ఎంట్రీ అదుర్స్.. హృదయాలను తాకిన నారా భువనేశ్వరి ప్రసంగం!
posted on Oct 26, 2023 @ 9:55AM
నారా భువనేశ్వరి.. ఎన్టీఆర్ తనయ, నారా చంద్రబాబు సతీమణి.. నారా లోకేష్ అమ్మ.. నందమూరి బాలకృష్ణ సోదరి.. కుటుంబంలో అందరూ రాజకీయ రంగంలో ఉన్నవారే. తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా పని చేశారు. కుమారుడు మంత్రిగా సత్తా చాటుకున్నారు. సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే. నాలుగు దశాబ్దాలుగా ఆమె కుటుంబంలోని వారంతా రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారు. ఉన్నత పదవులను అధిరోహించారు. ప్రజల గుండెల్లో కొలువయ్యారు. అయినా నారా భువనేశ్వరి ఇంత వరకూ ఎక్కడా రాజకీయ వేదికలపై కనిపించింది లేదు. రాజకీయ ప్రసంగాలు చేసింది లేదు.
తొలి సారిగా.. అదీ తన భర్త నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ఆమె తొలి సారిగా ప్రజలలోకి వచ్చారు. చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో తనదైన శైలిలో చెప్పారు.
నిజం గెలవాలి అంటూ చంద్రబాబు అరెస్టుతో ఆవేదనకు గురై గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె యాత్ర చేపట్టారు. తొలి రోజు ఆమె చంద్రగిరిలో తొలి సారిగా బహిరంగ సభలో ప్రసంగించారు. తన ఆవేదననే కాదు.. జనం ఆవేదననూ ఆమె తన ప్రసంగంలో కళ్లకు కట్టారు. అభివృద్ధి, సంక్షేమం జమిలిగా దౌడు తీయించిన చంద్రబాబును ఆ రెండిటి గురించీ కనీస అవగాహన లేని జగన్ సర్కార్ ఎంత అక్రమంగా అరెస్టు చేసిందో జనం హృదయాలను తాకేలా చెప్పారు. ఆమె ప్రసంగం ఆది నుంచి అంతం దాకా జనం చేత కన్నీళ్లు పెట్టించింది. ఆమె ప్రసంగం జనం కన్నీళ్లు తుడిచింది. తాను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి కాదు తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి వచ్చాననీ, అలాగే తన భర్త అరెస్టుతో ఆవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చానంటూ ప్రసంగాన్ని ఆరంభించిన భువనేశ్వరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర ఉందని ఉద్ఘాటించారు. అలాగే రెవెన్యూలోటుతో మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించేందుకు చంద్రబాబు పడిన తపనను, శ్రమను జనం కళ్ల ముందు సాక్షాత్కరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మహానగరానికి సైబరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించి అందించిన చంద్రబాబు విజన్ ను వివరించారు. చంద్రబాబు ముందు చూపుతో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసి లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపారని గుర్తు చేశారు. సంపద పెంచి ఆ పెంచిన సంపదను ప్రజలకు పంచాలన్న ఆకాంక్షతో ఆయన చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సంక్షేమం అంటే ఉత్తుత్తినే సొమ్ము పంచడం కాదనీ, ఆ పంచిన సొమ్ముతో పేదల సొంత కాళ్ల మీద నిలబడి సంపాదనా పరులు కావడానికి మార్గం చూపడమేనని చంద్రబాబు తన పాలనా కాలంలో చెప్పారనీ, చెప్పింది చేశారనీ వివరించారు. అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా జైల్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరే స్త్రీకి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వ నిర్బంధకాండను, అరాచక తీరును ప్రజలకు వివరించేందుకే తాను ఇప్పుడు బయటకు వచ్చాననీ చెప్పారు.
రాష్ట్రం మొత్తాన్ని జగన్ సర్కార్ ఒక జైలుగా మార్చేసిందనీ, ఎక్కడికక్కడ ఆంక్షలూ, నిర్బంధాలతో జనాలను వేధిస్తోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి కనిపించడం లేదనీ, అసలా మాటే వినబడటం లేదనీ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు, అరాచకాలు, అత్యాచారాలే తప్ప ప్రగతి, పురోగతి జాడే లేదని వివరించారు.
ఔను నారా భువనేశ్వరి తొలి సారిగా జనం మధ్యకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ఆమెలో ఎక్కడా తడబాటు కానీ, బెరుకు కానీ కనిపించలేదు. స్పష్టంగా సూటిగా విశేషణాలు, అతిశయోక్తులు మచ్చుకైనా లేకుండా ప్రజల మనసులను తాకేలా ఆమె ప్రసంగం ఉంది. ఎవరో రాసిచ్చిన స్పీచ్ ను వేదికపై చదవడం కాదు.. తన హృదయాంతరాళలోని ఆవేదననూ, ఆవేశాన్నీ ఆమె చంద్రగిరి సభా వేదిక నుంచి జనంతో పంచుకున్నారు. అందుకే ఆమె ప్రతి మాటా సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకుంది. ఆమె ప్రసంగంలో చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి చెబుతున్నసమయంలో ప్రజలు కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ఆమె ప్రసంగం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగిన నాటి నుంచీ జనంలో, తెలుగుదేశం తమ్ముళ్లలో గూడుకట్టుకున్న ఆవేదనకు, ఆవేశానికి భువనేశ్వరి ప్రసంగం అద్దం పట్టింది. ఆమె ప్రసంగం తెలుగు తమ్ముళ్లనే కాదు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా గత నెలన్నరగా ఆందోళనలు చేస్తున్న అశేష ప్రజానీకానికి ఊరట ఇచ్చింది. కన్నీళ్లు తుడిచింది. కలిసి పోరాడుదాం అన్న ధీమానిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. మొదటి ప్రసంగంతోనే భువనేశ్వరి తన పరిణితిని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా అధికార వైసీపీ నేతలూ, మంత్రులలా చవకబారు విమర్శలకు తావివ్వకుండా..సూటిగా, స్పష్టంగా ప్రభుత్వ తప్పిదాలను హుందాగా ఎత్తి చూపిన భువనేశ్వరి ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.