నిన్ను వదల కేసీఆర్ వదల.. వెంటాడుతున్న కాళేశ్వరం అవినీతి
posted on Oct 26, 2023 @ 3:50PM
కాళేశ్వరం ప్రాజెక్టు మీద, దాని డిజైన్ మీదా తొలి నంచీ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ అనుమానాలు బలపరిచిన తొలి ఘటన 2022 వరదలు. గోదావరి నదికి భారీగా వచ్చిన నాటి వరదలకు ఆ ప్రాజెక్టు పంపు హౌజులు మునిగిపోయాయి. మేడిగడ్డ దగ్గర కూడా పంపు హౌస్ కూడా మునిగింది. పంపు హౌస్ గోడ కూలింది. వీటిని తిరిగి పని చేసేలా చేయడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టింది. అంతేకాదు, కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఫిల్లర్లు కుంగిన సంఘటనతో అనుమానాలన్నీ వాస్తవమేనా అన్న సందేహాలు వెల్లువెత్తుతుున్నాయి. కేసీఆర్ కూడా ఇలా ఎందుకు జరిగింది? బరాజ్ ఎందుకు కుంగిందంటూ బాగా టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు. ఎందుకంటే పిల్లర్ కుంగిపోవటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎప్పుడైతే బ్యారేజి పిల్లర్ కుంగిందో, వెంటనే బ్యారెజీ కూడా కుంగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. . కారణమేదైనా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగటం ఈ ఎన్నికల్లో బిగ్ ఇష్యూగా మారిందనడంలో సందేహం లేదు. బ్యారేజి నిర్మాణంలో కేసీయార్ భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలో కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అర్ధంకావటంలేదు. కాంక్రీట్ స్ట్రక్చర్ లో లోపం కారణంగానే బ్యారేజి పిల్లర్ కుంగిందని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయాణ ప్రకటించారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే అతి పెద్ద లోపం ఉందని.. అక్కడ డిజైన్ తేడా ఉందని, నిపుణులు చెబుతూనే ఉన్నారు. అతి వేగంగా నిర్మించి.. క్వాలిటీని పట్టించుకోలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.... ఇరిగేషన్ శాఖ కూడా కేసీఆరే నిర్వహిస్తున్నారు. ఎప్పుడో, దశాబ్దాల కిందట కట్టిన బ్యారేజులు, ప్రాజెక్టులు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ పట్టుమని ఐదేళ్లు కాకుండానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో కేసీఆర్‌కు అర్థం కావడం లేదంటున్నారు.
విషయం ఏమిటంటే...
ఉత్తర తెలంగాణకు ప్రాణహిత నీరు అందాలంటే మేడిగడ్డే ఆధారం. అలా మేడిగడ్డ నుంచి నీటిని గోదావరిలో వెనక్కు తోడాలి. కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు నిలువ ఉంచే పరిస్థితే లేదంటున్నారు సాగునీటి నిపుణులు. ప్రస్తుతానికి ఉన్న నీరంతా ఖాళీ చేసేశారు.
దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి కానీ, ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడ నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు. అంటే మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికే గండి పడే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే ఇరుక్కున్నారు. ఎందుకంటే....
1) మేడిగడ్డ బరాజ్, కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది?
20వ నంబర్ దిమ్మ 20వ తేదీ, అదే శనివారం రాత్రి నుంచే కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడంతా రహస్యంగా ఉంది. మీడియాను అటు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గతంలో కాళేశ్వరం పంప్ హౌసులు మునిగినప్పుడు కూడా మీడియాను అనుమతించలేదు. రహస్యంగానే ఉంచారు.
