వైసీపీకి నా రక్తం ధారపోశా: షర్మిల
posted on Jan 27, 2024 @ 1:53PM
ఇచ్చాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న , ఎపి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. జగన్ వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల ముందు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన షర్మిల నేడు ఆమె జగన్ పైనే బాణాలు వేసారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నేను యుద్ధానికి రెడీ... మీరు రెఢీనా..? వైఎస్ఆర్ పార్టీలో.. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ పాలనకి.. జగన్ పాలనకీ.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా..? ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? 70 వేల విలువైన గంగవరం పోర్టు 600 కోట్లకి అమ్మేశాడు. మళ్ళీ ప్రభుత్వం చేతికి గంగవరం పోర్టు రాదు. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త... ఒక్కొక్క సైన్యంగా మారాలి. ఒక ఎంపీ.. ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఏపీ బీజేపీ వశం అయిపోయింది. జగనన్న బీజేపీ కి బానిసగా మారాడు. ఏపీని కూడా బీజేపీకి బానిసగా మారుస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనే అని షర్మిల పేర్కొన్నారు.యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు అయితే... తెలంగాణ మెట్టినిల్లు అని పేర్కొన్నారు. ప్రజలకి న్యాయం జరగాలనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైసీపీకి తన రక్తం ధారపోశానని షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తోందన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. వైసీపీని తన భుజస్కంధాలపై మోశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదన్నారు.