బాలల సంక్షేమంపై కేసీఆర్ మనవడు కేహెచ్ఆర్ ప్రాజెక్ట్

  కేహెచ్ఆర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. అదేంటి మాకు కేసీఆర్ తెలుసు.. కేటీఆర్ తెలుసు.. మరి ఈ కేహెచ్ఆర్ ఎవరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేహెచ్ఆర్ పేరుతో సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఎంతో కొంత పరిచయముంది. కేహెచ్ఆర్ ఎవరో కాదు.. కేసీఆర్ ముద్దుల మనవడు హిమాన్షు. తాత కేసీఆర్ లానే కేహెచ్ఆర్ కి కూడా లక్కీ నంబర్ 6 అందుకే తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ కి కేహెచ్ఆర్ 6666 అని పెట్టుకున్నారు. కేహెచ్ఆర్ అంటే కల్వకుంట్ల హిమాన్షురావు. ఇప్పుడు ఆయన చేసిన ఒక ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. హిమాన్షు.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను ఇంటర్వ్యూ చేశారు. స్కూల్ ప్రాజెక్టు విషయమై మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు సోషల్ మీడియాలో తన ఖాతాలో హిమాన్షు తెలిపారు. తెలంగాణలో శిశు సంక్షేమం గురుంచి మంత్రితో చర్చించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇంటర్వ్యూ ఫొటోలు పెట్టాడు. మంత్రి సత్యవతితో కలిసి హైదరాబాద్ లోని బాల నేరస్థుల జువైనల్ హోమ్ ను సందర్శించారు. అక్కడి స్థితిగతులను ఆరా తీశారు. ఆ తర్వాత అదే విషయం పై మంత్రి సత్యవతి రాథోడ్ ను ఇంటర్వ్యూ చేశారు. తాను చదివిన స్కూల్ లో బాలల సంక్షేమ పై ప్రాజెక్టు వర్కు ఇచ్చారు. ఇందులో భాగంగానే తాను మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్టు హిమాన్షు చెప్పారు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో మూడోతరం యాక్టీవ్ అవుతోంది. తండ్రి కేటీఆర్ లాగానే హిమాన్షు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

డిసెంబర్ 1 నుండి టోల్ దాటాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి!

  జాతీయ రహదారులపై తిరగాలంటే ఇక పై వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి. డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా.. ట్రాఫిక్ సమస్యలు రాకుండా.. ఉండేందుకు ఫాస్టాగ్ ను అమల్లోకి తెస్తున్నారు. ఫాస్టాగ్ ఉంటే వాహన దారులు టోల్ ప్లాజాల దగ్గర ఆగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫాస్టాగ్ ను వాహనం ముందు అద్దానికి అతికిస్తే టోల్ ప్లాజాలోని స్కానర్ లు దాన్ని స్కాన్ చేస్తాయి. వెంటనే దానికి అనుసంధానమైన ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతాల నుంచి టోల్ రుసుము ఆటోమేటిగ్గా ఖర్చయిపోతుంది. వినియోగదారులు తమ ఖాతాలో తగిన నిల్వ ఉంచుకుంటే చాలు. మరోవైపు టోల్ ప్లాజాల్లో ఒక్క లైన్ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్ లైన్లుగా మార్చాలని NHAI ఇప్పటికే నిర్ణయించింది. డిసెంబరు 1వ తేదీ నుండి ఫాస్టాగ్ లేని వాహనాలు ఆ ఒక్క లైన్ లోనే నగదు చెల్లించి వెళ్లాలి. పొరపాటున ఫాస్ట్ ట్యాగ్ లైన్ లోకి వెళితే రెట్టింపు రుసుము వసూలు చేస్తామని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని పెద్ద బ్యాంకులు తమ వినియోగదారులకు ఫాస్టాగ్ చెల్లింపుల సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాయి. ఈ పాస్టాగ్ వినియోగదారుల సేవింగ్స్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. వాహనాలు టోల్ ప్లాజాలను దాటేటప్పుడు ఆటోమెటిక్ గా నిర్దేశిత రుసుములు ఆయా బ్యాంక్ ఖాతాలో నుండి కట్ అవుతాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లు.. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్యక్రమంలో భాగస్వాములై ఉన్నాయి.

గన్నవరం ఉపఎన్నికలు... టిక్కెట్ యార్లగడ్డ కా లేక వంశీ కా?

  గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారుతూ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపికి రాజీనామా చేసిన వంశీ జగన్ వెంట నడుస్తానని ప్రకటించారు. త్వరలోనే వైసీపీలో చేరతారని చెప్పారు. అయితే పక్కా డేట్ మాత్రం ప్రకటించలేదు. సీఎం నిర్ణయం మేరకు తన చేరిక ఉంటుందని తెలిపారు వంశీ.   వైసిపిలో చేరేందుకు వంశీ రెడీ అవుతున్నారనే సిగ్నల్స్ వస్తున్న సమయంలో  వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో వంశీ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ, వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు అయిందని అందులో భాగంగానే వైసిపి నేతలను కలుస్తున్నారని చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వారితో కలిసి పని చేసేందుకు ముందు గానే వారితో భేటీ అవుతున్నారని అనుచరులు అంటున్నారు.  మరోవైపు వైసిపి గన్నవరం ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు.. జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వంశీని పార్టీలోకి చేర్చుకోవడం పై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డానని వైసిపి కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని ఆయన జగన్ వద్ద ప్రస్తావించారు. వంశీ వైసిపిలో చేరినా.. నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటానని జగన్ యార్లగడ్డకు భరోసా ఇచ్చారని తెలిపారు. వంశీ పార్టీలోకి వచ్చే విషయం తనకు తెలియదని.. జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని.. వైసీపీలోనే ఉంటానని యార్లగడ్డ ప్రకటించారు.  వంశీ పార్టీలోకి వస్తే యార్లగడ్డ, వంశీ ఇద్దరూ కలిసి పని చేస్తారా? కేడర్ కలిసిపోతుందా?? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే టికెట్ హామీ జగన్ ఎవరికి ఇవ్వనున్నారు అనే ప్రశ్న కార్యకర్తలను సతమతం చేస్తుంది. ఒకరికి ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తారనే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతుంది. వంశీ పార్టీలోకి వచ్చిన తర్వాత స్పందిస్తానని యార్లగడ్డ అంటున్నారు. వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తికర చర్చ సాగుతోంది.    

ఓరుగల్లులో చిచ్చు... నామినేటెడ్ పదవుల కోసం రాజుకున్న రాజకీయం

  అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే విధంగా ఉంది ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో టిఆర్ఎస్ పరిస్థితి. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం అధికార పార్టీలో కలకలం రేపుతూ ఉంది. పదవులు దక్కినవారు పండుగ చేసుకుంటుంటే పదవులు ఆశించి భంగపడిన వారు మాత్రం అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా కమిటీల నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుడా ఛైర్మన్ పదవీ కాలం ముగిసినప్పట్నుంచి ఆశావహులు ఆ పీఠంపై కన్నేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కుడా ఛైర్మన్ పదవిని మళ్లీ మర్రి యాదవరెడ్డికే కట్టబెట్టారు. దీంతో పదవి ఆశించిన వారంతా భంగపడ్డారు. మర్రి యాదవరెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించడంతో పాటు సభ్యులుగా ఐదుగురిని.. అడ్వైజరీ మెంబర్ లుగా మరో 15 మందిని నియమిస్తూ.. ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన వారిని పట్టించుకోలేదన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. స్థానికంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలే ఈ కమిటీ నియామకాల్లో చక్రం తిప్పారని అధికార పార్టీ నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. కుడా ఛైర్మన్ పదవిపై పార్టీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకోగా ఇతర పదవుల పంపకాల్లో మాత్రం స్థానిక నేతల ప్రమేయం ఉందని గులాబీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పాలక మండలి, సలహా మండళ్లలో తమ అనుచరులకు అవకాశం కల్పించకపోవడంపై జిల్లాలోని మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. 3  జిల్లాల 19 మండలాలు 181 గ్రామాల్లో కూడా విస్తరించిన కీలకమైన కమిటీలో కొందరు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లనే పరిగణలోకి తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. లే అవుట్ లు, భూ లావాదేవీలు, భవన నిర్మాణాల విషయంలో కూడా అనుమతులు తప్పని సరి. కానీ నిధుల కేటాయింపు కమిటీల్లో మాత్రం హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలకూ అగ్రపీఠం వేస్తున్నారంటూ మిగతా ప్రాంత ప్రజా ప్రతి నిధులు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15 మందితో కూడిన సలహా మండలి కమిటీలో వరంగల్ ట్రైసిటీకి సంబంధించిన ఉద్యమకారులు, సీనియర్ లకు అవకాశం దక్కలేదని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. నిజానికి కూడా పాలక వర్గం సలహా మండలిని నియమించేటప్పుడు ఆ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు మంత్రి ఇతర సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈసారి కూడ అది జరిగి ఉంటుందని అందరూ భావించారు. అయితే కమిటీల విషయంలో టీఆర్ఎస్ లోనే నెమ్మదిగా అసంతృప్తి రాక మొదలైంది. పాలక వర్గంలో 10 మందికి అవకాశం కల్పించారు. మర్రి యాదవరెడ్డి చైర్మన్ గా, మున్సిపల్ కమిషనర్ వైస్ ఛైర్మన్ గా వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి రాజయ్యలతో పాటు మరో 3 అధికారులను సభ్యులుగా చేర్చారు. ఇదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో అసలు మేము ఉన్నామా లేమా అన్న అనుమానం కలుగుతోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సభలో సతీష్ కుమారు ఈ మాటలు అన్నారు. ఆయన మాటలు ఇప్పుడు ఉమ్మడి ఓరుగల్లులో ప్రకంపనలు రేపుతున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు సీనియర్ లలోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఏదేమైనా కూడా నూతన చైర్మన్ కమిటీల నియామకం అంశం అధికార పక్షంలో కొత్త చిచ్చురేపిన మాట నిజం. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఇతర పార్టీల నుంచి గులాబిదళంలో భారీగా వలసలు జరిగాయి. అధిక సంఖ్యలో ద్వితీయ శ్రేణి నేతలు ఆ పార్టీలో చేరారు. ఆశవహులు భారీ సంఖ్యలో ఉండటంతో ఎవరిని ఎలా బుజ్జగించాలో తెలీక పార్టీ సీనియర్ లు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి ఓరుగల్లులో రగులుతున్న ఈ వ్యవహారం ఎలా చల్లారుతుందో చూడాలి.

ధూళిపాళ్ల కూడా బాబుకి షాకిస్తారా? మరి, ఎందుకు సైలెంట్ అయ్యారు?

  ధూళిపాళ్ల నరేంద్ర... గుంటూరు మిర్చిలా ఘాటున్న నాయకుడు... 1994 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి... డబుల్ హ్యాట్రిక్ ను తృటిలో మిస్సైన నేత... పొన్నూరులో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ధూళిపాళ్ల... టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా... పవర్ ఫుల్ మౌత్ పీస్ గా గట్టిగా పనిచేశారు. అయితే, ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదన్న మనస్తాపంతో 2017 తర్వాత సెలైన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కనబడటం లేదు. కనీసం టీడీపీ కార్యక్రమాల్లో కూడా ధూళిపాళ్ల పాల్గొనడం లేదు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించినా... అటువైపు కనీసం కన్నెత్తికూడా చూడలేదు. పార్టీలో నెంబర్-2 లీడర్ తన నియోజకవర్గానికి వస్తే... ఎందుకు వెళ్లలేదని అందరూ మాట్లాడుకుంటున్నారు.  అయితే, ధూళిపాళ్ల... అయ్యప్పమాల వేసుకున్నారని, అందుకే... పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రాలేదని ఆయన అనుచరులు అంటున్నారు. నారా లోకేష్ ...రవి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినా... అయ్యప్పమాలలో ఉన్నందుకే పాల్గొనలేదని, అంతేగానీ వేరే ఉద్దేశమేమీ లేదని చెబుతున్నారు. చనిపోయినవాళ్ల ఇంటికి అయ్యప్పమాల వేసుకున్నవాళ్లు రాకూడదనే కారణంతోనే రాలేదని ధూళిపాళ్ల అనుచరులు వివరణ ఇస్తున్నారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న రవి ఇంటికి రాని ధూళిపాళ్ల... నారా లోకేష్ పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించినా ఎందుకు కలవలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం... ఇతర అంశాలపై చంద్రబాబు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా... ధూళిపాళ్ల ఎందుకు పాల్గొనలేదని, బాబు ఇసుక దీక్షకు సంఘీభావం తెలపలేదని అంటున్నారు. కనీసం గుంటూరు జిల్లాలో చేపట్టిన ఆందోళనల్లో కూడా ధూళిపాళ్ల పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక, వల్లభనేని వంశీ, కొడాలి నానిలు తీవ్రస్థాయిలో చంద్రబాబును దూషించినా... ధూళిపాళ్ల ఎందుకు నోరు మెదపడం లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అయితే, ధూళిపాళ్ల మౌనవ్రతం వహించడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని, అయితే... ఆళ్లపాటి రాజా కూడా పోటీపడుతుండటంతో... అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో తెలియక... సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, నారా లోకేష్ ...పొన్నూరు పర్యటన కూడా ఆళ్లపాటి రాజా ఆధ్వర్యంలోనే జరిగిందని, అందుకే ధూళిపాళ్ల దూరంగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. లోకేష్ కూడా... ఎక్కువగా ఆళ్లపాటి రాజాకు ప్రాధాన్యత ఇస్తున్నారని ధూళిపాళ్ల గుర్రుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే, మరో మాట కూడా వినిపిస్తోంది. ధూళిపాళ్ల కూడా వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ బాటలో వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ధూళిపాళ్ల కూడా వైసీపీలో చేరేందుకు రంగంసిద్ధంచేసుకుంటున్నారని అంటున్నారు. కానీ, ధూళిపాళ్ల అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. తెలుగుదేశానికి ధూళిపాళ్ల వీర విధేయుడని... అధిష్టానంతో కొన్ని సమస్యలున్నా... త్వరలోనే పరిష్కారమవుతాయని అంటున్నారు. మరి, ధూళిపాళ్ల ఎప్పుడు మౌనం వీడతారో... అప్పుడే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది.

తన నిర్ణయాలే తనకు శత్రువు.. జగన్ సర్కార్ పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసు!

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసులు నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖకు ఐదు దేశాలు సమాచారమిచ్చాయి. తమ పెట్టుబడుల ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించడమే తమ చర్యలకు కారణమని ఆయా దేశాలు అంటున్నాయి. ఈ వ్యవహారంపై పీఎంవో కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పంద వివాదం ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టాయి. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశాయి. ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం వివిధ దేశాలు ఏపీలో రూ.40వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించాయి. జపాన్, అబుదాబి, కెనడా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు తమ ప్రభుత్వ నిధులతో పాటు పెన్షన్ ఫండ్ నుంచి కూడా పెట్టుబడుల వెచ్చించాయి. ఈ సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యుత్ నియంత్రణ కమిషన్ లతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తరువాత టారిఫ్ లు నిర్ణయించారు.  ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఒప్పందాలను పట్టించుకోవడం మానేశారు. ముందుగా ధరలు తగ్గించాలంటూ పిపిఎలతో చర్చలు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. దీనిపై పునరుత్పాదక విద్యుత్ సంస్థలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు దీనిపై స్టే ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీని సస్పెండ్ చేసింది. ఎటువంటి కారణాలు లేకుండా పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు నిలిపి వేయడం కానీ.. బిల్లులూ చెల్లించడం కాని.. ఆపవద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించే అంశంపై రెగ్యులేటరీ కమిషన్ ను ఆశ్రయించవచ్చని సూచించింది. ఏపీ సర్కార్ 6 నెలల నుంచి సౌర, పవన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు బిల్లులు చెల్లించడం లేదు. విద్యుత్ కూడా తీసుకోవడం లేదు. తమ పెట్టుబడులకు ముప్పు ఏర్పడడంతో ఆయా దేశాలు భారత విదేశాంగ శాఖకు లేఖలు రాశాయి. వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని కేంద్రం చెప్పింది. అటువంటి సూచనలు కనిపించకపోవడం, బిల్లులు నిలిపి వేయడంతో ఈ దేశాలు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల అంశాల పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వం జరిపే ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖకు సమాచారమిచ్చాయి. దీంతో భారత విదేశాంగ శాఖ ఈ అంశాన్ని కేంద్రలోని అత్యున్నత స్థాయి వర్గాల దృష్టికి తీసుకువెళ్లింది. విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పునరుత్పాదక విద్యుత్ రంగంలో కుదిరిన ఒప్పందాలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండదు కనుక ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.  ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష, పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు బిల్లులు చెల్లించక పోవడం సరఫరా సక్రమంగా తీసుకోకపోవటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏర్పడిన వివాదానికి సంబంధించి అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశం లేదని ఏపీ అధికారులు చెప్తున్నారు. పెట్టుబడులు పెట్టిన సంస్థలు.. దేశాలు.. భారతదేశం పై ఉన్న నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తాము పెట్టుబడులు పెట్టామని చెప్తున్నారు. అందువలన అంతర్జాతీయ ట్రిబ్యునల్ ను ఆశ్రయించే హక్కు తమకుందని వాధిస్తున్నాయి. ఈ విషయం పై కేంద్ర విద్యుత్ శాఖ సీరియస్ గా ఉంది. ఈ అంశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వం తీరు వలన ఇతర రాష్ట్రాలలో కూడా పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో అలజడి ప్రారంభమయ్యే ప్రమాదముందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది.

ఉద్యమకారులకే పదవులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రశంసలు

  నలుగురు ఒక దారిలో వెళుతుంటే.. ఆ దారి నాకెందుకు, నా దారి రహదారి అనుకునే వాళ్ళను చూశాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం కూడా అలానే ఉంటుంది. తెలంగాణలో మిగతా చోట్ల టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ టాక్ వస్తే.. చొప్పదండిలో మాత్రం పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. అదే రాష్ట్రమంత ఆ పార్టీ అధిష్టానానికి పాజిటివ్ ఉంటే చొప్పదండిలో మాత్రం నెగిటివ్ టాక్ ఉంటుంది. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి అంటే వివాదాస్పదమైన నియోజకవర్గంగా పేరుంది. ఇక్కడ ఎప్పుడు ఎవరు రెచ్చిపోతారో ఎవరు సైలెంట్ గా ఉంటారో తెలియదు. సోషల్ మీడియా కూడా ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. మార్కెట్ కమిటీల్లో.. ఉద్యమం నుంచి పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇస్తున్నారని సభావేదికల మీద ఎమ్మెల్యే రవిశంకర్ ను కార్యకర్తలు ఆకాశానికెత్తుతున్నారు. వాస్తవంగా రాష్ట్రం మొత్తం మీద టిఆర్ఎస్ అధిష్టానం ఉద్యమకారులను పక్కన పెట్టిందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ముందు నుండి పార్టీ జెండా మోసిన వారిని కాకుండా ఉద్యమానికి ద్రోహం చేసిన నేతలను చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ను బాగా విమర్శించిన వారికి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారని స్వపక్షీయులే గగ్గోలు పెడుతూ వస్తున్నారు. కొన్నాళ్ల నుంచి బీటీ బ్యాచ్ వర్సెస్ బ్యూటీ బ్యాచ్ అంటూ జోరుగా చర్చ కూడ సాగుతోంది. ఇలా రాష్ట్రమంతటా అసలైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న చర్చ జరుగుతుంటే చొప్పదండిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తన నియోజకవర్గంలో ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారన్న పాజిటివ్ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెంకట్ రెడ్డిని నియమించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి మంత్రి గంగుల కమలాకర్ ను కూడా పిలిపించారు. వేదిక మీద ఆరు మండలాల ప్రజా ప్రతి నిధుల మధ్య పలువురు ఉద్యమకారులను సన్మానించారు. మరోవైపు గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరో ఉద్యమకారుడు మహిపాల్ రావుకు అవకాశమిచ్చారు. గంగాధర మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రుల కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు. ఉద్యమకారునికి పెద్ద పీట వేశారని వేదిక మీద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను నేతలు పొగిడారు. ఇక మల్యాల మండలంలోని ఉద్యమకారుడు జనగాం శ్రీనివాస్ కు మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం కూడా ఎమ్మెల్యే రవిశంకర్ కు మంచి పేరు తెచ్చింది. మొత్తం మీద చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నియోజకవర్గంలో ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం వద్ద ఆయనకు మంచి మార్కులే పడ్డాయన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే శాసన సభ ఎన్నికల ముందు సుంకె రవిశంకర్ కోసం కష్టపడ్డ ఇంకా కొంతమంది ఉద్యమకారులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే పదవులు రాని మండలాల్లో ఉన్న సీనియర్ కార్యకర్తలు కూడా ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని వారు కాంక్షిస్తున్నారు. ఏదేమైనా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీసుకున్న నిర్ణయాన్ని మిగతా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటే అసలైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగా టీఆర్ఎస్ అధిష్ఠానం పెద్దలు ఎమ్మెల్యేలు నడుస్తారో లేదో చూడాలి.

వేములవాడకు జర్మనీ ఎమ్మెల్యే... టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ!

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన మోసపూరితంగా తప్పుడు పత్రాలను సమర్పించి పౌరసత్వం పొందారని స్పష్టం చేసింది. తప్పుడు మార్గంలో చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం పొందారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై చాలా కాలంగా కోర్టులో విచారణ సాగుతోంది. ఇరువురి వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తెలంగాణ హై కోర్టు ఆదేశించడంతో హోంశాఖ ఇద్దరి వాదనలు విని నిర్ణయం ప్రకటించింది. విదేశీ పర్యటనకు సంబంధించి రమేష్ తప్పుడు సమాచారం అందించారని తేల్చింది. దాంతో ఆయన భారత పౌరసత్వానికి అర్హత కోల్పోయారని తెలిపింది. పౌరసత్వ చట్టంలోని 10(2),10(3) నిబంధనలను పరిగణలోకి తీసుకుంది. 5(1)(ఎఫ్) కింద పౌరసత్వ దరఖాస్తు చేసుకున్న తేదీకి ముందు రమేష్ తన విదేశీ పర్యటనల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా వాస్తవాలను దాచి పెట్టారని అభిప్రాయపడింది. ఆయన తన పౌరసత్వాన్ని వాస్తవాలను కప్పిపుచ్చటం ద్వారా సాధించారని అందుకు చట్టంలోని సెక్షన్ 10(2) కింద శిక్షార్హులవుతారని స్పష్టం చేస్తోంది. ఈ చర్య వల్ల ఆయన భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అనర్హులవుతారని తెలిపింది. భారత పౌరసత్వం పొందడానికి 2008 మార్చి 31 న రమేష్ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో గత ఏడాది కాలంగా దేశంలో నివసించారా అన్న దగ్గర ఔను అని టిక్ చేశారు. గత ఏడాది కాలంలో ఏమైనా విదేశీ పర్యటనలు చేస్తే వాటి వివరాలూ పంపించమని రమేష్ కు 2008 నవంబర్ 21 న లేఖ రాశామని తెలిపింది కోర్ట్. దానికి ఆయన తిరిగి సమాధానమిస్తూ ఎటువంటి విదేశీ పర్యటన చెయ్యనట్లు తెలిపారని హోంశాఖ వెల్లడించింది. దాంతో 2009 ఫిబ్రవరి 4 న రమేష్ కు పౌరసత్వాన్ని మంజూరు చేశామని చెప్పింది. తర్వాతి కాలంలో 2009 జూన్ 15 న ఆది శ్రీనివాస్ రివిజన్ పిటీషన్ దాఖలు చేశారని తెలిపింది. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు ఏడాదిలో 2 సార్లు రమేష్ విదేశీపర్యటన చేసినట్టు తేలిందని వెల్లడించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడానికి తాము నియమించిన కమిటీ 2017 లో నివేదిక అందించిందని రమేష్ భారత ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించారని కమిటీ తేల్చిందని వివరించింది. 2009 ఎన్నికల్లో వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై చెన్నమనేని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే జర్మన్ పౌరుడిగా ఉన్న చెన్నమనేని తప్పుడు మార్గంలో భారత పౌరసత్వం పొందారని.. 2010 లో హైకోర్టులో ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పౌరసత్వం చెల్లదని.. 2013 లో కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ చెన్నమనేని సుప్రీం కోర్టును ఆశ్రయించగా హై కోర్టు తీర్పు పై స్టే విధించింది. ఆలోగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున రమేష్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పౌరసత్వంపై 3 నెలల్లో తేల్చాలని 2016 ఆగస్టులో కేంద్ర హోంశాఖకు సుప్రీం కోర్టు ఆదేశించింది. తరవాతి కాలంలో హోంశాఖ కేసును పరిశీలించి పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది.  అటు పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని రమేష్ ప్రకటించారు. జూలై 15,2019 నాటి హై కోర్టు తీర్పును హోంశాఖ పరిగణలోకి తీసుకోక పోవటం శోచనీయమని చెప్పారు. తన పౌరసత్వాన్ని 2017 లో హోంశాఖ రద్దు చేసిన తర్వాత వెంటనే స్టే ఇచ్చిన హై కోర్టు సుదీర్ఘ వాదనలు విన్నదని జూలై 15,2009 న పౌరసత్వం రద్దును కొట్టివేసిందని అన్నారు. పౌరసత్వ చట్టం వాటి నిబంధనలు నైతిక విలువలను వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిశీలిస్తూ చూడాలి తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని చెప్పారు. ఏ నిర్ణయం వచ్చినా మళ్లీ తమ వద్దకు రావొచ్చని హై కోర్టు చెప్పిందన్నారు.

రాజీ పడినా తిప్పలు తప్పటం లేదు... లేబర్ కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు

  ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఇచ్చి గంటలు గడుస్తున్నాయి అయినా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు పంపాలని కోరింది. కార్మిక సంఘాలు కూడా లేబర్ కోర్టు పై విశ్వాసాన్ని ప్రకటించాయి. అయితే ఇప్పుడు లేబర్ కోర్టులో ఏం జరుగుతుంది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతుందా లేక కార్మికులకు అనుకూలంగా వస్తుందా అనే చర్చ జరుగుతోంది. కార్మిక చట్టాల ప్రకారం చర్చల ప్రక్రియ ముగిశాక 7 రోజుల తర్వాత సమ్మెకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ సంఘాలు అక్టోబర్ 4 న జాయింట్ లేబర్ కమిషనర్ సమక్షంలో చర్చలు జరిపాయి. మరుసటి రోజు.. 5 వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్ళాయి. దాంతో సమ్మె అక్రమమని జాయింట్ లేబర్ కమిషనర్ ప్రకటించారు. సమ్మె అక్రమమని జాయింట్ లేబర్ కమిషనర్ ఇచ్చిన నివేదికను పట్టించుకోవద్దని హై కోర్టు తుది తీర్పులో కోరింది. చర్చల పూర్తి సారాంశాన్ని 15 రోజుల్లో లేబర్ కోర్టుకు నివేదించాలని ఆదేశాలిచ్చింది. హై కోర్టు ఆదేశాల ప్రకారం లేబర్ కోర్టుకు నివేదిస్తామని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కార్మిక చట్టాలను అనుసరించి 6 నెలల్లోగా పరిష్కరించాలని కార్మిక చట్టాలు సూచించాయి. కార్మికశాఖ నివేదికపై కార్మికులు.. ఆర్టీసీ యాజమాన్య వర్గాల.. వాదనలు విన్న తరువాత సమ్మె అక్రమమైనదా కాదా అనేది లేబర్ కోర్టు తేల్చనుంది. సమ్మె సక్రమమైతే సమ్మె కాలానికి జీతభత్యాలు ఇవ్వమని కోరే అవకాశముందంటున్నారు. అదే సమ్మె అక్రమమైతే కార్మికులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించే అవకాశముంది. సమ్మె కాలానికి జీతాలు చెల్లించకపోగా గరిష్ఠంగా 8 రోజుల జీతానికి కోత విధించాలని ఆదేశించే అవకాశముంది. అంతేకాదు సమ్మె అక్రమమని నిర్ధారిస్తే కార్మికుల సర్వీసు నిబంధనల ప్రకారం శిక్షలు విధించే విచక్షణాధికారం ఉంది. ఇందులో ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా ఉందని న్యాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది జరగటానికి చాలా ఏళ్లు పట్టే అవకాశముంది. అంతకాలం వేచి చూడటం కంటే అటు ప్రభుత్వం అయిన ఇటు కార్మిక సంఘాలైన రాజీ కుదుర్చుకోవడం మేలని అంటున్నారు. లేకపోతే ప్రభుత్వం ప్రజా రవాణా పూర్తి స్థాయిలో పునరుద్ధరించటంలో ఇబ్బంది తప్పదు. ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టడానికి కూడా ఇది ఆటంకంగా నిలుస్తుందని అంటున్నారు.  

తెలంగాణలో మళ్లీ స్వైన్-ఫ్లూ కలకలం... రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు...

  చలి మెల్లమెల్లగా పెరుగుతోంది. చలితోపాటే వ్యాధులు కూడా వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు స్వైన్ ఫ్లూ కూడా మళ్లీ జడలు విప్పుతోంది. వాతావరణ మార్పులకు తోడు చలి పెరుగుతుండటంతో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతోన్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పెరుగుతున్న  స్వైన్ ఫ్లూ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నమోదైన కేసులే అందుకు రుజువు. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 98 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23మంది మృత్యువాత పడ్డారు. నవంబరులో కూడా రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృత్యువాతపడ్డారు. అయితే, చలి మరింత పెరగనున్న నేపథ్యంలో స్వైన్ ఫ్లూ కేసులు కూడా పెరిగే అవకాశముందని వైద్యులు అంటున్నారు. ఎవరైనా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు... హెచ్ఐవీ పేషెంట్లు... తప్పనిసరిగా వ్యాక్సిన్స్ తీసుకోవాలని చెబుతున్నారు.  

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం కానీ పెన్షన్ ఉండదు.. జగన్ హామీలో షరతులు!

  ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టు బట్టిన వాళ్లు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. అధికారులుకు జీతాలు బాగా తగ్గడంతో పాటు మొత్తం సిబ్బందికి పెన్షన్ ఉండదని చెబుతుండడమే ప్రధాన కారణాలు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆర్టీసీకి 52,000  మంది సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి నేతృత్వంలోని కమిటీ సెప్టెంబర్ లో ఇచ్చిన నివేదికలో ఆర్టీసీని విలీనం చేయటం సాధ్యం కాదనడంతో సిబ్బంది వరకు విలీనం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఆ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. డిసెంబర్ లోపే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ప్రజా రవాణా శాఖలోకి 52,000 ల మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. విధి విధానాలు రూపొందించి సిబ్బందిని విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. విధి విధానాల రూపకల్పనలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జీతాలు చాలా తగ్గించాలని కమిటీలోని కొందరు సభ్యులు సూచించినట్టు తెలిసింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ కన్నా ఆర్టీసీ ఈడీలకు ఎక్కువ జీతాలున్నాయని.. జిల్లా కలెక్టర్ల కన్నా రీజియన్ మేనేజర్ లకు వేతనాలు అధికమని తేలింది. వచ్చే జనవరి నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ ఈడీ, ఆర్ఎం, డీఎం లకు హోదాలకు అనుగుణంగా జీతాలు నిర్ణయించాలని కమిటీ సూచించినట్టు ఆర్టీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలవెన్సులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలనే చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే పెన్షన్ ఆర్టీసీ నుంచి విలీనమయ్యేవాళ్లకు వర్తించదని జీపీఎఫ్ ఇస్తే ఆర్థిక భారం ప్రభుత్వం పై ఎక్కువగా పడుతోందని అవసరమైతే సీపీఎఫ్ కి అవకాశమిద్దాం తప్ప జీపీఎఫ్ వద్దే వద్దని కమిటీ సభ్యుల పేర్కొన్నట్లు తెలుస్తోంది. పెన్షన్ ఉండబోదన్న వార్తలు కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. అదే లేకపోతే తమకు విలీనం వల్ల కలిగే లాభం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి జీవిత చరమాంకంలో కనీస పెన్షన్ భద్రత లేకుంటే ఎలా అంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వంలో విలీనమయ్యారు. రవాణా సంస్థలను అక్కడి ప్రభుత్వాలే నిర్వహిస్తూ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అహ్మదాబాద్, ముంబై, పూనె,తానే, షోలాపూర్ తదితర చోట్ల స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ లు నిర్వహిస్తున్నందున అక్కడ పెన్షన్ చెల్లించడం లేదు. దీన్నే కమిటీ అధికారులు ప్రస్తావిస్తున్నారు.

వైసీపీ ఎంపీల ఆక్రోశం.. ఆ ఇద్దరు రెడ్డి గార్లకే ప్రాధాన్యత.. మేమంతా అనామకులమా?

  సర్వం సాయి రెడ్డే అన్నట్లు సాగుతున్న పరిణామాలపై పలువురు వైసిపి ఎంపిలు రగిలిపోతున్నారు. జగన్ సహచరుడైన సాయిరెడ్డి తో పాటు సమీప బంధువు మిథున్ రెడ్డి కి మాత్రమే పార్టీ లో ప్రాధాన్యం దక్కుతుందని తమను పట్టించుకునే వారే లేరని ఆక్రోశిస్తున్నారు. సాయిరెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా, మిథున్ రెడ్డిని లోక్ సభలో పార్టీ నేతగా ప్రకటించారు జగన్. పార్టీలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను.. ఆ ఇరువురు గీసిన గీత దాటవద్దని ఆదేశించారు. ఢిల్లీలో అన్ని అధికార పదవులు విజయసాయిరెడ్డికి అప్పజెప్పడంతో పాటు ఆయనను సంప్రదించకుండా ఏది చేయకూడదని.. ప్రధానమంత్రిని ,  కేంద్ర మంత్రులను కూడా కలవకూడదని స్పష్టం చేశారు జగన్.  తమ కంటే వయసులో అనుభవంలో చిన్నవాడైన మిథున్ రెడ్డి అదుపాజ్ఞలో నడుచుకోవాలని జగన్ ఆదేశించడం సబబు కాదని కొందరు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకే సభా వ్యవహారాల కమిటీతో పాటు నాలుగు కీలక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిని చేయడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడటం లేదు. ప్రతి దానికీ ఆ ఇద్దరేనా.. వారిలో అంత ప్రత్యేకత ఏముందంటూ మండిపడుతున్నారు. ప్రధానమంత్రిని నేరుగా కలిస్తే తప్పేంటి.. ఢిల్లీలో వారికే ప్రాధాన్యత ఉండాలా.. మేమంతా అనామకులుగానే మిగిలిపోవాలా.. అని పలువురు ఎంపీలు అంతర్గత సంభాషణల్లో ఆక్రోశిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను కలిస్తే వారికి ఎక్కడ సన్నిహితం అవుతామేమోనని వైసీపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు ఉందని.. బీజేపీ తమను ఆకర్షిస్తుందనే భయం వారిలో ఉన్నట్లుందని కొందరు చెబుతున్నారు. కోట్లు ఖర్చుపెట్టి దేశ రాజధానికి వస్తే ఇక్కడ ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొందని మరికొందరు వాపోతున్నారు. ఎంతమంది ఉన్నా ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించలేక పోతున్నాం. సభలో సెంట్రల్ హాల్ లో అనామకులు లాగా ఉండిపోవల్సి వస్తుందని ఎవరినీ పలకరించకుండా కట్టడి చేయడంతో పాటు నిఘా కూడా పెట్టారని ఒక ఎంపీ తన సహచరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఏం మాట్లాడాలన్నా.. వినతి పత్రం సమర్పించాలని వాపోతున్నారు. విజయసాయిరెడ్డి కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని తెలిపారు. జగన్ సర్కారు నిర్ణయాలను ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులు.. ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారని వారికి జవాబు చెప్పలేకపోతున్నామని వైసిపి ఎంపిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో క్రైస్తవ మత వ్యాప్తిని ప్రధాన ఎజెండాగా జగన్ పెట్టుకున్నట్టు కనపడుతుందన్న చర్చ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరుగుతుందని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షలు, రాజధాని నిలిపివేత, పోలవరంపై రివర్స్ టెండర్ తదితర అంశాలపైనా చర్చ జరుగుతుందని వీటిపై జాతీయ పత్రికల్లో కథనాలు సంపాదకీయాల గురించి కూడా తమను అడుగుతున్నారని ఒక ఎంపీ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై వివాదాస్పద నిర్ణయాల ప్రభుత్వమనే ముద్ర పడిందని తెలిపారు. వైసీపీలో తమకు ఉక్కపోత వాతావరణం నెలకొన్నదని.. ఇది మరింత పెరిగి ఊపిరాడని పరిస్థితి వస్తే మరో చల్లటి వాతావరణం చూసుకోవాల్సి వస్తుందని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

అనుకున్నది అనుకున్నట్టు చేసిన జగన్... విపక్షాల విమర్శల్ని లెక్కచేయని సర్కారు

  ఏపీలో నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ... ప్రైవేట్ స్కూల్స్‌కి ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఏడాదికో క్లాస్ పెంచుకుంటూ టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపిన ప్రభుత్వం... తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇక, ఇంగ్లీష్ మీడియంలో విద్యాభోదన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. టీచర్ల నైపుణ్యాభివృద్ధి కోసం ఎస్‌‌ఈఆర్టీతో కలిసి పనిచేయాలని విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి వీలుగా టీచర్లకు హ్యాండ్ బుక్స్, శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. అలాగే, భవిష్యత్తులో చేపట్టబోయే ఉపాధ్యాయ నియామకాల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యమున్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఇంగ్లీష్ మీడియం అమలుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని పిల్లలపై రుద్దుతున్నారని మండిపడుతున్నారు. ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే విద్యార్ధులకి అర్ధంకాదని, అలాగే ఇంగ్లీష్‌లో బోధించగలిగే సామర్ధ‌్యమున్న ఉపాధ్యాయులు లేరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాల మాటలను పట్టించుకోని జగన్ ప్రభుత్వం.... తాము అనుకున్నది అనుకున్నట్టు అమలు చేస్తోంది. అంతేకాదు, పేద పిల్లల భవిష్యత్తు... ఏపీ విద్యార్ధులు... ప్రపంచంతో పోటీ పడేందుకే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు జీవోలో పేర్కొంది.

చినజీయర్ ఎందుకు స్పందించరు? కేసీఆర్ పై వీహెచ్ కీలక వ్యాఖ్యలు 

  వీహెచ్ మాట్లాడుతుంటే ఒక్కోసారి కామెడీగా అనిపిస్తుంది కానీ... చాలా మంది టీకాంగ్రెస్ లీడర్లతో పోలిస్తే... హైపర్ యాక్టివ్ గా పనిచేస్తారు. 70ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా పోరాట పటిమ చూపిస్తారు. ఇష్యూ ఏదైనా వేగంగా స్పందిస్తారు. బాధితులను కలిసి భరోసా నింపుతారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడటంలో వీహెచ్ స్టైలే వేరు. వీహెచ్ ఏం మాట్లాడినా మీనింగ్ ఫుల్ గానే ఉంటుంది. ఏదిపడితే అది మాట్లాకుండా పాయింట్ టు పాయింటే మాట్లాడతారు.  తాజాగా, అధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామిపై వీహెచ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... చినజీయర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాతిక మందికి పైగా కార్మికులు చనిపోయారన్న వీహెచ్‌... ఇవన్నీ చినజీయర్ కు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. కేసీఆర్ మీరు గీసిన దాటరు కదా... మరి ఎందుకు ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయమని ముఖ్యమంత్రికి చెప్పడం లేదంటూ ప్రశ్నించారు. కార్మికులు, పేదల కష్టాలపై స్పందించినప్పుడే చినజీయర్ స్వామి ప్రవచనాలకు అర్ధముంటుందన్నారు. ఇప్పటికైనా... ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సలహా ఇవ్వాలని చినజీయర్‌కు సూచించారు. ఇక, రెవెన్యూశాఖలో అవినీతిపైనా వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని వీహెచ్ ఆరోపించారు. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదని, అందుకే ప్రజలు పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి.... రెవెన్యూశాఖ ప్రక్షాళన చేయాలని కోరారు.

యూనివర్సిటీ భూములను వదిలేయండి... ఏపీ ప్రభుత్వ భూముల అమ్మకం!

  నవరత్నాలు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ భూములను.. వాటి పరిధిలోని సంస్థల భూములను.. కూడా అమ్మాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. అందుకోసం బిఏపి ని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంతో పాటు యూనివర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల భూములు కూడా అమ్మాలని ఆ ఒప్పందంలో లిఖిత పూర్వకంగా తెలిపింది. విక్రయానికి పనికొచ్చే భూముల వివరాలు వెల్లడించాలంటూ ఇటీవల రెండు ఫార్మాట్లలో సమాచారం కోరింది.  యూనివర్సిటీల భూములు అమ్మాలని నిర్ణయించడాన్ని విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి వర్గాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సరస్వతి నిలయాల్లో భూములు విక్రయించవద్దని ప్రభుత్వానికి పలు వినతులు అందుతున్నాయి. ఈ వ్యవహారం వర్సిటీలు.. కాలేజీల్లో.. కొత్త అలజడికి దారితీస్తుండడంతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. వర్సిటీలు.. విద్యాసంస్థలు.. కాలేజీల భూములను అమ్మవద్దని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. వర్సిటీ భూములను జాబితాలో చేర్చి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. అన్ని విశ్వవిద్యాలయాలు.. కాలేజీలు.. పాఠశాలల భూములకు బిల్డ్ ఏపీ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇస్తున్నామని ఒకవేళ ఏవైనా జిల్లాలో వీటికి సంబంధించిన భూములను మాస్టర్ ప్లాన్ లో చేరిస్తే వెంటనే తొలగించాలని బిఏపికి కలెక్టర్ లకు సీఎంవో ఆదేశాలిచ్చింది.ఈ నేపధ్యంలో ఎన్బీసీసీ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని రెవెన్యూశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.

కిరణ్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు... మాజీ సీఎంపై సోనియా ఆశలు...

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా... కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా పట్టు నిలుపుకోలేకపోయిన మాజీ సీఎం కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి... మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలను కిరణ్ కుమార్‌ రెడ్డికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్‌గా కిరణ్‌ పేరును దాదాపు ఖరారు చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ... కిరణ్ కుమార్ రెడ్డి వైపే... సోనియా మొగ్గుచూపారని అంటున్నారు. రెండు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా... ఘోర పరాజయాన్ని చవిచూడటంతో అసలు ప్రజల్లోకి రావడమే మానేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి... ఈ ఐదేళ్లలో కేవలం ఐదారుసార్లు మాత్రమే మీడియాకి కనిపించారు. 2014 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుంచి తన తమ్ముడిని బరిలోకి దింపిన కిరణ్ కుమార్ రెడ్డి డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. అప్పట్నుంచి పొలిటికల్‌ గా లోప్రొఫైల్‌ మెయింటైన్ చేస్తోన్న కిరణ్‌రెడ్డి‌... ఏడాది క్రితమే మళ్లీ కాంగ్రెస్ లో చేరి... మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో చేరడమైతే చేరారు కానీ... పొలిటికల్ గా మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అయితే, రఘువీరారెడ్డి స్వచ్ఛందంగా ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, కొత్త సారధి కోసం కొన్నేళ్లుగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్  ఉమన్ చాందీ కూడా ఏపీసీసీ సారధి కోసం అందరి నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. పీసీసీ పగ్గాల కోసం పల్లంరాజు, చింతామోహన్, శైలజానాథ్ తదితర నేతలు పోటీ పడినా... ఏపీ కాంగ్రెస్ లీడర్లలో ఎక్కువ మంది కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడంతో... అతనివైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నియామకంపై ఒకట్రెండు రోజుల్లోనే ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ అండ్ సీడబ్ల్యూసీ స్థాయి పదవిని ఆశించిన కిరణ్ రెడ్డి... మరి, ఏపీసీసీ పగ్గాలు చేపడతారో లేదో చూడాలి.

టిటిడి తరహాలో శబరిమలలో బోర్డు ఏర్పాటు చెయ్యాలి :- సుప్రీం ఆదేశం

శబరిమలపై కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ తరహాలో శబరిమల బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాన్ని తయారు చేయాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఆ చట్టాన్ని తీసుకురావటానికి 4 వారాల గడువి ఇచ్చింది సుప్రీంకోర్టు. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సూచించింది. గడువు లోగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. మహిళలపై ఎలాంటి నిషేధం లేదని అన్ని వయసుల వాళ్ళు స్వామిని దర్శించుకోవచ్చుని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మహిళల ప్రవేశంలో గతంలో ఇచ్చిన జడ్జిమెంటే అమల్లో ఉంటుందని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం ఇప్పడు ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పదు. నిజానికి అక్కడ ఒక బోర్డ్ ని ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక చట్టాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలంటూ గతంలోనే ఆదేశాలిచ్చింది. సుప్రీం ఆదేశాలను ఇప్పటి వరకు కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానితో ఈ రోజు ( నవంబర్ 20న ) సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే శబరిమలలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  లక్షలాది సంఖ్యలో వచ్చే భక్తులకు సంబంధించి సదుపాయాల కల్పన విషయంలో.. అడ్మినిస్ర్టేషన్ విషయంలో.. మరే విషయంలో అయినా బోర్డు ఉండటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. అది కూడా టీటీడీ తరహాలో  ఆ బోర్డుకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి ఉంటే వాటి నిర్వహణ అన్నీ సక్రమంగా ఉంటాయన్న అభిప్రాయం.

గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

కంపెనీ నుండి నోటీసులు వచ్చాయి.. ఉద్యోగం పోతుందన్న మనస్థాపంతో మరో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మాదాపూర్ గోల్డెన్ హిల్స్ క్యాప్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హరిణి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంది. గచ్చిబౌలిలోని వెంకటేశ్వర ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. నెల నెలా ఇంటికి డబ్బులు పంపుతూ.. తన కాళ్ళ మీద తను నిలపడుతుంది. ఈ క్రమంలో కంపెనీ ఆమెతో పాటు మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చింది. వచ్చే నెలతో ఉద్యోగం పోతుందని తీవ్ర మనస్థాపానికి గురైన హరిణి హాస్టల్ రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హరిణి నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే దానికి కారణాలు మాత్రం కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ రావటమేనని అంటున్నారు.ఎప్పటిలానే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో చాలామంది ఉద్యోగులను తొలగిస్తూ ఉంటారు.. అదే సమయంలో హరిణికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చారు. ఆమె ఒక్క దానికే కాదు దాదాపు 25 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. నిన్న ( నవంబర్ 20న ) రాత్రి ఆమె 8 గంటల 30 నిమిషాల సమయంలో ఆమె హాస్టల్ కు వచ్చి హాస్టల్ లో ఉరేసుకున్నట్టుగా హాస్టల్ నిర్వాహకుల ద్వారా సమాచారం తెలిసింది. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిజంగానే ఆమెకు ఈ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు. నోటీస్ ఆమె ఒక్కదానికే ఇచ్చారా లేదంటే మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారా అన్న విషయం పై పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం.. ఆమెతో పాటు 25 మందికి పైగా నోటీసులు ఇచ్చినట్లు తేలింది. కాబట్టి ఆమె సూసైడ్ కి అదే కారణమా లేదంటే ఇంకా వేరే ఏదైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహా క్లైమాక్స్..! శివసేనకు సోనియా గ్రీన్ సిగ్నల్

రోజుకో మలుపు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. శివసేనకు మద్దతుపై తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఓకే చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు శివసేనకు సహకరించాలంటూ మహారాష్ట్ర కాంగ్రెస్‌ను సోనియాగాంధీ ఆదేశించారు. అయితే, శివసేనలో మొదట ఆశలు రేపిన ఎన్సీపీ తీరే ఇప్పుడు అనుమానంగా మారింది. అయితే, ఇప్పటికే పలుమార్లు సోనియాతో చర్చించిన శరద్ పవార్... శివసేనకు మద్దతుపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న శివసేనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి సర్కారు ఏర్పాటును 17మంది శివసేన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిద్ధాంతపరంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, ఎన్సీపీతో పోరాడిన శివసేన... ఇప్పుడెలా ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టితే అస్సలు ఒప్పుకునేది లేదని ఉద్దవ్ కి తేల్చిచెప్పారు. అయితే, చర్చలు కొలిక్కి వస్తున్న సమయంలో 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం శివసేనకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌... సడన్ గా ప్రధాని మోడీతో సమావేశమవడంపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. శివసేనతో విసిగిపోయిన బీజేపీ.... ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందంటూ ప్రచారం జరిగింది. అలాగే, ఎన్డీఏలోకి ఎన్సీపీ రానుందని కథనాలు వచ్చాయి. అయితే, పవార్‌పై మోడీ ప్రశంసలు కురిపించిన తర్వాత ఈ భేటీ జరగడంతో... రెండు పార్టీల దోస్తీ మధ్య దోస్తీ కుదిరిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తమ మధ్య రాజకీయ చర్చలేమీ జరగలేదని, రైతాంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికే కలిసినట్లు పవార్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ రాజకీయ అడుగులు ఇలాగుంటే... బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా, శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్స్ ... అలాగే చిన్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. అయితే, త్వరలో నెలరోజుల మహాడ్రామాకు తెరపడుతుందని.... శివసేనో లేక బీజేపీనో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంటున్నారు.