ఈ దారుణానికి కారణం నిర్మాణంలో.... నాణ్యతా లోపమే అంటున్నారు తెలంగాణ ఇంజినీర్ల ఫోరం కన్వీనర్ దొంతి లక్ష్మీ నారాయణ. కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగింది. ఫౌండేషన్ సరిగా చేయలేదు. అందులో లోపం ఉంది. దానివల్ల కొంత కాలంగా కొంచెం కొంచెం ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూపోయి ఇప్పుడు కుంగింది. రాతి పునాది వేరు. ఇది ఇసుక పునాది. ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఉదాహరణకు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాది అయినప్పటికీ బలంగా ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది’’
ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నదీ మట్టంలోని ఇసుకను వదులు లేకుండా చేయాలనీ కానీ మేడిగడ్డ విషయంలో ఆ ప్రక్రియ సక్రమంగా జరగలేదనీ నిపుణులు చెప్తున్నారు.
‘‘సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది. ఇక్కడ ఎంత మేర దెబ్బతిన్నది అన్నది తెలియాల్సి ఉంది. అప్పుడే మరమ్మతు సాధ్యపడుతుందా, సాధ్యమపేటట్లైతే ఏలా మరమ్మతు చేయాలి వంటివి తెలుస్తాయి. అని దొంతి లక్ష్మీ నారాయణ తెలిపారు.
ప్రస్తుతం ఆ బరాజ్ నిర్మాణం చేసిన తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లు, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలోని ఇంజినీర్లు, ఆ బరాజ్ కట్టిన కాంట్రాక్టు కంపెనీ ఇంజినీర్లు అంతా ఏం జరిగిందో సమగ్రంగా తెలుసుకునే పనిలో ఉన్నారు. కానీ వారికి నీరు అడ్డంకిగా మారింది. ఎందుకంటే, ఘటన జరిగే సమయానికి ప్రాజెక్టు నిండుగా ఉంది.
ఆ నీటిని కిందకి వదిలేసినప్పటికీ, పై నుంచి ఇంకా నీరు వస్తోంది. దాన్ని కూడా కిందకు వదిలేస్తున్నారు. సరిగ్గా గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తరువాత మేడిగడ్డ బారేజీ ఉంటుంది. అందుకని నీటి ప్రవాహం ఎక్కువ ఉంది.
అయితే, నిర్మాణ లోపాలు లేవని ప్రాజెక్టు నిర్మించిన సంస్థ చెబుతోంది. ‘‘వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మించాం. భారీ శబ్దం తరువాత ఇది జరిగింది. దీనిపై డిజైన్ టీమ్, ఇంజినీరింగ్ టీమ్ పరిశీలించింది. నీటి మట్టం తగ్గాకే ఏం జరిగిందో తెలుస్తుంది. బరాజ్‌కి ఏం జరిగినా ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుంది. ప్రజలకూ, వాతావరణానికీ ఎటువంటి హానీ కలగనివ్వబోం. డిజైన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణం మేం చేశాం. అంటూ ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేశ్ కుమార్ చెప్పారు.
బరాజ్ కుంగిన ప్రాంతాన్ని ఎల్ అండ్ టీ పరిశీలించింది. పూర్తి బాధ్యత వారిదే. అని బరాజ్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు చెప్పారు.
1. కొత్త బరాజ్ ప్రారంభమై నాలుగేళ్లే అయింది. అప్పుడే ఎందుకు దెబ్బతింది? నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా? మరమ్మత్తులు చేయగలరా? చేయడానికి ఎంత అవుతుంది, ఎంత కాలం పడుతుంది?
2. ఈ బరాజ్‌కి మరమ్మత్తులు పూర్తయి మళ్లీ నీటిని నిల్వ చేసే వరకూ రైతుల పరిస్థితి ఏంటి? వారు పంటల విషయంలో ఈ నీటిని నమ్ముకుని వెళ్లవచ్చా?
3. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ తప్పు ఎవరిదో తేల్చి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటారా?
4. జరిగిన ఆర్థిక నష్టానికి బాధ్యత ఎవరిది?
5. మిగిలిన బరాజ్‌ల పటిష్టత మాటేంటి. ఎందుకంటే వరదల సమయంలో ఇటువంటి ఘటన జరిగితే కింద అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంటుంది
ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
సాగునీటి శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది.