జీవించడమంటే ఇదే..!
posted on May 27, 2024 @ 9:30AM
జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.
ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు.
మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి, నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.
ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.
నేర్చుకుంటున్న విద్య కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం... జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.
◆నిశ్శబ్ద.