మెక్సికోలో కుప్పకూలిన విమానం.. పది మంది దుర్మరణం

మెక్సికోలో  జరిగిన విమాన ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ చిన్న విమానం మెక్సికో ఎయిర్ పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పది మందీ దుర్మరణం పాలయ్యారు. విమానం కూలిపోగానే మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పోగకమ్ముకుంది.  విమానం క్రాష్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  మెక్సికోకి 50కిలోమీటర్ల దూరంలోని టోలుకా ఎయిర్‌పోర్టు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఒక చిన్న ప్రైవేట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఓ భవనాన్ని ఢీకొని కూలిపోయింది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ ప్రైవేటు జెట్ లో ప్రమాద సమయంలో ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.   ప్రమాదం ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.   ఈ విమాన ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. 

బీబీసీపై 90 వేల కోట్టకు ట్రంప్ పరువునష్టం దావా..

ప్రఖ్యాత మీడియా సంస్థ  బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి.. తాను చెప్పని మాటలను మాట్లాడినట్లుగా బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించిన ట్రంప్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. బీబీసీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, ఇది జర్నలిజం విలువలకు  విఘాతమనిపేర్కొన్న ట్రంప్ బీబీసీపై 90 వేల కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు.  తాను ఎన్నడూ అనని  ఎ  మాటలను ఏఐ వినియోగించి.. తన నోట పలికినట్లు వినిపించి, చూపించారని తీవ్ర ఆరోపణలు చేశారు.  జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి, తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు. బీబీసీ ఫేక్ న్యూస్ ప్రసారం చేసిందన్న ట్రంప్.. ఈ దావా వేశారు. 

అవినీతి కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ

అద్భుత క్రికెటర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అవినీతి కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు. 1996లో శ్రీలంక వరల్డ్ కప్ విజయంలో రణతుంగది కీలక పాత్ర. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు  కెప్టెన్  అయిన రణతుంగ  క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు.  రణతుంగ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలపైనే ఆయనపై కేసు నమోదైంది. అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రణతుంగ స్వదేశానికి తిరిగి రాగానే అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.   కేసు వివరాల్లోకి వెడితే 2017లో రణతుంగ పెట్రోలియం మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో దీర్ఘకాలిక చమురు కొనుగోలు ఒప్పందాల నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరకు స్పాట్ పద్ధతిలో  కొనుగోళ్లు జరిపారనీ, దీనితో  ప్రభుత్వానికి దాదాపు  23.5 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ తేల్చింది.ఈ కేసులో ఇప్పటికే రణతుంగ సోదరుడు ధమ్మికను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు.   

ఉసురు తీసిన పొగమంచు

ఒకదాని వెనుక ఒకటిగా వాహనాలు ఢీ కొనినలుగురు మృతి పొగమంచు కమ్మేయడంతో విజిబులిటీ తగ్గిపోయి ఢిల్లీ-ఆగ్రారోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. దారి కనిపించక పదుల సంఖ్యలో వాహనాలు  ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.   దుర్ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో పాతిక మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.   మథుర జిల్లా పరిధిలోని ఆగ్రా-నోయిడా మార్గంలో మంగళవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ఒకదాని వెనుక ఒకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

తెలుగు వారికి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఆయన : సీఎం చంద్రబాబు

  తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా 'డే ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల దినం)గా  నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు  ప్రకటించారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మిస్తామని వెల్లడించారు.  సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం, ఆ తరువాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని ముఖ్యమంత్రి అన్నారు.  పాలకుల వివక్షకు గురైన తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన త్యాగ ఫలితంగానే 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. కొందరు ఈ తేదీలపై అనవసర రాజకీయాలు చేస్తున్నందునే, ఆయన ఆత్మార్పణ చేసిన రోజునే త్యాగాలకు గుర్తుగా నిర్వహించాలని నిర్ణయించాం” అని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాములు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, గుండె చప్పుడు అని ఆయన కొనియాడారు.  

ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు

  ఏపీ మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌కి బెయిల్‌ ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో సంజయ్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయాల్లో ఆయన ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మాత్రం ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా ఐపీఎస్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం సంజయ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది.

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు

  పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఈ-తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్  ఉగ్రసంస్థతో పాటు మరో ఆరుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ కుట్ర, నిందితుల పాత్రలు, ఆధారాలతో కూడిన ఈ ఛార్జిషీట్‌లో నిషేధిత ఉగ్రసంస్థను ఒక చట్టబద్ధ సంస్థగా గుర్తించి, పహల్గామ్ దాడిని ప్రణాళికాబద్ధంగా రూపొందిం చడం, సహకరిం చడం, అమలు చేయడంలో వారి పాత్ర ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.  పాక్ మద్దతు తో జరిగిన ఈ ఉగ్రదాడిలో మత ఆధారిత లక్ష్య హత్యలు చోటు చేసుకోగా, 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పో యారు.1,597 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్‌ను జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఇందులో పాకిస్థాన్ హ్యాండ్లర్ ఉగ్రవాది సజీద్ జట్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. అలాగే, 2025 జూలైలో శ్రీనగర్‌లోని డాచిగాం ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పొందుపరి చారు.  వారు ఫైసల్ జట్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. తో పాటు పై నలుగురు ఉగ్రవాదులపై భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం–1959, అక్రమ కార్య కలాపాల నివారణ చట్టం 1967 కింద అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా, భారత్‌పై యుద్ధం ప్రకటించిన నేరం కింద కూడా శిక్షార్హ సెక్షన్లను ఎన్‌ఐఏ ప్రయోగించింది. గత దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన శాస్త్రీయ, సుదీర్ఘ దర్యాప్తులో కేసులోని ఉగ్ర కుట్ర పాకిస్థాన్ నుంచే రూపుదిద్దుకున్నదని ఎన్‌ఐఏ తేల్చింది.  భారత్‌పై నిరంతరం ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది.ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై 2025 జూన్ 22న అరెస్టయిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జొథాత్ద్‌లపై కూడా ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో వారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఆయుధధారుల వివరాలు వెల్లడించడంతో పాటు, వారు నిషేధిత  ఉగ్రసంస్థకు చెందిన పాకిస్థాన్ పౌరులేనని నిర్ధా రించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.

కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

  సీఎం చంద్రబాబు  హైదరాబాద్ నగర శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కన్హా ధ్యానమందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు. కన్హాశాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాలను గురించి సీఎంకు దాజీ వివరించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా  చంద్రబాబు సందర్శించారు. ధ్యాన మందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన, సామర్థ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాజీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతోన్న సేవలు, నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు.

హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : సీపీ సజ్జనర్

  ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ట్రాన్స్‌జెండర్ల ను హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సిపి వారికి సూచించారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర సీపీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ పాల్గొని ట్రాన్స్‌ జెండర్లతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనర్ మాట్లాడుతూ... ట్రాన్స్‌జెండర్ల మధ్య తరచూ చోటుచేసుకునే గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ ప్రాణనష్టానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు పెరిగాయని తెలిపారు.ముఖ్యంగా “శుభకార్యాల పేరుతో ఇళ్లపైకి వెళ్లి యజమా నులను వేధించడం సరికాదు. ఇలాంటి బలవంతపు వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు,” అంటూ సిపి సజ్జనార్ హెచ్చరించారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీపీ గుర్తు చేశారు. వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే సమగ్ర పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్‌జెండర్లకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ  సిన్హా మాట్లాడుతూ.... ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికే మహిళా భద్రతా విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరి నుంచి వేధింపులు ఎదురైనా నిర్భయంగా ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు.  చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అదనపు డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పని సరిగా పొందాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇకబాల్, ఐపీఎస్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రతా విభాగ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ సృజన, తదితర ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

హెల్మెట్ ధారణపై ప్రజలు స్వీయ బాధ్యత కలిగి ఉండాలి : కలెక్టర్

  హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడితో కలసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా నో హెల్మెట్ - నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు ఇవ్వడం ఉండదని తెలిపారు.  రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వాహనాలు నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు భాద్యతగా హెల్మెట్ ధరించాలని, వారు భాధ్యత విస్మరించినట్లైతే వారి ప్రాణాలు కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వం నిర్భంద చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. తిరుపతి పట్టణం అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, ఇటువంటి పట్టణాలలో చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రూపొందించుటకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.           జిల్లా ఎస్ పి మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ భాధ్యత అని అన్నారు.  హెల్మెట్ ధరించడం పై అవగాహన కల్పించడంలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించడం జరుగిందన్నారు. ద్విచక్ర వాహనాదారులు చిన్న ఆక్సిడెంట్ ల కూడా తలకు బలమైన గాయాల కారణంగా మరణిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో ఏ ఎస్ పి లు రవి మనోహరాచారి, డి శ్రీనివాసరావు,నాగభూషణం, డీఎస్పీలు, సిఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల దందా.. ముగ్గురు యువకుల మృతి

  పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల అక్రమ దందా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.  చాలామంది యువకులు అనస్థీషియా డ్రగ్స్‌ను మత్తుగా వినియో గిస్తున్న ఘటనలు పెరుగు తుండటంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అనస్థీషియా మత్తు ఇంజక్షన్లు తీసుకున్న ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. మత్తు ఇంజక్షన్ల ఓవర్‌డోస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని పోలీసులు స్పష్టం వ్యక్తం చేశారు. డబ్బుల కక్కుర్తితో కొందరు డాక్టర్లు అనస్థీషియా మత్తు ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కో ఇంజక్షన్‌ను వెయ్యి రూపాయల చొప్పున యువకులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు ఎక్కువగా ఈ మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ అక్రమ దందా వ్యవహా రాన్ని పోలీసులు నిర్వహిం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పలువురు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ మత్తు మందుల నెట్‌వర్క్‌ను ఛేదించారు.ఈ కేసులో ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు డాక్టర్లు, నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  మత్తు ఇంజక్షన్ల సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ దందా జోరుగా సాగుతుందని... మత్తు ఇంజక్షన్ల దందాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికి ఈ మత్తు ఇంజక్షన్ల అధిక మోతాదులో తీసుకోని ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి...ఈ ఘటనపై సీరియస్ అయినా పోలీసులు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి... నిందితు లను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

చనిపోతున్నాననుకుని సిడ్నీ హీరో ఆఖరి సందేశం

  ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో తండ్రీకొడుకులైన ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ ఇప్పుడు రియల్ హీరోగా నిలిచారు. పండ్ల దుకాణం నడుపుకునే సాధారణ వ్యక్తి అయిన అహ్మద్‌.. తుపాకీ కాల్పుల మధ్య ఉగ్రవాదిని ధైర్యంగా అడ్డుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ పోరాటం మధ్యలో ఆయన తన బంధువుతో.. "నేను చనిపోతున్నా. నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని పంపిన చివరి సందేశం యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.  ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు. ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. తండ్రీకొడుకులైన ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న అహ్మద్‌ అల్‌ అహ్మద్‌‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రదాడి జరుగుతున్న సమయంలోనే అతడు.. ఈ పోరాటంలో నేను మరణిస్తాననిపిస్తోందని, ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలియజేయాలని పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. ఆయన చేసిన ఈ చివరి మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. సిరియా దేశానికి చెందిన అహ్మద్‌ అల్‌ అహ్మద్‌.. నిత్యం అంతర్యుద్ధాలతో నలిగిపోయే తన దేశాన్ని వీడి మెరుగైన భవిష్యత్తు కోసం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్‌ షైర్‌లో భార్యాపిల్లలతో (ఇద్దరు చిన్న పిల్లలు) కొత్త జీవితాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఒక పండ్ల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అహ్మద్.. తన సాధారణ జీవితంలో ఊహించని హీరోగా మారారు. ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన ఆదివారం ఉదయంబోండి బీచ్‌లో తన బంధువు జోజీ అల్కాంజ్‌తో కలిసి అహ్మద్‌ కాఫీ షాప్‌లో ఉన్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వారు భయపడిపోయారు. అయితే వెంటనే తేరుకున్న అహ్మద్‌.. ఉగ్రవాదులను చూసి వారిని ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఏం జరగబోతోందో తెలిసిన ఆయన.. తన బంధువు అల్కాంజ్‌తో ఇలా అన్నారు: "నేను చనిపోబోతున్నా. నా కుటుంబాన్ని చూసుకో. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని తన చివరి సందేశాన్ని ఇచ్చారు. ఈ హృదయ విదారక విషయాన్ని అల్కాంజ్ మీడియాకు వెల్లడించారు.ఈ ఘటన సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్‌ అడ్డుకున్నారు. వెనుక నుంచి వెళ్లి ధైర్యంగా ఆ దుండగుడి చేతిలోని తుపాకీని లాక్కున్నారు.  దీంతో ఆ ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఉగ్రవాదిని అడ్డుకునే ప్రయత్నంలో అహ్మద్‌ గాయపడగా.. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు. అహ్మద్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బోండి బీచ్‌ ఉత్సవంలో జరిగిన ఈ కాల్పుల దుర్ఘటనలో 16 మంది మరణించారు. కాల్పులు జరిపినవారు పాకిస్థాన్ నుంచి వచ్చిన తండ్రీకొడుకులని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

    హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 సాంగ్స్‌తో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.  

వారానికి నాలుగు పనిదినాలు.. మూడు వీక్లీ ఆఫ్‌లపై చర్చ!

జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ ల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి? లేబర్ కోడ్స్ సూచిస్తున్న మేరకు ఆ దిశగా నిబంధనల అమలు సాధ్యమేనా? అన్న చర్చ నడుస్తోంది. ప్రతీ ఉద్యోగికి జీతం పడే రోజు ఎంత ముఖ్యమో.. వీక్లీ ఆఫ్ కూడా అంతే ముఖ్యం. వారం మొత్తం గొడ్డులా పని చేసిన ఉద్యోగులు వీక్లీ ఆఫ్ అదేనండీ వారాంతపు సెలవు  కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. చాలా వరకు ప్రభుత్వ, కార్పొరేట్ ఆఫీసుల్లో వారానికి రెండు వీక్లీ ఆఫ్ లు ఉంటాయి. ఐదు రోజులు కష్టపడ్డ ఉద్యోగులు రెండు రోజులు సెలవు  తీసుకుంటారు. కొంతమంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజుల పని దినాలు.. మూడు వీక్లీ ఆఫ్ లు ఉంటే బాగుండును అనుకుంటున్నారు. జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ లపై  చర్చ మొదలైంది. డిసెంబర్ 12వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ తనఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో వారానికి నాలుగు రోజుల పని దినాలపై చర్చించింది.  మిత్ బస్టర్  పేరిట ఆ పోస్టు పెట్టింది. వారానికి నాలుగు రోజుల పని దినాలపై ఉన్న అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త లేబర్ కోడ్ ప్రకారం వారానికి నాలుగు రోజులు వీక్లీ ఆఫ్ లు కావాలంటే.. మిగిలిప  నాలుగు రోజులూ  రోజూ 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే  మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడేస్ వస్తాయి. 12 గంటల్లో ఇంటర్వెల్ కూడా ఉంటుంది. వారానికి పని గంటలు 48 గంటలుగానే కొనసాగుతాయి. రోజులో సాధారణ పని గంటల కంటే ఎక్కువ పని చేస్తే జీతాన్ని డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.  2025, నవంబర్ 21వ తేదీన భారత ప్రభుత్వం 29 పాత లేబర్ లాస్‌ను తొలగించింది. కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్‌  తీసుకుని వచ్చింది. కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్ కోడ్ 2020లను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల ఉద్యోగుల వర్క్‌ప్లేస్ రైట్స్‌ను కాపాడ్డానికి ఈ కొత్త లేబర్ కోడ్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో పిటిషన్‌

  జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్ సేనరెడ్డి విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్‌ పిటిషన్‌లో తెలిపారు.   డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. అనంతరం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు బల్ధియా ప్రత్యేక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు.   ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయిని  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.   

శ్రీవారికి విరాళాలిచ్చేభ‌క్తుల‌కు టీటీడీ అందించే సౌకర్యాలేంటో తెలుసా?

తిరుమల వెంక‌టేశ్వ‌ర స్వామివారికి రూ. 1లక్ష నుంచి.. రూ.1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందజేస్తున్నది.   తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన,వసతి, ప్రసాదం వంటి పలు అవకాశాలను కల్పిస్తోంది. విరాళం మొత్తాన్ని బ‌ట్టి భక్తులకు అందే సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి.   1లక్ష రూపాయల నుంచి   5 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులు, ఆ విరాళానికి సంబంధించిన నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువీకరణ పత్రం,1 రోజు ఐదుగురికి సుపథం దర్శనం, అలాగే వంద రూపాయల టారిఫ్ ఒక రోజు వసతి కల్పించడంతో పాటు, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ టీటీడీ ఇస్తుంది.   అలాగే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక ఏడాదిలో 3 రోజులు  ఐదుగురికి   సుపథం దర్శనం,  వంద రూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు,  ఒక దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఇక 10లక్షల రూపాయల నుంచి  పాతిక లక్షల రూపాయల వరకూ విరాళం  ఇచ్చే వారికి నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఏడాదిలో మూడు రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,   అలాగే వెయ్యిరూపాయల టారిఫ్ తో  3 రోజుల వసతి కల్పించడంతో పాటు,  20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ తో పాటు  50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం టీటీడీ అంద జేస్తుంది.  అలాగే పాతిక లక్షల నుంచి  50 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు ధృవీకరణతో పాటు ,  ఏడాదిలో ఒక రోజు  ఐదుగురికి  మందికి సుపథం దర్శనం, 3 రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,  1500  రూపాయల టారిఫ్ తో   3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక  బ్లౌజ్ పీస్ టీటీడీ అందిస్తుంది.  ఇక పోతే.. 50 లక్షల నుంచి  75 లక్షల రూపాయల విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ + పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక రోజు సుప్రభాత సేవ, 5 గురికి రెండు రోజులు  సుపథం దర్శనం, ఐదుగురికి, మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి రూ.2000 టారిఫ్‌తో మూడు రోజుల వసతి, 10 చిన్న లడ్డూలు, పది పెద్ద లడ్డూలు, పది మహా ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందిస్తుంది. ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు, రెండు రోజులు సుప్రభాత సేవ-, ఐదుగురికిమందికి, 3 రోజులు సుపథం దర్శనం- ఐదుగురికి 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి  రూ.2500 టారిఫ్‌తో 3 రోజుల వసతి,  8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెంతో  పాటు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందజేస్తుంది. కోటి రూపాయలు అంత కన్నా  ఎక్కువ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, పన్నుమినహాయింపు దృవీకరణ,  ఏడాదిలో 3 రోజులు ఐదుగురికి సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి నాణెం, దుపట్టా, జాకెట్ పీస్ సహా పలు అదనపు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది.  

నూతన సీఐసీగా రాజ్‌కుమార్ ప్రమాణ స్వీకారం

  నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాజ్‌కుమార్‌తో పాటు మరో 8 మందిని సమాచార కమిషనర్లుగా సిఫార్సు చేశారు. 9 ఏళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంలో పనిచేయనుంది.  ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ సహా పలువురు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ రాజ్‌కుమార్‌ గోయల్‌ పేరును ప్రతిపాదించింది.  రాజ్‌కుమార్‌ గోయల్ 1990 బ్యాచ్​ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. హోం శాఖలో కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ)గా కూడా పనిచేశారు. కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్​లోనూ కీలక పదవులను నిర్వహించారు.

సిడ్నీలో ఉగ్రఘాతుకం.. నిందితులు పాక్ కు చెందిన తండ్రీకొడుకులు

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ లో జరిగిన నరమేథం ఉగ్రదాడేనని తేలింది. ఐసీస్ తో సంబంధాలున్న పాక్ జాతీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.  యూదులు లక్ష్యం వారు హనూకా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాకిస్థాన్ జాతీయులైన తండ్రీ కొడుకులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తేలింది. కాల్పులకు తెగబడ్డవారిని   నవీద్ అక్రమ్, అతడి తండ్రి సాజిద్ అక్రమ్ గా రక్షణ బలగాలు గుర్తించాయి. వీరిరువురూ పాక్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించాయి. భద్రతాదళాల కాల్పుల్లో నవీద్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఓ హంటింగ్ క్లబ్‌లో సభ్యుడైన అతడి తండ్రి సాజిద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. సాజిద్ పేరిట 2015 నుంచి గన్ లైసెన్స్ ఉందని తేలింది. సాజిద్ వద్ద ఉన్న ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ తండ్రీకొడుకులు జరిపిన దాడిలో16 మంది మరణించగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.  ఇలా ఉండగా నిందితుల్లో ఒకరు చాలా కాలంగా ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘాలో ఉన్నట్లు చెబుతున్నారు.  కాల్పుల ఘటన తరువాత జరిపిన సోదాలలో వీరి కారులో  ఐసీస్ నల్లజెండాలు లభ్యమయ్యాయి. కాగా వీరిని ఓ సామాన్యుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి నిందితులను అడ్డుకున్న వ్యక్తిని 43 ఏళ్ల అహ్మద్ గా గుర్తించారు,  ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్‌ రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.  ఇక పోతే   కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరూ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నా వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం డిసెంబర్ 14) రాత్రి వారి నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా  నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది.