రామ్ లల్లా ఇకపై బాలక్ రామ్

ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.  మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు.  ఈరోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది.

చేతులు కాల్చుకుని ఆకుల కోసం జగన్ వెతుకులాట!

తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్  కు ఇప్పుడు పట్టి మునిగే పరిస్థితి వచ్చే సరికి నాలుగో కాలు కనిపించిందా? తన మాట తనే వినని జగన్ కు సిట్టింగుల మార్పు నిర్ణయం కళ్లు బైర్లు కమ్మేలా గట్టి షాక్ ఇచ్చింది. పార్టీలో నిరసనలు పెచ్చరిల్లినా, అసంతృప్తి భగ్గుమన్నా పట్టించుకోని జగన్ ఇప్పుడు ఒక్కరొక్కరుగా సిట్టింగులు రాజీనామాలు చేసి పార్టీ వీడుతుంటే.. పార్టీ వీడిన వారి స్థానంలో కొత్త అభ్యర్థులు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితుల్లో తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని జగన్ భావిస్తున్నారు. అధికారం ఉంది. ఏం చేసినా చెల్లిపోతుంది. నా ఫొటో చాలు మరోసారి గెలిచేయడానికి అన్న భ్రమలు ఒక్కటొక్కటిగా తొలగిపోతుంటే.. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురౌతుంటే.. గెలుపు ఆశలు కళ్ల ముందే ఆవిరైపోతుంటే... జగన్ నష్ట నివారణ చర్యలకు నడుంబిగించేందుకు ఉపక్రమించారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే జగన్ లోని ఈ మార్పు పట్ల పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.  ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు, 10 ఎంపీలను ఖరారు చేసేసిన తరువాత ఇప్పుడు తీరిగ్గా కాదు కాదు ఇది ఫైనల్ కాదంటూ పునరాలోచన చేస్తున్నానని చెప్పడం చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత పట్టుకోవడానికి ఆకుల కోసం వెతికిన చందంగా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలలో ఏ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రోది చేశాయో.. అంత కంటే ఎక్కువగా జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం పార్టీలో అసంతృప్తిని రాజేసింది. జగన్ కు అత్యంత నమ్మకస్థులు, నమ్మిన బంట్లు వంటి వారే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రశ్నస్తున్నారు.  పార్టీకి రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. పలువురు ఇప్పటికే రాజీనామా చేసి తమ దారి తాము చూసుకున్నారు. మరి కొందరు దారులు వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ఇప్పుడు ప్రకటించిన నాలుగు జాబితాలూ ఫైనల్ కాదు, పునరాలోచిస్తున్నాం. మరో సారి సర్వే చేయించి సిట్టింగుల మార్పుపై నిర్ణయం తీసుకుంటామని అసంతృప్తులకు నచ్చచెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.   ఏది ఏమైనా నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించే జగన్ కాదు కాదు అది శాసనం కాదు.. పరిశీలించి మాట మార్చుకుంటాను అంటూ ఒక మెట్టు దిగిరావడం ఆయనలో ఓటమి భయానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

ఒక్క ఎంపీ సీటు.. నాలుగు వికెట్లు.. జగన్ కు మామూలు దెబ్బ కాదుగా!

వైసీపీ టీమ్ ఆలౌట్ కు దగ్గరౌతోందా? ఒక దాని వెంట ఒకటిగా వికెట్లు పడిపోతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తాజాగా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఆయన తన ఎంపీ పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ కూడా రాజీనామా చేశారు.  ఒక్క గుంటూరు లోక్ సభ స్థానం కేంద్రంగా వైసీపీ నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఇప్పటికే రెండు వికెట్ల పడిపోయాయి. ఇహనో ఇప్పుడో మరో రెండు వికెట్లు కూడా డౌన్ కానున్నాయి. ఇంతకీ గుంటూరు లోక్ సభ స్థానం విషయంలో జగన్ నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం నలుగురు రాజీనామాకు ఎందుకు కారణమైంది. అంటే జగన్ తన ఇష్టారీతిగా ఆశావహులకు హామీలు ఇచ్చేయడం, ఆ తరువాత తూచ్ ఇది కాదు.. మరోటి అంటూ నిర్ణయాన్ని మార్చేసుకోవడం పరిపాటే. ఇంత వరకూ ఎలాగో గడిచిపోయింది కానీ ఎన్నికల ముందు.. జగన్ నిర్ణయాలు తమ కొంపలు ముంచేసే విధంగా ఉండటంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమంటూ పలువురు పార్టీని వీడుతున్నారు. అదే విధంగా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టికెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చి క్రికెటర్ అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. నిజమే కాబోలనుకున్న అంబటి రాయుడు ఓ మూడు నెలల పాటు నియోజకవర్గం అంతా పర్యటించి పరిచయాలు పెంచుకుని మద్దతు కూడగట్టుకుని అంతా బానే ఉందన్న నిర్ణయానికి వచ్చి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని కండువా కప్పుకున్నారు. అంత వరకూ గుంటూరు లోక్ సభకు వైసీపీ అభ్యర్థిని తానే అనే భవనలో ఉన్న రాయుడికి ఆ సీటు నుంచి పోటీ చేయాల్సిందిగా నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయులిని జగన్ ఆదేశించినట్లు తెలియడంతో బిత్తర పోయారు. పార్టీ అధినేత ఇలా మాట ఇచ్చి అలా తప్పడానికి సిద్ధపడిపోవడంతో ఇహ లాభం లేదని నిర్ణయానికి వచ్చేశారు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ తీర్థం పుచ్చుకున్న పది రోజుల్లోనే రాజీనామా చేసేశారు. జనసేన గూటికి చేరిపోయారు. ఇక లావు కృష్ణ దేవరాయులు విషయానికి వస్తే ఆయన జగన్ కు ముఖం మీదే తాను గుంటూరు నుంచి పోటీకి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేశారు. గుంటూరులో తాను కాదు, వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కూడా మొహమాటం లేకుండా చెప్పేశారు. తాను నరసరావు పేట నుంచే బరిలోకి దిగుతానని తెగేసి చెప్పారు. అప్పటికి సరే అన్న జగన్.. తన మాట కాదంటాడా అన్న అహంతో లావుకు నరసరావు పేట ఎంపీ టికెట్ ఖరారు చేయలేదు. దీంతో ఓ పది రోజులు ఓపిక పట్టిన లావు రెండో ఆలోచన లేకుండా రాజీనామా చేసేశారు. ఆ సందర్భంగా ఆయన నేరుగా జగన్ పేరు ప్రస్తావించకుండానే పార్టీ పరిస్థితిని, పార్టీ అగ్రనాయకత్వం అడ్డగోలు వ్యవహారాన్నీ మీడియాకు సవివరంగా చెప్పేశారు.  పార్టీలో గత కొంత కాలంగా  అయోమయం నెలకొందనీ,  దానికి పార్టీ అధిష్ఠానం తెరదించుతుందన్న ఇంత కాలం వేచి ఉన్నాననీ, ఆ పని హైకమాండ్ చేయకపోవడంతో తాను ముందుకు వచ్చి తన రాజీనామాతో తెరదించాలని భావించాననీ చెప్పారు.   గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేశాననీ చెప్పారు.   అయితే గుంటూరు లోక్ సభ స్థానం సెంట్రిక్ గా ఈ రెండు వికెట్ల పతనంతో ఆగేటట్లు కనిపించడం లేదు. నరసరావు పేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలాగే  నర్సరావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా బాటలోనే ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. తొలి నుంచీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న వీరిరువురూ లావు రాజీనామా చేసిన వెంటనే ఆయనతో భేటీ అయ్యారు.  త్వరలోనే వారూ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం.. గట్టిగానే ఫలిస్తున్నట్లు తోస్తున్నది. కొందరు మంత్రులు, సీనియర్ నేతలూ కూడా సమయం చూసుకుని వైసీపీకి గుడ్ బై కొట్టేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 

మోడీ బయోపిక్ విశ్వనేత.. క్రాంతికుమార్ డైరెక్షన్ లో సినిమా

ఒక వైపు అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం కుదరడం కాకతాళీయం, యాథృచ్ఛికం అనే అనుకున్నా.. రామభక్తి ఒక మాయగా దేశాన్ని కమ్మేసింది. రాజకీయ, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా దేశం అంతటా రామనామం మార్మోగింది. అది కచ్చితంగా బీజేపీకి రానున్న ఎన్నికలలో పాజిటివ్ వైబ్స్ రావడానికి కారణమౌతుందని, పొలిటికల్ మైలేజి లభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ మైలేజ్ సరిపోదనుకున్నారో ఏమో ఇప్పుడు మోడీ తన బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విశ్వనేత పేరుతో త్వరలో తెరకెక్కనున్న మోడీ బయోపిక్ ఉద్దేశం, లక్ష్యం కూడా మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టేందుకు దోహదపడటం మాత్రమేనని చెబుతున్నారు. మొత్తం భారతీయ భాషలన్నిటిలోనూ తెరకెక్కనున్న మోడీ బయోపిక్ విశ్వనేత సినిమాకు సీహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాశిరెడ్డి భరత్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాలభైరవ. నిర్మాణ సంస్థ వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ సినిమాలో అభయ్ డియోల్,  నినాగుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య తారాగణం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సెట్స్ మీదకు రానున్న విశ్వనేత సినిమాలో..   ఆర్టికల్ 370 రద్దు, డీమానిటైజేషన్, జీఎస్టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి  సంఘటనలను హైలైట్ చేయనున్నాయి.  చాయ్ వాలా స్థాయి నుంచి విశ్వనేతగా ఎదిగిన  నరేంద్రమోడీ ప్రస్థానం ఈ బయోపిక్  దృశ్యీకరించనుంది.  

వైసీపీ కి మరోషాక్... నరసారావుపేటఎంపీ రాజీనామా

నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొన్నదని తెలిపారు. పార్టీ కేడర్‌ కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడటంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ అనిశ్చితికి కారణం తాను కాదని స్పష్టం చేశారు. నరసరావుపేటకు అధిష్టానం కొత్త అభ్యర్థిని తీసుకువాలనుకుంది. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అందుకే చాలా స్పష్టంగా నా అభిప్రాయం చెప్పి రాజీనామా చేశాను అని వెల్లడించారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేసినట్లు చెప్పారు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాజకీయంగా పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడిందన్నారు.శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. గుంటూరు లేదా నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశాన్ని శ్రీకృష్ణ దేవరాయలుకే చంద్రబాబు వదిలేశారని సమాచారం. శ్రీకృష్ణదేవరాయలు లోకేశ్‌తోనూ సమావేశమైనట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పులో భాగంగా ఈసారి నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని ప్లాన్ చేసిన వైసీపీ హైకమాండ్‌.. కృష్ణదేవరాయలును గుంటూరుకు వెళ్లాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనకు శ్రీ‌కృష్ణదేవరాయలు విముఖత వ్యక్తం చేశారు. ఇటీవల జగన్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు ఆయన. దీంతో నరసరావుపేట టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో గత 15, 20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితికి తెర పడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదని, ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ, పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు. క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. దీని వల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు. దీనికి తెరదించుతూ.. తాను ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని... ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు. ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించానని... ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నానని తెలిపారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపికి రాజీనామా చేశారు.  బాల శౌరి జనసేనతీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజీనామాలు కామన్ అంటున్నారు వైసీపీ నేతలు. ఎవరు రాజీనామాలు చేసినా పార్టీకి జరిగే నష్టం ఏం లేదని తేల్చి చెప్తున్నారు. టికెట్ కుదరదని చెప్పడంతోనే నేతలు పార్టీని వీడుతున్నారని స్పష్టంచేశారు.

షర్మిల నుంచి వైఎస్ ను దూరం చేయగలరా?

వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో క్రియాశీలం అవుతుంటే.. వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. దివంగత వైఎస్ తనయగా ఆమె తండ్రి వారసత్వం తన నుంచి లాగేసుకుంటోందన్న భయం జగన్ ను వెంటాడుతోంది. ఆమె మాటల తూటాలు తన కోటను బద్దలు కొట్టేస్తాయన్న వణుకు నిలవనీయడం లేదు. వైసీపీ అధికారానికి ఏపీలో షర్మిల ఎంట్రీ చరమగీతం పాడేయడం ఖాయమన్న నిర్ణయానికి జగన్ అండ్ కో వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఆమెను నిలువరించాలంటే ఆమెపై, ఆమె వ్యక్తిత్వంపై బురద జల్లడంతో పాటు ఆమెను వైఎస్ కుటుంబీకురాలు కాదని ప్రజలలో ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. అందుకే వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలో వైఎస్ షర్మిలపై దుష్ఫ్రచారం, దూషణలు మొదలెట్టేసింది. అంతే కాదు.. ఆమె నుంచి వైఎస్ ను దూరం చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకే ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అన్న అక్షరాలు లేకుండా  వైసీపీ సోషల్ మీడియా వింగ్  అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అంతే కాదు.. జగన్ అనుకూల మీడియా కూడా ఉద్దేశపూర్వకంగా వైఎస్ షర్మిల వార్తల కవరేజ్ లో ఆమె పేరు ముందు   వైఎస్ అక్షరాలను మాయం చేస్తున్నది.  ఇక ఆమె మొదటి వివాహం, రెండో వివాహం అంటూ వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకుంటూ ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం నానా తంటాలు పడుతోంది. ఒక వైపు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల.. ఆయన కూడా వైఎస్ షర్మిల అనడం లేదు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయంటూ కన్నీరు పెట్టుకున్నంత పని చేసి, మెత్తగానే అయినా ఆమె చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఓ రకంగా విష ప్రచారానికి తెర లేపారు. వైఎస్ ను, వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శించి, దూషించిన వారి పంచన చేరారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారు. ఇక సజ్జల పుత్రరత్నం, వైసీపీ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అయితే.. మర్యాద ముసుగు తీసేసి.. ఆయన హయాంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆరితేరిన బూతు పురాణంతో  రెచ్చిపోతున్నారు. మొత్తంగా ఎంతగా ప్రయత్నించినా వైఎస్ షర్మిల పేరు నుంచి వైఎస్ పదాలను తీసేయడం సాధ్యమయ్యే పని కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో షర్మిల జగన్ కోసం చేసిన ప్రచారం సందర్భంగా ఆమె వైఎస్ షర్మిలగానే ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్ రాజన్న బిడ్డగానే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తున్నారు.  నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని రంగాలలోనే విఫలం కావడం ద్వారా వైఎస్ రాజకీయ వారసత్వ గుర్తింపును జగన్  స్వయంగా పోగొట్టుకున్నారనీ, అందుకే వైఎస్ షర్మిలను వైఎస్ వారసురాలిగా రాజకీయవర్గాలు గుర్తిస్తున్నాయనీ అంటున్నారు.  

వైఎస్ ఫ్యామిలీకి ఇచ్చాపురం సెంటిమెంట్ 

వైఎస్ ప్యామిలీ కి  ఇచ్చాపురంతో విడదీయరానిబంధం ఏర్పడింది. 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంతో తేవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర  ఇచ్చాపురంలో ముగించారు. ప్రస్తుతం ఆయన తనయ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు వైఎష్ షర్మిల కూడా ఇచ్చాపురం నుంచే సుడిగాలి పర్యటనలు ప్రారంభించారు.  ఎపిలో అన్నా చెల్లెల్ల రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యవేక్షణలో  వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారుకావడం, కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు షర్మిలసుడిగాలి పర్యటనలు ప్రారంభం కావడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తుంది.2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి కూతురుప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు అయ్యింది.కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు  వైఎస్‌ షర్మిల..విశాఖ వేదికగా యాక్షన్‌ ప్లాన్‌ స్టార్ట్‌ చేశారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను దాదాపుగా పూర్తి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ కూడా..విశాఖ నుండే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వేదికగా ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ సర్కారుపై ఇప్పటికే పదునైన విమర్శలు చేసిన షర్మిల..ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యాటనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది.  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజులపాటు రాష్ట్రంలో సుడిగాలిపర్యటన చేయనున్నారు.  ఈ రోజు ఉదయం  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో నేతలతో సమీక్షించారు. ఆ తర్వాత పార్వతీపురం చేరుకుని  మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షించారు. అనంతరం విజయనగరం చేరుకుని  జిల్లాపై సమీక్ష నిర్వహించారు.  బుధవారం  విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, గురువారం  (25న) కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, శుక్రవారం (26న) తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు.  శనివారం (27న) గుంటూరు, పల్నాడు,  ఆదివారం (28న) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు సోమవారం(29న) తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,మంగళవారం(30న) శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, బుధవారం(31న) నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. వైసీపీ అభ్యర్ధుల ఎంపికను దాదాపు పూర్తి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌..త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు షర్మిల కూడా జిల్లాల పర్యాటనకు శ్రీకారం చుట్టడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో పూర్తిగా స్తబ్ధత ఏర్పడింది. అధిష్ఠానం పలువురు పీసీసీ నేతలను మార్చినప్పటికీ పార్టీ కేడర్‌లో ఏమాత్రం ఉత్సాహం నింపలేకపోయింది ఇప్పుడు వైఎస్‌ షర్మిల ఆ పరిస్థితిని మార్చి..ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తారని అధిష్ఠానం ఆశిస్తోంది. సెప్టెంబరు 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని షాక్‌తో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించడం విశేషం. అప్పట్లో ఓదార్పు యాత్ర విజయవంతంగా కొనసాగింది. యాత్రతో సానుకూల ఫలితాలు సాధించి, నాలుగేళ్లలోనే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాతే 2019లో జగన్‌ సీఎం అయ్యారు. అంతకు ముందు మెగస్టార్‌ చిరంజీవి తన సొంత రాజకీయ పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి యాత్ర చేపట్టింది కూడా శ్రీకాకుళం నుంచే. 

ఏపీ ఎన్నికల్లో త్రిముఖ పోరు.. జగన్ బేజారు!

షర్మిల ఎంట్రీతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు  వేగంగా మరి పోతున్నాయా?  ఇప్పటి వరకూ ద్విముఖ పోరుగా ఉన్న పరిస్థితులు త్రిముఖ పోరుగా మారబోతున్నాయా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇంతవరకు ఓ లెక్క షర్మిల ఎంట్రీ తరువాత  ఇంకో లెక్క అన్నరీతిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయంటున్నారు. షర్మిల ఎంట్రీకి ముందు వరకూ తెలుగుదేశం, జనసేన కూటమి, అధికార వైసీపీ మధ్య ముఖాముఖీ పోరుగా వచ్చే ఎన్నికలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషించారు. అయితే షర్మిల ఎంట్రీ తరువాత రాష్ట్రంలో జరిగేది త్రిముఖ పోరే అంటూ తమ విశ్లేషణలను సవరించుకుంటున్నారు.ఇప్పటి వరకూ అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సక్షేమ పథకాలపైనే దృష్టిని కేద్రీకరించారు. నీట ముంచినా, పాల ముంచినా, ‘మీటదే’ భారం అన్నవిధంగా ఆయన ముందుకు సాగుతున్నారు.అయితే, కొంచెం ఆలస్యంగానే అయినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఒక చేత్తో మీటలు నొక్కుతూ.. మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని  గ్రహించారు. ప్రజలే కాదు సొంత పార్టీ నేతలూ విషయాన్ని గ్రహించారు. అందుకే  ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలతో  విభేదించి పలువురు పార్టీకి దూరం అవుతున్నారు.      మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, టీడీపీ జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది. జనసేన, తెలుగుదేశం పొత్తుతో  జగన్ వ్యతిరేక పవనాల తీవ్రత మరింత పెరిగింది.  ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ఫైర్ బ్రాండ్ విమర్శలతో అన్న జగన్ కు, వైసీపీకి చెమటలు పట్టిస్తున్నది. ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేన పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా కూటమికి రావడం వల్ల జగన్ విజయావకాశాలు సన్నగిల్లిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తుండటంతో చీలే ఓటు ప్రభుత్వ అనుకూల ఓటు అంటున్నారు పరిశీలకులు. జగన్ పార్టీ సొంత ఓటు చీలికతో ఇక గెలుపు అన్నది వైసీపీకి అందని ద్రాక్షగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు వల్ల అంటే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పుంజుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అధకారంలో ఉన్న వైసీపీయే అని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇన్ టాక్ట్ గా తెలుగుదేశం, జనసేన కూటమికి పడుతుందనీ, షర్మిల చీల్చే ఓట్లు మాత్రం జగన్ పార్టీకి పడే ఓట్లనేనని అంటున్నారు. దీని వల్ల ఇప్పటి వరకూ సర్వేలలో వైసీపీ గెలుచుకుంటుందని చెబుతున్న స్థానాలలో కొన్నిటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని విశ్లషిస్తున్నారు.  వాస్తవానికి నిన్న మొన్నటి దాకా అంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేంత వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కనీస గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే వైఎస్ వారసురాలిగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో.. ఆ పార్టీలో గత పదేళ్లుగా కాగడా పెట్టి వెతికినా కనిపించని జోష్ ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అదే జగన్ పార్టీలో  పునాదులు కదిలిపోతున్నాయన్న భయాన్ని రేకెత్తిస్తున్నది. మొత్తం మీద షర్మిల ఎంట్రీ వైసీపీ ఓటమిని డిసైడ్ చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటి వరకూ జగన్ పార్టీకి రాయలసీమలో ఉన్న పట్టు  షర్మిల ఎంట్రీతో జారిపోయిందని అంటున్నారు. షర్మిల ఎంట్రీతో  ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయంటున్నారు. షర్మిల ఎంట్రీ జగన్ ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. అంటే ఇప్పటి వరకూ జగన్ పార్టీ ఖాతాలో పడతాయనుకుంటున్న సీట్లలో ఎన్నో కొన్ని కాంగ్రెస్ ఖాతాలో పడతాయనీ, దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుచుకునే స్థానాల సంఖ్య సింగిల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 

తొలి ప్రసంగంతోనే సిక్సర్ కొట్టేసిన షర్మిల.. ఇక వైసీపీ బౌన్సర్లకు రెడీ అవ్వాలి!

ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిల సిక్సర్ కొట్టేశారు. ఇక ముందు తన పొలిటికల్ బ్యాటింగ్ ఎలా ఉండబోతోందో  తేటతెల్లం చేసేశారు. సొంత అన్న అన్న ముఖమాటం ఏ మాత్రం ఉండదని చాటారు. ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, అలా  జగన్ సర్కార్ పై విమర్శల బాణాలు సంధించారు.  జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అడుగంటిందని దుయ్యబట్టారు.  తొలిరోజే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు షర్మిల విమర్శల దాడి మరింత తీవ్రం అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం విభేదాలున్నా.. అటు అన్న జగన్ కానీ, ఇటు చెల్లి షర్మిల కానీ పరస్పర విమర్శలు చేసుకోలేదు. ఎదురుపడినా కొద్దిగా ముభావంగా ఉన్నా, పలకరింపులు, చిరునవ్వులు, కరచాలనాలు, ఆలింగనాలతో తమ అనుబంధం చెక్కు చెదరకుండా ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అంతెందుకు నిన్న మొన్న షర్మిల కుమారుడి పెళ్లి నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరయ్యారు. ఎక్కువ సమయం గడపక పోయినా.. ఆ కార్యక్రమానికి వెళ్లి మేనల్లుడిని ఆశీర్వదించి, చెల్లిని అభినందించి, ఆత్మీయంగా హగ్ చేసుకుని ఫొటో దిగారు.  అయితే ఇలాంటి మర్యాద ప్రదర్శనలు ఇక ముందు అన్నా చెల్లెళ్ల మధ్య ఉంటాయా అంటే డౌటే అంటున్నారు పరిశీలకులు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న వెంటనే అన్న జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే వచ్చే నెల 17న జోధ్ పూర్ లో జరగనున్న షర్మిల కుమారుడి వివాహానికి జగన్ హాజరయ్యే అవకాశాలు మృగ్యం అంటున్నారు. ప్రస్తుతం షర్మిల జగన్ సర్కార్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల ఉధృతి రానున్న రోజుల్లో మరింత తీవ్రం అవ్వడం ఖాయం  షర్మిల  తన ప్రభుత్వాన్నీ, తననూ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం జగన్ కు రాజకీయంగా చేసే నష్టం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.  ఈ పరిస్థితుల్లో తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా ఇక షర్మిల విషయంలో ఉపేక్షించకుండా దాడి ప్రారంభించడం ఖాయమని అంటున్నారు. అందుకే  జగన్  మేనల్లుడి పెళ్లికి హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు అంటున్నారు. కొందరైతే రాజకీయం దారి రాజకీయందే.. అందు కోసం బంధుత్వాన్ని వదులుకుంటారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిశీలకులు మాత్రం వైఎస్ వివేకా హత్య తదననంతర పరిణామాలు, సొంత బాబాయ్ కూతురిని కూడా కాదని, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ వత్తాసు పలుకుతూ వారిని కాపాడేందుకు చేస్తున్న  ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ఇక అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేది రాజకీయ యుద్ధమే తప్ప బంధుత్వం కాదని అంటున్నారు.   ఇప్పటికే షర్మిల వ్యక్తిగత జీవితాన్నిటార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. యధా ప్రకారం వైసీపీ సోషల్ మీడియా కు మాత్రమే సాధ్యమయ్యే బూతులతో వెల్లువెత్తుతున్న పోస్టులు గమనిస్తే..  షర్మిల విషయంలో మెహమాటం లేకుండా వ్యవహరించమని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయా అనిపించకమానదు.   ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల చేసిన విమర్శలన్నీ రాజకీయమైనవే. జాబ్ క్యాలెండర్, మూడు రాజధానులు, రాష్ట్ర అభివృద్ధి, పోలవరం వంటి అంశాలను లేవనెత్తి జగన్ వైఫల్యాలను ఎత్తి చూపారు. మణిపూర్ హింసాకాండను ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక క్రైస్తవుడిగా కూడా ఖండించకపోవడం దారుణమన్నారు. ఆమె చేసిన ఏ విమర్శలోనూ తప్పుపట్టాల్సినదేమీ లేదు. పైగా గత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం, జనసేన ఈ విమర్శలు చేస్తూనే ఉన్నాయి.  చేతనైతే వీటిపై సమాధానం ఇవ్వాలి కానీ.. షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఆమె విమర్శలకు వెనుక చంద్రబాబు ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తాడేపల్లి ప్యాలెస్ అనుమతి లేకుండా రావని పరిశీలకులు అంటున్నారు. తనను, తన విధానాలను విమర్శింస్తే జగన్ సహించరు. అలా విమర్శించేవారు తనవారైనా, పరాయి వారైనా ఆయనకు ఒక్కటే.  ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు.  ఇప్పుడు షర్మిల పైనా అదే చేస్తున్నారు. చేస్తారు. సొంత చెల్లి అయినా సరే తన విధానాలను వ్యతిరేకిస్తే జగన్ సహించరనీ, ఉపేక్షించరనీ చెప్పడానికి వైసీపీ సోషల్ మీడియాలో  వెల్లువెత్తుతున్న పోస్టులే నిదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు.  దీంతో ముందు ముందు వైసీపీ నుంచి షర్మిలపై విమర్శల దాడుల తీవ్రత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే మేనల్లుడి వివాహానికి కూడా జగన్ డుమ్మా కొట్టడం ద్వారా చెల్లెలు అన్న సెంటిమెంట్ నాకే లేనప్పుడు మీకు మొహమాటం ఎందుకు రెచ్చిపొండి అని సంకేతాలు ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. 

తండ్రికి తగ్గ తనయుడు.. తండ్రిని మించిన నాయకుడు.. నారా లోకేష్!

వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం  నారా లోకేష్.  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు.   హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష్, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా అటాక్ చేశారు.   అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు. డు.   ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైనా గత నాలుగున్నరేళ్లుగా అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు.  విపక్షంలో ఉండి గత నాలుగున్నరేళ్లుగా ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు.  అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు.  తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు.  అయితే నారా లోకేష్ కు నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది.   తాను ఎదగడం మాత్రమే కాదు.. పార్టీలో రానున్న ఎన్నికలలో విజయం పట్ల విశ్వాసం కల్పించడంలోనూ లోకేష్ విజయం సాధించారు.   ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్రగా చెప్పాలి. లోకేష్ ఈ యాత్రతో ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, దాడులను ప్రజాదరణతో ఎదుర్కొని ముందడుగు వేయడం నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే  అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని  తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి.   లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారంటే దటీజ్ లోకేష్. ఇదే దీక్షతో, ఇదే సంకల్పంతో ఆయన మున్ముందు మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ నారా లోకేష్ కు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

ఏపీ వేదికగా అన్నా చెల్లెళ్ల రాజకీయ రణం!

ఏపీలో ఇప్పుడు వైఎస్ కుటుంబ రాజకీయ రణం ఓ రేంజ్ లో ప్రారంభమైంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు షర్మిల రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. రాజధాని నగరానికి వచ్చే దారిలో ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించడంతో  రానున్న రోజులలో అన్నా చెళ్లెల్ల పొలిటికల్ వార్ ఏ స్థాయిలో సాగనుందన్న విషయం అందరికీ అవగతమైంది. ఈ వార్ లో మాటల తూటాలే కాదు, కుటుంబ రహస్యాలూ ఫైర్ వర్క్స్ మాదిరిగా ఆకాశమే హద్దుగా బయటకు వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నయ్య జగన్ సర్కార్ పతనమే అజెండాగా చెల్లి షర్మిల ఏపీలో అడుగుపెట్టారు. ఆమె  కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకోవడానికి ముందే ఏపీలో పోలీసు వ్యవస్థ పంజా విసిరింది.  అన్న సర్కార్ ఇలా ఆదేశాలు జారీ చేసిందో లేదో.. అలా పోలీసులు ఆమె కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అయితే ఇటువంటి ఉడుత బెదరింపులకు బెదిరే రకం కాదు వైఎస్ బిడ్డ షర్మిల. అసలే ఫైర్ బ్రాండ్.. ఈ ఘటనే నాందిగా ఆమె అన్న సర్కార్ పై నిప్పులు చెరిగారు.   ఏపీ కాంగ్రెస్ దళపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆదివారం, గన్నవరం నుంచి బెజవాడకు భారీ కాన్వాయ్‌లో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు.  ర్యాలీకి అనుమతి లేదంటూ కాన్వాయ్ ని ఆపేశారు.  దారి మళ్లాలని ఆదేశించారు. అయితే షర్మిల ససేమిరా అన్నారు.  ఏపీలో నియంత పాలన నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కారు వణికిపోతోంది. అంటూ ఎలుగెత్తారు.   అక్కడితో ఆగకుండా  ఏంటి సార్ మమ్మల్ని చూసి భయపడుతున్నారా? ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా? మీ అక్రమాలిక సాగవు. కార్యకర్తల కోసం జైలుకయినా వెళతా అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో  వైరల్ అయ్యాయి.   పోలీసుల వైఖరికి నిరసనగా షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు.  దానితో  దిగొచ్చిన పోలీసులు  షర్మిల  కాన్యాయ్‌ను అనుమతించారు. ఈ పరిణామంతో  గంటల తరబడి ట్రాఫిక్ చాలాసేపు జామయింది.  తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే.. పోలీసులు ఓవరాక్షన్ చేశారని ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా కాంగ్రెస్ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తాడేపల్లి  ప్యాలస్ నుంచి  ఆదేశాలు రాకపోతే వైఎస్ బిడ్డ షర్మిలను ఆపే ధైర్యం పోలీసులు చేయరని అంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలు, సజ్జల డైరక్షన్ ప్రకారమే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోలీసులు ఇప్పటికైనా జగన్ సర్కారు భజన మానకపోతే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ హెచ్చరించింది.  కాగా.. వైఎస్‌కు అసలైన వారసురాలొచ్చిదంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ఈ సందర్భంగా ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉటుంది.  ఇక తనను పోలీసులు అడ్డుకోవడం వరకూ అన్న జగన్ పై విమర్శల విషయంలో కొంచం ముందు వెనుకలాడిన షర్మిల ఇక ఏ శషబిషలూ లేకుండా  జగన్ కు నేరుగా లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు.  ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది, అయితే రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదు, రాష్ట్రంలో నియంత పాలనను అంతం చేస్తా అంటూ ప్రతిన పూనారు షర్మిల. ఆ నియంత జగనేననీ, తాను అంతమొందించేది జగన్ పాలననేననీ షర్మిల ఇంత కంటే నేరుగా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా?  ఆ ఒక్క హెచ్చరికతో షర్మిల అన్నపై రాజకీయ యుద్ధం ప్రకటించేశారు.   

వైసీపీకి గుంటూరు కారం.. అధిష్ఠానం నషాళానికి అసమ్మతి ఘాటు!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఎవరి మాటా లెక్క చేయకుండా సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేయగా.. పాత అభ్యర్థులు ఆయా స్థానాలలో రచ్చ లేపుతున్నారు.  కొత్త అభ్యర్థులను వైసీపీ క్యాడర్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు. కొందరు కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇస్తే తాము మద్దతుగా పని చేసేది లేదని ద్వితీయ శ్రేణి నేతలు  తేల్చి చెప్పేస్తున్నారు.  పాత, కొత్త నేతలు కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్లాలని అధిష్టానం  ఆదేశాలను ఎటూ ఎవరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడు అధిష్ఠానం దిగి వచ్చి బాబ్బాబు ఈ సారికి కలిసి పని చేయడం అంటూ బతిమలాడుతున్నా పట్టించచుకోవడం లేదు. ఇక్యత అన్నది రియాలిటీలో  కనిపించడం లేదు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కాడి వదిలేసినట్లైంది. పార్టీలో ఉన్న వారిలో కొందరు ఇప్పటికే పక్క పార్టీలలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా.. ఆ అవకాశం లేక వైసీపీలోనే మిగిలిపోయే వారు కూడా  వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీకి ఒకవైపు రాజధాని అమరావతి సెగ  ఇప్పటికే కాకపుట్టిస్తున్నది.  మరోవైపు ఇలా సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తూ, పార్టీ గెలుపు, ఓటములతో తమకు సంబంధం లేదు. అసలు పార్టీతోనే మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.  దీంతో  జగన్ చేష్టలుడిగి చేతులెత్తేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిట్టింగు ఎమ్మెల్యేల‌పై రెండు చోట్ల‌, కొత్త‌గా ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులపై   అస‌మ్మ‌తి భారీ ఎత్తున చెలరేగింది. స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేత‌లే  రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. అంబటి కోసం గ‌త ఎన్నిక‌ల్లో జెండా భుజాన వేసుకుని ఊరూ వాడా తిరిగిన నేతలే ఇప్పుడు అంబటి వద్దు బాబోయ్ అంటున్నారు.  నానా కష్టాలూ పడి అంబటిని గెలిపిస్తే ఆయన తిరిగి మాపై కేసులు పెట్టి వేధించారని స్థానిక నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. ఆయన ఓటమికి పని చేస్తాం తప్ప విజయానికి కాదని   అల్టిమేటం జారీ చేస్తున్నారు. అంబటి స్థానంలో ఎవ‌రిని నిల‌బెట్టినా పనిచేస్తాం కానీ.. అంబ‌టి మాత్రం వ‌ద్దు అని ముఖమాటం లేకుండా అధిష్థానానికి చెప్పేస్తున్నారు. అలాగే ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త ఇంచార్జ్ కిర‌ణ్‌కుమార్‌కూ అసమ్మతి సెగ దడపుట్టిస్తోంది. ఆయనకు కూడా సొంత పార్టీ నుండే  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని ఎస్సీ వ‌ర్గం కిరణ్ కుమార్   వ‌ద్ద‌ని గంటా బజాయించి మరీ చెబుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని శపథం చేసి మరీ పార్టీ పెద్దలకు హెచ్చరికలు చేసింది.   ఇక ఉమ్మడి జిల్లాలోనే అత్యంత కీల‌క‌మైన నియోజకవర్గం గుంటూరు తూర్పు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వైసీపీకి  సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తాఫా ఈసారి త‌న కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ దక్కేలా చేసుకున్నారు. ఇప్పటికే ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించగా ఆమె కూడా ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడుగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అధిష్టానం ఒకటి తలిస్తే ఇక్కడ వైసీపీ క్యాడర్ మరొకటి తలిచింది. ముస్తఫాపై అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులు కూడా నమోదలైన నేపథ్యంలో ఆయనను తప్పించి ఆయన స్థానంలో కుమార్తె ఫాతిమాని దింపారు. కానీ ఇక్కడ క్యాడర్ మాత్రం అసలు ఈ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఓడించి తీరుతామని  తెగేసి చెప్తున్నారు. అసలు ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వ‌డానికి వీల్లేద‌ని సొంత పార్టీలో ని ముస్లిం మైనారిటీ నాయ‌కులే గట్టిగా  ప‌ట్టుబడుతున్నారు. ఈ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓటేసేది లేదని.. అభ్యర్థిని మార్చకపోతే తామే పార్టీ మారిపోతామని తెగేసి చెబుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం తాడికొండలో కూడా వైసీపీలో అసంతృప్తి జ్వాల ఎగసి పడుతోంది. ఇక్కడ దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానకరంగా పార్టీ నుండి పంపించేశాక..   నియోజకవర్గ టికెట్‌ను మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్‌ ఆశిస్తున్నారు. కానీ  తాడికొండను మాజీ హోంమంత్రి సుచరితకు రాసిచ్చేశారు. దీంతో డొక్కా ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో కూడా జాడ కనిపించడం లేదు. పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వర్గం క్యాడర్ మాత్రం సుచరిత ఓటమికి కంకణం కట్టుకుని మరీ పని చేస్తామని ప్రతిజ్ణ పూనారు. మరోవైపు అసలు సుచరితకు కూడా తాడికొండలో  పోటీ చేయడం ఇష్టం లేదని  సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అన్నిటికంటే మించి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తాడికొండలో తెలుగుదేశం విజయం ఖాయమని బాహాటంగానే చెప్పేస్తోంది. అటువంటి పరిస్థితిలో పని చేయడం ఎదుకని వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు.   ఉమ్మడి గుంటూరు జిల్లాలోని  కీలకమైన స్థానాలలోనే ఈ తరహా ఇబ్బందులతో వైసీపీ తీవ్రంగా సతమతమవుతుంటే.. మిగిలిన నియోజకవర్గాల గురించి ఇక చెప్పుకోవడానికి ఏముంటుంది. మొత్తంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీకి వ్యతిరేక గాలి వీస్తోంది.  అన్నిటికీ మించి రాజధాని విషయంలో జిల్లా ప్రజలలో  వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. వీటన్నిటినీ ఉటంకిస్తూ పరిశీలకులు ఉమ్మడి జిల్లాలో వైసీపీ బోణీ కొట్టడమే కష్టమని విశ్లేషిస్తున్నారు. 

సజ్జల బాధ..ఓదార్పు ఏది?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో పెత్తనం, పెత్తందారి తనం చేసేవారెవరైనా ఉన్నారంటే అది సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే.  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ కీలక నిర్ణయాన్ని ప్రకటించాలన్నీ, ప్రధాన  విధానాలను వివరించాలన్నా, నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ఉంచాలా, మార్చేయాలా? ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నిరాకరించాలి వంటి ప్రతి విషయంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరించేది సజ్జల మాత్రమేనని అందరికీ తెలిసిందే.   అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తనను చాలా చాలా బాధపెట్టాయని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. తననే కాదు.. సాక్షాత్తూ షర్మిల సోదరుడు జగన్ ను, పార్టీ నేతలు, కార్యకర్తలనూ కూడా షర్మిల వ్యాఖ్యలు బాధించాయని ఆయన చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలనూ తూర్పారపట్టడం, జగన్ సర్కార్ తప్పిదాలను సమర్ధించడం తప్ప మరో మాట మాట్లాడని సజ్జల తొలి సారిగా షర్మిల వ్యాఖ్యలు బాధించాయంటూ తెగబాధపడిపోయారు.   ఇంత కాలం వైసీపీ నేతలు వాడిన బాష, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై చేసిన దూష ణలను ఒక్క సారి కూడా మీడియా ముందుకు వచ్చి ఖండిచని సజ్జల..  షర్మిల  వైఎస్ జగన్ సర్కార్ తప్పిదాలను, ఆర్థిక అరాచకత్వాన్ని, జగన్ హయాంలో రాష్ట్రంలో కనిపించని ప్రగతిని, సరిగ్గా పంపిణీ కాని సంక్షేమాన్ని ప్రశ్నించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రషర్మిల వాడిన భాష సరికాదంటూ సూక్తులు చెప్పారు. ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయడంగా అభివర్ణించారు. అసలు ఆమె కాంగ్రెస్ గూటికి చేరడమే తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ   వైఎస్‌ కుటుంబానికి  ఎంతో ద్రోహం చేసిందని చెప్పారు.  అదే సమయంలో వైసీపీ విజయం కోసం, అన్న జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక చెల్లెలుగా షర్మిల పడిన శ్రమ, చేసిన త్యాగం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. తాను ఆ స్థానంలో కూర్చోవడానికి శ్రమపడి, చెమట చిందించి, కాళ్లు అరిగేలా నడిచి, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను రాష్ట్రం నుంచి తరిమేదాకా ఊరుకోని జగన్ ద్రోహం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  అంతెందుకు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆమె రాజకీయాలతో కానీ, ఆమె పార్టీతో కానీ వైసీపీకి కానీ జగన్ కు కానీ ఎటువంటి సంబంధం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ వైఎస్ కుటుంబంలో ఆమె ఏకాకి అని తానే స్వయంగా చాటిన విషయం పాపం సజ్జలకు గుర్తు రాలేదు.   ఇక తెలంగాణలో పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరులు షర్మిలకు అందకుండా చేసిన విషయమూ గుర్తు రాలేదు. ఇప్పడు సొంత చెల్లి తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయం తాను తీసుకుంటే మాత్రం ఎక్కడలేని బాధా సజ్జలలో తన్నుకొచ్చేసోతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత చేసిన తొలి ప్రసంగంలో   జగన్ మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండటాన్నిప్రశ్నిస్తూ, ఆయన క్రైస్తవుడేనా అని ప్రశ్నించడాన్ని జగన్ పార్టీ తట్టుకోలేకపోతోందని అంటున్నారు.   ఇక షర్మిల ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారో లేదో అలా వైసీసీ సోషల్ మీడియా వింగ్ ఆమెను టార్గెట్ చేస్తూ దూషణల పర్వాన్ని ప్రారంభించేసింది. అంత దాకా ఎందుకు ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని, దారి మల్లించి వైసీపీ సర్కార్  నిర్బంధకాండను ప్రారంభించేసింది.   జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా షర్మిల విమర్శలు నేరుగా సూటిగా ఉండటమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వాగ్దానాలను ఎత్తి చూపుతో, వాటిని నెరవేర్చడంలో ఎలా విఫలమయ్యారో పూసగుచ్చినట్లు వివరించడం సహజంగానే సజ్జలను బాధపెట్టింది.  షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలకు పరోక్షంగానైనా ఆహ్వానం పలికారు. ఇది సజ్జలను అమితంగా బాధపెట్టింది. సిట్టింగుల మార్పు పేరున చేస్తున్న ప్రయోగం కారణంగా ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకా మరింత మంది తమ దారి తాము చూసుకోవడానికి దిక్కులు వెతుకుతున్నారు. అటువంటి వారందరికీ తన ప్రసంగం ద్వారా షర్మిల కాంగ్రెస్ గేట్లు తెరిచే ఉన్నాయని చాటారు. వారికి మార్గం చూపడానికా అన్నట్లు తాను ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేరగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న కేవీపీ, రఘువీరా వంటి నేతలు షర్మిల పక్కన నిలబడి వైఎస్ రాజకీయ వారసురాలు ఆమె మాత్రమేనని చాటేశారు. దీంతో పార్టీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమన్న భయమే సజ్జలలో బాధకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో వైసీపీ నేతలూ, శ్రేణులే కాదు, అగ్రనాయకత్వం కూడా భయంతో వణికి పోతోందని సజ్జల బాధ లోకానికి చాటింది. 

ఆ సెంటిమెంట్ ప్రకారం జగన్ ఓటమి ఖాయమే!?

తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతున్నప్పటికీ, ఆమె పొలిటికల్ ఎంట్రీ మాత్రం జగనన్న వదిలిన బాణంగానే ఆరంభమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలా జగనన్న వదిలిన బాణం.. చాలా దూరం ప్రయాణించింది. లక్ష్యాలను మార్చుకుంది. ఇప్పుడు ఎవరు వదిలారో వారే టార్గెట్ గా రెట్టించిన స్పీడ్ తో రివర్స్ అయ్యింది, జగనన్న తన చెల్లులు షర్మిల అనే బాణాన్ని  ఏ లక్ష్యంతో వదిలారో.. ఆ లక్ష్యం చేరుకుందో లేదో తెలియదు కానీ ఇప్పడు మాత్రం రివర్స్ అయ్యింది. నేరుగా జగనన్న అధికారాన్నే గురిపెట్టింది. ఔను షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఆమె తన టార్గెట్ ఏమిటి? ఎవరి ఆశయాన్ని సాకారం చేయడం కోసం తాను ఏపీలో ఎంట్రీ ఇచ్చారు? అన్నది విస్పష్టంగా చెప్పేశారు.  రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని సాధించేం దుకు ఏపీలో అధికారాన్ని కాంగ్రెస్ కు అందించేందుకు తాను రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టానని షర్మిల సందేహాలకు అతీతంగా.. నేరుగా జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యమని కుండబద్దలు కొట్టేశారు. అంటే  జగనన్న వదిలిన బాణంగా తన ప్రయాణాన్ని ముగించి.. ఇప్పుడు తనను సంధించిన వారిపైకే రివర్స్ అయ్యిందని తేటతెల్లమైపోయింది.  సినిమా రంగం తరువాత సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయ్యే రంగమేదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగం కంటే రాజకీయ రంగంలోనే సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఔను సినిమాలలో సక్సెస్ కాంబినేషన్ నే దర్శకులు, నిర్మాతలూ రిపీట్ చేస్తుంటారు. తమ సినిమా కథాబలం మీద ఎంత నమ్మకం ఉంచుతారో సక్సెస్ కాంబినేషన్ అన్న సెంటిమెంటును అంత కంటే ఎక్కువగా నమ్ముతారు. అదే విధంగా రాజకీయాలలో కూడా సెంటిమెంట్ కు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఇప్పుడు అదే సెంటిమెంట్ కారణంగా షర్మిల ఏపీ పాలిటిక్స్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.  ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే షర్మిల ఎంట్రీ తో జగన్ ఎగ్జిట్  ఖాయమైపోయిందనే భావన పోలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతోంది. ఆమె తొలి సారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో  అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.  షర్మిల తన అన్న జగన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు.  2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలలో షర్మిల అధికార తెలుగుదేశం పార్టీ పరాజయం కోసం అన్న జగన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది.  ఆ తరువాత షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. నేరుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ పోటీలో లేదు. కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి వైదొలగింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది.ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  అంటే 2019 ఎన్నికలలో  ఏపీలో ఆమె ప్రచారం అధికార పక్షాన్ని గద్దె దించి ప్రతిపక్షాన్ని అధికారంలోకి తీసుకువచ్చింది. 2023 ఎన్నికలలో తెలంగాణలోనూ అదే రిపీట్ అయ్యింది. దీంతో షర్మిల అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేస్తే అధికార పార్టీకి ఓటమి తప్పదన్న ఒక సెంటిమెంట్ బలంగా రాజకీయ వర్గాలలో ఏర్పడింది. ఆమె ఏ పార్టీ తరఫున నిలబడ్డారో ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉంటే అధికారం చేజిక్కించుకుంటుంది.   అంటే షర్మిల ప్రచారం అధికార పార్టీని గద్దె దించి ప్రతిపక్షాన్ని అధికార పీఠం ఎక్కిస్తుందన్న సెంటిమెంట్ రాజకీయపార్టీలలోనే కాదు, ప్రజలలో కూడా కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే ఏపీ ఎన్నికలలో షర్మిల కాంగ్రెస్ తరఫున నిలబడి ప్రచారం చేస్తుండటం అధికారంలో ఉన్న జగన్ పార్టీకి ఓటమిని ఖరారు చేయడమేనన్ననమ్మకం వైసీపీలో రోజు రోజుకూ బలపడుతోంది. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం, నమ్మకం ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.    ఇక 2019  ఎన్నికలలో జగన్   ముఖ్యమంత్రి కావడానికి తన శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు అదే జగన్ ను గద్దె దించడానికి అంత కంటే ఎక్కువగా కష్టపడేందుకు రెడీ అయిపోయారు.  సెంటిమెంటూ ఆమెకు అనుకూలంగానే ఉంది. సో వచ్చే ఎన్నికలలో జగన్ గద్దె దిగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే సెంటిమెంటు ప్రకారం తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమనీ అంటున్నారు. 

సందేహం లేదు.. షర్మిల టార్గెట్ జగనే!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  అయిన తన సోదరుడు వైఎస్‌ జగన్‌ పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల  వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న నిన్న మొన్నటి దాకా అందరిలోనూ మెదులుతూ ఉన్న ప్రశ్న. అయితే ఇలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారో లేదో అలా అటువంటి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేశారు షర్మిల. ఇక ఆమె వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నే తలెత్తని విధంగా అన్నపై డైరెక్ట్ అటాకేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా తన తొలి ప్రసంగంతోనే తేల్చి చెప్పాశారు.  ఆదివారం (జనవరి 21)న ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన షర్మిల  జగన్‌ పై డైరెక్ట్ అటాక్ కు సిద్ధ పడ్డారని, అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి శంఖారావం పూరించారని ఆమె తొలి ప్రసంగంతోనే చాటారు. తనంటే భయపడేవారే ఎక్కువగా తనపై విమర్శలు చేస్తారనీ, తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పడం ద్వారా షర్మిల జగన్ సర్కార్ తన ఎంట్రీతో భయపడుతోందని స్పష్టం చేశారు.   వైసిపి  హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని విమర్శించారు.  జగన్‌ రెడ్డి ఈ ఐదేళ్లలో  మూడు మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని, జనం మీద మోయలేనంతగా పన్నుల భారం మోపారని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదన్నారు.   రాష్ట్రానికి   పరిశ్రమలు   రాలేదు, పోలవరం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. దళితులపై దాడులు పెచ్చరిల్లాయి.  ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియాల దోపిడీ స్వైరవిహారం చేస్తోంది. ఇక ప్రశ్నించే వారిపై వేధింపులు, గొంతెత్తితే కేసులు అంటూ షర్మిల వైసీపీ సర్కార్, ఏపీ సీఎం జగన్ పై సూటిగా విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేసిన జగన్  ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఆ విషయం ఎత్తలేదని గుర్తు చేశారు.  స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, మూడు రాజధానులన్న జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.  .జగన్‌ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్‌ హింసాకాండ మీద మాట్లాడలేదని విమర్శించారు. 

జగన్ కు షర్మిల వార్నింగ్.. ఓటమికి రెడీ అయిపోవాలని పరోక్ష హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌ పిసీసీ  అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ కు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.   తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ఓటమిని ప్రస్తావిస్తూ,  తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించానని చెప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి   బిడ్డ తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దింపిందని షర్మిల చెప్పడాన్ని బట్టి ఏపిలో కూడా వైఎస్‌ జగన్‌ను అధికారం నుంచి దింపుతానని, తన అజెండా అదేనని ఆమె పరోక్షంగా హెచ్చరించారు.   తెలంగాణ తన మెట్టినిల్లనీ, ఏపీ తన పుట్టిల్లనీ చెబుతూ తన లక్ష్యం, తన ధ్యేయం తెలుగు ప్రజలు బాగుండాలన్నదేనని చాటారు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరినట్లు క్లియర్ గా చెప్పడం ద్వారా  ఏపీలో జగన్ హయాంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చాటారు. ఆ పరిస్థితిని చక్కదిద్ది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే తాను కాంగ్రెస్ లో చేరి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినట్లు షర్మిల చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనకు ముఖ్యమని చెప్పడం ద్వారా సోదరుడు అన్న ఓటమే లక్ష్యమని చాటారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు, తాను ఈ నెల 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు జిల్లాల్లో చేరికలు ఉంటాయని చెప్పారు. 24 నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.  బిజెపిపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ సంఘటలను ప్రస్తావిస్తూ అటువంటి బిజెపి దేశానికి అవసరం లేదని చెప్పారు. పోలవరం, అమరావతి రాజధాని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఇలా అన్ని విషయాల్లో బిజెపి ఏపీకి అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. వైసిపి, టిడిపి రెండు కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీలు కూడా బిజేపి వాళ్లేనని ఆమె వ్యాఖ్యానించారు.  తాను ఎవరూ వదిలిన బాణం కాదని, మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని షర్మిల అన్నారు.తన వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని ఆమె అన్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని వైఎస్‌ షర్మిల అన్నారు.

రేవంత్ మద్దతు దారులకు కీలక పోస్టింగులు

పాలనలో చంద్రబాబును, నమ్మకున్న వారికి న్యాయం చేయడంలో వైఎస్ ను తలపిస్తూ రేవంత్ ముఖ్యమంత్రిగా సత్తా చాటుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల నియామకంలో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ముగ్గురు సలహాదారులను నియమించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో క్రియాశీలంగా వ్యవహరించి పార్టీ విజయానికి తమ వంతు దోహదం చేసిన కీలక నేతలకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవులలో నియమించింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన నియామకాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు అయ్యింది. మాట ఇస్తు తప్పనన్న నమ్మకాన్ని రేవంత్ పార్టీలో కలిగించగలిగారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ నేత వేణుగోపాల్ ను నియమించింది. మొత్తం ఈ నాలుగు నియామకాలతో కాంగ్రెస్ సర్కార్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టింది. షబ్బీర్ అలీ ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా,  ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఇదే జోరులో రానున్న రోజులలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోంది.   ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు పోస్టింగులు ఇచ్చిన నలుగురూ కూడా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుల కావడం ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.  వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే సన్నిహితుడు.  ఓటుకు నోటు కేసులో  వేం నరేందర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లిన సంగతి విదితమే.  కాంగ్రెస్ లో చేరిన తరువాత కూడా వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కోసం టిక్కెట్ అంటూ ఒత్తిడి చేయలేదు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో కూడా వే నరేందర్ రెడ్డి రేవంత్ కు గట్టి మద్దతుదారుగా నిలబడ్డారు.  ఇప్పుడు రేవంత్ ఆయనకు   కేబినెట్ హోదా ఇచ్చారు. ఇక  మల్లు రవి కూడా రేవంత్ కు నమ్మకమైన నేతగా, సన్నిహితుడిగా ఉన్నారు.   షబ్బీర్ అలీ కూడా రేవంత్ నే సమర్థిస్తున్నారు. అలా తనకు కష్టకాలంలో మద్దతుగా నిలిచిన వారందరికీ రేవంత్ పదవులు కట్టబెట్టారని చెప్పారు. ఇక త్వరలో ఆర్టీసీ ఛైర్మన్‌ సహా మరికొన్ని కీలక పదవుల నియామకానికి కూడా రేవంత్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పార్టీలో తనకు గట్టి మద్దతు ఇచ్చిన అద్దంకి దయాకర్ కు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చే దిశగా రేవంత్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.