దిల్‍సుఖ్‍నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన

  జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు  రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.  

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ...ఐదుగురు అరెస్ట్

  హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది. ఐటీ ఉద్యోగాలు, స్టార్టప్ కల్చర్ మాత్రమే కాదు… ‘స్టార్ హోటల్ డ్రగ్ పార్టీలకు’ కూడా గచ్చిబౌలి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తాజా ఘటన మరోసారి రుజువు చేసింది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్‌బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ హోటల్‌లో జరిగిన డ్రగ్ పార్టీపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసుల సంయుక్త దాడులు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హోటల్ రూమ్‌లో రీయూనియన్ పేరుతో మత్తులో మునిగిపోయిన యువకుల ఆటలు, పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. 2019లో హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేసిన నలుగురు యువకులు కలిసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో రీయూనియన్ ప్లాన్ చేసుకున్నారు.  అదే సమయంలో మరో పాత స్నేహితుడు కూడా వీరిని కలిశాడు. ఈ ఐదుగురు గతంలో ఒక పెళ్లి వేడుకలో తొలిసారి గంజాయి సేవించారు. ఈరోజు అందరూ కలవడంతో మళ్లీ గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేశారు. రీయూనియన్ అంటే పాత ఫోటోలు, పాత జ్ఞాపకాలు కాదు… పాత మత్తే ప్రధాన అజెండాగా మారింది. పోలీసుల చేతికి చిక్కిన వారు హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న యువకులు వారిని చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. మణికొండ కు చెందిన మెఘేందర్ (29) – ఫ్రీలాన్సర్ బార్ టెండింగ్ గా పని చేస్తున్నాడ. కూకట్పల్లికి చెందిన తేజేశ్వర్ (28) – ఫుడ్ అండ్ బేవరేజెస్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. రామంతపూర్ కు చెందినసాయి ప్రసాద్ (28) – మనోహర్ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శేర్ లింగంపల్లి కి చెందిన రమేష్ (27) – లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు... నలుగురు యువకులు ఫుడ్ అండ్ బేవరేజెస్ మేనేజర్లు, హోటల్ మేనేజర్లు, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్లు…అతిథులకు సేవ చేసే వారు, మత్తుకు సేవ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు కలిసి జనవరి 6న హోటల్ రూమ్ నెంబర్ 309పై దాడులు నిర్వహిం చారు. రూమ్‌లో ఏడుగురు మద్యం సేవిస్తూ హంగామా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గది మొత్తం తనిఖీ చేయగా.. గంజాయి లభించకపోయినా, అనుమానం నివృత్తి కోసాం అందరికీ యూరిన్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రోజు గంజాయి సేవించినట్లు వారే స్వయంగా అంగీకరించారు.  బేగంపేట్ కు చెందిన టి. రవి (27) – ఏఆర్‌పీసీ, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఈ నలుగురితో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఏఆర్‌పీసీ స్థాయి అధికారి మత్తులో పట్టుబడటం పోలీస్ విభాగంలో కలకలం రేపింది. చట్టాన్ని కాపాడాల్సినవారే చట్టాన్ని మరిచిపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.  ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ముఖ్యంగా హోటల్, ఐటీ రంగాల్లో పనిచేసే యువత ఈ మత్తు మాయలో పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. స్టార్ హోటల్, రీయూనియన్, పార్టీ పేరుతో మత్తు పదార్థాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈగిల్ ఫోర్స్ హెచ్చరించారు.

సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు?

  రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు.. పార్టీ ఏదైనా సరే తనపై వచ్చే విమర్శలకు అంతే ధీటుగా స్పందిస్తారు. దశాబ్దా కాలంగా కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సురేష్ బాబు చెక్ పెట్టి పదవి నుంచి దించేశారు. తన వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇదంతా ఓ లెక్కైతే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడపలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జిల్లాలో దూమారం రేపుతోందట.. 2024 ఎన్నికల ముందు కడప నగరంలో నేరాలు అరికడతామని, గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు కడప రెడ్డెమ్మ. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నరగంలో సీసీ కెమెరాలు అవసరమని దాతల సహకారంతో పి4 పద్దతిలో నిధుల సమీకరణకు ఎమ్మెల్యే దంపతులు చేపట్టారంట. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సొంత పార్టీకి చెందిన మైనారిటీ నేత రబ్బానిని రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇవ్వకపోతే పార్టీకి మీతో సంబంధాలు కట్ చేస్తాం మీ కథ చూస్తాం అని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో దూమారం రేపుతోంది. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు సీసీ కెమెరాల పేరుతో వసూళ్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో మైనారిటీ నేత రబ్బాని తండ్రి జిలాని  అస్వస్ధతకు గురికావడం చర్చినీయంశంగా మారిందట. జిలానిని శ్రీనివాసులు బెదిరించడం వల్లే అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.   కడప నగరంలో సీసీ కెమెరాల వివాదం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడితున్నారు మాజీ డిఫ్యూటీ సియం అంజాద్ బాషా. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎవరు ఏం అనుకున్నా ఎన్ని ట్రోల్స్ చేసినా తగ్గేదేలే అంటున్నారు. కడప నగరం గంజాయికి అడ్డాగా మారిందని, గంజాయి ఫెడ్లర్లకు చెక్ పెట్టాలంటే ప్రతి గల్లీలో సిసి కెమెరాలు అవసరం అంటున్నారు. సీసీ కెమెరాల కోసం కోటి రూపాయలకి పైగా నిధులు అవసరం అని అందుకే పి4 మోడల్లో నిధులు సమీకరిస్తున్నామని ఆమె సమర్ధించుకుంటున్నారు.  అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాతలు ముందుకు రావాలని సీసీ కెమెరాలు అందించే కంపెనీ పేరుతో చెక్ ఇవ్వాలని కోరుతున్నారు . అయితే మీ పార్టీ అధికారంలో ఉంది... ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి కెమెరాలు ఏర్పాటు చేయాలి కానీ ఇలా బెదిరించి వసూలు చేయడం ఏంటని వైసీపీ విమర్శులు చేస్తుంది.

రూ.43 వేల కోట్ల బంగారం వెనిజులా నుంచి స్విస్‌కు తరలింపు

  వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు రూ.43,000 కోట్ల పైచిలుకు విలువైన బంగారాన్ని వెనిజులా నుంచి స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. నికోలస్ మదురో 2013లో వెనిజులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడింది. ఆ మూడేళ్ల కాలంలోనే దాదాపు 113 మెట్రిక్ టన్నుల స్వచ్ఛమైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించారు.  వెనిజులా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న నిల్వల నుంచే ఈ బంగారం తరలిపోయినట్లు స్విస్ బ్రాడ్‌కాస్టర్ 'ఎస్‌ఆర్‌ఎఫ్' ధ్రువీకరించింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, నగదు లభ్యత కోసం ప్రభుత్వం ఈ బంగారాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే గోల్డ్ రిఫైనింగ్‌కు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రం కావడంతో.. అక్కడ శుద్ధి చేయడం, ధ్రువీకరణ పొందడం కోసం ఈ బంగారాన్ని పంపినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల జనవరి 3న కరాకస్‌లో జరిగిన ఆకస్మిక దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌ కోర్టులో డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో-టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదురోతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన మరో 36 మందికి సంబంధించిన ఆస్తులను స్విస్ బ్యాంకులు స్తంభింపజేశాయి.  అయితే వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలిన బంగారానికి, ప్రస్తుతం ఫ్రీజ్ చేసిన ఆస్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  వెనిజులా ప్రజలు తీవ్ర ఆకలితో, ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సమయంలోనే ఇంత భారీ సంపద దేశం దాటడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ బంగారం ఆసియా మార్కెట్లలో విక్రయించబడిందా లేక ఆర్థిక సంస్థల వద్దే ఉండిపోయిందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

బంగ్లాలో హిందువులను ఓటింగ్‌కు దూరం చేయడానికి కుట్ర..!

  ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా? మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు ఓటింగ్లో పాల్గొనకుండా చేయడానికే ఈ మారణకాండ కొనసాగుతుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గడిచిన 31 రోజుల్లో ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యలు, లూటీలు, అత్యాచారాలతో బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా హిందువుల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి.  కొత్త ఏడాదిలోనే ఇదే పరిస్థితి కొనసాగుతుండతో సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి దిక్కుతోచకుండా తయారైంది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది.  ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలపాలవుతోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు కనిపించడం లేదని, ఆంక్షలు విధించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు కుట్రగా కనిపిస్తోంది.

బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం

  హైదరాబాద్‌ నగరంలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. జంతు హింసతో పాటు డ్రగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఒక ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ కంపెనీపై విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించగా, భారీగా రక్త నిల్వలు బయటపడ్డాయి. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారుల కంటపడిన దృశ్యాలు విస్మయానికి గురి చేశాయి. గోదాములలో ప్యాకెట్ల రూపంలో భారీగా గొర్రె, మేక రక్తాన్ని నిల్వ చేసి ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు వెయ్యి లీటర్లకు పైగా రక్తంను ప్యాకెట్లలో భద్రపరిచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ రక్తాన్ని నిల్వ చేయడం, తరలించడం పూర్తిగా అక్రమమని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. రక్తానికి సంబంధించిన అన్ని ప్యాకెట్లను సీజ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ రక్తాన్ని హర్యానాలోని పాలీ మెడికూర్ అనే కంపెనీకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ పేరుతో రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ, ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు అనుమాని స్తున్నారు. అసలు గొర్రె, మేకల రక్తాన్ని ఏ అవసరానికి వినియోగిస్తున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఈ రక్తాన్ని క్లినికల్ ట్రయల్స్‌, ఔషధ తయారీ లేదా బయో–మెడికల్ ప్రయోగాల కోసం అక్రమంగా ఉపయోగిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు కొనసాగించారు.  దీనికి సంబంధించిన పత్రాలు, లైసెన్సులు ఏవీ కంపెనీ వద్ద లభించలేదు. CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీ లో ఉన్నాడు. గత రెండు రోజులుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నికేష్‌ను అదుపులోకి తీసుకుంటే రక్తం సేకరణ, నిల్వ, సరఫరా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రాంతాల్లో గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం లభించింది. ఎలాంటి వెటర్నరీ పర్యవేక్షణ లేకుండా, జంతువులకు తీవ్ర హింస చేస్తూ ఈ రక్తాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జంతు సంక్షేమ చట్టాలకు పూర్తి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో కేంద్ర డ్రగ్ కంట్రోల్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశ ముంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, జంతు హింస నిరోధక చట్టం, అక్రమ రవాణా నిబంధనల కింద కేసులు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అక్రమ రక్త వ్యాపారం వెనుక మరిన్ని కంపెనీలు, వ్యక్తులు ఉన్నారా? దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడికి ఈ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసా గుతోంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదు నగరంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రియులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు... అసలు ఈ రక్తంతో ఏం చేస్తున్నారనే పూర్తి వివరాలు నిందితుల అరెస్టులతోనే వెలుగులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్  నోటీసులో పేర్కొన్నాది. రేవంత్‌ రెడ్డి  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్‌ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్‌ కోరినట్లు సమాచారం. ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి.  మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్‌ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సిట్‌ రెండు దఫాలుగా కస్టోడియల్‌ విచారణ పూర్తి చేసింది.  

సోషల్ మీడియాలో బాలల లైంగిక దోపిడీకి పాల్పడిన...యూట్యూబర్ అరెస్టు

  సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తూ, అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసిన కేసులో క్రైమ్ నెం.1885/2025గా నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన కంబెటి సత్యమూర్తి (39)* “వైరల్ హబ్” (@ViralHub007) పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, వీక్షణలు మరియు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో మైనర్లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వీడియో లను రూపొందించాడు.  నిందితుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలతో ఇంటర్వ్యూలు నిర్వహిం చాడు. ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన, లైంగికంగా స్పష్టమైన ప్రశ్నలు అడిగేవాడు. కొన్ని వీడియోల్లో మైనర్ పిల్లలను ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని ప్రేరేపించాడు. ఇది బాలల లైంగిక దోపిడీకి సమానమని అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియోల్లో ఉపయో గించిన భాష, ప్రవర్తన పూర్తిగా నీచమైనదిగా, చట్టవిరుద్ధమైనదిగా ఉండటంతో పాటు, పోక్సో చట్టం, ఐటీ చట్టం మరియు ఇతర క్రిమినల్ చట్టాల నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు తేలింది. వీడియోల్లో కనిపించిన మైనర్ల వయస్సు సుమారు 15 నుంచి 17 సంవత్సరాలు గా పోలీసులు అంచనా వేశారు. 2025 అక్టోబర్ 16న ‘వైరల్ హబ్’ యూట్యూబ్ ఛానెల్‌లో బాలల దుర్విని యోగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నట్టుగా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు, సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ ఆధారాల సేకరణ అనంతరం నిందితుడి పాత్రను నిర్ధారించి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కి చెందిన కంబెటి సత్యమూర్తి(39) 2018 నుంచి యూట్యూబర్‌ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మొదట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయె న్సర్‌లతో అసభ్య భాషతో ఇంటర్వ్యూలు నిర్వహించి వ్యూస్ సంపాదించాడు.  ఆ తరువాత మరింత ఆదాయం, ప్రచారం కోసం మైనర్లను లక్ష్యంగా చేసుకుని అత్యంత అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం, లైంగిక సూచనలతో కూడిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా తీవ్రమైన క్రిమినల్ నేరాలకు పాల్ప డ్డట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్ కంటెంట్ కోసం మైనర్లను దోపిడీ చేయడం తీవ్రమైన నేరమని తెలిపారు.  మైనర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేయడం, అనుచిత చర్యలకు ప్రేరేపించడం, అటువంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం శిక్షార్హమని స్పష్టం చేశారు.బాలలపై లైంగిక దుర్వినియోగ కంటెంట్‌ను సృష్టించినా, పంచుకున్నా, ఫార్వార్డ్ చేసినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. పిల్లలపై వేధింపుల కంటెంట్ లేదా ఏదైనా సైబర్ నేరానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజే యాలని సూచించారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

ప్రియురాలి మృతి... ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ప్రియుడు సూసైడ్

  హయత్‌నగర్, యాచారం ప్రాంతాల్లో వరుసగా చోటుచే సుకున్న ఆత్మహత్యలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయ విదారక సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. యాచారం మండలంలో నివాసం ఉంటున్న పూజ (17) అనే బాలిక నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే పూజ మరణించినట్లుగా వైద్యులు దృవీకరించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో  ప్రేమ జంట సిద్ధగోని మహేష్ (20), పూజ(16) గత నాలుగు నెలలుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.  దీంతో ఇటీవలే ఈ ప్రేమ జంట మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం రోజు ప్రియుడు మహేష్ బాలిక పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తీవ్ర మన స్థాపానికి గురైన పూజ మంగళవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పూజ మృతికి కారణం ఆమె ప్రేమ వ్యవహారమేనని బంధువులు ఆరోపిస్తు న్నారు. పూజ, సిద్ధగోని మహేష్‌ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబ సభ్యులకు తెలుసు... పూజ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు.  అయితే పూజ ఆత్మహత్యకు బాధ్యుడిగా మహేష్‌ను పేర్కొంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మహేష్‌ను విచారణకు పిలిచారు.పూజ ఆత్మహత్య చేసుకున్న విషయం  తెలియగానే మహేష్ తీవ్ర మనస్తాపానికి గురై నాడు. పూజ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు లోనైన మహేష్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటిం చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే మహేష్ మృతి చెందాడు..మహేష్, పూజ ఇద్దరూ గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అప్పట్లో కుటుంబ సభ్యులు, పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుబాటు చేసినట్లు సమాచారం. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు ఈ విషా దాంతానికి దారి తీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రేమికులు మరణించడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి..ఈ రెండు ఘటనలపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారంలోని అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత ... కాంగ్రెస్ నేత అరెస్ట్

రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులు ఇళ్లు,కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.  ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల్లో సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేసినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్ కుమార్ అరెస్ట్‌తో  నిజామాబాద్ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక వ్యక్తులకు సిట్ నోటీసులు

తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కుమారుడు సందీప్‌కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోసం వీరిని విచారించ నున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వారు బుధవారం (జనవరి 7) హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, రాజకీయ నేతలు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారం సాగిందన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జారీ చేసిన నోటీసులతో కేసు కీలక దశకు చేరినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అమరావతి వేదికగా ఒలింపిక్స్.. మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను బుధవారం (జనవరి 7) ప్రారంభించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందు కోసం  రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు . ఈ ఏడు గ్రామాల రైతుల నుంచి స్వీకరించే భూమిని అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఒలంపిక్స్ నిర్వహిస్తామన్నారు.   రైతులు భూములపై తీసుకున్న రుణాలను గతంలో రూ.1.5 లక్షల వరకు మాఫీ చేశారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం, నిధులు విడుదల చేయవద్దని వరల్డ్ బ్యాంక్‌కు లేఖలు రాయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు .గ్రామాల్లోని అంతర్గత నిర్మాణాలు, రోడ్‌లు, డ్రైన్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శ్రావణ్ కుమార్ సూచించారు . హరిశ్చంద్రపురం ఈనాం భూముల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని, తాడికొండ నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 3 గ్రామాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని   ఎమ్మెల్యే కోరారు.

బ్లో అవుట్ ప్రాంతంలో తెరుచుకున్న పాఠశాలలు

బ్లోఅవుట్ ముప్పు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా మలికిపురం మండలంఇరుసుమండలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అక్కడ పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు.  ఇరుసుమండలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి.  ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్‌ లో బ్లో ఔట్ సంభవించి భారీగా మంటలు ఎగసిపడిన సంగతి తెలిసిందే. మూడు రోజులు అవుతున్నా మంటలు అదుపులోనికి రాలేదు కానీ, బుధవారం (జనవరి 7) నాటికి మంటల తీవ్రత తగ్గింది.   అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు పూర్తిగా ఆగిపోవడానికి  వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు.  బ్లో అవుట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్‌జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు.  బ్లో అవుట్‌కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాదుర్ కోరారు. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్‌ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. పాత గ్యాస్ పైపులైన్లు మార్చాలని కూడా కోరుతున్నారు.

రాజధాని అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైన రెండో విడత ల్యాండ్ పూలింగ్  బుధవారం (జనవరి 7) మొదలైంది. రాజధాని ప్రాంతంలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడమే ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ లక్ష్యం.   ఈ రెండో విడతలో భాగంగా బుధవారం (జనవరి 7)  యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలోని మూడు గ్రామాలు (వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి)లో 9,097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 ఎకరాల అసైన్డ్ భూమి, అలాగే పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7,465 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు.   ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వచ్చే నెల 28 నాటికి పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   ఈ ప్రక్రియ పారదర్శకంగా, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయనున్నారు.  

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు రేపటితో ముగింపు

తిరుమల పుణ్యక్షేత్రంలో గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం (జనవరి 8)తో  ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని, గత ఏడాది డిసెంబర్ 30నుంచి భక్తులకు టీటీడీ  ఉత్తర ద్వార దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే.  శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు  ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన  తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం (జనవరి 8) అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య  ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది. కాగా ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించిన పది రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఎల్లుండి నుంచి తిరుమల కొండపై   బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలు   ప్రారంభం కానున్నాయి.

పోలవరం సందర్శించిన సీఎం చంద్రబాబు.. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును బుధవారం (జనవరి 7) సందర్శించారు.  ఉదయం   ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన  ప్రాజెక్టు వద్దకు చేరున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనుల వేగం పెరిగిన సంగతి తెలిసిందే.      2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.   కాగా ప్రాజెక్టు పనులు ఇప్పటికే 88 శాతం మేర పూర్తి అయ్యాయి.  చంద్రబాబు పోలవరంప్రాజెక్టు సందర్శనలో భాగంగా  ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బట్రస్ డ్యామ్, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వంటి పనులను ఆయన తనిఖీ చేశారు.  అనంతరం జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి,  ప్రాజెక్టు పనులు, కుడి, ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై చర్చించి, తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత అక్కడే అధికారులతో సమీక్ష  నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై వివరించే అవకాశం ఉంది. 

బీసీబీకి ఐసీసీ షాక్

భారత్ లో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  (బీసీబీ) విజ్ణప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  (ఐసీసీ)నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. టి20 వరల్డ్ కప్ లో తమ దేశం ఆడే మ్యాచ్ లను భారత్ వెలుపల నిర్వహించాలంటూ బీసీబీ ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు నిరాకరించిన ఐసీసీ బంగ్లాదేశ్ జట్టు  భారత్‌కు వచ్చి ఆడాల్సిందేనని, లేకుంటే ఆయా మ్యాచ్‌ల పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఐసీసీ తమ విజ్ణప్తిని తోసిపుచ్చిందన్న అధికారిక సమాచారం తమకు అందలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంటోంది.  బంగ్లాదేశ్‌లో  హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్న  నేపథ్యంలో  ఇరు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ లో బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్‌ రహమాన్‌ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ టి20 వరల్డ్ కప్ లో భారత్ లో ఆడబోమంటూ ఐసీసీని ఆశ్రయించింది. భారత్ లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన ఉందంటూ బీసీబీ  పేర్కొంది. ఈ విషయంలో గతంలో పాకిస్థాన్ విషయంలో అనుసరించిన తటస్థ వేదిక విధానాన్ని తమకూ వర్తింప చేయాలని విజ్ణప్తి చేసింది. అయితే ఆ విజ్ణప్తిని ఐసీపీ తిరస్కరించింది.  

కొలిక్కివస్తున్న ఎల్బీఎఫ్ కేసు.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'(ఎల్బీఎఫ్) సంస్థ మోసం కేసులో  విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ , ఉద్యోగ అవకాశాలు అంటూ ఆశచూపి.. ఇన్వెస్ట్ మెంట్ల పేర  ప్రజల నుంచి 21.37 కోట్ల రూపాయలు అక్రమంగా  వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.  ఈ సంస్థ వలలో పడి  1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే  అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా  విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా  ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో కొందరు తాము పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తంలో లాభాల రూపంలో పొందారని పోలీసులు గుర్తించారు. ఇలా అదనంగా లబ్ధిపొందిన వారిని పిలిపించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.  పెట్టుబడి పెట్టిన దాని కంటే అదనంగా వచ్చిన సొమ్మును అప్పగించాలని వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా వసూలు చేసిన సొమ్మును బాధితులకు పంపిణీ చేసేందుకు పోలీసులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.  ఇప్పటికే సంస్థ బ్యాంకు ఖాతాలు, లావాదేవీల రికార్డులను సీజ్ చేసిన పోలీసులు, అక్రమంగా ఆర్జించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు.  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపెనీ నిర్వాహ‌కులైన శివానీ దంపతులు లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ , ఉద్యోగ అవకాశాలు ఎర చూపి భారీగా ప్రచారం చేయడంతో  జ‌నం పెద్ద ఎత్తున ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు.  తొలుత చెప్పినట్లుగానే అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ ఇచ్చిన సంస్థ నిర్వాహకులు.. ఆ తరువాత  ఇస్తామ‌న్న సొమ్ము ఇస్తామ‌న్న స‌మ‌యానికి ఇవ్వ‌క పోవ‌డంతో ఖాతాదారులు తిర‌గ‌బ‌డ్డారు. దీంతో ఈ వ్య‌వ‌హారం పోలీసు స్టేష‌న్ మెట్లెక్కింది.  

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తమిళనాడుకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారానికి (జనవరి 7)   వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.  ఈ వాయుగుండం ప్రభావంతో  తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే తమిళనాడుతో పాటు  పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.  కాగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండే అవకాశాలు లేవని పేర్కొంది. ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందనీ, అదే సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయనీ పేర్కొంది.  అయితే వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతుందని పేర్కొంది.