అప్పుడు 1700 కోట్లు కొట్టేసారు, ఇప్పుడు రద్దు చేసారు.. బిల్డప్ ఎందుకు శకుని మామా

  వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'శకుని మామా' అంటూ వరుస ట్వీట్లతో సెటైర్లు వేశారు. "స్క్రిప్ట్ మార్చు శకుని మామా. గతంలో రాసిన స్క్రిప్ట్ తో  ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టావ్. రివర్స్ టెండరింగ్, ఎలెక్ట్రిక్ బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరు." అంటూ విజయ సాయిని ట్యాగ్ చేసి ట్వీట్ చేసారు. "ఆ విషయం ఇంకా నీకు అర్ధం కాలేదా ? నీ బది'లీలలు' త్వరలోనే బయటకి వస్తాయి. కిలోమీటర్ల లెక్కన నొక్కేసే ప్రతి రూపాయికి లెక్క రాసుకో. ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి కదా లేకపోతే లావైపోతావు శకుని మామా!!" అంటూ మరో ట్వీట్ లో ఎద్దేవా చేసారు. "రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసి కవల పిల్లలు గాలి, జగ్గు చేసిన మైనింగ్ సంగతిని మర్చిపోయావా శకుని మామా? ఎలా మర్చిపోతావ్ లే లెక్క రాసింది నువ్వేగా. అన్నట్టు బాక్సైట్ మైనింగ్ అని ఏదో అంటున్నావ్ ఏంటా సంగతి ?. 2007లో మీ మహామేత విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వుకొని దోచుకోవడానికి రస్ అల్ ఖైమా కంపెనీ పేరుతో అనుమతులు ఇచ్చారు దాని గురించేనా? అవి చంద్రబాబుగారు ఎప్పుడో రద్దు చేస్తే, ఇప్పుడు తండ్రి ఇచ్చిన అనుమతులు కొడుకు రద్దు చేసాడు అని బిల్డప్ ఎందుకు శకుని మామా. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇప్పించినందుకే 1700 కోట్లు అప్పట్లో మీరు కొట్టేసారు కదా మర్చిపోయావా? ఒకసారి పాత పద్దుల పుస్తకం తిరగేయ్ బాక్సైట్ లెక్క ఉంటుంది. పుస్తకాలు కాల్చేస్తే లెక్క సీబీఐ దగ్గర దొరుకుతుంది ఒక్క సారి అడిగి చూడు శకునిమమా !!" అంటూ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు.

సాక్ష్యాలతో దొరికిన ఆమంచి.. సొంత పార్టీ వ్యక్తి పైనే దాడి!!

  చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల నాగార్జున రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులని వార్తలొచ్చాయి. అంతేకాదు అసలు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి.. ఆమంచి మరియు అతని అనుచరుల అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జున రెడ్డి కూడా తనపై.. ఆమంచి బంధువులు, అనుచరులు దాడి చేశారని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆమంచి మాత్రం ఇదంతా పచ్చి అబద్దం, ఇది టీడీపీ ఆడిస్తున్న నాటకం అని కొట్టి పారేసారు. అంతేకాదు.. 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదు. ఇటీవల ఎన్నికలలో టీడీపీ ఏజంట్‌ గా పనిచేసాడు. టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.' అని ఆమంచి చెప్పుకొచ్చారు.   అయితే ఆమంచి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అబద్దమని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఆధారాలు దర్శనమిస్తున్నాయి. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదని ఆమంచి అన్నారు. కానీ ఆమంచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, అదే పార్టీ అధినేతకు చెందిన మీడియా సంస్థలో నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ గా పనిచేసారు.     అదేవిధంగా నాగార్జున రెడ్డి.. ఎన్నికలలో ఏజంట్‌ గా పనిచేసిన మాట వాస్తవమే కానీ.. ఆయన పనిచేసింది టీడీపీ కోసం కాదు ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నాగార్జున రెడ్డి టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆమంచి చెప్పుకొచ్చారు. కానీ నిజానికి నాగార్జున రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంతెందుకు వైఎస్ జగన్ తో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.     మరి ఇవన్నీ తెలియకుండానే 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు, టీడీపీకి చెందిన వ్యక్తి' అని ఆమంచి వ్యాఖ్యలు చేసారా?. ఏది ఏమైనా ఆధారాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమంచిని ఏకేస్తున్నారు. అంతేకాదు ఆమంచి కుటుంబం మీద ఉన్న కేసుల లిస్ట్ ని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమంచి తండ్రి మీద.. హత్య, దొంగసారా మరియు హత్యాయత్నం కింద పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి సోదరుడిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి వర్గీయలు చీరాలలో పలువురిపై దాడి చేసిన ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై గతంలో కూడా ఆమంచి సోదరుడు, అనుచరులు దాడి చేసాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమంచి వర్గీయులే తన మీద దాడి చేసారని నాగార్జున చెప్తున్నాడు. కానీ ఆమంచి మాత్రం సింపుల్ గా.. అతను జర్నలిస్ట్ కాదు, టీడీపీ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ వ్యక్తి అయితే జగన్ తో పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వ్యక్తే ఆమంచి మరియు అతని వర్గీయులపై ఫిర్యాదు చేస్తున్నారు అంటే.. చీరాలలో వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటున్నారు. ఆమంచి మరియు అతని వర్గీయులు చీరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెలకు రూ.3.82లక్షలు-అలవెన్సులు అదనం... ఐఏఎస్ లను మించి దేవులపల్లి అమర్ కు జీతం 

  ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది ప్రతిభావంతులు, అర్హులు ఉండగా, తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో ఉన్నత పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ...వాళ్లనుకూల వ్యక్తులకు పెద్దపీట వేయడం సహజం... కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు జర్నలిస్టు దిగ్గజాలే లేనట్లుగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో పదవులు కట్టబెట్టుతున్నారు. అక్కడ స్వరాష్ట్రంలోనూ, ఇక్కడ ఏపీలోనూ తెలంగాణ జర్నలిస్టులకు పెద్దపీట దక్కుతుండగా, రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు మాత్రం తీవ్ర అన్యాయమే జరుగుతోంది. ఇక, తెలంగాణ జర్నలిస్టు, సాక్షి టీవీలో డిబేట్ యాంకర్ గా పనిచేసిన దేవులపల్లి అమర్ ను ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా మరియు ఇంటర్ స్టేట్ ఎఫైర్స్ సలహాదారుగా నియమించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... అతనికి సీనియర్ ఐఏఎస్ లను మించి జీతం, సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దేవులపల్లి అమర్ కు నెలకు అక్షరాలా 3లక్షల 82వేల రూపాయల జీతం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో నేరుగా 2లక్షలు జీతం కాగా, వ్యక్తిగత సహాయకులు అంటే ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బాయ్, కారు డ్రైవర్లకు నెలకు 70వేలు చెల్లించనున్నారు. ఇక ఫోన్ బిల్లు 2వేలు, ఇంటి అద్దె 50వేలు ఇవ్వనున్నారు. ఇవికాకుండా మెడికల్ రీఎంబర్స్ మెంట్, సెకండ్ క్లాస్ ట్రైన్ ఛార్జీలు, ఎకానమీ ఫ్లైట్, అలాగే బిజినెస్ క్లాస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఛార్జీలు అదనంగా చెల్లించనున్నారు. ఏదిఏమైనా తెలంగాణ జర్నలిస్టులకు జగన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరవడమే కాకుండా, పెద్ద మొత్తంలో ఆంధ్రా ప్రజల డబ్బును జీతాలుగా చెల్లించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఇప్పటికే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా సాక్షిలో పనిచేసిన తెలంగాణ జర్నలిస్టులను తీసుకొచ్చి... ఏపీలో ప్రభుత్వ పదవులు కట్టబెట్టడమేమిటని మండిపడుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ మార్క్..! త్వరలోనే కొత్త ఈవో.!

  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీని హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారిందట. పెద్ద సంఖ్యలో సిఫార్సులు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఎన్నడూలేనివిధంగా 36మందితో జంబో పాలక మండలిని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి... భవిష్యత్ లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సమర్ధుడైన అధికారికి టీటీడీ పగ్గాలు అప్పగించాలని కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే టీటీడీ పాలక మండలిపై అనేక విమర్శలు, వివాదాలు చుట్టుముట్టడంతో, భవిష్యత్ లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చేయాలని జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు హయాంలో నియమితులైన ప్రస్తుత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయనున్నారనే మాట వినిపిస్తోంది. టీటీడీ కొత్త ఈవోగా జేఎస్వీ ప్రసాద్ ను నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్నత విద్య మరియు స్కిల్ డెవలప్ మెంట్ శాఖలకు కార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్ వైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీపరుడు, సమర్ధుడిగా పేరున్న జేఎస్వీ ప్రసాద్ కు చంద్రబాబు హయాంలో సరైన ప్రాధాన్యత దక్కలేదని తెలుస్తోంది. బ్రాహ్మణుడైన ఈవోగా జేఎస్వీ ప్రసాద్ ను పశుసంవర్ధకశాఖకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. దాంతో కొన్నాళ్లు సెలవులో వెళ్లిపోయిన జేఎస్వీ ప్రసాద్, ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని భావించారు. అయితే, అంతలోనే ఎన్నికలు రావడం, జగన్ సీఎం కావడంతో... కీలకమైన ఉన్నత విద్య మరియు స్కిల్ డెవలప్ మెంట్ శాఖలకు కార్యదర్శిగా నియమితులైయ్యారు. అయితే, ఇఫ్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పగ్గాలే ఆయనకు అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.  జేఎస్వీ ప్రసాద్ ను టీటీడీ ఈవోగా పంపిస్తే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలు-సమస్యలు సమసిపోతాయనే భావనలో జగన్ ఉన్నారట. దాంతో అతిత్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని, ప్రస్తుత ఈవో సింఘాల్ బదిలీ ఖాయమని చెబుతున్నారు. అయితే, సింఘాల్ ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపిస్తారని తెలుస్తోంది. మరి, పది పదిహేను మంది ఉండే టీటీడీ బోర్డును హ్యాండిల్ చేయడమే అధికారులకు చాలా కష్టమని, అలాంటిది 36మంది బోర్డు మెంబర్స్ ను సంతృప్తిపర్చడమంటే అది కత్తి సామే అంటూ మాజీ ఈవోలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో... ముందుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..!

మొన్న మెట్రో... ఇప్పుడు ఎక్స్ ప్రెస్-వే... భయపెడుతున్న ఫ్లైఓవర్లు...

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం... అంతర్జాతీయస్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశామంటూ గొప్పులు చెప్పుకుంటున్న హైదరాబాద్‌ మెట్రోరైల్ సంస్థ నిర్లక్ష్యానికి ఒకరు బలైపోయారు. నాసిరకం పనుల కారణంగా అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో పెచ్చులూడి మహిళ మృత్యువాత పడింది. దాంతో మెట్రోరైల్ పేరు చెబితేనే భయపడే పరిస్థితి వచ్చింది. వర్షం పడుతుందని... మెట్రో స్టేషన్ల కింద, మెట్రో ఫ్లైఓవర్ల కింద నిలబడటానికి జనం జంకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ విరిగి మీద పడుతుందోనని హైదరాబాదీలు భయపడిపోతున్నారు. అసలు ఈ మెట్రోరైల్ సేఫేనా? మెట్రో స్టేషన్లు సురక్షితమేనా? అసలు ఇవి ఉంటాయా? లేక కూలిపోతాయా? అనే భయం వెంటాడుతోంది. కట్టి కనీసం ఏడాది కూడా కాకుండానే, అప్పుడే అలా పెచ్చులూడటమేంటి బాబోయ్ అంటూ వణికిపోతున్నారు. మెట్రో పరిస్థితి ఇలాగుంటే, ఇప్పుడు మరో ఫ్లైఓవర్ భయపెడుతోంది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లడానికి పదేళ్ల క్రితం నిర్మించిన పీవీ ఎక్స్ ప్రెస్-వే కూడా పెచ్చులూడుతోంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ భారీ ఫ్లైఓవర్ మెయింట్ నెన్స్ ను  హెచ్ఎండీఏ అధికారులు గాలికొదిలేయడంతో... పిల్లర్‌ నెంబర్‌ 20 దగ్గర వయాడక్ట్‌ పెచ్చులూడుతోంది. దాంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, ఎక్స్ ప్రెస్ -వేపై గుంతల సంగతి చెప్పక్కర్లేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ఫ్లైఓవర్ కి పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాదాపు 12 కిలోమీటర్ల పొడవున్న ఈ పీవీ ఎక్స్ ప్రెస్-వే నుంచి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటే, అదే సంఖ్యలో ఫ్లైఓవర్ కింద నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అలాంటి అత్యంత కీలకమైన ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై హైదరాబాదీలు మండిపడుతున్నారు. ఫ్లైఓవర్ ను ఇలాగే వదిలేస్తే... ఏదైనా జరగకూడని ప్రమాదం సంభవిస్తే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని, ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ఈఎస్ఐలో భారీ స్కామ్... హైదరాబాద్, వరంగల్‌లో ఏసీబీ దాడులు

ఈఎస్ఐ మందుల స్కామ్ లో తవ్వేకొద్దీ డొంక కదులుతోంది. పెద్దఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌లో ఏకకాలంలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు బయటికొచ్చాయి. మొత్తం 13మంది అధికారులు, 10మంది అనధికారుల ప్రమేయం ఉన్నట్లు తేల్చిన ఏసీబీ... ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. దాంతో దేవికారాణి ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లల్లో కూడా దాడులు నిర్వహించారు. అలాగే, ముషీరాబాద్ లోని ఈఎస్‌ఐ కార్యాలయం, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్, అధికారులు, నర్సులు, వాళ్ల వాళ్ల బంధువు ఇళ్లల్లో ఏకధాటికి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు డ్యాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ లో ఓ ఛానల్ రిపోర్టర్ కు కూడా సంబంధమున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి  పెద్దమొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏసీబీ... ఈ ఆస్తులకు దేవికారాణి కొడుకు కూడా బినామీగా ఉన్నట్లు తేల్చారు. ఈ కుంభకోణం తేజ ఫార్మా కంపెనీ కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 2013 నుంచి ఈ మందుల స్కామ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మందుల కొనుగోళ్లలో పెద్దఎత్తున మోసాలకు పాల్పడ్డారని, కేవలం డ్రగ్స్ అండ్ డ్రెస్సింగ్ విభాగంలోనే పది కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని ఏసీబీ చెబుతోంది.

జగన్ మరో సంచలన నిర్ణయం... వరుసగా ఆరు జీవోలు జారీ

ఏళ్ల తరబడి సాగుతోన్న గిరిజనుల పోరాటాలకు, ఆదివాసీల ఉద్యమాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ జగన్ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను శాశ్వతంగా నిలిపేస్తూ జీవో ఇచ్చింది. బాక్సైట్‌ తవ్వకాల కోసం 15వందల హెక్టార్లలో 30ఏళ్లపాటు ఏపీఎండీసీకి ఇచ్చిన లీజును రద్దు చేసింది. వరుసగా మొత్తం 6జీవోలను జారీ చేసింది. విశాఖ జిల్లా అరకు, అనంతగిరి మండలాల పరిధిలో జెర్రెల, గాలికొండ, రక్తకొండ ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాల కోసం గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. అడవులు, కొండలను తవ్వడం వల్ల తమ జీవితాలు నాశనమవుతున్నాయంటూ 50ఏళ్లుగా గిరిజనులు, ఆదివాసీలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరిగినప్పుడెల్లా గిరిజనులు, ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మావోయిస్టులు సైతం అడవి బిడ్డల పోరాటాలకు మద్దతిచ్చారు. అయితే, పాదయాత్ర సమయంలో... తాము అధికారంలోకొస్తే బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేస్తామంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి... ఇచ్చిన మాట మేరకు బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ గ్రామాలు, అడవుల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి అతలాకుతలం... వరుసగా మూడోరోజూ దంచికొట్టింది...

వరుసగా మూడోరోజు కూడా హైదరాబాద్‌‌లో వర్షం దంచికొట్టింది. మొదటి రెండ్రోజులూ మధ్యాహ్నం, సాయంత్రంవేళ వర్షం దండికొడితే, మూడోరోజు మాత్రం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో విరుచుకుపడింది. అందరూ నిద్రలోకి జారుకున్నాక, అర్ధరాత్రి భారీ శబ్ధాలతో వరుణుడు విరుచుకుపడ్డాడు. గంటల తరబడి కురిసిన జోరువానకు ఎప్పటిలాగే, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం వణికిపోతోంది. గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వానలకు భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. వరుసగా మూడోరోజు కూడా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎప్పటిలాగే, రోడ్లన్నీ వాగుల్లా, కాలనీలు చెరువుల్లా మారగా, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇక పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో, మరో రెండ్రోజులపాటు ఇదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణశాఖ హెచ్చరించింది.

రైతు భరోసా సగానికి సగం కోత... అన్నదాతలకు జగన్ సర్కారు షాక్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను చూస్తుంటే... కోటలు దాటుతున్నాయ్. కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటపెడుతున్నారు. అమ్మఒడి పథకం నుంచి రైతుభరోసా పథకం వరకు అన్నింటా ఇదే జరుగుతోంది. వైసీపీ నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... లబ్దిదారులను సగానికి సగం తగ్గించేందుకు వడపోత ప్రారంభించారు. అక్టోబర్ నుంచే వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేస్తామని గొప్పగా ప్రకటించిన జగన్... మార్గదర్శకాల పేరుతో అన్నదాతలకు ఊహించని షాకిచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో సర్కారు ప్రకటించిన లబ్దిదారుల సంఖ్య... సగానికి సగం తగ్గిపోయింది. కౌలు రైతులతో కలుపుకొని 64లక్షల పైగా(రైతులు 48.7లక్షలు, కౌలు రైతులు 15.37లక్షలు) సాగుదారులు ఉన్నారని, వారందరికీ పెట్టుబడి సాయం అందిస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్న జగన్ సర్కారు... గైడ్ లైన్స్ అండ్ వడపోత తర్వాత ఆ సంఖ్యను దాదాపు 36లక్షలకు కుదించేసింది. ఎన్నికల టైమ్ లో ప్రతి రైతుకూ 12వేల 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.... ఇఫ్పుడు కేంద్రం ఇస్తోన్న 6వేలు పోను... మిగతా 6500లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, కేంద్రం అమలు చేస్తోన్న గైడ్ లైన్స్ నే జగన్ సర్కారు కూడా ఫాలో కావాలని నిర్ణయించింది. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం లబ్దిదారుల సంఖ్య  29.45లక్షలకు పడిపోయింది. ఎన్నికలవేళ కేంద్రం మొదటగా ఏపీలో దాదాపు 43లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ మనీ జమచేయగా, రెండో విడతకు వచ్చేసరికి పలురకాల కండీషన్స్ తో లబ్దిదారుల సంఖ్యను 33లక్షలకు తగ్గించేసింది. ఇక మూడో విడత వచ్చేసరికి ఆ సంఖ్య 29.45లక్షలకు పడిపోయింది. కేవలం మూడే మూడు నెలల్లో గైడ్ లైన్స్ పేరుతో ఏకంగా పదమూడున్నర లక్షల మంది రైతులను అర్హుల జాబితాలో నుంచి తొలగించేసింది. అయితే, కేంద్రం ఇస్తోన్న సొమ్ముతో కలిపే 12వేల 500 ఇస్తామంటూ మెలిక పెట్టిన జగన్ సర్కారు... అదే గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టింది. కేంద్రం ఎవరి ఖాతాల్లో అయితే, మూడు విడతల్లో 6వేల రూపాయలు జమ చేసిందో... వాళ్లకే మిగతా ఆరున్నర వేలు వేయనున్నట్లు తెలుస్తోంది. సొంత భూమి కలిగిన రైతుల విషయంలో గైడ్ లైన్స్ ఇలాగుంటే, ఇక కౌలు రైతుల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కౌలు రైతులకు కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో, మొత్తం 12వేల 500 తామే ఇస్తామంటోంది జగన్ సర్కారు. అయితే, గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో కౌలు రైతుల సంఖ్యను కూడా 16లక్షల నుంచి ఐదారు లక్షలకు తగ్గించి, పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో వైఎస్సార్ రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టిన జగన్ సర్కారు... కేవలం 30లక్షల్లోపు రైతులకే సాయం అందించినున్నట్లు తెలుస్తోంది.

తిరుమలలో రాజకీయ రంగులు... గులాబీ గుబాళింపులు కేసీఆర్ మెప్పు కోసమేనా?

  సెప్టెంబర్ 30నుంచి అక్టోబరు 9వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు కల్పిస్తోంది. ముఖ్యంగా సౌకర్యాలతోపాటు భక్తుల భద్రతపైనా టీటీడీ దృష్టిపెట్టింది. దాదాపు 6వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, తిరుమల నడకదారుల్లో 1650 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక గదుల కేటాయింపు, దర్శనాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు. అయితే, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వరకు బాగానే ఉన్నా, అలిపిరి నుంచి తిరుమల వెళ్లే మార్గంలో... గోపురానికి, శ్రీవారి శంఖు చక్రాలకు గులాబీ రంగు వేయడంపై వివాదం చెలరేగింది. గతంలో వీటికి తెలుపు లేదా పసుపు రంగులు వాడేవారు. అయితే, ఇప్పుడు లేత గులాబీ రంగు వేయడం, అది టీఆర్ఎస్ జెండా కలర్ లాగా ఉండటంతో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించేందుకేనన్న విమర్శలు చెలరేగాయి. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల మీటింగ్ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని తెలంగాణ సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి...  కేసీఆర్ మెప్పు కోసమే గోపురానికి, శ్రీవారి శంఖు చక్రాలకు గులాబీ రంగు వేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.  అయితే, అలిపిరి టోల్ గేట్ దగ్గర గోపురానికి, శంఖు చక్రాలకు గతంలో వేసిన రంగులనే వేశారంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. మెప్పు కోసం ఒక రాజకీయ పార్టీ రంగును వేశామనడంలో నిజం లేదన్నారు. అయితే, టీటీడీ వివరణను ఎవరూ నమ్మడం లేదు. అలిపిరిలో టీఆర్ఎస్ గులాబీ కలర్ డామినేట్ చేస్తోందని, ఇది కచ్చితంగా గులాబీ గుబాళింపేనని అంటున్నారు. అయినా, దేవుడి దగ్గర ఈ రాజకీయ రంగులేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత సంప్రదాయాలకు విరుద్ధంగా గులాబీ రంగు ఎలా వేస్తారంటూ నిలదీస్తున్నారు. కేసీఆర్ ను మెప్పించేందుకు తిరుమల వేంకటేశ్వరుడి చిహ్నాలకూ గులాబీ రంగులేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

మరో మూడ్రోజులు ముంపే... టేక్ కేర్ హైదరాబాద్‌... జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌

వరుసగా రెండోరోజు కూడా హైదరాబాద్‌‌లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారాయి. దాంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఇక, ప్రధాన రహదారులైతే వాగులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతుండటంతో, ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ నోరు తెరుచుకుని ఉందోనని పాదచారులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. మరోవైపు, పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, బహదూర్‌పురా మహమూద్‌నగర్‌లో భారీ వర్షానికి ఇంటి గోడ విరిగిపడి వృద్ధురాలు మరణించింది. మరోవైపు, కుండపోత వర్షానికి హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దాంతో లోయర్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మల్లేపల్లి హబీబ్‌నగర్‌‌ నాలా దగ్గర ఒక ఇంట్లోకి నడుము లోతు నీళ్లు రావడంతో... ఆ నీటిలో మహిళ ఈత నేర్చుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇక, ఉస్మాన్ గంజ్‌లో వర్షపు నీరు ముంచెత్తడంతో వాహనాలు, బైక్స్ కొట్టుకుపోయాయి. దాంతో, వాటిని కాపాడుకునేందుకు వాహనదారులు నానా తిప్పలు పడ్డారు. కుండపోత వర్షాలు హైదరాబాద్‌‌ను ముంచెత్తుతుండటంతో జీహెచ్‌ఎంసీ రెస్క్యూ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. మరో రెండు మూడ్రోజులు ఇదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో.... ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే, 1908 తర్వాత సెప్టెంబర్లో ఈ స్థాయిలో వర్షాలు పడటం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.

పాతబస్తీలో అక్రమంగా ఇ-సిగరెట్లను విక్రయిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు...

దేశ వ్యాప్తంగా ఇ-సిగరెట్ లను కేంద్రం నిషేధించింది. స్కూలుకు వెళ్ళే పిల్లలు నుంచి కాలేజికి వెళ్లే యువకుల వరకూ అందరూ ఇ-సిగరెట్లను వాడటంతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. ఎవరైనా అమ్మితే చట్ట పరంగా చర్యలు తీసుకునే ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. వ్యాపారస్తులు ఇ-సిగరెట్ లను వెంటనే పోలీసులకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు, ఆయన హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా ఇ-సిగరెట్ లను అమ్ముతున్న వారిని పాతబస్తీలో దాడులు నిర్వహించి, టాస్క్ ఫోర్స్ తో పెద్ద మొత్తంలో  సిగరెట్ లను సీజ్ చేశారు. మామూలు సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదముందో ఇ-సిగరెట్లు తాగితే కూడా అంతే ప్రమాదముందని, ఇ-సిగరెట్లలో టొబాకో,నికోటిన్,కార్బన్ ఇవేవీ లేకపోయినా దాని నుంచి వచ్చే పొగ అత్యంత ప్రమాదకరమైందని అధికారులు చెబుతున్నారు. ఇ-సిగరెట్లు అత్యధికంగా విదేశాల నుంచే దిగుమతి అవుతుందని అధికారులు వెళ్లడించారు. ఇ-సిగరెట్ ఒక్కోదాని విలువ వెయ్యి నుంచి మూడు వేల లోపు ఉంటుందని చెబుతున్నారు. అది ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కావడం వల్ల అది సిగరెట్ అని ఎవరూ గుర్తించరు దీంతో కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి అనుమానం కూడా రాదు. దాని పరిమాణం చిన్నగా ఉండటం వల్ల పిల్లలు సులభంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇది విస్తరిస్తే దేశం మొత్తాన్ని నాశనం చేస్తుందనే ఆలోచనతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. అక్రమంగా ఎవరైనా దీనిని విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకు రావాలని ఒక ఆర్డినెన్సును కూడా ప్రవేశ పెట్టింది.

కడప జిల్లా ప్రజల్ని హడలెత్తిస్తున్న సింక్ హోల్స్...

  కడప జిల్లా అసలే కరువు ప్రాంతం, వర్షాలు కురిస్తే అక్కడ ఒక భయం మాత్రం ముందుగా మొదలవుతుంది. అమాంతంగా ఉన్నట్టుండి భూమి లోపలకి కుంగిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కాక ఆ గ్రామ ప్రజలందరూ అలాగే చూస్తుంటారు.  గ్రామ సమీపంలో ఐదు నుండి యాభై అడుగుల లోతున భూమి కళ్ల ముందే కుంగిపోతుంటాయి. గుంతలు గుంతలుగా పెద్ద పెద్ద హోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సింక్ హోల్స్ గా చెప్తూ ఉంటారు. గతంలో కూడా ఈ సమస్య వచ్చింది అప్పుడు అసలీ సమస్యకు కారణమేంటో కనుగొనే ప్రయత్నం చేశారు కానీ తెలియలేదు. కడప జిల్లాలో సింక్ హోల్స్ స్థానిక ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి, చింతకొమ్మదిన్నె మండలం బుగ్గమల్లేశ్వర ఆలయం సమీపం లోని గూడవాండ్లపల్లెకు చెందిన రైతు సుబ్బారాయుడు పొలంలో ఇరవై అడుగుల లోతు, అయిదు అడుగుల వెడల్పు తో భూమి లోపలకి కుంగిపోయింది. నెల రోజుల క్రితం ఇప్ప పెంట గ్రామం లోని చెరువులో భూమి కుంగిపోయి అతిపెద్ద గోతులు ఏర్పడ్డాయి. గ్రామానికి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న చెరువులో రెండు చోట్ల భూమి కుంగిపోయింది. సుమారు యాభై అడుగుల మేర కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూమి కుంగిపోయే సమయంలో వచ్చిన శబ్దాలు గ్రామస్థుల్ని హడలెత్తించాయి. రాత్రి వేళ కూడా గలగలమనే శబ్దాలు వస్తాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సింక్ హోల్స్ కారణంగా తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి చెరువులో కుంగిపోయింది కానీ, అదే నివాస ప్రాంతాల్లో కుంగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన ప్రస్తుతం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

న్యూఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో భూకంపాలు...

ఈ రోజు న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపం యొక్క కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్టు తెలిసింది. పాకిస్థాన్ లోని లాహోర్ నార్త్ వెస్ట్ లో 6.1 రెక్టార్ స్కేల్ గా భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (ఐఎంఎస్సి) తెలిపింది. ఇస్లామాబాద్, లాహోర్, రావుల్పిండి, పెషావర్ లతో పాటు ఇతర నగరాల్లో 5.7 ధ్వని తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నివేదికలు తెలిపాయి. ఢిల్లీ, కాశ్మీర్, చండీఘర్, ఉత్తర్ ప్రదేశ్, మరియు నార్త్ ఇండియా లోని ఇతర ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. భూకంపం (భూకంపం, వణుకు లేదా టెంబ్లర్ అని కూడా పిలుస్తారు) భూమి యొక్క ఉపరితలం వణుకుతుంది, దీని ఫలితంగా భూకంప తరంగాలను సృష్టించే భూమి యొక్క లితోస్పియర్‌లో శక్తి అకస్మాత్తుగా విడుదల అవుతుంది. భూకంపాలు చుట్టుపక్కల ప్రజలు మరియు మొత్తం నగరాలను నాశనం చేసేంత హింసాత్మకంగా ఉంటుంది. ఒక ప్రాంతం యొక్క భూకంపం ఫ్రీక్వెన్సీ, రకం మరియు పరిమాణం ద్వారా పరిగణిస్తారు.

రూ 10 వేలు పడేస్తే నెలకు సరిపడా సిగరెట్లు.. ఆ జైలు గదులు చాలా కాస్ట్లీ గురూ...

  డబ్బు పడేస్తే కొండ మీది కోతైనా దిగి వస్తుందంటారు మన పెద్దలు. అది నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం ఆ జైలులో మాత్రం పైసలు ఉండాలే కానీ దొరకని ఫెసిలిటీ లేదని చెపుతున్నారు అక్కడి ఎసిబి అధికారులు.  రాజస్థాన్ లోని అజ్మీర్ సెంట్రల్ జైలు లో కొందరు శ్రీమంతులైన ఖైదీలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లుగా అక్కడి ఎసిబి తేల్చింది. దాని కోసం వారు నెలకు కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఎసిబి అధికారుల విచారణలో తేలింది. అజ్మీర్ సెంట్రల్ జైలులోని బ్యారెక్ 1 నుండి 15   వరకు వీఐపీల సెల్ లు ఉన్నాయి. బాగా డబ్బున్న ఖైదీలకు మాత్రమే ఈ బ్యారెక్ లలోని గదులు చిక్కుతాయట. ఈ వీఐపీ సెల్స్ లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఆ దర్యాప్తు లో తేలింది. ఆ వీఐపీ సెల్స్ లో ఉండే వారికి స్పెషల్ ఫుడ్, కాస్ట్లీ డ్రస్సులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయట. ఈ ప్రత్యేక సదుపాయాల కోసం నెల ఖర్చు కేవలం 8 లక్షల రుపాయాలే వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నెలకు సరిపడా  సిగరెట్ ప్యాకెట్లు సప్లై చేయడానికి రూ. 10 వేల నుండి రూ. 15 వేల వరకు అలాగే పొగాకు ఉత్పత్తులు సరఫరా చేయడానికి ప్యాకెట్ కు రూ. 300 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారని ఈ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ సొమ్మునంతటిని జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులు, బంధువుల నుండి కొంత మంది జైలు సిబ్బంది కలెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐతే కొంత మనది ఈ సొమ్మును నగదు రూపంలో ఇస్తుండగా మరి కొంత మంది ఆన్ లైన్ లో అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్కామ్ పై దర్యాప్తు చేసిన అధికారులు దీనికి సంబంధించి 15 బ్యాంకు అకౌంట్లను గుర్తించి 12 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం.

నాటు పద్దతిని ఉపయోగిస్తే తప్ప బోటుని బయటకి తీయలేం : బోటు డ్రైవర్లు

  గోదావరిలో మునిగిన బోటు బయటకి తీసేదెలా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. కచ్చులూరు ఒడ్డున కూర్చొని బోటు చుట్టూ అంచనాలు వేస్తున్న అధికారులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే మార్గమంటున్నారు కానీ, స్థానికులు మాత్రం నాటు పద్ధతులు పాటిస్తే తప్ప బోటును బయటకు తీయలేమని చెబుతున్నారు. అయితే, సంఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులు మాత్రం ఏ పద్ధతిని పాటించినా బోటుని వెలికితీయటం చాలా కష్టమని సంకేతాలిస్తున్నాయి. గోదావరి నదిలో బోటు మునిగిన ప్రదేశం మామూలు ప్రాంతం కాదు. వేగంగా పరుగెత్తుకొచ్చిన గోదావరి కొండను ఢీ కొనే ప్రదేశం, అంటే కొండను తాకిన నీరు వెనక్కి తిరుగుతోంది. ఈ క్రమంలో నదిలో భారీ సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ సుడిగుండాల్లోనే మునిగింది రాయల్ వశిష్ట బోటు. దాదాపు రెండు వందల ఎనభై అడుగుల లోతులోకి వెళ్లి పడిపోయింది. అయితే గల్లంతైన వారు ఒకవేళ మరణిస్తే వారి మృతదేహాలు బోటులోనే ఉండుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందరూ చెప్పుకుంటున్న లెక్క ప్రకారం బోటులో ప్రయాణించింది డెబ్బై ఏడు మంది అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజు ప్రాణాలతో బయటపడ్డ వారు ఖచ్చితంగా ఇరవై ఆరు మంది, చనిపోయిన డెడ్ బాడీలు దొరికిన వారి సంఖ్య ముప్పై ఏడు. ఈ లెక్కన ఇంకా జాడ తెలియాల్సిన వారి సంఖ్య పద్నాలుగు. ఈ పద్నాలుగు మంది ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి బంధువులు ఎవరు అన్నది ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దీంతో మిస్సయిన వారి కోసం ఒడ్డున కూర్చొని వారి బంధువులు బోరుమంటున్నారు. ప్రాణాలతో బయట పడ్డవారి బంధువులు కూడా కొందరు గల్లంతైన వారిలో ఉన్నారు. వాళ్లు బోలెడు ఆశలతో గోదావరి వైపు కన్నీళ్లతో ఆశగా చూస్తున్నారు. గల్లంతయిన వారు బోటులోనే చిక్కుకుపోయి ఉంటే వారిని వెలికి తీసేందుకు సాంకేతిక పరిజ్ఞానం పనికి రాదని చెబుతున్నారు స్థానికులు. బోటులో ఉన్న డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని నాటు పద్ధతులను పాటిస్తే బోటులో ఉన్న డెడ్ బాడీలు వెలికి తీసే ఛాన్సుందని చెప్పుకొస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం సాంప్రదాయ పద్ధతులపై పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. సాంప్రదాయ పద్ధతులను అనుసరించి బోటును వెలికి తీసే ప్రయత్నం చేసే మరో ప్రమాదం జరిగే అవకాశముందని చెబుతున్నారు. బోటుని వెలికి తీయడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బోటులో ఏవైనా డెడ్ బాడీలు చిక్కితే వాటిని బయటకు తీయడమే ఇప్పుడు అవసరమైన చర్య అంటున్నారు స్థానికులు. బోటు మునిగి ఈ రోజుకి పది రోజులు కావడంతో డెడ్ బాడీలు కుళ్లిపోయి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. మునిగిన రెండో రోజే బోటు పైన బండరాళ్లు వేయడం కానీ నీటి బాంబులతో ప్రకంపణలు సృష్టించడం కానీ చేయాల్సి ఉండేదని చెబుతున్నారు. ఫలితంగా బోటు అద్దాలు పగిలి సుడులు తిరుగుతున్న నీటిలో డెడ్ బాడీలు బయటకు వచ్చేవని చెబుతున్నారు స్థానిక బోటు డ్రైవర్లు.

80 రూపాయలకు చేరుకున్న ఉల్లి...

  ఉల్లి ధరలు భారతీయుల్ని బెంబేలెత్తిస్తున్నాయి, తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఉల్లి పంట దిగుబడులు తగ్గడానికి తోడు కృత్రిమ కొరతతో రేటు అమాంతం పెరిగిపోయింది. ఉల్లి పాయలను ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు వ్యాపారులు. వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నాలుగేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్టానికి ఉల్లిపాయ ధర పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ ఎక్కడ చూసినా కిలో ఉల్లిని ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. నాసిరకం ఉల్లిని కొనాలన్నా జేబులు తడుముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నాణ్యత ఉన్న ఉల్లి కిలో ఎనభై రూపాయలకు మించి అమ్ముడుపోతోంది. ఉల్లి ధరలు ఘాటెక్కిస్తోంది, సామాన్యుడికి అందనంత ధరలు పెరిగిపోయాయి. విజయవాడ మార్కెట్ లో రెండు నెలల్లోనే పన్నెండు నుంచి అరవై రూపాయలకు కిలో ఉల్లి ధర చేరిపోయింది. రెండు ఉల్లిపాయలు వేస్తేనే సరిగా కూర అవ్వదు అలాంటిది ఇప్పుడు ఉల్లి ధర పెరిగిపోవటంతో ఒక్కో ఉల్లిపాయ వేసి కూర వండుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యతరగతి వారికి కుటుంబం గడుపుకోవటమే కష్టంగా ఉంటుందనీ అలాంటిది ఇలా రేట్లు పెంచితే అది కూడా కష్టమని ప్రజలంతా బాదకు గురౌతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని మద్య తరగతి, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ..?

  హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలను అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు, బొప్పాయిలు తమకే అమ్మాలని బెదిరింపులకు దిగారు. దళారుల బెదిరింపులకు రైతులు తలొగ్గకుండా వారిపై ప్రతిదాడికి దిగారు. దళారుల దాడులు, రైతుల ప్రతిదాడులతో మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డెంగ్యూ ఫీవర్ విజృంభనతో బొప్పాయి విక్రయాలు నగరంలో భారీగా పెరిగాయి. కిలో బొప్పాయి వంద రూపాయలు పలుకుతోంది. డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్లేట్ లెట్స్ ను పెంచుకోవటానికి బొప్పాయి పండ్లు, అదే విధంగా బొప్పాయి ఆకులను జ్యూస్ చేసుకుని తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయనే ఒక ప్రచారముంది. ఈ నేపథ్యంలో బొప్పాయి అమ్మకాల, కొనుగోలు పెద్ద ఎత్తున పెరగటంతో రైతులు పెద్ద ఎత్తున పండించిన బొప్పాయి పంటను కొత్తపేట మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయాలను జరుపుతుండగా, దళారులు వచ్చి తమకు తక్కువ ధరకు అమ్మాలని డిమాండ్ చేయటంతో రైతులు డైరెక్టుగా కొనుగోలు దారులకే అమ్మకాలు జరపటం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన దళారులు రైతులపై దాడులు చేయటం జరిగింది. ఈ దాడిలో నలుగురు రైతులు గాయపడ్డారు. రైతులపై దాడికి పాల్పడటంతో వారంతా కలిసి దళారులపై ప్రతి దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పరిస్థితిని చక్కపెట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.