హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో  నిందితుడికి పదేళ్ల శిక్ష ఖరారు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు మరో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ కు శిక్ష పడింది. ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఈ కేసులో శిక్ష పడిన వారి సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేయగా, నలుగురికి ఇదివరకే శిక్ష పడింది.  సయ్యద్ మక్బూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై అతడిని 2013 ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. పాకిస్థాన్, భారత్ లోని ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులతో అతడు క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతూ కుట్రలో భాగమయ్యాడని ఎన్ఐఏ తన చార్జిషీటులో పేర్కొంది. 2012లో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ 11 మందితో కూడిన గ్యాంగ్.. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చింది.

రాయలసీమ నుండి పవన్ కళ్యాణ్ పోటీ.. నియోజకవర్గం ఏదో తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు? అటు జనసైనికులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న ఇదే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలలోని భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.   ప్రత్యర్ధులు ప్రతిసారి ఇదే విషయంపై ఎద్దేవా చేస్తుంటారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎక్కడ నుండి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ మరోసారి భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ ఉత్తర లేదా   ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, అటు కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుండి కూడా పోటీ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు.  రాయలసీమలోని తిరుపతి, అనంతపురంలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.   అయితే, ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుండి బరిలో దిగనున్న నేపథ్యంలో తిరుపతి పవన్ కళ్యాణ్ కోసం కేటాయించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. పవన్ కళ్యాణ్ ఒకే అంటే అనంతపురం నుండి పోటీ చేసేందుకు తెలుగుదేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇక్కడ  తెలుగుదేశం  నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కోసం అనంతపురం పేరు వినిపించడం వెనక బలమైన కారణం లేకపోలేదు. ఇక్కడ ఉన్న సామజిక వర్గాల బలాబలాల నేపథ్యంలోనే పవన్ ఇక్కడ పోటీ చేస్తే గెలుపు ఖాయమవడంతో పాటు రాయలసీమలో బలం పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అనంతపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కమ్మ, బలిజ సామాజిక వర్గ ప్రజలు అధికంగా ఉంటారు. దాదాపుగా ఇక్కడ 70 వేల ఓటర్ల వరకూ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారని అంచనా. ప్రస్తుతం వీరంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. అయితే, గతంలో ప్రజారాజ్యం వైపు  ఈ సామాజివర్గాల ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు వెళ్లారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత మళ్ళీ వీరంతా తెలుగుదేశం వైపు పోలరైజ్ అయ్యారు. గత ఎన్నికల్లో కొంతమేర జనసేనకు సైతం మద్దతు తెలిపారు. అయితే, ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ అనంతపురం నుంచి బరిలో దిగితే విజయం సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. పవన్ ఇక్కడ నిలబడితే రాయలసీమలో సైతం ప్రభావం చూపగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే, నిజానికి ఇంతవరకు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం ఏంటన్నదానిపై స్పష్టత లేదు. పవన్ నుండి కానీ, జనసేన వర్గాల నుండి కూడా ఎలాంటి ప్రకటనలు లేవు. కానీ  ఇప్పుడు పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయనున్నారనే కథనాలు వస్తుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది. చంద్రబాబు రాయలసీమ నుండి కుప్పంలో పోటీ చేయనుండగా.. లోకేష్ కోస్తాంధ్ర నుండి మంగళగిరిలో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే బావుంటుందన్న భావన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై   ప్రకటన చేయాలని జనసైనికులు కోరుతున్నారు. అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గాల మాదిరిగా.. పవన్ సైతం శాశ్వతమైన ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. మరి పవన్ ఈసారి ఎక్కడ నుండి పోటీకి దిగనున్నారో చూడాల్సి ఉంది.

తెలంగాణ టీడీపీ అభ్యర్థులు ఫైనల్?

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. వచ్చే వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే తెలంగాణలో టీడీపీ తప్పించి.. మిగిలిన పార్టీలన్నీ అంటే.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ వగైరా వగైర పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను విడతల వారీగా ప్రకటిస్తు వస్తున్నాయి.  మరోవైపు ప్రచారంలో ఆయా పార్టీలు తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాయి. కానీ టీడీపీ మాత్రం.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అనే ఓ సందేహం అయితే ఆ పార్టీ శ్రేణులు కొట్టుమిట్టాడుతోన్నాయి. అదీకాక ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని.. దీంతో ఆ పార్టీ శ్రేణులన్నీ నోటాకే ఓటు వేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చినట్లు ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో హోరెత్తి పోతుంది. ఈ ప్రచారాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ఖండించడమే కాకుండా దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వేళ తెలుగు తమ్ముళ్లకు తీపి కబురు అందనున్నట్లు తెలుస్తోంది.  అదేమంటే.. రానున్న తెలంగాణ ఎన్నికల్లో 89 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యిందన్న కబురు.  ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహ అభ్యర్థుల ఎంపికపై గట్టి కసరత్తు చేసి.. అందులో 189 మంది అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను తయారు చేసి..  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి ఇప్పటికే తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు  తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం చంద్రబాబు తీసుకోవలసి ఉంది.   రాజమండ్రి సెంట్రల్ జైల్లో  చంద్రబాబు నాయుడుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ఆ ములాఖత్ లో తెలంగాణలో తెలుగుదేశం పోటీపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  కాగా శుక్రవారం (అక్టోబర్ 27) ఈ ములాఖత్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  ఇక రాష్ట్రంలో మిగిలిన 30 నియోజకవర్గాలను పక్కన పెట్టినట్లు ఓ ప్రచారం అయితే కొన.. సాగుతోంది. సదరు ఈ నియోజకవర్గాలు.. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని స్థానాలతోపాటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్నా మొత్తం 89 స్థానాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరు లేదా ఇద్దరు.. అలాగే ముగ్గురు వరకు ఆశావాహులుగా ఉన్నారని.. ఆ క్రమంలో వారి సంఖ్య 189 మందికి చేరినట్లు సమాచారం.   చంద్రబాబుతో కాసాని జ్జానేశ్వర్ ములాఖత్ తర్వాత... అభ్యర్థులు జాబితాకు తుది రూపు ఇచ్చి.. రెండు మూడు రోజులలో జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంకోవైపు తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని  బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా.. ఎలాగైనా కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని కాంగ్రెస్, బీజేపీలు   తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అలాంటి వేళ తెలుగుదేశం పార్టీ సైతం రంగంలోకి దిగితే.. ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్నదనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.  ఇక తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్.. నవంబర్ 3వ తేదీన విడుదల చేయనుంది. ఆ రోజు నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. దీంతో డిసెంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. దాంతో తెలంగాణలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టేది ఆ రోజే తెలిపోనున్నది. ఏది ఏమైనా పోటీలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మాత్రం అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నారు. 

చంద్రబాబు ఆరోగ్యంతో జైలు అధికారుల చెలగాటం!

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్నది.  జైలు అధికారులు వాస్తవాలను దాచిపెట్టి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇచ్చిన నివేదికలు మార్చి ప్రకటిస్తుండటంతో అసలు వాస్తవంగా చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.  చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అంతా బాగానే ఉందంటూ విడుదల చేసిన హెల్త్ బులిటిన్, అదే ప్రభుత్వ వైద్యులు వారు జైలు అధికారులకు అందించిన నివేదికనే   నారా భువనేశ్వరికి సైతంఆయన భార్య నారా భువనేశ్వరికి అందించారు. అయితే ప్రభుత్వ వైద్యులు వైద్యులు ఇచ్చిన నివేదిక కాకుండా దానిని మార్చి చంద్రబాబు ఆరోగ్యం బాగుందంటూ బెలిటెన్ ను విడుదల చేయడం దిగ్భ్రాంతి కొలుపుతోంది. ఇలా తప్పుడు వివరాలతో  చంద్రబాబు హెల్త్ బులిటిన్ ను జైలు అధికారులు విడుదల చేసినట్లు వెల్లడి కావడంతో సర్వత్రా బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.   చంద్రబాబు చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. బుధవారం అంటే అక్టోబర్ 25వ తేదీ ఉదయం ఆయన్ని పరీక్షించిన ఐదుగురు వైద్యుల బృందం జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు.  గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చంద్రబాబు వైద్య పరీక్షల నివేదికను నారా భువనేశ్వరికి జైలు అధికారులు పంపడంతో జైలు అధికారులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఉద్దేశపూర్వకంగా గోప్యత పాటిస్తున్నారని తేటతెల్లమైంది.   స్కిన్ అలర్జీతో కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు శరీరంపై దద్దుర్లు వ్యాపించి ఇబ్బంది పడడంతో.. మందులు వాడకంతోపాటు చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సిఫార్స్ చేయడంతో.. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఉండే గదికి ఏసీని అమర్చారిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒంటిపై దద్దుర్లు తగ్గలేదని తాజా నివేదికలో వెల్లడైంది. ఇక చంద్రబాబు చెప్పిన.. వైద్యులు గుర్తించిన అంశాలపై బయట వైద్యులను సంప్రదిస్తే.. చంద్రబాబుకు.. విరోచనం సాఫీగా కాకపోవడం, ఇబ్బంది పడడం, నడుం కింద భాగంలో నొప్పి కి కారణాలు తెలుసుకోవాలంటే ప్రాక్టోస్కోపీ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు ఆయనకు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు జైల్లో ఆయన్ని పరీక్షించిన వైద్యులు కొన్ని వైద్య పరీక్షలను సిఫార్సు చేశారు. అలాగే పూర్తి రక్త పరీక్ష, కిడ్నీ, లివర్ పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్ రే, 2డి ఎకో పరీక్షలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జైల్లో చంద్రబాబుకు వైద్యుడు కంటిపరీక్ష నిర్వహించగా.. ఆయన కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని సూచించారు. ఇప్పటికే అంటే.. గతంలో ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. మరో కంటికి కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యుడు తెలిపారనీ, అయితే ఆ విషయాన్ని నివేదికలో పేర్కొనవద్దంటూ   సదరు వైద్యుడిపై జైలు అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఓ ప్రచారం జరుగుతోంది.  అయితే చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందంటూ జైలు అధికారులు  హెల్త్ బులెటిన్ రూపంలో విడుదల చేసిన నివేదికకు.. తాజాగా నారా భువనేశ్వరికి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన నివేదికకు  వ్యత్యాసం ఉందని.. ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్యం అంతా బాగానే ఉందంటూ ఇస్తున్న నివేదికపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. అలాగే ఆయన కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుడు సూచిస్తే.. ఆ విషయాన్ని బహిర్గతం చేయవద్దంటూ ఆయనపై ఒత్తిడి ఎందుకు తీసుకు వచ్చినట్లు అనే పార్టీ శ్రేణులే కాదు, జనం సైతం ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచి.. తప్పుడు హెల్త్ బులిటిన్ విడుదల చేసి.. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న కుట్రకోణంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు కనుక.. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయకుండా ఆయన ఆరోగ్యం బాగుందంటూ తప్పు సమాచారంతో హెల్త్ బులిటిన్ విడుదల చేసిన జైలు అధికారులపై హై కోర్టు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

నిన్ను వ‌ద‌ల కేసీఆర్‌ వదల.. వెంటాడుతున్న కాళేశ్వ‌రం అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టు మీద, దాని డిజైన్ మీదా తొలి నంచీ అనుమానాలు  వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ అనుమానాలు బలపరిచిన తొలి ఘటన 2022 వరదలు. గోదావరి నదికి భారీగా వచ్చిన నాటి  వరదలకు ఆ ప్రాజెక్టు పంపు హౌజులు మునిగిపోయాయి.   మేడిగడ్డ దగ్గర కూడా పంపు హౌస్ కూడా మునిగింది. పంపు హౌస్ గోడ కూలింది. వీటిని తిరిగి పని చేసేలా చేయడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టింది. అంతేకాదు, కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది.  ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఫిల్లర్లు కుంగిన సంఘటనతో  అనుమానాలన్నీ వాస్తవమేనా అన్న సందేహాలు వెల్లువెత్తుతుున్నాయి. కేసీఆర్ కూడా ఇలా ఎందుకు జరిగింది?  బరాజ్ ఎందుకు కుంగిందంటూ  బాగా టెన్షన్ ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. ఎందుకంటే  పిల్లర్ కుంగిపోవటం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎప్పుడైతే బ్యారేజి పిల్లర్ కుంగిందో, వెంటనే బ్యారెజీ కూడా కుంగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. .  కారణమేదైనా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగటం ఈ ఎన్నికల్లో బిగ్ ఇష్యూగా మారిందనడంలో సందేహం లేదు.   బ్యారేజి నిర్మాణంలో కేసీయార్ భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.  ప్రతిపక్షాల ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలో కేసీఆర్ కు, బీఆర్ఎస్  కు అర్ధంకావటంలేదు. కాంక్రీట్ స్ట్రక్చర్ లో లోపం కారణంగానే బ్యారేజి పిల్లర్ కుంగిందని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయాణ ప్రకటించారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే అతి పెద్ద లోపం ఉందని.. అక్కడ డిజైన్ తేడా ఉంద‌ని,  నిపుణులు చెబుతూనే ఉన్నారు.  అతి వేగంగా నిర్మించి.. క్వాలిటీని పట్టించుకోలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.  ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన పాయింట్ ఏమిటంటే....  ఇరిగేషన్ శాఖ కూడా కేసీఆరే నిర్వహిస్తున్నారు. ఎప్పుడో, దశాబ్దాల కిందట కట్టిన బ్యారేజులు, ప్రాజెక్టులు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ పట్టుమని ఐదేళ్లు కాకుండానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో కేసీఆర్‌కు అర్థం కావడం లేదంటున్నారు. విష‌యం ఏమిటంటే...  ఉత్తర తెలంగాణకు ప్రాణహిత నీరు అందాలంటే మేడిగడ్డే ఆధారం. అలా మేడిగడ్డ నుంచి నీటిని గోదావరిలో వెనక్కు తోడాలి.   కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు నిలువ ఉంచే పరిస్థితే లేదంటున్నారు సాగునీటి నిపుణులు. ప్రస్తుతానికి ఉన్న నీరంతా ఖాళీ చేసేశారు. దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి కానీ, ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడ నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు. అంటే మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికే గండి పడే అవకాశం ఉంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాగానే ఇరుక్కున్నారు. ఎందుకంటే.... 1) మేడిగడ్డ బరాజ్,  కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది?   20వ నంబర్ దిమ్మ  20వ తేదీ, అదే శనివారం రాత్రి నుంచే కుంగడం ప్రారంభమైంది.  ప్రస్తుతం అక్కడంతా రహస్యంగా ఉంది. మీడియాను అటు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గతంలో కాళేశ్వరం పంప్ హౌసులు మునిగినప్పుడు కూడా మీడియాను అనుమతించలేదు. రహస్యంగానే ఉంచారు. ఈ దారుణానికి కార‌ణం నిర్మాణంలో.... నాణ్యతా లోపమే అంటున్నారు తెలంగాణ ఇంజినీర్ల ఫోరం కన్వీనర్ దొంతి లక్ష్మీ నారాయణ.  కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగింది. ఫౌండేషన్ సరిగా చేయలేదు. అందులో లోపం ఉంది. దానివల్ల కొంత కాలంగా కొంచెం కొంచెం ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూపోయి ఇప్పుడు కుంగింది. రాతి పునాది వేరు. ఇది ఇసుక పునాది. ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఉదాహరణకు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాది అయినప్పటికీ బలంగా ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది’’   ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నదీ మట్టంలోని ఇసుకను వదులు లేకుండా చేయాలనీ కానీ మేడిగడ్డ విషయంలో ఆ ప్రక్రియ సక్రమంగా జరగలేదనీ నిపుణులు చెప్తున్నారు.  ‘‘సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది. ఇక్కడ ఎంత మేర దెబ్బతిన్నది అన్నది తెలియాల్సి ఉంది. అప్పుడే మరమ్మతు సాధ్యపడుతుందా, సాధ్యమపేటట్లైతే ఏలా మరమ్మతు చేయాలి వంటివి తెలుస్తాయి. అని  దొంతి లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రస్తుతం ఆ బరాజ్‌ నిర్మాణం చేసిన తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లు, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలోని ఇంజినీర్లు, ఆ బరాజ్‌ కట్టిన కాంట్రాక్టు కంపెనీ ఇంజినీర్లు అంతా ఏం జరిగిందో సమగ్రంగా తెలుసుకునే పనిలో ఉన్నారు. కానీ వారికి నీరు అడ్డంకిగా మారింది. ఎందుకంటే, ఘటన జరిగే సమయానికి ప్రాజెక్టు నిండుగా ఉంది. ఆ నీటిని కిందకి వదిలేసినప్పటికీ, పై నుంచి ఇంకా నీరు వస్తోంది. దాన్ని కూడా కిందకు వదిలేస్తున్నారు. సరిగ్గా గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తరువాత మేడిగడ్డ బారేజీ ఉంటుంది. అందుకని నీటి ప్రవాహం ఎక్కువ ఉంది. అయితే, నిర్మాణ లోపాలు లేవని ప్రాజెక్టు నిర్మించిన సంస్థ చెబుతోంది. ‘‘వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మించాం. భారీ శబ్దం తరువాత ఇది జరిగింది. దీనిపై డిజైన్ టీమ్, ఇంజినీరింగ్ టీమ్ పరిశీలించింది. నీటి మట్టం తగ్గాకే ఏం జరిగిందో తెలుస్తుంది. బరాజ్‌కి ఏం జరిగినా ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుంది. ప్రజలకూ, వాతావరణానికీ ఎటువంటి హానీ కలగనివ్వబోం. డిజైన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణం మేం చేశాం. అంటూ  ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేశ్ కుమార్ చెప్పారు. బరాజ్‌ కుంగిన ప్రాంతాన్ని ఎల్ అండ్ టీ  పరిశీలించింది.  పూర్తి బాధ్యత వారిదే. అని బరాజ్‌ చీఫ్ ఇంజినీర్  వెంకటేశ్వర్లు చెప్పారు.  1. కొత్త బరాజ్‌ ప్రారంభమై నాలుగేళ్లే అయింది. అప్పుడే ఎందుకు దెబ్బతింది? నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా? మరమ్మత్తులు చేయగలరా? చేయడానికి ఎంత అవుతుంది, ఎంత కాలం పడుతుంది? 2. ఈ బరాజ్‌కి మరమ్మత్తులు పూర్తయి మళ్లీ నీటిని నిల్వ చేసే వరకూ రైతుల పరిస్థితి ఏంటి? వారు పంటల విషయంలో ఈ నీటిని నమ్ముకుని వెళ్లవచ్చా? 3. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ తప్పు ఎవరిదో తేల్చి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? 4. జరిగిన ఆర్థిక నష్టానికి బాధ్యత ఎవరిది? 5. మిగిలిన బరాజ్‌ల పటిష్టత మాటేంటి. ఎందుకంటే వరదల సమయంలో ఇటువంటి ఘటన జరిగితే కింద అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంటుంది ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వమే స‌మాధానం చెప్పాలి.  సాగునీటి శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది.

కాంగ్రెస్ ఏడో గ్యారంటీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్రం!

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి  కాంగ్రెస్‌  మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలిచింది. వరుసగా ఏడు సర్వేల్లో ఆరు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే విజయావకాశాలున్నట్లు ప్రకటించాయి. సిక్స్ గ్యారెంటీస్ తో ప్రజల్లో ఇప్పటికే చర్చనీయాంశమై ఆ పార్టీకి మరో కొత్త గ్యారెంటీ తోడయ్యింది. ఇప్పుడు ఈ హామీలకు మరోటి చేర్చినట్టు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.  ఒక దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ మూడింటినీ తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము ప్రకటించిన ఆరు హామీలకు తోడుగా దీనిని ఏడో హామీగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని చాటిచెప్పేందుకే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరినట్టు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ తరచూ ముఖ్యమంత్రులను మార్చుతుందన్న విమర్శలపైనా రేవంత్ స్పందించారు. పార్టీలో ప్రస్తుతం అలాంటి వైఖరి లేదని, అది గతించిన విషయమని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వాలను వదులుకుంటుంది తప్ప పార్టీలోని అసమ్మతి గొంతులకు అధిష్ఠానం తలొగ్గబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌, కర్ణాటకను ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలన్న జ్యోతిరాదిత్య సింధియా ఒత్తిడి చేస్తే ఆయననే వదులుకొందని, అంతకుముందు కర్ణాటకలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని వదులుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. పార్టీలోని వివిధ వర్గాలు సీఎం పదవిని ఆశించడం తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు.

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగి‘రేసు’

కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో డీలా పడ్డ బీజేపీ.. రెండు పార్టీలనూ మరింతగా ఇబ్బందులకు గురి చేసేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త  సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు సహజకవచకుండలాలుగా అంతా  చెప్పే అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల నుంచి బయటపడేశారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ సమష్టిగా ఐక్యంగా  కదులుతున్న తరుణంలోనే  ప్రత్యర్థి  పార్టీలకు కాంగ్రెస్ జాడ్యం అంటుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా  చెప్పుకునే బీజేపీపరిస్థితి తెలంగాణలో అత్యంత దయనీయంగా మారిపోయింది. బీజేపీలో నేతల సంఖ్యతో సమానంగా అసంతృప్తుల సంఖ్య కూడా ఉందని అంటున్నారు. ఇతర పార్టీలనుంచి వచ్చి బీజేపీ గూటికి చేరిన వారు సహజంగానే ఆ పార్టీలో ఉక్కపోతకు గురౌతుంటారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా  బీజేపీని వెనుక నుంచి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటుంది. దీంతో వేరే భావజాలంతో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసం కమలం గూటికి చేరినా అక్కడ ఇమడ లేని పరిస్థితులు ఉంటాయి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం తొలి నుంచీ పార్టీలో ఉన్నవారే ఉక్కపోతకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అలాగే  ఈ తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీలో తొలి నుంచీ ఉన్నవారి కంటే బయట నుంచి వచ్చి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న వారి సంఖే ఎక్కువ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వెనుక కూడా ఈ బయట నుంచి వచ్చి చేరిన వారి ప్రమేయమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నాటికి బలమైన నేతలతో బీజేపీ నిండిపోతుందన్న పరిశీలకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే వారిని నిలువరించడం ఎలా అని కమలం నేతలు తలలు బద్దలు కొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఇక మరో వైపు బీఆర్ఎస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి ఇతర పార్టీలను ఖాళీ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అనుసరించిన విధానమే ఇప్పుడు ఆ పార్టీని కకావికలం చేస్తోందని అంటున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో అధినేత మాటే శాసనం అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ లో విధేయత కంటే ధిక్కారమే ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ లో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా  ఐక్యత కనిపిస్తున్నది. సీనియర్ల మంటూ తమ భుజాలను తామే చరుచుకునే కాంగ్రెస్ వృద్ధ నేతల అసమ్మతి గళాలనూ, అసమ్మతి రాగాలనూ పార్టీ శ్రేణులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వారూ మిన్నకుండక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమాయత్తం కోసం బీజేపీ, బీఆర్ఎస్ ను కసరత్తులు చేస్తుంన్నాయి. ఆ పార్టీ నేతలకు వలసల బెడద కంటిమీద  కునుకు లేకుండా చేస్తుంటే.. అటువంటి ఇబ్బందులన్నిటినీ అధిగమించిన కాంగ్రెస్ మాత్రం వజయం కోసం వ్యూహాలను రచించుకుంటూ.. వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. 

అక్కడ ఈటల.. ఇక్కడ రేవంత్.. కేసీఆర్ కు ఇక చుక్కలేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సారి తాను పోటీ చేయనున్న రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీనే ఎదుర్కోనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గజ్వేల్ లో ఏ ప్రతిబంధకాలు కనిపించాయో.. నియోజకవర్గ ప్రజల కోరిక అంటూ ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా ఉన్న కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియా తానేనని చెప్పుకునే ఆయన ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆ  దిశగా ఆయన వచ్చే ఎన్నికల కోసం రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తుగడలు మాత్రం అంతగా  ఫలిస్తున్నట్లుగా కనిపించదు. స్వయంగా తానే సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి సిద్ధపడటం ఆయనలోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నదని పరిశీలకులుఅంటున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా తాను నిలబడతానని చాలా చాలా ముందుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అలా ఈటల ప్రకటించిన క్షణం నుంచీ గజ్వేల్ లో  కేసీఆర్ విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈటల తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ తో అడుగులు వేసిన వ్యక్తే. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనకు తన  సొంత నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలి విడతలో ఆయన మంత్రిపదవి దక్కలేదు. మలివిడతలో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.  ఆ శాఖ మంత్రిగా కరోనా సమయంలో ఆయన పని తీరును ప్రజలు మెచ్చారు. కానీ.. ఆయన ముక్కుసూటి తనం, మంత్రి కేటీఆర్ కు  సీఎం పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు జోరుగా వచ్చిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఆగ్రహం కలిగించాయి. ఫలితం భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. పార్టీనుంచీ బయటకు పంపారు. ఆ సమయంలో ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈటల  కాంగ్రెస్ గూటికి చేరుతారని పరిశీలకులు భావించినా.. అప్పటికి రాష్ట్రంలో  కాంగ్రెస్ బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) కు పోటీ ఇచ్చే  స్థాయిలో లేదన్న కారణంతో ఆయన తన బీజేపీ గూటికి చేరారు. తన శాసన  సభ్యత్వానికి రాజీనామా  చేసి మరీ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ   అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈటలను ఓడించేందుకు కేసీఆర్ చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. మంత్రులను, సీనియర్లనూ అందరినీ హుజూరాబాద్ లో మోహరించి దాదాపు ఓ యుద్ధమే  చేశారు. అయితే అవన్నీ నిష్ఫలమై ఈటల  భారీ  మెజారిటీతో విజయం సాధించారు. దీంతో సహజంగానే  ఈటల  కేసీఆర్  ప్రత్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధపడటం, బీజేపీ  హైకమాండ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  కేసీఆర్ ముందు జాగ్రత్త పడ్డారనీ, గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి రెడీ అయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడా ఆయనకు స్థిమితం లేకుండా చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ కు బలమైన ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి బరిలోకి దింపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ కు కాంగ్రెస్ హై కమాండ్ సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ముందుగా రేవంత్ కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని భావించినప్పటికీ  కాంగ్రెస్ హై కమాండ్ సూచన మేరకు కామారెడ్డి నుంచి  రంగంలోకి దిగుతున్నారు.  దీంతో కేసీఆర్ పోటీ  చేయనున్న రెండు నియోజకవర్గాలలోనూ  ఆయన గట్టి  పోటీని  ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కామారెడ్డి నుంచి ఇప్పటికే షబ్బీర్ అలీ అభ్యర్థిగా ప్రచారం  చేసుకుంటున్నప్పటికీ అధిష్ఠానం  ఆయనను మరో స్థానం  నుంచి  పోటీ చేయించడం కానీ, పార్టీ బాధ్యతలు అప్పగించడం  కానీ  చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   కామారెడ్డిలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది.  గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్  మెజారిటీ 5వేల ఓట్లు  మాత్రమే.  గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్  వర్కౌట్ అయినప్పటికీ కామారెడ్డి నుంచి  గంపగోవర్ధన్ స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కారు. ఈ  సారి  తెలంగాణ  సెంటిమెంట్  పెద్దగా  కనిపించకపోవడం, అలాగే  ప్రభుత్వ  వ్యతిరేకత అధికంగా ఉండటంతో  రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. కేసీఆర్ కు ఇబ్బందులు  తప్పవనీ పరిశీలకులు అంచనా  వేస్తున్నారు. అందుకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా కాదని  రేవంత్ ను అక్కడ  నుంచి పోటీకి  దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని అంటున్నారు. రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచీ కూడా పోటీ చేయనున్నారు. పరిశీలకుల విశ్లేషణ మేరకు కొడంగల్ లో ఈ సారి రేవంత్ విజయం నల్లేరు మీద బండి నడకే. కామారెడ్డిలో ఆయన పోటీ చేయడం ద్వారా కేసీఆర్ వంటి నేత.. ఆ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు.  ఒక వేళ కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ విజయం సాధిస్తే.. ఇక రాష్ట్ర పార్టీలో ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించేందుకు అసమ్మతి వాదులు ధైర్యం చేయలేరనీ పరిశీలకులు అంటున్నారు. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.  మొత్తం మీద గజ్వల్ లో ఈటల నుంచీ, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నుంచీ కేసీఆర్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు.  ఈ పరిస్థితి కచ్చితంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రచారంపై పడుతుందనీ, ఇతర నియోజకవర్గాలపై కేసీఆర్ పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితి ఉంటుందనీ, ఆయన పూర్తిగా ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పింఛన్ కు ఓటర్ ఐడీ కార్డుకూ లింకేంటి?

జగన్ సర్కార్ మరో సారి అధికారంలోకి రావడానికి లబ్ధిదారులను బెదరించడానికి రెడీ అయ్యిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాలలో  వేల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేయించడమే కాకుండా, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ విషయంపై ఈసీ దృష్టి పెట్టింది. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయంలో అక్రమార్కులకు సహకరించిన అధికారులపై వేటు కూడా వేసింది. జనం తన ప్రభుత్వాన్ని వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారని నిర్ధారణకు వచ్చేసిన వైసీపీ దొంగదారిలోనైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం చేతిలో ఉన్న అధికారాన్ని ఏ స్థాయికైనా దుర్వినియోగం చేయడానికి వెనుకాడటం లేదు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు పై ఈసీ దృష్టి పెట్టడంతో ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడకు తెరలేపింది. ఈ సారి సంక్షేప పథకాల లబ్ధిదారులను బెదరించడమే లక్ష్యంగా కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు. అందులోనూ ముఖ్యంగా సామాజిక భద్రత పించన్ లబ్ధిదారులను టార్గెట్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఐదారు నెలల సమయం ఉన్న ఈ తరుణంలో సామాజిక పించన్ లబ్ధిదారుల అర్హతకు ఓటరు ఐడీ కార్డుకూ లింకు పెట్టారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏదైనా సంక్షేమ పథకం లబ్ధిదారుల అర్హతకు ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకోవాలి. దానితో పాటు నివాస ధృవీకరణ కోసం ఇప్పటి వరకూ ఆధార్ సరిపోయేది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఓటర్ కార్డు, లేదా పాస్ పోర్టును తప్పని సరి చేసింది. అయితే ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నది. అసలు ఓటరు కార్డు, పాస్ పోర్టులకూ సామాజిక భద్రత పించన్ల అర్హతకు లింకేమిటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఒక వేళ ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే దానిని జీవో రూపంలో విడుదల చేయాలి. కానీ అలా చేయడం లేదు. కేవలం సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని అందిస్తున్నది. ఇక్కడే పించన్ల లబ్ధికి వైసీపీకే ఓటు వేయాలన్న నిబంధనను అనధికారికంగా తీసుకువచ్చినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తుదారుల వయసు, చిరునామా ధ్రువీకరించేందుకు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తూనే..  ఓటర్‌ ఐడీ లేదా పాస్‌పోర్టును తప్పనిసరి చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారాన్నిపంపింది. ఎన్నికలకు మరో ఐదారు నెలల గడువు మాత్రమే ఉన్న తరుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  పింఛను లబ్ధి పేరుతో ప్రభుత్వం దరఖాస్తుదారుల ఓటరు ఐడీ నంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఉరుము లేని పిడుగులా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తెరచాటుగా పోర్టల్‌లో మార్పులు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓటరు ఐడీ సేకరణ ద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడం, లేదా పింఛను అందదని బెదరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నాలుగున్నరేళ్లుగా లేని  ఓటరు ఐడీ  నిబంధనను జగన్ సర్కార్ ఇప్పుడే, ఎన్నికల ముందే ఎందుకు  తీసుకువచ్చిందని విపక్షాలు నిలదీస్తున్నాయి.    

అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి

అమెరికాలో  మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా  జరిపిన కాల్పుల్లో కనీసం 22 మంది మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.  భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి  ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఈ ఘటన జరిగిందని  లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడు పరారయ్యాడని ఆ ప్రకటనలో పేర్కొంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుడి చేతిలో ఆయుధాలు ఉండటంతో అతడు మరోసారి కాల్పులకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళేన వ్యక్తం అవుతున్నది. ఈ  నేపథ్యంలో ఎమర్జెన్సీ  అలర్ట్ జారీ చేశారు. 

భువనేశ్వరిపై హద్దూ పద్దూ లేని రోజా విమర్శలు!?

విధ్వంసానికీ.. నిర్మాణాత్మకతకు తేడా స్పష్టంగా తెలిసిపోయింది. జగన్ సర్కార్ మాత్రమే కాదు.. ఆయన నాయకత్వంలోని పార్టీ, ఆయన కేబినెట్ సహచరులు అందరిదీ ఒకే మైండ్ సెట్.. ఆత్మస్థుతి.. పరనింద. స్పష్టంగా కనిపిస్తున్న సొంత తప్పిదాలను పట్టించుకోకుండా, కనీసం ఆ తప్పులను సరిచేసుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా వాటిని ఎత్తి చూపిన వారిపై మాటల దాడికి పాల్పడటంలో అధికార పార్టీ, జగన్ ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని చెప్పవచ్చు. రాజకీయాలలో  కనీస విలువలకు కూడా తిలోదకాలిచ్చిన జగన్ సర్కార్, ఆయన పార్టీ నేతలు తప్పులు చేస్తాం? ఎత్తి  చూపిస్తే వ్యక్తిగతంగా దూషణలకు దిగుతాం  అన్నట్లు వ్యవహరిస్తున్నది. తన భర్త, తెలుగుదేశం అధినేత   నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఆయన అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజలలోకి వెడుతున్న నారా భువనేశ్వరిపై తమకు మాత్రమే ప్రత్యేకం అనదగ్గ  అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వెగటుపుట్టిస్తున్నాయి. వైసీపీలో ఇటువంటి  అనుచిత  వ్యాఖ్యలు చేయడానికీ, అడ్డగోలు  విమర్శలకూ ఒక ప్రత్యేక బ్యాచ్ ఉంది. తాడేపల్లి  ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడం ఆలస్యం ఈ బ్యాచ్ మైకుల ముందుకు వచ్చేస్తుంది.  ఇప్పుడు కూడా అదే  జరిగింది. తెలుగుదేశం అధినేత నారా భువనేశ్వరి చంద్రగిరి సభలో ప్రసంగానికి అనూహ్య స్పందన రావడం ఆలస్యం జగన్ పార్టీ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలతో, అడ్డగోలు విమర్శలతో రంగంలోకి దిగిపోయింది. తమ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారు అన్న విషయం వాళ్లకు పట్టదు. తమ అధినేతకు నచ్చితే చాలు అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. అందులోనూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటంలో ముందుండే మాజీ మంత్రి కొడాలి నాని, ప్రస్తుత మంత్రి రోజాలు అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు విమర్శలలో  సిద్ధహస్తులు అని రాజకీయవర్గాలలో పెద్ద టాక్ నడుస్తోంది.  ఇప్పుడు నారా భువనేశ్వరిపై వారు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  నోటికొచ్చినట్లు మాట్లాడేయడం.. ఎవరైనా గట్టిగా రిటార్డ్ ఇస్తే.. ఒక మహిళనని కూడా చూడకుండా ఇలా మాట్లాడతారా అంటూ మైకుల ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టే రోజా, నోరు ఉన్నది బూతులు మాట్లాడడానికే అన్నట్లుగా వ్యవహరించే కొడాలి నానిలు రంగంలోకి దిగారు. భువనేశ్వరి యాత్రను ఫ్యాషన్ షోగా రోజా అభివర్ణిస్తే.. తాను మాత్రమే మాట్లాడగలిగిన ప్రత్యేక బాషలో కొడాలి నాని నోటికి పని చేప్పారు. వెల్లంపల్లి కూడా అవాకులూ చవాకులూ పేలారు.  నారా భువనేశ్వరిది ఫ్యాషన్ షో అన్న రోజా వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విమర్శలకు ఒక హద్దూ పద్దూ, పద్ధతీ పాడూ ఉండదా అని నెటిజన్లు రోజాను చెరిగి పారేస్తున్నారు.  గతంలో ఎన్నికల ప్రచారంలో చుడీదార్ వేసుకున్న భూమా అఖిల ప్రియపై కూడా రోజా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా జబర్దస్త వంటి  కార్యక్రమంలో వెకిలి జోకులకు ఆమె నవ్విన నవ్వులు, చేసిన డ్యాన్సులూ మాత్రం ఇటువంటి  విమర్శలు చేసే సమయంలో రోజాకు గుర్తుకు రావా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.   ఇంతకీ విషయానికి వస్తే నారా భువనేశ్వరి తన భర్త అక్రమ అరెస్టును నిరసిస్తూ తొలి సారిగా ప్రజా బాహుల్యంలోకి వచ్చారు. తన భర్త అక్రమ అరెస్టును తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగానే వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. సభలలో ప్రసంగాలు చేస్తున్నారు.  అన్నిటికీ  మించి గత  నెలన్నరగా  ఆమె రాజమహేంద్రవరంలోనే మకాం వేసి తరచుగా చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, సౌకర్యాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అటువంటి  భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత మాటల దాడి కచ్చితంగా బూమరాంగ్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ఎంతగా గింజుకున్నా, బరితెగించి అనుచిత వ్యాఖ్యలతో బజారున పడినా.. జనం మాత్రం భువనేశ్వరి యాత్రకు స్వాగతం పలుకుతున్నారనీ, పలుకుతారనీ, ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారనీ,తెలుపుతారనీ తెలుగుదేశం శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. చంద్రబాబు  అరెస్టుతో జగన్ పనైపోయిందనీ, ఈ విషయం అందరికంటే వైసీపీయే బాగా తెలుసుననీ, అందుకే  వారిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరి..ఇలా నోటికి పని చుబుతూ ప్రజలలో  మరింత పలుచన అవుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎంట్రీ అదుర్స్.. హృదయాలను తాకిన నారా భువనేశ్వరి ప్రసంగం!

