ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకం చేసిన నితీష్? కమలంతో కొత్త దోస్తీ!

ఐ.ఎన్.డి.ఐ.ఎ. కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి పేరు ఇది. ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్  అలయెన్స్. విపక్షాల ఐక్యతపై ఆశలు రేపిన ఈ చుక్కల కూటమి.. ఔను నిజంగా చుక్కల కూటమే. ఎందుకంటే ఇండియా  అని ఈ కూటమిని పిలుచుకోవడానికి వీలుగా ఎంతో శోధించి, శ్రమించి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సూచించిన పేరు ఇది. అయితే కూటమి ఐక్యత ఈ కూటమి ఆవిర్భావం నుంచీ ప్రశ్నార్థకంగానే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ వంటి వారి చాణక్యం కారణంగా విభేదాలను (తాత్కాలికంగా) పక్కన పెట్టి దేశంలోని ప్రధాన బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పైన చెప్పినట్లుగా అక్షరాల మధ్య చుక్కలతో ఇండియాగా కలిశాయి. ఇప్పుడు ఆ కూటమిలోని పెద్ద చుక్కలు ఒక్కటొక్కటిగా దూరం అవుతున్నాయి. తృణమూల్ అధినేత్రి పొత్తులు, కూటముల వ్యవహారం ఎన్నికల తరువాత చూసుకుందామంటూ తొలుత విపక్ష ఐక్యతకు గండి కొట్టారు. అయినా ఆమె ఎన్నికల అనంతరం పొత్తులకు, అవగాహనకు ఐక్యతకు ఆప్షన్ ను మాత్రం సజీవంగా ఉంచారు. అయితే కూటమి ముడి పడటానికి కారణమైన జేడీయూ అధినేత, బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఆయన కూటమి నుంచి తప్పుకోవడమే కాదు.. ఏకంగా ఎన్డీయే లో చేరిపోయేందుకు రెడీ అయిపోయారు.  సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ..  కూటమికి కట్టప్ప బాహుబలికి పొడిచినట్లుగా  నితీష్ చుక్కల కూటమికి వెన్నుపోటు పొడిచారు.  వాస్తవానికి ఇండియా కూటమి ముడిపడటానికి పౌరోహిత్యం చేసినదే నితీష్ కుమార్. ఇందులో ఆయన స్వార్థ రాజకీయం ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ మోడీ సర్కార్ గద్దె దించడమే లక్ష్యంగా  జాతీయ స్థాయిలో కూటమి దిశగా బీజేపీయేతర పార్టీలను, పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ముఖ్య భూమిక నితీష్ కుమార్ దే. అందులో సందేహం లేదు.. మరాఠాయోధుడు శరద్ పవార్ కూడా ఇందుకోసం తన వంతు కృషి చేసినప్పటికీ  జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో మాత్రం సింహభాగం క్రెడిట్ నితీష్ కుమార్ కే దక్కుతుంది.  పైగా ఇల కూటములు, పొత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా అప్రతిహాతంగా కొనసాగగలుగుతున్నారు.  పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేతగా నితీష్ కుమార్ కు ఉన్న గుర్తింపు అత్యంత ప్రత్యేకమైనదనడంలో  అనడంలో సందేహం లేదు.  ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే రంగంలోకి దిగుతారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎన్డీయే కూటమిలో ఉన్నారు. మధ్యలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆర్జీడీ, కాంగ్రెస్ లతో చేయి కలిపి తన ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలంగా ఉంచుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆయన జాతీయ స్థాయిలో పొత్తులపై దృష్టి సారించారు. అందుకు కారణం పెద్ద పదవి ప్రధాని పీఠంపై దృష్టి పడటమేననడంలో రాజకీయాలతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారికైనా ఇట్టే అర్ధమైపోతుంది.  అందుకే ఆయన ఇండియా కూటమి ముడిపడటానికి ముందుండి పౌరోహిత్యం నెరిపారు. అయితే కాంగ్రెస్ ఉండగా ఆ పీఠం తనకు దక్కదని ఆయనకు అనతి కాలంలోనే అర్ధమైంది. ఉన్న సీఎం పీఠమైనా పదిలంగా ఉండాలంటే.. ఇండియా కూటమితో లాభం లేదనుకున్నారో ఏమో ఇప్పుడు ఆయన మళ్లీ కమలంవైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నితీష్ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీతో తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. బీజేపీ మద్దతుతో తన పీఠాన్ని పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.     అందుకోసం ఆర్జేడీ అంగీకరించే అవకాశం లేని ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. వచ్చే ఏడాది జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ముందస్తుకు వెళదామని  ప్రతిపాదించారు. అందుకు ఆర్జేడీ సహజంగానే నో చెప్పేసింది. అంతే అదే కారణం చెబుతూ   ఆర్జేడీకి పచ్చి కొట్టేసి బీజేపీతో జట్టు కట్టేందుకు రెడీ అయిపోయారు.   గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ రద్దు,  బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.  తాను మాత్రం సీఎం పదవిలోనే కొనసాగేలా, అలాగే గతంలో బీజేపీకి ఇచ్చినట్లుగానే రెండు డిప్యూటీ సీఎంలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.  దీంతో ఇప్పుడు ఇండియా అనే చుక్కల కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ లు దూరమయ్యాయి. ఇక ఇప్పుడు జేడీయూ సైతం అదే బాటలో ఉంది. ఉండటమేమిటి.. బీహార్ లో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోయింది.  

షర్మిల ఖాతాలోకే వైఎస్ బ్రాండ్!.. జగన్ కు మిగిలింది వైవీ, విజయసాయి, సజ్జలే!

