బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా సునీల్ కనుగోలు వ్యూహాలు!?

తెలంగాణలో అదికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ప్రత్యర్థి పార్టీలలోని అసంతృప్తులకు గాలం వేయడం ద్వారా ఆ పార్టీలను బలహీనపరిచే ఎత్తుగడులతో ముందుకు సాగుతోంది. అందు కోసమే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం చేస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలోని సీనియర్ నేతలు, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతలపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టిందనీ, వారికి నేరుగా హస్తిన నుంచే పార్టీలోకి ఆహ్వానాలు అందుతున్నాయనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత.. అన్నిటికీ మించి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక ఇదే వ్యూహం, ఇదే ఎత్తుగడ ఉందని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే పార్టీ మునుగోడు అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అలాగే మరో  బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామి కూడా ఒకటి రెండు రోజులలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డిలు, అలాగే బీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా కాంగ్రెస్ వ్యూహాల వెనుక కర్నాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు  ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సునీల్ కొనుగోలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.   మైనంపల్లి , పొంగులేటి , తుమ్మల తదితరులు కాంగ్రెస్ పంచన చేరడంలో సునీల్ కనుగోల్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు.  ఒక కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో కూడా మరిన్ని చేరికలు ఉండేలా సునీల్ కనుగోలు వ్యూహాలు రూపొందించారని అంటున్నారు.  ఇక ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ను గుక్కతిప్పుకోనీయకుండా చేయడం కోసం ఆ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట  నియోజకవర్గాలపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టిందనీ, ఆయా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్ధులను  రంగంలోకి దింపి  బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయాలన్న వ్యూహంతో సునీల్ కనుగోలు పావులు కదుపుతున్నారని అంటున్నారు.  గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా,  బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్ పై పోటీకి ఆ పార్టీ  ప్రకటించిన నేపథ్యంలో నర్సారెడ్డి అభ్యర్థిత్వంపై  కాంగ్రెస్ పునరాలోచనలో పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇక  సిరిసిల్ల నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను రంగంలోకి దించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  

వైసీపీ సామాజిక బస్సు యాత్ర.. తిరుగుబాటుకు ప్రజలు సిద్ధం!

ఏపీలో ఈసారి అధికారం ఎవరిది అంటే ఇప్పటికే   జనం క్లియర్ కట్గా  తేల్చి చెప్పేస్తున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం తెలుగుదేశం  అధికారం చేపట్టడం తథ్యం అంటూ విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ ఎంతటి ఘన విజయం దక్కించుకుందో.. ఈసారి ఎన్నికలలో అంతటి ఘోర పరాజయం తప్పదని లెక్కలేసి మరీ చెప్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతిపక్ష  తెలుగుదేశం లో గెలుపు ధీమా స్పష్టంగా కనిపిస్తుంటే.. ఓటమి బెరుకు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.  ఏదో ఒక మాయ చేసో.. మతలబు చేసో మరోసారి ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని చూసినా ఆ పరిస్థితి కూడా చేయి దాటి పోయిందని అంటున్నారు. కుట్ర పన్ని టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో  వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అయితే, వైసీపీ పెద్దలు మాత్రం గెలుపు మనదే అంటూ పార్టీ నేతలను, క్యాడర్ ను నమ్మించేందుకు వృధా  ప్రయత్నం చేస్తున్నారు. లోలోపల ఓటమి భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మన బటన్ నొక్కుడే మనల్ని కాపాడుతుందని నమ్మిస్తున్నారు. ప్రజలకు మనం ఏం చేశామో ప్రజల వద్దకే వెళ్లి తెలియజెప్పండి అంటూ ఆదేశిస్తున్నారు. ఇప్పటికే గడపగడపకి అనే కార్యక్రమంతో మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ అందరినీ ఇంటింటికి పంపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి బస్సెక్కించి ప్రతి గ్రామానికి పంపిస్తున్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో మొదలవనున్న ఈ యాత్ర రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సాగుతుంది. ఈ యాత్రలో మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ  ఇన్వాల్వ్ కావాలని ఆదేశించారు. ఇంకా చెప్పాలంటే పార్టీ మొత్తం కదిలేలా.. డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగి.. నాలుగున్నరేళ్లలో వాళ్లకి ఏం చేశామో చెప్పాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం (అక్టోబర్ 26) నుంచి ఏపీ వ్యాప్తంగా ఈ వైసీపీ సామాజిక బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమ లో అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఒకేసారి ఈ యాత్ర మొదలు కానుంది. అరవై రోజులు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా రూపకల్పన చేశారు. అయితే  ఈ యాత్రలో కానీ, ప్రతిరోజూ జరిగే బహిరంగ సభలలో కానీ ఎక్కడా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించరు. ఆ మాటకొస్తే ఎక్కడా వైసీపీ ముఖ్యనేతలు కూడా కనిపించరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నేతలే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి భయంతో సగం డీలా పడిపోగా.. ద్వితీయ శ్రేణి నేతలంతా ప్రభుత్వంపై పీకల వరకూ అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది వైసీపీ ముఖ్యనేతలు కనిపిస్తేనే కాస్త వాళ్లలో కదలిక వస్తుంది. కానీ, వాళ్లనే బస్సెక్కి వెళ్ళండి అంటున్నారు. ఇప్పటికే గడపగడపకి వెళ్లిన వీళ్లు ప్రజల స్పందన ఎలా ఉందో చూసేశారు. ఇప్పుడు మరోసారి  ప్రజల వద్దకు వెళ్లి మరో అవకాశం ఇవ్వాలని కోరితే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియనిదేమీ కాదు. దీంతో ఈ యాత్ర చివరి వరకూ సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సామజిక బస్సు యాత్ర సక్సెస్ కావాలంటే ముందుగా కావాల్సింది రోడ్లు. ప్రతి గ్రామానికి బస్సు వెళ్లాలంటే రోడ్లు సక్రమంగా ఉండాలి. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అలాంటిది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్ల మీద నుండి ప్రజల వద్దకి వెళ్తే ఎదురయ్యే తొలి ప్రశ్న అదే అవుతుంది. గ్రామాల నుండి పట్టణాల వరకూ.. గూడేల నుండి నగరాల వరకూ అడుగడుగునా సమస్యలు తాండవం చేస్తున్నాయి. సవాలక్ష కొర్రీలు పెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల అసంతృప్తి ప్రజలలో పెల్లుబుకుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చి అమలు చేయని అంశాలు, నాలుగేళ్లుగా మాటలే తప్ప అడుగు ముందుకు పడని ప్రాజెక్టులు లాంటి ఎన్నో అంశాలతో ప్రజలలో ఆగ్రహాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి.  ఇలాంటి సమయంలో ప్రజల వద్దకు పాలకులు వెళ్తే ఏ స్థాయిలో రియాక్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సామజిక బస్సు యాత్ర వైసీపీకి ఏ స్థాయి రియాక్షన్ ఎదుర్కొంటుందో చూడాలి.

జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై పురంధేశ్వరి ఫిర్యాదులు బుట్టదాఖలేనా?

బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీ రాష్ట్ర శాఖల విషయంలో  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. ఒక  రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖకు అన్ని  విధాలుగా అండదండలు అందించే పార్టీ  మరో రాష్ట్రంలో సొంత నాయకులకే ముందరి కాళ్లు బంధం వేసి వెనక్కులాగేస్తుంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో బీజేపీ హైకమాండ్ కు ఒక వ్యూహం, ఒక  ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక విధానం ఉన్నట్లు కనిపించదు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సర్వశక్తులూ ఒడ్డి పని చేస్తున్న అధ్యక్షుడిని పదవి నుంచి  దింపేసి.. మరొకరికి పార్టీరాష్ట్ర  పగ్గాలుఅప్పగించడం, ఆ కారణంగా రేసు గుర్రంలాసాగుతున్న పార్టీ ప్రస్థానం ఒక్కసారిగా చతికిల పడిపోయే పరిస్థితి ఏర్పడినా పెద్దగా పట్టించుకోదు. తెలంగాణలో అదే జరిగింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు  బండి  సంజయ్ చేతుల్లో ఉన్నంత  కాలం తెలంగాణలో బీజేపీ  బీఆర్ఎస్ కు  గుబులు పట్టిస్తూనే వచ్చింది. అయితే ఎప్పుడైతే బండి  సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిని నియమించిందో.. ఆ క్షణం నుంచీ  రాష్ట్రంలో బీజేపీ రేసు గుర్రంలా దౌడు తీయడం అటుంచి కనీసం అడుగులు కూడా ముందుకు పడని స్థితికి చేరుకుంది.  ఇక  ఏపీ  విషయానికి వస్తే.. పార్టీని పాతాళానికి దించేసిన  సోము వీర్రాజును పార్టీ  రాష్ట్ర  అధ్యక్ష పదవి  నుంచి తప్పించి పగ్గాలను  సీనియర్ నాయకురాలు  పురంధేశ్వరికి అప్పగించింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ పురంధేశ్వరి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక  అరాచకత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మద్యం మాఫియా వంటి విషయాలపై గళమెత్తుతూ ఆ పార్టీ అవకతవకలపై కేంద్రానికి వరుస నివేదికలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. అయితే అందుకు ప్రతిగా బీజేపీ  హై కమాండ్ నుంచీ, కేంద్రం నుంచీ నిష్క్యియాపరత్వం, కొండొకచో అధికార  పార్టీకి మద్దతుగా ప్రకటనలు వస్తున్నాయి.  ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసే పిర్యాదుల్ని, మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకల్ని,  మద్యం స్కాం గురించి గణాంకాలతో సహా ఇచ్చిన నివేదికలను బుట్టదాఖలు చేయడమే కాకుండా..  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను పార్లమెంటు వేదికగా సమర్ధించి చిన్న బుచ్చింది.   కేంద్ర ఆర్థిక శాఖ తీరు కారణంగా రాష్ట్రంలో తమ పార్టీ ఇబ్బందుల్లో పడిందని పురంధేశ్వరి బాహాటంగానే చెప్పారు.   ఇప్పుడు ఆమె ఒక అడుగు ముందుకు వేసి జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో  రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోందని, నిబంధలను తుంగలోకి తొక్కి, ఎలాంటి ఆర్థిక అంచనాలూ లేకుండానే.. కార్పోరేషన్ల పేరిట కోట్లాది రూపాయల రుణం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో వైసీపీ సర్కార్ నిండా మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.   పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు మాత్రమే కాదు.. పార్టీలో ఆమె  తన పలుకుబడి ఉపయోగించి   రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకలు, అరాచకత్వంపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిగేలా చేయగలిగితే జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం ఆ మేరకు చర్యలు తీసుకుంటుందా? లేక   ఏపీలో పార్టీ బలోపేతం కావడం కంటే.. వైసీపీ శ్రేయస్సే ముఖ్యమని భావిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.  మొత్తం మీద జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై పురంధేశ్వరి చేస్తున్న పోరాటం మాత్రం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. 

బీజేపీకి బిగ్ షాక్.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి !?

అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని ఆ పార్టీలో చేరడం జరిగిందని, కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నానని తెలిపారు. మరో ఐదు వారాల్లో కేసీఆర్ పాలన అంతం కాబోతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.  ఢిల్లీలలో రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కానీ మునుగోడు లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన బిజెపిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు అనేక సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి గుర్తు మీద గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు విషయంలో ఓటు వేసే సమయంలో ఓటర్లు అయోమయానికి గురి అవుతారేమో అన్న ఆలోచన బీజేపీ నేతలను కలవరపెడుతుంది. ఈ కారణంగా బిజెపి జాబితాలో మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారు  చేయలేదు.చాలా ఏళ్ళపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం వల్ల చాలామంది వృద్ధులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అని భావిస్తున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి.

పవన్ కు అమిత్ షా పిలుపు.. మర్మమేంటి?

దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా.. అత్యధిక రాష్ట్రాలలో తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడేలా చక్రం తిప్పిన బీజేపీకి తెలుగు రాష్ట్రాలు మాత్రం కొరుకుడు పడటం లేదు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసి కట్టు అన్నట్లుగా మారిపోతోంది. అటు ఏపీలో అధికార వైసీపీతో అంటకాగుతూ ప్రజాగ్రహాన్నిప్రోది చేసుకుంటున్న బీజేపీ, ఇటు తెలంగాణలో కూడా ప్రత్యర్థులను చీల్చి  లబ్ధి పొందాలన్న వ్యూహంతో మొదటికే మోసం వచ్చే  పరిస్థితులను సృష్టించుకుంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్యాయం అని    ఘనంగా చాటుకున్న బీజేపీకి ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అన్న బెంగ పట్టుకుంది. తెలంగాణలో కనీసం గౌరవ ప్రదమైన స్థానాలను గెలుచుకోవాలన్నా జనసేన  మద్దతు అవసరం అన్న  అభిప్రాయానికి వచ్చింది. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ కు హస్తిన రావాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట పవన్ ను అమిత్ షా ఆహ్వానించడం రాజకీయంగా అత్యంత  ప్రాధాన్యత  సంతరించుకుంది. తెలంగాణలో జనసేన పార్టీతో సీట్ల  సర్దుబాటు విషయంపై చర్చించేందుకే అమిత్ షా పవన్ కల్యాణ్ కు హస్తినకు రమ్మని ఆహ్వానం పంపారని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని తమ పార్టీ ఎన్డీయే భాగస్వామ్య పక్షమేనని పదే పదే చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా  తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు  పెట్టుకున్నారు. తెలంగాణలో  కూడా ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన ఈ వైఖరే పొలిటికల్ స్పెక్యులేషన్స్ కు అవకాశం ఇస్తోందని కూడా అంటున్నారు. తెలంగాణలో 36 స్థానాలలో పోటీ చేయనున్నట్లు జనసేన   ఇప్పటికే జనసేన ప్రకటించేసింది. కానీ బీజేపీ మాత్రం మిత్రపక్షంగా తెలంగాణలో జనసేన పోటీకి దూరంగా ఉండి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. ఈ మేరకు బీజేపీ  హైకమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా జనసేనానికి రాయబారం కూడా పంపింది. అయితే ఇందుకు జనసేనాని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని జేనసేన వర్గాలు చెబుతున్నాయి.  మామూలు పరిస్థితుల్లో అయితే.. జనసేన మద్దతు కోసం, తెలంగాణ ఎన్నికలలో సహకారం కోసం బీజేపీ ఇంతగా తాపత్రేయపడేది కాదు. కానీ తెలంగాణలో అధికారమే తరువాయి అనుకున్న పరిస్థితి నుంచి కనీసం నాలుగైదు స్థానాలలోనైనా విజయం సాధించగలమా అన్న పరిస్థితికి  బీజేపీ దిగజారడంతో బీజేపీ డిస్పరేట్ గా తెలంగాణలో జనసేన మద్దతు కోసం ప్రయత్నిస్తున్నది. అయితే ఆ ప్రయత్నాలలో బీజేపీ స్నేహధర్మం పాటించడం మాని తన స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలంటూ జనసేనానిపై ఒత్తిడికి ప్రయత్నిస్తున్నది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా  తమ పార్టీ త్యాగం చేసి బీజేపీకి మద్దతునిచ్చిందనీ, మరో సారి అదే పని చేయడానికి సిద్ధంగా లేమనీ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలంటే ఈ సారి పోటీ చేసి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అదే విషయాన్ని కిషన్ రెడ్డితో భేటీలో విస్పష్టంగా చెప్పేశారు. అదే సమయంలో  ఏపీలో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకున్న విధంగానే తెలంగాణలో కూడా ఆ పార్టీతో కలిసి వేడితే రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఇరు పార్టీల శ్రేణులూ అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ నిర్ణయం కోసం ఇక ఎంత మాత్రం వేచి చూసే పరిస్థితి లేదని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ కు హస్తిన నుంచి పిలుపు రావడం గమనార్హం. జనసేనతో పొత్తు ద్వారా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల మద్దతుతో పాటు, రాష్ట్రంలో  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మద్దతు కూడా లభిస్తుందన్న ఉద్దేశంతోనే బీజేపీ జనసేన స్నేహహస్తం కోసం అర్రులు చాస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అందుతున్న సమాచరం మేరకు ఈ భేటీలో జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంపై అమిత్ షా ఒక  ప్రతిపాదన చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో జనసేనకు పొత్తులో  భాగంగా 8 నుంచి పది స్థానాలను ఇచ్చేందుకు అమిత్ షా ప్రతిపాదించవచ్చని అంటున్నారు. అయితే అందుకు జనసేనాని అంగీకరించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికంటే మించి ఏపీలో అధికార వైసీపీ పట్ల బీజేపీ వైఖరిని నిలదీసేందుకే జనసేనాని హస్తినలో అమిషాతో భేటీకి అంగీకరించారని అంటున్నారు. అంతే కాకుండా ఏమీ మాజీ ముఖ్యమంత్రి అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఇసుమంతైనా లేదన్న వివరణను ఈ సందర్బంగా అమిత్ షా జనసేనానికి ఇచ్చే అవకాశం ఉందని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అమిత్ షా లోకేష్ ను పిలిపించుకుని మరీ చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం పాత్ర లేదని చెప్పుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వేలలో కచ్చితత్వం ఉందా?

తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పార్టీలు, ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్ధులను ప్రకటించలేదు. అధికార బీఆర్‌ఎస్ కూడా ఇంకా పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  అభ్యర్ధుల తొలి జాబితాను మాత్రమే ప్రకటించాయి.  అన్నిటికీ  మించి ఈ సారి ఎన్నికలలో కింగ్ మేకర్ పాత్ర, అంత కంటే ఎక్కువ అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా పోటీ విషయంలోనే స్పష్టత ఇవ్వలేదు. తెలుగుదేశం  ఈ సారి పోటీ విషయంలో సారీ చెప్పేస్తుందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో వస్తున్నాయి. ఇక తాను ఎన్డీయే భాగస్వామినే అని చెబుతున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో ఇప్పటికే 36 స్థానాలలో పోటీకి రెడీ అని ప్రకటించేశారు. బీజేపీ అయితే జనసేనను మద్దతుకే పరిమితం కావాలి..పోటీ వద్దు అని కోరుతోంది. దీనిపై జనసేనాని ఏ నిర్ణయం తీసుకున్నారో.. తీసుకుంటారో అన్న విషయంలో క్లారిటీ లేదు. మరో వైపు ఏపీలో మాత్రం జనసేనానికి తెలుగుదేశంతో పొత్తు ఖరారు చేసేశారు. సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో ఉమ్మడి సమావేశంలో పాల్గొన్నారు. మరి అదే సయోధ్య, సమన్వయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇరు పార్టీల మధ్యా అంటే తెలుగుదేశం, జనసేన మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  అన్ని పార్టీలలోనూ అసమ్మతి రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జంపింగ్ లు కూడా అన్ని పార్టీలకూ తలనొప్పిగానే ఉన్నాయి. అభ్యర్థులు ఎవరు? రెబల్స్ గా ఎవరు బరిలోకి దిగుతారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. షర్మిల పార్టీతో పాటు, దళితుల్లో బలం ఉన్న బీఎస్పీ ఇప్పటికే రంగంలో ఉన్నట్లు ప్రకటించాయి. ఆ రెండు పార్టీలకూ సొంతంగా విజయం సాధించే బలం లేకున్నా.. ఏదో మేరకు కనీసం కొన్ని నియోజకవర్గాలలోనైనా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలుగుతాయి.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఇన్ని రోజులైనా.. ఇప్పటి వరకూ పార్టీల అభ్యర్థులు, వారి బలాబలాలు, తెలుగుదుశం, జనసేనల నిర్ణయం ఏమిటి? ఒక వేళ రెండూ పోత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దిగితే సమీకరణాలు ఎలా ఉంటాయి? జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే సమీకరణాలు ఎలా మారుతాయి? తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగితే పరిస్థితి ఏమిటి? అసలు పోటీలో లేకుండా ఉంటే ఏమౌతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం రాకుండానే.. తెలంగాణలో అధికారం ఈ పార్టీదే.. కాదు కాదు ఆ పార్టీదే అంటూ వెలువడుతున్న సర్వేలకు విశ్వసనీయత ఎమిటి? ఎంత? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేడి అయితే బాగా పెరిగింది కానీ.. ఏయే పార్టీలు అధికారం రేసులో ముందుంటాయి? ఏయే పార్టీలు వెనుకబడతాయి అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడ్ ఆఫ్ ది తెలంగాణ అన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని అంటున్నారు.  గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ, ఈ సారి అధికారం మాదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలకు కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ మీడియా సంస్థలు, స్థానిక సంస్థలు వెలువరిస్తున్న సర్వేలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని నమ్మడం కష్టమేనని చెబుతున్నారు.  పార్టీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే.. రాష్ట్రంలో పొత్తుపొడుపులపై చర్చలు ఇంకా సాగుతుండగానే వెలువడిన సర్వేల ఫలితాలను ఎలా విశ్వసించగలమని రాజకీయవర్గాలు అంటున్నాయి.   తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ అధికారం చే జిక్కించుకోవడం తథ్యమని జాతీయ మీడియా సంస్థలు చెబుతుంటే.. బీజేపీ అనుకూల మీడియా మాత్రం హంగ్ తథ్యమని జోస్యం చెబుతోంది.  లోక్‌పోల్  సర్వే బీఆర్‌ఎస్‌కు 45-51 సీట్లు కాంగ్రెస్‌కు 61-67 సీట్లు వస్తాయని పేర్కొంటే.. పోల్  బీఆర్‌ఎస్‌కు 40-కాంగ్రెస్‌కు 64 సీట్లు, తెలంగాణ పల్స్ బీఆర్‌ఎస్‌కు 46-54, జన్‌మత్ సంస్థ బీఆర్‌ఎస్ 45-47, కాంగ్రెస్ 58-60; ఏబీపీ-సీ ఓటర్ సంస్థ బీఆర్‌ఎస్ 43-55, కాంగ్రెస్‌కు 54 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. ఈ సర్వేలను పరిశీలిస్తే.. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ బలంగా పుంజుకుందన్నది మాత్రం స్పష్టమౌతున్నది. అలాగే ఇంత కాలం బీజేపీ బలంగా చూపుకున్నది కేవలం వాపు మాత్రమేనని తేటతెల్లమౌతున్నది. తెలుగుదేశం పోటీపై స్పష్టత వచ్చిన తరువాత, అలాగే జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగుతాయా అని తేలిన తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలలో గణనీయమైన మార్పు రావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు వెలువడిన సర్వేలలో కచ్చతత్వం ఉందని భావించడం సరి కాదని అంటున్నారు. 

నిజం గెలవాలి.. గెలుస్తుంది.. నారా భువనేశ్వరి బస్సు యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉండగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి   'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర కు సంకల్పించారు.  చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమవుతారు. సభలూ, సమావేశాలలో ప్రసంగిస్తారు. బాబు అక్రమ అరెస్టును, జగన్ సర్కార్ వేధింపులను ప్రజలకు వివరిస్తారు. ఈ యాత్ర ప్రారంభం సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ అందరినీ కదిలిస్తున్నది. "నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో నే నారావారి పల్లెకు వచ్చే నేను, ఆయన తోడు లేకుండా తొలి సారిగా  ఒంటరిగా వచ్చారు. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరి దేవత నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో   తొలి అడుగు వేస్తున్నాను"  అంటూ ఆ ట్వీట్ లో నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసినప్పటి నుంచీ ఆమె రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. ఆయన అరెస్టు అయిన క్షణం నుంచీ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తొలి సారి రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె తనలో సగ భాగాన్ని అక్కడే వదిలి వచ్చినట్లుందని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చినా నారా భువనేశ్వరి ఇప్పటి వరకూ ఎన్నడూ రాజకీయ వేదికలపై కనిపించింది లేదు. తండ్రి ముఖ్యమంత్రిగా పని చేశారు. భర్త ముఖ్యమంత్రిగా పని చేశారు. కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. అయినా నారా భువనేశ్వరి ఇంత వరకూ ఎన్నడూ రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. రాజకీయ వేదికలపై కనిపించింది లేదు. ప్రసంగించింది లేదు. అయితే తన భర్తను అక్రమంగా అరెస్టు చేయడంతో ఆమె  తొలి సారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.  నిజం గెలవాలి అంటూ ఆమె బస్సు యాత్ర బుధవారం(అక్టోబర్ 25) చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. చంద్రబాబు  అరెస్టును తట్టుకోలేక మరణించిన చిన్నస్వామి నాయుడు, ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను ఆమె తన తొలి రోజు యాత్రలో పరామర్శిచారు. అనంతరం నిజం గెలివాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భేటీ అవుతారు.   వారానికి మూడు రోజుల పాటు చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. గత 47రోజులుగా జైలులో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలుపనున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతోపాటు అండగా ఉంటామంటూ భరోసాను నారా భువనేశ్వరి ఇవ్వనున్నారు. మొత్తం మీద నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ద్వారా తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా మరింత జోష్ తో ముందుకు కదిలేందుకు అవసరమైన చైతన్యాన్ని నింపుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

వైసీపీ వైనాట్ 175ధీమా వెనుక భారీ కుట్ర ఓట్ల గల్లంతే!

వైసీపీ వైనాట్ 175 నినాదం గురించి తెలిసిందే. మూడు నాలుగు నెలల క్రితం వరకూ ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు ఈ నినాదాన్ని ఊదరగొట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ వైనాట్ 175 అంటూ క్యాడర్ చెవులలో మార్మ్రోగించారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని చూశారు. కానీ, ఆ తర్వాత మెల్లగా వైసీపీ చేయించుకున్న సొంత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలలో ప్రజలలో వ్యతిరేకత చూసిన వైసీపీ నేతలు కాస్త సౌండ్ తగ్గించారు. అయితే, అసలు వైనాట్ 175 అనేంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలను వెంటాడాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం సహా కీలక నేతలు, ఉద్దండులు గల స్థానాలతో సహా మావే అంటూ వైసీపీ ప్రకటించడం ఒక రకంగా దుస్సాహసమే. అయితే, ఇదేదో తమ పనితనాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారనో.. తమ పాలన అంత సుభిక్షంగా సాగడం వలనో.. తమ ప్రభుత్వం ప్రజలను అంత గొప్పగా ఉద్ధరించడం వలనో వచ్చిన కాన్ఫిడెన్స్ కాదన్నది ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నిజం.  వైసీపీ అందిపుచ్చుకున్న వైనాట్ 175 నినాదం వెనుక అతి పెద్ద కుట్ర ఉందని ఆది నుండి రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు కుట్రని ఇప్పుడు బయట పడుతున్నది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే గెలుపు తమదే అన్నది వైసీపీ ధీమా. జగన్ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ ప్లాన్ పకడ్బందీగా అమలు జరుగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తగా.. ఇద్దరు అధికారులపై వేటు కూడా పడింది. ఎన్నికల విధులకు సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం కూడా విధించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో భారీగా ఈ ఓట్ల తొలగింపు చేపట్టారు. దీంతో అక్కడి తెలుగుదేశం నేతలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టి బండారం బయటపెట్టారు. నిజానికి ఈ కుట్రను కూడా వైసీపీ అండ్ కో ఒక ప్లాన్ ప్రకారం నడిపించింది. సజ్జల నేతృత్వంలో ఏర్పాటైన ఓ టీమ్.. వాలంటీర్ల ద్వారా ఓటర్ల సమాచారం సేకరించి ఎన్నికల వ్యూహాలను రచించే ఐ ప్యాక్ టీంకి అందించడం.. ఎక్కడెక్కడ ఓట్లు తీసేయాలో ఐప్యాక్ టీం ప్రణాళిక రెడీ చేసి వైసీపీకి అందించడం.. ఎక్కడిక్కడ వైసీపీ నేతలు ఫామ్ 7లతో దరఖాస్తులు ఇవ్వడం.. వాటిని అధికారులు ధృవీకరించి తొలగించడం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం బయటపడడంతో కలకలం రేగింది. రంగంలోకి దిగిన ఈసీ దర్యాప్తు చేసి అధికారులపై వేటు వేసింది. బదిలీలను నిలిపివేసింది. అయినా ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడాపెడా బదిలీలు సాగుతున్నాయి. మరోవైపు సమయం చూసి ఇప్పుడు మరోసారి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని ఆచరణలోకి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్టుతో ఇటు నేతలు, అటు క్యాడర్ అంతా ఆ వైపే దృష్టి ఉంది. అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు, క్యాడర్ యాక్టివ్ గా ఉండేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి వైసీపీ ఫామ్ 7లతో ఈ ఓట్ల తొలగింపునకు సిద్దమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లు గల్లంతు అయినట్లు తెలుస్తున్నది. ఈ కొత్త ఓటర్ లిస్ట్ ఈనెల 27న రాబోతుంది. అందులో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు లేపేశారో బయటపడుతుంది. మరోవైపు మరోసారి ఓట్ల తొలగింపుకు సన్నాహాలు సిద్ధం చేసున్నారట. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందించబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఈసీ కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితమవుతున్నది తప్ప చర్యలు మాత్రం అమలవడం లేదు. మొత్తంగా చూస్తే ఇలాంటి కుట్రలతోనే వైసీపీ వైనాట్ 175 అంటూ రెచ్చిపోతున్నదని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

రాములోరి భూములనూ వదలని వైసీపీ నేతలు!

రాయలసీమ నుండి కృష్ణా జిల్లా వరకూ.. గోదావరి జిల్లాల నుండి ఉత్తరాంధ్ర వరకూ వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన భూకబ్జాలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని పేరిట విశాఖలో ఈ భూ అరాచకాలు కోకొల్లలు. ప్రకాశం జిల్లా కేంద్రంగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువే భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల బండారాన్ని మరో వైసీపీ నేతే బయట పెట్టారు. ఈ వ్యవహారంలో పదిమందిని అరెస్ట్ చేయగా.. ఈ కేసులో కీలక నేతలు కూడా అరెస్ట్ కావాల్సి ఉందని సదరు వైసీపీ నేతే చెప్తున్నారు. ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు సొంతం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. ఎక్కడ పోరంబోకు భూములు కనిపించినా మండలస్థాయి నేతల నుండి జిల్లా స్థాయి నేతల వరకూ ఎవరికి వారు  కబ్జాకు దిగుతున్నారు. కేవలం ప్రజల భూములే కాదు దేవుడి భూములను కూడా వదలడం లేదు. సుపరిపాలన అందించి ఆదర్శమూర్తిగా మూర్తీభవించిన సాక్షాత్తు శ్రీరాముల వారి భూములను కూడా మింగేశారు.  ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో 917 ఎకరాల భూమిని 1878లో సోమరాజు పురుషోత్తమరాజు రిజిస్టర్‌ డీడ్‌ ద్వారా భద్రాచలం దేవస్థానానికి బహూకరించారు. ఈ భూమి రాములవారిదే అయినా స్థానికులు కొందరు ఆక్రమించుకొన్నారు. ఈ భూముల విషయంలో దేవస్థానానికి వ్యతిరేకంగా ఆక్రమించుకున్న వారు  వివిధ కోర్టుల్లో కేసులు వేయగా దేవస్థానానికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఈ భూములకు దేవస్థానం పేరుతో పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండగా ఆన్‌లైన్‌లో కూడా వివరాలన్నీ దేవస్థానం పేరుతోనే ఉన్నాయి. 2005 నుంచి 2010 వరకు ఎకరాకు రూ.1,000 చొప్పున ఆక్రమణదారుల నుంచి డ్యామేజెస్‌ ఫర్‌ యూజ్‌ అండ్‌ ఆక్యుపేషన్‌ చార్జెస్‌ కింద వసూలు చేయగా 2021-22 నాటికి దీనిని రూ.4 వేలకు పెంచారు.   కాగా, రాష్ట్ర విభజన సమయంలో భదాద్రి దేవస్థానం తెలంగాణకు వెళ్లగా.. భద్రాద్రికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో భూములు ఉన్న ఈ భూములున్న ప్రాంతం పురుషోత్తమ పట్నం ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. అయితే, ఆక్రమణదారులు 2018 నుంచి ఆక్యుపేషన్‌ చార్జెస్‌ చెల్లించకపోగా.. చెల్లించేదిలేదని కరాఖండిగా చెప్తున్నారు. సరిగ్గా ఇక్కడే స్థానిక వైసీపీ నేతలు ఎంటరై ఆక్రమణదారులకు కాపాడడమే కాకుండా.. మరికొంత భూములను కూడా  కబ్జా చేసినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ మధ్యనే దేవస్థానం ఈ భూములను స్వాధీనం చేసుకొనేందుకు  ప్రయత్నాలు మొదలెట్టింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములలో 110 ఎకరాలలో దాతల సహకారంతో గోశాల నిర్మాణం చేపట్టారు. అయితే, ఈ నిర్మాణాన్ని ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారు. దేవస్థాన భూములను తిరిగి అప్పగించాల్సిన వివిధ శాఖల అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. మొత్తం 14 శాఖలు ఈ భూములకు రక్షణ కల్పించి దేవస్థానికి అప్పగించాల్సి ఉంది. హైకోర్టులో ఈ కేసు దాఖలైన రోజు నుండీ ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఇప్పుడు హైకోర్టు ఈ వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములను ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చి, ఇక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి దేవస్థానికి భూములు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ కబ్జా వ్యవహారం అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తున్నది. భూములలో అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ సిబ్బందిని దుర్భాషలాడిన అక్రమార్కులు, దాడులకు యత్నించారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, దేవాదాయ లాంటి మిగతా శాఖలు కూడా ఈ విషయంలో భద్రాద్రి ఆలయ అధికారులకు సహకరించడం లేదు. ఏపీ ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా రావడం లేదు. అయితే, దీని వెనక బడా వైసీపీ నేతల హస్తం ఉండడమే ఏపీలో ఏ శాఖ నుండి సహకారాలు అందడం లేదని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ అండదండలతో కబ్జా దారులు ఈ వ్యవహారంలో భద్రాద్రి అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో అయినా అధికారులు కబ్జాదారుల నుండి దేవాలయ భూములను ఖాళీ చేసి తిరిగి అప్పగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న రోడ్ రోలర్ 

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంటుందన్నప్రచారం విస్తృతంగా ఉంది. బిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ముచ్చెటమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ తో పాటు మరో పార్టీ చేరింది. మునుగోడు ఉపఎన్నికల్లో  వినిపించిన ఈ పార్టీ పేరు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వినిపించడంతో కెసీఆర్ వణికి పోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు ఉన్న యుగతులసీ పోటీ చేయనుండటంతో కెసీఆర్ భయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే  ఈ గుర్తుపై బిఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించి రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని కోరి భంగపడింది.  చేసేదేమిలేక కెసీఆర్ యుగతులసీ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ తో ప్రగతి భవన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం.   ప్రవళిక ఆత్మహత్య తర్వాత నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు కాకుండా ఇదే ప్రగతి భవన్ లో ప్రవళిక కుటుంబసభ్యులను పిలిపించి చర్చలు జరిపినట్లు  వార్తలు వచ్చిన సంగతి  తెలిసిందే.  ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మంత్రులకే అవకాశం లేని నేపథ్యంలో యుగతులసి పార్టీ అధినేతతో చర్చలు జరిపి ఎన్నికల్లో ఆ పార్టీ  పోటీ చేయడకుండా కెసీఆర్  శత విధాల ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.   తెలంగాణలో యుగ తులసి పార్టీకి ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇది పీడకలగా మారింది. అంతకుముందు, బీఆర్ఎస్  పార్టీ కారు గుర్తును పోలి ఉండే రోడ్ రోలర్‌ను కేటాయించడంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఎన్నికల సంఘం పార్టీ చిహ్నాల కేటాయింపులో  డ్రా నిర్వహించి యుగ తులసి పార్టీకి కేటాయించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేయవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘంకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు గుర్తును తొలగించడం అప్పట్లోసంచలనంగా మారింది. యుగ తులసి పార్టీ అధినేత కొలిశెట్టి శివ కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం అప్పట్లో ఆయనపై బదిలీ వేటు వేసింది.ఎన్నికల సంఘం యుగ తులసి పార్టీ , అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అనే రెండు రాజకీయ పార్టీల మధ్య రోడ్ రోలర్ గుర్తును కేటాయించేందుకు డ్రాను నిర్వహించింది. డ్రాలో యుగ తులసి పార్టీకి గుర్తును కేటాయించారు.

ఆ సామాజిక వర్గాలకూ సంక్షేమం.. జగన్ దింపుడు కల్లం ఆశ!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశ ఆరిపోయింది. ఈస్ట్ మన్ కలర్ లో, సినిమా స్కోపులో రానున్న ఓటమి కళ్లెదుట కనిపిస్తుంటే.. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుముంటున్న పరిస్థితి వైసీపీది. అయితే మేకపోతు గాంభీర్యమే, అతి విశ్వాసమో, అహంభావమో తెలియదు కానీ.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఏం చేసైనా సరే మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలన్న తాపత్రయం మాత్రం వదలడం లేదు.  ఇందుకు కారణమూ లేకపోలేదు. ఈ సారి అధికారం దక్కకుంటే ఇక వైసీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయన్నది ఆయనకు విస్పష్టంగా అర్ధమైపోయింది. ఈ సారి ఎన్నికలలో పరాజయం పాలై, చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అమరావతి, పోలవరంను పరుగులు పెట్టించి పూర్తి చేయడం ఖాయమన్న సంగతి జగన్ కు స్పష్టంగా తెలుసు. అదే జరిగితే అంటే పోలవరం, అమరావతి పూర్తయితే ఇక ఏపీలో వైసీపీకి స్థానం అనేదే ఉండదు. ఆ విషయాన్ని గుర్తించే ఏం చేసైనా సరే మరోసారి అధికార పగ్గాలను అందుకోవాలని జగన్ నేల విడిచి సాము చేయడానికి కూడా వెనుకాడటం లేదు.  నిజానికి చెప్పాలంటే 2019 ఎన్నికల సమయంలో కూడా వైసీపీదీ, జగన్ ది ఇదే పరిస్థితి. అప్పుడు కూడా అధికారమో, రాజకీయ సన్యాసమో అన్నట్లుగానే జగన్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఉంది. అయితే అదృష్టం కలిసి వచ్చింది.   2019లో కూడా అధికారం దక్కకపోతే తనకి ఇక భవిష్యత్ లేదని గుర్తించిన జగన్  ఆ ఎన్నికలలో  ఎన్ని వాడాలో అన్నీ వాడారు. బాబాయ్ దారుణ హత్య, కోడి కత్తి కేసు, తండ్రి రాజశేఖరరెడ్డిది హత్యేనని ప్రచారం, తల్లి,చెల్లిని ప్రచారానికి వాడుకోవడం, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కుట్రలు చేశారని ఆరోపణలు, తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మాయం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు, అమరావతి గ్రాఫిక్స్ అనే ప్రచారం, మేధావులుగా చెప్పుకొనే కొంతమందితో నిత్య అసత్య ప్రచారాలు ఇలా ఏం చేయాలో అవి చేయడమే  కాకుండా చేయకూడనివి కూడా చేసేశారు. ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచీ ఈ నాలుగున్నరేళ్లు ప్రజలకు  నరకం చూపారు. జగన్ పాలనలో సమాజంలోని అన్ని వర్గాల వారు అసంతృప్తి, అభద్రతా భావంతోనే కాలం గడుపుతున్నారు. అన్ని వర్గాల వారి నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే  తేల్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీదే అని పలు సర్వేలు పేర్కొన్నాయి. చివరాఖరికి జగన్ కు ఎన్నికల వ్యూహకర్త అయిన పీకే  కూడా చేతులెత్తేశారని అంటున్నారు. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్..  కుట్ర పూరితంగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారు. చంద్రబాబును జనంలో తిరగకుండా నిరోధించగలిగితే.. తెలుగుదేశంలో స్తబ్దత నెలకొంటుందనీ, సులువుగా ఎన్నికలలో చక్రం తిప్పేయొచ్చని భావించారు. అయితే జగన్ అనుకున్నది  ఒకటి అ యితే అయ్యింది మరొకటి  అయ్యింది. చంద్రబాబు  అక్రమ అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులే కాదు.. సామాన్య  జనం, రాజకీయాలకు సంబంధం లేని తటస్థ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం  చేశాయి. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశాయి. దీంతో చంద్రబాబు అక్రమ అరెస్టుతో వైసీపీ ఓటమి మరింత ఖరారైంది. వైసీపీకి చంద్రబాబు అరెస్టు పూడ్చలేని నష్టాన్ని  చేకూర్చిందని తేలడంతో  దీని నుండి బయట పడేందుకు ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు ప్రజలలో అసంతృప్తిని ఎలా తగ్గించాలని కోటాను కోట్లు ఖర్చు చేసి ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో వైసీపీకి   ఏకైన ఆయుధం ఏదైనా ఉందంటే అది సంక్షేమం మాత్రమే. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టనీ, ముక్కు పిండి వసూళ్లు చేసి ఆ డబ్బులే వివిధ పేర్లతో పంచనీ, రకరకాల పేర్లతో పన్నులు బాది వాటినే తిరిగి ప్రజలకు జమ చేయనీ.. అప్పులు చేసి, ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇవ్వక ఎలాగోలా   బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరం చేశారు.  అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు, వ్యవసాయం, నీటి పారుదల, పరిశమ్రలు, టెక్నాలజీ లాంటివి అసలు తమకు పట్టనే పట్టవనీ,   సంక్షేమం ఒక్కటే తమ పాలసీ అన్నట్లుగా  జగన్ పాలన కొనసాగించారు. ఆ సంక్షేమం కూడా అనేక కోతలతో అరకొరగానే సాగింది.  దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ఆయా సామాజికవర్గాలలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఇది గమనించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. గత ఏడాది నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోతలు ఎక్కువయ్యాయి. ఆర్థిక‌ భారం నుంచి స‌ర్కారు త‌ప్పించుకునేందుకు ఈ చర్యలకు దిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కొన్ని సామాజికవర్గాలకు అసలు వైసీపీ సంక్షేమం చేరనే లేదు. అందులో ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలలో నేటికీ ఒక్క రూపాయి సంక్షేమ ఫలాలు దక్కని కుటుంబాలు ఉన్నాయి. తమ సిద్ధాంతమే బటన్ నొక్కుడు కాగా.. అదే అసలు అందకపోతే వారి అసంతృప్తి అంతా ఇంతా కాదు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధి పొంద‌ని కుటుంబాల‌ను ఎంపిక చేసి వారికి ప్ర‌త్యామ్నాయంగా ఏం చేయాలన్నయోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా కోటి కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా.   వీటిలో ముఖ్యంగా కాపు, రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాలే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కుటుంబాలకు వ‌చ్చే మూడు నెలల్లో ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలను  అమ‌లు చేయాల‌ని తాడేపల్లి కేంద్రంగా ప్రణాళికలు సిద్దమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే పరిశీలకులు మాత్రం చివరి క్షణంలో సంక్షేమం పేరుతో ప్రణాళికలు రూపొందించడాన్ని  జగన్ దింపుడు కళ్లెం ఆశగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అత్యాచారం కేసులో మురళీముకుంద్ అరెస్ట్, రిమాండ్

జూబ్లీ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ ను పోలీసులు అరెస్టు చేశారు.     తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నేరంపై మురళీముకుంద్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనను రిమాండ్ కు ఆదేశించింది.  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీముకుంద్‌ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు  న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడు మరళి ముకుంద్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలిచారు.   ఇదే కేసులో మురళీముకుంద్ కుమారుడు ఆకాశ్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. హైదరాబాద్  బంజారాహిల్స్ మిథిలానగర్ లో నివాసం ఉండే మురళి ముకుంద్ ఇంట్లో  ఓ ఏగ్రేడ్ ఏజెన్సీ ద్వారా పనిమనిషిగా చేరిన యువతిని తన కుమారుడితో సహా వేధింపులకు గురి చేశారు.  ఈ ఏడాది  జూన్ 18న   మురళి ముకుంద్ నివాసంలో పని మనిషిగా  చేరిన యువతికి అలా చేరిన నెల రోజుల నుంచే  వేధింపులు ఎదురయ్యాయి. పలు మార్లు ఈ విషయమై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. తాను పని చేస్తున్న ఇంటి యజమాని మురళి ముకుంద్ మామూలు వ్యక్తి  కాదు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్. మురళి ముకుంద్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించే వాడు. ఆ క్రమంలోనూ  జూలై 16 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మురళి ముకుంద్ ఆమెను తన బెడ్ రూంలో బెడ్ షీట్ మార్చాలని ఆదేశించాడు. దీంతో ఆమె బెడ్ రూంలోకి వెళ్లగానే ఆమె ప్రతిఘటించేలోగానే రూం తలుపులు మూసేసి స్నానం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. తిరస్కరిస్తే బెదరింపులకు దిగాడు. ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించడంతో ఆమె బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసింది. బాత్ రూంలో ఆమె స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలూ చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించాడు. తీవ్ర భయాందోళనకు గురైన  ఆ యువతి మురళీముకుంద్ కుమారుడు ఆకాష్ కు చెప్పింది. అయితే  ఆకాష్ బాధితురాలిని తీవ్రంగా కొట్టి విషయం బయటపెడితే చంపేస్తానని  బెదరించాడు. అంతే కాకుండా తమ ఇంట్లో సిమ్ కార్డ్ చోరీ చేసిందంటూ ఎదురు కేసు పెట్టారు. తనను తీవ్రంగా  కొట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీచేసుకోమని వారు ఆమెనే మందలించారు. దీంతో దిక్కుతోచక ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పలేకపోయింది. చెబితే తననూ తన తల్లినీ చంపేస్తామని మురళి ముకుంద్, అతని కుమారుడు ఆకాష్ బెదరించడంతో మౌనంగా ఉండిపోయింది. తర్వాత కూడా అత్యాచార పర్వం కొనసాగిస్తుండటంతో ఆమె విషయాన్ని తల్లికి  చెప్పి ఆమెతో కలిసి ఈ  నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని  భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు నిందితులు మురళీముకుంద్, అతని కుమారుడు ఆకాష్ పై కేసు నమోదు చేశారు. 

ఎపికి పొంచి ఉన్న అసాని తుఫాను

ఏపీకి తుఫాను గండం పొంచి ఉంది. ఈ విషయాన్ని  వాతావరణ శాఖ ధ్రృవీకరించింది.. విశాఖకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన అసాని తుఫాన్‌ మరో 6 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాంలో రెండ్రోజులపాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత మార్చిలో భారీ తుఫానుతో ఎపి అతలాకుతలం అయ్యింది. అప్పట్లో భారీ విధ్వంసం, ఆస్తి నష్టం జరిగింది.   తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుఫాను పేరు అసానిగా నామకరణం చేసింది శ్రీలంక. తమిళభాషలో అసాని అంటే రౌద్రం. అసాని ఈ సాయంత్రానికి తుపానుగా మారి... ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది.  కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్ డేట్ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఎపిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

బీఆర్ఎస్ రైతు రుణమాఫీకి తిలోదకాలిచ్చేసిందా?

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఊసే లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రుణమాఫీకి బీఆర్ఎస్ తిలోదకాలిచ్చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతాంగం రుణమాఫీ  హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని  బీఆర్ఎస్ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటుంటే.. రైతులు మాత్రం  పెదవి  విరుస్తున్నారు. రైతు బంధు సహా పది హామీలను ప్రకటించిన కేసీఆర్ రుణమాఫీని మాత్రం పూర్తిగా విస్మరించారు. పాత విధానాలు అన్ని  యథావిథిగా కొనసాగుతాయని మేనిఫెస్టోలో ప్రకటించినా.. రైతు రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్ష వరకు రుణమాఫీపై బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) విస్పష్ట హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ హామీని 2018 ఎన్నికల సమయంలోనూ పునరుద్ఘాటించింది. ఫస్ట్ టర్ములో నాలుగు విడతల్లో అమలు చేసినట్లుగానే రెండో టర్ములో కూడా సంపూర్ణం చేస్తామని అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ నాలుగున్నరేండ్లు పూర్తయ్యి ఎన్నికలకు వెళ్తున్నా ఇంకా బకాయిలు ఉండిపోయాయి. గత రెండు ఎన్నికలలోనూ మేనిఫెస్టోల్లో రుణమాఫీ గురించి విస్పష్ట హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈసారి  మేనిఫెస్టోలో కనీసంగానైనా ప్రస్తావించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  2014 మేనిఫెస్టోలోనూ,  2018 ఎన్నికల మేనిఫెస్టోలో నూ చేర్చినా.. ఇప్పుడు మాత్రం దానిని కనీసం ప్రస్తావించకపోవడంతో  కేసీఆర్ రుణమాఫీపై చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దీనిపై జనం ప్రశ్నలకు బీబర్ఎస్ నేతలు సమాధానం ఇవ్వడం లేదు.  గత ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చినా  అది సంపూర్ణంగా నెరవేరకపోవడంతో.. బకాయిల సంగతేమిటని రైతులు నిలదీస్తున్నారు.  రుణమాఫీ అంశంలో కేసీఆర్ మౌనంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.   ఇలా ఉండగా కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇప్పుడు రుణమాఫీ వ్యవహారం బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. 

తెలంగాణలో చలి తీవ్రత 

ఈసారి తెలంగాణలో శీతాకాలం కాస్త ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి. అక్టోబర్ నెల ప్రారంభమైన తర్వాత కూడా ఎండలు భగ్గుమన్నాయి. చాలా చోట్ల ఏకంగా 33 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నవంబర్‌ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. అయితే రుతుపవనాల తిరోగమనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.చల్లటి గాలుల కారణంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. మెదక్, హనుమకొండ, రామగుండం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  అక్టోబర్‌ నెలలో కూడా వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. తెలంగాణలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాత్రి సమయంలోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రంలో నెమ్మదిగా చలి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరకున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అత్యల్పంగా హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండతో పాటు మెదక్‌, రామగుండంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్‌, భద్రాచలంలో మాత్రం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో మాత్రం 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం.

లోకేష్, పవన్ భేటీ.. వైసీపీకి లోన వణుకు.. పైకి మేకపోతు గాంభీర్యం!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచినప్పటికీ.. తెలుగుదేశం పార్టీలో జోష్ ఇసుమంతైనా తగ్గలేదు. సరికదా.. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ పతనమే లక్ష్యంగా మరింత దృఢసంకల్పంతో  కేడర్ ముందుకు సాగుతున్నది.  అతెలుగుదేశం క్యాడర్ లోనే కాదు.. తటస్థులు, సామాన్య జనంలో కూడా ఇదే భావన వ్యక్తం అవుతోంది.   మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించి  జనంలో కొత్త జోష్ నింపారు. అయితే జనసేనాని తెలుగుదేశంతోనే కలిసి వెడతామని ప్రకటించి 45 రోజులైనా.. ఆ దిశగా రెండు పార్టీల మధ్యా  ఉమ్మడి కార్యాచరణ దిశగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో జనం ఒకింత అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. అసలు పొత్తు ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ అసహనానికీ, అనుమానాలకీ తెర దించుతూ రెండు పార్టీల పెద్దలు కలిసి ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. రాజమండ్రి మంజీరా హోటల్‌ వేదికగా సోమవారం (అక్టోబర్  23)న జరిగిన భేటీలో టీడీపీ, జనసేన నేతలు సమన్వయ కమిటీ సభ్యులతో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరిపారు. సమన్వయ కమిటీలలో ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల సమన్వయ కమిటీలతో  నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించారు. గ్రామీణ స్థాయిలో పార్టీల బలోపేతం, ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలు, క్షేత్రస్థాయికి పొత్తు అంశాన్ని బలంగా తీసుకెళ్లడంపై చర్చించారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహించిన తొలి సమావేశం ఇదే .   45 రోజులుగా చంద్రబాబు నిర్బంధంలో ఉన్న రాజమహేంద్రవరంమే రెండు పార్టీల భేటీకి అక్కడే వేదిక కావడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు. ముందుగా నారా లోకేష్ రాజమండ్రి తెలుగుదేశం క్యాంపు కార్యాలయంలో పార్టీ  సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కళ్యాణ్ తో  భేటీ అయ్యారు.   కాగా, సమన్వయ కమిటీలతో భేటీ అయ్యాక నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతకు ముందే  సోమవారం (అక్టోబర్ 10) ఉదయమే  నారా లోకేష్ చంద్రబాబును ములాఖత్ లో కలిసి చర్చించారు.. పలు అంశాలపై సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ భేటీ.. అనంతరం పవన్-లోకేష్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పవన్, లోకేష్ భేటీతో తెలుగుదేశం, జనసేన నాయకులలో జోష్ పెరిగింది. అంతకు మించి  వైసీపీ నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన పెరిగిపోయింది. ఈ సమావేశంతో  ఏపీ రాజకీయాలలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇరు పార్టీలూ వేరువేరుగా అంటే పొత్తు లేకుండా ఉన్నసమసయంలోనే వైసీపీ పట్ల వ్యతిరేకత పీక్స్ లో ఉంది. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. గుడ్డిలో మెల్ల అన్నట్లుగానైనా గెలుస్తామన్న ఆశ వైసీపీలో మిణుకు మిణుకు మంటుండేది. అయితే   రెండు పార్టీలూ కలిసి రంగంలోకి దిగితే.. సోదిలోకి కూడా మిగలం అన్న ఆందోళనతోనే వైసీపీ నేతలు ఇరు పార్టీల మధ్యా పొత్తు లేకుండా చేయడానికి నానా విధాలుగా  ప్రయత్నించారు. ఒంటరి పోరు.. దమ్ము అంటూ సవాళ్లు విసిరారు. అయితే ఇరు పార్టీలూ జగన్ ను గద్దెదించాలన్న ప్రజల ఆకాంక్షను సాకారం చేయడమే లక్ష్యం అంటూ కలిసే పోటీలో దిగడానికి సిద్ధం అవ్వడంతో  వైసీపీ వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు.   ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ  నాదశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ  తెలుగుదేశం. క్షేత్రస్థాయి నుండి బూత్ స్థాయి వరకూ నాయకత్వం, నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదార్శనికుడు, దార్శనికుడు చంద్రబాబు సారధ్యంలో సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలచుకోవడం అలవాటుగా మార్చుకున్న పార్టీ తెలుగుదేశం. ఇక పవన్ కళ్యాణ్ కున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, సినీ గ్లామర్ జనసేనకు ప్రధాన ఆకర్షణ. అన్నిటికీ మించి ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, వ్యతిరేకత, ప్రజాగ్రహం కూడా తోడై ఈసారి వైసీపీకి ఘోర పరాజయం తప్పదేనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. వాళ్లలోనూ, వీళ్లలోనూ కాదు.. ఏకంగా వైసీపీ శ్రేణులలోనే ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు, మంత్రులూ కూడా అంతర్గత సంభాషణల్లో, తమ అనుచరులతో భేటీలలో ఈ విషయాన్నే చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరిగిన లోకేష్, పవన్ భేటీ  వైసీపీలో అలజడి పెరిగింది. భయం మొదలైంది. ఇప్పటికే సర్వేల ఫలితాలను, ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్నీ చూసిన వైసీపీ నేతలకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది.  పైకి మేకపోతు గాంభీర్యం పదర్శిస్తున్నా ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి సహా.. వైసీపీ పెద్దలను కూడా  తెలుగుదేశం, జనసేన పొత్తు కలవరపెడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గజ్వేల్.. కామారెడ్డిలో కేసీఆర్ టార్గెట్ గా పెద్ద సంఖ్యలో నామినేషన్లు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో ‘కీలక’ పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్నుంచే పోటీ చేస్తారా? మరో  నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా?  నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ విషయంలో రాజకీయవర్గాలలో వినిపించిన ప్రశ్నలివి. కుమారుడికి సీఎం పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన సీఎం కేసీఆర్ కు కాలం కలిసిరావడం లేదు. బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అన్న భావన ప్రజలలోకి బలంగా వెళ్లడంతో.. ఆయన ముందు రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా విపక్షాలు వేటికవిగా ఆయన సిట్టింగ్ స్థానం అయిన గజ్వేల్ టార్గెట్ చేయడంతో కేసీఆర్ మరో నియోజకవర్గాన్ని కూడా సేఫ్ సైడ్ గా ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి వచ్చిందంటేనే తెలంగాణ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అని చెప్పుకునే కేసీఆర్ ఎంత డిఫెన్స్ లో పడ్డారన్నది అవగతమౌతుంది.  అసలు కేసీఆర్ ఎన్నికల వ్యూహ రచన ప్రత్యర్థి పార్టీల నేతలకే కాదు.. సొంత పార్టీ నేతలకే అంతుబట్టదు అని నిన్నమొన్నటి వరకూ అంతా భావించే వారు. కానీ ఎందుకే ఈ సారి ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఆయన మాటే శాసనం అనే పరిస్థితి పార్టీలో లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.  ఆయన ఏ ముహూర్తంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారో ఆ రోజు నుంచే పార్టీలో అసమ్మతి భగ్గుమంది. అంతకు ముందు వరకూ ఆయనకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన రాజయ్య, మైనంపల్లి వంటి వారే తొలుత అసమ్మతి గళం వినిపించారు. మైనంపల్లి అయితే నేరుగా  కేసీఆర్ సమీపబంధువు, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించి సంచలనం సృష్టించారు. అన్నిటికీ మించి ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరెవరికీ దక్కని వెసులుబాటు కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు దక్కడంతో విపక్షాలు గతం నుంచీ మొదటి నుంచీ వినవస్తున్న బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. అంతే కాకుండా సొంత పార్టీలో సైతం ఆ అనుమానాలు బలపడ్డాయి.  దీంతో సొంత పార్టీలోనే ఆయన పట్ల ఒకింత అనుమానాలు పొడసూపాయి. కల్వకుంట్ల కవిత కోసం ఆయన బీజేపీతో లాలూచీపడ్డారా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తం అయ్యాయి. అలాగే గతంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీ గేట్లు బార్లా తెరిచేయడంతో ఇప్పుడు చాలా వరకూ నియోజకవర్గాలలో  రెండు అంతకంటే ఎక్కువ వర్గాలు ఏర్పడ్డాయి.  దీంతో అభ్యర్థుల తొలి జాబితా విడుదల తరువాత పార్టీలో వలసలు పెరిగియి. గేట్లు తెరిచేసినట్లుగా ఆ వలసలు ఒక ప్రవాహంగా మారాయి. ఎన్నికల ముంగిట, అదీ అధికార పార్టీ నుంచి వలసలు పెరగడం కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరంగా మారిందని చెప్పకతప్పదు. అన్నిటికీ మించి కేసీఆర్ ను లక్ష్యంగా  చేసుకుని గజ్వేల్ లో పోటీ చేస్తామంటూ సవాల్ విసురుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో.. ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన కుమార్తె కవితకు ఎదురైన అనుభవం గుర్తుకు వచ్చింది. అందుకే ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఈటలకు గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి బీజేపీ అధిష్ఠానం పచ్చ  జెండా ఊపింది. ఈటల బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి, అలాగే ఆయన సొంత నియోజకవర్గం నుంచీ కూడా పోటీలో దిగుతున్నారు. అదే విధంగా రేవంత్ కూడా గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. అలాగే ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా పోటీలో దిగనున్నారు. దీంతో గజ్వేల్ లో నిస్సందేహంగా కేసీఆర్ గడ్డుపరిస్థితిని ఎదుర్కోనున్నారు. ఇది చాలదన్నట్లు.. అమరుల కుటుంబాలకు చెందిన వారు కూడా కేసీఆర్ ను లక్ష్యం చేసుకుని వందల సంఖ్యలో గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ లు దాఖలు చేయాలని నిర్ణయించడంతో కేసీఆర్  కు వచ్చే ఎన్నికలు ఒకింత ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి.   అసలు ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండానే.. ఆయనను వ్యతిరేకించే వారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. వీరి సంఖ్య తక్కువగా ఏమీ లేకపోవడంతో  బీఆర్ఎస్ పై ప్జా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది అందరికీ తెలిసిపోయింది. దానికి తోడు తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండు సార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టినాం ఒక సారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇద్దాం అన్న భావన మెజారిటీ ప్రజలలో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఆందోళన.. కేంద్ర బృందం సందర్శన

కాళేశ్వరం బ్యారేజి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన   మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డ్యామ్ భద్రత, బ్యారేజీ భద్రత  పరీక్షించాల్సిన అవసరం ఉందంటూ, ఇందు కోసం కేంద్ర  బృందాన్ని పంపాలంటూ.. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్నిపంపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ బృందం హుటాహుటిన  తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై.. కాళేశ్వరం డ్యామ్ ను సందర్శించింది. కాగా కాళేశ్వరం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.   మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. 6వ బ్లాక్‌లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయనీ, ఆ సందర్భంగా భారీ శబ్దాలు వెలువడటంతో స్థానికులు భయందోళనలకు గురయ్యారనీ పేర్కొన్నారు. మెడిగడ్డ ఫిల్లర్లు కుంగిన వెంటనే  బ్యారేజ్ లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేశారని వివరించారు.  సాగునీటికోసం నిలువ చేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదిలేయడంతో.. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంతా జాగరణ చేసి భయంతో గడిపారని పేర్కొన్నారు.   అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా?  నిర్వహిస్తే ఆ పరీక్షల్లో ఏం తేలింది? ఇత్యాది విషయాలను గోప్యంగా ఎందుకు ఉంచారు. మేడిగడ్డ  పిల్లర్లు కుంగిన నేపథ్యంలో   స్థానికులలోనూ, ఇంజినీరింగ్ నిపుణులలోనూ ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే పిల్లర్ల నిర్మాణం నాసిరకంగా జరిగిందని ఈ కుంగుబాటుతో తేటతెల్లమైందని, అక్కడ సాయిల్ ట్రీట్ మెంట్ జరగలేదని ఈ సంఘటనతో రుజువౌతోందని కిషన్ రేడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తాజా పరిస్థితికి ఎవరు బాధ్యులనే విషయాన్ని సత్వరమే తేల్చాలని ఆయన ఆ లేఖలో కోరారు.   నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఆయన లేఖకు వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి నిపుణుల బృందాన్ని ప్రాజెక్టు తనిఖీ కోసం పంపించారు. తొలి నుంచీ కాళేశ్వరం భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. గతంలో భారీ వరదకు ప్రాజెక్టు ముంపునకు గురైన సందర్భంలోనే ఈ అనుమానాలు వెల్లువెత్తాయి. అప్పట్లో ప్రాజెక్టు సందర్శనకు ఎవరినీ అనుమతించలేదన్న విషయం విదితమే. ఇప్పుడు  కూడా మెడిగడ్డ ఫిల్లర్లు కుంగిన తరువాత ఆ ప్రాంతానికి రాజకీయ పార్టీల నేతలను అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.