నారా భువనేశ్వరి.. ఎన్టీఆర్ తనయ, నారా చంద్రబాబు సతీమణి.. నారా లోకేష్ అమ్మ.. నందమూరి బాలకృష్ణ సోదరి.. కుటుంబంలో అందరూ రాజకీయ రంగంలో ఉన్నవారే. తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా పని చేశారు. కుమారుడు మంత్రిగా సత్తా చాటుకున్నారు. సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే. నాలుగు దశాబ్దాలుగా ఆమె కుటుంబంలోని వారంతా రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారు. ఉన్నత పదవులను అధిరోహించారు. ప్రజల గుండెల్లో కొలువయ్యారు. అయినా నారా భువనేశ్వరి ఇంత వరకూ ఎక్కడా రాజకీయ వేదికలపై కనిపించింది లేదు. రాజకీయ ప్రసంగాలు చేసింది లేదు.  తొలి సారిగా.. అదీ తన భర్త నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ఆమె తొలి  సారిగా ప్రజలలోకి వచ్చారు. చంద్రబాబు  అరెస్టు ఎంత అక్రమమో తనదైన శైలిలో చెప్పారు.  నిజం గెలవాలి అంటూ చంద్రబాబు అరెస్టుతో ఆవేదనకు గురై గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె యాత్ర చేపట్టారు. తొలి  రోజు ఆమె చంద్రగిరిలో తొలి సారిగా బహిరంగ సభలో ప్రసంగించారు. తన ఆవేదననే కాదు.. జనం ఆవేదననూ ఆమె తన ప్రసంగంలో కళ్లకు  కట్టారు. అభివృద్ధి, సంక్షేమం జమిలిగా దౌడు తీయించిన  చంద్రబాబును ఆ రెండిటి గురించీ కనీస అవగాహన లేని జగన్ సర్కార్ ఎంత అక్రమంగా అరెస్టు చేసిందో జనం హృదయాలను తాకేలా చెప్పారు.  ఆమె ప్రసంగం ఆది నుంచి అంతం దాకా జనం చేత కన్నీళ్లు పెట్టించింది.  ఆమె ప్రసంగం జనం కన్నీళ్లు తుడిచింది. తాను ఇక్కడికి  రాజకీయాలు చేయడానికి కాదు తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి వచ్చాననీ, అలాగే తన భర్త అరెస్టుతో ఆవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చానంటూ ప్రసంగాన్ని ఆరంభించిన భువనేశ్వరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర ఉందని ఉద్ఘాటించారు. అలాగే రెవెన్యూలోటుతో మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించేందుకు చంద్రబాబు పడిన తపనను, శ్రమను జనం కళ్ల ముందు సాక్షాత్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మహానగరానికి సైబరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించి అందించిన చంద్రబాబు విజన్ ను వివరించారు. చంద్రబాబు ముందు చూపుతో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసి లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపారని గుర్తు చేశారు. సంపద పెంచి ఆ పెంచిన సంపదను ప్రజలకు పంచాలన్న ఆకాంక్షతో ఆయన చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సంక్షేమం అంటే ఉత్తుత్తినే సొమ్ము పంచడం కాదనీ, ఆ పంచిన సొమ్ముతో పేదల సొంత కాళ్ల మీద నిలబడి సంపాదనా పరులు కావడానికి మార్గం చూపడమేనని చంద్రబాబు తన పాలనా కాలంలో చెప్పారనీ, చెప్పింది  చేశారనీ వివరించారు. అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా జైల్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరే స్త్రీకి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వ నిర్బంధకాండను, అరాచక తీరును ప్రజలకు వివరించేందుకే తాను ఇప్పుడు బయటకు వచ్చాననీ చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని జగన్ సర్కార్ ఒక జైలుగా మార్చేసిందనీ, ఎక్కడికక్కడ ఆంక్షలూ, నిర్బంధాలతో జనాలను వేధిస్తోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి కనిపించడం లేదనీ, అసలా మాటే వినబడటం లేదనీ అన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ  చూసినా  విధ్వంసాలు, అరాచకాలు, అత్యాచారాలే తప్ప  ప్రగతి, పురోగతి  జాడే  లేదని  వివరించారు.  ఔను నారా భువనేశ్వరి తొలి సారిగా జనం మధ్యకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ఆమెలో ఎక్కడా తడబాటు కానీ, బెరుకు కానీ కనిపించలేదు. స్పష్టంగా సూటిగా విశేషణాలు, అతిశయోక్తులు మచ్చుకైనా లేకుండా ప్రజల మనసులను తాకేలా ఆమె ప్రసంగం ఉంది. ఎవరో రాసిచ్చిన స్పీచ్ ను వేదికపై చదవడం కాదు.. తన హృదయాంతరాళలోని ఆవేదననూ, ఆవేశాన్నీ ఆమె చంద్రగిరి సభా వేదిక నుంచి జనంతో పంచుకున్నారు. అందుకే ఆమె ప్రతి మాటా సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకుంది. ఆమె ప్రసంగంలో చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి చెబుతున్నసమయంలో ప్రజలు కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ఆమె ప్రసంగం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది.  చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగిన నాటి నుంచీ జనంలో, తెలుగుదేశం తమ్ముళ్లలో గూడుకట్టుకున్న ఆవేదనకు, ఆవేశానికి భువనేశ్వరి ప్రసంగం అద్దం పట్టింది. ఆమె ప్రసంగం తెలుగు తమ్ముళ్లనే కాదు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా గత నెలన్నరగా ఆందోళనలు చేస్తున్న అశేష ప్రజానీకానికి ఊరట ఇచ్చింది. కన్నీళ్లు తుడిచింది. కలిసి పోరాడుదాం  అన్న ధీమానిచ్చింది. ధైర్యాన్నిచ్చింది.  మొదటి ప్రసంగంతోనే భువనేశ్వరి తన పరిణితిని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా అధికార వైసీపీ నేతలూ, మంత్రులలా  చవకబారు విమర్శలకు తావివ్వకుండా..సూటిగా, స్పష్టంగా ప్రభుత్వ తప్పిదాలను హుందాగా ఎత్తి చూపిన భువనేశ్వరి ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.  

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మా రెడ్డి

నర్సాపూర్ బీఆర్ఎస్  అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు బుధవారం బీఫామ్ అందించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్‌ను అందించారు. అందరికంటే ముందే బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు కెసీఆర్  115 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ గోషామహల్, జనగాం, నాంపల్లి, నర్సాపూర్  నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించలేదు. జనగాం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి పేర్లను ప్రకటించినప్పటికీ గోషామహల్ , నర్సాపూర్ అభ్యర్థులను కెసీఆర్ పెండింగ్ లో పెట్టారు. బుధవారం నర్సాపూర్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ప్రకటించారు.  ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ టిక్కెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మదన్ రెడ్డి నర్సాపూర్ సీటుపై వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...  మదన్ రెడ్డి తనతో పాటు మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారని, ఆయనతో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. తనకు ఆప్తుడు, కుడిభుజం లాంటి వాడన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజాలపై వేసుకొని సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యతను తీసుకున్నారన్నారు. ప్రస్తుతం కొత్త కోట ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న మెదక్ నుంచి మదన్ రెడ్డికి అవకాశమివ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు. మదన్ రెడ్డి మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్నారు. ఆయన సేవలను పార్టీ మరింతగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ బీఫామ్ ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి తన ప్రతిష్ఠను మరింతగా పెంచుకున్నారన్నారు. అందుకు ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు అని కెసీఆర్  అన్నారు.  

కోడి, క్వార్టర్ .. బాటిల్.. ఓటర్లకు వైసీపీ గాలం!

ఏపీలో అధికార వైసీపీకి అసలు ప్రజలంటే ఎంత చులకనో.. ఎన్నికలు, రాజ్యాంగం అంటే కూడా అంతే చులకన అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేక వైసీపీ ఇప్పుడు ఓటమి భయంతో గిలగిలలాడుతోంది. ప్రజలలో అసంతృప్తి తార స్థాయికి చేరడంతో వారిని ఎలాగోలా బుజ్జగించో, బెదరించో, బెల్లించో దారికి తెచ్చుకోవాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే ఇప్పటి నుండే రకరకాల తాయిలాలు పంపిణీ చేసి ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నది. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి వారిని మత్తులో ముంచి ఓట్లు గుద్దించుకోవాలని చూస్తుంది. ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో భారీగా మద్యం పంపిణీ చేశారు. సభల పేరిట జనసమీకరణ చేసి వారికి మద్యం తాగించి  వైసీపీకి ఓట్లేస్తామన్న హామీలు తీసుకున్నారు. కాగా, ఇప్పుడు దసరా పండగ పేరిట రాష్ట్రంలో పలుచోట్ల రకరకాల బహుమతులు, మద్యం సీసాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా విశాఖలో పాగా వేయాలని చూస్తుండగా.. ఇక్కడ బరితెగించి మద్యం పంపిణీ చేశారు. దసరా సందర్భంగా విశాఖ తూర్పు, దక్షణ నియోజకవర్గాలలో వైసీపీ నేతలు రకరకాల బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. కొన్ని వార్డులలో అయితే మనిషికి ఒక క్వార్ట్రర్ మందు. ఇంటికో కోడి  పంపిణీ చేశారు.  విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ ఈసారి ఎంపీ ఎంవిబి సత్యనారాయణను బరిలో దించనుంది. ఎంపీగా ఘోరంగా ఫెయిలైన నేత సత్యనారాయణ. అయితే ఆర్ధికంగా బలమైన నేత కావడంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబుపై ఈసారి ఇక్కడ ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే దసరా రోజున స్వీట్లు పంచి పెట్టారు. ప్రతి ఇంటికి అరకిలో స్వీట్లు లెక్కన వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరగా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆయన్నే పోటీ కి దింపుతోంది.. ఈ తరుణంలో ఆయన కూడా ఇప్పటి నుండే తాయిలాలు పంచుతున్నారు. దసరా రోజున గణేష్ ఏకంగా కుక్కర్లు పంపిణీ చేశారు.  ఇక, అదే దక్షణ నియోజకవర్గానికి చెందిన వార్డులకు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి బాబు ఆనంద్ అయితే తన నాలుగు వార్డులలో ఒక్కొక్కరికి ఒక కోడి, ఒక మద్యం సీసా పంపిణీ చేశారు. అది కూడా యథేచ్ఛగా ఏదో చీర సారె పంచినట్లుగా పబ్లిక్ గా పంచిపెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వైసీపీ నేతల బరితెగింపుపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కార్యాలయం ఎదుటే బజారుకెక్కి   అదేదో ఘనకార్యం చేసినట్లుగా మద్యం పంపిణీ చేయడంపై మహిళలు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. అసలు మద్యపాన నిషేధం చేస్తామని హామీనిచ్చి అధికారం దక్కించుకున్న పార్టీ ఇప్పుడు ఇలా మళ్ళీ ఓట్ల కోసం మద్యం పంపిణీ చేయడం బరితెగింపు కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు.  కోళ్లు, మందు బాటిళ్లు తీసుకోవడం కాదు.. కాస్త మమ్మల్ని గుర్తుపెట్టుకోండంటూ ఓటర్లను సిగ్గులేకుండా విజ్ఞప్తి చేసుకోవడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. విశాఖ కేంద్రంగా వైసీపీ ఈసారి ఎన్నికల కోసం భారీ టార్గెట్ పెట్టుకుంది. గత పదేళ్లుగా  జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. సాక్షాత్తు జగన్ తల్లి విజయమ్మను బరిలో దింపినా విశాఖ ప్రజలు ఓడించి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో విశాఖను తన అడ్డాగా మార్చుకోవాలని రాజధాని తరలింపు డ్రామాకు తెరలేపారు. అయితే, రాజధానిపై జగన్ తేదీలు మార్చుకుంటూ వెళ్లడంతో ఇక్కడి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉండగా..   జనసేన కూడా తోడవడంతో వైసీపీకి స్కోప్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీంతో ఎలాగైనా ఇక్కడ ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలని బరితెగించి ఇలా  మద్యం పంపిణీకి దిగారు.

బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా సునీల్ కనుగోలు వ్యూహాలు!?

తెలంగాణలో అదికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ప్రత్యర్థి పార్టీలలోని అసంతృప్తులకు గాలం వేయడం ద్వారా ఆ పార్టీలను బలహీనపరిచే ఎత్తుగడులతో ముందుకు సాగుతోంది. అందు కోసమే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం చేస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలోని సీనియర్ నేతలు, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతలపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టిందనీ, వారికి నేరుగా హస్తిన నుంచే పార్టీలోకి ఆహ్వానాలు అందుతున్నాయనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత.. అన్నిటికీ మించి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక ఇదే వ్యూహం, ఇదే ఎత్తుగడ ఉందని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే పార్టీ మునుగోడు అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అలాగే మరో  బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామి కూడా ఒకటి రెండు రోజులలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డిలు, అలాగే బీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా కాంగ్రెస్ వ్యూహాల వెనుక కర్నాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు  ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సునీల్ కొనుగోలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.   మైనంపల్లి , పొంగులేటి , తుమ్మల తదితరులు కాంగ్రెస్ పంచన చేరడంలో సునీల్ కనుగోల్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు.  ఒక కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో కూడా మరిన్ని చేరికలు ఉండేలా సునీల్ కనుగోలు వ్యూహాలు రూపొందించారని అంటున్నారు.  ఇక ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ను గుక్కతిప్పుకోనీయకుండా చేయడం కోసం ఆ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట  నియోజకవర్గాలపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టిందనీ, ఆయా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్ధులను  రంగంలోకి దింపి  బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయాలన్న వ్యూహంతో సునీల్ కనుగోలు పావులు కదుపుతున్నారని అంటున్నారు.  గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా,  బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్ పై పోటీకి ఆ పార్టీ  ప్రకటించిన నేపథ్యంలో నర్సారెడ్డి అభ్యర్థిత్వంపై  కాంగ్రెస్ పునరాలోచనలో పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇక  సిరిసిల్ల నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను రంగంలోకి దించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  

వైసీపీ సామాజిక బస్సు యాత్ర.. తిరుగుబాటుకు ప్రజలు సిద్ధం!