షర్మిల ఎన్నికల రణస్థతిలో  అదరగొడుతున్నారు. అన్న జగన్ ను నోరెత్తేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు, విమర్శలతో నిలదీస్తున్నారు. ఎటువంటి  ఇబ్బందీ లేకుండా సునాయాసంగా వైసీపీ నుంచి వైఎస్ బ్రాండ్ ను తన సొంతం చేసేసుకుంటున్నారు. తన ప్రశ్నలకు, సవాళ్లకు బదులిచ్చేందుకు కూడా వైసీపీకి మాటలు దొరకడం లేదు. ఆమె వాస్తవాలన్నిటినీ కుండబద్దలు కొట్టినట్లు జనం ముందు ఉంచుతున్నారు. ఆమె చెబుతున్నవాటిలో ఏ ఒక్క అంశాన్నీ ఖండించేందుకు కూడా వైసీపీకి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆమె ఐదేళ్ల కిందట జరిగిన అంశాలను సూటిగా సుత్తి లేకుండా మళ్లీ జనం కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. అన్న జగన్ కోసం ఆనాడు తాను పడిన కష్టాన్ని మరో సారి గుర్తు చేస్తున్నారు. జనం కూడా ఔను నిజమే కదా అని ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. సజ్జలలు, పేర్కి నానీలు మీడియా ముందుకు వచ్చి షర్మిలపై చేస్తున్న విమర్శలు ఆమె చెబుతున్న వాస్తవాల ముందు నిలబడలేకపోతున్నాయి. వాటిని జనం అసలు పట్టించుకోవడం లేదు.  చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ షర్మిలపై నిందలేసి చేతులు దులిపేసుకుందామన్న తాపత్రయమే తప్ప వైసీపీ నేతలలో షర్మిలకు దీటుగా బదులిచ్చేందుకు మేటర్ లేకుండా పోయింది. దీంతో జగన్ కూడా మీడియా ముందుకు వచ్చి తన కుటుంబాన్ని చీల్చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుని నీళ్లునమలడం తప్ప మరేం చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు.   ఇంత కాలం పరదాల మాటున దాక్కున్న జగన్ ను ఇప్పుడు ఆ పరదాలన తొలగించి చెల్లిని, తల్లిని నిలవనీడ లేకుండా తరిమేసిన దుర్మార్గుడిగా జనం ముందు నిలబెడుతున్నారు.  తాజాగా తన అన్న జగన్ సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ లేరని కుండబద్దలు కొట్టేశారు. ఆ పార్టీ వైఎస్సఆర్సీపీకి కొత్త భాష్యం చెప్పారు. వైఎస్సార్సీపీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి, వి అంటే విజయసాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని వివరించారు. ఆ పార్టీలో వైఎస్సార్ లేరనీ, అది జగన్ సొంత పార్టీ అనీ, అది నియంత పార్టీ అని విమర్శలు గుప్పించారు.  జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలను దోచుకునే పార్టీ, పేదల ప్రయోజనాలు పట్టని పార్టీ అంటూ దుమ్మెత్తి పోశారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలొకి తొక్కిన పార్టీగా వైసీపీని షర్మిల అభివర్ణించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డనైన తాను తండ్రి ఆశయసాధన కోసం కాంగ్రెస్ లో చేరి అడుగులు వేస్తుంటేముప్పేట దాడి చేస్తున్నారని విమర్శించారు.   తన అన్న వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తండ్రి ఆశయాల కోసం నిలబడతారని భ్రమించాననీ, ఆ పార్టీ కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి  3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నకు అండగా నిలిచానని చెప్పారు. వైసీపీని భుజాల మీద వేసుకుని మోసానన్నారు. నా రక్తం, చెమట ధారపోసి పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చానని షర్మిల చెప్పారు.   తన రెక్కల కష్టం మీద ఎదిగి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దిన చందంగా తనపై దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని దాడులు జరిగినా బెదిరేది లేదు, అది రేది లేదని.. తాను వైఎస్సార్ బిడ్డననీ భయమన్నది తన డిక్షనరీలోనే లేదని కుండబద్దలు కొట్టారు. 

వైసీపీకి నా రక్తం ధారపోశా: షర్మిల 

ఇచ్చాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించిన ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న , ఎపి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. జగన్ వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల ముందు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన షర్మిల నేడు ఆమె జగన్ పైనే బాణాలు వేసారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  నేను యుద్ధానికి రెడీ... మీరు రెఢీనా..? వైఎస్ఆర్ పార్టీలో.. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ పాలనకి.. జగన్ పాలనకీ.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా..? ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? 70 వేల విలువైన గంగవరం పోర్టు 600 కోట్లకి అమ్మేశాడు. మళ్ళీ ప్రభుత్వం చేతికి గంగవరం పోర్టు రాదు. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త... ఒక్కొక్క సైన్యంగా మారాలి. ఒక ఎంపీ.. ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఏపీ బీజేపీ వశం అయిపోయింది. జగనన్న బీజేపీ కి బానిసగా మారాడు. ఏపీని కూడా బీజేపీకి బానిసగా మారుస్తున్నాడు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనే అని షర్మిల పేర్కొన్నారు.యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు అయితే... తెలంగాణ మెట్టినిల్లు అని పేర్కొన్నారు. ప్రజలకి న్యాయం జరగాలనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైసీపీకి తన రక్తం ధారపోశానని షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తోందన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. వైసీపీని తన భుజస్కంధాలపై మోశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదన్నారు.

జగన్ భీమిలి సభ... విపక్షనేతల అరెస్ట్ 

సిఎం జగన్ భీమిలి పర్యటన సందర్భంగా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం సభకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. టిడిపి, జనసేన పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలను గృహనిర్భందం చేశారు. ఆయా లీడర్ల నివాసం వద్ద కాపలా ఏర్పాటు చేశారు. వారిని ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరికొంతమంది నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. భీమిలిలో సిద్ధం పేరిట ముఖ్యమంత్రి సభ కోసం వైఎస్‌ఆర్‌సిపి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ సభను అడ్డుకుంటారనే అనుమానంతో ప్రతిపక్ష నేతలను పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. జనసేన పార్టీ భీమిలి ఇన్ చార్జి పంచకర్ల సందీప్‌ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ టూర్ నేపథ్యంలో తనను హౌస్ అరెస్ట్ చేశారని జనసేన లీడర్, విశాఖపట్నం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ తెలిపారు. విశాఖ భూదోపిడీలపై అధికార పార్టీ పెద్దలను నిలదీసినందుకే తనను అడ్డుకున్నారని యాదవ్ ఆరోపించారు. సీఎం పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలను అడ్డుకోవడం, పోలీస్ వలయాలు ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.

కాలుదువ్వుతోన్న బర్రెలక్క!

బర్రెలక్క మళ్లీ కాలుదువ్వుతోంది... రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి.. గెలిచేందుకు ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.  ఈ విషయాన్ని స్వయంగా  బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష ప్రకటించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ఆమె తెలిపారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నేర్చుకొన్న పాఠాలను దృష్టిలో ఉంచుకొని.. రానున్న ఎన్నికల్లో ఆచి తూచి అడుగులు వేయనున్నట్లు బర్రెలక్క తెలిపారు.  ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాన్ని బర్రెలక్క బాగానే ఒంట పట్టించుకున్నారనీ, అందుకే రాజకీయాన్ని వదలనంటున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క పారజయం పాలైన సంగతి తెలిసిందే.  అయితే ఎన్నికల బరిలో దిగాలంటే.. బ్యాంక్‌లో మనీ ఉండాలి. బ్యాక్ గ్రౌండ్‌లో మజిల్ పవర్ ఉండాలి. అలాగే మాయా మర్మంతోపాటు జిమ్మిక్క్ చేసే తెలివి తేటలు సైతం ఉండాలి. కానీ అవేమి లేకుండానే ..  అతి చిన్న వయస్సులో.. జస్ట్ నాలుగు బర్రెలు కాసుకొంటూ జీవనం సాగిస్తున్న బర్రెలక్క..  ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోవడమే కాకుండా.. తన సోదరుడితో  నడుచుకొంటూ వెళ్లి మరీ న్నికల రిట్నరింగ్ అధికారి కార్యాలయంలో  నామినేషన్ దాఖలు చేసి  వచ్చారు. అలా నామినేషన్ దాఖలు చేసి ఊరుకోకుండా  తన దైన శైలిలో నియోజకవర్గంలో  ప్రచారం చేసి పాపులర్ అయ్యారు. అయితే ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలంటూ.. బెదిరింపులు వచ్చినా.. తగ్గేదే లే  అంటూ ప్రచారంలో దూసుకుపోయారు.  ఆ ఎన్నికలలో  బర్రెలక్కకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు నుంచి మద్దతు లభించింది. సామాజిక మాధ్యమంలో ఆమెకు మద్దతుగా నెటిజన్లు పోస్టులతో ఓ రేంజ్ హైప్ తీసుకువచ్చారు. దీంతో ఒక దశలో ఆమె   గెలుపు నల్లేరు మీద నడకేనన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమైంది. అయితే వాస్తవంలో మాత్రం ఆమెకు 5 వేలు పైచిలుకు ఓట్లు మాత్రమే పోలైనాయి.  ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు  విజయం సాధించారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  బర్రెలక్క స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి ఆమె బీకాం డిగ్రీ పట్టా అందుకోంది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించినా,  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో పేపరు లీకేజీలు చోటు చేసుకోంటుండడంతో.. తీవ్ర నిరాశ చెంది, ఎన్ని డిగ్రీలు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదు,   అందుకే బర్రెలు కాస్తున్నానంటూ.. నిరుద్యోగిగా శిరీష పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేసింది.  దీంతో శిరీష.. ఒక్కసారిగా బర్రెలక్కగా ఫేమస్ అయిపోయారు. అలా కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు.. కేంద్ర ఎన్నికల సంఘం ఈల గుర్తు కేటాయించింది.   మరోవైపు నిరుద్యోగుల ప్రతినిధిగా శిరీష.. తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్‌లో ఓ పాటను సైతం విడుదల చేశారు. ఆ పాట యూట్యూబ్‌లో తెగ వైరల్ అయ్యింది. ఇంకోవైపు బర్రెలక్క గురించి కేంద్రపాలిత ప్రాంతం యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని.. ఆమె ఎన్నికల ప్రచారం కోసం లక్ష రూపాయిల నగదు విరాళాన్ని అందజేశారు. అలాగే ఆ తర్వాత ఆమెను ఆయన స్వయంగా కలిసి.. మరింత ఆర్థిక సాయం అందించడమే కాదు.. ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చిన నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాలంటూ  ధైర్యం చెప్పారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ సైతం బర్రెలక్కను కలిసి.. తన మద్దతు సైతం ప్రకటించమే కాకుండా.. చిన్న వయస్సులోనే బర్రెలక్క రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్వాగతించారు. ఆమెను ఆదర్శంగా తీసుకోని .. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు కూడా ఇచ్చారు.  తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిని కైవసం చేసుకోనేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కొల్పోయాం.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలంటూ.. గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యామిలీ కృతనిశ్చయంతో ముందుకు దూసుకుపోతోంది. అలాంటి వేళ.. ఈ బర్రెలక్క ఎన్నికల్లో నిలబడి.. ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది చూడాల్సిందే. ఎన్నికల్లో నిలబడితే.. నిధుల రూపంలో రూపాయిలు అందుతున్నాయని.. అలా కష్ట పడకుండానే నగదు వస్తుందని బర్రెలక్క బాగానే గ్రహించారనీ, అందుకే గెలుపుతో పని లేదు కానీ.. నగదుతోనే పని అన్నట్లుగా బర్రెలక్క వ్యవహార శైలి ఉందనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేంద్రరావు కన్నుమూత 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేంద్రరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అల్వాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978-83లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు. ఆయన మరణవార్త విని పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేరని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ శ్మశాన వాటికలో నేడు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.మశ్చేంద్రరావు తను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జనాదరణ పొందారు.1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు.ఆ తరువాత రెండేళ్ళకు అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీలో చీలికలు వచ్చి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వర్గాలుగా విడిపోయింది, 

కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో  విజయవాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాడు చేశారు. ఈ మెడికల్ క్యాంపుకు భారీ స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో  ఉచితంగా కంటి,గుండె, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనసేన నగర అధ్యక్షుడు  పోతిన మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్, తెలుగు యువత నాయకుడు కాండ్రేకుల రవీంద్ర ప్రారంభించారు. ఈ మెగా మెడికల్ క్యాంపునకు పెద్ద ఎత్తున పేదలు తరలి వస్తున్నారు. ఉచితంగా గుండె, క్యాన్సర్ స్క్రీనింగ్, నేత్ర పరీక్షలు  చేయించుకుంటున్నారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పత్తి నాగేశ్వరరావు, ఎద్దు పార్టీ రామయ్య, కేఎస్ఆర్ ఆర్ శర్మ, పీవీ సుబ్బయ్య, సురభి బాలు, రాంబాబు, యువి శివాజీ ,పల్లె కిరణ, ఆదిత్యా కిరణ్, పెద్ది సతీష్, ముదిగొండ శివ, గుండు సుధా, కామా దేవరాజ్, పితాని పద్మ, మొవ్వ విజయ, వల్లభనేని ప్రసన్నలక్ష్మి తదితరులు  పాల్గొన్నారు

పోటా పోటీ ప్రచారాలతో వేడెక్కిన ఎపి పాలిటిక్స్ 

ఏపీలో ప్రధాన పార్టీల నేతల వరుస సభలు, కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  టీడీపీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' పేరుతో బహింరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈరోజు భీమిలిలో  సభకు హాజరయ్యారు. దీంతో, రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.  టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించారు.  గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన ఆయన  తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి  హెలికాప్టర్ లో పీలేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఉరవకొండకు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుగుపయనమవుతారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించారు.  బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. కేత్ర స్థాయిలో ఆమె పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన ఈ నెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది. తొలిరోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో షర్మిల పర్యటించారు. శనివారం కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. . త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు.  ఈ నెల 27 న ఉత్తరాంధ్ర లోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.ఫిబ్రవరి 10 వ తేదీ లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. 

అజారుద్దీన్ రిటైర్డ్ హర్ట్.. కాంగ్రెస్ ను వీడనున్న మాజీ క్రికెటర్.. బీఆర్ఎస్ గూటికేనా?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేయనున్నారా? తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలలో చివరి నిముషంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించింది. ఆఖరి ఆప్షన్ గా అజారుద్దీన్ కు పార్టీ టికెట్ కేటాయించినా, ఆయన గట్టిగా నిలబడ్డారు. స్వల్ప తేడాతో పారజయం పాలయ్యారు. అయితే గెలుపు అవకాశాలు ఇసుమంతైనా లేని స్థానాన్ని తనకు కేటాయించారని అప్పట్లోనే అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నుంచి పెద్దగా అండ లేకపోయినా, తన వ్యక్తిగత ఇమేజ్ తోనే ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.   తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ.. రాష్ట్ర పార్టీలో ఆయనకు తగినంత గుర్తింపు లభించలేదన్న అసంతృప్తితో ఉన్న అజారుద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా దేశానికి చిరస్మరణీయమైన విజయాలను అందించడమే కాకుండా అరంగేట్రం సిరీస్ లోనే వరుసగా మూడు సెంచరీలతో వరల్డ్ రికార్డ్ సృష్టించి క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి అజారుద్దీన్ పుట్టి పెరిగింది తెలంగాణలోనే అయినా ఆయన కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేశారు. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ మారు మాట్లాడకుండా పోటీ చేశారు. ఆ క్రమంలో జయాపజయాలను ఎదుర్కొన్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు లభించినా, లభించకున్నా కాంగ్రెస్ ను మాత్రం వీడలేదు. 2009 సార్వత్రిక ఎన్నికలలో యూపీలోని మొరదాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తరువాత పార్టీ ఆయనను రాజస్థాన్ లోని టోంక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే మారు మాట్లాడకుండా అక్కడకు వెళ్లి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో అజారుద్దీన్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత స్వరాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా తెలంగాణలోని జూబ్లీహెల్స్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ఇంత కాలంగా పార్టీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ పార్టీకి విధేయుడిగా ఉన్నా తనకు తగినంత గుర్తింపు రాలేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారని చెబుతున్నారు.  ఏదో ఒక కోటాలో  ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడిన ఆయనకు కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో  ఇక చేయి వదిలేయడమే బెటర్ అని అజారుద్దీన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ కూడా రాజీనామా చేయాలని అజారుద్దీన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాజీనామా తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఆయన అలోచిస్తారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండటంతో ఆయన చేరాలనుకుంటే స్వాగతించని పార్టీ ఉండదన్న విశ్వాసాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అజారుద్దీన్ మాత్రం ఇక తన కార్యక్షేత్రం తెలంగాణ అని నిర్ణయించుకోవడం వల్లనే ఆయనకు కాంగ్రెస్ లో ప్రియారిటీ తగ్గిందని అంటున్నారు.  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండగా వచ్చిన ఆరోపణల కారణంగా అప్పట్లో ఆయన ఇమేజ్ కొంత మసకబారింది. ఆ కారణంగానే రాష్ట్రంలో ఆయనకు పెద్దగా మైలేజ్ ఉండదన్న అభిప్రాయం కాంగ్రెస్ హై కమాండ్ లో వ్యక్తం అవుతోందనీ, ఆ కారణంగానే  తెలంగాణ పాలటిక్స్ లో అజారుద్దీన్ ను ప్రమోట్ చేయడం వల్ల ప్రయోజనం ఉందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే అజారుద్దీన్ మాత్రం తెలంగాణ రాజకీయాలలోనే ఇక తన ప్రస్థానం అని తేల్చి చెప్పడంతో  ఆయన విధేయతను ద‌ృష్టిలో ఉంచుకుని చివరి నిముషంలో జూబ్లీ హెల్స్ నుంచి పోటీకి అవకాశం కల్పించారని అంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా సుముఖంగా లేకపోయినప్పటికీ హై కమాండ్ నిర్ణయం కారణంగానే ఆయనకు ఇటీవలి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ ఎన్నికలలో పరాజయం మూటగట్టుకోవడంతో ఇక అజారుద్దీన్ కు ఏదో ఓ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ కి అవకాశం ఇవ్వడంలో కానీ హై కమాండ్ పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికి వదిలేసింది. దాంతో సహజంగానే అజారుద్దీన్ ను కాంగ్రెస్ నాయకత్వం అసలు పరిగణనలోనికే తీసుకోలేదని అంటున్నారు.  ఇప్పుడు అజారుద్దీన్ కు తెలంగాణలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలంటే బీఆర్ఎస్ గూటికి చేరి అదృష్టాన్ని పరిశీలించుకోవడం అనే ఆప్షన్ మాత్రమే ఉందని పరిశీలకులు అంటున్నారు. 

నీటి కోసం పాట్లు.. జగన్ పాలనలో జనం ఇక్కట్లు!

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి గంగలో ముంచేశాడు అంటూ జగన్ పై జనం మండి పడుతున్నారు. గత ఎన్నికల ముందు నవరత్నాలన్నారు.. అరచేతిలో వైకుంఠం చూపారు.. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేళ చేప్పినవన్నీ చేసేశామంటూ మరో చాన్స్ కోసం ఓట్లడిగేందుకు జనం ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నారు. కానీ జనం మాత్రం చుక్క నీటి కోసం కన్నీటి వరదలు పారిస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు ప్రత్యక్ష నరకం చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనది కృష్ణా తీరాన ఉన్న బెజవాడలో శీతాకాలంలో జనం తాగునీటి కోసం అలమటించే పరిస్థితి వచ్చింది. ఒక్క పూట కూడా సక్రమంగా నీటి సరఫరా ఉండటం లేదు. ఆ సరఫరా చేసే అరకొర నీరు కూడా కలుషితమై ఆరోగ్యాలను గుల్ల చేస్తోంది. ఔను.. జగన్ హయాంలో  ప్రజలకు కనీసం తాగునీటికి కూడా కటకట తప్పడం లేదు. వేసవిలో తాగునీటి ఎద్దడి అంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ శీతాకాలంలో అదీ జీవనది కృష్ణానదిని ఆనుకుని ఉన్న విజయవాడ మహానగరంలో తాగునీటికి కటకట ఏర్పడిందంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం, చాతకాని తనం, అస్తవ్యస్థ నీటియాజమాన్య పద్ధతులే కారణమని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు వారాలుగా విజయవాడ మహానగరంలో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ కనీస స్పందన లేదు. రిపబ్లిక్ దోనోత్సవం రోజున కూడా నగరంలో మద్యం ఏరులై ప్రవహించింది. కానీ నీటి చుక్క కోసం జనాలు నానా ఇబ్బందులూ పడాల్సిన పరిస్థితి తలెత్తిందంటే రాష్ట్రంలో పాలన ఎంత సుందరముదనష్టంగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు.  గత రెండు వారాలుగా విజయవాడలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సరఫరా సమయాన్ని పూర్తిగా కుదించేసి జనం తాగునీటికి అలమటించే పరిస్థితి ఏర్పడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళనలకు, నిరసనలకు దిగుతుంటే ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా వారి ఆందోళనలను నిరసనలను అణచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తోంది. విజయవాడ నగరంలో కనీసం ఒక పూట కూడా నీటిసరఫరా సక్రమంగా లేని పరిస్థితి నెలకొనడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నగర వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీలలో శుక్రవారం జనం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఒక వైపు దేశం అంతా   ఘనంగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంటే.. తాము మాత్రం తాగునీటి కోసం ఆందోళనలకు దిగాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.   అరకొరా సరఫరా చేసే నీరు కూడా కలుషితంగా ఉంటోందనీ, హెడ్ వాటర్ వర్క్స్ లో నీటి శుద్ధి అన్న విషయాన్నే మరచిపోయారన్నట్లుగా పరిస్థితి తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు.   కృష్ణానది నీటిలో సాంద్రత, కాలుష్యం పెరిగిందని చెబుతున్న అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో  మాత్రం చేతులెత్తేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులంతా ప్రభుత్వ సేవలో తరిస్తూ ప్రజల కష్టాలను విస్మరిస్తున్నారనీ, ఇక ప్రజా ప్రతినిథులైతే ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేసి నాలుగున్నరేళ్లయ్యిందని విమర్శిస్తున్నారు. జగన్ పార్టీలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిథులకు దోచుకోవడం, దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వాటర్ చార్జీలు, ఆస్తి పన్నుల పెంపు, చెత్తపై టాక్స్ విధించి వాటిని  కట్టడంలో ఆలస్యమైన వారిపై భారీగా పెనాల్టీలు వసూలు చేస్తున్న జగన్ సర్కార్ ప్రజల కష్టాల విషయంలో మాత్రం కనీసం స్పందించడలేదని జనం మండిపడుతున్నారు. నీటి మీటర్ల ఏర్పాటులో చూపుతున్న అత్యుత్సాహం నీటి సరఫరా విషయంలో ఎందుకు లేదని నిలదీస్తున్నారు.  ఎన్నికలు, టికెట్ల కేటాయింపు, అంతర్గత కుమ్ములాటలలో మునిగి తేలుతున్న వైసీపీ నేతలకు ప్రజల కష్టాలు పట్టడం లేదు.   ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం సక్రమంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  

జగన్ ఇంటి గుట్టు బట్టబయలు.. విభీషుణుడు సజ్జలేనా?!

దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి మరణం అనంతరం ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వైఎస్ కుమారుడు జగన్ రాజకీయ ప్రయాణం, సొంత పార్టీ, అవినీతి కేసులలో 16 నెలల జైలు, జగన్ తరపున తల్లి, చెల్లి ప్రచారం, వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఘోర హత్య, వైసీపీ విజయం, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం.. ఇలా అన్నీ ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. అలాగే జగన్ సీఎం అయ్యాక తల్లి, చెల్లి దూరం కావడం, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం, తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి కుమార్తె వద్దకే వెళ్లిపోవడం కూడా ప్రజలు చూసిందే. అయితే, ప్రజల కంటికి కనిపించనిది వైఎస్ కుటుంబంలో ఏదో జరిగింది.. జరుగుతూనే ఉంది. వివేకా హత్య ఎలా జరిగిందో ప్రజలకు తెలియదు. ఈ హత్య ఎవరు చేశారో.. ఎందుకు చేయించారో కూడా వైఎస్ కుటుంబానికి తెలుసు. అర్ధరాత్రి ఫోన్ కాల్ డేటా రహస్యం ఏంటో కూడా ఆ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం ఏంటో కూడా ప్రజలకు తెలియదు. కడుపున మోసి కని పెంచిన తల్లి కూడా జగన్ కు ఎందుకు దూరం జరిగారో ఆ కుటుంబ సభ్యులకే   తెలుసు.  అయితే, ఇప్పుడు వైఎస్ ఇంటి రహస్యాలు ఒక్కొక్కటీ బట్టబయలు అయ్యే రోజులు వచ్చేసినట్లే కనిపిస్తున్నది. షర్మిల కాంగ్రెస్ లో చేరిక, ఏపీ బాధ్యతల స్వీకరణతో ఏదో ఒక రోజు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్న ఎన్నో రహస్యాలకు సమాధానం దొరుకుతుందని అనుకున్నదే. అయితే, జగన్ తర్వాత వైసిపీలో నంబర్ టూగా, సకల శాఖల మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డే ఈ రహస్యాలను బహిర్గతం అయ్యేలా చేస్తారని ఎవరూ అనుకోలేదు. విభీషణుడు లంక గుట్టు బట్టబయలు చేసినట్లు..  సజ్జలే పనిగట్టుకొని మరీ జగన్ ఇంటి గుట్టును రచ్చ చేయడానికి కంకణం కట్టుకున్నారా అనిపిస్తున్నది. నిజానికి షర్మిల ఏపీలో రాజకీయం మొదలైన తర్వాత ఎలా అటాక్ మొదలు పెడతారని ఆసక్తి అందరిలోనూ కనిపించింది. అయితే, ఆమె వచ్చీ రాగానే విజయవాడలో పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పుడే మొదలు పెట్టారా జగన్ రెడ్డి సార్ అంటూ షర్మిల  అటాక్ మొదలు పెట్టారు. ఇక జగన్ తిరుపతిలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ని నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీపై జగన్ నిందలకు షర్మిల ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టింది, చీలిక తెచ్చింది జగనే అంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. అమ్మ తోడు అంటూ ఒట్టు పెట్టి, పైన దేవుడు, అలాగే తన తల్లి వైఎస్ విజయమ్మ సాక్ష్యం అని కూడా ఆమె చెప్పారు. జగన్,  వైసీపీ ఈ అంశాన్ని అక్కడే ఆపేస్తే షర్మిల తనంతట తానే తగ్గాల్సి వచ్చేది. కానీ  సీన్ లోకి సజ్జల ఎంటర్ అయ్యారు. చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ సజ్జల   ఆరోపణలు మొదలు పెట్టారు. బాబు చెప్పినట్లుగానే షర్మిల నడుచుకుంటారని.. బాబు చెప్పిన దానికి మించి ఒక్క ముక్క కూడా షర్మిల మాట్లాడరని సజ్జల విమర్శించారు. అసలు తనకు జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల చెప్పాలని, కుటుంబానికి జగన్ ఏం ద్రోహం చేశారో వెల్లడించాలని  సజ్జల షర్మిలను డిమాండ్ చేస్తున్నారు. అసలే ఫుల్ ఫైర్ మీదున్న షర్మిల ఇప్పుడు ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తిగా మారింది. జగన్ తనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న సమయంలోనే షర్మిల అన్నీ దేవుడికి తెలుసంటూ పరోక్షంగా మాట్లాడారు. కానీ  ఇప్పుడు సజ్జల ఆ దేవుడికి తెలిసిన నిజాలేంటో షర్మిల ప్రజలకు చెప్పాలని కోరుతున్నారు. దీంతో షర్మిల ఇప్పుడు గొంతు విప్పితే  అంత: పుర రహస్యాలు బయటపడడం ఖాయం. వివేకా హత్య నుండి అన్న చెల్లెళ్ళ విబేధాలు, జగన్ కుటుంబానికి చేసిన అన్యాయం.. ఇలా ఏదో ఒకటి లేదా ఒకదాని వెంట ఒకటి షర్మిల బట్టబయలు చేయడం గ్యారంటీగా కనిపిస్తున్నది. అదే జరిగితే జగన్ ఇంటి రహస్యాలు సజ్జల కారణంగానే బహిర్గతం అయినట్టే భావించాల్సి వస్తుంది.  వైసీపీ నుండి సజ్జల తప్ప మిగతా నేతలు ఎవరూ షర్మిలను టార్గెట్ చేసి ఈ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. షర్మిలను రెచ్చగొట్టినా, బుజ్జగించినా సజ్జలే చేస్తున్నారు కనుక.  షర్మిల రియాక్షన్ కు కూడా  సజ్జలే  కారకుడు కూడా అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే రావణుడిని కూల్చడానికి  రాముడికి విభీషణుడు మార్గం చూపినట్లు అన్న జగన్ మీద షర్మిల బాణాలు ఎలా సంధించాలో సజ్జల మార్గం చూపిస్తున్నారు.   

పద్మవిభూషణుడు చిరంజీవి.. ఎలా అయ్యాడో తెలుసా?

తెలుగు తేజం విజయకేతనం ఎగురవేసింది. ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డును సొంతం చేసుకొని తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. మెగాస్టార్‌ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో  అత్యంత ఉన్నత పురస్కారంగా చెప్పబడే పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన మెగాస్టార్‌ కీర్తి కిరీటంలో మరో అత్యున్నత పురస్కారం కూడా చేరింది.  తన సినిమాల ద్వారా వినోదాన్ని పంచడమే కాదు, సమాజాన్ని చైతన్యపూరితుల్ని చేసే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి.. కేవలం స్వయంకృషితోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. కేవలం సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు, తన సేవా దృక్పథంతో ఎంతో మందికి అండగా నిలిచారు, ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఆనందాన్ని పంచారు. మదర్‌ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సీసీసీ సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012- 2014 వరకూ మన్మోహన్‌ సింగ్‌ మంత్రి వర్గంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు. మెగాస్టార్‌ సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ను ప్రకటించి తగిన రీతిలో సత్కరిస్తోంది.  కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ ‘’కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండదండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి,  ప్రధాని నరేంద్ర మోడీగారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.  తన నటనతో 45 ఏళ్ళుగా ఎంటర్‌టైన్‌ చేస్తున్న చిరంజీవి ప్రతి తెలుగువారి సొంత మనిషిగా భావిస్తారు. కేవలం సినిమాలతోనే కాదు, పలు సేవా కార్యక్రమాటు చేపట్టి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి అంటే ఇంతటి ప్రభంజనం ఏ ఒక్కరోజుతోనో రాలేదు. అంతటి కీర్తి ప్రతిష్టల వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. వినోదాన్ని అందించడమే కాదు, ఆపదలో ఉన్నవారికి తన సాయం కూడా అందాలన్న సంకల్పం ఆయన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. మెగాస్టార్‌ని ఈ అత్యున్నత పురస్కారం వరించడం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తించిన కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్‌కి మెగాస్టార్‌ చిరంజీవి నూటికి నూరుశాతం అర్హుడని భావించింది.

సెకండ్ చాన్స్ జనం ఎలాగూ ఇవ్వరని తెలిసి జగన్ ఓటమి మాట చెప్పారా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం, స్కెచ్ సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాక్కాదు.. 175 కు 175  అంటూ దూసుకు పోతున్నారు.  మూడు నాలుగు నెలల కిందటి వరకూ ఏపీలో పరిస్థితి ఇదే. మరో చాన్స్ కోసం జగన్ ఎత్తులు వేస్తున్నారు. ఆయన తన జగన్మాయతో జనాలను మాయచేయగలరు? అంటూ కొందరు గట్టిగా ఎదురుగా బల్ల ఉంటే అది గుద్ది మరీ వాదించారు. అయితే, రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేరని పెద్దగా   శ్రమ పడవలసిన అవసరం లేకుండానే అందరికీ అర్ధమైపోయింది. ఆ అందరిలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. జగన్ కు జనం రెండో చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు.  గుసగుసలు పోతున్నారు.  అయితే ఇప్పుడు వాళ్లూ వీళ్లూ అనాల్సిన పని లేకుండా జగనే స్పష్టంగా చెప్పేశారు. తనకు మరో చాన్స్ లేదనీ, ఇచ్చిన ఒక్క చాన్స్ తోనే సంతృప్తి పడి హాయిగా ఓడిపోతే ఆనందంగా ఇంట్లో కూర్చుంటానని ఆయన చెప్పేసుకున్నారు. నవరత్నాల మీద పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. అలాగే సంక్షేమం పేరిట క్రమం తప్పకుండా బటన్లు నొక్కుతూ ఖాతాలలో డబ్బులు వేస్తుంటే.. ఆ డబ్బులు తీసుకున్న వారు తనకు కాక ఇంకెవరికి ఓటేస్తారు అన్న ధీమా మాయమైపోయింది.   అయితే ఈ విషయం అర్ధం చేసుకోవడానికి జగన్ కు నాలుగున్నరేళ్ల పైచిలుకు సమయం పట్టింది కానీ, జగన్ అధికార పగ్గాలు అందుకున్న మూడేళ్లకే జగన్ కు మరో చాన్స్ ఇవ్వకూడదని జనం నిర్ణయం తీసేసుకున్నారు. క్షేత్ర స్థయిలో పరిస్థితి దగ్గరుండి పరిశీలిస్తున్న వైసీపీ నేతలకు కూడా అర్ధమైపోయింది. అప్పడు అర్ధం కాని వారికి జగన్ ఆదేశం మేరకు చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వచ్చే ఎన్నికలలో పరాజయం తపప్దన్న వాస్తవం కళ్లకు కట్టింది. అందుకే ఎటూ ఓడిపోయేదానికి మళ్లీ గడపగడపకూ అంటూ జనం ఇళ్ల ముందుకు వెళ్లి పరాభవాన్ని ఎదుర్కోవడం ఎందుకు అన్నట్లుగా ఆ కార్యక్రమానికి ముఖం చాటేశారు.   ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ సంతృప్తి చెందిన దాఖలాలు  కనిపించడం లేదని వైసీపీ జెండామోస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు నాయకులకు అర్ధమైపోయింది. గత ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధీ ఉండేదని, జగన్ సర్కార్ లో సంక్షేమమూ అరకొరగానే ఉంది, అభివృద్ధి ఆనవాలే కనపడకుండా పోయిందని జనం ముఖం మీదే చెబుతుండటంతో  ఈ సారి ఎన్నికల్లో మరో ఛాన్స్ అని అడిగితే  ప్రజలు నో .. ఛాన్స్ అనడం ఖాయమని పార్టీ నేతలే అంటున్నారు.   జగన్ రెడ్డి, మాట తప్పను, మడమ తిప్పను అంటే నిజమే అనుకుని  అయన వెంట నడిచి, గత ఎన్నికలలో విజయాన్ని కట్టబెట్టిన ప్రజలే ఈనాడు జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, మా విశ్వాసాన్ని సైతం పూర్తిగా కోల్పోయారని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.  రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రావడం లేదు. ఒకసారి కాదు, రెండు మూడుసార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా  టెండర్లు వేసేందుకు, కాంట్రాక్టర్లు  ముందుకు రావడం లేదంటే  ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా అని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, కొండలా  పెరుకు పోయాయి. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక  కాంట్రాక్టర్లు ఆందోళనలు  చేయడమే కాదు, ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు.  చివరకు అధికార పార్టీ  మ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్’కు ఏదో మేలు చేసేందుకు  కేటాయించే నామినేషన్ పనులు చేయడానికి కూడా  క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ ముందుకు రావడం లేదు. మాకు పనులు వద్దు మహప్రభో.. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇప్పించడం చాలని దండం పెట్టేస్తున్నారు. ఇది జగన్ పట్ల ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా నమ్మకం పోయిందనడానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.   ఇక  వైసీపీ గ్రామా సర్పంచ్‌ లు కూడా  వదిలి పెట్టి పారి పోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలైన సర్పంచ్‌లు మీరిఇచ్చిన పదవి కి ఒక దండం,   ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.  ఇక ప్రభుత్వం  భూములు  ప్లాట్స్ వేసి అమ్మి ఖజానాలోకి సొమ్ము జమచేద్దామనుకుంటే వాటిని కొనే నాదుడే కనిపించని పరిస్థితి కంటే ప్రభుత్వానికి అవమానం ఏముంటుంది. అది కూడా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్, వైజాగ్ మహానగరంలోనే, ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రాలేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’లో  సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది  లేక  దరఖాస్తు  గదువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా  నో రెస్పాన్స్. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత  తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా, ఎన్నిసార్లు గడువు పెంచినా కనీస స్పందన రాలేదు.  అంటే.. జగన్ రెడ్డి  మీద ప్రజలలో  విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెడితే  ఒకరిద్దరని కాదు అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న లబ్ధిదారులు కూడా జగన్ రెడ్డికి మరో చాన్స్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు.  మీటలు నొక్కి నోట్లు  వేశాం.. ఓట్లేందుకు  వేయరు’ అంటూ జగన్ రెతమ పేదరికాన్ని  పరిహాసం చేస్తున్నారని వారు భావిస్తున్నారు. ఆలా  ప్రజలు, పార్టీ నాయకులు, క్యాడర్ అందరూ కూడా జగన్ రెడ్డికి మరో చాన్స్ లేదన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు.  ఇంకా జగన్ రెడ్డి మీద నమ్మకం మిగిలి ఉన్న వారెవరైనా ఉంటే షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తరువాత జరుగుతున్న పరిణామాలను చూసి సొంత చెల్లిపైనే కనీస మమకారం చూపలేని వ్యక్తి ఇక ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతగా ఉంటారంటూ నో చాన్స్ టు జగన్ రెడ్డి అనేస్తున్నారు. ఇక చివరిగా తనకు మరో చాన్స్ మీద ఆశలు పెట్టుకున్న జగన్ కు కూడా సరిగ్గా ఎన్నికల ముందు జ్ణానోదయం అయినట్లుంది.. అందుకే ఓడిపోయినా బాధపడను అంటూ చేతులెత్తేశారు. మరో చాన్స్ అంటూ అడిగి లేదనిపించుకోవడం కంటే ముందే వద్దని చెప్పేయడం మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు జగన్ మాటలను విశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశం జనసేన పొత్తులో పదనిసలు

తెలుగుదేశం, జనసేన కలిసి పని చేస్తున్నాయి. పార్టీలుగా వేరువేరుగానే ఉన్నా లక్ష్యం ఒకటే కావడంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయి. ఆ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటన చేశారు. అలా పొత్త ప్రకటన సమయాన్ని కూడా ఆయన ఇరు పార్టీలూ ఉద్వేగంతో పూనకాలకు లోనయ్యేలా చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు పంపిన సమయంలో ఆయనను ములాఖత్ ద్వారా కలుసుకుని బయటకు వచ్చి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణల సమక్షంలో ప్రకటించారు. ఆ ప్రకటనతో అప్పటి దాకా పొత్తు విషయంలో ఉన్న అనుమానాలు పటాపంచలైపోవడమే కాదు.. ఇరు పార్టీల క్యాడర్ లో కూడా ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం, జనసేనలు క్షేత్రస్థాయిలో కలిసే పని చేశాయి. పవన్ సభలలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు కార్యక్రమాలలో జనసేన నాయకులు హల్ చల్ చేశారు. గ్రామీణ స్థాయిలో సమస్యలపై తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఉమ్మడిగా కదం తొక్కాయి. పొత్తు పోవడకుండా ఉండేందుకు జగనరెడ్డి, ఆయన పార్టీ నేతలు చేసిన   కుట్రలూ, కుతంత్రాలు ఫలించలేదు. ఇప్పుడు ఇరు పార్టీలూ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పొత్తులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల విషయంలో ఒక అంగీకారానికి వచ్చి, సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తున్న తరుణంలో చిన్న కలకలం రేగింది.  స్వతహాగా ఆవేశపరుడైన జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం అధినేత రాష్ట్రంలో రెండు స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఆయన అలా ప్రకటించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ, వారు రెండు స్థానాలను ప్రకటించారు కనుక తాను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరంలలో జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారని చెప్పారు.  టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన క్రమంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి కౌంటర్ గా పవన్ కళ్యాణ్.. రాజోలు, రాజానగరం టికెట్లను ప్రకటించారు. ఈ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ చిన్న విషయాన్ని పోత్తు అడుగులు తడబడుతున్నాయని చాటడానికి ఒక వర్గం మీడియా నానా తంటాలూ పడుతోంది. జనసేనాని నియోజకవర్గాలను ప్రకటించడాన్ని హైలైట్ చేస్తున్న మీడియా ఆ సందర్భంగా పొత్తుకు కట్టుబడి ఉన్నాననీ, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలనివ్వన్న మాటకు కట్టుబడి ఉన్నాననీ చెప్పిన మాటలను ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది.  రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. అందులో సందేహం లేదు. ఇప్పటి వరకూ జరిగిన చర్చలలో  పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని, ఏవి అన్న విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. బీజేపీ ఈ కూటమితో కలుస్తుందా? లేదా అన్నది తేలడం కోసం వేచి చూడాలని ఇరు పార్టీలూ భావించడం వల్లే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన సీట్లలో ఓ రెండింటిని చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ ప్రకటించడంలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఇక ఏకపక్షంగా రెండు సీట్ల ప్రకటన అంటూ పవన్ కల్యాణ్ అనడాన్ని కూడా క్యాడర్ అనవసరంగా గందరగోళపడి ఉన్న సయోధ్య వాతావరణం చెడకుండా ఉండటానికే అని భావించాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ రెండు సీట్లను ప్రకటించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పారు. 

యుద్ధానికి ముందే వైసీపీ అస్త్రసన్యాసం!

ఎక్కడైనా ఎన్నికల ముందు అధికార పార్టీలో ధీమా కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటన, ప్రచార వ్యూహాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా చేసుకోవడానికి సావకాశం ఉంటుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు పార్టీకి లబ్ధి జరిగేందుకు వీలుగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించేందుకు, గతంలో ఇచ్చి, ఇంకా నెరవేర్చని హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధి పనులను వేగం చేస్తుంది. అసంతృప్తి ఉన్న వర్గాలను బుజ్జగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. కోడ్ కూయకముందే అన్నీ చక్కబెట్టుకుని ఎన్నికలకు సిద్ధమైపోతుంది. కానీ విచిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ మాత్రం సరిగ్గా ఎన్నికలకు ముందు సమస్యలు సృష్టించుకుని, వాటిని పరిష్కరించడం ఎలాగో తెలియక దిక్కు తోచని స్థితిలో పడింది. ఎన్నికలకు ముందే ఓటమిని ఖరారు చేసుకుని, ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటించేస్తోంది. ఓడిపోయినా హ్యాపీగానే ఉంటాను అంటూ స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అర్ధమౌతుంది. సిట్టింగులను మార్చేస్తున్నామంటూ జగన్ చేపట్టిన ప్రయోగం.. వైసీపీ విజయావకాశలను దాదాపు మృగ్యం చేసేసింది. సీటు మారిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టికెట్ దక్కిన నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. అసలు వైసీపీ అధినేత జగన్ ప్రజల నమ్మకాన్నే కాదు, పార్టీ నాయకులు, కార్యకర్తల నమ్మకాన్ని కూడా కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నాలుగు జాబితాలు విడుదల చేసి ఐదో జాబితాకు జగన్ సమాయత్తమౌతున్న సమయంలో పార్టీలో అత్యథికులకు పోటీపైనే ఆసక్తి పోయింది. వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం వస్తే మంచిదే.. రాకపోతే మరీ మంచిది అన్న భావన మెజారిటీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నాది. నియోజకవర్గం మారుతుందా? పోటీకి అవకాశం ఉంటుందా అన్న టెన్షన్ దాదాపు ఎవరిలోనూ కనిపించడం లేదు. అంతర్గత సంభాషణల్లో పోటీ చేసినా ఎటూ గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు టికెట్ వస్తే ఎంత రాకపోతే ఎంత అంటున్నారు.  ఇక ఇప్పటికీ జగన్ భజన చేస్తున్న వారెవరైనా ఉన్నారంటే... ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ప్రాపకం కోసం విపక్ష నేతలపై ఇష్టారీతిగా బూతులు, అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడిన వారు మాత్రమే. ఇంతగా నోరు పారేసుకున్న తమకు మరే పార్టీలోకి ప్రవేశానికి అవకాశం ఉండదని డిసైడైపోవడం వల్లే వారు ఇప్పటి వరకూ జగన్ తో అంటకాగుతున్నారు. ఇక ముందు ఆ పరిస్థితి కూడా ఉండదని పరిశీలకులు అంటున్నారు. షర్మిల ఎంట్రీతో గెలుపుఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే గౌరవమైనా దక్కుతుందని జగన్ కు వీరభక్త హనుమాన్ లుగా గుర్తింపు పొందిన వారు కూడా యోచిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్కేను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మల్లాదితో మొదలు పెడితే గోరంట్ల మాధవ్ వరకూ పలువురు నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉందంటున్నారు. మంత్ర గుమ్మనూరు ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. ఆయనకు కర్నూలు ఎంపీగా పోటీ చేయమని జగన్ ఆదేశించినా నో చెప్పేసి.. పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. నేడో రేపో హస్తం గూటికి చేరడం ఖాయమని అంటున్నారు.  అలాగే సొంత బంధువు అయిన బాలినేని కూడా వైసీపీకి రాజీనామా చేయడం చిటికెలో పని అని బెదరింపులకు దిగుతున్నారంటే.. పార్టీగా వైసీపీ, వైసీపీ అధినేతగా జగన్ ఎంత బలహీనం అయిపోయారో అవగతమౌతుంది. వైనాట్ 175 అన్న నోటితోనే జగన్ వచ్చే ఎన్నికలలో పరాజయం పాలై పదవి కోల్పోయినా తానేం బాధపడను అన్నారంటేనే పార్టీ విజయావకాశాలు మృగ్యమైపోయాయని ఆయనకు అర్ధమైందని స్పష్టమౌతోంది. అధినేతే చేతులెత్తేస్తే ఇక ఆ నాయకుడిని నమ్మి పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికలలో పని చేసే అవకాశాలు ఉండవని విశ్లేషిస్తున్నారు.  సో యుద్ధం మొదలు కాకుండానే వైసీసీ అస్త్రసన్యాసం చేసేసిందని అంటున్నారు. 

షర్మిల చెబితే సరిపోదా.. విజయమ్మతో కూడా కుటుంబాన్ని జగన్ చీల్చారని చెప్పిస్తారా సజ్జలా?

మా కుటుంబం చీలిపోవడానికి జగనన్నే కారణమని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నా.. వైసీపీకి చెవికెక్కడం లేదు. పిడుక్కీబియ్యానికీ ఓకే మంత్రం అన్నట్లు తమ పార్టీ అధినేత తప్పులకు, అక్రమాలకు, అన్యాయాలకు అన్నిటికీ చంద్రబాబే కారణమన్న ప్రచారం తప్ప వారికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. సొంత తప్పిదాలతో తమ  గొయ్యి తామే తీసుకుంటూ కూడా చంద్రబాబు గొయ్యి తీసి తమను పాతేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.  షర్మిల ఇప్పుడు కాదు ఎప్పుడో జగన్ తో విభేదించారు. తెలంగాణకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఆ పార్టీ ఏపీ బాధ్యతలు చేపట్టారు. అందులో వైసీపీ నాయకులకు చంద్రబాబు ప్రమేయం ఏం కనిపించిందో వారికి తప్ప మరొకరికి అర్ధం కాదు.  వైఎస్సార్టీపీ అధినేత్రిగా ఉన్న సమయంలో కూడా షర్మిల నేరుగా జగన్ పై ఆరోపణలు చేశారు.  వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆమె హస్తిన వెళ్లి మరీ వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా అక్కడ మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలలో జగన్ పై కూడా విసుర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్ చెబుతున్నట్లు ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కుటుంబం విడిపోలేదు. ఏపీ సీఎంగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరు కారణంగానే చెల్లి, ఆ తరువాత తల్లి ఆయనతో విభేదించి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ తల్లి, చెల్లితో జగన్ కు సత్సంబంధాలు లేవన్న విషయం రహస్యమేమీ కాదు. అప్పుడు వారిని ఉద్దేశపూర్వకంగా దూరం చేసి, ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం నుంచి తరిమేసింది జగనే కానీ కాంగ్రెస్ కాదు. సరే విభేదాలతో విడిపోయిన తరువాత ఆమె రాజకీయం ఆమెను చేసుకోనియకుండా తెలంగాణలో అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా చేశారు. ఇవన్నీ ఎవరో జగన్ అంటే కిట్టని వారు చేసిన విమర్శలు కాదు.. స్వయంగా ఆ కుటుంబానికి సన్నిహితులే వెల్లడించిన విషయాలు. ఇలా తన విజయం కోసం శక్తికి మించి కృషి చేసిన  సొంత చెల్లి షర్మిలను ఆ తరువాత కూరలో కరివేపాకులా విసిరి పారేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టగానే  వ్యక్తిగత అంశాలను.. కుటుంబ అంశాలను మొదట ప్రస్తావించినది జగనే.  జగన్ వ్యాఖ్యలకు, విమర్శలకు షర్మిల దీటుగా బదులివ్వడంతో  తాడేపల్లి అంత:పుర రహస్యాలు బయటకు వచ్చే పరిస్థతి వచ్చింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందన్న చర్చే హాట్ టాపిక్ గా మారిపోయింది.   షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబం చీలిందని గుండెలు బాదుకోని జగన్ రెడ్డి.. ఆమె కాంగ్రెస్ లో చేరి  ఆ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టగానే కుటుంబం చీలపోయిందనీ, దీని వెనుక చంద్రబాబు ఉన్నారనీ గోలగోల చేస్తున్నారు. అయితే   కుటుంబాన్ని జగన్ రెడ్డే చీల్చేశారని స్వయంగా షర్మిల కుండబద్దలు కొట్టేశారు. ఇందుకు తల్లే  విజయమ్మే సాక్ష్యామని బాంబు పేల్చారు. అసలు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఇష్టారీతిగా ఆమె వ్యక్తిగత జీవితంపై పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వారుస్తోంది. చివరికి ఆమెను షర్మిలా శాస్త్రి అనడానికి కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వెనుకాడలేదు. ఆ వింగ్ కు సకల శాఖల మంత్రి సజ్జల కుమారుడు అధిపతి అన్న సంగతి తెలిసిందే. ఇప్పడు వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగనన్నే అంటే వైఎస్ షర్మిల అనగానే.. స్వయంగా  సజ్జల రంగంలోకి దిగారు. షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోందంటూ గగ్గోలు పెట్టేశారు.  అసలు షర్మిలకు జరిగిన అన్యాయమేమిటో చెప్పాలంటూ రివర్స్ అటాక్ మొదలెట్టేశారు.   అంతే కాకుండా  షర్మిల మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ఆమె పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు షర్మిలకు జరిగిన అన్యాయం ఏమిటో తలియడం లేదంటూ మాయకత్వం ప్రదర్శించారు. ఏపీ పాలిటిక్స్ పై షర్మిలకు అవగాహన లేదనీ, అందుకే చంద్రబాబు స్క్రిప్ట్ బట్టీపట్టి చదువుతోందని విమర్శించారు. కాళ్లరిగేలా తిరగడమే కాకుండా జగన్ కోసం గత ఎన్నికలలో విస్తృత ప్రచారం చేసిన షర్మిలకు ఏపీ పాలిటిక్స్ పై అవగాహన లేదనడం ద్వారా మరింత సజ్జల ఆమెను మరింత రెచ్చగొట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇక ముందు షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా కుటుంబ వ్యవహారాలపై మాట్లాడక తప్పని పరిస్థితిని సజ్జల స్వయంగా తీసుకు వచ్చారని అంటున్నారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె స్వయంగా బయటకు వచ్చి చెబితే.. ఆమె కూడా చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించగలరా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు, విమర్శల ద్వారా వైసీపీ పరిస్థితి పతనం నుంచి పతనానికి జారిపోతోందని అంటున్నారు. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్ 

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్‌లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు.  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే, వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, మరొకరి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ తిరస్కరించారు. దాంతో ఆ రెండు స్థానాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారయ్యారు. టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ మాట ఇవ్వగా.. ఇప్పడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఆయన్న పెద్దలకు సభకు పంపుతున్నారు.2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. దీంతో జోక్యం చేసుకోవాలని దాసోజు, కుర్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇంతలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గతంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు స్థానాలకు ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తాజాగా ఆమోదించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ మద్దతును ప్రకటించారు. దీంతో కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ హై కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోకాపేటలో పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 11 ఎకరాల భూ కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం (జనవరి 25)  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది.   కోకాపేటలో (సర్వే నెం. 239, 240) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   ఆ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా,  అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్దిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చింది.