చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల దర్యాప్తులో సిట్ కు విశేషాధికారాలు.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను తప్పుబడుతూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను మరింత లోతుగా విచారించేందుకు ఏర్పాటైన సిట్ కు ప్రభుత్వం అసాధారణ అధికారాలు కట్టబెట్టింది. సంచలన రీతిలో సిట్ నే పోలీసు స్టేషన్ గా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొచ్చింది. సీఆర్పీసీ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిపించే అధికారాన్ని సిట్ కు అప్పగిస్తూ తాజాగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో అక్రమాలు చోటుచేసుకున్నారని ఆరోపిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై సిట్ విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సిట్ కు అసాధారణ అధికారాలు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఏకంగా సిట్ నే పోలీసు స్టేషన్ గా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిపించి ప్రశ్నించేందుకు సిట్ కు విశేష అధికారాలు కట్టబెట్టారు. ఆర్ధిక నేరాల దర్యాప్తులో సమర్ధుడైన ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డితో పాటు పది మంది అధికారులతో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ వారంలో సిట్ తమకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకు అప్పగించిన అంశాలపై దర్యాప్తు ప్రారంభించనుంది. వీటిలో రాజధాని అమరావతి భూసేకరణ, ఎర్రచందనం, విశాఖలో భూదందా వంటి కీలక అంశాలు ఉన్నాయి. తాజాగా సిట్ కు అప్పగించిన విశేషాధికారాలను బట్టి చూస్తుంటే టీడీపీకి చెందిన ముఖ్యనేతలను దర్యాప్తులో భాగంగా పిలిపించి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సిట్ ను ఏకంగా పోలీసు స్టేషన్ గా పరిగణించాలన్న ఆదేశాలు కూడా అసాధారణంగా ఉన్నాయి. దర్యాప్తు నిర్వహణ, కేసుల నమోదు, వాటిపై తుది నిర్ణయాలను తీసుకునే అధికారం కూడా ప్రభుత్వం సిట్ కు కట్టబెట్టింది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కర్నాటకలో రైల్వే యార్డ్ మరమ్మత్తులు..  తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్ల రద్దు

    కర్నాటకలోని బయ్యప్పనహళ్లి వద్ద యార్డ్ మోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28 నుంచి మార్చి 31 వరకూ ఏపీ నుంచి కర్నాటకకు రాకపోకలు సాగించే పలు సర్వీసులు రద్దవుతున్నాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య ఓ ప్రకటనలో తెలిపింది. తాజా మార్పులతో జరిగే లింక్ ట్రైన్ల ఆలస్యం కారణంగా విశాఖ- లోక్ మాన్య తిలక్ స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్ ప్రైస్ రైలు ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడిచే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లను యార్డ్ మోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28 నుంచి మార్చి 31 వరకూ పూర్తిగా రద్దు చేశారు. పాట్నా-బాన్స్ వాడీ మధ్య నడిచే రెండు రైళ్లను కృష్ణరాజపురం-బాన్స్ వాడీ మధ్య పాక్షిక రద్దు చేశారు. అలాగే సంబల్ పూర్ – బాన్స్ వాడీ మధ్య నడిచే రెండు రైళ్లను కూడా కృష్ణరాజపురం-బాన్స్ వాడీ మధ్య పాక్షిక రద్దు చేశారు. ఇవాళ విశాఖపట్నం నుంచి లోక్ మాన్య తిలక్ స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు కూడా రద్దయింది. మేడ్చల్ నాందేడ్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇవాళ మేడ్చల్- నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అదికారులు ప్రకటించారు.

 అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై క్షేత్రస్ధాయి దర్యాప్తుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ...

    ఏపీ రాజదాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీఐడీ ఇప్పటికే పలు కేసులు నమోదు చేయగా.. సీఐడీ రాసిన లేఖ మేరకు నెలాఖరులోగా ఈ మొత్తం వ్యవహారంపై క్షేత్రస్ధాయి దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఐడీ అధికారులకు సమాచారం కూడా ఇచ్చింది. అమరావతి భూసేకరణ సమయంలో జరిగిన పలు లావాదేవీలు మనీలాండరింగ్, ఫెమా చట్టాల పరిధిలోకి వస్తుందని భావిస్తున్న ఈడీ ఈ మేరకు పూర్తిస్ధాయిలో దర్యాప్తు కోసం ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.  రాజధాని అమరావతిలో భూసమీకరణ సందర్భంగా పలు అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ఏపీ సర్కారు సీఐడీ అధికారులను రంగంలోకి దింపింది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణతో పాటు దాదాపు 800 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు తదుపరి దర్యాప్తు కోసం ఈడీ, ఐటీ విభాగాలకు లేఖలు రాశారు. సీఐడీ లేఖపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదికారులు అమరావతి భూసేకరణ, అందులో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలపై ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా క్షేత్రస్ధాయి దర్యాప్తు కోసం ఏపీకి ఈడీ అదికారులు రానున్నారు. అమరావతిలో జరిగిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలతో ఇప్పటికే ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)-2002, ఫారిన్ ఎక్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా)-1999 కింద కేసులు నమోదు చేసిన ఈడీ.. మరిన్ని కీలక ఆధారాల కోసం క్షేత్రస్ధాయి దర్యాప్తుకు సిద్దమవుతోంది.  హైదరాబాద్ లోని ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్ధాయి దర్యాప్తుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజధానిలో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సీఐడీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమికంగా దర్యాప్తు చేపడుతున్న అదికారులు తదుపరి దర్యాప్తుపై దృష్టిసారించారు. ముఖ్యంగా స్ధానికంగా ఉన్న కొందరు తెల్ల రేషన్ కార్డు దారులు విలువైన భూములు ఎలా కొన్నారో తెలుసుకునేందుకు ముందుగా ఈడీ ప్రయత్నిస్తోంది. అప్పట్లో అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఈడీకి ఆధారాలు అందజేశారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొందరు టీడపీ నేతలకు బినామీలుగా ఉన్న తెల్లకార్డుదారులే ఈ భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. రూ.కోట్లతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎవరికి బినామీలు తదితర కోణాల్లో ఈడీ కూపీలాగుతోంది. రికార్డుల పరిశీలన పూర్తయిన అనంతరం ఈడీ అమరావతి ప్రాంతంలో విచారణ ప్రారంభిస్తుందని సీఐడీ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి దర్యాప్తునకు ముందే సీఐడీ అధికారుల బృందంతో ఈడీ ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈడీ, సీఐడీ ఉమ్మడి సమావేశం ఉంటుందని అధికారులు ధ్రువీకరించారు.

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదంట? మరి కేసీఆర్ ఏం చేస్తారో?

  నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, స్థానిక టీఆర్ఎస్‌ నేతలకు ఇంకా పీడకలగానే వెంటాడుతున్నాయి. పడుకున్నా, లేచినా, అవే ఫలితాలు తరుముతున్నాయి. తమ భవిష్యత్తు ఏమవుతుందోనని, గులాబీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని, టెన్షన్‌ టెన్షన్‌ పడుతున్నారట. అసలు, తిన్న అన్నం కూడా సయించడం లేదని అంటున్నారు. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులున్నాయి. 15 స్థానాలతో మున్సిపల్ పీఠాన్ని ఎంఐఎం ఎగరేసుకుపోయింది. తొమ్మిది సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. మరో రెండు వార్డుల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. కానీ ఒక్కటంటే, ఒక్క సీటు కూడా రాలేదు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు. అదే ప్రగతి భవన్‌లో వున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్సలు మింగుడుపడటం లేదట. అసలు ఈ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే వున్నారా...లోకల్‌గా పార్టీ శ్రేణులున్నాయా....అన్న సందేహం వస్తోందట గులాబీ అధిష్టానానికి. అందుకే లోకల్‌ ఎమ్మెల్యేకు అస్సలు కంటిమీద కనుకు కరువైందంటున్నారు. ముథోల్‌‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి. ఇదే నియోజకవర్గంలోని భైంసా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆ‍యన గ్రాఫ్‌ను అమాంతం నేలకు పడేశాయి. కనీసం ఒక్కవార్డు సభ్యుడు కూడా పార్టీ తరపున విజయం సాధించకపోవడంపై, పార్టీ పెద్దలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కనీసం గల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించని ఎమ్మెల్యే, పార్టీకి ఏవిధంగా ఉపయోగపడతారని పార్టీ పెద్దలకు అనుమామాలు మొదలయ్యాట. పార్లమెంటు ఎన్నికల్లోనూ, ఇలాంటి ఫలితాలు రావడంతో, ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డిపై ప్రగతిభవన్‌ వర్గాలు గుర్రుగా ఉన్నాయట. మరోవైపు విఠల్ ప్రభావం తగ్గడానికి కుటుంబ సభ్యులు సైతం కారణమన్న మాటలు వినపడ్తున్నాయి. విఠల్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేలుగా, కొందరు కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతున్నారట. దానివల్లనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందట. వీటి ఎఫెక్టే పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో పడిందన్న చర్చ జరుగుతోంది. వరుస చేదు ఫలితాలు స్థానిక ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తున్నాయట. అయితే, భైంసాలో గెలుపొందింది ఎంఐఎం అని, దీంతో ఫ్రెండ్లీ పార్టీకే పీఠం దక్కింది కాబట్టి, కేసీఆర్ అంత కోపంగా లేరని కూడా కొందరంటున్నారు. చూడాలి, ఫలితాలు రివర్సయిన మున్సిపాల్టీల్లో స్థానిక నేతలపై పార్టీ అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా...లేదంటే కొన్ని హెచ్చరికలు చేసి ఊరుకుంటుందో... త్వరలోనే తెలియనుంది.

ఆ ఐదుగురు మాజీ మంత్రుల పరిస్థితి ఇఫ్పుడెలా ఉందో తెలుసా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పిన ఐదుగురు మాజీ మంత్రులు, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారే నాగం జనార్ధన్‍ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, పి.చంద్రశేఖర్‍, లక్ష్మారెడ్డిలు. ఇందులో ఒక్క లక్ష్మారెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మిగతా వారు నాగం, జూపల్లి, డీకే అరుణ, పి.చంద్రశేఖర్‌లు, పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకుంటున్నారన్న చందంగా మారింది వారి పరిస్థితి. నాగం జనార్థన్‌ రెడ్డి, పి.చంద్రశేఖర్‍. ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో అత్యంత సీనియర్‍ నాయకులు. తెలుగుదేశం హయాంలో ఈ ఇద్దరూ ఐదుసార్లు మంత్రులుగా కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగం... నాగర్‍ కర్నూల్‍ నుంచి కాంగ్రెస్‍ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. పి.చంద్రశేఖర్‍ మాత్రం టీడీపీని వీడి మొదట టీఆర్‍ఎస్‍ లో చేరారు. అక్కడ టిక్కెట్‍ రాకపోవడంతో టీఆర్‍ఎస్‍ ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా కూడా చంద్రశేఖర్‍ కు నిరాశే మిగిలింది. తర్వాత కమలం గూటికి చేరి, ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నానంటే ఉన్నా అన్నట్టున్నారు. ఇక, కాంగ్రెస్‍ పార్టీలో సీనియర్‍ నాయకులుగా కొనసాగిన జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ సైతం గడ్డుకాలాన్ని చవిచూస్తున్నారు. ప్రస్తుతం జూపల్లి టీఆర్‍ఎస్‍ లో ఉంటే, అరుణ బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందడంతో ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు తీవ్ర సంక్షోభంలో పడింది. ఇందులో జూపల్లి కృష్ణారావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. మున్సిపల్‍ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా... అధిష్టానం మాత్రం జూపల్లిపై సస్పెన్షన్‍ వేటు వేయలేదు. దాంతోపార్టీలో ఉండాలా, కొనసాగాలా అన్న నిర్ణయాన్ని జూపల్లికే వదిలేసినట్టు కనిపిస్తోంది. జూపల్లి పార్టీలో ఉన్నా కనీసం ఆయనకు ఓ కార్యకర్త అన్న గుర్తింపూ ఇవ్వడంలేదట గులాబీ అధిష్టానం. దాంతో పార్టీలో కొనసాగలేక, ఉండలేక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు జూపల్లి. ఇటు మరో డీకే అరుణ సైతం గద్వాల అసెంబ్లీ, మహబూబ్‍నగర్‍ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి, రెండుమార్లు ఓటమి చెందారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా కమలం నేతలు కనిరించడం లేదని తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క మాజీ మంత్రి లక్ష్మారెడ్డిదీ అదే సమస్య. జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఉద్యమ నాయకుడిగా ముద్ర ఉన్న లక్ష్మారెడ్డికి... కేసీఆర్‍ తన మంత్రివర్గంలో మొండిచెయ్యి చూపించడం తీవ్ర అవమానంగా భావిస్తున్నారట. మొదటి విడత, రెండో విడతలోనూ మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశతో కొన్నిరోజులపాటు తన కార్యకర్తలెవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు లక్ష్మారెడ్డి. అయితే, జడ్చర్ల కార్యకర్తలందరూ పనుల కోసం మంత్రి శ్రీనివాస్‍ గౌడ్‍ దగ్గరకు వెళ్తుండటంతో కంగుతిన్న లక్ష్మారెడ్డి... మళ్ళీ నియోజకవర్గంపై దృష్టి సారించి అంతా చక్కదిద్దే పనిలో పడ్డారు. అలా, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నాగం, జూపల్లి, అరుణ, పి.చంద్రశేఖర్‍, లక్ష్మారెడ్డీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.

మొతెరా స్టేడియంలో ట్రంప్ దంపతులు... ఫొటోలకు ఫోజులిచ్చిన మెలానియా..

  అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 22 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత మొతెరా స్టేడియానికి ట్రంప్ మెలానియా దంపతులు చేరుకున్నారు. మొతెరా స్టేడియం దగ్గర ట్రంప్ మెలానియా దంపతులకు ఘనస్వాగతం లభించింది. స్టేడియానికి చేరుకున్న ట్రంప్ మెలానియా దంపతులను లోపలికి తోడ్కని వెళ్లిన మోడీ.... అక్కడున్న వివిధ ప్రముఖులను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం, పలు ఫొటోలను ఫోజులిచ్చారు. అనంతరం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ట్రంప్ ప్రారంభించారు. ఇక, లక్షలాది మంది ప్రజలతో మొతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది.

వైసీపీలో ఏ2 పదవి కోసం తీవ్ర పోటీ- టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ట్వీట్

  వైసీపీలో ఏ1, ఏ2లపై టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇవాళ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పట్టేలా కేఈ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఏ2 పదవి కోసం ఏ1 అయిన జగన్ పార్టీ నేతల మధ్య పోటీ పెట్టారని, విపక్ష నేత చంద్రబాబును వీలైనంత ఎక్కువగా విమర్శించే వారికి ఏ2 పోస్టు దక్కుతుందని కేఈ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఏ2 పదవి కోసం పార్టీలో కీలక నేతలైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరితో ఒకరు పోటీ పడి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని కేఈ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తన ట్వట్ చివర్లో కేఈ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. అసలు రహస్యం ఏంటంటే జగన్ గారు, సాయిరెడ్డి గారు జీవిత కాలం జైలుకు వెళ్లడం తప్పదని డిసైడ్ అయిన సజ్జల రెడ్డి గారు పార్టీలో ఏ1 పదవికి బాణం ఎక్కుపెట్టారని కూడా పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే సజ్జల ఏకంగా ఏ2 కంటే ఏ1 పదవిపైనే దృష్టిపెట్టారని కేఈ చెబుతున్నట్లుగా ఈ ట్వీట్ ఉంది. వాస్తవానికి గతంలో జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఏ1, ఏ2 అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. కానీ తాజాగా టోన్ మార్చి ఏ1 జగన్ ఏ2 పదవి కోసం పోటీ పెట్టారని ఓసారి, ఏ1 పదవి కోసం సజ్జల పోటీపడుతున్నారని మరోసారి పేర్కొనడం చూస్తుంటే వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరును బయటపెట్టారనే ఆలోచనతోనే కేఈ ఈ ట్వీట్ చేసినట్లు అర్దమవుతోంది.

 ప్రజా వేదిక కూల్చివేత శిధిలాల తొలగింపుకు టెండర్లు పిలిచిన జగన్ సర్కార్

    ఏపీలో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా నేలమట్టం చేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిధిలాల తొలగింపుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సీఎం జగన్ అధికారం చేపట్టగానే మొదటిసారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రజావేదికను కూల్చివేశారు. కానీ అప్పటి నుంచి వాటి శిధిలాలను అక్కడి నుంచి తరలించలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వీటిని అక్కడే ఉంచినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శిధిలాల తొలగింపు కోసం టెంటర్లను ఆహ్వానించింది. మార్చి 3 వరూ ఆన్ లైన్ లో టెండర్లు స్వీకరించనున్నారు.  ఏపీలో 2014లో అధికారంలోకి రాగానే హైదరాబాద్ నుంచి పాలన సాగించిన అప్పటి సీఎం చంద్రబాబు, ఓటుకు నోటు కేసు వివాదం తర్వాత అమరావతికి తరలివచ్చారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం వద్ద కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని లీజుకు తీసుకున్న చంద్రబాబు అక్కడి నుంచే పాలన ప్రారంభించారు. తన నివాసం పక్కనే ప్రజావేదిక పేరుతో ఐదు కోట్ల రూపాయలతో ఓ ప్రాంగణాన్ని నిర్మించారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. కరకట్టపై నదీ చట్టాలను ఉల్లంఘించి ఇల్లు కట్టుకోవడమే నేరమైతే ప్రజావేదికను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించింది. అయినా అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అతి తక్కువ సమయంలో తాత్కాలిక నిర్మాణంగా ప్రజావేదికను నిర్మించడమే కాకుండా అక్కడే కలెక్టర్ల సమావేశాలతో పాటు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహించేవారు.  గతేడాది వైసీ అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ ప్రజా వేదికపై దృష్టిపెట్టారు. అధికారంలోకి రాగానే నిర్వహించిన మొట్టమొదటి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వేదికగా మార్చిన జగన్.. నిబంధలను ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లను నిలదీశారు. కలెక్టర్ల భేటీ ముగిసిన వెంటనే అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చేయాలని ఈ భేటీలోనే ఆదేశాలు సైతం ఇచ్చారు. దీంతో కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే సీఆర్డీఏ అధికారులు ప్రజావేదికను నేలమట్టం చేశారు. అయితే శిధిలాలను మాత్రం అక్కడి నుంచి తొలగించలేదు. దీంతో శిధిలాల తొలగింపును ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే వదిలేసిందనే విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు శిదిలాల తొలగింపు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. మార్చి 3 వరకూ  దరఖాస్తుల స్వీకరణకు గడువు కూడా ఇచ్చింది. శిధిలాల తొలగింపుతో పాటు ఇనుము వేలానికి కూడా టెండర్లు పిలిచింది. దీంతో ఈ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడినట్లయింది.

రాట్నాన్ని ఆసక్తిగా తిలకించిన ట్రంప్ అండ్ మెలానియా

  సబర్మతి ఆశ్రమంలో వస్తువులను ట్రంప్ మెలానియా దంపతులు ఆసక్తిగా తిలకించారు. సబర్మతి ఆశ్రమంలో ప్రతి గదినీ దగ్గరుండి చూపించిన మోడీ.... గాంధీజీ వినియోగించిన నూలు వడికే రాట్నం దగ్గర ఎక్కువ సమయం గడిపారు. నూలు వడికే రాట్నం దగ్గర కూర్చొని ఎలా నూలు వడుకుతారో పరిశీలించారు. రాట్నాన్ని తిప్పుతూ నూలు వడికే ప్రయత్నం చేశారు. మెలానియా అయితే, రాట్నాని తిప్పుతూ సంతోషానికి గురైంది. అనంతరం, ఎలా నూలు వడకాలో... ట్రంప్ అండ్ మెలానియాకు అక్కడున్న సబర్మతి సిబ్బంది చేసి చూపించారు. అనంతరం ట్రంప్ కూడా నూలు వడికేందుకు ప్రయత్నించారు. చివరిగా, సబర్మతి ఆశ్రమ బుక్ లో తన అనుభూతులను ట్రంప్ అండ్ మెలానియాలు స్వహస్తాలతో రాశారు. ఆ తర్వాత గాంధీజీ బోధించిన చెడు వినకు... చెడు చూడకు... చెడు మాట్లాడకు... అనే మూడు కోతుల బొమ్మను చూపించి... వివరించారు మోడీ. అనంతరం మొతేరా స్టేడియానిక బయల్దేరి వెళ్లారు.

నాపై దాడి చేసింది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే : బాపట్ల ఎంపీ సురేష్

నిన్న అమరావతిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, తన కాన్వాయ్ లో కారు హనుమంతు అనే రైతు కాలిపై నుంచి వెళ్లిన ఘటనపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇవాళ వివరణ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సురేష్.. నిన్నటి ఘటనలకు దారి తీసిన పరిస్ధితులను వివరించారు. అమరావతికి వస్తుండగా తన కారు గుద్దుకుని ఓ వ్యక్తికి దెబ్బలు తగిలాయని, ఆయన్ను ఆస్పత్రికి తరలించాలని అనచరులకు చెప్పానని కానీ వారు కావాలని చేయలేదు కాబట్టి ఇంతటితో వదిలేయాలని వారు కోరారని సురేష్ వెల్లడించారు. అమరలింగేశ్వర స్వామి గుడి వద్ద రథోత్సవం ముగించుకుని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి వస్తుండగా కొందరు తమ దగ్గరికి వచ్చి జై అమరావతి, జై సీబీఎన్ నినాదాలు చేశారన్నారు. నినాదాలతో పాటు చెవి దగ్గరికి వచ్చి బూతులు కూడా తిట్టి వెళ్లారని సురేష్ తెలిపారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డి వాహనంలో అక్కడి నుంచి మద్దూరు వైపు బయలుదేరామన్నారు. లేమల్లె వద్ద కారు మారేందుకు కిందకి దిగిన సమయంలో అక్కడికి మహిళా జేఏసీ నేతల బస్సు వచ్చిందని, అందులో ఉన్న మహిళలు తనను చూసి జై అమరావతి నినాదాలు చేశారన్నారు. అందులో ఓ యువతి తన దగ్గరకు వచ్చి నువ్వొక ఎంపీవా, మమ్మల్ని ఏం పీకుతార్రా అని అభ్యంతరకర వ్యాఖలు చేసిందని సురేష్ వెల్లడించారు. ఆమెను తాను వారిస్తుండగానే పదిమంది మహిళలు వచ్చి తనపై కారం జల్లి దాడి చేస్తుండగా...గన్ మెన్లు జోక్యం చేసుకుని తనను కారులోకి పంపించారన్నారు. అదే సమయంలో మహిళలు తన అనుచరులపై దారి చేసి చెప్పులతో కొట్టారుని సురేష్ ఆరోపించారు. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనను దళితుడని కూడా చూడకుండా టార్గెట్ చేస్తున్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహిళలపై దాడి చేసినట్లు కథనాలు ప్రసారం చేస్తున్న పలు ఛానళ్లపైనా సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం మాట్లాడటానికి అలవాటుపడాలని సూచించారు. గతంలో అబద్ధాలు మాట్లాడి చంద్రబాబును 23 సీట్లకు తీసుకొచ్చారని, ఇప్పటికైనా వాస్తవాలు చూపించాలన్నారు. తనపై దాడిలో పాల్గొన్నది అమరావతి స్దానికులు కాదని, వారికి అమరావతితో ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడికి పాల్పడిన వారంతా టీడీపీ పంపిన పెయిడ్ ఆర్టిస్టులేనని ఎంపీ సురేష్ తెలిపారు. రాజధానిలో తాము మాత్రమే బతకాలనే స్ధాయికి వీరు చేరుకున్నారని దాడి చేసిన వారినుద్దేశించి సురేష్ వ్యాఖ్యానించారు. దళితులంటే ఎలాగో విలువలేదు కనీసం ఎంపీగా అన్నా గౌరవం ఇవ్వాలి కదా అని సురేష్ తెలిపారు.  టీడీపీ అధినేత చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు ఆపాలని సురేష్ డిమాండ్ చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో యుఎస్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి  నీ అంతుచూస్తాం, నిన్నువదలిపెట్టం, ఏం పీక్కుంటావో పీక్కోరా జగన్ వచ్చి కాపాడతాడా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. బలహీన వర్గాలెవరూ ఉండకూడదు, మేమే పాలించాలని చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని సురేష్ విమర్శించారు. మహిళా జేఏసీ బస్సులో ఉన్న ఓ మహిళ కారం ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే సురేష్ అనుచరులే వేశారని చెప్పాలంటూ మాట్లాడుతున్న వీడియోను సురేష్ తన ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు.

సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... ఆసక్తిగా తిలకించిన మెలానియా...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ భారత ప్రధాని నరేంద్రమోడీ కలిసి అహ్మదాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొతేరా స్టేడియం వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర రోడ్ షో చేశారు. పెద్దఎత్తున చేరుకుని రోడ్డుకిరువైపులా నిలబడి స్వాగతం పలుకుతున్న ప్రజలకు... కారులో నుంచే ట్రంప్ దంపతులు... అభివాదం చేశారు. ఇక, మార్గం మధ్యలో సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. గాంధీజీ వినియోగించిన వస్తువులను ఆసక్తిగా తిలకించారు. అయితే, సబర్మతి ఆశ్రమానికి వచ్చిన ట్రంప్ దంపతులకు తెల్లని ఖాదీ వస్త్రాలను మెడలో వేసి మోడీ ఆహ్వానించారు. ఆ తర్వాత, మోడీ, ట్రంప్ కలిసి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని దగ్గరుండి చూపించారు మోడీ.

భారత్‌లో అడుగుపెట్టిన ట్రంప్... గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మోడీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారత్ లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండైన ట్రంప్ కు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. ట్రంప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని తమ మధ్య ఉన్న సత్సంబంధాలను మోడీ చాటిచెప్పారు. అనంతరం, బీస్ట్ కారులో ట్రంప్ దంపతులు... రోవర్ కారులో మోడీ కలిసి అహ్మదాబాద్ రోడ్ షోలో నిర్వహిస్తున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, రోడ్డుకిరువైపులా నిలబడ్డ ప్రజలు... అమెరికా, ఇండియా ప్లాగ్స్ ను ఊపుతూ... ట్రంప్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

 ఏపీ సీఎస్ నీలం సాహ్ని సెలవు వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా !

  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారని కొంతకాలం క్రితం ప్రచార జరిగింది. సీఎంవో ఉన్న ఇతర అధికారులతో ఆమెకు పొసగడం లేదని ఓసారి, కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు ఆమె ప్రమేయం లేకుండానే ఆదేశాలు వెలువడటంతో నొచ్చుకున్నారని మరోసారి ప్రచారం సాగింది. అయితే తాజాగా ఆమె సన్నిహితులు చెబుతున్న ప్రకారం నీలం సాహ్ని ఆమె పదవీకాలం ముగిసేవరకూ అంటే జూన్ చివరి వరకూ తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తిస్ధాయిలో నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలిసింది. గతేడాది టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎప్పటిలాగే ఏపీ సీఎంవోలో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రతీ ముఖ్యమంత్రిలాగే అధికారంలోకి రాగానే తన టీమ్ ను సీఎం జగన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాను ఏరికోరి తెచ్చుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సాగనంపడంతో అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. సీఎస్ నే అర్ధాంతరంగా తప్పించినప్పుడు తమ పరిస్ధితి ఏంటనే ఆందోళన ఐఏఎస్ లతో పాటు మిగిలిన అదికారుల్లోనూ కనిపించింది. అయితే సీఎంవోలో సీఎం రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఆధిపత్య ధోరణి వల్లే అప్పట్లో సీఎల్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత మిగిలిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ప్రచారం సాగింది. తాజాగా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ కూడా ప్రవీణ్ ప్రకాష్ వైఖరితో విసిగిపోయి దీర్ఘకాలిక సెలవుపై  వెళ్లాలని భావిస్తున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఇది కాస్తా ముదిరి ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న నీలం సాహ్ని ఏకంగా సీఎస్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. చివరికి ఈ వివాదాలపై సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. సీఎస్ నీలం సాహ్నితో నేరుగా మాట్లాడి తనపై జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకున్నారు. చివరికి ఆమెకు అలాంటి ఉద్ధేశాలేవీ లేవని తెలియడంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. గతంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా బదిలీ చేసిన నేపథ్యంలో నీలం సాహ్ని విషయంలో ఏం జరిగినా అది చివరికి ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో సీఎం జగన్, ఇతర సీనియర్ అధికారులు నీలం సాహ్ని అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఆమెకు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలన్న ఉద్దేశం కానీ, సీఎస్ పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచన కానీ లేనట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో సీఎస్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. వాస్తవానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తర్వాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న సాహ్నీని రాష్ట్రానికి తీసుకొచ్చి మరీ సీఎస్ పదవి కట్టబెట్టారు. ఆమెకు కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే మంచి పేరుంది. కానీ ప్రభుత్వంపై గిట్టని వారు కొందరు చేసిన ప్రచారం కారణంగా ఆమె సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్దితి ఏర్పడిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా మూడు రాజధానుల ప్రక్రియకు ప్రభుత్వం సన్నద్ధమైన కీలక సమయంలో సీఎస్ వ్యవహారం సద్దుమణగడంతో ప్రభుత్వం కూడా ఊపరిపీల్చుకున్నట్లయింది.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు... అమరావతిలో పెరుగుతున్న హీట్...

  ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అమరావతిలో హీట్ కూడా పెరుగుతోంది. రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో రైతులు, మహిళలు ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులకూ, ఆందోళనకారులకూ మధ్య నిత్యం వాగ్వాదాలు, దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా వీటిని సీరియస్ గా తీసుకోకపోవడంతో అమరావతి గ్రామాలు ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉన్నాయి.  శాసనమండలి రద్దు ప్రతిపాదనల నేపథ్యంలో ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం పార్లమెంటుతో పాటు న్యాయస్ధానాల పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం వీటితో సంబంధం లేకుండా బడ్డెట సమవేశాలు ముగియానే విశాఖకు రాజదాని తరలింపు కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. రాజధానిలో ఏర్పాటు చేసే ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్ధలాల కోసం ఇప్పటికే విశాఖలో అధికారులు అణువణువూ గాలిస్తున్నారు. తొలుత రుషికొండలోని మిలీనియం టవర్స్ ను సచివాలయం ఏర్పాటు కోసం పరిశీలించిన ప్రభుత్వం... తాజాగా ఆ ప్రతిపాదనను విరమించుకుంది. దీంతో సచివాలయంతో పాటు, సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర హెచ్.ఒ.డి కార్యాలయాల కోసం స్ధలాల అన్వేషణ కొనసాగుతోంది.  మరోవైపు బడ్జెట్ సమావేశాలు ముగిశాక రాజధాని తరలిపోవడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో అమరావతిలో రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నిత్యం రాజధాని గ్రామాల్లో ఏదో ఒక రూపంలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలపై దాడులకు కూడా పాల్పడే పరిస్ధితి ఉంది. వాటిని ప్రతిఘటించే క్రమంలో వైసీపీ నేతలు కూడా రాజధాని రైతులను, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో పోలీసులు కూడా జోక్యం చేసుకుని తీవ్ర చర్యలు తీసుకునే పరిస్ధితి  లేదు. దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకూ ఆందోళనలు విరమించబోమని చెబుతున్న అమరావతి రైతులు.. అధికార వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ తమ డిమాండ్లను వారిముందు పెడుతున్నారు.  రాజధాని రైతులతో ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు సమావేశమై వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ రాజధాని తరలింపు తప్ప తమకు ఇంకేమీ వద్దనేది వారి నుంచ వినిపిస్తున్న మాట. దీంతో ప్రభుత్వం కూడా ఆందోళనలను శాంతిపజేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తొలుత రైతులు శాంతించాలని ప్రకటనలు చేసిన మంత్రులు.. ఆ తర్వాత మౌనం వహించారు. కానీ వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న అమరావతి గ్రామాల్లో మంత్రులు, ఎంపీలను వారు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి పరిస్ధితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈసారి బడ్జెట్ సమావేశాలను మొక్కుబడిగా పూర్తి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శాంతి భద్రతల పరిస్ధితిని సాకుగా చూపుతూ బడ్జెట్ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తారని భావిస్తున్నారు.

వైసీపీలో రాజ్యసభ బెర్తుల కోసం గట్టి పోటీ.. రెడ్లలో అవకాశం ఎవరికి?

ఏపీలో అధికార వైసీపీలో రాజ్యసభ స్ధానాల కోసం గట్టిపోటీ నెలకొంది. ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు స్ధానాలను వైసీపీ గెల్చుకునే అవకాశం ఉండటంతో వీటిని ఎవరికివ్వాలనే విషయంలో సీఎం జగన్ తేల్చుకోలేకపోతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కొందరు, సామాజిక వర్గాల వారీగా మరికొందరు ఆశావహుల జాబితాలో ఉన్నారు వీరిని కాదని రోజుకొకరు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటూ కొత్తగా ఈ జాబితాలో చేరుతున్నారు. దీంతో పార్టీ మూలస్తంభాలైన రెడ్లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున 50 మంది రెడ్డి సామాజికవర్గం నేతలు గెలిచారు. వీరిలో దాదాపు సగం మంది పార్టీలో సీనియర్లు కావడమో లేకపోతే సీఎం జగన్ కు దగ్గరి బంధువులో, అధికారంలోకి రాముందు పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న వారో ఉన్నారు. వీరంతా కేబినెట్ బెర్తులు ఆశించారు. అయితే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాల్సి రావడంతో వీరిలో చాలామంది నిరాశకు గురయ్యారు. అదే సమయంలో ఎంపీ సీట్లకు సర్దుబాట్లలో భాగంగా బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి వారికి టికెట్లు దక్కలేదు. దీంతో వారంతా జగన్ మీద భారం వేసి పార్టీ చెప్పినట్లు నడుచుకుంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో టికెట్లు రాకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే చాలు తమ పంట పండినట్లే అని భావించిన వారంతా నామినేటెడ్ పదవులు కూడా పూర్తి స్దాయిలో భర్తీ కాకపోవడంతో అసంతృప్తిలో మునిగిపోయారు. వీరిని బుజ్జగించేందుకు సీఎం జగన్ పలుమార్లు క్యాంప్ ఆఫీసుకు వారిని పిలిపించుకుని మాట్లాడారు. అయితే మంత్రి పదవి రాకపోయినా త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్ధానాలు ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. అయితే ఈసారి ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు స్ధానాల్లో ఓసీ, బీసీ, ఎస్సీ లకు మూడు సీట్లు కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. మరొకటి పరిస్ధితిని బట్టి అవకాశం కల్పించనున్నారు. దీంతో ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా పోటీ మొదలైంది. బీసీ, ఎస్సీల పరిస్దితి ఎలా ఉన్నా పార్టీకి అందరి కంటే ఎక్కువగా అండగా నిలిచిన రెడ్లు మాత్రం ఓసీ కోటాలో తమకు అవకాశం కల్పించాల్సిందేనని జగన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రెడ్లలో ఎవరికివ్వాలనే అంశంలో జగన్ కు పెను సవాలే ఎదురవుతోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రధానంగా ముగ్గురు రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపిగా పనిచేసి ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డి కోసం తన సీటును త్యాగం చేసిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం రేసులో అందరి కంటే ముందున్నారు. జగన్ హామీతో ఎంపీ సీటు త్యాగం చేసిన వైవీకి కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. తనకు ఎంపీ పదవి కూడా కావాలని సుబ్బారెడ్డి కోరుతున్నారు. మరోవైపు 2014లో నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి తన బావ మోదుగుల వేణుగోపాలరెడ్డి చేతిలో ఓడిపోయిన పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి .. ఈసారి జగన్ హామీ మేరకు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో రెడ్ల జాబితాలో ఆయనకు అవకాశం దక్కుతుందో తేదో చూడాలి. అటు ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేటకు బదులుగా గుంటూరు నుంచి బరిలోకి దిగి నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతో గల్లా జయదేవ్ చేతిలో ఓటమిపాలైన మోదుగుల వేణుగోపాల రెడ్డి కూడా ఓసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మిగిలిన వారు కూడా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.

"కార్గో ముందుకు - పాసింజర్లు వెనక్కి- విశాఖ ఎయిర్ పోర్టులో వింత పరిస్ధితి"

ఏపీలో కీలకమైన విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి దేశంలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను ప్రైవేటు విమానయాన సంస్ధలు రద్దు చేసుకునే అలోచనల్లో ఉండగా.. అనూహ్యంగా సరకు రవాణా మాత్రం జోరందుకోబోతోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, కోల్ కతాతో పాటు ఇతర ప్రాంతాలకు కార్గో విమానాలు నడుపుకునేందుకు రక్షణ శాఖ అనుమతివ్వడమే ఇందుకు కారణం. దీంతో ఈ నెల 25 నుంచి కార్గో సర్వీసులను నడిపేందుకు పలు విమానయాన సంస్ధలు సిద్ధమవుతున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం చరిత్రలో త్వరలో మరో మైలురాయి నమోదు కానుంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, కోల్ కతా తదితర ప్రాంతాలకు కార్గో విమానాలను నడుపుకునేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో తొలిసారిగా ఇక్కడి నుంచి రవాణా విమానాలు నడిపించేందుకు ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ నెల 15 నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి వున్నప్పటికీ, రక్షణ శాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యం కావడంతో సర్వీసులు నిలిచిపోయాయి. అయితే స్పైస్ జెట్ కోరిన సమయాలను కార్గో సేవల నిమిత్తం కేటాయించే పరిస్థితి లేదని విశాఖ రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. కేంద్ర మంత్రులతో చర్చించారు. విశాఖ నుంచి కార్గో విమానాల అవసరాన్ని గుర్తించి అనుమతులివ్వాలని విన్నవించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని, ఈ సమయంలో సరకు రవాణాకు అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరడంతో కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించింది. కాగా, ఈ నెల 25 నుంచి చెన్నై- వైజాగ్ - కోల్ కతా, చెన్నై - వైజాగ్ - సూరత్ రూట్లలో కార్గో విమానాలు నడుపుతామని స్పైస్ జెట్ వెల్లడించింది. ప్రస్తుతం రోజు విడిచి రోజు సర్వీసులు నడుస్తాయని, స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మారుతున్న తరుణంలో ప్రయాణికుల విమానాలను పలు ప్రైవేటు ఆపరేటర్లు రద్దు చేసుకోనున్నారనే వార్తలు నగర వాసులను కలవరపెట్టాయి. ఈ తరుణంలో కార్గో సర్వీసులకు రక్షణ శాఖ అనుమతివ్వడం, ప్రైవేటు ఆపరేటర్లు సిద్దం కావడం చూస్తుంటే తిరిగి విశాఖపట్నం విమానాశ్రయానికి కొత్త కళ రానున్నట్లు అర్ధమవుతోంది. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ కార్యాచరణలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో వ్యాపార వర్గాలతో పాటు అటు విశాఖ నగర వాసుల్లోనూ ఓ రకమైన అనిశ్చితి నెలకొంది. అప్పటికే ఆర్ధికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు సర్వీసులు పాసింజర్ విమానాలను రెగ్యులర్ గా నడిపేందుకు సుముఖంగా లేనట్లు కనిపించింది. కానీ తాజాగా విశాఖలో రాజధాని వల్ల రక్షణ పరంగా ఇబ్బందులు తప్పవన్న వార్తలను తూర్పు నావికాదళం అధికారులు కూడా కొట్టిపారేయడంతో విశాఖకు పునర్ వైభవం వస్తుందని భావిస్తున్నారు.

అమరావతిలో వైసీపీ దాదాగిరీ.. రైతు కాలిపై నుంచి దూసుకెళ్లిన ఎంపీ సురేష్ కారు

అమరావతి నుంచి ఏపీ రాజదాని తరలింపునకు వ్యతిరేకంగా మహిళా జేఏసీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర ఉద్రిక్తలకు దారి తీసింది. లేమల్లె 14వ నంబరు మైలురాయి దాటాక బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ నేతలు కారం ప్యాకెట్లు విసరడంతో మహిళా నేతలు భయభ్రాంతులయ్యారు. అదే సమయంలో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వెళుతున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కారును మహిళలు అడ్డుకున్నారు. కాసేపు వాగ్వాదం తర్వాత రైతులు ఎంతకీ అడ్డు తప్పుకోకపోవవడంతో సురేష్ డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన హనుమంతు అనే రైతు కాలు మీదుగా కారు దూసుకెళ్లడంతో అతను గాయాలపాలయ్యాడు. పక్కనున్న రైతులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కారు రైతు కాలి మీద నుంచి దూసుకెళ్లిన ఘటనపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎంపీ సురేష్ ను వివిధ ప్రాంతాల‌్లో అడ్డుకున్నందుకు వందకు పైగా రైతులు, మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో చాలా మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి.. అక్రమంగా నమోదు చేసిన ఈ కేసులను ఎత్తివేయాలంటూ ఇప్పటికే టీడీపీ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అమరావతిలో ఎంపీ కారు రైతు కాలిపై నుంచి దూసుకెళ్లిన ఘటనలో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

3నెలల ముందే.. మొత్తం ఆధీనంలోకి.. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ గురించి తెలుసుకోండి...

అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా ముందుగా ఆ ప్రాంతాలను అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాయి. అత్యంత కఠిన శిక్షణ పొందే సీక్రెట్ సర్వీస్ బలగాలను అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం ప్రత్యేకంగా వినియోగిస్తారు.  అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌కు ఎంపికైన వారికి 29వారాలపాటు కఠోర శిక్షణ ఉంటుంది. తుపాకీ కాల్పులు, ఆత్మాహుతి బాంబర్లను, పేలుళ్లను ఎదుర్కోవడం, అధునాతన ఆయుధాలతో ఎదురుదాడి, అనుమానాస్పద పదార్థాలను పసిగట్టడంవంటి అంశాల్లో శిక్షణ పొందుతారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు నిరంతరం అధ్యక్షుడి వెన్నంటే ఉంటారు. వీరి సూచనలు, నిబంధనలను అధ్యక్షుడు తప్పక పాటించాల్సిందే. భద్రత వలయం నుంచి బయటకు వెళ్లే అధికారం ఆయనకు ఉండదు. బయట ప్రయాణించేటప్పుడు పర్యటన మొత్తాన్నీ వీడియో తీస్తారు. అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటన చేపట్టినప్పుడు సీక్రెట్‌ సర్వీసు అధికారులు 3 నెలల ముందే ఆ దేశానికి చేరుకొని ఏర్పాట్లు మొదలుపెడతారు. స్థానిక ప్రభుత్వ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ప్రణాళికను తయారు చేసుకుంటారు. అధ్యక్షుడు పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి ముప్పు తలెత్తకుండా చూసుకుంటారు. సుశిక్షిత బెల్జియన్‌ మాలినోయిస్‌ జాగిలాలనూ వెంట తెచ్చుకొని క్షుణ్నంగా తనిఖీలు చేస్తారు. అమెరికా అధ్యక్షుడు రావడానికి ముందు 7 విమానాల్లో వివిధ పరికరాలు, హెలికాప్టర్‌, ప్రత్యేక వాహనాలు, కమ్యూనికేషన్‌ సాధనాలు సదరు దేశానికి చేరుకుంటాయి.  అధ్యక్షుడు బసచేసే హోటల్‌ను సీక్రెట్‌ సర్వీసు అధికారులు ఎంపిక చేస్తారు. నేర చరిత్ర ఉన్న సిబ్బందిని.. అధ్యక్షుడు అక్కడ బస చేసినన్ని రోజులు హోటల్‌కు రానివ్వరు. అధ్యక్షుడు బస చేసే హోటల్‌ గదిలో ప్రత్యేక రక్షణ, నిఘా పరికరాలు అమరుస్తారు. కిటికీలకు బుల్లెట్‌ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ కవచాలు ఏర్పాటు చేస్తారు. మొత్తం 6వేల 500 అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఉంటారు. ఇందులో 3వేల200 మంది స్పెషల్‌ ఏజెంట్లు, 1300 మంది యూనిఫామ్‌ డివిజన్‌ అధికారులు, 2వేల సాంకేతిక, సహాయ సిబ్బంది ఉంటారు. సీక్రెట్‌ ఏజెంట్లు తాము ఎవరిని చూస్తున్నామన్నది అవతలివారికి తెలియకుండా ఉండటానికి నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటారు. అనేక విభాగాల్లో సేవలందించే సీక్రెట్‌ సర్వీస్‌లో అతికొద్ది మంది మాత్రమే అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలు చూస్తారు. ఈ విభాగమే ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌ డివిజన్‌. వారు నిరంతరం చుట్టూ ఉన్న జనంపై కన్నేసి ఉంచుతారు. చేతులను ఫ్యాంట్‌ జేబుల్లో పెట్టిన వ్యక్తులను, ఇతర అనుమానాస్పద కదలికలను పరిశీలిస్తుంటారు. ఆయుధాలు దుస్తుల్లో దాచేసి... అవసరమైనప్పుడు మెరుపు వేగంతో తీసి, ప్రతిదాడి చేస్తారు. అత్యవసర సమయాల్లో అధ్యక్షుడిని ఆసుపత్రికి తరలించే వరకూ కాపాడుకొనేలా 10 మినిట్‌ మెడిసిన్‌లో వీరు శిక్షణ పొందుతారు. 10 నిమిషాల వ్యవధిలోనే చేరుకునేలా ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తంగా, అత్యంత శక్తివంతంగా పనిచేసే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ దళాలు.... అధ్యక్షుడి భద్రత విషయంలో ఎలాంటి రాజీపడరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మెరుపు వేగంతో పనిచేస్తారు.

ఏ రోజు... ఏ టైమ్ లో...ఎక్కడ? ట్రంప్ టూర్ షెడ్యూల్‌పై ఫుల్ డిటైల్స్

యావత్‌ భారత్‌ ఇప్పుడు ట్రంప్ జపం చేస్తోంది. అగ్రరాజ్యాధినేత రాక కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 24న ఉదయం అహ్మదాబాద్‌లో ల్యాండ్ కానున్న డొనాల్డ్‌ ట్రంప్ దంపతులు... రెండ్రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట అహ్మదాబాద్‌లో... ఆ తర్వాత ఆగ్రాలో... చివరిగా ఢిల్లీలో పర్యటించి ఫిబ్రవరి 25న తిరుగుపయనం కానున్నారు. ట్రంప్ ఇండియన్ టూర్ షెడ్యూల్‌పై ఫుల్ డిటైల్స్ మీకోసం. +++ ఫస్ట్ డే - ట్రంప్ షెడ్యూల్ +++ ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.... అహ్మదాబాద్‌, ఆగ్రా, ఢిల్లీలో ట్రంప్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 24 అంటే సోమవారం ఉదయం 11గంటలకు ఎయిర్‌‌ఫోర్స్ వన్‌ విమానంలో అహ్మదాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో ల్యాండ్‌ కానున్న ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోడీ, ట్రంప్ కలిసి రోడ్‌షో ద్వారా మొతేరా స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు, మొతేరా స్టేడియాన్ని ప్రారంభించి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే, మొతేరా స్టేడియం దగ్గర ట్రంప్‌‌కు కనీవినీ ఎరుగనిరీతిలో గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పనున్నారు. అనంతరం, ట్రంప్‌, మోడీ కలిసి ప్రసంగిస్తారు. గతేడాది మోడీ అమెరికా టూర్ సందర్భంగా టెక్సాస్‌లో నిర్వహించిన హౌడీ మోడీ తరహాలోనే నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనుంది. ట్రంప్ ఇండియా టూర్‌లో మొతేరా స్టేడియంలో నిర్వహించనున్న ప్రోగ్రామే హైలైట్‌గా నిలవనుంది. ఇక, ఇదే రోజు అంటే, ఫిబ్రవరి 24న మధ్యాహ్నం మూడున్నరకు గుజరాత్ నుంచి ట్రంప్ దంపతులు ఆగ్రాకు బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 5గంటలకు ఆగ్రా చేరుకుని తాజ్‌ మహల్‌ను సందర్శిస్తారు. ఇక, రాత్రికి ఢిల్లీ చేరుకుని ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్, మెలానియా దంపతులు బస చేస్తారు. +++ సెకండ్ డే - ట్రంప్ షెడ్యూల్ +++ రెండోరోజు అంటే, ఫిబ్రవరి 25న ఉదయం 10గంటలకు ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత 10-45కి రాజ్‌ఘాట్‌‌కు చేరుకోనున్న ట్రంప్‌-మెలానియా దంపతులు.... ప్రధాని మోడీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం, సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన తర్వాత ట్రంప్... ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌కు బయల్దేరుతారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోడీ, ట్రంప్ మధ్య అత్యున్నతస్థాయి సమావేశం జరుగుతుంది. వివిధ అంశాల్లో రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకం చేసి, ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతారు. ఆ తర్వాత యూఎస్ ఎంబసీలో ఈసీవో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. అనంతరం ప్రధాని మోడీ ఏర్పాటు చేసే లంచ్‌లో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ వెళ్తారు. అక్కడ భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మీటింగ్ జరిగే అవకాశముంది. ఇక, అదే రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం ఫిబ్రవరి 25న రాత్రి 10గంటలకు ట్రంప్, మెలానియా... ప్రత్యేక విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు.