మొత్తానికి జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు... ఎందుకంటే?

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశాను. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జితో కూడిన బృందం... సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. హుద్ హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీ పరిశ్రమ 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఇళ్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని నిర్మాతల బృందం కోరగా, జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాదాపు 15కోట్ల రూపాయలతో హుద్ హుద్ బాధితుల కోసం టాలీవుడ్ నిర్మించిన ఇళ్లను త్వరలోనే సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఇదే మొదటిసారి కలవడం. పైగా, చిత్ర పరిశ్రమ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా జగన్ ఇవ్వలేదనే మాట వినిపించింది. అయితే, ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ద్వారా, జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది.

కియాపై మరో న్యూస్ నెట్ వర్క్ కథనం... ఖండించిన కోట్రా...

ఏపీ నుంచి కియా మోటర్స్ కార్ల పరిశ్రమ తరలిపోతుందన్న ప్రచారాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కియా పరిశ్రమను తరలించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టింది. కియా మోటర్స్ ఎక్కడికి తరలించేది లేదని స్పష్టం చేసింది. రాయిటర్స్ కథనంతో కియా తరలింపుపై కలకలం రేగగా, తాజాగా... కియా తరలిపోతుందంటూ ఆసియా కమ్యూనిటీ న్యూస్ నెట్‌వర్క్‌ కథనం రాయడంతో... కోట్రా దానిని ఖండించింది. ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాకారం, మద్దతు ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో కియా యూనిట్ ను ఏర్పాటు చేశామని...ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని కియా మోటర్స్  ఎండీ కుక్ యున్ షిమ్ తెలిపారు.

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ.. ఇప్పటివరకు 27మంది మృత్యువాత...

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్  కొనసాగుతోంది. ఈశాన్య ఢిల్లీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నా... అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. పెద్దఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించినప్పటికీ, పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. దాంతో, రంగంలోకి దిగిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ... ఈశాన్య ఢిల్లీలో తిరుగుతూ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఇక, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 27మంది మరణించగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 1984 ఘటనలను పునరావృతం కానివ్వరాదన్న న్యాయస్థానం... బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, బాధితులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వంపై రజనీకాంత్  విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని తలైవా ప్రశ్నించారు. హోంశాఖ, నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఢిల్లీలో ఘర్షణలు జరిగాయని రజనీ ఆరోపించారు.  ఢిల్లీ అల్లర్లపై అధికార, ప్రతిపక్షాల మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. హస్తిన ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సోనియాగాంధీ డిమాండ్ చేశారు. అయితే, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కౌంటరిచ్చారు.  

ఏపీలో మొదలవుతున్న పరీక్షల సీజన్.. అధికారుల విస్తృత ఏర్పాట్లు

ఏపీలో పబ్లిక్ పరీక్షల సీజన్ మొదలు కాబోతోంది. వచ్చే నెల 4 నుంచి ఇంటర్, 23 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ సచివాలయంలో వెల్లడించారు. వీటి ప్రకారం ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం 1411 పరీక్ష కేంద్రాను సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ మీడియట్ పరీక్షలు రాయనున్నారు. అలాగే పదో తరగతి పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 6 లక్షల 30 వేల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 2,900 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు.తీసుకోనున్నారు.. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయించనున్నారు. 1400 ఇంటర్ పరీక్ష, 2900 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినందున విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి హాల్ టికెట్ పైనా క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి హాల్ టికెట్ ను తనిఖీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విద్యామంత్రి తెలిపారు. గతంలోలా పొరుగు రాష్ట్రాల్లో మన విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇన్విజిలేటర్లుగా వాడుకోనున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు మార్చి 3 తేది నుంచి, పదో తరగతి పరీక్షలకు 14 తేదీ నుంచి కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. ఇన్విజిలేటర్లుగా గా అవకాశం ఉంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని విద్యామంత్రి సురేష్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని సురేష్ పేర్కొన్నారు. జవాబు పత్రం కేవలం 24 పేజీలతో ఉంటుందని, ఈసారి అడిషనల్ తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. నూజివీడు ఐఐఐటీలో బాలికల హాస్టల్లో విద్యార్ధి చొరబడిన ఘటనపై విచారణ కమిటీ వేశామని .దీనిపై నివేదిక వచ్చాక చర్యలు చేపడతామని సురేష్ వెల్లడించారు.

అమరావతి పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు.. వచ్చేనెల 30కి విచారణ వాయిదా

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఏఫీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇందులో మూడు రాజధానులకు ఉద్ధేశించిన సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లుతో పాటు కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా ధర్మాసనం ముందు పిటిషనర్లు వాదనలు వినిపించారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియ ఇంకా మొదలు కానందున అమరావతిలో హైకోర్టులో జరుగుతున్న పనులు కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. మూడు రాజధానుల ఏర్పాటు సందర్బంగా దాఖలైన పిటిషన్లను వేర్వేరుగా విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో మూడు రాజధానుల ప్రక్రియకు ప్రాతిపదికగా ప్రభుత్వం చెబుతున్న జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూపు నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. వివిధ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం వీటిపై తదుపరి వాదనలను వచ్చే నెల 30కి వాయిదా వేసింది.

పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్

ఏపీలో విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వైసీపీ సర్కారు ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ రంగంపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారీకి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త విధానం ఉండాలని జగన్ ఆదేశించారు. ఏపీలో కొత్తగా ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా విద్యుత్ ఎగుమతుల విధానం ఉండాలని సీఎం సూచించారు. ఏపీలో కొత్తగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన భూములు తీసుకునే ప్రతిపాదనపైనా జగన్ విద్యుత్ రంగ సమీక్షా సమావేశంలో చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని సీఎం తెలిపారు. దీనివల్ల ప్రతిఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వీరికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని వారు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ నిర్మాణంపైనా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను కోరారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాలపైనా సమావేశంలో చర్చించారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణపై దేవినేని ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, డీజీపీ ఆఫీసులో నిర్ణయాలను సీఎం జగన్ సన్నిహితులు తీసుకుంటున్నారని ఉమ ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. పోలీసు శాఖలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపైనా ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా మార్పురావడంలేదని ఆయన మండిపడ్డారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించే స్థాయికి పోలీసులు వెళ్లారని ఆయన విమర్శించారు. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పటికీ నీళ్లు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ సర్కారు అని అన్నారు.

ఇంత దీనపు పలుకులు ఏమిటి?.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీ ప్రజాచైతన్యయాత్రలో భాగంగా విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయారని, పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశామని చంద్రబాబు చెబుతున్నారని, 9 సార్లు ఆయన్ను గెలిపించిన కుప్పం ప్రజలు ఇంకా ఐదు రూపాయల భోజనం కోసం ఎదురుచూస్తుండటమేమిటని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇంత దీనపు పలుకులేమిటని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని, మీరు అధికారంలో ఉంటే 15% అంచనాల పెంపు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవారని సాయిరెడ్డి తన ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా మీది అంటూ చంద్రబాబునుద్దేశించి విజయసాయి వ్యాఖ్యానించారు..చివరిగా ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

అమరావతిపై టీడీపీ కొత్త ప్లాన్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయసేకరణ

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి ఇప్పటివరకూ ఆందోళనలు సాగిస్తున్న టీడీపీ తాజాగా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన టీడీపీ వైసీపీ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతోంది. ఎలాగో ప్రజల్లోకి వెళుతున్నారు కాబట్టి అందులో భాగంగానే మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని భావిస్తోంది... మూడు రాజదానుల నిర్ణయంతో ప్రజలను సీఎం జగన్ అయోమయంలోకి నెట్టారని, తన స్వార్ధం కోసమే విశాఖను రాజధానిని ఎంచుకున్నారు తప్ప అక్కడ అభివృద్ధి చేసే ఉద్దేశం ఆయనకు లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించామని, అందులో భాగంగానే రేపటి నుంచి జరగబోయే యాత్రలో ప్రజాభీష్టమేమిటో తెలుసుకుంటామని రవీంద్ర వివరించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తామని, జగన్ అమరావతి కేంద్రంగా చేస్తున్న అల్లరిని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామన్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతిపై జగన్ తన అక్కసును వెళ్లగక్కుతుంటే కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. కేంద్రం ఇప్పటికైనా జగన్ నిర్ణయంపై తన అభిప్రాయమేంటో స్పష్టంగా చెప్పాలన్నారు. అమరావతిలోని 132 సంస్ధలను తరిమేస్తున్న జగన్ విశాఖను అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మే స్ధితిలో లేరని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉండే పేదల కోసం గత ప్రభుత్వం 5 వేల ఇళ్లను నిర్మించిందని, వాటిని గాలికొదిలేసి మళ్లీ పేదలకు రాజధానిలో భూములు కేటాయిస్తామనడం విడ్డూరమన్నారు.

పేదలకు వివాదాస్పద భూములిస్తారా ? జగన్ సర్కారుకు పవన్ ప్రశ్న...

ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సూచించారు. నిర్దిష్ట అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తే వివాదాలు రేగే అవకాశముందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని పవన్ తప్పుబట్టారు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామంటే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని, చిత్తశుద్ధి ఉంటే పేదలకు వివాద రహిత భూములనే పంపిణీ చేయాలని హితవు పలికారు. భూములు ఇచ్చిన రైతులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమేనని ఆరోపించారు. రాజధాని భూములను లబ్దిదారులకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, కానీ ఆ తర్వాత చట్టపరమైన చిక్కులు వస్తే బాధపడేది పేదవాళ్లేనని అభిప్రాయపడ్డారు.

హీరో మహేష్ బాబుకి జగనన్న విద్యా దీవెన!!

స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో.. ప్రభుత్వాలు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడం, పన్ను రాయితీలు ఇవ్వడం కామన్. అలా కాకుండా వెరైటీగా ఓ స్టార్ హీరోకి ప్రభుత్వ పథకం వర్తింప చేస్తే ఎలా ఉంటుంది?. ఏపీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని హీరో మహేష్ బాబు ఫోటో ఓ ప్రభుత్వ పథక లబ్ధిదారుల్లో ప్రత్యక్షమైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకానికి సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేసిన కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్ బాబు ఫొటో వచ్చింది. మరోచోట కూడా లోకేష్ అనే విద్యార్థి ఫోటో స్థానంలో మహేష్‌బాబు ఫోటో ప్రత్యక్షమైంది. దీంతో షాకైన విద్యార్థులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్డుల జారీలో లోపాలు బయటపడటంతో అధికారులు.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆరా తీస్తున్నారు.

ఢిల్లీ అల్లర్లు.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని చంపి మురికి కాలువలో పడేసారు!

ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 26 ఏళ్ల ఇంటిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మను అల్లరి మూకలు హతమార్చాయి. ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన శర్మ.. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన అంకిత్ శర్మ.. ఓ మురుగు కాలువలో విగతజీవిగా కనిపించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లరిమూక ఆయనపై దాడి చేసి, హతమార్చి, పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసింది. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అంకిత్ శర్మ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 200 మందికి పైగా గాయపడినట్టు సమాచారం.

మైలవరంలో మర్డర్స్ మిస్టరీ.. ఉమా ఖాతాలో ఒకటి, వసంత ఖాతాలో రెండు!

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే, ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయ నాయకుల విమర్శలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు హత్యారోపణలు చేసుకుంటూ కొత్త చర్చలకు దారి తీస్తున్నారు. 2019 ఎన్నికలలో కృష్ణా జిల్లా మైలవరంలో టీడీపీ తరపున దేవినేని ఉమా, వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ బరిలోకి దిగగా.. వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. ఎన్నికల ముందు నుంచే ఉప్పు-నిప్పులా ఉన్న వీరి మాటల యుద్ధం, ఎన్నికల తరువాత మరింత తీవ్రతరమైంది. ఇక రాజధాని అంశంతో వీరి మాటల యుద్ధం మరోస్థాయికి వెళ్ళిపోయింది. రాజధానిగా అమరావతిని మారిస్తే.. రాజీనామా చేస్తానన్న కృష్ణప్రసాద్.. తరువాత యూటర్న్ తీసుకొని మూడు రాజధానులు జై కొట్టారు. అంతేకాదు, మూడు రాజధానులకు మద్దతుగా.. వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలీని కూడా ప్రారంభించారు.  ఈ నేపథ్యంలో దేవినేని ఉమా.. వసంత కృష్ణప్రసాద్ మరియు ఆయన తండ్రి పై విమర్శలు గుప్పించారు. ప్రజల్ని అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు వంచించారని.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగలేదు. బినామీ ఆస్తుల కోసం సొంత బంధువు పొదిలి రవిని వసంత నాగేశ్వరరావు పొట్టన పెట్టుకున్నారన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని వసంత ఇంట్లో పని చేస్తున్న బాపట్ల మేరీ ఎలా చనిపోయిందో చెప్పాలని ఉమా డిమాండ్‌ చేశారు. ఉమా వ్యాఖ్యలపై వసంత నాగేశ్వరరావు కూడా అదే స్థాయిలో స్పందించారు. బాపట్ల మేరీ చనిపోయిన రోజు కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నాడని రుజువు చేస్తే నేను తల తీసుకుంటా లేదంటే నువ్వు తల తీసుకుంటావా అని సవాల్ చేశారు. అంతటితో వదిలి పెట్టలేదు.. వదినను చంపిన దేవినేని ఉమాకు సవాల్ చేయాలంటే సిగ్గుగా ఉందన్నారు. మొత్తానికి ఇప్పుడు.. పొదిలి రవి, బాపట్ల మేరీ, ఉమా వదిన మరణాలు చర్చనీయాంశమయ్యాయి. ముందు ముందు వీరి మాటల యుద్ధం ఇంకే స్థాయికి వెళ్తుందో ఏంటో!.

ఢిల్లీ అల్లర్లలో 20కి చేరిన మృతులు.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం...

ఢిల్లీలో గత కొన్నిరోజులుగా కొనససాగుతున్న అల్లర్లు అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు ఢిల్లీ అల్లర్లపై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ అల్లర్లకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ డిమాండ్ చేశారు. అల్లర్లను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమైనప్పుడు సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు రంగంలోకి దించలేదని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్లకు నిరసనగా రేపు దేశ రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని సోనియాగాంధీ ప్రకటించారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవర్ స్పందించారు. ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుటోందని, ఇప్పటికే అల్లర్లను అదుపులోకి తీసుకురావడంతో పాటు టీవీల్లో రెచ్చగొట్టే కథనాలు, వ్యాఖ్యలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చామని సమాచార, ప్రసారమంత్రి కూడా అయిన జవదేకర్ వెల్లడించారు. కేంద్రం బాధ్యత వహించాలని కోరుతున్న సోనియాగాందీకీ ఇంత జరుగుతుంటే ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారో కూడా చెప్పాలన్నారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లపై లక్నోలో మాట్లాడిన సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ.. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఢిల్లీ అల్లర్లు యూపీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పిన ప్రియాంక.. ప్రజలు కీలక సమయంలో విజ్ఞతతో వ్యవహరించి రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపీకి అల్లర్లు విస్తరించకుండా రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు. హస్తినలో అల్లర్లపై హైదరాబాద్ లో ఏఎన్ఐ వార్తాసంస్ధతో మాట్లాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. దీనికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే పరిస్ధితి చక్కదిద్దాల్సింది పోయి హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో తనపై విమర్శలు చేస్తున్నారని ఓవైసీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు అల్లర్లను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఓవైసీ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఘర్షణలను అదుపుచేయాలన్నారు. మరోవైపు అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం అవసరమైతే సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల ప్రజల్లో స్ధైర్యం నింపేందుకు ఇవాళ పోలీసులు కవాతు నిర్వహించారు. అదే సమయంలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజన్స్ అధికారి మృతదేహం ఓ డ్రైనేజీ సమీపంలో లభ్యం కావడం కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అల్లర్ల సమయంలో విదులు నిర్వహించేందుకు వెళ్లిన అంకిత్ శర్మను ఎవరు హతమార్చి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని మోడీ ట్విట్టర్ లో కోరారు.

ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర.. అమిత్ షా రాజీనామా చేయాలి!!

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 20కి చేరింది. 189 మంది చికిత్స పొందుతున్నారని జీటీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గౌతమ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొనసాగుతున్న హింసపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో అల్లర్లు జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఈ అల్లర్లకు బీజేపీనే కారణమని విమర్శించారు. ఢిల్లీలోని ఈ హింస వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇటువంటి ఘటనలనే ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ దేశం యావత్తూ చూసింది. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, వారిలో భయపూరిత వాతావరణం నెలకొనేలా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అల్లర్లకు హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం కేజ్రీవాల్ దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సాయం చేయాలని సోనియా పిలుపునిచ్చారు.

నదిలో పడిన పెళ్లి బస్సు.. 24మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూండీ జిల్లాలోని కోటలాల్‌సోట్ దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి మేజ్‌ నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. బూండీలోని కోటకు చెందిన వరుడి కుటుంబ సభ్యులు 40 మంది ఒకే బస్సులో సవాయ్‌మాదోపూర్‌లో జరగనున్న పెళ్లి మండపానికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సు లకేరీ పట్టణం పరిధిలోని వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 24 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నా వల్ల కాదంటూ పారిపోయిన రాహుల్ గాంధీకే మళ్లీ కాంగ్రెస్ పగ్గాలా?

దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాని నిలుపుకోవడానికి కూడా సతమతమవుతోంది. దానికి ప్రధాన కారణం నాయకత్వ లేమి. నరేంద్ర మోడీ- అమిత్ షా ద్వయం బీజేపీకి వరుసగా రెండోసారి ఘన విజయాన్ని అందించి దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ని అలా ముందుండి నడిపించే నాయకుడు లేక.. వరుసగా రెండోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. అదికూడా కేవలం పదుల సంఖ్యలో సీట్లు తెచ్చుకుంటూ.. ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. దీంతో కాంగ్రెస్ ని ఆదుకునే నాయకుడు ఎవరు?, కాంగ్రెస్ కి మళ్లీ పూర్వవైభవం ఎప్పుడొస్తుందని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ బరిలోకి దిగింది. 2014 సమయంలో పప్పు అనే ముద్ర వేసుకున్న రాహుల్ గాంధీ.. రాను రాను ఆ ముద్ర పోగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే మోడీకి ధీటైన నాయకుడిగా మాత్రం ఎదగలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ ఓటమితో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. గాంధీ కుటుంబంతో సంబంధం లేని బలమైన నేతని ఎంపిక చేయాలని సూచించారు. అసలే ఓటమి, దానికితోడు పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో.. పార్టీ శ్రేణులు ఢీలాపడిపోయాయి. పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అయినా రాహుల్ మాత్రం అధ్యక్ష పదవిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోనియాగాంధీ పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా తీసుకున్నారు. అయితే సోనియా గాంధీ తరువాత పార్టీని నడిపించేది ఎవరు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్ని వేధిస్తున్న ప్రశ్న. ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొందరు కోరుతున్నా.. ఆమెకున్న ఈ కొద్ది రాజకీయ అనుభవంతో.. ఓ జాతీయ పార్టీని ముందుండి నడిపించి మోడీ-షాలను ఢీ కొట్టగలరా? అంటే అనుమానమే. పోనీ గాంధీ కుటుంబంతో సంబంధం లేని.. ఎవరైనా సీనియర్ నేతకి ఇద్దామా అంటే వర్గపోరు మొదలయ్యే అవకాశముంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రాష్ట్రాలలో జరిగే వర్గపోరుతోనే కాంగ్రెస్ అధిష్టానం వేగలేకపోతుంది. ఇక జాతీయస్థాయిలో వర్గపోరు మొదలైతే ఇంకేమైనా ఉందా? పార్టీ పూర్తిగా బలహీనపడే ప్రమాదముంది. అందుకే కాంగ్రెస్ శ్రేణులు గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్నాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకోవాలని నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పార్టీ బలోపేతమవుతుందని, ఆయనకు పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి అప్పగించాలంటూ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ లాయలిస్టు ఫోరం సైతం లేఖ రాసింది. ఇలా పలు రాష్ట్రాలలోని నేతలూ డిమాండ్ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ వీరి కోరిక మేరకు పార్టీ పగ్గాలు చేపడతారా?. ఒకవేళ చేపట్టినా.. ఒకసారి నావల్ల కాదంటూ పార్టీ పగ్గాలు వదిలేసిన రాహుల్ గాంధీపై.. సామాన్య కార్యకర్తలకు, ప్రజలకు అంత త్వరగా నమ్మకం కలిగే అవకాశంలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి కాంగ్రెస్ భవిష్యత్తుకి భరోసానిచ్చే నాయకుడు రాహుల్ అవుతాడో లేక మరెవరైనా అవుతారో చూద్దాం.

ఏపీలో స్ధానిక ఎన్నికలు మరింత ఆలస్యం? బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమగ్ర సర్వే చేయకుండా బీసీ రిజర్వేషన్లు పెంచిన వ్యవహారంలో నిబంధనలు పాటించలేదంటూ మంగళవారం హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తీర్పు వచ్చే నెల మొదటి వారానికి వాయిదా పడింది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల నిర్వహణపై తీర్పును సైతం హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. వాస్తవానికి స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం... హైకోర్టు తీర్పు వాయిదా నేపథ్యంలో అశెంబ్లీపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి. ఏపీలో స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గత డిసెంబర్ 28న ప్రభుత్వం జీవో జారీచేసింది. దీని ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో రిజర్వేషన్ల శాతం 59.85కు చేరింది. అయితే రిజర్వేషన్లు ఎట్టి పరిస్దితుల్లోనూ 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు కూడా వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లను 2011 జనాభా గణన ఆధారంగా రూపొందించిన అంచనాలతో ఖరారు చేయడాని కూడా హైకోర్టు తప్పుబట్టింది. ఎప్పుడో 2011లో జరిగిన జనగణనను ఆధారంగా చేసుకుని అంచనాలతో బీసీ రిజర్వేషన్లు ఎలా ఖరారు చే్స్తారని కోర్టు ప్రశ్నించింది. సమగ్ర సర్వే జరపకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల మొదటివారానికి వాయిదా వేసింది. స్ధానిక సంస్ధల ఎన్నికలపై హైకోర్టులో అభ్యంతరాలు తొలగిపోతే వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వానికి తాజా పరిణామాలతో ఇబ్బందికర పరిస్ధితి ఎదురవుతోంది. హైకోర్టులో కేసుల విచారణ వాయిదా దృష్ట్యా చూస్తే మార్చి మెదటి వారంలో ఎన్నికల నిర్వహణ కష్టమని తేలిపోయింది. కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 2 లేదా 3వ తేదీల్లోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వీలుంది. ఆ తర్వాత వారం లేదా పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత కోర్టు తీర్పు ఆధారంగా స్ధానిక ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతోంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపై పూర్తి స్ధాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

పులివెందుల సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా?

కడప జిల్లాలో వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా వరుస విజయాలు అందుకుంటున్నా వారికి కొరుకుడు పడని నేత ఎవరైనా ఉన్నారంటే సతీష్ రెడ్డి మాత్రమే. రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో ఆయనతోనూ, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ తోనూ ముఖాముఖీ తలపడిన సతీష్ రెడ్డి కొంతకాలంగా సొంత పార్టీ టీడీపీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీతో పెట్టుకోవడం ఎందుకని భావిస్తున్నారో లేక ఆ పార్టీతో రాజీపడ్డారో తెలియదు కానీ కొన్ని నెలలుగా సతీష్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం మొదలైంది. ఇది ఆయన దృష్టికి వెళ్లినా ఖండించకపోవడం చూస్తుంటే టీడీపీ పులివెందులలో కొత్త ఇన్ ఛార్జ్ ను వెతుక్కోక తప్పదా అనిపిస్తోంది. చాలా కాలం క్రితం కడప జిల్లాలో జరిగిన మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్దులుగా ఉన్న కొందరు రాజారెడ్డిని కాపు కాసి నరికిచంపారు. అయితే ఈ హత్య కేసు న్యాయస్దానాల్లో సుదీర్ఘకాలం విచారణ జరిగింది. ఇందులో పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి పాత్ర ఉందని వైఎస్ బలంగా నమ్మేవారు. అంతే కాదు తన తండ్రి హంతకులు పులివెందులలో తన కళ్లముందు తిరుగుతున్నా వదిలేశానని వైఎస్ చెప్పుకునేవారు. అయితే వైఎస్ తండ్రి హత్యలో తన పాత్ర లేదని సతీష్ రెడ్డి కూడా చెప్పుకునేవారు. అయినా వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పులివెందుల నియోజకవర్గంలో 1999 నుంచి 2019వరకూ అదే వైఎస్ కుటుంబీకులపై పోటీ చేస్తూనే ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి కీలక నేతగా మారిపోయారు. ఒకప్పుడు పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసే అభ్యర్ధులకు బూత్ ఏజెంట్లు కూడా ఉండే వారు కాదు. అలాంటిది వైఎస్ కుటుంబంపై టీడీపీ నుంచి పోటీ చేయడమే కాకుండా బూత్ ఏజెంట్లను కూడా పెట్టుకునే పరిస్ధితికి తీసుకొచ్చారు సతీష్ రెడ్డి. అలాంటి నేత తాజాగా మౌనం వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చని చెబుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్ధానాల్లో 49 సీట్లు గెల్చుకుని వైసీపీ జోరు మీదుంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎంత చెబితే అంతగా రాయలసీమలో పరిస్ధితులు ఉన్నాయి. గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీద చేసిన పోరాటం వేరు, ఇప్పుడు జగన్ మీద పోరాటం చేయడం వేరు. జగన్ ది తన తాత రాజారెడ్డి మనస్తత్వమని స్వయానా తన పార్టీ అధినేత చంద్రబాబే నేరుగా ఆరోపిస్తున్న తరుణంలో జగన్ కు ఎదురు వెళ్లడం మంచిదా కాదా అనే విషయంలో సతీష్ రెడ్డి ఓ క్లారిటీకి వచ్చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తాజాగా కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మాత్రమే ఆయన హాజరయ్యారు. పార్టీ సమన్వయ కమిటీల భేటీలకు సైతం సతీష్ రెడ్డి దూరంగాన ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారిపోవడం లేదా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవచ్చని చెబుతున్నారు. సతీష్ రెడ్డి యాక్టివ్ కాకపోతే ఆయన స్ధానంలో ఎమ్మెల్సీ బీటెక్ రవిని చంద్రబాబు పులివెందుల ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశముంది.