టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పవన్‌కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకకూ ఎవరూ అందుకోనటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐదవ డాన్‌ను ప్రదానం చేసింది. అంతే కాకుండా ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ.. పవన్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు .. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు.. ఎలా ఎదిగారు లాంటివన్నీ ఆ వీడియోలో పొందుపరిచారు.  డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించారు. మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యకు తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా గత ఏడాది డిసెంబర్ 30న ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.

భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు  అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న మొట్ట మొదటి భారతీయుడు పవన్ కళ్యాణ్.  . సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా ఐదవ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు.  ఈ వార్త తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తిరుపతిలో ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్.. చంద్రబాబు

యువతరం భవిష్యత్  బంగారంగా ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఆ దిశగా అన్ని విధాలుగా యువత భవిష్యత్ ను తీర్చిదిద్దేలా అవసరమైన చర్యలు తీసుకునేలా విధానాల రూపకల్పన జరగాలని చంద్రబాబు ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  భవిష్యత్తులో ఏయే రంగాల్లో యువతకు మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయో గుర్తించడంతో పాటు,  .ఆయా రంగాల్లో యువతలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం (జనవరి 16) ఏరో స్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయనీ,  ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్, సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వివరించారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు...వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా వచ్చే కంపెనీలకు... పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనీ, ఆ దిశగా చర్యలు, విధానాల రూపకల్పనలు జరగాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ఇందుకురాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతిలో  ఓ అతి పెద్ద అధ్యయన కేంద్రాన్ని తిరుపతిలో ఏపీఫస్ట్ పేరిట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్‌ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీఫస్ట్ ఏర్పాటు కాబోతోందన్న ఆయన దీనిని  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిది ద్దాలన్నారు.  ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదిం పులు జరపాలని చంద్రబాబు సూచించారు.     నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు...యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందనీ,  సంక్షేమానికి-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తోందో,  యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. దీంట్లో భాగంగానే ఏపీ ఫస్ట్   ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యూనివర్శిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకుని,  ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యార్థులు చేస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలను అంది పుచ్చుకోవాలన్నారు.  అలాగే యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలన్నారు. అదే విధంగా   అందుబాటులోకి వస్తోన్న టెక్నాలజీలు ఏంటీ...? ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనే విషయాలను గుర్తించి.. వాటిని కరిక్యులమ్‌లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ ప్రిపేర్ చేసేలా ఏపీ ఫస్ట్ పని చేయాలని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నాయి. ఇదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలనీ, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందనీ చెప్పారు.  వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.  అలాగే.. డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలనీ, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందనిచెప్పారు. ఇటువంటి ఫ్యూచర్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ఈ  సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మేడిపల్లిలో పండగ దొంగల బీభత్సం...12 ఇళ్లలో చోరీ

  వీళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు కాదురా బాబోయ్ దర్జాగా కార్లో వస్తారు... మెల్లిగా ఎటువంటి అలజడి లేకుండా పని మొత్తం ముగించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ కోసం పోలీసులు వేట కొనసాగించారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది తమ స్వగ్రామా లకు వెళుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలోనే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకో వాలంటూ పలు సూచనలు చేశారు. కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా సంతోషంతో స్వగ్రామాలకు వెళుతూ ఉంటారు. కానీ ఇదే అవకాశం గా భావించే దొంగలు రెచ్చిపోతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.  మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదండోయ్...  అర్ధరాత్రి సమయంలో ఒక్కరు కాలనీలోకి వచ్చి ఆగింది. కార్లో నుండి చాలామంది యువకులు బయటకు వచ్చారు. చేతిలో కత్తులు పట్టుకుని కాలనీలో సంచరిస్తూ వరుసగా 12 ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి... అనంతరం అర్ధరాత్రి సమయంలో కారులో దర్జాగా వచ్చి చోరీలు చేసి, అనంతరం వేగంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు.  సంక్రాంతి పండగ కారణంగా చాలా కుటుంబాలు వారి తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లిపోయారు. అలాంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకున్న దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. కొందరు ఇళ్లలో అల్మారాలు, డ్రాయర్లు చెల్లాచెదురుగా పడివుం డటం చూసి ఉదయం చోరీ జరిగిన విషయం బయట పడింది. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే బాధితులు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అయితే కారులో వచ్చి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో  రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌ను రప్పించారు.  ఫింగర్ ప్రింట్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దొంగల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో మొహానికి మాస్క్ , మరియు చేతిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్న దొంగలను చూసిన స్థానికులు  భయాం దోళనకు గురవుతున్నారు. పండగ రోజుల్లో గస్తీ పెంచాలని, రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ సులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంక్రాంతి కోళ్ల పందేలు...ఎన్ని వేల‌ కోట్లంటే!?

  ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం  రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఏకంగా 2 వేల కోట్ల రూపాయ‌ల మేర కోళ్ల పందేల్లో చేతులు మారాయ‌ని తెలుస్తోంది. కొన్ని కొన్ని అంచ‌నాల ప్ర‌కారం ఈ  మొత్తం ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంది త‌ప్ప త‌గ్గే  ప్ర‌స‌క్తే లేదంటున్నారు. గ‌త సంక్రాంతి సంబ‌రాల్లో ఒక్క క‌నుమ‌రోజే వెయ్యి కోట్ల మేర చేతులు మారాయి. మూడో రోజు మ‌రింత పెద్ద మొత్తంలో పందెంరాయుళ్లు కోళ్ల పందేలు ఆడుతార‌ని చెబుతారు. కార‌ణం ఇదే ఆఖ‌రు రోజు కావ‌డంతో.. మ‌రింతగా చెల‌రేగిపోయి పందెంరాయుళ్లు పందేలు కాస్తార‌ని అంటారు. బేసిగ్గా కోళ్ల పందేలపై దేశ వ్యాప్తంగా నిషేధ‌ముంది. కానీ ఆ నిషేధం ఎక్క‌డా అమ‌ల‌వుతున్న‌ట్టే క‌నిపించ‌డం లేదు. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఎలాగో ఇక్క‌డ కూడా కోళ్ల పందేలు అలాగ‌. అయితే త‌మిళ‌నాడులో వీటి విష‌యంలో పందేల నిర్వ‌హ‌ణ ఉండ‌దు. కేవ‌లం వీరుల‌కు బ‌హుమానాలు ఇస్తారు. అంతే. అదే ఏపీలో అలాక్కాదు కోళ్ల పై పందేలు కాయ‌డం ఎప్ప‌టి  నుంచో వ‌స్తోన్న అల‌వాటు.  భీమ‌వ‌రం ఆ ప‌రిస‌ర  ప్రాంతాల్లోని గోదావ‌రి జిల్లాల‌కు ప‌రిమిత‌మైన కోళ్ల పందేలు ఇప్పుడు ఉభ‌య గుంటూరు, కృష్ణా జిల్లాల వ‌ర‌కూ పాకిపోయాయి. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో అయితే సినిమా హాళ్ల‌ను త‌ల‌పించేలా సీటింగ్ గేల‌రీలు ఏర్పాటు చేయ‌డం చూసి ఆశ్చ‌ర్య పోయారు పోలీసులు. అప్ప‌టికీ వారి ఏర్పాట్ల‌ను ధ్వంసం చేసి ఆపై అక్క‌డ‌క్క‌డ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. వాటిని కూడా లెక్క చేయ‌కుండా బ‌రుల నిర్వాహ‌కులు బ‌రి తెగించిన‌ట్టు క‌నిపిస్తోంది.  పోలీస్టేష‌న్ కి ప‌ది ల‌క్ష‌లు ఇచ్చేలా తాము మాట్లాడామ‌ని.. వాళ్ల కేసులు వాళ్ల‌వే మ‌న పందేలు మ‌న‌వే అంటూ నిర్వాహ‌కులు.. రెచ్చిపోయి వీరు మాట్లాడిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి కూడా. దీన్నిబ‌ట్టీ చూస్తే.. గుంటూరు కృష్ణా జిల్లా వ్యాప్తంగా  కూడా కోళ్ల పందేలు ఏ స్థాయిలో జ‌రిగాయో ఊహించుకోవ‌చ్చు.ఒక వ్య‌క్తి కోటిన్న‌ర గెలిచిన‌ట్టు స‌మాచారం అంద‌గా.. తాడేప‌ల్లిగూడెంలో ద‌గ్గ‌ర్లో జ‌రిగిన ఒక పందెంలో 6 కోట్ల మేర పందెం కాచిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఇలా చెప్పుకుంటూ  పోతే ఈ పందేల కోళ్ల క‌ట్ట‌ల‌ క‌థ‌లు కోకొల్ల‌లు.  

ఒక్క పెగ్గు మద్యం కోసం సొంత అన్ననే చంపేశాడు!

ఒక్క పెగ్గు.. ఒక్కటంటే ఒక్క పెగ్గు కోసం విచక్షణ మరిచి సొంత అన్ననే మేడమీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతమింది. మద్యపానానికి బానిసైన వారికి   తల్లీ, తండ్రీ, అన్నా, తమ్ముడూ, భార్యా, పిల్లలూ, స్నేహితులు.. ఇలా అన్ని సంబంధాలూ విచ్ఛిన్నమౌతాయి. కుటుంబం బంధాలలో చిచ్చు రేగుతుంది.  మద్యం వ్యసనానికి బానిసైన  వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. చుక్క మద్యం కోసం ఉచ్ఛనీచాలనూ విస్మరిస్తారు. ఎంతకైనా తెగిస్తాడు. సరిగ్గా అలాంటి ఉదంతమే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.   నాచారంలో నివాసం ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు  సంక్రాంతి పండుగ సందర్భం గా గురువారం (జనవరి 15)ఆనందోత్సాహాలతో పతంగులు ఎగరవేసి సంబరం జరుపుకున్నారు. ఆ తరువాత రాత్రి ఒక ఇంటి భవనం మూడో అంతస్తులో  మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం తాగుతుండగా, ఒక్క పెగ్గు విషయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. అది కాస్తా వారి మధ్య వాగ్వాదానికీ, ఘర్షణకూ దారి తీసింది.  అన్న తమ్ముడిని ఒక్క పెగ్గు మద్యం ఇవ్వాలంటూ అడగడంతో వివాదం మరింత ముదిరింది.  ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అన్నను ఒక్కసారిగా  మేడపై నుంచి తోసివేశాడు.   మూడు అంతస్తుల భవనం పై తోసివేయడంతో కిందపడిన అన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడైన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మద్యం మద్యం మత్తే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  సంక్రాంతి పండుగ రోజున చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

110 ఏళ్లకు పెళ్లి .. ఏడాదికే బిడ్డ...142 ఏళ్లలో మృతి

  ఆరోగ్య రహస్యంతో అక్షరాలా 142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు. 110 పదేళ్లకు మూడో పెళ్లి చేసుకుని, ఆపై ఏడాదికే తండ్రిగా మారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఆయన జీవితం ఒక అద్భుతంగా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన ఆహారం, దైవచింతనతో 40 సార్లు హజ్ యాత్ర చేసిన ఈయన.. 134 మంది వారసులను వదిలి వెళ్లారు.  దాదాపు ఒకటిన్నర శతాబ్దం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన సౌదీ ఓల్డెస్ట్ మ్యాన్ షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి తాజాగా ప్రాణాలు కోల్పోయారు. సౌదీఅరేబియా దేశం ఏర్పడక ముందే ఆయన జన్నించారు. 110 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని విధంగా మూడో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఏడాదికే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాకుండా 40 సార్లు హజ్ యాత్ర చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్య పరిచాడు.   35 - 40 ఏళ్ల దాటితేనే పిల్లల్ని కనడానికి అనేక మంది స్త్రీ, పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే.. షేక్ నాసర్ మాత్రం వందేళ్లు పైబడినా పిల్లల్ని కనడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం, సంతాన సామర్థ్యం కలిగి ఉండటం చూసి వైద్య నిపుణులు, పరిశోధకులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆయన దీర్ఘాయువు వెనుక ఉన్న రహస్యాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ నాగరత్న“ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేము కదా? మీ ఉద్దేశం పూర్తయిందా లేదా? ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం, ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకొని తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీలో ఆ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్

  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఆలస్యంగా వస్తే ఆ రోజు వేతనంలో కోత విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా మెరుగైన సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ సంస్కరణల ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సర్కార్ లక్ష్యమని తెలుస్తోంది. ఇటీవ‌లే ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల పేర్ల‌ను సైతం మార్చింది. గ్రామ స‌చివాల‌యాల‌ను స్వ‌ర్ణ గ్రామాలుగా, వార్డు సచివాల‌యాల‌ను స్వ‌ర్ణ వార్డులుగా మార్చేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు స‌చివాల‌య పాల‌న‌లోనూ మార్పులు తీసుకురావాల‌ని నిర్ణయించిన ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. 

ఇండియన్స్.. ఇరాన్ నుంచి వచ్చేయండి.. కేంద్రం ప్రకటన

ఇరాన్ లో నివసిస్తున్న ఇండియన్స్ అందరూ వెంటనే వెనక్కు వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఇరాన్ లో భారతీయులు ఎవరూ ఉండొద్దు, వెంటనే వెనక్కు వచ్చేయాలనీ, అక్కడ ఉన్న ఇండయన్స్ ను వెనక్కు తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నామనీ పేర్కొంది.   ఇరాన్‌  ముస్లిం దేశమే అయినప్పటికీ,  సాంకేతిక‌త‌, వైద్య విద్య  తదితర అంశాలలో ముందంజలో ఉండటంతో భారత్ నుంచి అనేక మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసించేందుకు వెడుతుంటారు. ఇక నిర్మాణ రంగంలో పని చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఇరాన్ వెడతారు.  కానీ ఇటీవ‌ల కాలంలో ఇరాన్  కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది.  దీంతో అక్కడ ఆహార ప‌దార్థాలు స‌హా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా  ఉండటంతో  ఇరాన్   ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి. ల‌క్ష‌లాది  రోడ్ల‌పైకి వ‌చ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను విధ్వంసానికి దారి తీస్తున్నాయి. దీంతో నిరసనకారులపై ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇరాన్ నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ  12 వేల మందికి పైగా నిర‌స‌న కాల్పుల్లో హతమయ్యారు ఇక అమెరికా రంగంలోకి దిగి నిరసనకారులకు మద్దతు ప్రకటించింది. తద్వారా దేశంలో హింసను రెచ్చగొట్టేలా ప్రకటనలు గుప్పిస్తోంది. నిరసనలు కొనసాగించాలనీ, నిరసనకారులకు పూర్తి సహకారం అందిస్తామనీ, భద్రత కల్పిస్తామని అగ్రదేశాధినేత ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ లో సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో, ఆ దేశంలో ఉన్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారతీయులందరూ వెంటనే  స్వదేశానికి వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చింది. ప్ర‌త్యేక విమానాల ఏర్పాటు షెడ్యూల్ ను నేడో, రేపో ప్రకటించనుంది. 

జగ్నన్న తోట ప్రభల తీర్థం.. ప్రత్యేకతలు.. విశిష్టతలు!

దేశమంతా జరుపుకునే పండుగ సంక్రాంతి .. ప్రాంతాన్ని బట్టి పండుగ ఒక్కో విధంగా జరుపుకుంటారు.  ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు సంక్రాంతి పండుగను తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్రాంతి పండుగ తరువాత వచ్చే కనుమ పండుగ కోససీమ వాసులకు ఒక అద్భుత ప్రత్యేక తీర్థాన్ని తీసుకువస్తుంది. కొబ్బరాకుల పందిరి వేసినట్లుండే కోనసీమలో కనుమ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది.   ఈ జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.  అసలింతకీ ఈ జగ్గన్న తోట తీర్ధం ప్రత్యేకతలు, విశిష్ఠతలు ఏంటంటే..  కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుంచి జనం ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన ఏ చిహ్నాలూ కనిపించవు.   భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. శివుని వాహనంగా భావించే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని కొలుస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలతో ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో  తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్య గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలను జనం మోస్తారు. అలా మోయడం ఈశ్వర  సేవగా భక్తులు భావిస్తారు.  నాలుగు శతాబ్దాలుగా  ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థం జరుగుతోందంటారు.  ఈ ప్రభల తీర్థానికొక  గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ ఒక కారణం ఉందంటారు.   మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే  వ్యక్తి ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించిన స్థానికులు అప్పటి నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారట. దీంతో  వాళ్ళు ఈయన్నిఅడ్డుకుని నిజాం నావాబు వద్దకు తీసుకెళ్లారట. ఆ సందర్భంగా ఈ జగ్గన్న   పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే జగ్గన్న ఈ ప్రభల తీర్థం జరిపాడని అంటారు.  దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ ఉండదనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పేందుకే  ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు. ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొ విశేషం  కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీక  లోతు కౌశిక ప్రవాహాన్ని దాటుకుంటూ, పొలాల మధ్య నుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒకసారి ఎత్తిన తరువాత  ఈ ప్రభలను  కిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీటి చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు.   గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలను ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు.  తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువు ఉంటాయి. అయినా వాటిని అవలీలగా దాటించగలగడం మాత్రం ఈశ్వరానుగ్రహం వల్లనేనని చెబుతారు వాటిని మోసే వాళ్లు.  మొత్తంగా శతాబ్దాలుగా జరుగుతున్న ఈ జగ్గనతోట ప్రభల తీర్ధం వైభవం ఎంత చెప్పినా తక్కువే. 

నిఘా సంస్థల డైరెక్టర్ జనరల్‌‌లను మార్చిన కేంద్రం

  జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఐఏ  కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్‌ఐఏ డైరెకర్ట్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్‌ను నియమించింది. ఆయన ఈ పదవిలో 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనున్నారు. హిమాచల్‌ క్యాడర్‌కు చెందిన అగర్వాల్‌ 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఎన్‌ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశం ఈ నియామకాన్ని ఆమోదించింది. ఎన్‌ఐఏ మాజీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్‌కు పంపింది. దీంతో ఎన్ఐఏ డీజీగా అగర్వాల్‌కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అగర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అలానే సంక్లిష్ట దర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఎన్ఐఏతోపాటు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీలకు కొత్త డైరెక్టర్‌ జనరళ్లనూ కేంద్రం నియమించింది. సీనియర్‌ ఐపీఎస్‌ శతృజీత్‌ సింగ్‌ కపూర్‌ను కేంద్రం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ను బీఎస్‌ఎఫ్‌ కొత్త చీఫ్‌గా నియమించింది.