లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ బాబా అరెస్ట్

  విద్యార్ధులను లైంగిక వేధించిన కేసులో చైతన్యానంద సరస్వతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని ఇవాళ తెల్లవారుజామున ఆగ్రాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నైరుతి ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  చైతన్యానంద సరస్వతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.  మార్చి 2025లో ఒక విద్యార్థి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు సందర్భంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మొత్తం 17 మంది విద్యార్థినులపై వేధింపులు జరిగినట్టు తేలడంతో, చైతన్యానంద పారిపోయాడు. అరెస్టు తప్పించుకోవడానికి చైతన్యానంద ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. కానీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు దాన్ని తిరస్కరించింది.  విచారణలో అతను తాను ఐక్యరాజ్యసమితి ప్రతినిధినని చెప్పుకున్నాడని పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ కేసు నేపథ్యంగా, చైతన్యానందకు చెందిన 18 బ్యాంకు ఖాతాలు, రూ.8 కోట్లు, 28 ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్తంభింపజేశారు. ఈ నిధులు అతను పార్థసారథి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌తో ముడిపడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థినులు ఫిర్యాదులో, రాత్రిపూట తమను బలవంతంగా చైతన్యానంద గదికి పిలిపించి శారీరక సంబంధానికి ఒత్తిడి చేసేవాడని చెప్పారు.  హాస్టల్ గదుల్లో సీసీటీవీలు అమర్చడం, విదేశీ పర్యటనలకు బలవంతం చేయడం, నకిలీ వాహన నంబర్ ప్లేట్లు వాడటం, మతాన్ని కవచంగా చేసుకుని మోసాలు చేయడం వంటి అంశాలు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఒక విద్యార్థిని తనను బలవంతంగా మధురకు తీసుకెళ్లారని పేర్కొంది. ఈ ఆరోపణలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, స్వామి చైతన్యానందపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.  వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్‌స్వామి,  చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. గ‌రుడ వాహ‌నం సాయంత్రం 6:30 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.  

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వన్యప్రాణులు

  ఎయిర్ పోర్ట్ లో అధికారులేకాక మరెవరికి కూడా ఎటువంటి అనుమానం కలగదని భావిస్తారో ఏమో తెలియదు కానీ... ఈ స్మగ్లర్లు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వారి ఎత్తులను చిత్తు చేస్తూ అధికా రులు ఎంతో చాక చక్యంగా వారిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో ఉన్న వాటిని చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు.... చివరకు ప్రయాణికుడిని అదుపులోకి తీసు కొనిజైలుకు పంపారు.  బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఓ వ్యక్తి అటు... ఇటు చూస్తూ  కంగారుగా నడుచుకుంటూ వెళ్తుండగా కస్టమ్స్ అధికారులకు అతనిపై అను మానం కలిగింది... దీంతో అధికారులు వెంటనే అతన్ని ఆపి అతని బ్యాగును తెరిచి చూసి....షాక్ కు గురయ్యారు... బ్యాగులో వన్యప్రా ణులు ఉన్నాయి... ఎయిర్ పోర్ట్ లో ఉండే కస్టమ్స్ అధికారులకు ఎటువంటి అనుమానం కలగకుండా.... ఈ ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి  వన్యప్రాణు లను బ్యాగ్ అడుగు భాగంలో పెట్టుకొని  శంషాబాద్ ఎయి ర్పోర్ట్ కు వచ్చాడు.  కానీ చివరకు అధికారుల చేతికి చిక్కాడు. అధికా రులు అతన్ని అదుపులోకి తీసు కొని అతని వద్ద నున్న ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తెల్ల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువాన, 12 ఇగువానాస్ స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం అధికారులు ఈ వన్య ప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు తర లించారు. ప్రయాణి కుడిని అరెస్టు చేసి... ఇతను హైదరా బాద్‌కు వన్యప్రాణు లను ఎందుకు తీసుకో వచ్చాడు? ఎవరి కోసం తీసుకోవ చ్చాడు? అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

తమిళనాడు తొక్కిసలాటపై నలుగురిపై కేసు నమోదు

  తమిళనాడు కరూర్‌లో విజయ్‌ టీవీకే వ్యవస్థాపకుడు నిర్వహించిన ర్యాలీకి అనుమతులు 10,000 మందికే తీసుకున్నట్లు డీజీపీ జి. వెంకట్రామన్‌ వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కారణంగా ఫ్యాన్స్ ముందుగానే భారీ సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. రాత్రి 7.30 గంటలకు విజయ్‌ రాకముందే జనసందోహం ఏర్పడి తొక్కిసలాట జరిగింది.  అధికారులు ఈ కార్యక్రమానికి 1.2 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించినప్పటికీ, ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. ఘటన స్థలానికి వెంటనే 2,000 మంది సిబ్బంది, సీనియర్‌ పోలీసు అధికారులను పంపించామని, ఒకే సభ్య కమిషన్‌తో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. విజయ్‌ సహాయకులపై కేసు ఈ ఘటనలో విజయ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ నిర్మల్‌ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీ ఎస్‌. డేవిడ్‌సన్‌ ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే మెగాస్టారక సినీ నటుడు చిరంజీవి ఎక్స్‌లో స్పందిస్తూ – “కరూర్‌ ర్యాలీ దుర్ఘటన బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని పేర్కొన్నారు.

తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులోని కరూర్‌లో తన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విజయ్‌ పేర్కొన్నారు. తమిళనాడు కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది.  ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విజయ్‌ సభకు మధ్యాహ్నం చేరుకోవాల్సి ఉండగా, ఆరు గంటల ఆలస్యంగా రాత్రి వేళ ర్యాలీకి హాజరయ్యారు. ఈలోపు భారీ సంఖ్యలో జనాలు కూడగట్టుకోవడంతో అనూహ్య పరిస్థితి ఏర్పడింది.  విజయ్‌ ప్రసంగం ప్రారంభమైన క్షణాల్లోనే ఆయనను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంతో కొందరు ముందుకు దూసుకెళ్లారు. ఫలితంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన స్ధలికి వెళ్లాలా? వద్ద అనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు. అక్కడికి వెళ్లే వచ్చే  వచ్చే సెక్యూరిటీ సమస్యలు, వెళ్లకపోతే ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎలా ఎదర్కోవాలనే దానిపై  పార్టీనేతలతో చర్చిస్తున్నారు  

ఈనెల 30న సద్దుల బతుకమ్మ... ప్రభుత్వం కీలక నిర్ణయం

  రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందాయి. తెలుసుకున్నట్లుగా, ఈ నెల 21వ తేదీ ఆదివారం చిన్న బతుకమ్మ జరుపుకున్నారు. సాధారణంగా చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ మధ్య తొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన 29వ తేదీ సోమవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని కొందరు భావించగా, మరికొందరు 30వ తేదీ మంగళవారం జరుపుకోవాలని సూచించారు. పూజారులు కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక మరోవైపు, అక్టోబర్ 2న దసరా పండుగ జరుపుకోనున్నారు. అయితే అదే రోజు గాంధీ జయంతి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం నిషేధం అమలులో ఉండనుంది.

ప్రాణం తీస్తోన్న అభిమానం

  చాలా మంది అంటుంటారు.. నువ్వంటే నాకు చ‌చ్చేంత అభిమాన‌మ‌ని. అది ఇదే. మ‌నం ఇటు హీరోలు, క్రికెట‌ర్లు కానీ, అటు దేవుళ్ల‌ను, లేదా ఇత‌ర‌త్రా కొన్ని కొన్ని విష‌యాల ప‌ట్ల పెంచుకునే అభిమానం కాస్తా ఇదిగో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. మొన్నంటే మొన్న త‌మ అభిమాన జ‌ట్టు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు ఐపీఎల్ క‌ప్పు కొట్టింద‌న్న ఒకే ఒక్క ఆలోచ‌న‌తో స్టేడియంకి వెళ్లి ఎంద‌రు చ‌నిపోయారో తెలిసిందే. ఈ మ‌ర‌ణాల విషాదం మ‌ర‌వ‌క ముందే మ‌రో తీవ్ర విషాదం. ఇప్పుడు చూస్తే ఇద‌య ద‌ళ‌ప‌తిగా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే విజ‌య్ స‌భ‌కు వ‌చ్చిన వాళ్లు ఏకంగా 38 మంది స్పాట్ డెడ్ కాగా.. మ‌రి కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే క‌రూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు శోక సంద్రంలో మునిగిపోయింది. త‌మ త‌మ ఆశాజ్యోతులు ఆరిపోవ‌డంతో వారంతా క‌ల‌సి దీనంగా రోదిస్తుంటే.. దీనంత‌టికీ కార‌కుడైన విజ‌య్ కేవ‌లం ఒక గుండె ప‌గిలింద‌న్న ప్ర‌క‌ట‌న‌తో స‌రి పెట్టేశాడు. ఆ మాట‌కొస్తే మొన్నటి బెంగ‌ళూరు స్టేడియం ఘ‌ట‌న‌లో ఒక తండ్రి కొడుకును ఖ‌న‌నం చేసిన చోట నుంచి క‌ద‌ల‌కుండా ఏడ్చిన ఏడుపులు ఇప్ప‌టికీ క‌ర్ణాట‌క వాసుల గుండెల‌ను మెలిపెడుతూనే ఉన్నాయి. దేశ‌మంత‌టా కూడా ఆ తండ్రి దుఃఖం తీవ్రంగా లోచింప చేసింది. ఎవ్వ‌రూ కూడా ఆయ‌న క‌డుపుకోత‌కు మందు పూయ‌లేక పోయారు.    ఏం అభిమాన‌మిది? కోహ్లీ వ‌చ్చి ఆ తండ్రికి త‌న బిడ్డ‌ను అందివ్వ‌గ‌ల‌డా? ఇప్పుడు విజ‌య్ ప‌రిస్థితి కూడా అంతే ఏడుగురు చిన్న‌పిల్లలు చ‌నిపోయారు. ఒక సినిమా చేస్తే విజ‌య్ కి వంద కోట్ల‌యినా తిరిగి వ‌స్తాయోమో గానీ వీరి ప్రాణాలు తిరిగి తీసుకురావ‌డం సాధ్య‌మా? ఇటు పెద్ద‌ల‌కు కూడా బుద్ధి పాడు లేకుండా పోయింది. పిల్ల‌ల‌న్నాక సినిమా హీరోల‌ను ద‌గ్గ‌ర్నుంచి చూడాల‌ని మారాం చేస్తుంటారు. అలాగ‌ని ఇంత కిక్కిరిసే స‌భ‌లు త‌మ పిల్లా జెల్లా వెంట వేసుకుని రావ‌డ‌మేంటి?  పుష్ప 2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట సంగ‌తి స‌రే స‌రి. ఆ త‌ల్లీ కొడుకుల జీవితాలు ఆగ‌మై పోయాయి. ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. ఇప్పుడా తల్లి చ‌నిపోయిన కుర్రాడి ప‌రిస్థితేంటి? జీవిత‌మంతా ఆ త‌ల్లిలేని లోటుతో పాటు.. వెన్నంటే వ‌చ్చే ఆ విషాద జ్ఞాప‌కాలు, అది తెచ్చిన విప‌త్తును ఒక జీవిత కాల భారంగా భ‌రించాల్సిందేగా? దీనంత‌టికీ కార‌ణం పైసాకు ప‌నికిరాని అభిమానం. స‌రే ఇక్క‌డంటే మీరు సినిమా హీరోల‌ను ఆడి పోసుకుంటున్నారు. మ‌రి దేవుళ్ల ప‌రిస్థితేంటి? ఆయా ఉత్స‌వాలు, కుంభ‌మేళాల్లో పోయిన ప్రాణాలు ఎవ‌రి ఖాతాలో వేయాలి? అని అడిగే వారుండొచ్చు. ఇటీవ‌ల రెండు మూడు విషాద వార్త‌లు. ఒక‌టి తిరుమ‌ల శ్రీవారి వైకుంఠ ఏకాద‌శి తొక్కిస‌లాట కాగా, మ‌రొక‌టి సింహాచ‌లం అప్ప‌న్న గోడ కూలిన ఘ‌ట‌న‌.  ఇక కుంభ‌మేళా సంగ‌తి స‌రే స‌రి. ప‌విత్ర స్నానాల కోస‌మ‌ని వెళ్లిన వారు.. పై లోకాల‌కు చేరిపోయారు. కొంద‌రైతే తిరిగొస్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.   జ‌నం ఎక్కువ‌గా పోగ‌య్యే ఏ ప్రాంత‌మైనా స‌రే.. ఇదే ప‌రిస్థితి. ఎప్పుడేం జ‌రుగుతుందో చెప్పలేం. ప్రాణాలు అర‌చేత ప‌ట్టి బిక్కు బిక్కుమ‌నాల్సిందే. తిరిగి వ‌స్తామ‌న్న గ్యారంటీ లేదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇంట్లోంచి బ‌య‌ట‌కెళ్లి తిరిగి రావ‌డం ఏ మాత్రం న‌మ్మ‌కం లేని కండీష‌న్స్. స‌రే ఇదంటే బ‌తుకు పోరాటంలో త‌ప్ప‌దు. ఏదైనా ప‌నిబ‌డి, లేదా ఆఫీసు, స్కూలు, కాలేజీల‌కు వెళ్లి రావ‌డం అంటే త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి. త‌మ త‌మ‌ అభిమాన క‌థానాయ‌కుడి స‌భ‌ల‌కు వెళ్ల‌డం, ఆ హీరో సినిమా విడుద‌లైతే ప్రీమియ‌ర్ షోల‌కు వెళ్ల‌డం, త‌మ క్రికెట్ హీరో క‌ప్పు కొట్టాడ‌న్న కోణంలో ఆయా విజ‌యోత్స‌వాల‌కు వెళ్ల‌డం.. వంటివి ఎంత చేటు తెస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇవేమైనా కూటికొచ్చేదా గుడ్డ‌కు వ‌చ్చేదా? అయినా స‌రే మ‌న‌సు ఆగ‌దు. అక్క‌డికెళ్లి ఏదో చూసెయ్యాల‌న్న త‌ప‌న తాప‌త్ర‌యం. వెంప‌ర్లాట‌. వెర‌సీ ప్రాణాల మీద‌కు తెస్తోన్న ప‌రిస్థితి.  ఆపై దైవ‌ ద‌ర్శ‌నాలు, కుంభ‌మేళాల‌కు వెళ్ల‌డం.. ఇదేం ఒక‌రొచ్చి చెప్పేది కాదు. ఆ మాట‌కొస్తే అక్క‌డికి వెళ్లాలన్న రూలు కూడా ఏమీ ఉండ‌దు. టీవీల్లోంచి చూసినా స‌రిపోతుంది. ఆ దేవుడు ఇందుగ‌ల‌డు అందులేడ‌న్న సందేహం లేదు. స‌ర్వాంత‌ర్యామి. ఇంట్లోంచి కొలిచినా ఇవ్వాల్సిన ఆశీస్సులు ఇస్తాడు.  కానీ వంద ఏళ్ల త‌ర్వాత వ‌చ్చే కుంభ‌మేళా అని, ఈ రోజు ద‌ర్శ‌నం చేస్తే మ‌న‌కు నేరుగా వైకుంఠ ప్రాప్తి అని.. ఇలా ఆయా ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు చెప్పింది విని.. వెళ్లిన వారి జీవితాల‌కు పుణ్యం రాక పోగా.. ఆయా కుటుంబాల్లో ఒక జీవితానికి స‌రిప‌డా విషాదం మాత్రం ఎదుర‌వుతోంది. వేలం వెర్రీ త‌నం త‌ల‌కెక్కి.. పిచ్చి పైత్యం ఎక్కువ‌య్యి.. ఇదిగో ఇంత‌టి తీవ్ర విషాదాన్ని కొని తెచ్చుకోవ‌డం మాత్రం నిజంగా చాలా చాలా బాధాక‌రం. ఇప్పటికి ఎన్ని ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతున్నా.. వాటిని గ్ర‌హించ‌లేక పోవ‌డం మాత్రం బాధాక‌ర‌మేనంటారు ప‌లువురు సామాజిక వేత్త‌లు.

తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 24 గంటలు

  తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల క్యూ కంపార్ట్ మ్మెంట్  దాటి ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 75,006 మంది భక్తులు దర్శించుకోగా 45,413 మంది తలనీలాలు సమర్పించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.  తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వరలక్ష్మి శరత్ కుమార్  దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు కూడా గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని   టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మూల విరాట్టు దర్శనం కోసం కూడా వేలాది మంది భక్తులు క్యూ లైనల్లో వేచి ఉన్నారని చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి.. సర్వదర్శనం క్యూ లైన్ గుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని  ఈవో తెలిపారు. 

ట్రంప్, మోలానియా డిష్యూం.. డిష్యూం.. నిజమేనా?

అమెరికా దేశాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాల మధ్యసఖ్యత లేదా? వారిరువురూ తరచూ ఘర్షణ పడుతుంటారా? అంటే.. తాజాగా బయటపడిన ఓ వీడియోను బట్టి ఔననే అనాల్సివస్తున్నది. ఈ వీడియో ప్రకారం ఇరువురూ హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ఏదో విషయంపై తీవ్రంగా వాదించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఎప్పటిదంటే.. ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు సతీసమేతంగా డోనాల్డ్ ట్రంప్ హాజరై తిరిగి వెళుతున్నప్పటిదని తెలుస్తోంది. తిరుగుప్రయాణంలో ట్రంప్, మెలానియాలు మెరైన్‌ వన్ హెలికాప్టర్‌లో ఘర్షణపడ్డారని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.  ట్రంప్ మెలానియా వైపు చూపుడువేలు చూపుతూ ఆగ్రహంగా మాట్లాడుతుంటే.. మెలానియా కూడా ఆగ్రహంగా తల అడ్డంగా తిప్పుతూ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్ధమౌతుంది. ఈ వీడియోను హెలికాప్టర్ బయట నుంచి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  

విద్యా సంస్కరణలు.. లోకేష్ కు ప్రపంచబ్యాంకు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యా సంస్కరణలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ముఖ్యంగా సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు విశేషంగా ప్రస్తుతించింది. ఇటీవల విద్యా మంత్రి నారా లోకేష్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, ముఖ్యంగా సాల్ట్ అమలు తీరును ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు ఏపీలో అమలు అవుతున్న విద్యా సంస్కరణలు ఇండియాకే కాదు, మొత్తం దక్షిణాసియాకే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.   పెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్ ఫర్ లెర్నింగ్ ల్యాబ్‌లు (పీఏఎల్),   ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఎఫ్ఎల్ఎన్),అలాగే  కేంద్రీకృత పాఠశాల నాయకత్వ శిక్షణ వంటి కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తార్కాణంగా పేర్కొన్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని కూడా సందర్శించారు. ఆ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని పేర్కొన్నారు.  

సైబర్ మోసానికి గురైన కావలి ఎమ్మెల్యే

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ సైబ‌ర్ మోసాల‌కి అతీతులు కారన్నట్లుగా బలౌతున్నారు. ఉన్నత విద్యావంతులు, ఐఏఎస్ అధికారులూ కూడా సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. సైబర్ మోసాలపై ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తులను చేస్తున్నా.. వారి వలలో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నవారి సంఖ్యపెరుగుతూనే వస్తున్నది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి   సైబర్ నేరగాళ్ల  చేతిలో మోసపోయిన వారి జాబితాలో చేరారు. సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి 23.16లక్షల రూపాయలు దశలవారీగా కాజేశారు. వివరాల్లోకి వెడితే.. గత నెల  22న కావడి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి  ఓ ఫేక్ ఆర్టీఏ లింక్‌ వచ్చింది. దానిని   క్లిక్ చేసిన ఎమ్మెల్యే… అది తన కంపెనీ వాహనాల బకాయిలు అనుకున్నారు. కానీ ఆ లింక్ ను క్లిక్ చేయడమే ఎమ్మెల్యే  సిమ్ కార్డ్ బ్లాక్ కావడానికి కారణమైంది. వెంటనే స్పందించిన ఆయన, సిమ్ సమస్య పరిష్కరించేందుకు హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించారు.  దీంతో ఆయన  సిమ్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో అసలు మోసం బయటపడింది. ఆయనకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి (ఆగ‌స్ట్‌ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు) యూపీఐ ద్వారా దశల వారీగా  23,16,009 రూపాయలు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఆయన కంపెనీ సిబ్బంది ద్వారా ఈ   ఆలస్యంగా తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన , కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

గుంటూరులో పానీపూరీ విక్రయాలు బంద్.. ఎందుకంటే?

గుంటూరు నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరీ విక్రయాలపై నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించినట్లు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు.  గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో పానీ పూరి విక్రయాలు, టిఫిన్ బండ్లపై నిషేధం విధించారు. డయేరియా వ్యాప్తిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరునగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డితోట, రెడ్ల బజార్, సంగడి గుంట సహా తొమ్మిది ప్రాంతాలలో డయేరియా ప్రబలినట్లు అధికారులు గుర్తించారు. డయేరియా కేసులు అధికంగా నమోదు కావడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. డయేరియా వ్యాప్తి అరికట్టేం దుకు తీసుకోవలసిన చర్యలపై గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరి విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయించారు.డయేరియా వ్యాప్తికి కలుషిత నీరు, ఆహారం ప్రధాన కారణాలనీ, అందుకే  ముందుజాగ్రత్త చర్యగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల అమ్మకాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పులి శ్రీనివాసులు తెలిపారు. 

హైదరాబాద్ సీపీగా సజ్జనార్

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదలీ చేసింది. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించింది.   అగ్నిమాపక శాఖ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా బదలీ చేసింది. ప్రస్తతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా నియమించింది. అలాగే హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేసింది. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‎గా హరిత నియమితులయ్యారు.   ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌ , జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ,  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్,  గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్,  పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,   ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్‌,  హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్,  వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్,   సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్,   నారాయణ పేట్ ఎస్పీగా వినీత్‌‌,  ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్,  మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్,  ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధలు నియమితులయ్యారు. 

సృష్టిలో ముగిసిన ఈడీ సోదాలు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఈడీ అధికారలు వేర్వేరు ప్రాంతాలలో నిర్వహించిన సోదాలు శుక్రవారం రాత్రి ముగిశాయి.   హైదరా బాద్ జోనల్ ఆఫీస్ కు చెందిన  ఈడి  అధికారులు  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్ కత్తా సహా మొత్తం తొమ్మది ప్రాంతాలలో ఈ తనఖీలు నిర్వహించారు.   డాక్టర్ నమ్రత యూని వర్సల్ సృష్టి ఫెర్టిలిటీ & రీసెర్చ్ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ దందా కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ  వ్యవ హారంలో పోలీ సులు ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  హైదరా బాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమ్రతపై మోసం, మభ్యపెట్టడం, అక్రమ సరోగసి, చైల్డ్ ట్రాఫికింగ్ మొదలగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నమోదైన  ఎఫ్ఐఆర్ ఆధారం గా  ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు సోదాలు నిర్వహింొచారు. ఈ సోదాల్లో  ఈడి అధికారులు   కీలక పత్రాల తో పాటు మోసపోయిన జంటల వివరాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకు న్నారు. డాక్టర్ నమ్రత తన సెంటర్ లో పని చేస్తున్న సిబ్బంది, ఏజెంట్ల సహాయంతో గత పది సంవత్సరాలుగా  సరోగసి రాకెట్ నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత దేశవ్యాప్తం గా ఈ అక్రమ రాకెట్ నడిపినట్లుగా తేలింది. గుట్టు చప్పుడు కాకుండా గత పది సంవత్స రాలుగా ఈ  దందా  కొనసాగిం చినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నమ్రత చేతిలో  మోసపోయిన ఓ  విదేశీ జంటకు ఇచ్చిన శిశువుకు డిఎన్ఏ టెస్టు చేయగా ఆ శిశువు వారి శిశువు కాదని తేలడంతో ఆ శిశువుకు పాస్పోర్ట్ నిరాకరించారు. ఇలా ఈడి దర్యాప్తు లో  డాక్టర్ నమ్రత మోసాలు బయట పడ్డాయి. గత రెండు రోజులుగా ఈడి చేసిన సోదాల్లో కీలక పత్రాలతో పాటు మోసపో యిన జంటల వివరాలు, నమ్రత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  

మూసీ వరద..చిగురుటాకులా వణుకుతున్న విశ్వనగరం!

తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది వరదతో ఉప్పొంగుతోంది. హైదరాబాద్ లోని జంట జలాశయాలు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ మహోగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ దాదాపుగా నీటమునిగాయి. కుసుంపూర్, పురానాపూల్, చాదర్ ఘాట్, మలక్ పేట్, మూసారాంబాగ్, నాగోల్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక మూసీకి ఆనుకుని ఉన్న అన్ని బ్రిడ్జీలపైనా రాకపోకలను నిలిపివేశారు.   జియాగూడ , కులుసంపూర , చాదర్ ఘాట్  , మూసారాంబాగ్ బ్రిడ్జిల పైనుంచి  వరద నీరు ప్రవహిస్తుండటంతో వాటిని మూసివేసి రాకపోకలను నిలిపివేశారు.   కాగా మూసీని ఆనుకుని ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోని భారీ ఎత్తున వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రయాణీకులు బస్టేషన్ లో చిక్కుకుపోయారు.  బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులను అతి కష్టం మీద తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు.  ముందస్తు హెచ్చరికలు లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో అనూహ్యంగా వరద ముంచెత్తిందని అంటున్నారు. ఇలా ఉండగా నార్సింగి, మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.   ఉస్మాన్ సాగర్  గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద నీరు పొంగి పోర్లతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించు కోకుండా ఓ డ్రైవర్ ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది  అప్రమత్తమై వాళ్ళని సురక్షితం గా కాపాడి,   ఆటో ట్రాలీ కి తాడు కట్టిబయటకు తీశారు.  

రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. అయినా ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటో నడుపుతూ  కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందినసత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు. 

జలదిగ్బంధంలో ఎంజీబీఎస్

హైదరాబాద్‌లో   గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.  శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మూసీనది వరదతో పోటెత్తింది. దీనికి తోడు జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ లోని వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బస్టాండ్ నుంచి బయటకు వచ్చే మార్గంలేక బస్టాండ్ లోనే చిక్కుకుపోయారు. తాడు సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు.  హైడ్రాతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు.  ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.  మూసీ వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా మూసీ వరద ఉధృతి ఒక్క ఎంజీబీఎస్ కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో  200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి.  ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.  మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ ప్రాం తంలో కూడా పలు పల్లపుప్రాంతాలు జలమయమయ్యాయి. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 26) శ్రీవారిని మొత్తం 75 వేల 358 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  2 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది. 

మూసీకి భారీ వరద.. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తున్నది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.   పురానాపూల్ ప్రాంతంలో మూసీ వరద రోడ్లను ముంచెత్తింది. జియాగూడ ప్రాంతంలో కూడా మూసీ ఉగ్రరూపం దాల్చింది. అక్కడ కూడా వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలను నిలిపివేశారు. స్థానికులను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.    ఇక వికారాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో టంగుటూరు మోకిల రోడ్డును మూసి వేశారు.  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.