రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం టు ఉండవల్లి.. బాబుకు అడుగడుగునా జననీరాజనం!
స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో తెలుగుదేశం శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు బెయిలు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే జైలు సిబ్బంది చంద్రబాబు బ్యాకర్‌కు వెళ్లిఆయనకు ఆ సమాచారం తెలిపినట్లు తెలిసింది. మంగళవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 3 -4 గంటల మధ్య చంద్రబాబు విడుదలయ్యే అవకాశంఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్లాలనీ మార్గ మంతటా ఆయన అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ నీరాజనాలు పలికేలా తెలుగుదేశం రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ఊరేగింపుతో చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారని తెలుస్తోంది. రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్‌ను ఇప్పటికే రెడీ చేసి, దీనిపై లోకేష్ తో తెలుగుదేశం నేతలు చర్చించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే బెజవాడ నుంచి చంద్రబాబు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ వెళ్లి ఎల్వీ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా చంద్రబాబు జైలు నుంచి విడుదల కాగానే అక్కడ నుంచి భారీ ఊరేగింపుతో లాలా చెరువు ,మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి ), జొన్నాడ సెంటర్, రావులపాలెం, సిద్ధాంతం సెంటర్, పెరవలి, తణుకు , తాడేపల్లిగూడెం, నల్లజర్ల , భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల , దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం, రామవరప్పాడు రింగ్ రోడ్, పెనమలూరు, కనకదుర్గ వారధి గుంటూరు, మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మీదుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జైలు నుంచి విడుదల కాగానే ఆరంభమయ్యే యాత్ర రాత్రి 9.20 గంటలకు ఉండవల్లిలో ముగియనుంది.