శ్రీశైలంలో మూడో రోజు చంద్రఘంటా దుర్గ గా అమ్మవారు
posted on Sep 24, 2025 @ 12:26PM
శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంటా దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారు చంద్రవంక ఆకారంలో ఉండే గంటను శిరస్సున ధరించి, శివునితో కలయికను సూచిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
ఇక రెండో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 23) బ్రహ్మచారిణి అలంకారాంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలం కారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో, అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూరవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు,బాజా బజంత్రీలు,కేరళ చండీ మేళం,కొమ్ము కోయ నృత్యం,స్వాగత నృత్యం,రాజభటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాల,చెంచు గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆలయంలోపలి నుంచి భాజా భజంత్రీలు బ్యాండు వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా, కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు.