింది. ఆ  మేరకు అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయిన స్థితిలో బీజేపీ రంగ ప్రవేశం చేసి జనసేనతతో తన మైత్రికి చూపుతూ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి మద్దతు ఇవ్వాలంటూ చేసిన  ప్రతిపాదన బూమరాంగ్ అయ్యింది. తెగదెంపులు చేసుకోవడానికైనా రెడీ కానీ పోటీకి దూరంగా  ఉండే ప్రశక్తే లేదని  జనసేనాని  బీజేపీకి తేల్చి చెప్పేశారని  ఆ పార్టీ శ్రేణులు  చెబుతున్నాయి.  ఏపీలో తన తీరుతో జనసేనను  దూరం  చేసుకున్న బీజేపీ  తెలంగాణలో కూడా అదే అపరిపక్వ  తీరుతో ఆ పార్టీకి  దూరం అవుతోందని  అంటున్నారు.   ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్నాం  కనుక బీజేపీతో కలిసి  తెలంగాణ ఎన్నికలలో ముందుకు సాగడమే బాగుంటుందని అన్న  జనసేనానికి  వ్యాఖ్యలను స్వాగతించాల్సింది  పోయి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ఆయనకు  బీజేపీ అధిష్ఠానం ఒక ప్రతిపాదన పంపిందని  అంటున్నారు. ఆ ప్రతిపాదన ప్రకారం  ఎన్డీయే మిత్ర  పక్షంగా  జనసేన తెలంగాణ ఎన్నికలలో  అభ్యర్థులను  రంగంలోకి దింపకుండా  బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పని చేయాలి. అయితే  ఈ  ప్రతిపాదనను జనసేన  నిర్ద్వంద్వంగా తిరస్కరించారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ  ఎన్నికలలో  కూడా  పోటీకి  దూరంగా  ఉండి జనసేన చేసిన త్యాగాన్ని బీజేపీ ఇసుమంతైనా గుర్తించలేదనీ, పైపెచ్చు   ఏరు  దాటాకా అన్న సామెతలా  తెలంగాణలో ఎవరి  పొత్తూ లేకుండా ఒంటరిగానే అధికారంలోకి వస్తామంటూ   ప్రకటనలు గుప్పించి మిత్ర ధర్మాన్ని  విస్మరించిందనీ జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.   అంతే కాకుండా సొంత బలం లేని బీజేపీ తమను  పోటీ చేయకుండా మద్దతుకే పరిమితం అవ్వాలంటూ  ఒత్తిడి  చేయడం హాస్యాస్పదమంటున్నాయి. ఇక బీజేపీలో సీనియర్లు కూడా అధిష్థానం తీరు పట్ల అభ్యంతరం  వ్యక్తం  చేస్తున్నారు.  రాష్ట్రంలో త్రిముఖ పోటీ నేపథ్యంలో..  జనసేనతో కలసి పోటీ చేయడమే మంచిదని అంటున్నారు.    ఇక పోతే బీజేపీ ప్రతిపాదనతో తీవ్ర ఆగ్రహానికి  గురైన జనసేనాని తెలుగుదేశంతో కలిసి  తెలంగాణ ఎన్నికలలో పోటీలోకి దిగే విషయాన్ని  తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే జనసేన తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్ని నిర్ణయం తీసేసుకుంది సమయం మించి  పోయిన కారణంగా  ఆ పొత్తును తెలంగాణలో కూడా కొనసాగించే విషయంలో తెలుగుదేశం, జనసేనలు నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే జనసేన 36 స్థానాలలో అభ్యర్థులను నిలపాలని నిర్ణయించింది. తెలుగుదేశం  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను  నిలిపేందుకు నిర్ణయించినప్పటికీ.. చంద్రబాబు  అరెస్టు  తదననంతర పరిణామాల నేపథ్యంలో  ఎన్నిస్థానాలలో పోటీ  అన్న విషయంలో  ఒక  క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే  రాజమహేంద్రవరం  వెళ్లి   తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ఆ తరువాత రాష్ట్రంలో 86స్థానాలలో తెలుగుదేశం పోటీ  చేస్తుందని ప్రకటించారు. ఏయే  స్థానాలలో అన్న త్వరలో ప్రకటిస్తామనీ, ఈ లోగా  జనసేనానితో కూడా  చర్చించి  కలిసిఎన్నికలు వెళ్లే విషయమై చర్చిస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో  కూడా  తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని కలిసే  ఎన్నికలకు వెళ్లే అవకాశాలు  మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారుప తెలుగుదేశం, జనసేన కలిసి  ఎన్నికలకు  వెడితే ఈ  కూటమి అభ్యర్థులు  రాష్ట్రంలోని 119 స్థనాలలోనూ  పోటీ  చేసే అవకాశం ఉంటుందని  అంటున్నారు. అదే  జరిగితే ఈ కూటమి రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు.