నాటు పద్దతిని ఉపయోగిస్తే తప్ప బోటుని బయటకి తీయలేం : బోటు డ్రైవర్లు

  గోదావరిలో మునిగిన బోటు బయటకి తీసేదెలా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. కచ్చులూరు ఒడ్డున కూర్చొని బోటు చుట్టూ అంచనాలు వేస్తున్న అధికారులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే మార్గమంటున్నారు కానీ, స్థానికులు మాత్రం నాటు పద్ధతులు పాటిస్తే తప్ప బోటును బయటకు తీయలేమని చెబుతున్నారు. అయితే, సంఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులు మాత్రం ఏ పద్ధతిని పాటించినా బోటుని వెలికితీయటం చాలా కష్టమని సంకేతాలిస్తున్నాయి. గోదావరి నదిలో బోటు మునిగిన ప్రదేశం మామూలు ప్రాంతం కాదు. వేగంగా పరుగెత్తుకొచ్చిన గోదావరి కొండను ఢీ కొనే ప్రదేశం, అంటే కొండను తాకిన నీరు వెనక్కి తిరుగుతోంది. ఈ క్రమంలో నదిలో భారీ సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ సుడిగుండాల్లోనే మునిగింది రాయల్ వశిష్ట బోటు. దాదాపు రెండు వందల ఎనభై అడుగుల లోతులోకి వెళ్లి పడిపోయింది. అయితే గల్లంతైన వారు ఒకవేళ మరణిస్తే వారి మృతదేహాలు బోటులోనే ఉండుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందరూ చెప్పుకుంటున్న లెక్క ప్రకారం బోటులో ప్రయాణించింది డెబ్బై ఏడు మంది అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజు ప్రాణాలతో బయటపడ్డ వారు ఖచ్చితంగా ఇరవై ఆరు మంది, చనిపోయిన డెడ్ బాడీలు దొరికిన వారి సంఖ్య ముప్పై ఏడు. ఈ లెక్కన ఇంకా జాడ తెలియాల్సిన వారి సంఖ్య పద్నాలుగు. ఈ పద్నాలుగు మంది ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి బంధువులు ఎవరు అన్నది ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దీంతో మిస్సయిన వారి కోసం ఒడ్డున కూర్చొని వారి బంధువులు బోరుమంటున్నారు. ప్రాణాలతో బయట పడ్డవారి బంధువులు కూడా కొందరు గల్లంతైన వారిలో ఉన్నారు. వాళ్లు బోలెడు ఆశలతో గోదావరి వైపు కన్నీళ్లతో ఆశగా చూస్తున్నారు. గల్లంతయిన వారు బోటులోనే చిక్కుకుపోయి ఉంటే వారిని వెలికి తీసేందుకు సాంకేతిక పరిజ్ఞానం పనికి రాదని చెబుతున్నారు స్థానికులు. బోటులో ఉన్న డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని నాటు పద్ధతులను పాటిస్తే బోటులో ఉన్న డెడ్ బాడీలు వెలికి తీసే ఛాన్సుందని చెప్పుకొస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం సాంప్రదాయ పద్ధతులపై పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. సాంప్రదాయ పద్ధతులను అనుసరించి బోటును వెలికి తీసే ప్రయత్నం చేసే మరో ప్రమాదం జరిగే అవకాశముందని చెబుతున్నారు. బోటుని వెలికి తీయడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బోటులో ఏవైనా డెడ్ బాడీలు చిక్కితే వాటిని బయటకు తీయడమే ఇప్పుడు అవసరమైన చర్య అంటున్నారు స్థానికులు. బోటు మునిగి ఈ రోజుకి పది రోజులు కావడంతో డెడ్ బాడీలు కుళ్లిపోయి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. మునిగిన రెండో రోజే బోటు పైన బండరాళ్లు వేయడం కానీ నీటి బాంబులతో ప్రకంపణలు సృష్టించడం కానీ చేయాల్సి ఉండేదని చెబుతున్నారు. ఫలితంగా బోటు అద్దాలు పగిలి సుడులు తిరుగుతున్న నీటిలో డెడ్ బాడీలు బయటకు వచ్చేవని చెబుతున్నారు స్థానిక బోటు డ్రైవర్లు.

80 రూపాయలకు చేరుకున్న ఉల్లి...

  ఉల్లి ధరలు భారతీయుల్ని బెంబేలెత్తిస్తున్నాయి, తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఉల్లి పంట దిగుబడులు తగ్గడానికి తోడు కృత్రిమ కొరతతో రేటు అమాంతం పెరిగిపోయింది. ఉల్లి పాయలను ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు వ్యాపారులు. వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నాలుగేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్టానికి ఉల్లిపాయ ధర పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ ఎక్కడ చూసినా కిలో ఉల్లిని ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. నాసిరకం ఉల్లిని కొనాలన్నా జేబులు తడుముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నాణ్యత ఉన్న ఉల్లి కిలో ఎనభై రూపాయలకు మించి అమ్ముడుపోతోంది. ఉల్లి ధరలు ఘాటెక్కిస్తోంది, సామాన్యుడికి అందనంత ధరలు పెరిగిపోయాయి. విజయవాడ మార్కెట్ లో రెండు నెలల్లోనే పన్నెండు నుంచి అరవై రూపాయలకు కిలో ఉల్లి ధర చేరిపోయింది. రెండు ఉల్లిపాయలు వేస్తేనే సరిగా కూర అవ్వదు అలాంటిది ఇప్పుడు ఉల్లి ధర పెరిగిపోవటంతో ఒక్కో ఉల్లిపాయ వేసి కూర వండుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యతరగతి వారికి కుటుంబం గడుపుకోవటమే కష్టంగా ఉంటుందనీ అలాంటిది ఇలా రేట్లు పెంచితే అది కూడా కష్టమని ప్రజలంతా బాదకు గురౌతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని మద్య తరగతి, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ..?

  హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలను అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు, బొప్పాయిలు తమకే అమ్మాలని బెదిరింపులకు దిగారు. దళారుల బెదిరింపులకు రైతులు తలొగ్గకుండా వారిపై ప్రతిదాడికి దిగారు. దళారుల దాడులు, రైతుల ప్రతిదాడులతో మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డెంగ్యూ ఫీవర్ విజృంభనతో బొప్పాయి విక్రయాలు నగరంలో భారీగా పెరిగాయి. కిలో బొప్పాయి వంద రూపాయలు పలుకుతోంది. డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్లేట్ లెట్స్ ను పెంచుకోవటానికి బొప్పాయి పండ్లు, అదే విధంగా బొప్పాయి ఆకులను జ్యూస్ చేసుకుని తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయనే ఒక ప్రచారముంది. ఈ నేపథ్యంలో బొప్పాయి అమ్మకాల, కొనుగోలు పెద్ద ఎత్తున పెరగటంతో రైతులు పెద్ద ఎత్తున పండించిన బొప్పాయి పంటను కొత్తపేట మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయాలను జరుపుతుండగా, దళారులు వచ్చి తమకు తక్కువ ధరకు అమ్మాలని డిమాండ్ చేయటంతో రైతులు డైరెక్టుగా కొనుగోలు దారులకే అమ్మకాలు జరపటం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన దళారులు రైతులపై దాడులు చేయటం జరిగింది. ఈ దాడిలో నలుగురు రైతులు గాయపడ్డారు. రైతులపై దాడికి పాల్పడటంతో వారంతా కలిసి దళారులపై ప్రతి దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పరిస్థితిని చక్కపెట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.