బెడిసి కొట్టిన ఆర్జీవీ వ్యూహం!
posted on Oct 21, 2023 5:24AM
ఏం చేసినా చూస్తూ ఊరుకునేందుకు ఇదేమీ ఆటవిక రాజ్యం కాదు కదా. ఎలాంటి మహారాజులనైనా చీల్చి చెండాడే రాజ్యాంగం అమలయ్యే దేశం కదా.. కాస్త ఆలస్యమైనా విపరీత ధోరణికి కళ్లెం పడాల్సిందే. నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అందరూ చూస్తూ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. అసలే తలబిరుసు ఎక్కువాయె.. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇంతకీ దేని గురించి ఇదంతా అనుకుంటున్నారా? అదే టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ గురించి.. ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా గురించి. దీనిని సినిమా అనే కన్నా.. ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హీరోగా చిత్రీకరించేలా తెరకెక్కించిన ఓ కంప్లీట్ ప్రచారం చిత్రం అని చెప్పొచ్చు. విడుదల కూడా కాకుండా మీరెలా చెప్తారని అంటారేమో.. ఏకంగా సినిమా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ తానే స్వయంగా ఈ విషయం చెప్పారు. ఔను.. నాకు జగన్ మోహన్ రెడ్డి హీరోలాగానే కనిపిస్తారు.. కనుకే ఆయన్ని ఈ సినిమాలో హీరోలా చూపించానని ఓపెన్ గానే చెప్పారు ఆర్జీవీ. జగన్ హీరో అంటే మిగతా ఆయన రాజకీయ ప్రత్యర్థులంతా విలన్లే కదా. అందుకే ఇష్టం వచ్చినట్లుగా జగన్ ప్రత్యర్థులందరినీ ఘోరాతి ఘోరంగా చూపించారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లలోనే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆయన సినిమాకు బ్రేకులు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. .
జగన్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వర్మ అండ్ కో ఇప్పటికే ప్రకటించారు. అయితే, వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరుతున్నారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. వర్మ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయ నేతలందరినీ తక్కువ చేసి చూపించడమే కాకుండా.. వారంతా కుట్రలు పన్నే నేతలుగా చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు.
వ్యూహం సినిమా విడుదలైతే తెలంగాణ ఓటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపించిన నట్టి కుమార్.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహం సినిమా విడుదల సరి కాదని పేర్కొన్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్న తెలంగాణలోతెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయని.. ఆ పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలను ఈ సినిమాలో తప్పుగా చూపించారన్న విషయం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ల ద్వారానూ, స్వయంగా ఆర్జీవీ మాటల ద్వారానూ అర్దం అవుతోందని పేర్కొన్న నట్టి కుమార్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విడుదల వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అక్రమంగా అరెస్టై జైలులో ఉండగా.. ఆయన పాత్ర డూప్ ద్వారా వస్తున్న ఈ చిత్రం విడుదల చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయనీ, ఈ సమయంలో వ్యూహం సినిమా విడుదలైతే అల్లర్లు జరిగే అవకాశాలు మండుగా ఉన్నాయనీ నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో పాత్రలన్నీ యధాతధంగానే చిత్రీకరించారు. ఒక్క జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీలను తప్ప మిగతా అందరినీ కుట్రదారులుగా చూపించారు. పైగా రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో వాస్తవాలను వక్రీకరించి తమకు కావాల్సినట్లుగా తెరకెక్కించారు. జగన్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పాత్రలను ఎక్కడా సినిమాలో లేకుండా ఇది సంపూర్ణంగా జగన్ కోసమే.. జగన్ కు అనుకూలంగా ఉండేలా.. జగన్ ను ఓ ఆదర్శ నాయకుడిలా చూపించే ప్రయత్నంగానే కనిపిస్తున్నందునే నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు.