గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సాకారం కానుందా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా వార్తలలో ఉన్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే  దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విజయవాడ కార్పొరేషన్ ను విస్తరించి గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ గా చేయాలన్నదే ఆ ప్రతిపాదన. ఇందుకు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 74 గ్రామాలను   విలీనం చేసి.. గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నదే ఆ ప్రతిపాదన. అమరావతికి ఆనుకుని ఉన్న నగరం విస్తరణ అత్యంత ముఖ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఆ ప్రతిపాదనలో ఒక కదలిక వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం (డిసెంబర్ 25) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వివరించారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి తోడుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరించాలని విజ్ణప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి చాలా కాలంగా  గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉంది. ఆ అంశాన్నే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి సత్వరమే విజయవాడ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తసుకోవాలని కోరారు. తక్షణమే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య   ఆ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు. జీవీఎంసీపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని చిన్ని అన్నారు.

బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్ లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  ఆ దేశంలో దీపూ చంద్ర దాస్ దారుణ హత్య మరవకముందే, రాజ్‌బర్ జిల్లాల్లో మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. బుధవారం (డిసెంబర్ 24 రాత్రి ఈ దారుణం జరిగింది.   రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో   29 ఏళ్ల అమృత్ మొండల్ అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే  అమృత్ మొండల్  ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.  అమృత్ మండల్ సామ్రాట్ బహిన్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఆ సంస్థ పేరిట సొమ్ములు వసూలు చేస్తూ, దౌర్జన్యాలకూ, హింసాకాండకూ పాల్పడుతున్నాడన్న అభియోగాలు ఉన్నాయి. అతడిపై   హత్యా నేరం సహా రెండు కేసులు ఉన్నాయి. అదలా ఉంచితే  గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉన్న అమృత్ మొండల్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగింది.  ఇదలా ఉండగా హిందువులు లక్ష్యంగా బంగ్లాదేశ్ లో దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ లో హిందువులకు కుటుంబాలు లక్ష్యంగా ఏడు దాడులు జరిగాయి. ఏడు గృహాలు దగ్ధమయ్యాయి. 

అమరవతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు తోడు కొత్త నిర్మాణాలకూ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు మంత్రి నారాయణ గురువారం (డిసెంబర్ 25)శంకు స్థాపన చేశారు. ఈ ఐకానిక్ భవన నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన  రెండు బేస్‌మెంట్ అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. 52 కోర్టు హాళ్లు ఉంటాయన్నారు. ఇందు కోసం 45 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు శాశ్వత నిర్మాణ పనుల ప్రారంభాన్ని ఒక చారిత్రక ఘట్టంగా మంత్రి నారాయణ అభివర్ణించారు.  ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ  నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అద్భుతమైన డిజైన్‌తో ఈ హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ హైకోర్టు శాశ్వత భవనానికి రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే.. భవనం మొత్తం బరువును నేల అంతటా సమానంగా పంపిణీ చేయడానికి ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనినే  రాఫ్ట్   ఫౌండేషన్ అంటారు. నేల స్వభావం మెత్తగా ఉన్నప్పుడు లేదా భవనం బరువు భారీగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది భవనానికి  పటుత్వాన్ని ఇస్తుంది.   

భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదలీ వేటు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదలీ వేటు పడింది. ఆయన స్థానంలో   రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. బదలీ వేటు పడిన జయసూర్యకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలనిఆదేశాలు జారీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.  జయసూర్య  పనితీరుపై పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన తీరుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు నెలల కందటే డీఎస్పీ జయసూర్య అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.  అయితే అప్పట్లో జయసూర్యకు మద్దతుగా ఆయన సమర్ధుడైన అధికారి  అంటూ ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్   రఘురామ కృష్ణరాజు కితాబివ్వడం సంచలనం సృష్టించింది. పవన్ కల్యాణ్ ఆదేశించినా, ప్రభుత్వం విచారణ జరుగుతోందని ప్రకటించినా గత రెండు నెలలుగా డీఎస్పీ జయసూర్యపై ఎటువంటి చర్యా లేదు.  ఇప్పుడు హఠాత్తుగా ఆయనపై బదలీ వేటు పడింది. అయితే జయసూర్యపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు అంటున్నారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు అంతర్గ విచారణలో నిరూపితం కాకపోవడం వల్లనే రెండు నెలల తరువాత బదలీ వేటు వేశారనీ, ఒక వేళ ఆరోపణలు నిరూపితమై ఉంటే సస్పెండ్ చేసి ఉండేవారనీ అంటున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సిట్ స్పీడ్ మామూలుగా లేదుగా?

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణ  గురువారం (డిసెంబర్ 25)  అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో సిట్ దూకుడు పెంచింది.  ప్రభాకరరావు కస్టడీ గడువు ముగుస్తున్న రోజే కేసులోని కీలక నిందితులందరినీ ఒకేసారి విచారించేందుకు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావు, మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావుతో పాటు మరికొందరిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ప్రభాకరరావు కస్టడీ గడువు ముగిసే చివరి రోజున సిట్ ఒకే సారి వీరందరినీ విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించి కీలక అంశాలపై సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 14 రోజుల కస్టోడియల్ విచారణలో  ప్రభాకరణావు చాలా వరకూ ప్రశ్నలన్నిటికీ నో అనే సమాధానాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌లుగా పనిచేసిన నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ప్రస్తావించినప్పటికీ, ఆరు వేల ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ విషయంపై   ప్రభాకర్‌రావు మౌనం వహించినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, మావోయిస్టుల అంశంపైనే మాజీ మంత్రి హరీష్‌రావు తనతో మాట్లాడినట్టు చెప్పిన ప్రభాకర్‌రావు, తనకు అప్పటి సీఎం  కేసీఆర్ రీ-ఎంప్లాయిమెంట్‌ను ఎలా ఇచ్చారన్న విషయంపై మాత్రం స్పందించలేదని సమాచారం. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితమే ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావులను కలిపి సిట్ విచారించింది. ప్రణీత్‌రావును దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, ఇవాళ ఆయన మినహా మిగిలిన నిందితులందరినీ విచారించారు. అలాగే ప్రభాకర్‌రావు పెద్ద కుమారుడు నిశాంత్‌రావును సైతం  నాలుగు గంటల పాటు విచారించిన సిట్, ఆయన ఆర్థిక లావాదేవీలపై వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసుకు అనుబంధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా సిట్ దృష్టి సారించింది. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్‌ను విచారణకు పిలిచి, ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించింది. తన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై తనను సిట్ ప్రశ్నించిందని నందకుమార్ వెల్లడించారు. అప్పుడే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న అనుమానం వచ్చినట్టు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సిట్‌కు సమర్పించినట్టు   తెలిపారు.  మరోవైపు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను మరోసారి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను శుక్రవారం (డిసెంబర్ 26)  సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు నోటీసుల అంశంపైనా కీలక చర్చ జరుగుతోంది. అదేవిధంగా, బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులను విచా రిస్తున్న సిట్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ స్థాయి అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇవాళ్టితో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ, అధికార వర్గాల్లో నెలకొంది.

మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే హతం

ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న అగ్ర మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే అలియాస్ పాకా హనుమంతు భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో  హతమయ్యాడు. కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో గురువారం (డిసెంబర్ 25)   ఒడిశా ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ , సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన కూబింగ్ ఆపరేషన్  ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో  గణేష్ ఉయికేతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా  ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక పోతే ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన గణేష్ ఉయికే సీపీఐ  మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు. మోస్ట్ వాంటెడ్  మావోయిస్టుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. గణేష్ ఉయికేపై   . మొత్తం కోటి రూపపాయల రివార్డు ఉండగా, తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా పాతిక లక్షల రివార్డు  ప్రకటించింది. తెలంగాణలోని  నల్గొండ జిల్లా చందూర్ మండలం పుల్లెమ్ల గ్రామానికి చెందిన గణేష్ ఉయికే, బీఎస్సీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి, క్రమంగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ అగ్రస్థాయి నేతగా ఎదిగారు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మిగిలి ఉన్న కేవలం ముగ్గురు సభ్యుల్లో గణేష్ ఉయికే ఒకడిగా భద్రతా సంస్థలు గుర్తించాయి. మిగిలిన వారిని  ఛత్తీస్‌గఢ్‌లో మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, జార్ఖండ్‌లో అనాల్డా అలియాస్ తూఫాన్‌ మాత్రమే. ఇదిలా ఉండగా, మావోయిస్టు పాలిట్‌బ్యూరో సభ్యుల్లో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిషిర్ బేస్రా ఇంకా పరారీలో ఉన్నారు. మరోవైపు, పాలిట్‌బ్యూరో సభ్యులు వెనుగోపాల్ రావు అలియాస్ సోను, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న ఇప్పటికే లొంగిపోయారు. గణేష్ ఉయికే హతంతో ఒడిశా, పరిసర రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భద్రతా దళాలు చెబుతున్నాయి.ఇలా ఉండగా గణేష్ ఉయికే ఎన్ కౌంటర్ పై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు.  తాజా ఎన్కౌంటర్తో నక్సల్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందన్న ఆయన.. వచ్చే ఏడాది మార్చి 31లోగా దేశంలో  మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.   

ఆంధ్ర కురియన్, ఉక్కు కాకాని... మన మహనీయుడు వెంకటరత్నం

ప్రజాసేవే తన వృత్తి అని నమ్మి,  జీవితమంతా ప్రజలతోనే, వారి సేవలోనే గడిపిన ఆదర్శ నాయకుడు స్వర్గీయ కాకాని వెంకటరత్నం.  ఆయన మరణించి గురువారం (డిసెంబర్‌ 25) నాటికి సరిగ్గా  53 ఏళ్లు. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ జనంస్మరించుకుంటూనే ఉన్నారు.  దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన గ్రామీణ రైతు, కూలీ బంధువుగా వారికి చేయూతనందించిన ప్రజల మనిషి కాకాని వెంకటరత్నం. ప్రజానాయకునిగా అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకాని వెంకటరత్నం. ప్రజా పోరాటాలలో నిమగ్నుడైన ఆయనను ‘ఉక్కు కాకాని’ అని ప్రజలు ప్రేమగా పిలుచుకున్నారు. అసలు సిసలు ప్రజా నాయకుడైన  కాకాని వెంకటరత్నం చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే కాక, ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమంత్రిగా చేసిన కాలంలో ఆయన స్థాపించిన పాల సేకరణ కేంద్రాలు, శీతలీకరణ కేంద్రాలు, జిల్లా పాడి పరిశ్రమ కేంద్రాలు గ్రామీణ రైతాంగ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అందుకే కాకానిని చాలా మంది ‘ఆంధ్రా కురియన్‌’గా పిలుచుకుంటారు. కుల మతాలకి అతీతంగా ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం ఆయన నైజం. ముఖ్యంగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లంటే కాకానికి ప్రత్యేక అభిమానం. స్థానిక పనుల కోసం ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడకూడదనీ, స్థానికంగా ప్రజలు సహకరించుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందని కాకాని ప్రచారం చేసేవారు. ఆయనది ఎలిమెంటరీ స్కూల్ చదువే, అయినా ఎన్నో వేల మంది పెద్ద చదువులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులే కొద్దో గొప్పో విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేశారు. వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ మంత్రిగా కాకాని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు అమోఘం. గ్రామాల్లో పేదరికాన్ని, ముఖ్యంగా ఒంటరి మహిళ ఆర్థిక స్థితిగతులు మారాలంటే, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం పాడి, గుడ్డు ముఖ్యమని గమనించి, ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాడి పరిశ్రమలో మధ్యవర్తుల బెడద పోతేగాని బీదరికాన్ని నిర్మూలించలేమని నిర్ణయించుకున్నారు.  గ్రామాల్లో ఆయన సాధించిన విజయాలు చూసి జమీందార్లు, ఎంతోమంది భూ కామందులు కలిసి కాకానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండా ప్రయత్నించారు. అయినా కాకాని ప్రజానాయకుడుగా పేరొందారు. తమ సిద్ధాంతాలని వ్యతిరేకించే కాకాని వెంకటరత్నం, రైతు కూలీలకు   నాయకుడు అవ్వడం కమ్యూనిస్టులకి నచ్చలేదు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు, మనుగడకే ఆయన ముప్పు అని భావించారు. కమ్యూనిస్టు పార్టీ కాకాని మీద కత్తి కట్టి, ఆయన్ని చంపే ప్రయత్నాలు కూడా చేసింది. అయితే వాళ్లెవరూ కాకాని లంచగొండి అని శంకించకపోగా, ఆయన కార్యదీక్ష, క్రమశిక్షణను మెచ్చుకున్న వాళ్లే. కాకాని వెంకటరత్నం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కూడా 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, యువకులకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చెప్పి, ఉద్యమాన్ని ఉధృత స్థితికి తీసుకువెళ్లారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాల్ని, వ్యతిరేకిస్తూ గన్నవరం విమానాశ్రమంలో ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విమానం ఆగకుండా చేసినప్పుడు యువకుల మీద పోలీసులు జరిపిన కాల్పులను తట్టుకోలేక కాకాని చివరకు ప్రాణాలే విడిచారు. కాకాని ఆశించిన ప్రత్యేక రాష్ట్రం 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలయినా ఇంతవరకు ఆయన జ్ఞాపకార్థం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఆయన స్ఫూర్తి, స్మారణ చిహ్నం ఏర్పాటు చేయలేదు. అంతకు ముందెప్పుడో పెట్టిన కాకాని విగ్రహాన్ని కూడా తొలగించారు. విజయవాడలో ఆ సర్కిల్‌ని కాకాని పేరుతో కాకుండా  బెంజ్‌ సర్కిల్‌  అనే పిలుస్తున్నారు. ఎట్టకేలకు కాకాని విగ్రహాన్ని బ్రిడ్జి కింద అతి కష్టం మీద మళ్లీ పెట్టారు, అదీ జిల్లా ప్రముఖుల పట్టుదల వల్ల.  కనీసం ఈ 54వ వర్ధంతికైనా కాకాని వెంకటరత్నం పేరును   అమరావతి అవుటర్‌ రింగ్ రోడ్డు కు   పెట్టి ఆ మహనీయుడ్ని గౌరవించాలని అందరూ  కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ కు పాతికేళ్లుగా వారం వారం నివాళులు!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఓ అసోసియేషన్ గత పాతికేళ్లుగా ప్రతి గురువారం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ అరుదైన  ఘనతను సొంతం చేసుకున్న అసోసియేషన్ పేరు పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు విగ్రహానికి ఈ సంస్థ గత పాతికేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఉదయం ఎనిమిదిన్న గంటలకు నివాళులర్పించడాన్ని ఒక ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది.   ఈ క్రమంలో ఈ గురువారం (డిసెంబర్ 25)తో ఈ కార్యక్రమానికి 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ రజతోత్సవ వేడుకలను నిర్వహించింది.  ఎన్టీఆర్ అంటే నటన, రాజకీయాలు మాత్రమే కాదని.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన శకపురుషుడు నందమూరి తారకరామారావుకు   గత పాతికేళ్లుగా ప్రతి గురువారం  గుంటూరులోని  బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి గురువారం నివాళులు అర్పిస్తూ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనతన సొంతం చేసుకుంది.  పరిస్థితులు ఎలా ఉన్నా గత పాతికేళ్లుగా ఒక్క గురువారం కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం కొనసాగించామని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  ఇక  ఈ నివాళుల కార్యక్రమం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఎన్టీఆర్ విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, రాజకీయ సేవలను అభిమానులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను తరతరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రతి గురువారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తామని చెప్పారు.  గుంటూరులో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1969లో గుంటూరు రైలుపేట ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ జీవితానికి అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆ అభిమాన సంఘానికి కొనసాగింపుగానే పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. రజతోత్సవ వేడుకల సందర్భంగా  ఎన్టీఆర్ ఆశయాలను యువతకు చేరువ చేయడమే సంకల్పమని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  భవిష్యత్తులోనూ ప్రతి గురువారం ఇదే విధంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తామన్నారు. అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో గుంటూరు బస్టాండ్ సెంటర్ ప్రాంతం అభిమానులతో కళకళలాడింది. ఎన్టీఆర్ నినాదాలు, పుష్పవర్షం, జై ఎన్టీఆర్ అంటూ మార్మోగిన నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమం చూసిన పలువురు ప్రయాణికులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. నిదితులందరినీ ఒకేసారి విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో  కీలక పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో  సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసుకు సంబంధించిన  నిందితులందరినీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఒకేసారి విచారించారు. ఈ కేసులో నిందితులైన ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌ రావుతో పాటు తిరుపతన్న ను విచారణకు హాజరు కావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టడీ గురువారం (డిసెంబర్ 24) ముగిసింది. ఈ  నేపథ్యంలో ఆయనను ఇతర నిందితులతో కలిపి   సిట్ విచారించింది.  కస్టడీ సమయంలో అడిగిన మెజార్టీ ప్రశ్నలకు ప్రభాక ర్‌రావు బదులు చెప్పలేదని సమాచారం. అయితే విచారణలో మాజీ ఇంటె లిజెన్స్‌ చీఫ్‌లు నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ఆయన  ప్రస్తావించి నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు ఆరు వేల  ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ అంశంపై ప్రభాకర్‌రావు నోరు మెదపలేదని అధికారులు తెలిపారు. మాజీ మంత్రి హరీష్‌ రావు తనతో మావోయిస్టుల అంశంపైనే మాట్లాడినట్లు ప్రభాకర్‌రావు విచారణలో వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు రీఎంప్లాయిమెంట్‌ ఎలా మంజూరయ్యిందన్న విషయంపై మాత్రం ప్రభాకర్‌రావు మౌనం పాటించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు  కీలక దశకు చేరిందని, 14రోజుల కస్టడీ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారు? ఎటువంటి విషయాలు బయటపడ్డాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగారావులను విచారించిన సిట్ ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై సిట్  లోతుగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఇదే కేసులో ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. దర్యాప్తు పరిధిని విస్తరిస్తూ, వివిధ కోణాల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఇక విచారణకు హాజరైన డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిసి విచారించిన సిట్, తాజాగా గురువారం (డిసెంబర్ 24) ప్రణీత్ రావును సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఈ విచారణలతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.  

ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

ఒడిశాలోభద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు మరణించారు. కంధమల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవుల్లో  మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) బలగాలు  గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో  ఎదురుపడిన మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒకరిని  ఏసీఎం బారి అలియాస్ రాకేష్ రాయగడగా గుర్తించారు. మరో మృతుడు ప్లాటూన్ సభ్యుడు  అమృత్‌గా   గుర్తించారు. వీరిద్దరూ జిల్లాలో పలు నక్సల్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం గుమ్మా అడవుల ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసా గిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరి స్తున్నారు.    

రో-కో తగ్గేదేలే.. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద

స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.  వీరిద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడితే చూడాలని అభిమానులు తపిస్తున్న నేపథ్యంలో వచ్చింది.. విజయ్ హజారే ట్రోఫీ. సఫారీలతో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడుతున్నారు. ఈ టోర్నీలోనూ రో-కో పరుగుల వరద పారిస్తున్నారు.   జైపుర్ వేదికగా సిక్కింతో బుధవారం (డిసెంబర్ 24) జరిగిన మ్యాచ్లో ముంబై దూకుడు ప్రదర్శింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. అనంతరం 237 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన ముంబై 30.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి ఆటను ముగించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 94 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా ముంబై ఛా రాజా అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా హిట్‌మ్యాన్  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో   ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వన్ డౌన్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కి ఆంధ్ర జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకి దిగిన ఢిల్లీ 27.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ స్టేజ్‌‌లో కోహ్లీతో కలిసి ప్రియాంక్ ఆర్య(74) రాణించడతో ఢిల్లీ 37.4 ఓవర్లో లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుని విజయ సాధించింది

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్  వద్ద బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా  పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూనే.. పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తో నేరుగా మాట్లాడిన ఆయన, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి స్పష్టంగా వివరించారు. చదువుకున్న వారు కూడా బాధ్యత లేకుండా ఇలా వ్యవహ రించడం దురదృష్టకరమన్నారు. న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యం లో గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా  ప్రత్యేక నిఘా, తనిఖీలు ముమ్మరం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 31 రాత్రి వరకు హైదరాబాద్ నగరమంతటా  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్  కొనసాగుతుందని  సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఇందు కోసం అదనంగా  ఏడు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పబ్‌లకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్ల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని సిపి తెలిపారు. 

అత్యవసర పరిస్థితుల్లోనూ వేగంగా స్పందించరా?.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ లో వాయుకాలుష్యం తీవ్రత ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే.. హస్తినలో మూడు రోజులుంటే చాలు అలర్జీలు, గొంతు నొప్పి ఖాయమని చెప్పారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లోనూ ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడుంబిగించింది. అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై 18శాతం జీఎస్టీ ఆర్థిక భారంగా పరిణమించింది. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ సమంజసం కాదని పేర్కొంటూ, దానిని ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కపిల్ మదన్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను బుధవారం (డిసెంబర్ 24)విచారించిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కాలుష్యం కారణంగా జనం నానా ఇబ్బందులూ పడుతుంటే, అనారోగ్యానికి గురై మరణిస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎటూ అందించలేరు.. కనీసం  ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీని కూడా తగ్గించలేరా? అంటూ నిలదీసింది. జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోంది? వేగంగా నిర్ణయాలు తీసుకోవడం చేతకాదా అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  స్పందించేందుకు పక్షం రోజులు గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాదిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.  వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి (డిసెంబర్ 26)కు వాయిదా వేసింది.  

బాంబు బెదరింపు.. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బాంబు బెదరింపుతో ఓ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టుగా శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం (డిసెంబర్ 25) ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.   ఆ తరువాత విమానంలోని ప్రయాణీకులను దించివేసి బాంబ్ స్క్వాడ్ తో విమానంలో తనిఖీలు చేపట్టారు.  ఇటీవలి కాలంలో విమానాలలో బాంబులు పెట్టామంటూ బెదరింపు ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తరహా బెదరింపులు ఇటీవలి కాలంలో దాదాపు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటుంన్నారు. తాజాగా మరోమారి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

చంద్రబాబు, పవన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్  అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని  కోరుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా  క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గంలో  నడవాలని పిలుపునిచ్చారు. నేటి సమాజానికి  ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు  అత్యంత అవసరమని పేర్కొన్న చంద్రబాబు.. క్రీస్తు అదే మార్గంలో నడవాలని ఉద్బోధించారని పేర్కొన్నారు.   జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ క్రైస్తవుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం సందర్భంగా ఆయన చూపిన ప్రేమ‌, శాంతి, స‌హ‌నం పాటిద్దామని పేర్కొన్నారు.  అంద‌రూ ఆనంద‌మ‌యంగా క్రిస్మస్ పండుగ జ‌రుపుకోవాల‌ని  నారా లోకేశ్ పేర్కొన్నారు. 

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది సజీవదహనం

కర్నాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది సజీవదహనమయ్యారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి గోకర్ణకు వెడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం బెంగళూరులోని గాంధీనగర్ నుంచి 30 మంది ప్రయాణీకులతో గోకర్ణకు బయలు దేరిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో  48వ నంబర్ జాతీయ రహదారిపై హిరియూర్ సమీపంలో అదుపుతప్పి కంటైనర్ ను ఢీ కొంది.  వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి.  ఈ ఘటనలో 18 మంది  సజీవదహనం అయ్యారు. మిగిలిన వారు  తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఓ 12 మంది మాత్రం కిటీకీ అద్దాలు పగుల గొట్టుకుని బయటపడగలిగారు. అయితే వారికి  సైతం తీవ్రమైన కాలిన గాయాలయ్యాయని చెబుతున్నారు. బయటపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతున్నది.  ప్రమాద సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

నకిలీ ఈచలాన్ లింకులతో సైబర్ మోసాలు!

నకిలీ ఈ-చలాన్  చెల్లింపు లింకుల ద్వారా జరుగు తున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి అంటూ  సైబర్ నేరగాళ్లు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ లింకులు పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే విధంగా  ఉండటంతో.. చాలామంది అవి నిజమైనవని నమ్మి క్లిక్  చేసి మోసపోతున్నారని పేర్కొన్నారు. ఆ  నకిలీ లింక్ పై  క్లిక్ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలని, ఆ తరువాత  చెల్లించాల్సిన మొత్తం చూపించి వెంటనే చెల్లింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. చెల్లింపు చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం, బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలిపారు. దీని వల్ల బాధితుల ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగి భారీగా డబ్బు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.  ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితు ల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే తమ మొబైల్ డేటా లేదా వై-ఫైని నిలిపివేయాలని, బ్యాంకును సంప్రదించి కార్డులు లేదా లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.  

మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్

పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిం చుకొని పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు గా తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్ లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మార్గమ ధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు.అదే సమయంలో బత్తుల ప్రభాకర్ మూత్ర విసర్జనకు అంటూ  పోలీసుల కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతడి కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీ కి పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు.     ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని తీసుకొని కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చోరీల ద్వారా సంపా దించిన డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నారు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పరారీలో ఉన్న నేరస్తుల్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.