కన్నుల పండువగా గండికోట శోభాయాత్ర

గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం (జనవరి 11) శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.   గండికోట చారిత్రక, సాంస్కృతిక,  కళా వైభభం ఉట్టిపడేలా   అత్యంత వైభంగా ఉత్సవ వాతావరణంలో సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులు పాల్గొన్నారు.

గ్రాండ్ కేన్వాస్ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన గండి కోట ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్  వచ్చే రెండు సంవత్సరాలలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతామన్నారు.  గండికోట మరింత అభివృద్ధి చెందడానికీ,  యునెస్కో ద్వారా గుర్తింపు రావడానికి స్థానికుల సహకారం అవసరమన్నారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌.సవితఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్‌పి నచికేతన్‌ విశ్వనాథ్‌, ప్రముఖ రచయితలు తవ్వా ఓబుల్‌రెడ్డి,   సుధారాణి తదితరులు పాల్గొన్ని ప్రసంగించారు. విశిష్ఠ అతిథిగా పాల్గొన్న గేయ రచయత    జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గండికోట గేయాలాపన చేశారు. 

ఎక్స్ సేవలకు అంతరాయం

 ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ఎక్స్ మరోసారి  మొరాయించింది. శుక్రవారం (జనవరి 16) సాయంత్రం  ఎక్స్ సేవలు నిలిచిపోవడంతో  ప్ర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్  సేవలు కొద్ది సేపు నిలిచిపోయాయి. కంటెంట్ డెలివరీ, భద్రతా సేవలు అందించే క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ అంతరాయానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే, ఈ అంతరాయంపై ఎక్స్ యాజమాన్యం గానీ, ఎలాన్ మస్క్ గానీ  అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా ఉండగా వారం వ్యవధిలో ఎక్స్ సేవలకు అంతరాయం కలగడం ఇది రెండో సారి.   

గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 17)  కాకినాడలో  పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారు  రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా చెబుతున్న ప్రతిష్ఠాత్మక  గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ  13 వేల కోట్ల రూపాయల వ్యయంతో  ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఏడాదికి  మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను, భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా  ప్రత్యక్షంగా, పరోక్షంగా పాతిక  వందల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రద్దీ ఏర్పడింది. ఏపీ నుంచి    పండగ పూర్తి చేసుకొని   హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. శని, ఆది (జనవరి 17, 18) వారాలలో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుందన్న అంచనాలు ఓ పక్క,  జాతీయ రహదారిపై  పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు మరో పక్క ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  నల్గొండ జిల్లా పోలీసు శాఖ ట్రాఫిక్ మళ్లింపు చేపట్టింది. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ ట్రాఫిక్ మళ్లింపు వివరాలను ప్రకటించారు.  గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను  మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు  మాచర్ల , నాగార్జునసాగర్ , పెద్దవూర , కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా ట్రాఫిక్ ను మళ్లిస్తారు.  అదే విధంగా నల్లగొండ నుంచి  హైదరాబాద్   వెళ్లే వాహనాలను నల్లగొండ , మార్రిగూడ బై పాస్ , మునుగోడు, నారా యణపూర్, చౌటుప్పల్  మీదుగా హైదరాబాద్ కు చేరుకోవలసి ఉంటుంది.  ఇక విజయవాడ నుంచివి  హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తారు.  

చదువు ఒక్కటే పేదిరికాన్ని పోగొడుతుంది : సీఎం రేవంత్‌

  మాదాపూర్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తాము రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.  గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మితే వారికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేదని తెలిపారు. టీజీపీఎస్సీ ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం....యూపీఎస్సీ ని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశామని సీఎం స్ఫష్టం చేశారు. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశామన్నారు.  ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షి గా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశామని ఆయన తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది.. పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని.. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని చెప్పారు. 10 ఏళ్ల‌లో రెండు సార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదని విమర్శించారు. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది.. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలని సీఎం రేవంత్ తెలిపారు.

మంగళగిరి ప్రీమియర్ లీగ్‌లో సందడి చేసిన మంత్రి లోకేష్

  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో  నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ పోటీల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ముందుగా బోగి ఎస్టేట్స్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ ఆఖరి మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ టాస్ వేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. వల్లభనేని వెంకట్రావ్ యూత్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ను ఎంచుకుంది. అనంతరం ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ను మంత్రి లోకేష్ వీక్షించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య,  ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.

లక్కుండిలో లంకె బిందెలు...నిధి కోసం ప్రభుత్వ వేట

  కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే. 634 గ్రాముల బరువున్న ఆ తామరపు బిందెలో 466 గ్రామలు బంగారు గాజులు, కడియాలు, గొలుసు, ఉంగరాలు బయటపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో నిధి కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం (16-1-26) నుంచి లక్కుండిలో నిధి కోసం వేట మొదలుపెట్టారు.  అక్కడి కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిధుల కోసం పుర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రాక్కులు, ట్రాక్టర్‌లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్‌మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి.  పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణాలు ముద్రించినట్లు అధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతం 14వ శతాబ్దంలో ప్రధాన నగరంలో ఉండేదని చారిత్రక ఆధారులున్నాయి. భుగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాడి ఉండొచ్చని, వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్కుండిలో లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు.

అంధ రచయిత్రి రాసిన నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

  మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో కుటుంబంతో సహా సాయిజ్యోతి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అంధురాలైన సాయిజ్యోతి మొబైల్ లో వాయిస్ ఇన్ పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రచనలు చేస్తున్నారు.  ‘చైత్రశ్రీ’ కలం పేరుతో కవితాంజలి అనే కవితా సంపుటితో పాటు ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ అనే నవలలు, సామాజిక స్పృహ కలిగించే కథలు రచించారు. నూతక్కి హైస్కూల్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తున్నారు. వైకల్యాన్ని జయించి తన ప్రతిభతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన సాయిజ్యోతిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బీహార్‌లో ట్ర‌క్కు ఢీకొని బాలుడు మృతి…మానవత్వం మరిచిన జనం

  బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతే… మరోవైపు అదే ప్రమాదానికి కారణమైన ట్రక్కు నుంచి కింద పడిన చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని పట్టించుకోకుండా చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజిహాట్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రితేష్ కుమార్ ఉదయం సైకిల్‌పై కోచింగ్ క్లాస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. అందులో ఉన్న చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెలవిసేలా రోదిస్తుంటే… మరోవైపు కొందరు స్థానికులు మాత్రం ఆ దృశ్యాన్ని పట్టించుకోకుండా చేపలను తీసుకెళ్లడంలో మునిగిపోయారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మానవత్వం ఎక్కడ పోయింది?” అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలుడి మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   https://publish.twitter.com/?url=https://twitter.com/SomuAnand_/status/2012079958672458099#