కాలుదువ్వుతోన్న బర్రెలక్క!
posted on Jan 27, 2024 @ 11:39AM
బర్రెలక్క మళ్లీ కాలుదువ్వుతోంది... రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి.. గెలిచేందుకు ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష ప్రకటించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ఆమె తెలిపారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నేర్చుకొన్న పాఠాలను దృష్టిలో ఉంచుకొని.. రానున్న ఎన్నికల్లో ఆచి తూచి అడుగులు వేయనున్నట్లు బర్రెలక్క తెలిపారు. ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాన్ని బర్రెలక్క బాగానే ఒంట పట్టించుకున్నారనీ, అందుకే రాజకీయాన్ని వదలనంటున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క పారజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల బరిలో దిగాలంటే.. బ్యాంక్‌లో మనీ ఉండాలి. బ్యాక్ గ్రౌండ్‌లో మజిల్ పవర్ ఉండాలి. అలాగే మాయా మర్మంతోపాటు జిమ్మిక్క్ చేసే తెలివి తేటలు సైతం ఉండాలి. కానీ అవేమి లేకుండానే .. అతి చిన్న వయస్సులో.. జస్ట్ నాలుగు బర్రెలు కాసుకొంటూ జీవనం సాగిస్తున్న బర్రెలక్క.. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోవడమే కాకుండా.. తన సోదరుడితో నడుచుకొంటూ వెళ్లి మరీ న్నికల రిట్నరింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి వచ్చారు. అలా నామినేషన్ దాఖలు చేసి ఊరుకోకుండా తన దైన శైలిలో నియోజకవర్గంలో ప్రచారం చేసి పాపులర్ అయ్యారు. అయితే ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలంటూ.. బెదిరింపులు వచ్చినా.. తగ్గేదే లే అంటూ ప్రచారంలో దూసుకుపోయారు.
ఆ ఎన్నికలలో బర్రెలక్కకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు నుంచి మద్దతు లభించింది. సామాజిక మాధ్యమంలో ఆమెకు మద్దతుగా నెటిజన్లు పోస్టులతో ఓ రేంజ్ హైప్ తీసుకువచ్చారు. దీంతో ఒక దశలో ఆమె గెలుపు నల్లేరు మీద నడకేనన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమైంది. అయితే వాస్తవంలో మాత్రం ఆమెకు 5 వేలు పైచిలుకు ఓట్లు మాత్రమే పోలైనాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బర్రెలక్క స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి ఆమె బీకాం డిగ్రీ పట్టా అందుకోంది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించినా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో పేపరు లీకేజీలు చోటు చేసుకోంటుండడంతో.. తీవ్ర నిరాశ చెంది, ఎన్ని డిగ్రీలు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదు, అందుకే బర్రెలు కాస్తున్నానంటూ.. నిరుద్యోగిగా శిరీష పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేసింది. దీంతో శిరీష.. ఒక్కసారిగా బర్రెలక్కగా ఫేమస్ అయిపోయారు. అలా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు.. కేంద్ర ఎన్నికల సంఘం ఈల గుర్తు కేటాయించింది.
మరోవైపు నిరుద్యోగుల ప్రతినిధిగా శిరీష.. తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్‌లో ఓ పాటను సైతం విడుదల చేశారు. ఆ పాట యూట్యూబ్‌లో తెగ వైరల్ అయ్యింది. ఇంకోవైపు బర్రెలక్క గురించి కేంద్రపాలిత ప్రాంతం యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని.. ఆమె ఎన్నికల ప్రచారం కోసం లక్ష రూపాయిల నగదు విరాళాన్ని అందజేశారు. అలాగే ఆ తర్వాత ఆమెను ఆయన స్వయంగా కలిసి.. మరింత ఆర్థిక సాయం అందించడమే కాదు.. ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చిన నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాలంటూ ధైర్యం చెప్పారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ సైతం బర్రెలక్కను కలిసి.. తన మద్దతు సైతం ప్రకటించమే కాకుండా.. చిన్న వయస్సులోనే బర్రెలక్క రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్వాగతించారు. ఆమెను ఆదర్శంగా తీసుకోని .. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు కూడా ఇచ్చారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిని కైవసం చేసుకోనేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కొల్పోయాం.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలంటూ.. గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యామిలీ కృతనిశ్చయంతో ముందుకు దూసుకుపోతోంది. అలాంటి వేళ.. ఈ బర్రెలక్క ఎన్నికల్లో నిలబడి.. ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది చూడాల్సిందే.
ఎన్నికల్లో నిలబడితే.. నిధుల రూపంలో రూపాయిలు అందుతున్నాయని.. అలా కష్ట పడకుండానే నగదు వస్తుందని బర్రెలక్క బాగానే గ్రహించారనీ, అందుకే గెలుపుతో పని లేదు కానీ.. నగదుతోనే పని అన్నట్లుగా బర్రెలక్క వ్యవహార శైలి ఉందనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.