ఏపీలో ఈసారి అధికారం ఎవరిది అంటే ఇప్పటికే   జనం క్లియర్ కట్గా  తేల్చి చెప్పేస్తున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం తెలుగుదేశం  అధికారం చేపట్టడం తథ్యం అంటూ విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ ఎంతటి ఘన విజయం దక్కించుకుందో.. ఈసారి ఎన్నికలలో అంతటి ఘోర పరాజయం తప్పదని లెక్కలేసి మరీ చెప్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతిపక్ష  తెలుగుదేశం లో గెలుపు ధీమా స్పష్టంగా కనిపిస్తుంటే.. ఓటమి బెరుకు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.  ఏదో ఒక మాయ చేసో.. మతలబు చేసో మరోసారి ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని చూసినా ఆ పరిస్థితి కూడా చేయి దాటి పోయిందని అంటున్నారు. కుట్ర పన్ని టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో  వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అయితే, వైసీపీ పెద్దలు మాత్రం గెలుపు మనదే అంటూ పార్టీ నేతలను, క్యాడర్ ను నమ్మించేందుకు వృధా  ప్రయత్నం చేస్తున్నారు. లోలోపల ఓటమి భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మన బటన్ నొక్కుడే మనల్ని కాపాడుతుందని నమ్మిస్తున్నారు. ప్రజలకు మనం ఏం చేశామో ప్రజల వద్దకే వెళ్లి తెలియజెప్పండి అంటూ ఆదేశిస్తున్నారు. ఇప్పటికే గడపగడపకి అనే కార్యక్రమంతో మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ అందరినీ ఇంటింటికి పంపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి బస్సెక్కించి ప్రతి గ్రామానికి పంపిస్తున్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో మొదలవనున్న ఈ యాత్ర రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సాగుతుంది. ఈ యాత్రలో మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ  ఇన్వాల్వ్ కావాలని ఆదేశించారు. ఇంకా చెప్పాలంటే పార్టీ మొత్తం కదిలేలా.. డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగి.. నాలుగున్నరేళ్లలో వాళ్లకి ఏం చేశామో చెప్పాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం (అక్టోబర్ 26) నుంచి ఏపీ వ్యాప్తంగా ఈ వైసీపీ సామాజిక బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమ లో అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఒకేసారి ఈ యాత్ర మొదలు కానుంది. అరవై రోజులు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా రూపకల్పన చేశారు. అయితే  ఈ యాత్రలో కానీ, ప్రతిరోజూ జరిగే బహిరంగ సభలలో కానీ ఎక్కడా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించరు. ఆ మాటకొస్తే ఎక్కడా వైసీపీ ముఖ్యనేతలు కూడా కనిపించరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నేతలే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి భయంతో సగం డీలా పడిపోగా.. ద్వితీయ శ్రేణి నేతలంతా ప్రభుత్వంపై పీకల వరకూ అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది వైసీపీ ముఖ్యనేతలు కనిపిస్తేనే కాస్త వాళ్లలో కదలిక వస్తుంది. కానీ, వాళ్లనే బస్సెక్కి వెళ్ళండి అంటున్నారు. ఇప్పటికే గడపగడపకి వెళ్లిన వీళ్లు ప్రజల స్పందన ఎలా ఉందో చూసేశారు. ఇప్పుడు మరోసారి  ప్రజల వద్దకు వెళ్లి మరో అవకాశం ఇవ్వాలని కోరితే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియనిదేమీ కాదు. దీంతో ఈ యాత్ర చివరి వరకూ సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సామజిక బస్సు యాత్ర సక్సెస్ కావాలంటే ముందుగా కావాల్సింది రోడ్లు. ప్రతి గ్రామానికి బస్సు వెళ్లాలంటే రోడ్లు సక్రమంగా ఉండాలి. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అలాంటిది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్ల మీద నుండి ప్రజల వద్దకి వెళ్తే ఎదురయ్యే తొలి ప్రశ్న అదే అవుతుంది. గ్రామాల నుండి పట్టణాల వరకూ.. గూడేల నుండి నగరాల వరకూ అడుగడుగునా సమస్యలు తాండవం చేస్తున్నాయి. సవాలక్ష కొర్రీలు పెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల అసంతృప్తి ప్రజలలో పెల్లుబుకుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చి అమలు చేయని అంశాలు, నాలుగేళ్లుగా మాటలే తప్ప అడుగు ముందుకు పడని ప్రాజెక్టులు లాంటి ఎన్నో అంశాలతో ప్రజలలో ఆగ్రహాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి.  ఇలాంటి సమయంలో ప్రజల వద్దకు పాలకులు వెళ్తే ఏ స్థాయిలో రియాక్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సామజిక బస్సు యాత్ర వైసీపీకి ఏ స్థాయి రియాక్షన్ ఎదుర్కొంటుందో చూడాలి.

జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై పురంధేశ్వరి ఫిర్యాదులు బుట్టదాఖలేనా?

బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీ రాష్ట్ర శాఖల విషయంలో  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. ఒక  రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖకు అన్ని  విధాలుగా అండదండలు అందించే పార్టీ  మరో రాష్ట్రంలో సొంత నాయకులకే ముందరి కాళ్లు బంధం వేసి వెనక్కులాగేస్తుంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో బీజేపీ హైకమాండ్ కు ఒక వ్యూహం, ఒక  ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక విధానం ఉన్నట్లు కనిపించదు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సర్వశక్తులూ ఒడ్డి పని చేస్తున్న అధ్యక్షుడిని పదవి నుంచి  దింపేసి.. మరొకరికి పార్టీరాష్ట్ర  పగ్గాలుఅప్పగించడం, ఆ కారణంగా రేసు గుర్రంలాసాగుతున్న పార్టీ ప్రస్థానం ఒక్కసారిగా చతికిల పడిపోయే పరిస్థితి ఏర్పడినా పెద్దగా పట్టించుకోదు. తెలంగాణలో అదే జరిగింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు  బండి  సంజయ్ చేతుల్లో ఉన్నంత  కాలం తెలంగాణలో బీజేపీ  బీఆర్ఎస్ కు  గుబులు పట్టిస్తూనే వచ్చింది. అయితే ఎప్పుడైతే బండి  సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిని నియమించిందో.. ఆ క్షణం నుంచీ  రాష్ట్రంలో బీజేపీ రేసు గుర్రంలా దౌడు తీయడం అటుంచి కనీసం అడుగులు కూడా ముందుకు పడని స్థితికి చేరుకుంది.  ఇక  ఏపీ  విషయానికి వస్తే.. పార్టీని పాతాళానికి దించేసిన  సోము వీర్రాజును పార్టీ  రాష్ట్ర  అధ్యక్ష పదవి  నుంచి తప్పించి పగ్గాలను  సీనియర్ నాయకురాలు  పురంధేశ్వరికి అప్పగించింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ పురంధేశ్వరి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక  అరాచకత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మద్యం మాఫియా వంటి విషయాలపై గళమెత్తుతూ ఆ పార్టీ అవకతవకలపై కేంద్రానికి వరుస నివేదికలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. అయితే అందుకు ప్రతిగా బీజేపీ  హై కమాండ్ నుంచీ, కేంద్రం నుంచీ నిష్క్యియాపరత్వం, కొండొకచో అధికార  పార్టీకి మద్దతుగా ప్రకటనలు వస్తున్నాయి.  ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసే పిర్యాదుల్ని, మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకల్ని,  మద్యం స్కాం గురించి గణాంకాలతో సహా ఇచ్చిన నివేదికలను బుట్టదాఖలు చేయడమే కాకుండా..  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను పార్లమెంటు వేదికగా సమర్ధించి చిన్న బుచ్చింది.   కేంద్ర ఆర్థిక శాఖ తీరు కారణంగా రాష్ట్రంలో తమ పార్టీ ఇబ్బందుల్లో పడిందని పురంధేశ్వరి బాహాటంగానే చెప్పారు.   ఇప్పుడు ఆమె ఒక అడుగు ముందుకు వేసి జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో  రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోందని, నిబంధలను తుంగలోకి తొక్కి, ఎలాంటి ఆర్థిక అంచనాలూ లేకుండానే.. కార్పోరేషన్ల పేరిట కోట్లాది రూపాయల రుణం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో వైసీపీ సర్కార్ నిండా మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.   పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు మాత్రమే కాదు.. పార్టీలో ఆమె  తన పలుకుబడి ఉపయోగించి   రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకలు, అరాచకత్వంపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిగేలా చేయగలిగితే జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం ఆ మేరకు చర్యలు తీసుకుంటుందా? లేక   ఏపీలో పార్టీ బలోపేతం కావడం కంటే.. వైసీపీ శ్రేయస్సే ముఖ్యమని భావిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.  మొత్తం మీద జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై పురంధేశ్వరి చేస్తున్న పోరాటం మాత్రం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది.