రూ.547 కోట్ల సైబర్ మోసాలు... చేధించిన ఖమ్మం పోలీసులు

  ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల మాయలో పడి రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతేడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.372 కోట్లు కాజేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. అయినా కూడా కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు.  ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేయగా కేవలం ఆరుగురి ఖాతాల్లోనే రూ.547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.   సైబర్ క్రైమ్ ద్వారా వీళ్లంతా రూ. 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు తేల్చారు. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌కళ్యాణ్, ఉడతనేని వికాస్ ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడిచిందని గుర్తించారు.కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అలాగే.. మాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్.. ఇలా పలు రకాలుగా బాధితుల నుంచి ఈ డబ్బును కొల్లగొట్టినట్టు స్పష్టం అవుతోంది.  గతేడాది డిసెంబర్ లో విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి .. తాను సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. దాంతో వీరి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అలాగే నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీళ్లంతా అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇక ఇటీవల హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్‌ భార్యకు సైబర్‌ నేరగాళ్ల టోకరా వేసిన సంగతి తెలిసిందే. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పేరుతో కేవలం పది రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కొట్టేశారు సైబర్‌ కేటుగాళ్లు. 

జిల్లాల పునర్విభజనపై కమిటీ : సీఎం రేవంత్‌రెడ్డి

  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని...6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు. గతంలో నాయకులు నచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.  మండలాలు, రెవెన్యూ డివిజన్లనూ పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం తెలిపారు. మల్కాజ్‌గిరి మేం పెట్టలేదు. తీయలేదు. రాచకొండ ఒక్కటే రాజులను తలపించేలా ఉందన్నారు. సికింద్రాబాద్ పేరు ఎక్కడ ఉంది? తీసేసింది ఎక్కడ? జీహెచ్‌ఎంసీలో భాగంగా సికింద్రాబాద్ ఉంది అని రేవంత్‌రెడ్డి అన్నారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారు. మనమంతా ఒకే కుటుంబం… కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయిని సీఎం స్పష్టం చేశారు.  ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేని తెలిపారు.  మీరే మా సారధులు, మా వారధులు.. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండని ఉద్యోగులను ప్రశ్నించారు.  సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా.. మీ ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్  సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం..ఇదొక బాధ్యత.. అందరం కలిసికట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపాలన పరుగులు పెడుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు.  

చిరంజీవి వరప్రసాద్ సినిమా చూస్తూ రిటైర్డ్ ఏఎస్ఐ మృతి

  హైదరాబాద్ నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ థియేటర్ లో సినిమా చూస్తూ ఓ వ్యక్తి  మృత్యు వాత పడడంతో ఆ థియేటర్లో విషాదఛాయలు అలుము కున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా హైదరాబాదు నగరంలో ఉన్న పలు సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన అభిమాన హిరో చిరంజీవి నటించిన సినిమా చూడడానికి వచ్చి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌లో  చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.  లింగంపల్లికి చెందిన ఆనంద్ కుమార్  (63) ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి 12వ బెటాలియన్ నుంచి రిటైర్ అయ్యారు. చిరంజీవి అభిమానిగా ఉన్న ఆయన ఈరోజు సోమవారం ఉదయం 11:30 గంటల షోకు కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌కు వచ్చారు. సినిమా ఆసక్తిగా వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. క్షణాల్లోనే థియేటర్‌లో కుప్పకూలి కింద పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.  ప్రాథమికంగా హార్ట్‌స్ట్రోక్‌ కారణంగానే ఆనంద్ కుమార్ మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగి స్తున్నారు. సినిమా థియేటర్‌ లోనే ఈ విధమైన విషాద ఘటన జరగడం పట్ల ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమా ఆనందంగా చూడటానికి వచ్చిన ఓ అభిమాని ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటన  నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వెంకన్నదేవుడిని నెత్తిన పెట్టుకున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సనాతన ధర్మం విషయంలో పట్టుదలగా ఉంటున్న సంగతి తెలిసిందే. తనను తాను సనాతన ధర్మం ఆచరించే వ్యక్తిగా చెప్పుకోవడమే కాకుండా, వాటి విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా తాను సనాతన ధర్మం పట్ల మెగ్గు చూపుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని దేవదేవుని పట్ల తనకున్న భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాలను తన సొంత నియోజకవర్గం పిఠాపురం జరుపుకుంటున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం వచ్చిన సందర్భంగా తనకు   బహుమతిగా ఇచ్చిన కలియుగ దైవం వేంకటేశ్వరుడి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించి, ఆ విగ్రహాన్ని భక్తి పారవశ్యంతో తన నెత్తిన, భుజాన మోశారు. తద్వారా  తిరుమల వెంకన్నదేవుడిపై తనకున్న అపారమైన భక్తి భావాన్ని గర్వంగా ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ నిజమైన భక్తుడు అంటూ నెటిజనులు పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.  

దివ్యాంగులకు జైపాల్‌రెడ్డి స్పూర్తి : సీఎం రేవంత్

  దివ్యాంగులకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైకల్యం ఉందని ఆయన మనసులో కూడా రాలేదని తెలిపారు. ప్రజా భవన్ లో 'బాల భరోసా' పథకం, “ప్రణామ్” డే కేర్ సెంటర్ల ప్రారంభించి..దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని  ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు.  విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి ప్రత్యేక కోటా కేటాయిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని సీఎం ఆంక్షించారు.  రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని చేస్తామని సీఎం వెల్లడించారు. తెలంగాణ కులగణన మోడల్‌ను  దేశం అనుసరిస్తోందని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్ లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంద... తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  

పోలవరం, నల్లమల సాగర్ పై పిటిషన్.. తెలంగాణకు సుప్రీం షాక్

తెలంగాణ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణార్హత లేదని విస్పష్టంగా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు.   పోలవరం ప్రాజెక్టును నల్లమల్ల సాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని ఆయన వాదించారు. అయితే సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ, పోలవరం, నల్లమల ప్రాజెక్టు విషయంలో కర్నాటక, మహారాష్ట్రలు కూడా ముడిపడి ఉన్నాయనీ, అందుకే ఈ వ్యవహారాన్ని మీడియేషన్ లేదా సివిల్ సూట్ ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. పిటిషన్ డిస్మిస్ చేయాలా? ఉపసంహరించుకుంటారా అని సుప్రీం కోర్టు పేర్కొనడంతో  తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ ను ఉపసంహరించుకుంది.  , దీనిపై సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలపింది.  

ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

  ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్‌ అశోక్‌, చిత్తూరు జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.ఎస్‌.శోబిక, కడప జేసీగా నిధి మీనా, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివ్‌ నారాయణ్‌ శర్మ, పల్నాడు జేసీగా వి.సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా నియమితులైన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మార్కాపురం జాయింట్‌ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు పోస్ట్‌లు ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.

పతంగుల పండుగ.. మాంజా వినియోగించినా, విక్రయించినా జైలే.. సజ్జనార్

పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకూ ముప్పుగా పరిణమించిన చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సంక్రాంతి సంక్రాంతి పండుగను పతంగుల పండుగా కూడా జరుపుకుంటారు. ఈ పతంగులు ఎగురవేసే విషయంలో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే పతంగులను ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనా మాంజాపై నిషేధం ఉన్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పతంగులు ఎగురవేయడానికి దారం బదులుగా ఉపయోగించే చైనా మాంజా వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలకే కాకుండా పక్షులకూ ఇది పెనుముప్పుగా పరిణమిస్తున్నది. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ పోలీసులు చైనా మాంజా వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టులో  పతంగులు ఎగరేయడానికి ఎవరైనా చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.   అలాగే చైనా మాంజా విక్రయించేవారిపైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  చైనా మాంజా వినియోగం, విక్రయాలను సమూలంగా నిలిపివేయాలన్న లక్ష్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగిన దాడులలో దాదాపు 43 లక్షల రూపాయల విలువైన   2,150 మాంజా బాబిన్లను సీజ్​ చేసినట్లు తెలిపారు.   నిషేధిత మాంజాను విక్రయాలకు సంబంధించి 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గత నెల రోజులలో మాంజా విక్రయం, వినియోగం కు సంబంధించి   132 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన సజ్జనార్.. ఇందుకు సంబంధించి  .68 కోట్ల విలువైన 8,376 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకొన్నామనీ, మొత్తం  200 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.   

అల్ ఫలాహ్ వర్సిటీ ఆస్తుల జప్తునకు ఈడీ రెడీ!

హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆస్తుల జప్తు దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అడుగులు వేస్తున్నది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు పేలుడు కేసులో  ఈ వర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధికీకి సంబంధాలున్నాయన్న అనుమానంతో ఆయనను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హర్యానా  ఫరీదాబాద్‌లోని  ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ నిధులు మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చినవని ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. దీంతో ఈ వర్సిటీపై చర్యలకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే అల్ ఫలాహ్ ట్రస్టుకు  అస్తుల మదింపులో ఈడీ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ మదింపు పూర్తయిన వెంటనే యూనివర్సిటీ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

షిరిడీ సాయి సేవలో మంత్రి నారా లోకేశ్ దంపతులు

ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా సోమవారం (జనవరి 12) ఉదయం  ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. సూర్యోదయానికి  ముందు సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే  విశిష్ట కాకడ హారతి  కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. దర్శనం అనంతరం లోకేశ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి   తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటూ మంత్రి ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.

భారత్ పై ఆత్మాహుతి దాడులు.. కలకలం రేపుతున్న మసూద్ అజహర్ ఆడియో

 గణతంత్ర దినోత్సవ వేడుకల తరుణంలో భారత్ పై భారీ ఎత్తున దాడులకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థ జైషే హమ్మద్ కుట్ర పన్నుతోంది. భారత్ పై దాడులకు వేల మంది బాంబర్లు అంటే ఆత్మాహుతి దళ సభ్యులు రెడీగా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్  ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. మసూద్ అజహర్ గొంతుకగా చెబుతున్న ఈ  ఆడియో క్లిప్పింగ్ లో భారత్‌పై దాడులకు వేలమంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నాన్న హెచ్చరికలు కలకలం రేపాయి.  ఈ ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ఆడియో మేరకు  వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి సభ్యులు భారత్ పై ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉంది.  తమ యోధులు ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా  షహాదత్  అంటే అమరత్వం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ ఆడియో పేర్కొంది. ఇలా అమరత్వం కోసం భారత్ పై ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్న వారి సంఖ్య పదులు, వందలు, వేలూ కాదనీ, అంతకు మించి అని ఆ ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ ఆడియో  ప్రామాణికతపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.   అంతర్జాతీయ ఉగ్రవాదిగా  ఐక్యరాజ్య సమితి మసూద్ అజహర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ లో ఆ నిషేధిత ఉగ్ర సంస్థ అధినేతకు రాచమర్యాదలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.   పాకిస్థాన్ లో రాజభోగాలు అనుభవిస్తూ.. అక్కడ నుంచి  భారత్‌పై విషం చిమ్ముతూ మసూద్ అజహర్ పలు ఉగ్రదాడులకు కుట్రపన్నిన సంగతి తెలిసిందే.   2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా పలు భారీ ఉగ్రవాద ఘటనలకు మసూద్ అజహరే సూత్రధారి అన్న సంగతి విదితమే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ భారీగా నష్టపోయింది. ఆ సంస్థకు చెందిన అనేక మందిని భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిపిన దాడులలో హతం చేసింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా మసూద్ అజహర్ విడుదల చేసినట్లుగా చెబుతున్న ఆడియో హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల వెంబడి గస్తీని కట్టుదిట్టం చేశాయి. 

భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్  జిల్లాల్లో ఆదివారం (జనవరి 11) పాక్ డ్రోన్ల కదలికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.  వెంటనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించి కొద్ది సేపు తరువాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.   తొలుత రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని గనియా-కల్సియన్ గ్రామం వద్ద పాకిస్థాన్ డ్రోన్లు నింగిలో చక్కర్లు కొట్టడం గమనించినన భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి.  కాగా దాదాపు అదే సమ యంలో   ఖబ్బర్ గ్రామం వద్ద కూడా డ్రోన్ కదలికలను గుర్తించారు.  అలాగే సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్‌లలో కూడా పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయి.  ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను ఈ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి జారవిడిచారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆర్మీ, పోలీసులు ఆయా ప్రాంతాలలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.  ఇటీవలే సాంబా జిల్లా పాలూరా గ్రామం వద్ద డ్రోన్ ద్వారా పంపిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల తాజా  కదలికలను సీరియస్ గా తీసుకున్న భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం సమీపిత్తున్న ఈ సమయంలో  భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల సంచారం కలవరం రేపుతోంది. భద్రతా దళాలు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.  

యువతి దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో  ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన బోరబండ ప్రాంతంలో   కలకలం రేపింది. తనతో  మాట్లాడటం లేదన్న కోపంతోనే ఆ యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలు  గతంలో  బంజారా హిల్స్‌లోని ఓ పబ్‌లో పనిచేస్తున్న సమయంలో నిందితుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది.  ఇటీవల ఆమె అక్కడి ఉద్యోగాన్ని వదిలి ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి యువతి తనతో సరిగా మాట్లాడటం లేదనీ, తనను అవాయిడ్ చేస్తోందనీ అనుమానం పెంచుకున్న యువకుడు ఆమెను మాట్లాడుకుందాం రమ్మని  బోరబండ ప్రాంతానికి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉన్మాదంగా మారిన నిందితుడు ఒక్కసారిగా యువతి పై దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సోమనాథ్ ఆలయంలో డ్రమ్ములు వాయించిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా   ఆదివారం (జనవరి 11)  గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు సోమనాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరిస్తూ ఏర్పాటు చేసిన శౌర్య యాత్ర ఉత్సవ ఊరేగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 గుర్రాలతో  ఊరేగింపు జరిగింది. శౌర్య యాత్రలో భాగంగా ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని ప్రధాని మోదీ దారికి ఇరువైపులా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.  అంతే కాకుండా ఊరేగింపు సమయంలో ప్రధాని మోదీ  డమరుకం  వాయించారు.  గుజరాత్ ముఖ్య మంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ప్రధాని మోదీ, ఒక కిలోమీటరు పొడవునా సాగిన యాత్రలో పాల్గొన్నారు. సోమనాథ్ శౌర్యయాత్రలో భాగంగా మోదీ అక్కడి భక్తులతో కలిసి సాంప్రదాయ డ్రమ్ములను వాయించారు.  ఆ తర్వాత ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 'బాల గురువులు' పఠించే మంత్రాలను విన్నారు. అనంతరం  ఋషులకు, సాధువులకు, భక్తులకు అభివాదం చేశారు. 

కివీస్ పై టీమ్ ఇండియా విజయం.. కోహ్లీ వరల్డ్ రికార్డ్

న్యూజీలాండ్​తో   మూడు వన్డేల సిరీస్​లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఎవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి  300 పరుగులు చేసింది. 301 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన చేపట్టిన టీమ్ ఇండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే   లక్ష్యాన్ని ఛేదించింది.  ఛేదనలో తనకు ఎదురే లేదని కింగ్ విరాట్ కోహ్లీ మరో సారి నిరూపించుకున్నాడు. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగులు చేసి జట్టు స్కోరు   39 వద్ద ఉండగా ఔటయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, స్కిప్పర్ శుభమన్ గిల్ తో కలిసి రెండో వికెట్​కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో   గిల్​ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. కోహ్లీ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 93 పరుగులు చేసి ఔటయ్యాడు.   కోహ్లీ తృటిలో సెంచరీ మిస్సయినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అత్యంత వేగంగా 28వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి బ్యాటర్​గా రికార్డులకెక్కాడు.  అంతేకాకుండా మొత్తంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో మాస్టర్​ సచిన్​ టెండుల్కర్​ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.  

పురుషుల పొంగళ్ వేడుక.. ఎక్కడంటే?

ఆలయాల్లో జాతర్లు, తిరునాళ్లు జరిగితే,  మహిళలు పొంగళ్ళు పెట్టడం సాంప్రదాయం. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి కడప జిల్లాలోని ఒక ఆలయంలో వింత ఆచారం అమలులో ఉంది. ఆ ఆలయంలో పురుషులు పొంగళ్లు పెడతారు.   ఔను ఇక్కడి ఆచారం ప్రకారం ప్రతి ఏటా   సంక్రాంతికి ముందు సంజీవరాయ స్వామికి మగవాళ్ళు పొంగళ్ళు పెట్టి మొక్కలు తీర్చుకుంటారు. మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు. ఆలయంలో పెట్టిన నైవేద్యం కూడా మహిళలు ముట్టుకోరు. మగవాళ్ళేతింటారు.  ఉమ్మడి కడప జిల్లా  పుల్లంపేట మండలం తిప్పారు పల్లెలో ఈ  ఆచారం ఉంది.  ప్రస్తుతం ఈ పుల్లంపేట తిప్పారుపల్లె గ్రామం తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ మగవారి పొంగళ్ల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఆచారం ప్రకారం శ్రీ సంజీవరాయ స్వామికి మగవారే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొంగళ్ళు పెట్టారు. ఈ  పురుషుల  పొంగళ్ల వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం   సంజీవరాయునికి పొంగళ్లు పండుగను   సంక్రాంతి కంటే  ఘనంగా జరుపుకొంటారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. 

కన్నుల పండువగా గండికోట శోభాయాత్ర

గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం (జనవరి 11) శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.   గండికోట చారిత్రక, సాంస్కృతిక,  కళా వైభభం ఉట్టిపడేలా   అత్యంత వైభంగా ఉత్సవ వాతావరణంలో సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులు పాల్గొన్నారు. గ్రాండ్ కేన్వాస్ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన గండి కోట ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్  వచ్చే రెండు సంవత్సరాలలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతామన్నారు.  గండికోట మరింత అభివృద్ధి చెందడానికీ,  యునెస్కో ద్వారా గుర్తింపు రావడానికి స్థానికుల సహకారం అవసరమన్నారు.   ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌.సవితఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్‌పి నచికేతన్‌ విశ్వనాథ్‌, ప్రముఖ రచయితలు తవ్వా ఓబుల్‌రెడ్డి,   సుధారాణి తదితరులు పాల్గొన్ని ప్రసంగించారు. విశిష్ఠ అతిథిగా పాల్గొన్న గేయ రచయత    జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గండికోట గేయాలాపన చేశారు. 

షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్  ఐటీ, విద్యాశాఖ  మంత్రి నారా లోకేశ్ సతీ సమేతంగా  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీ చేరుకున్నారు.ఆయన సోమవారం (జనవరి 12) ఉదయం షిరిడీ సాయినాథుని దర్శించుకోనున్నారు. కాగా ఆదివారం (జనవరి 11) షిరిడీ చేరుకున్న  లోకేశ్ దంపతులకు   విమానాశ్రయంలో  కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. సోమవారం (జనవరి 12) ఉదయం జరిగే కాకడ హారతి సేవలో లోకేశ్, బ్రహ్మణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.  

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పవన్‌కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకకూ ఎవరూ అందుకోనటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐదవ డాన్‌ను ప్రదానం చేసింది. అంతే కాకుండా ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ.. పవన్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు .. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు.. ఎలా ఎదిగారు లాంటివన్నీ ఆ వీడియోలో పొందుపరిచారు.  డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించారు. మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యకు తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా గత ఏడాది డిసెంబర్ 30న ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు  అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న మొట్ట మొదటి భారతీయుడు పవన్ కళ్యాణ్.  . సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా ఐదవ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు.  ఈ వార్త తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.